(ఆరు నెలల తరువాత)
నందు
నాకు ఈ విషయం మాట్లాడం ఇష్టం లేదు. జస్ట్ లీవ్ ఇట్.
అయినా మాట్లాడానికి ఏముందని? నన్ను ఇలా అవమానించి వెళ్ళిపోతుందని నేను అనుకోలేదు. అన్ని సమకూర్చి వున్న జీవితాన్ని కాదని వెళ్ళటం ఎంత వరకు కరెక్ట్? ఏమైనా నాకు ఆమె గురించి మాట్లాడటం ఇష్టం లేదని చెప్తున్నాను కదా?
ఎందుకా?
ఎంత ధైర్యం వుంటే నాకు తెలియకుండా నా వెనకాలే నాకు ద్రోహం చేసేందుకు సిద్ధపడింది? ఆమె చేసిన తప్పుకి ఏం చెయ్యాలో తెలుసా? ఓహ్… లీవ్ ఇట్. నాకు కోపం వచ్చిందంటే ఏమైనా అనేస్తాను. అందుకే చెప్పాను. మాట్లాడనని.
చూడండి. పిల్లి కళ్లు మూసుకోని పాలు తాగటం గురించి మీరు వినే వుంటారు. నియతి చేసిన పని కూడా అలాగే వుంది. నాకు తెలియదని ఎలా అనుకుంది? నేనేమైనా పిచ్చోడిలా కనపడుతున్నానా?
నాకు తెలియకపోవటం ఏమిటి? ఎప్పుడో తెలుసు. ఎందుకలా ఆశ్చర్యపోతారు? అవును. నాకు ముందే తెలుసు.
బహుశా మొదలైన నెల రెండు నెలలలోనే అనుమానం వచ్చింది. అనుమానంతో మాట్లాడటం నాకు ఇష్టం వుండదు. నిర్థారణ కావాలి. అప్పుడు నాకు ప్రశ్నించే హక్కు వుంటుందని నమ్ముతాను. అప్పటి నుంచి పరిశీలించడం మొదలుపెట్టాను. ఖచ్చితంగా ఇలాంటిదేదో వుందని అర్థం అయిపోయింది.
ఆధారం ఏమిటని మీరు అడగకూడదు. ఆమెని చూస్తేనే అర్థం అయిపోయింది. చూస్తే ఎలా తెలిసిపోతుందని మీరు అనుమానించవచ్చు. తెలుస్తుంది. కళ్ళు చూసి ఆ కళ్ళ భాష అర్థం చేసుకోగలిగితే అర్థమైపోతుంది. మాట తీరు, ఇంటి నుంచి బయట పడటానికి చెప్పే సాకులు, తయారయ్యే విధానం, వేసుకునే డ్రస్, లిప్ స్టిక్, ఇంట్లో కాకుండా బయట వుండే సమయం. ఇవన్నీ చూసాను నేను. పరిశీలించాను.
నేరుగా ఆమెనే అడిగి వుండచ్చు. కానీ అడగలేదు. అడగాలని అనుకోలేదు కూడా. నా పార్ట్ నర్స్ అంటారు – ఎంత పెద్ద డీల్ అయినా నింపాదిగా వుంటాను తప్ప పరుగెత్తనని. ఎంత పెద్ద కస్టమర్ అయినా అతను చెప్పింది మొత్తం వింటాను. ఒప్పుకుంటాను కూడా. కానీ డాకుమెంట్ మీద సంతకం పెట్టను. ఆలోచిస్తాను. ఎవరు చెప్పినా వినను. ఇది మొండితనం కాదు. ఓర్పు. స్థిరత్వం. స్థితప్రజ్ఞత. అందుకే అడగలేదు.
ఏ విషయానికీ తొందరపడనని నియతి నా గురించి అంటుండేది. తొందర వుంది. కాకపోతే నా తొందర కొంచెం నెమ్మదిగా వుంటుంది అంతే. తెలిసిన వెంటనే అడిగేస్తే ఇంత దూరం రాకుండా వుండేదా? ఏమో. తెలిసిన తరువాత దూరంగానే వుంచాను. శారీరికంగా. మానసికంగా. ఇప్పుడు పూర్తిగా దూరమైపోయింది.
నియతి ఇలా చేస్తుందని నేను ఊహించలేదు. మీకు తెలుసా మాది లవ్ మ్యారేజ్. తనే ప్రపోజ్ చేసింది. ఐ మీన్ నాకు తనంటే ఇష్టం లేదని కాదు. ఐ టూ లవ్డ్ హర్. కానీ నేను చెప్పడానికి ముందే ఆమె చెప్పింది. ఏదో కవిత్వం చెప్పింది నా గురించి. నాకు అలాంటివి అర్థం కావు. నేరుగా చెప్పేశాను.
బట్ చెప్పానుగా. ముందు తనే ప్రపోజ్ చేసింది. నన్ను ప్రేమించిన ఆ మనిషి ఎందుకిలా మారిపోయినట్లు? ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు.
నియతి ఎప్పడూ నాకు అర్థం కాలేదు. అర్థరాత్రి ఉన్నట్టుండి పద ఐస్ క్రీమ్ తిందాం అంటుంది. లేకపోతే ఏదో పజిల్ ముందేసుకోని చేద్దాం రా అంటుంది. ఒకేసారి ఆశ్చర్యాన్ని, కోపాన్ని కూడా తెప్పించగలదు. మొదట్లో ఆ లొడ లొడ వాగుడు చూసి కొంచెం పిచ్చేమైనా వుందా అనిపించేది నాకు.
ఒకోసారి ఈమె నిజంగానే నాకు తెలిసిన నియతేనా అనిపించేది. అర్థం అయ్యేది కాదు. బహుశా అర్థం కాలేదు కాబట్టే నేను ఎక్కువగా బాధ పడటం లేదు. పూర్తిగా అర్థం కానిది బాధ పెట్టలేదు కదా. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించేది. ఇప్పుడు ఆమె చేసిన పని కూడా నాకు కొత్తగానే వుంది. నియతి లేదన్న బాధ కన్నా ఆశ్చర్యం. అలా ఎలా చేసుకోగలిగిందా అని.
ఓహ్. అనవసరంగా మాట్లాడుతున్నాను. నాకు ఇలా మాట్లాడటం రాదు. నియతి అయితే ఆపకుండా అరగంటైనా మాట్లాడేది. టాపిక్ లేకుండా. మా ఇద్దరి మధ్య ఇలాంటి డిఫరెన్సెస్ ఏమనాలి దాన్ని – వైరుధ్యాలు – యస్ వైరుధ్యాలు కొన్ని వున్నాయి. నేను ఒంటరిగా వుండటానికి ఇష్టపడతాను. ఆ సమయంలో కదిలించకుండా వుంటే బాగుంటుంది నాకు. తనకి ఎప్పుడూ చుట్టూ మనుషులు కావాలి. పార్టీలు, ఫ్రెండ్స్, సినిమా, నాటకం, కవిత్వం వర్క్ షాప్, పెయింటింగ్ క్లాసెస్. ఏదీ స్థిరంగా నెల రోజులు వుండవు. ఇది నచ్చేది కాదు నాకు.
నాకు ఊరికే అలా మార్చేయడం అంటే ఇష్టం వుండదు. వీకెండ్ సాయంత్రం ఇంట్లోనే వుండటం ఇష్టం. నా ఇల్లు. నా భూమి. నా గార్డెన్. రియల్ ఎస్టేట్ కాకపోతే రైతుని అయ్యేవాణ్ణేమో. మొక్కల్ని చూస్తూ లాన్ లో కూర్చోని నాకు ఇష్టమైన ఇలైచీ చాయ్ తాగడం బాగుంటుంది నాకు. నియతికి అలాకాదు. తనకి ఎప్పుడూ మార్పు కావాలి. ఒకసారి వెళ్ళిన మాల్ కి మళ్ళీ వెళ్ళాలంటే ఇష్టం వుండదు. కొత్త మాల్ ఎక్కడ ఓపెన్ చేశారు అని చూస్తుంటుంది. అబ్బ రొటీన్… పరమ బోర్. చాలా తరచుగా నియతీ వాడేదీ పదాలని. నేను కూడా అలాగే రొటీన్ అయిపోయానేమో. సారీ, కామెంట్ చెయ్యడం నా వుద్దేశ్యం కాదు. జస్ట్ అనిపించింది… వదిలెయ్యండి.
ఏం తక్కువైందని ఆ పని చేసిందో నాకు అర్థం కావటం లేదు. డబ్బు, అంతస్థు, హోదా…. ఏది లేదు? అడగకుండా ఇల్లు కొని గిఫ్ట్ చేసాను. ఏ పండగ అయినా బంగారం కొనిచ్చాను. పుట్టిన రోజు, పెళ్ళిరోజు నేనెప్పుడూ మర్చిపోలేదు. మొదటిసారి కలిసిన రోజు, ప్రపోజ్ చేసిన రోజు కూడా సెలబ్రేట్ చేశాను. ఆరు నెలల క్రితం ప్లాటినం లాంగ్ చెయిన్… ఒక్కసారి వేసుకుంది. అంతే! ఆ వస్తువు నచ్చకనా? నేను ఇష్టం లేకనా? ఇలాంటి విషయల్లో కూడా మార్పు, కొత్తదనం కోరుకునేదేమో. ఏమో… నేనే అర్థం చేసుకోలేకపోయానేమో.
తన వెంట వుంటే ఎన్ని అంతస్థులైనా ఎక్కేస్తానని అనుకున్నాను. ఆఖరి అంతస్థుకి చేరిన తరువాత ఆమె అక్కడ్నుంచి ఎగిరిపోతుందని తెలుసుకోలేకపోయాను. నేను ఇప్పుడు చిటారు అంతస్థులో వున్నాను. నేను భూమి మీద వుండటం ఇష్టమున్నవాణ్ణి. నాకు ఎత్తులంటే భయం అని మర్చిపోయింది నియతి.
సారీ ఎక్కువ తాగేశాను. నియతిలాగా నేను కూడా కవిత్వం చెప్పేస్తున్నాను. సారీ. ఇంక నేను ఈ విషయం గురించి మాట్లాడను.
శశాంక్
నాకు అంతా ఒక కలలాగే అనిపిస్తుంది. ఇప్పుడు తల్చుకుంటే. ఎందుకు నియతిని అంత ఇష్టపడ్డానో నాకు కూడా తెలియదు. తెలుసుకోవాలన్న ప్రయత్నమేదీ ఫలించలేదు. ఇప్పుడే కాదు అప్పుడు కాలేజిలో కూడా. అవును అప్పుడే ప్రేమించాను. చెప్పలేకపోయాను. నియతి ఖచ్చితంగా చెప్పేస్తుందని అనిపించేది. ఐ మీన్ అప్పట్లో అలా వుండేది. బట్ మేము చెప్పుకోలేదు.
అయిపోయిందనుకున్నాను. గుర్తుకొచ్చేది. సచ్ ఎ స్వీట్ మెమరీ. అంతే! అంత కన్నే ఇంకేం లేదు అనుకున్నాను. రేఖతో పెళ్ళైపోయింది. ఎవ్రీ థింగ్ వాజ్ నార్మల్. అప్పుడప్పుడు గుర్తుకొచ్చేది నియతి. నా వైపు ఆరాధనగా చూసే కళ్ళు. సామాన్యంగా ఆమె కళ్ళు స్థిరంగా వుండవు. ఎప్పుడూ అటూ ఇటూ చూస్తూ వుండేది. కానీ నేను నవ్వినప్పుడో, ఏదైనా జోక్ చెప్పినప్పుడో అలాగే చూస్తూ వుండిపోయేది. ఆమె కళ్ళలో మెరుపు – ఓహ్ ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు కనపడుతోంది.
మళ్ళీ కలిసినప్పుడు ఏదీ అనుకోని చేసింది కాదు. కాఫీకి ఇంటికి పిలిచినప్పుడు, అనుకోకుండా కొంచెం చొరవ తీసుకున్నాను. నిజమే. మళ్లీ వద్దనుకున్నాము. ఎవరు ముందు వద్దన్నారో నాకు గుర్తులేదు. బట్ మళ్ళీ కలిసినప్పుడు సారీ చెప్పాలనుకున్నాను. నియతే సారీ చెప్పింది. చెప్పిన తరువాత జరిగిందది.
ఐ థాట్ ఇట్ ఈజ్ జస్ట్ వన్ టైమ్. ఆ తరువాత మళ్ళీ నేనే కాంటాక్ట్ చేశాను. ఎండ్ ఇట్ కంటిన్యూడ్.
ఎందుకో తెలియదు. ఇద్దరికీ పెళ్ళైందని ఇద్దరికీ తెలుసు. ఒకరిని ఒకరం మోసం చేసుకున్నాం అన్నది అసలు అర్థంలేని మాట. మమ్మల్ని మేమే మోసం చేసుకోవడం అనడం కూడా అసంబద్ధమే అని అంటాను.
ఇట్ వాజ్ ఎ కాన్షియస్ కాల్ వి టుక్ టుగెదర్.
రేఖ దగ్గర నాకు దొరకనిదేదో నియతి దగ్గర దొరికిందని నేను అనను. అంటే కేవలం శారీరికమేనా అంటే కాదేమో. బహుశా ఒక అర్థం లేని, అర్థం కాని సంబంధం ఎక్కడో ముడి పడింది అనుకుంటాను. నియతి కావాల్సిన ప్రేమ నా దగ్గర దొరికిందేమో నాకు తెలియదు. తను మాత్రం అంటుండేది. నువ్వు నా సోల్ ని ప్రేమిస్తావు. అదే నచ్చుతుంది నాకు అని. మే బీ.
ఇద్దరం కలిసే మొదలుపెట్టాం ఆ ప్రయాణం. ఇద్దరికీ ప్రయాణాలంటే ఇష్టం. ఇద్దరికీ ఈస్థటిక్ గా వుండేది ఏదైనా ఇష్టం. ఇద్దరికీ మాట్లాడటం అంటే ఇష్టం. ఇద్దరికీ వినడం కూడా ఇష్టం. ఇవన్నీ కలిసాయి. అందుకే మేం ఇద్దరం ఒకరి కంపెనీని ఒకళ్లం అంతగా ఇష్టపడ్డాము. ఐ థింక్ దట్ ఈజ్ కరెక్ట్. ఇద్దరం కలిసి గడిపిన క్షణాలు మమ్మల్ని కలిపి వుంచాయి. నాట్ ది రిలేషన్ షిప్! లాజికల్ గా ఆలోచిస్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది.
అయితే ఇంకో విషయం వుంది. ఎంత ఇద్దరికీ నచ్చినా ఇది ఒక ఎఫైర్. అంటే అటు నందుకి తెలిసినా, ఇటు రేఖకి తెలిసినా ఇద్దరి జీవితాలని అతలాకుతలం చెసెయ్యగలదు. ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో అప్పట్నుంచి చాలా ఆలోచించాను. లాజికల్ గా… నేను ఎక్కువగా ఇదే పదం వాడతానని నియతి అంటుండేది. బట్ యస్, ఒక కారణం ఐ మీన్ లాజిక్ వుండాలి కదా మనం చేసే పనికి.
రేఖ వూర్లో లేదు కాబట్టి ఇది సులభమైంది. నియతి మా ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు రేఖ వుండి వుంటే? అసలు ఇంటికి తీసుకువెళ్ళేవాడిని కాదేమో? తను వచ్చినా ఫ్రెండ్ గా పరిచయం చేసేవాడిని. ఆ తరువాత ఎప్పుడో నాకు కొడుకు పుట్టాడని ఒక మెసేజ్ పంపేవాణ్ణి. కంగ్రాజులేషన్స్ అని ఆమె మెసేజ్. మే బీ ఎప్పుడైనా పార్టీ. ఇద్దరం కలిసి ఫార్మల్ గా… లేదా జంటలుగా కలిసేవాళ్లమేమో! రేఖ వూర్లో వుండి వుంటే.
రేఖ డెలివరీ టైమ్ కి నేను అక్కడికి వెళ్ళిన తరువాత ఆ విషయం అర్థం అయ్యింది. రెండు రోజులు చాలా ఆలోచించాను. తప్పు చేస్తున్నానా అని భావన మొదలైంది. ముఖ్యంగా పిల్లాడు పుట్టిన తరువాత. ఆ క్షణం మారిపోయాను. నియతికి మెసేజ్ పెట్టాను. వీ షుడ్ ఎండ్ దిస్ అని.
సారీ… మా అబ్బాయి ఏడుస్తున్నాడు. మళ్ళీ మాట్లాడతా. నాకు రోజంతా ఇదే డ్యూటీ అయిపోయింది.
నియతి దగ్గర్నుంచి మాత్రం రిప్లై రాలేదు?
నియతి
నేను చచ్చిపోలేదు. బ్రతికే వున్నాను. నిజానికి ఇప్పుడే బ్రతికున్నాను.
వీ షుడ్ ఎండ్ దిస్
ఇక దీనిని ముగించాలి. శశాంక్ పెట్టిన మెసేజ్.
అప్పటిదాకా నా జీవితాన్నే ముగించాలి అని అనుకుంటున్న నేను ఆ క్షణం ఆ మెసేజ్ చూసిన తరువాతే నిర్ణయం తీసుకున్నాను. ముగించాల్సింది నా జీవితాన్ని కాదు, ఈ సంబంధాన్ని అని.
శశాంక్ ఏ మెసేజ్ పెట్టినా డిలీట్ చేయడం అలవాటుగా వుండేది. ఈ మెసేజ్ ని డిలీట్ చెయ్యబుద్ధి కాలేదు. నాకు దారి చూపించిన మెసేజ్ అది. ఆ మెసేజ్ ని తరచుగా చూస్తూ వుండేదాన్ని. మొదటిసారి చూసినప్పుడు ఏడుపు వస్తుందని అనుకున్నాను. రాలేదు. చచ్చిపోవాలని అనిపిస్తుందని అనుకున్నాను. బ్రతకాలని అనిపించింది.
చచ్చిపోదాం అన్న ఆలోచన నేను ప్రగ్నెంట్ ఏమో అని అనుమానం వచ్చినప్పుడు కూడా వచ్చింది. టెస్ట్ చేసుకున్నాను. రిపోర్ట్ నెగెటివ్ అని వచ్చింది. అప్పుడు ఏడుపొచ్చింది.
వీ షుడ్ ఎండ్ దిస్
నందు ఆ మెసేజ్ చూశాడు. అడిగాడు. అప్పుడు చెప్పాను –
కొన్ని సందర్భాలు వుంటాయి. ఒక పని చెయ్యాలనిపిస్తుంది. ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం వుండదు. మనసు అదంతా ఆలోచించనివ్వదు. జస్ట్ డూ ఇట్ అంటుంది. ఇది నా సమాధానం కాదు. అనుభవం
నాకు డిప్లిమాటిక్ గా, కన్వింసింగ్ గా మాట్లాడటం వచ్చు. నేను అలాగే మాట్లాడతానని నందు అంటాడు. శశాంక్ కూడా అదే అంటాడు. కానీ అలా మాట్లాడలేదు. నిజం నిజంగానే చెప్పాలనిపించింది. చెప్పాను.
బుకాయించలేదు. ధిక్కరించలేదు. క్షమించమని అడగలేదు. నిజం నిజంలా మాత్రమే చెప్పాను.
నందు కోప్పడలేదు. నన్ను నిలదీయలేదు. అవమానించలేదు. నిజం నిజంలా మాత్రమే విన్నాడు.
కోపం వచ్చే వుంటుంది. కానీ బయటపెట్టలేదు. చూపులో తెలుస్తుంది. నిలబడ్డ తీరులో తెలుస్తుంది. బిగించిన దవడలను, ముడిచిన చేతులను చూస్తే తెలుస్తుంది. అతనికి చాలా కోపం వచ్చింది. అయినా బయటపడలేదు. అదే నాకు పెద్ద సమస్య అయిపోయింది. తిడతాడనుకున్నాను. కొడతాడనుకున్నాను. ఏమీ చెయ్యలేదు.
వీ షుడ్ ఎండ్ దిస్
కొనసాగించే అవకాశం లేదని మెసేజ్ చెప్తోంది. ఆత్మహత్య అవసరం లేదు.
నీ తప్పు నీకు అర్థం అయ్యింది కదా? అన్నాడు నందు వారం క్రితం ఫోన్ చేసి. కోపం తగ్గి వుంటుందని నేను అనుకోను. ఎందుకు ఫోన్ చేశాడు అని ఆలోచించడం అనవసరం అనుకున్నా.
నీ తప్పు నీకు అర్థం అయ్యింది కదా?
తప్పు? ఏది తప్పు?
ఒక పెళ్ళైన ఆడది భర్త వుండగా మరో మగాడితో సంబంధం పెట్టుకోవడం అనే తప్పా? సామాజిక కట్టుబాట్లకి వ్యతిరేకంగా! కావచ్చు. కానీ నాకు కూడా అది తప్పు అని అనిపించాలి కదా? నాకు నేను చేసిన పని తప్పు అని ఎప్పుడూ అనిపించలేదు, అనిపించదు కూడా.
టు హెల్ విత్ సమాజం.
నేను బహుశా ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి చెందిన దానిని కాదేమో. గ్రహాంతరవాసినేమో. నాకు గాల్లోకి తేలి అలా గాలిలోనే అక్కడే బ్రతకడం వచ్చు. భూమి మీదకి దిగినప్పుడల్లా ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటాను. కానీ ఈ ప్రశ్నలు చాలా బరువైనవి. నన్ను మళ్ళీ పైకి ఎగరనివ్వకుండా భూమి మీద వుంచే గుదిబండలు అవి.
ఛ. ఏం మాట్లాడుతున్నాను నేను?
మీకు నిజం చెప్తాను వినండి. నాకు నేనుగా తెలుసుకున్న నిజం.
అసలు శశాంక్ కి నాకు మధ్య వున్నది శారీరిక సంబంధం కాదు. మా మధ్య వున్న సంబంధంలో శారీరిక సంబంధం కూడా వుంది అంతే!
నందుతో అంతా బాగానే వుంది. అలా అనిపించేది. నేను అతని జీవితంలో కలిసిపోయాను. నన్ను నేను మర్చిపోయిన తరువాత మళ్ళీ ఒకసారి నన్ను నేను తెలుసుకోవాలి అనిపించి, ఊహలకి రెక్కలు తొడగాలనుకున్నాను. ఆ రెక్కలు కట్టే ఒక తోడు కావాలనిపించింది. అది శారీరిక వాంఛ మాత్రం కాదు. అలాంటి తోడు నందు కాలేడని అర్థం చేసుకోడానికి సమయం పట్టింది. అనుకోకుండా శశాంక్ ఆ స్థానంలో కనిపించాడు. అంతకన్నా ఇంకేం లేదు. అది కూడా ముగిసిపోయింది కదా ఇప్పుడు.
శశాంక్ ప్రేమ నిజం కాదని నేను అనను. కానీ, అతనికి రేఖ మీద వున్న ప్రేమ కూడా నాకు తెలుసు. అతని పరిస్థితి అర్థమైన తరువాత నేనే వద్దనుకున్నాను.
నందుకి నా మీద ప్రేమ లేదని నేను అనను. కానీ, అతని ప్రేమలో వున్న పరిధులేంటో కూడా నాకు తెలుసు. నా పరిస్థితి అర్థమైన తరువాత నేనే వద్దనుకున్నాను.
శశాంక్ ని అడగలేదు. నందుకి సమాధానం చెప్పలేదు.
శశాంక్ చెప్పినదానికి నేను ఒప్పుకున్నాను. నేను చెప్పినదానికి నందు ఒప్పుకున్నాడు.
కథ అక్కడితో అయిపోయింది.
నేనా?
ఒంటరిగా వుంటున్నాను. ఇదే వూర్లో. విడిపోయాం కానీ లీగల్ గా కాదు. చెప్పానుగా నేనే వద్దనుకున్నాను. నందు రెండు సార్లు ఫోన్ చేశాడు. ఏమన్నా కావాలా లాంటి జనరల్ ప్రశ్నలు అడిగాడు. వచ్చేయచ్చు కదా అంటాడేమో అని అనుకుంటాను. అలా ఎప్పటికీ అనడు అన్న విషయం కూడా తెలుసు నాకు.
నాకు కావాల్సింది అతని జాలి కాదు. కోపం. అది మాత్రం చూపించడు.
నేను వెళ్తే నా కోసం వెళ్ళాలి. అతని కోసం కాదు. అది అతనికి అర్థం కాదు.
ఇప్పుడా? టీచింగ్, ఆర్ట్ గ్యాలరీ. పెయింటింగ్. అంతా బాగానే వుంది.
ఎప్పుడన్నా కవితలు కూడా రాస్తున్నాను. ఇదిగో ఇది నిన్నే వచ్చింది –
గాలిపటంలా ఎగిరేదాన్ని
బలమైన గాలి కోసం విహంగాశని గుప్పిట్లో పెట్టుకోని
అమాంతమైన గాలి ఒక ముళ్ల చెట్టు పై వదిలింది
చిరుగులు పట్టిన ఆశ చివరి అంకంలో
ఒక పిల్లగాలి వచ్చింది
ఆశని రెపరెపలాడించింది
ఆ చిరుగాలి నన్ను ఎగరెయ్యలేదు
కానీ ఎగిరే ఆశని గుర్తు చేసింది
ఎగరలేని నా అచేతనని నాకు చూపించి వెళ్ళింది
**
ముగింపు భాగం .ఏడో అడుగు. ఇక్కడ నియతి కి క్లియర్ గా ఒకటి ఆర్డమయింది. తనకు కాలసిందేదో గ్రహించుకుంది. తన ఆలోచనలు .నేను అనే తన అస్తిత్వం గురుంచి న వెదుకులాట లో నందు లో లేనిది శశాంక్ లో చూడటానికి ప్రయత్నం చేసింది. ఒక మూమెంట్ లో చనిపోవలానుకున్నా ఎందుకు ఆ పని చేయాలి నేనేమి తప్పు చెయ్యలేదు. అని తనని తానే నమ్మింది. అందుకే జీవించడానికి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒంటరిగా ఉండటానికి,.ముందు ముందు నందు తో మళ్ళీ కలిసి జీవించే అవకాశం ఉందా అని ప్రశ్నకి only time wil tell.