కుక్కలకు అమానుష శక్తులు ఉంటాయని అంటారు. వాటి మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అవి భూకంపాలను, ప్రమాదాలను ముందుగా పసిగడతాయనేది మనకు తెలిసిందే. ఈ కుక్క ఎత్తైన పర్వతం అంచున కూర్చొని ఏమి చేస్తోంది? సింధూళి గ్రామాన్ని అలా శ్రద్ధగా ఎందుకు చూస్తోంది? అది ఈ ప్రాంతపు అలౌకిక సౌందర్యాన్ని ఆస్వాదిస్తోందా? లేక సింధూళి ప్రాంతపు వీరోచిత గతాన్ని చూడగలుగుతోందా?
1767 లో బ్రిటిష్ వారి పై జరిగిన మొదటి గెరిల్లా పోరాటం, ఆసియాలోనే మొట్టమొదటి పోరాటమైన సింధూళి పోరాటాన్ని చూస్తోందా? ఇక్కడ గూర్ఖా వీర సైనికులు బ్రిటిష్ దళాల్ని మట్టికరిపించిన పోరాట ఘటనల్ని చూస్తోందా? ఇంకా బ్రతికివున్న బ్రిటిష్ సైనికులు ఆయుధాల్ని వదిలేసి పారిపోవడాన్ని చూస్తోందా? తమ నేలను కాపాడుకున్న పర్వతపుత్రుల తెగువను చూస్తోందా? ఇప్పటికీ మిగిలివున్న సింధూళి గంధి కోట శిధిలాల్ని చూస్తోందా?
ఆక్రమణదారుల నెత్తురు పర్వతాల పై నుండి చిక్కగా పల్లానికి జారి కమల నదిలో కలవడం చూస్తోందా? ఎర్రబడిన కమల నది పరాజయవు వార్తను భారతదేశంలో ఉన్న బ్రిటిష్ క్వార్టర్స్ వరకూ చేరవేసిన వైనాన్ని చూస్తుందా? ఇక్కడి మహా పర్వతాలు మరింత దగ్గరగా ఒరిగి దురాశాపూరిత సామ్రాజ్య వాదుల్ని నలిపివేసిన నైరూప్య స్వప్నాన్ని వీక్షిస్తోందా?
ఎప్పుడూ ఏ విదేశీ జాతీ యుద్ధంలో తమ దేశాన్ని గెలుచుకోవడానికి అనుమతించని నేపాల్ ప్రజల స్వేచ్ఛాకాంక్షని, దృఢ సంకల్పాన్ని చూస్తోందా?
ఈ కుక్క ఎత్తైన పర్వతం అంచు పై కూర్చొని ఏమి చూస్తోంది?
*
Short and sweet experiment