ప్రశాంతంగా పవళించి
కలల లోకంలో విహరిస్తూ
చిరునవ్వులు చిలకరించే మోముతో
అడుగు బయట పెట్టిన బాల్యం
చాక్లెట్లు ఇచ్చి ఒకరు
చెవిపోగులు లాగి ఒకరు
చేతులు పట్టుకుని ఒకరు
బుగ్గలు గిల్లి ఒకరు
ఆ ప్రేమలో మతలబు
తెలియని బాల్యం
ఫక్కుననవ్వింది
అమ్మకు చెప్పావో…
అన్న బెదిరింపుకు..
బిగుసుకుపోయింది..
పదేపదే చేసేవికృత చేష్టలకి
విలవిల్లాడింది
నోరు విప్పి ఏం చెప్పాలో
తెలియని అయోమయం
తెలియని లోకానికి చేర్చేసింది
అందమైన మోము తో
అసలుండొద్దని హెచ్చరించింది
బాగా చదివి అందరి దృష్టిలో
పడతావేమో జాగ్రత్తంది
కుటుంబంలో కక్షలకు , ఈర్ష్యలకు
పగతీర్చుకునే కీలుబొమ్మైంది
వయసులో వచ్చే మార్పులకు
వక్రబుద్ది తోడై బలిపశువైంది
అమ్మ కడుపు శోకంలో
ఆవిరైన చుక్కైంది
నాన్న ప్రేమకు నోచుకోని
నల్లబొగ్గయింది
ఇంటి ముంగిట్లో తిరుగాడే సింగిడి
రంగులేని లోకానికి చేరిపోయింది
ఏముందిక…
గునపాలు పట్టడం
పుట్టల్నితవ్వడం విషనాగుల పని పట్టడం
విషపు కోరల్ని పీకడం తప్ప!
భూమి చదునుచేసి మంచి విత్తనాలు నాటి
అసలైన డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లను పెంచండి
శల్యపరీక్షలు చేసి అన్యాయాన్ని వెలికి తీయండి
నిర్మాణాలు సరి చేయండి
నిజాయితీగా తీర్పు చెప్పండి
ఆడపిల్లని చూసే దృష్టి కోణం సరిచేసి
అమ్మాయిని ఆటవస్తువుగా
ఆడుకునే వారి ఆట కట్టండి
మేమూవస్తున్నాం ..
ఆడపిల్లల భద్రత లోపిస్తే
అక్షరాలే కత్తులుగా
కుత్తుకలు కోయడానికి.
*
Add comment