ఏది గొప్ప?!

కాముడుకి రాముడు పోటీ. రాముడికి కాముడు పోటీ. ఇద్దరికీ ఇద్దరు సాటి. నలభీమసేనుల్లా విజృంభిస్తున్నారు.

అంతర్వేది పాలెం నాటకాల వెంకట్రాయుడి గారింట్లో పెళ్లి.‌ చుట్టుపక్కల ఊర్లల్లో ఆయన రాసిన నాటకాలే ఎక్కువగా ఆడేవి. 16 ఏళ్ల వయసు నుంచే రాయడం ప్రారంభించిన ఆయన కొన్నాళ్లకే మంచి రచయితగా పేరు తెచ్చుకున్నాడు.

సినిమా వాళ్ళు కూడా ‘మాకో మంచి కథ రాయండి మహాప్రభో’ అని వెంట పడేవారు. కానీ ఆళ్ల నాన్నగారి కోరిక   మేరకు స్కూల్ మాస్టారు కింద స్థిరపడిపోయాడు. మాస్టారు అయినా నాటకాలు రాయడం మానలేదు. ఈయన రాసిన నాటకాల్లో‌ హీరోగా వేసే  రమేష్ బాబు సినిమాల్లోకి వెళ్లి పెద్ద హీరో అయిపోయాడు. అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల్లో ఆ బాబు ఊర్లో అడుగు పెట్టింది లేదు. కానీ వెంకట్రాయుడు ఇంట్లో పెళ్లి కాబట్టి తప్పకుండా వస్తాడని ఊర్లో చెప్పుకోడం మొదలెట్టారు.

“ఆడికి పొగరెహే! అంతటి హీరోడు వత్తాడా?” అని లైట్లు బిగిస్తూ చెప్తున్నాడు కరెంటు నారాయణ అసిస్టెంట్ రాంబాబుతో.

“అలా అంటారేంటండీ బాబు? వెంకట్రాయుడు గారి వల్లే కదేటి అంతటి హీరో అయ్యింది”

“వత్తాడు అంటున్నారులే! ఊరి మీద పేమ కాకపోయినా ఆళ్లావిడ అంటే భయం ,భక్తి గందా! ఒకేల బాబు గారు వచ్చినా, అంతటోడు వచ్చాడు గనక ఆయనే గొప్పోడు కామోసు అనుకుంటారు”.

“అబ్బే! ఇంతటోళ్లను చేసిన వెంకట్రాయుడి గొప్పతనం హీరోకి ఎక్కడ సెప్పండి”.

వెంకట్రాయుడు ఇవేం పట్టించుకోకుండా కంగారు పడిపోతున్నాడు. వంటలు బాగా వండుతారని ముంజరపు కొట్టు వాళ్ళని పురమాయించాడు. కాముడు, రాయుడు.. ఇద్దరూ పేరున్న వంటగాళ్లు. పెందలకాడే వస్తానన్నవాళ్ళు ఎంతసేపైనా రాకపోతే కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. పెళ్లిళ్ల సీజన్లో వంటవాళ్లు దొరకడమంటే వర్షాకాలంలో బంగినపల్లి దొరికినంత కష్టం. ఇక్కడ ఈయన ఎంత కంగారు పడుతున్నాడో దానికి విరుద్దంగా చుట్టలు కాల్చుకుంటూ తాపీగా కబుర్లు చెప్పుకుంటూ  వస్తున్నారు కాముడు, రాముడు.

“ఓరి నా రాముడో, కాముడో! మీ దుంపలు తెగ. చుట్టాలకి టిఫిన్లు గట్రా చెయ్యాలి. ఆడోల్లు పప్పు అయితే రుబ్బేసారు..” కంగారంతా మాటల్లో చూపించేశాడు వెంకట్రాయుడు.

పొయ్యి మీద పాలు పొంగేదాకా చూసినట్టు తాపీగా, ఓపికగా చూసి “ఏం టిఫిన్ చెయ్యమంటారు?” అని అడిగాడు రాముడు. “పెళ్లి కొడుక్కి గారెలంటే ఇష్టమంట! అందుకని అల్లం పచ్చిమిరపకాయలతో కారపు గారెలు, మాములు గారెలు, పాకం గారెలు, ఆవడలు.. అట్టాగే ఇడ్డెనులు, పల్లి చెట్నీ, అల్లం చెట్నీ, మదరాసీల సాంబార్, ఇడ్డెన్లలోకి వేడి వేడి నెయ్యి, కారంపొడి”

“అంతేనా? చిట్టి గారెలు కూడా పడేత్తాం” అన్నాడు కాముడు.

“చిట్టి గారెల్లోకి ముక్క బాగుంటాది కానీ పెళ్లికి యెట్టం కదా! ఎలాగా?” అన్నాడు వెంకట్రాయుడు.

“మంచి పచ్చి పనసకాయ తెప్పించండి. అట్టాగే వండేద్దాం” అన్నారు కాముడు, రాముడు.

“వంటలు బాగుండాలీరోయ్. పాకం గార్లెకి ముదురు పాకం పెట్టండి. ఆవడలు పెరుగు మునిగాక పైన కూసింత కారేట్టు తురుము,కొత్తిమీర, పల్లీలు పడేయండి” అని ఏకరవు పెట్టాడు వెంకట్రాయుడు.

ఇద్దరు ఒకరినొకరు చూసుకుని “మీరు తాపీగా కూర్చోండి ముందు. అందరికీ కాఫీలెట్టేత్తామ్” అని ఐదు నిమిషాల్లో అందరికీ‌ కాఫీలు అందించారు. ఇత్తడి గ్లాసులో నురగ నిండిన వేడి వేడి కాఫీ తాగుతున్న వాళ్లంతా ‘ఆహా ఓహో’ అన్నారు.

ఆడోల్లు రుబ్బిచ్చిన పిండిలో ఉప్పు ఎక్కువైతే రిపేర్ చేసి గారెలు వేశారు. అరగంటలో రెండు వాయిల గారెలు, ఇడ్డెన్లు దింపేశారు. తిన్నవారంతా గారెలు, ఇడ్డెనులు దూదుల్లా ఉన్నాయని, మదరాసీల సాంబారైతే మంచి నీళ్ల జగ్గుల్లో తాగారు. పనస ముక్కకి, కోడి ముక్కకీ తేడా తెలియట్లేదు అన్నారు. అతిశయోక్తి అయినా మరో ఉపమానం దొరకలేదు చెప్పడానికి.‌ పెళ్లివారు ఇంకో గంటలో వస్తారనగా పకోడీలు, జిలేబీలు వేశారు రాముడు, కాముడు.

మొగపెళ్ళివాళ్లంతా తిని ఈ జన్మలో ఇలాంటి రుచి ఎరగమన్నారు. ఆడోల్లు తమ మొగుళ్ళని చూసి నేర్చుకోమన్నారు. మగ పెళ్లివారు,‌ ఆడపెళ్లి వారిని మెచ్చుకున్నారు.

కాముడుకి రాముడు పోటీ. రాముడికి కాముడు పోటీ. ఇద్దరికీ ఇద్దరు సాటి. నలభీమసేనుల్లా విజృంభిస్తున్నారు. కొత్తగా తినేవాళ్ళకి కొత్త ఈ రుచి. వండే పాత రాముడికీ కాముడికీ కాదు.

చానాళ్ళకి రమేష్ బాబు ఊళ్లోకి వచ్చాడు. బాబుకి ఇష్టం లేకపోయినా వాళ్ళావిడ బలవంతం మీద ఊర్లోకి అడుగెట్టాడు. సతీసమేతంగా వచ్చిన రమేష్ బాబుని సాదరంగా ఆహ్వానించి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లందించాడు  వెంకట్రాయుడు. చేతులొక్కటే కడుక్కుని తనకి ఇష్టమైన, ఖరీదైన కెలరస్ షూస్ విప్పకుండానే లోపలకి నడిచాడు.

“షూ ఖరీదు ఎక్కువన్నయ్యా! అందుకేనేమో” అంది బాబు భార్య  వెంకట్రాయుడితో. ఆయన ప్రశాంతంగా నవ్వి ఊరుకున్నాడు. ఒకప్పుడు నాకంటూ ఒక పాత్ర రాయండి సారూ అని ప్రాధేయపడుతూ కటిక నేల మీద మోకాళ్ళతో కూర్చున్న రమేష్ బాబు గుర్తొచ్చి నవ్వి ఊరుకున్నాడు. రమేష్  బాబుని అక్కడ చూసిన జనం ఊగిపోతున్నారు. చుట్టూ మూగిపోతున్నారు. తన సెక్యూరిటీని తెచ్చుకోవడం మంచిదైంది అనుకున్నాడు రమేష్.

పెళ్ళికి ముందు వరసలో కూర్చొని చూస్తున్న రమేష్ బాబు ‘ఇంత మంది జనం వెంకట్రాయుడి కూతురు పెళ్ళికే వచ్చారా, నన్ను చూడటానికి వచ్చారు కామోసు’ అనుకున్నాడు మనసులో.

పెళ్లి తంతు పూర్తయ్యింది. ఆశీర్వచనం వేళ బంగారపు ఉంగరాలని బహుమతిగా తొడిగింది రమేష్ బాబు భార్య. ఆయన మాత్రం గర్వంగా చూస్తూ దంపతుల మీదకు అక్షింతలు విసిరాడు.

అందరూ పంక్తి భోజనాలకి కూర్చున్నారు. రాముడు, కాముడు చేసిన వంటలు ఘుమఘుమలాడిపోతున్నాయ్. ఇయన్నీ దగ్గరుండి చేయించిన సాయిబు గారు “అన్నీ సర్దండ్రా” అని అరుస్తున్నాడు. ఊర్లో ఎలాంటి కార్యక్రమం అయినా వండించి, వడ్డించడం ఆయనకలవాటు. అమృతంలా ఉన్నాయంటున్నారు వంటలన్నీ. కొసరి కొసరి వడ్డించమంటున్నారు. రమేష్ బాబు కూడా స్పెషల్‌గా టేబుల్ వేయించుకుని తింటున్నాడు.

వంకాయ కూర అద్భుతం. అందులోని జీడిపప్పులని దెబ్బలాడి మరీ వేయించుకుంటున్నారు. “పచ్చి వడియాలలో కారం సరిగ్గా పడిందెహే! ఒకింత అటూ కాలే, ఇటూ కాలే” అని ఒకరంటే, “మిరపకాయ్ బజ్జి తిన్నావేరా? ఆ వాము బజ్జీలు దేనికదేనేహే” అన్నాడు ఇంకొకడు.

“గొట్టం కాజా తిన్నావేటి? అచ్చమ్ మన తాపేశ్వరం రుచే. పాకం ఊరిపోతోందనుకో”. ఒకటిని మించి ఇంకొకటి దేనికదే సాటి. తిన్నవాళ్ళందరూ బాగుందని ఏకగ్రీవంగా తీర్మానించారు. సాయిబు గారు కాముణ్ని, రాముణ్ని పిలిచి “వీరే వంటలు చేసింది” అని తినే వాళ్లకు పరిచయం చేసారు.

“వంకాయ కూర ఎవరు చేశారయ్యా? ఇన్నేళ్ళలో మా ఆవిడ కూడా ఇలా చెయ్యలేదు” అన్నారు అరవై ఏళ్ళ  సూర్యంగారు. అది విన్న వాళ్ళావిడ “రేపట్నుంచి వాళ్ళ చేతే చేయించుకోండి” అని రుసరుసలాడింది.

“అంత బాగుందంటే నేను చేసిందేనండి బాబు” అన్నాడు రాముడు. “అదేటి కూరలోకి ఉప్పు నేనేసింది కదేటి?‌” అన్నాడు కాముడు.

“కారం గుండ ఎవరేసారు నేను” అన్నాడు రాముడు.

“గొట్టం కాజాలు పాకం పట్టింది ఎవరు? నేను” ఇది కాముడి వాదన. ఇలా పప్పు నుంచి కాజా దాకా నేనంటే నేననడం ప్రారంభించారు. చినికి చినికి గాలివానయ్యింది. పేద్ద గొడవ. వెంకట్రాయుడు తల పట్టుకుని కూర్చున్నాడు. పెళ్ళిలో ఈ రభస ఏంటని?

రమేష్ బాబు పెరుగన్నంలో అరటి పండు కలుపుకుంటా ఆ  గొడవను చూసి  నవ్వుతా ఉన్నాడు.

గొడవ పెద్దది అవుతోందనగా సాయిబు గారు వాళ్లిద్దరినీ ఆపి అడగడం మొదలెట్టారు.

“ఇదిగో అబ్బాయిలు! వంట అద్భుతం. వంకాయ కూర అద్భుతం. కానీ ఇంతకీ వంకాయలు తరిగింది ఎవరు?”

“మాచవరం సత్తెమ్మండీ” అన్నారు ఇద్దరూ ఒకేసారి.

‘మా ఇంటికి చుట్టాలొత్తారు బాబోయ్’ అనుకున్నారిద్దరూ మనసులో.

“మరి ఆ లేత వంకాయలు నోట్లో వేస్తే కరిగి పోతున్నాయి కదా? ఎక్కడి నుంచి తెచ్చారు?”

“గ్రంధి సుబ్బారావు గారి తోట నుంచండీ” అన్నాడు ఆవకాయ్ వడ్డిస్తున్న వెంకట్రాయుడి గారి పాలేరు.

“మరి మామిడికాయ పప్పుకి కాయలు?”

“అది వెంకన్న గారి తోట నుండండీ” అన్నాడు పాలేరు మళ్ళీ.

“పప్పులోకి పోపు పెట్టడంలో మాచవరం సత్తెమ్మ సాయం చేసిందండీ” అన్నాడు కాముడు.

“ ఇన్ని కూరల్లోకి, ఆటిల్లోకి ఉప్పు యేసుంటారు కదా! ఎక్కడ నుంచి వచ్చాయి” అన్నారు సాయిబు గారు.

“మీరే కదండీ బాబూ కాకినాడ నూకరాజు గారికి చెప్పి కోరంగి ఉప్పు మడుల నుంచి తెప్పించారు” అన్నాడు వెంకట్రాయుడు.

సాయిబు గారు చెప్పేది శ్రద్ధగా వింటున్నారు అందరూ. రమేష్ బాబు తినడం మానేసి సాయిబు గారు ఏం   చెప్తారా అని తీక్షణంగా చూస్తున్నాడు. ఇలా ఆయన అన్నీ ఏకరువు పెట్టాడు పప్పు నుంచి ఉప్పు దాకా.

“ఇప్పుడు చెప్పండబ్బాయిలు! గొప్పంతా మీదేనంటారా? ఇంత మంది చెయ్యి ఎయ్యకుండా మీరే చేశారంటారా?” ఇద్దరూ మాట్లాడకుండా ఉండిపోయారు.

“ఎవరి సాయం, చేత లేకుండా ఏది గొప్పదవుతాది చెప్పండి. ఏదైనా.. చివరకు మనిషైనా” అని ముగించాడు సాయిబు.

“క్షమించండి బాబు..” అన్నారిద్దరూ.

“భోజనకాలే హరినామ స్మరణే గోవిందా గోవింద” అని గట్టిగా అరిచాడు సాయిబు. వంత పాడారు జనం.

సాయిబు చెప్పిన చివరి మాట రమేష్ బాబుకి ఎక్కడో తగిలింది. “నిజమే! ఆయన సాయం లేకుండానే ఇంతవాడిని అయ్యానా?” అనుకున్నాడు. పెరుగన్నంలో ఉప్పగా ఉండే కన్నీళ్లు పడ్డాయ్. ఇంక పెరుగులోకి ఉప్పు వేయించుకోలేదు. భోజనాలయ్యాయి. అప్పగింతలు మొదలయ్యాయి.

“పోయిరావే తల్లి! పోయిరావే అమ్మ”‌అని బాపనమ్మ గారు పాడేసరికి

వెంకట్రాయుడు భోరున ఏడవటం మొదలెట్టాడు. ఆయన్ని చూసిన జనాలకి కన్నీళ్లు ఆగట్లేదు. ఈసారి మూలగా నించుని చూస్తున్న రమేష్ బాబుని ఎవరూ పట్టించుకోలేదు .

రమేష్ వెళ్లిపోతూ వెళ్ళిపోతూ వెంకట్రాయుడిని గట్టిగా కౌగలించుకుని ఏడ్చాడు. చిన్నపిల్లలా ఏడుస్తున్న భర్తను భార్య సముదాయించింది.

ఇంటి నుంచి బయటకి వచ్చాక ఒక మూలకి తాను ఇష్టపడి కొని తెచ్చుకున్న అమెరికా చెప్పులను వదిలేసి కంకరరోడ్డు మీదకి భార్యతో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

రమేష్ బాబు విడిచి పెట్టింది చెప్పులనే కాదు. తానే గొప్ప అనే అహాన్ని కూడా!

*

కారణం మా ఊరే!

* హాయ్ విజయ్! మీ గురించి చెప్పండి.

హాయ్! మాది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర లూటుకుర్రు. నేను పుట్టి పెరిగింది అక్కడే. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాను.

* సాహిత్యంతో పరిచయం ఎలా ఏర్పడింది?

నాలో సాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడటానికి కారణం మా ఊరే. నారాయణాచార్యులనే ఆయన ఇంట్లో చిన్న లైబ్రరీ ఉండేది. అక్కడికి చందమామ మాసపత్రిక వచ్చేది. అలాగే వివిధ పత్రికల్లో వచ్చిన పిల్లల కథల్ని ఆయన సేకరించి, బైండింగ్ చేసి పెట్టేవారు. చిన్నప్పటి నుంచి వాటిని ఇంటికి తెచ్చుకుని చదవడం అలవాటైంది. ఆ తర్వాత ఏడో తరగతిలో రమణమూర్తి అనే తెలుగు మాస్టారు ‘శైశైవగీతి’ అని శ్రీశ్రీ కవిత చదివి వినిపించారు. చాలా నచ్చేసింది. అప్పుడే తొలిసారి శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ పుస్తకం కొని చదివాను.

* నవల రాయడం వెనుక నేపథ్యం?

ఆ సమయంలో మా తాతగారు చనిపోయారు. ఆ పది రోజుల కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూశాను. ఆ అనుభవాలను కథగా రాద్దామని కూర్చున్నాను. మొదలుపెట్టాక అది మరింత ముందుకు వెళ్తూ ఉంది. నవలగా మారింది. అదే ‘మరణంతో నా అనుభవాలు’. 2015లో దాన్ని మొదట ‘కినిగె’ వెబ్‌సైట్‌లో పెట్టాను. మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత 2017-18లో ఎమ్మెస్కో వాళ్లు పుస్తకంగా తీసుకొచ్చారు. దానికి తనికెళ్ల భరణి గారు ముందుమాట రాశారు.

* కథల వైపు ప్రయాణం చేసిందెప్పుడు?

2020లో. దసరా సందర్భంగా పాలపిట్ట మాసపత్రిక వారు కథలపోటీ పెట్టారు. దానికి ‘ఇక్కడికే’ అనే కథ పంపాను. సాధారణ ప్రచురణకు ఎంపికైంది. అంతకుముందు కొన్ని కథలు రాసినా ప్రచురితమైన తొలి కథ ఇదే! మా ఊళ్ళో నేను చూసిన ఒకరి జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాశాను. అది మంచి పేరు తెచ్చుకుంది. కవి, రచయిత ఎం.ఎస్.సూర్యనారాయణ గారు ఆ కథ చదివి చాలా మెచ్చుకున్నారు. ఇప్పటికి నాలుగు కథలు రాశాను. ఒక కథా సంకలనం తేవాలని ఉంది.

* మీకు నచ్చిన కథలు, కథకులు?

కథలు నేను కొంచెం తక్కువే చదివాను. అలా చదివిన వాటిలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, ముళ్లపూడి వెంకటరమణ, శంకరమంచి సత్యం, వంశీ గారి కథలు చాలా నచ్చాయి. యండమూరి వీరేంద్రనాథ్, ఎన్.ఆర్.నంది, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి నవలలు చాలా ఇష్టంగా చదువుతాను.

* ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది?

నా ఊరిలో నేను చూసిన అనుభవాలు, నన్ను హత్తుకున్న సంఘటనలను కథలుగా రాయాలని ఉంది. ప్రస్తుతం ‘సీతాపహరణం’ అనే నవల రాస్తున్నాను.

*

ఉపాధ్యాయుల విజయశేఖర్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Excellent story Vijay గారూ.. 👌👌 మీ గురించి తెలుసుకోవడం చాలా హ్యాపీ గా ఉంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు