ఏవయ్యా మౌళీ… ఏం చేస్తున్నావు నువ్వు?

ఆకు కదలని చోటుల్లోనూ నెమ్మదిగా ప్రశాంతంగా అంటుకడుతున్న ముఖంలోనేలతారాడే మనుషుల్ని, కళ్ళ మీదకు ఆకాశాన్ని దించుకున్న అమ్మాయిని అందరినీ అన్నిటినీ దగ్గరకు తీసుకుందామా?

(కేంద్ర సాహిత్య అకాడెమీ యువ సాహిత్య పురస్కారం అందుకున్న సందర్భంగా బాలసుధాకర మౌళికి అభినందనలు. డిసెంబర్ 7, 2016 సంచిక నించి పునర్ముద్రణ )

నిన్ననే చేతుల్లోకి వచ్చింది పద్యం, ఒంటి నిండా బాల సుధాకర మౌళి ని తొడుక్కుని. వొచ్చి వారం పైనే అయిందట ఊళ్ళోకి. వెళ్ళి పోస్టుమ్యాన్ ని బతిమాలుకుంటే దయ తల్చి నిన్న ఇచ్చాడు.

గుండె కళ్ళకు ప్రేమ గా అద్దుకుని మనసు చేతులు చాపి వెచ్చగా హత్తుకున్నాను. ఎలా ఉంది స్పర్శ? పువ్వులా మెత్తగా ఉంది. కత్తిలా కరుకు గా ఉంది. పాట లా తీయ గా ఉంది. బాధ లా చేదు గా ఉంది.అంటుకుంటున్న అడవి లా ఉంది. ‘ఆకు కదలని చోటు’ లా ఉంది.

ఎన్ని ముచ్చట్లు పెట్టిందో! ఎక్కడుంటావు నువ్వని అడిగితే ఎంత హాయిగా నవ్విందో, అచ్చం కొంచెం గడ్డం తో అమాయకం గా కనపడే ఆ విజయనగరం పిల్లోడి లాగా. “వేకువనే లేచి ఊరు దాటుతున్న ఆ భుజమ్మీది కావిడి లో లేనా” అంది. “రేపటి విలుకాడి వద్ద శిష్యరికం చేస్తూ లేనా” అంది.

**

ఏవయ్యా మౌళీ… ఏం చేస్తున్నావు నువ్వు? “ప్రపంచం మధ్య లోంచి ఎక్కడో ఏ ఊరులోనో మొదలయి కాగడా లాంటి మనిషి ఒకరు నడుచుకుంటూ నడుచుకుంటూ వొచ్చినట్టు” – ఏంటి ఇలా లోలోపలకు వొచ్చేస్తున్నావ్? చంపేస్తున్నావ్, తిరిగంతలోనే బతికిస్తున్నావ్.

“నీడ కురిసే చెట్ల మధ్యో, ఎండ కాసే వీధుల్లోనో, గోళీలాడుకుంటున్న పిల్లాడ్ని బంధించి కణతలపై గురి చూసి తుపాకీ కాల్చకూడద” ని గదా… కవికీ, కవిత్వానికీ నిషేధాలుండకూడదని గదా నువ్వంటున్నావ్. ఉహూ… నిన్ను మాత్రం కాల్చేయాల్సిందే, నీ కవిత్వాన్ని నిషేధించాల్సిందే. లేకుంటే నువ్వు నిద్ర పోనిచ్చేట్టు లేవు.

ఎన్నో ఉద్విగ్న క్షణాలనుతీసుకొచ్చి మా రక్తనాళాల్లోకి ఊదేటట్టున్నావ్. రగిలే పోరుజెండా నీడలో రాలే పూలన్నీ మన కలలే అని అనిపించేటట్టున్నావ్. చలికి వణికే వానకు తడిసే భయపడి పరుగులు తీసే కొండ మేక ఒక్కసారి ఆగ్రహించి కాళ్ళకింది నేలను కబళించే వాళ్ళను నేలకేసి కుమ్మేసే దృశ్యాన్ని కళ్ళకు కట్టేటట్టున్నావ్.

ఎలా చెప్పు నిను నిషేధించకుంటే. దేశ అంతర్గత భద్రతను అసలు పట్టించుకోకుండా బస్తర్ ను ఎక్కుపెట్టిన విల్లు అంటావా? నిర్బంధం లో ఎగిరే పావురమంటావా? అరే, అలా అమాయకంగా కళ్ళజోడొకటి పెట్టుకుని “నెత్తురోడుతున్న నేల మీది వీరోచిత గాన”మంటావా?

ఏమంటావూ రాత్రిని? ఏ ఆదిమ మానవ సమూహమో నెగడు చుట్టూ చేరి ఆడి ఆడిఅలసి నిద్రలోకి జారుకున్నప్పుడు ఒడిలో వేసుకుని ఓలలాడించిన రాత్రా? ఆకుపచ్చని అడవి వాసన వేసే, నిషేధిత మనుషుల మహాస్వప్నాల వాసన వేసే రాత్రా?

ఏం చేయగలం మేము మాత్రం నీ లాగే ఆకుపచ్చని వాసనేసే రాత్రిని కళ్ళతోనూ హృదయం తోనూ ప్రేమించకా మోహించకా…?

**

ఏం చేద్దాం ఈ కవి ని? “ఒక దుశ్చల స్థితి నుంచి కదులుతున్న పడవను ఒడ్డుకి చేర్చే ప్రయత్నం లో సంభవించే ఏ చిన్న కదలిక నైనా యుద్ధ విన్యాసం గానే భావిస్తాన”ని అంటున్న వాణ్ణి, “అంతిమం గా యుద్ధాన్నే నేను ప్రేమించేద”ని తెగేసి చెబుతున్న వాణ్ణి.

తను తన విద్యార్ధికి చెప్పినట్టు, తన కవిత్వాన్ని ముద్దు పెట్టుకుందామా..అంతరాంతరాల్లోకి హత్తుకుందామా…?

ఆకు కదలని చోటుల్లోనూ నెమ్మదిగా ప్రశాంతంగా అంటుకడుతున్న  ముఖంలోనేలతారాడే మనుషుల్ని, దేహమంతా వేళ్ళే మొలిచే నిరసన దృశ్యాల్ని, HCU దారిన పోతున్న ఆ వరి సొప్పల కంఠపు అబ్బాయిని, కళ్ళ మీదకు ఆకాశాన్ని దించుకున్న అమ్మాయిని అందరినీ అన్నిటినీ దగ్గరకు తీసుకుందామా?

**

“నది మీద పిట్టెగురుతుందంటే నది బతికున్నట్టు…” అని మౌళి అన్నట్టుగా రేపటిని స్వప్నిస్తోన్న అక్షరాల్ని ప్రేమిస్తున్నామంటే మనం బతికున్నట్టు.

రాఘవ

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • హృదయంగమంగా సంక్షిప్తంగా వ్రాసారు అభినందనలు.అవార్డు గ్రహీతకు జేజేలు…

  • నది బ్రతికి ఉంది ఈయన కలం లో ప్రవహిస్తూ ….
    అభినందనలు సుధాకర్ మౌళి గారు

  • “నిషేధిత మనుషుల మహాస్వప్నాలను” ఆవాహనం చేస్తున్న
    “నెత్తురోడుతున్న నేల మీది వీరోచిత గానం” ఆలాపిస్తున్న
    “రేపటిని స్వప్నిస్తోన్న” బాల సుధాకర్ మౌళికి వొందనాలు.

  • కంగ్రాట్స్ మౌళీ….
    వ్యాసం బాగుంది సర్..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు