ఏ తరహా కవిత్వం రాయాలనేది వర్ధమాన కవులైన వారికి సహజంగా కలిగే సందేహం. కవిగా ప్రారంభమైన కొత్తలో తమపై అమిత ప్రభావం చూపిన ప్రముఖులైన కవులను అనుసరించాలని ప్రయత్నిస్తారు. ఆ తర్వాత పెద్దలో, మరొకరో ఇచ్చిన సలహా ననుసరించి సొంత గొంతుకని, సొంత శైలిని సృష్టించు కోవాలని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కొంత గందరగోళానికి గురవుతారు. కవిత్వం ఎన్ని రకాలు? తామే తరహా కవిత్వం రాయాలి? అనే సదిగ్ధం మొదలవుతుంది.
అవునూ… ఇంతకి కవిత్వం ఎన్ని రకాలు? టక్కున వచ్చే సమాధానం అనేక రకాలు అని. ఎందుకంటే సాహిత్య విమర్శకులు ప్రపంచ సాహిత్యాన్ని ఔపోసన పట్టి కవిత్వాన్ని నానా రకాలుగా విభజించారు. వాటికి అనేక సిద్ధాంత రాద్ధాంతాలని కూర్చారు. ఇప్పుడు వాటన్నింటినీ తడిమి గందరగోళంలో పడవేయడం భావ్యం కాదు కనుక వర్ధమాన కవులకు అవసరమైన మేరకు మాత్రమే ప్రస్తావిద్దాం.
స్థూలంగా కవిత్వాన్ని మూడు విభాగాలుగా చెప్పుకోవచ్చేమో. 1. ప్రేమ/భక్తి కవిత్వం 2. ప్రకృతి కవిత్వం. 3. సామాజిక కవిత్వం. వర్ధమాన కవులైన వారు ఈ మూడు విభాగాల్లో తమకు ఏ విభాగంలో ఎక్కువ పట్టు ఉందో, తాము ఏ తరహా కవిత్వం రాస్తే పాఠకుడిని మెప్పించగలమో ఒక అవగాహనకు రావాలి. తమ అధ్యయనం, ఆసక్తి, అవగాహన, వ్యక్తీకరణ సామర్ధ్యాలను బట్టి ఒక ప్రధాన విభాగాన్ని ఎన్నుకోవాలి. మరొక విభాగాన్ని స్టాండ్ బై గా ఉంచుకోవాలి. అంతే తప్ప మూడు విభాగాల్లోనూ రాసి మెప్పించగలమనే భ్రమలు కనుక ఉంటే విడనాడాలి. ప్రేమ/భక్తి కవిత్వానికి, సామాజిక కవిత్వానికి పొత్తు కుదరడం కష్టం. అందుకే ఉభయ కవితా ధోరణులకు స్టాండ్ బైగా పనికొచ్చేది ఒక్క ప్రకృతి కవిత్వం మాత్రమే.
మొదటి విభాగం ప్రేమ/భక్తి కవిత్వాన్ని పరిశీలిస్తే ప్రేమకు, భక్తికి పొత్తేమిటి అనే సందేహం కలగక మానదు. ప్రియుడి పట్లనో, ప్రియురాలి పట్లనో కలిగే మోహానికి, దేవుడి పట్లనో, దేవత పట్లనో కలిగే ఆరాధనకు అట్టే తేడా ఉండక పోవచ్చు. కనుక ప్రేమను ఎంచుకుంటే దానిపైన, భక్తిని ఎంచుకుంటే ఆ మార్గంలో కవిత్వాన్ని పుంఖాను పుంఖాలుగా వెలువరించవచ్చు. ఇవి రెండూ ఎవర్ గ్రీన్ సబ్జెక్టులు కూడా. పెద్దగా అధ్యయనం అవసరం లేకుండానే హృదయానుగత అనుభూతుల్ని కవిత్వంగా మలచవచ్చు. ఇందుకు భాషపై గల పట్టు, నవ్య వ్యక్తీకరణ సామర్థ్యం ఇతోధికంగా తోడ్పడతాయి. నండూరి వారి ఎంకి పాటల్ని, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని బాగా పరిశీలించి ఆకళింపు చేసుకోవచ్చు. వర్ధమాన, వర్తమాన కవుల్లో కేవలం ప్రేమ కవిత్వ విభాగంలోనే రాస్తూ మెప్పిస్తున్న వారు నలుగురైదుగురు ఉన్నారు.
రెండవ విభాగం ప్రకృతి కవిత్వం. దీనికి ఉండాల్సిన ప్రధాన లక్షణం పరిశీలనాసక్తి, నిరంతరం ప్రకృతిలోకి ప్రయాణించడం, అనుభూతించడం. ఈ లక్షణాలు ఉంటే కురిసే చినుకు, విరిసే పువ్వు, ఎగిరే పిట్ట, రాలే ఉల్క… ఒకటేమిటి ప్రకృతిలో కంటికి కనిపించే, చెవులకు ధ్వనించే ప్రతి అంశమూ కవిత్వమై అలరారుతాయి. ప్రేమ/ భక్తి కవులైన వాళ్ళు, సామాజిక కవులైన వాళ్ళు సైతం ప్రకృతిని ఆస్వాదించి, ఆరాధించి కవిత్వాన్ని వెలువరించారు. ప్రేమ కవి అయిన కృష్ణశాస్త్రి మొదలు కొని సామాజిక కవులైన గోరటి వెంకన్న, పైడి జయరాజ్ ల వరకు ఇలా ఎందరి నైనా చెప్పుకోవచ్చు. వర్ధమాన, వర్తమాన కవుల్లో చాలా మంది అప్పుడప్పుడూ ఈ విభాగంలోకి ప్రవేశించి చెప్పుకోదగ్గ ప్రకృతి కవిత్వాన్ని వెలువరిస్తూనే ఉన్నారు. అయితే ప్రత్యేకించి కేవలం ఈ విభాగానికే పరిమితమై రాస్తున్న వారు అరుదేమో!
ఇక మూడవ విభాగం సామాజిక కవిత్వం. ఇది ఎంత సులువో అంత సంక్లిష్టతతో కూడినది కూడా. ఈ తరహా కవిత్వంలోకి రాజకీయ, ఆర్థిక, సామాజిక, తాత్విక, వర్తమాన, ఇత్యాది అంశాలన్నీ వస్తాయి. నిరంతర విస్తృత అధ్యయనం, నిశిత పరిశీలన, వివిధ సామాజిక, రాజకీయ, తాత్విక సిద్ధాంతాల పట్ల అవగాహన, మానవ, సమాజ పరిణామ క్రమాల గతిని అర్థం చేసుకోవటం వంటి అంశాలు ఎన్నో తెలిసి ఉండాలి. సమాజంలోని దుర్నీతి పట్ల, అసమానతల పట్ల గుండెల్లోంచి తన్ను కొచ్చే ఆగ్రహం కలిగి ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే స్పష్టమైన, ఆలోచనాత్మకమైన భావ ప్రకటనతో సామాజిక కవిత్వం వెలువరించడం సాధ్యమౌతుంది. లేదంటే వెలువరించే కవిత్వం గుండె లోతుల్లోంచి కాక పెదాల మీద నుంచి జారి పడినట్లుగా ఉంటుంది.
ఈ మధ్య కాలంలో వస్తున్న సామాజిక కవిత్వంలో సైద్ధాంతిక దృక్పథం కొరవడుతోందని చెప్పక తప్పదు. యువ కవులు చాలా మంది తాము పుట్టి పెరిగి వచ్చిన వాతావరణాన్ని, ఇంటి భాషను, కులం,మతం, వృత్తి సాధక బాధకాలను కవిత్వంగా మలుస్తున్నారే తప్ప తాము ఏ మార్పు వైపు దృష్టి సారించదలచారో చెప్పలేక పోతున్నారు. వర్తమాన ప్రపంచంలోని దుశ్చర్యలను ఖండిస్తూ కవిత్వం వెలువరిస్తున్నారే తప్ప వాటి మూలాలను వెదకడమో, వాటి నిర్మూలనకు ఏం చెయ్యాలో చెప్పలేని స్థితిలో ఉన్నారు. కొద్ది మంది స్పష్టమైన సైద్ధాంతిక అవగాహన, రాజకీయ దృక్పథం కలిగి ఉన్నప్పటికీ వారు రాసే కవిత్వం నినాదప్రాయ మవుతోందే తప్ప గాఢత కలిగిన కవిత్వంగా రూపు దాల్చడం లేదు. అందుకే శ్రీ శ్రీ స్థాయిలో కాకపోయినా ఆ దగ్గరలో కూడా ఎవరూ కనిపించడం లేదు. సీనియర్ కవులుగా మిగిలున్న వారు రాసేది వారికి తప్ప ఇతరులకు అర్థం అవడం కష్టం అవుతోంది. వారు రాసిన కవిత్వానికి రాసిన వారు కాక వేరొకరు రాసిన కవికే తెలియని కొత్త అర్ధాలని ఆపాదిస్తున్నారు. ఇదో వైచిత్రి.
నూటికి తొంబై శాతం కవులు సామాజిక కవిత్వ విభాగం లోనే ఉన్నారు కానీ పైన చెప్పిన ప్రతిబంధకాల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ స్తబ్ధతను ఛేదించ గలగాలి. వర్తమాన ప్రపంచపు రాజకీయాలను అర్థం చేసుకుంటూ తమదైన అవగాహనను కవిత్వంలో ఒలికించ గలగాలి, పలికించ గలగాలి. అప్పుడే సామాజిక చేతన వైపు కవుల అడుగులు సాగగలవు.
ఏతా వాతా చెప్పొచ్చేదేమంటే వర్ధమాన కవులైన వారు పై మూడు విభాగాల్లో తాము ఏ తరహా కవిత్వం బాగా రాయగలమో అంచనా వేసుకోవాలి. తాము బాగా రాయగలమనుకున్న విభాగం లేదా విభాగాలను గుర్తించి ఆ తరహా కవిత్వ రచనలో చేయాల్సిన పరిశ్రమను అవగాహన చేసుకుని ఆచరణ లో పెట్టాలి. అప్పుడే కవిగా నలుగురి మన్ననలు దక్కించు కోగలమని గుర్తించాలి.
*
Add comment