వొక రచయిత తన పాఠకుడి జీవితంలోకి ఎంతవరకూ రాగలడు? వాళ్ళిద్దరూ కలిసిసహప్రయాణం – సఫర్ – చేయగలరా?
చేస్తే, వొకరికొకరు ఎట్లా అర్థమవుతారు?
త్రిపురని తలచుకున్నప్పుడు ఈ మూడు ప్రశ్నలూ నన్ను వుక్కిరిబిక్కిరి చేస్తాయి. త్రిపుర కథల వెంట, ఆయన సృష్టించిన పాత్రల వెంటా నేను సాగించిన ప్రయాణాలు వొక్కోసారి నాకు ప్రశ్నలూ, ఇంకో సారి జవాబులు కూడా! కానీ, ప్రశ్నకీ, జవాబుకీ మధ్య ఇంకో స్థితి కూడా ఏదో వుంది. ఆ స్థితిలోకి నన్ను చాలా సార్లు నెడుతూ వచ్చాడు త్రిపుర. అసలు జీవితంలో అసంబద్ధతకి ఆ స్థితే తల్లివేరు అనుకుంటా.
ఏ వాస్తవికతా నన్ను స్థిరంగా వుండనివ్వని వయసులో నా కంట పడ్డాడు త్రిపుర. ‘స్థిరతా నహీ నహీ” అని ఎందుకో పాడుకుంటున్నప్పుడు –నా పందొమ్మిదో ఏడు దాటాక-మధ్యాన్నపుటెండలో ఉద్వేగంగా వేగంగా నడుస్తూ పోతున్నప్పుడు అకస్మాత్తుగా అపరిచితుడిలా ఎదురుపడి “ ఇవాళ నీ పేరు అలఖ్ నిరంజన్!” అనేసి వెళ్లిపోయాడు. అప్పటినించీ ఆ పేరు రకరకాలుగా మా మిత్రుల మధ్య నలిగిపోవడం మొదలయ్యింది. మా సమకాలీన అసంబద్ధతకి అలఖ్ నిరంజన్ వొక కొండ గుర్తు అయిపోయాడు. ఆ సమయంలో “అప్పుడే కలలోంచి లేచి కొత్త ప్రపంచాన్ని చూస్తున్న” అనుభూతి త్రిపుర కథలన్నీ!
1
ఆ మొదటి సారి చదువుతున్నప్పుడు త్రిపుర నిజంగానే కొత్తగా అనిపించాడు. బయటి వాస్తవికత మీద నాలోపల పెరిగిపోతున్న నిరసనకి ఇక్కడో భాష దొరికిందనిపించింది.
“బాల్యం…బాల్యపు అనుభూతులు…బాల్యం నన్ను విరామం లేకుండా మెత్తగా వెంటాడుతుంది. ఏళ్ళు గడిచిన కొలదీ, ఎడారిలాంటి ‘యధార్థం’ గుండెల్లో బలమయిన వ్రేళ్లతో పాటుకుపోయి స్థిరపడ్డ కొలదీ…నా వెనుకనే నీడలా వచ్చి వీపు మీద పచ్చటి వేళ్ళతో తట్టి పిలుస్తున్నారెవరో…జీవితానికి అర్థం లేదు, అంతా శూన్యం అని తెలుస్తున్న కొలదీ, నా పూర్ణ శక్తితో వెనక్కి…వెనక్కి పరుగెడదామనుకుంటాను….తిరిగీ, నా బాల్యంలోకి…క్షణానికీ, క్షణానికీ, క్రియకీ, క్రియకీ సంబంధం లేకుండా బతకడం…..”
ఈ భాష మొదటిసారి విన్నప్పుడు అంతకు ముందు చదివిన బైరాగీ, అజంతా కొంత కొంత గుర్తుకు వచ్చారు కానీ, లోపల పేరుకుపోతున్న శూన్యానికి వాళ్ళెవరూ వచనరూపం ఇవ్వలేదు కదా అన్న అసంతృప్తి వుండేది. పందొమ్మిది దాటి ఇరవైలోకి అడుగుపెడ్తున్న వయసులో, విద్యార్థి ఉద్యమాలూ, కాలేజీల్లో శ్రీశ్రీ వరవరరావుల ప్రసంగాలు ఇంకా చెవుల్లో గింగిరాలు తిరుగుతున్న వేడిలో వచ్చాడు త్రిపుర వొక జెర్కిన్ వేసుకుని…శూన్యాన్ని సఫర్ గా మార్చేస్తూ…!
- కొత్త వాస్తవికతని చెప్పడానికి – త్రిపుర భాషలో చెప్పాలంటే- “ఇమేజ్ దొరకడం లేదు.” జీవితంలోంచి “పోయేటిక్ వెదర్” తప్పించుకుంది. బీట్ నిక్స్ కోసం ఎదురుచూపులు. “రూట్ లెస్ ఫెలోస్” గా మారిపోతున్న చెట్లు కూలిపోతున్న దృశ్యం. అవున్నిజమే, “ఎంగ్రీ యంగ్ మెన్” ఇప్పుడు అత్యవసరమనే ఆవేశం. “మాటలు దేన్నీ వ్యక్తపరచలేవు…ఇటుకల్లాగా ప్రాణం లేకుండా కట్టుకుపోతాయి” అన్న భావమూ గట్టిపడుతున్న మనోస్థితి.
అప్పుడొచ్చాడు త్రిపుర…అతని మల్లిపూవు తెల్లని కాయితాల పుస్తకంతో! దాని మీద నల్లని అట్టతో…ఆ అట్ట మీద నిర్వర్ణ ముఖాలతో..! త్రిపుర కథల్ని ఆవురావురుమని చదవలేం. ఆగి ఆగి వొక్కో వాక్యాన్ని చదవాలి. తిరగ తిరగ చదవాలి. మొదట్లో నేను రోజుకో కథ చదివే వాణ్ని. ఆ వాక్యాల్ని మననం చేసుకుంటూ…ఆ భాషలోకి వలసపోతూ చదివే వాణ్ని. చదివిన వాక్యాల వెంట తూనీగలా పరుగులు పెట్టే వాణ్ని. నన్ను క్షణం సేపు నిలవనీయని ఆ పరుగులు కావాలి నాకు.
2
ఎందుకో తెలీదు బెజవాడ మొగల్ రాజపురం కొండ నాకు చాలా ఇష్టం. ఆ కొండ పక్కనే రెండు గదుల్లో నేను అద్దెకి వుండేవాణ్ణి. నాతోపాటు నా చెల్లి. ఇంటి పక్క కొండపల్లి కోటేశ్వరమ్మ గారూ, ఇంకో పక్క వేణుగోపాలూ, ఇంకో రెండడుగులు వేస్తే డానీ, ఖాదర్, భట్టు గారూ, మో…సిద్ధార్థ కాలేజీ నించి స్టెల్లా కాలేజీ దాకా సాయంత్రపు నడకలూ…అదీ జీవితం! అలాంటి వొక సాయంత్రం “నీతో నేనూ నడుస్తాను పద..!” అంటూ తోడొచ్చారు త్రిపుర.
“నాకు మాటలు రావేమో!” అన్నాను.
“మాటలు అక్కర్లేదు. వచ్చినప్పుడే రానీ!” అన్నారాయన.
నిజమే…ఇప్పుడొచ్చినన్ని మాటలు అప్పుడు రావు నాకు. అసలు నా నవ్వు తప్ప నా గొంతు వినని వాళ్ళు చాలా మంది వుండే వాళ్ళు అప్పుడు.
“Do you know you’ve a pleasant voice and a singer’s face?!” అన్నారాయన.
“నేనేమిటో నాకు ఇంకా తెలీదు!” అన్నాను సిగ్గుపడుతూ. నా ఇరవయ్యో ఏడు అమాయకత్వం!
అలా కొన్ని సాయంత్రాలు నడిచాక ఆయన వెళ్ళిపోయారు, “మనం ఉత్తరాలు రాసుకుంటున్నాం!” అని ఇద్దరి తరఫునా డిక్లేర్ చేసేసి!
కాగితాల మీద చూసిన త్రిపురకీ, ఎదురుగా నిలిచిన/ తోడుగా నడిచిన త్రిపురకీ పెద్ద తేడా లేదు. ఆ ఇద్దరూ వొక్కటే అవడం నాకు చాలా ఆశ్చర్యం.
అలా ఆయన వెళ్ళిపోయిన ఆ రాత్రి నించి మరికొన్ని రోజులు త్రిపుర కథలు చదువుతూ కూర్చున్నా. నాకు త్రిపుర తెలుస్తున్నాడో లేదో తెలియడం లేదు! నాకు చాలా తెలియడం లేదు అని మోనోలాగ్ తో నన్ను నేను కొన్ని రోజులు త్రిపురాక్షరాల అద్దంలో నిలబడి తల దువ్వుకొని కొన్నిసార్లూ దువ్వుకోకుండా కొన్ని సార్లూ అడుక్కుంటూ వుండిపోయా. యవ్వనం చాలా desperate గా వుంటుంది కొన్ని సార్లు. అప్పుడు త్రిపుర నాలోని ఆ desperate mood లోకి ప్రవేశించే వాడు.
అప్పుడే మళ్ళీ కామూ వొకడు నా ప్రాణం తోడేయడానికి! “ఒరేయ్…వాడు నీ చమడాలు తీసేస్తాడ్రా…” అని ‘మో’ బెదిరింపులు. కామూ The Myth of Sisyphus చదువుకుంటూ…గడిపిన రాత్రుల్లో త్రిపుర కూడా!
In a universe that is suddenly deprived of illusions and of light, man feels a stranger. His is an irremediable exile…this divorce between man and his life, the actor and his setting, truly constitutes the feeling of Absurdity.
ఏమిటీ Absurdity లో ఆ A capitalize అయిపోయి నా అస్తిత్వాన్ని నన్నూ కడిగి ఉతికి పారేస్తూ…గది ముందు దండేనికి వేలాడుతున్న చొక్కాలా నేను!
3
Nothing happens, nobody comes, nobody goes; it’s awful!
ఇంకో పదేళ్ళకి చాలా అమాయకంగా ఆ Samuel Becket వాక్యం దుప్పట్లా కప్పేసుకునే human condition. “…అర్థరాత్రి స్వప్నాల్లో …ఆ కనిపించని ద్వారం తెరుచుకుంటుంది. ఎవరో పచ్చటి వేళ్ళతో తట్టి లేపుతారు. లోపలకు వెళ్తావు. తలుపు మూసుకుంటుంది. చప్పుడు చేయదు. అప్పుడే సీజర్, జీసస్…..జూడాస్ కూడా!”
త్రిపుర పాత్రలు సృష్టించాడా? లేదు. అవి నా బహురూపాలు. నా భిన్న ముఖాలు. నా వొక్కో ముఖాన్ని వొలిచి వాటికి వేరే పేర్లు పెట్టాడు త్రిపుర.
త్రిపుర వేరే జీవితం చెప్పాడా కథల్లో? కాదు. అది నేను జీవించే జీవితమే. నేను జీవిస్తున్నాను అని చెప్పుకోడానికి నిరాకరించే జీవితం!
అందుకే –
త్రిపుర నిష్క్రమించడు. వొక కనిపించని ద్వారం తెరిచి అందులోంచి మనల్ని ప్రవేశపెట్టి, కాసేపు మన సంభాషణకి మనల్ని వదిలేసి వెళ్లిపోయాడు ఇదిగో ఇక్కడి దాకే!
వచ్చేస్తాడు ఏదో వొక క్షణం, ఇక్కడే వున్నట్టుగా!
మే 29, 2013, సారంగ
Excellent….
నాకు ఆయన కథలు ఒకటి రెండు చదివిన తరువాత యిక చదవాలనిపించలేదు. ఆయన కథల గురించి విన్నప్పుడల్లా ఈ సారి చదవాలి అనుకుంటాను కానీ పుస్తకం తీసాక చదవాలనిపించదు బహుశా ఆ కథల లోతులకి నేను వెళ్ళలేకపోవడం వల్లనేమో.
ప్రతి పాఠకుడికీ కొత్త కథలా పరిచయం అవుతాడు త్రిపుర. కొన్ని రోజులపాటూ వేరే ఏమీ చదవాలనిపించదు, ఆయన్ని తప్ప. ఒక్కో వాక్యంలో ఎన్నెన్ని కథలు వినిపిస్తాడో, ఎన్నెన్ని ఆలోచనలు పుట్టిస్తాడో. త్రిపుర నిష్క్రమించడు. నిజం.
I read this previously somewhere on FB … but this again drags in to the Ocean! Great post indeed!