గాజు మేడల మీద, విద్యుత్తు దీపాల మధ్య పారే నీళ్లు తప్ప
ఎంతసేపు కురిసినా… బాల్కనీలో నిలబడి ఎంత చూసిన నాలో ఏ చలనం లేదే!
స్వచ్ఛమైన మట్టివాసన మోసుకొని వచ్చే గాలులు లేవు
కాగితం పడవలు లేవు, కప్పల అరుపులు లేవు
మూసుకపోతున్న కిటికీలు తప్ప
ఏముంది ఈ వానలో
కల్లాల పొలాల మధ్య పరిగెత్తాలని ఉంది
ట్రాక్టర్, ఎద్దుల బండి కింద దాక్కోవాలని ఉంది
తడిచొచ్చిన నన్ను చూసి
మా అమ్మ తిట్టే తిట్లను ఇంకోసారి నవ్వుతూ వినాలని ఉంది
మా ఎద్దుల మెడలో గజ్జెల సవ్వడి
బజారల్లో వాన నీళ్ల అలికిడి
మట్టి మిద్దెల దోనారలు,
వాన నీళ్లలో కలిసిపోయే రొచ్చు కంపులు
బుడ్డి ఇళ్లలో గంపల గంపల మాటలు
పంట గురించి మా నాయన ఆలోచనలు
సీకటి రాత్రుళ్లు
ఏముంది ఈ వానలో
ఒంటరి బతుకులో గుర్తొచ్చినప్పుడల్లా
ఊరు కోసం కార్చే కొన్ని కన్నీళ్లు తప్ప.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
చాలా బాగుంది వాన
మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చావ్ సూరి👏👏👏
Super…
బాగుంది సురేంద్ర 🌴