బయట వాన
కాస్త చల్లగాలి
ఈ ఉక్కపోతలో
కొంత వెసులుబాటు
గదిలో కిటికీలు చేరిస్తే
వాన పావురంలా వచ్చి మొకంపై వాలుతుంది.
కిటికీ పక్కగా తెగిపడిన పీతకాళ్ళలా చినుకులు
నగరంలో కురిసే వాన మనిషికి
కాస్త చల్లదనాన్ని పంచటానికే వస్తుందేమో
కొమ్మ మీద ఒంటరి గూడు
వానకి తడుస్తూ ఊగుతూ ఉంది
అందులో ఏ పిట్ట పిల్లలు చలికి వణుకుతూ
ముడుచుకుపోతూ ఉన్నాయో
ఆకాశం చామనఛాయగా గుంటక లాగిన
నల్లరేగడి పొలంలో పెడ్డలు పెడ్డలు లేచినట్టు
మబ్బులు పట్టి అంతా గూడు కట్టుకుని ఉన్నాయి.
గదిలో నేను
బయట వాన
నా గదిలో
చీకటిలా కురుస్తూ ఉంది
వానకి ఎండకి రాత్రికి పగులుకి
ఏ చలింపూ లేనిది ఈ నగరం
గదిలో నేనులా
వాన కురిస్తే
వాగులకి పాదాలను కానుకిచ్చిన రోజులు పోయాయి
తడిసిన కలేకాయల రుచీ వానకు పోయింది
రుచి లేని వానబతుకు ఇది.
*
Add comment