ఏది ఆధునికం? ఏది సనాతనం?

దయాన్నే లేచి కిటికీ తెరవగానే ఒక సూర్యకిరణం వెచ్చగా తాకుతుంది. ఒక చల్లటి మందపవనం స్పర్శ సేదదీరుస్తుంది. కాకుల అరుపులూ, పిట్టల కిచకిచలు వినపడుతుంటాయి. రోడ్డుపై ఒక వాహనం శబ్దం చేస్తూ వెళ్లిపోతుంది. స్కూలు డ్రెస్సులు ధరించిన చిన్నపిల్లలు ముచ్చట్లు చెప్పుకుంటూ బస్సుకోసం ఎదురు చూస్తుంటారు. ఈ శబ్దమయ ప్రపంచంలో ప్రతి రోజూ ఇవే ధ్వనులు, ఇవే దృశ్యాలు. వీటిలో ఏది ఆధునికం? ఏది సనాతనం?

మొన్నటి దృశ్యాలూ, ధ్వనులూ, నిన్నటి దృశ్యాలూ ధ్వనులూ నేడు కూడా వినిపిస్తున్నప్పుడు దేన్నిగతంగా భావిస్తాం? వర్షం హోరూ, ఆకులపై రాలే నీటి బిందువులు, రెక్కలు తడిసిన పక్షులు,  వానను తట్టుకునేందుకు చెట్ల క్రింద నిలబడే మనుషులూ, వంతెనల క్రింద ఆగే సైకిల్, స్కూటర్ వాహనాలు, పాదచారులూ ఇవి ఎప్పటివి?నేటివా? నిన్నటివా?

మనుషులు సంకెళ్లతో నడిచే దృశ్యాలు ఎప్పటివి?యుద్దాలు, ఊచకోతలు, మూలవాసీయుల నిర్మూలనలూ, బూట్ల ధ్వనులు ఎన్నటివి? అడవుల్లోంచి, కొండల్లోంచి బల్లేలతో, బాకులతో,  విల్లంబులతో, తుపాకులతో పుట్టుకొచ్చే చీమల దండు ఏనాడైనా ఆగిందా? తత్వవేత్తలు, రచయితలు, మేధావులు, ప్రశ్నించిన వారు చీకటి గదుల్లో ఏనాడు బందీ కాలేదు? మెజారిటీ, మైనారిటీలను ఏనాడు తొక్కి పెట్టలేదు? బానిసల యుగం ముగిసిందా?కత్తుల కోలాహాలం ఏనాడైనా ఆగిందా? “తనను దేవుడిగా పూజించకపోతే వధిస్తాను” అన్నాడు హిరణ్య కశిపుడు. “నేను దేవుడికీ, చరిత్రకే బాధ్యత వహిస్తాను” అన్నాడు వేలాదిమందిని ఊచకోత కోసిన స్పానిష్ జనరల్ ఫ్రాన్సిస్కో ఫ్రాంకో, “పరమాత్మ భరత భూమిని ఎంచుకుని నన్ను పంపాడు, నేనేమి చేసినా పరమాత్మ చేయిస్తున్నట్లే..” అన్నాడు నరేంద్రమోదీ.. ఏది సనాతనం? ఏది ఆధునికం?

నాకు సనాతనంలోకి వెళ్లడం ఇష్టం.తండ్రినే ధిక్కరించిన ప్రహ్లాదుడిని నేనేందుకు ఇష్టపడను? ప్రశ్నోపనిషత్తును నేను ఎన్నిసార్లు చదివాను? భౌతికవాదాన్ని నమ్మినందుకా చార్వాకుడిని వధించారు? విషం తాగే మరణ శిక్ష ఎదుర్కొన్న సోక్రటీస్ ను ఎలా మరిచిపోతాను? మైఖేల్ సర్విటస్ రక్తప్రసరణను కనిపెట్టినందుకా నిన్ను ప్రొటెస్టంట్లు పుస్తకాలతో సహా దహనం చేశారు? క్యూబా నుంచి బొలీవియాకు, బ్రిటన్ నుంచి స్పెయిన్ కూ వెళ్లి అక్కడి ప్రజలకోసం ప్రాణాలర్పించిన చేగువేరా, క్రిస్టఫర్ కాడ్వెల్, డేవిడ్ గెస్ట్ ల గురించి చదివిన అక్షరాలు మనఃఫలకం నుంచి చెదిరిపోతాయా? తన గుండె నెత్తుటిలో వ్రేళ్లు ముంచానని చెప్పిన ఫైజ్ అహ్మద్ ఫైజ్ వాక్యాలు నాలో నిత్యం ప్రకంపించకుండా ఉంటాయా?

అందుకే నేను గతానికి ప్రతినిధిని. నాకు ఆధునికత అంటే సనాతనానికి పొడిగింపు మాత్రమే. నా ప్రయాణం ఎప్పుడూ గతం నుంచి ఆధునికతవైపు. సనాతనాన్ని తెంచుకున్న ఆధునికతను నేను హర్షించను. అసలు గతానితో సంబంధం లేని ఆధునికత ఏనాడూ సహజసిద్దమైనది కాదని నా అభిప్రాయం. నా మూల వాక్యం వర్తమానంలో లేదు. నా మూలాక్షరం ఎప్పటిదో.. ప్రశ్నించడం, పరిశీలించడం, విమర్శించడం ఈనాటివి కావు. కవితా సాంప్రదాయం తెలియని వాడు కవిత్వం రాయలేడు.  గతానికీ, ఆధునికతకూ మధ్య తెగిన సంబంధాలను పునరుద్దరించినప్పుడే సాంస్కృతిక దాడులను ఎదుర్కోగలం.

కేంద్ర సాహిత్య పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా ఢిల్లీలో సాహిత్య అకాడమీ ఆడిటోరియంలో దేవీప్రియతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాను. ప్రాచీన సాహిత్యం చదవడం నేటి యువతకు అవసరమంటారా అని  నేను అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఆయనపై నాకు గౌరవాన్ని మరింత పెంచింది.

“కృష్ణా, మీకు తెలుసు ప్రాచీన సాహిత్యాన్ని తప్పకుండా చదవాలని చెప్పేవాళ్లలో నేనొకడినని. యువకవులకు నేను ఈ విషయం పదే పదే చెబుతాను. సరే, భారత, రామాయణాల సంగతి అటుంచితే, తెలుగులో పంచ మహాకావ్యాలున్నాయి. నేటి యువకులు భాషా సాహిత్యాల మీద పట్టు ఏర్పర్చుకోవాలంటే, అలంకార శాస్రం గురించి నేర్చుకోవాలంటే లభ్యమైన ప్రాచీన కావ్యాలు చదవాలి. వాటిని అధ్యయనం చేసేందుకు రకరకాల సాధనాలున్నాయి. సీనియర్ల సహాయం తీసుకోవచ్చు. అభినవ గుప్తుడిని కానీ, ఆనందవర్ధనుడిని కానీ చదవమని నేను అనడం లేదు. కాని ఏదీ చదవకుండా సాహిత్యం గురించీ, శిల్పం గురించీ, సాహిత్య పరిణామం గురించీ మనకు పరిజ్ఞానం ఎలా పెరుగుతుంది?” అని దేవీ ప్రియ అన్నారు.

“నాడుల తీగలపై సాగిన నాదబ్రహ్మపు పరిచుంబన, ప్రాణావసానవేళాజనితం,
నానాగానానూనస్వానావళితం,బ్రదుకును ప్రచండభేరుండ గరుత్పరిరంభంలో పట్టిన గానం,సుఖదుఃఖాదిక ద్వంద్వాతీతం,అమోఘ, మగాధ, మచింత్య, మమేయం,ఏకాంతం, ఏకైకం,క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం, బ్రహ్మానుభవం” గురించి కలవరించాడు శ్రీశ్రీ.

“చిదంశం విభుం నిర్వికల్పం నిరీహం, నిరాకారమోంకార గమ్యం, గుణాతీత మవ్యక్తం మేకం తురీయం, విశుద్ధం శివం శాంత మాద్యంత శూన్యం, జగజ్జీవనం జ్యోతిరానందరూపం, అదిగ్దేశకాలవ్యవచ్చేదనీయం”

అంటూ పరబ్రహ్మ గురించి పలవరించాడు శంకరాచార్యుడు.

‘ఎవరు నీవు?’ అని పార్కులో రాత్రిపూట నిద్రిస్తున్న ఒక వ్యక్తి లేపి అడిగాడు ఒక పోలీసు కానిస్టేబుల్.

‘అది తెలియకే కదా.. ఇక్కడున్నాను..’ అని జవాబిచ్చాడు ఆ మహాతత్వవేత్త.

ఈ అన్వేషణ ఆధునికమా? సనాతనమా?

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు