ఏం జీవితం!

జీవితంలో మనిషికి ఏం కావాలి?
జీవితానికి గమ్యం జీవించటమేనా?
పంచేంద్రియాలతోనూ అనుభవించగలిగినంతేనా జీవితమంటే?
చివరకు ఏం జరుగుతుంది?
రచన: చంద్ర కన్నెగంటి

 

కళ్ళు మూతలు పడుతున్నాయి.

చుట్టూరా సందడికి తెరుస్తూ మళ్ళీ మూస్తూ.

అందరూ ఉన్నారు కనపడీ కనపడకుండా. గొంతులు వినపడీ వినపడకుండా. పోలికలు తెలుస్తున్నాయి.

మనవడూ, మనవరాళ్లూ అటూ ఇటూ. ఒకరు గడ్డం మీద చేత్తో రాస్తూ “నీకు గడ్డం పెరిగింది తాతా! షేవ్ చేసేదా?” అంటూ. ఇంకొకరు “నన్ను టికిల్ చేస్తావా? ఇప్పుడు దొరికావు, నిన్ను టికిల్ చేస్తా!” అంటూ బుల్లి చేతులతో తడుముతూ. ఇంకొకరు “ఏదీ మళ్ళీ నవ్వు మాయల పకీరు లాగా! హహ్హహ్హహ్హ!” అని నవ్వుతూ.

 

నువు తాకావు. పాదాలతో మట్టినీ, రాళ్లనూ, ఇసుకనూ, పచ్చికనూ.

వేడివీ, చల్లనివీ, గోరువెచ్చనివీ.

చర్మం బొబ్బలెక్కేంత వేడినీ, ఎముకలు కొరికే చలినీ.

కరచాలనం చేస్తూ ఎన్ని అరిచేతుల్నో తడిగా, పొడిగా, మెత్తగా, గరుగ్గా.

లేత బుగ్గలనూ, మృదువైన చర్మాన్నీ, ముడతల్నీ.

దేహంతో దేహాన్నీ, పెదాలతో పెదాల్నీ, మెడ వొంపుల్నీ. వేడి నెత్తురు పొంగే నరాల్నీ, కొట్టుకునే గుండెనూ.

వానలో తడిసి, ఎండలో ఎండి, గాలిని చుట్టుకున్నావు.

నీళ్లలో మునిగి మంట కాచుకున్నావు.

గడ్డిపరక చివర వేలాడే నీటి బొట్టుని తాకావు.

పిట్ట ఈకనూ, పూరేకునూ, మెడకు చుట్టుకున్న చేతులనీ.

వెచ్చటి కన్నీటినీ. రేగిన చర్మాన్నీ, ముల్లు గుచ్చుకున్న నొప్పినీ భరించావు.

తాకరానివీ, తాకబుద్ధి కానివీ కూడా.

 

కూతురు గొంతు వినవస్తూంది. “నాన్నా, నీకు గుర్తుందా? చిన్నప్పుడు తిరపతి కొండ మెట్లు ఎక్కలేకపోతుంటే భుజం మీద ఎక్కించుకుని పైదాకా మోసుకెళ్ళావు. అన్నాయ్ కంటే నేనంటేనే ఇష్టం నీకు. నువు ఏ రోజయినా ఇంటికి ఆలస్యంగా వస్తే అలిగి నీకు కనపడకుండా దాక్కునేదాన్ని. అందుకని నువు చాక్లెట్స్ తెచ్చేవాడివి. నువు నా అలక తీర్చడానికి పడే పాట్లు చూస్తే నువ్వంటే ఎంతో ఇష్టం కలిగేది. అందుకే ఒక్కోసారి నువు ఆలస్యంగా వస్తే బావుండునని అనుకునేదాన్ని. ఎప్పుడయినా అమ్మ కొట్టేదేమో కానీ నువ్వెప్పుడూ నామీద చేయెత్తలేదు. నువు కోప్పడిన గుర్తు కూడా లేదు నాకు. మొదటిసారి కాలేజ్ నుండి నేను ఆలస్యంగా వచ్చినప్పుడు నేనూ నీకోసం చాక్లెట్స్ తెచ్చాను గుర్తుందా? నువు నా అలక తీర్చినట్టే నీ అలక తీర్చాను ఆ రోజు. ఎప్పుడన్నా దిగులుగా అనిపించినప్పుడు అది గుర్తు చేసుకుంటాను. పెళ్ళయాక అత్తగారింటికి పంపేప్పుడు నువు బయటికి కూడా రాలేదు. ఎందుకో నాకు తెలుసు. మరుసటి రోజు పొద్దున్నే అక్కడికి వచ్చావు నేనేదో మర్చిపోయానని చెప్పి. వాళ్లంతా ఒకటే నవ్వడం.”

నువు విన్నావు. ఆకుల గలగలనీ, అలల కలకలాన్నీ.

పక్షుల రెక్కల టపటపల్నీ.

నానారకాల వాయిద్యాలనూ. మనుషుల గొంతుల్నీ.

సప్తస్వరాలుగా, రాగాలుగా. కబుర్లనీ, కథలనీ.

మాటల్నీ, పిల్లల కేకల్నీ.

నీతుల్నీ, బూతుల్నీ, నినాదాలనీ. పలురకాల పాటల్నీ.

నానారీతుల నవ్వుల్నీ, ఏడుపుల్నీ.

గుండె చప్పుళ్ళనూ.

పిట్టల కూతల్నీ, జంతువుల అరుపుల్నీ.

సముద్రపు హోరునూ, ఉరుముల్నీ.

కీచురాళ్లనూ, గుసగుసల్నీ.

జనసందోహాల సవ్వడినీ. చెవులు బద్దలయ్యే యంత్ర, వాహన రణగొణధ్వనుల్నీ. నిశ్శబ్దాన్నీ నువు విన్నావు.

 

కొడుకు అందుకున్నాడు. “నాన్నా, నీకు చాలా ఓపిక. నాకు లెక్కలు కష్టంగా ఉంటే అర్థరాత్రి దాకా కూచోబెట్టి చెప్పేవాడివి. ఎన్నిసార్లు లెక్క తప్పు చేసినా మళ్లీ మళ్లీ చెప్పేవాడివే కానీ కోప్పడేవాడివి కాదు. ఎంత ఆలస్యంగా పడుకున్నా పొద్దున్నే లేపేవాడివి. ఆదివారం పార్కుకు తీసుకెళ్లి పిట్టల్నీ, పురుగుల్నీ చూపించేవాడివి. మాతో క్రికెట్ ఆడేవాడివి. మా స్కూల్ టూర్‌కి వెళ్లాలని ఏడిస్తే డబ్బులు కట్టి నువు ఆ నెలంతా స్కూటర్ బదులు సైకిల్ వేసుకు వెళ్లావు. నా గాలిపటం తెగి కొమ్మల్లో ఇరుక్కుంటే ఎక్కి తెచ్చావు. నాకు సైకిల్ నేర్పడానికి ఎన్ని రోజులు పట్టిందో గుర్తుందా? నాకంటే చెల్లి సైకిల్ తొందరగా నేర్చుకుందని ఆట పట్టించేవాడివి. మా ఇద్దరి చదువుల కోసం ఎంత కష్టపడేవాడివో నాకు తెలుసు. అడుగడుగునా ధైర్యం చెప్పేవాడివి. నీతో ఎప్పుడూ అనలేదు కానీ నువు మమ్మల్ని ఎలా పెంచావో మా పిల్లల్నీ అలాగే పెంచాలని అనుకుంటూంటాను. నువు మా నాన్నవని అనుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా?”

 

నువు చూశావు.

చీకటినీ, వెలుతురునూ.

మసక చీకట్లనూ, వేకువ వెలుతురునూ, చిమ్మ చీకట్లనూ, కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతినీ.

వెలుగునీడల దోబూచులాటల్నీ, వాటి మధ్య విచ్చుకున్న ఏడు రంగుల హరివిల్లునూ.

ఉజ్జ్వలమైన ఉదయాల్నీ, సాయంత్రాల్నీ, మధ్య రంగు పుంజుకునే మబ్బుల్నీ.

వెలిగే రంగు రంగుల పూలనూ, దీపాలనూ.

ఎండలో మెరిసే చెట్లనూ, చిగుళ్లనూ, వెన్నెల్లో మునిగిన లోకాన్నీ.

మెరుపుల్నీ, చూరు చివర వర్షపుధారల్నీ. మిణుకుమనే చుక్కల్నీ.

నీలాన్నీ, అనంతాన్నీ.

అనేక రకాల ఆకారాలనీ, మొహాల్నీ.

తళుక్కుమనే కన్నుల్నీ. వంపులు తిరిగిన నదుల్నీ, దేహాల్నీ.

అద్దంలో నిన్నూ.

పర్వతాల్నీ, మానవ నిర్మిత కట్టడాల్నీ.

చిత్రాన్నీ, శిల్పాన్నీ, నృత్యాన్నీ, నవరసాలూ పొంగే అభినయాన్నీ.

చిందిన నెత్తుటినీ, తెగిపడ్డ అంగాంగాలనూ.

ప్రకృతి విలయతాండవాన్నీ, మనిషి వికృత చర్యలనూ.

యుద్ధాన్నీ, విధ్వంసాన్నీ.

నువు చూశావు.

 

నువు చదివావు.

అక్షరాలూ, పదాలూ, వాక్యాలూ, పుస్తకాలూ.

వార్తలూ, వ్యాఖ్యానాలూ.

ఎన్నో కథలూ, కవితలూ,నవలలూ, నాటకాలూ.

 

మిత్రుడు అంటున్నాడు. “మనం చిన్నప్పుడు ఎట్లా స్నేహితులమయ్యామో నాకు గుర్తే లేదు. మీ నాన్న జేబులో సిగరెట్లు నేను కాజేసి తెచ్చి బలవంతంగా నీతోటీ తాగిస్తే, పట్టుబడినప్పుడు తప్పంతా నీమీద వేసుకుని తన్నులు తిన్నావు గుర్తుందా? పరీక్షలో నాకు సాయం చేయబోయి పట్టుబడ్డావు. ఇన్నేళ్లూ మన స్నేహం చెక్కు చెదరలేదు. నువ్వొక్క ద్రోహం మాత్రం చేశావు. అది నీకు తెలుసు. అయినా నీ స్నేహం ముఖ్యం నాకు. తెలీనట్లే ఉండిపోయాను. క్షమాపణలేవీ అక్కర్లేదు. మనం మనుషులమే కదా! నా మిత్రధర్మం నేనూ అన్నివేళలా నిలబెట్టుకున్నానని చెప్పలేను. కానీ మనం ఎన్ని సమయాలు సరదాగా గడిపాం! ఎన్ని సాయాలు చేసుకున్నాం! ఓదార్చుకున్నాం, ధైర్యం చెప్పుకున్నాం. మొదట్నుంచీ నీది బాగా కష్టపడే స్వభావం. నిన్ను చూసీ చూసీ కొద్దో గొప్పో అది నాకూ అబ్బింది. చెప్పొచ్చో లేదో కానీ నీ స్నేహానికి కృతజ్ఞతలు.”

 

నువు ఆఘ్రాణించావు.

మల్లెల్నీ, జాజుల్నీ, సంపెంగల్నీ.

చెట్టువీ, జడలోవీ.

పంట చేల మీదుగా వీచే గాలినీ.

వానకు తడిసిన మట్టివాసననీ.

నీ ఊపిరితిత్తుల నిండుగా పీలుస్తూ, వదులుతూ.

విదేశాల అత్తరునూ, విరబోసుకున్న జుట్టునూ.

చెమటనీ, నెత్తుటినీ వాసన చూశావు.

సముద్ర తీరపు ఉప్పుగాలినీ, చేపల వాసననూ.

అన్నం ఉడికే ఆవిరినీ.

మసాలాదినుసుల, నానా రకాల తినుబండారాల నోరూరించే వాసనల్నీ.

కాఫీ, టీ పొగల్నీ.

బాలింతా పసిగుడ్డుల వాసనల్నీ, ముసలి ముతకనూ.

గొడ్ల దగ్గర రొచ్చునూ, మురిక్కాలవ మురుగునూ, మండని పెట్రోలు పొగనూ.

పక్కనే చేతిని చేయిలోకి తీసుకుని నిమురుతూన్న భార్య అంటూంది, “ఎన్ని ఏళ్ళుగా కలిసి బతికాం మనం! పెళ్లయిన కొత్తలో ఏదో సాకుతో నా చుట్టూ తిరగడం, నన్ను తాకాలని చూడడం ఇంకా గుర్తుంది. నా చేత మీరు అని పిలవడం మానిపించి నువు అని పిలవడం అలవాటు చేశావు. కొన్ని సాయంత్రాలు నడుస్తూ ఉండేవాళ్లం. కొన్ని రాత్రులు వెన్నెల్లో ఊరికే పాటలు వింటూ గడిపేవాళ్లం. కొన్ని నాకు నేర్పావు, కొన్ని నేర్చుకున్నావు. కొన్నిసార్లు పంతాలకు పోయి అలిగి కూచునే వాళ్లం. కొన్ని మార్చలేమని అర్థం అయినా అంతే. కానీ నువ్వే ముందు పలకరించే వాడివి. అబద్ధమెందుకూ! ఒక్కోసారి కోపంలో నిన్నొదిలి పోవాలనిపించేది. కోపం తగ్గాక నన్ను నేనే తిట్టుకునేదాన్ని అలా అనుకున్నందుకు. నువు తప్పుదారి పట్టిన ఆ ఒక్కసారీ తప్ప. సగటు మనిషి బలహీనత అని సమాధానపడడానికి సమయం పట్టింది. ఆ తప్పు మళ్లీ చేయలేదు నువ్వు. నేను నిన్ను ప్రేమించినంతా నువ్వూ నన్ను ప్రేమించావు. నీ ఇష్టాలు కొన్ని నేను తీర్చాను. నావి నువు తీర్చావు. అన్నీ పంచుకున్నాం. ఎన్ని జ్ఞాపకాలు! ఇంకా తీయగా మిగిలాయి. మనం పడ్డ గొడవలూ గమ్మత్తుగా అనిపిస్తాయి ఇప్పుడు. ఇన్నేళ్లు గడిచినట్టుగానే లేదు.”

 

అన్నీ రుచి చూశావు.

కాకర చేదూ, చెరుకూ తేనెల తీపీ, పచ్చి, పండు, ఎండు మిరపల కారమూ, మామిడీ, చింతకాయల పులుపూ, దోర వెలగ వగరూ, సముద్రపు ఉప్పూ.

రకరకాల పాళ్లలో ఆ ఆరు రుచులూ కలిపీ.

కమ్మటివీ, కక్కొచ్చేవీ. పుచ్చినవీ, కుళ్ళినవీ.

రకరకాల గింజలూ, పళ్లూ, కూరగాయలూ, మాంసాలూ.

ఉడికించినవీ, వేయించినవీ.

తినేవీ, తాగేవీ. తీపీ కారపు పిండివంటలూ.

 

ఆపైన మాట్లాడావు.

నీ మనోభావాలన్నిటినీ మాటల్లోకి అనువదించుకుంటూ.

తడుముకుంటూ.

పలకరించావు.

మరిన్ని మాటలు.

నిజాలూ, అబద్ధాలూ, అటూ ఇటూ కానివీ.

ముద్దుగా, కరుగ్గా, పొడిగా, ఆప్యాయంగా.

పాటల్లాంటివి పాడావు.

ఆనందంతోనో, కోపంతోనో అరిచావు.

 

ఇంకా మరింతమంది కనిపిస్తున్నారు మసగ్గా. మరిన్ని గొంతులు. ఎవరో చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. మిగతా అందరూ అందుకున్నారు. ఎవరు వదిలారో రంగురంగుల గాలి బుడగలు పైకి ఎగురుతున్నాయి.

చేయి బిగుసుకుంది. నోరు తెరుచుకుంది. మొహం దగ్గరకు తెచ్చింది భార్య.

“బాగా బతికానా?”

అవునన్నట్టుగా తలుపుతూ ఆమె సన్నగా నవ్వుతూ అతని చేతిని నిమిరింది.

 

నువు నడిచావు, పరుగెత్తావు, ఎగిరావు, దూకావు, జారావు, పడ్డావు.

చేతులు ఊపావు, దోమను చంపావు.

దగ్గరివాళ్లను హత్తుకున్నావు.

ఉత్తరాలు రాశావు.

పట్టుకున్నావు, వదిలేశావు.

వంచావు, విరిచావు.

బరువులు మోశావు.

నువు ఏడ్చావు. లోపల్లోపల కుళ్ళి కుళ్ళీ, బయటికి వెక్కి వెక్కీ.

నీకోసం. నీ వాళ్ల కోసం. ముక్కూ మొహమూ తెలియని ఎవరికోసమో కూడా.

నువు నవ్వావు.

చిన్నగా, సన్నగా, పగలబడీ.

ఎవరి భుజమ్మీద పాపో వెనక్కి తిరిగి నీకేసి చూసి బోసినవ్వు నవ్వినప్పుడూ, నీ ఇంట్లో వాళ్లు చక్కిలిగిలి పెట్టినప్పుడూ, మిత్రుల జోకులకూ, ఏమీ లేకుండా ఉత్తుత్తికే కూడా.

 

నువు భయపడ్డావు.

చీకట్లో చిటుక్కుమంటేనూ, బిడ్డలు ఇంటికి సమయానికి చేరకపోతేనూ, మీ అందరి భావి జీవితాల గురించీనూ.

 

నువు కోప్పడ్డావు.

నీ తల్లిదండ్రుల మీదా, భార్య మీదా, పిల్లల మీదా, లోకం మీదా.

నీ మీద నువ్వూ.

ప్రేమించావు.

నిన్నూ, నీ కుటుంబాన్నీ, అప్పుడప్పుడూ ప్రపంచాన్నీ.

ద్వేషించావు.

నీ పొడ గిట్టనివాళ్ళనూ, ఒక్కోసారి నీ చుట్టూ ఉన్న అందరితో పాటు నిన్నూ.

అసహ్యించుకున్నావు. ఆనందించావు. ఆశ్చర్యపోయావు. అసూయ చెందావు. దయ చూపావు.

 

నువు వెతికావు.

ఎదురుచూశావు. కలలు కన్నావు.

ఆశపడ్డావు. నిరాశ చెందావు. పేరాస పడ్డావు.

మోసం చేశావు, త్యాగం చేశావు.

న్యాయం చేశావు, అన్యాయం చేశావు.

ఓడావు, గెలిచావు.

సిగ్గుపడ్డావు, గర్వపడ్డావు.

చిన్నవాటికీ, పెద్దవాటికీ.

నేర్పావు, నేర్చుకున్నావు.

ఓదార్చావు, ఓదార్పు పొందావు.

ద్రోహం చేశావు, క్షమించావు.

జ్ఞాపకాలు పోగేసుకున్నావు, పోగొట్టుకున్నావు.

కొన్ని అవకాశాలు వదులుకున్నావు.

 

నువు అన్నీ అనుభవించావు. నలుపునుంచి తెలుపూ, తిరిగి నలుపూ, మధ్య అన్ని రంగుల్నీ. నువు జీవించావు. ఉన్నంతలో. నీకు వీలయినట్టుగా. అంతే.

అతని కళ్ళు మూతలు పడ్డాయి.

ఈసీజీ చప్పుడు విని, అటుగా వెళుతున్న కొత్త నర్సు తొంగి చూసి, పరుగెత్తుకెళ్లి పెద్ద నర్సుకి చెప్పింది. ఇద్దరూ అతని గదిలోకి వెళ్లి చూశారు.

పరీక్షించి, “పోయాడు!” అంది పెద్ద నర్సు.

“మొహం చూడండి! తృప్తిగా, ఆనందంగా పోయినట్టు లేదూ?” విస్మయంగా అతని మొహం వంకే చూస్తూ అంది కొత్త నర్సు.

“ఎట్లా బతికాడో గానీ చావు మాత్రం హాయిగా పోయాడు!”

“ఈయన తాలూకా ఎవరూ లేరుగా! ఏం చేయాలి?”

“రిజిస్టర్లో ఈయన్ని చేర్పించిన వాళ్ళ ఫ్రండ్ నంబర్ ఉంటుంది చూడు. ఫోన్ చేసి రమ్మని చెప్పు! డాక్టర్ గారికి నేను ఫోన్ చేస్తాలే!” అతని కుడిచేతివేళ్ల మధ్య నుంచి దుప్పటిని తప్పిస్తూ అంది పెద్ద నర్సు.

“ఈ టైమ్ లోనా? లేపితే తిడతారేమో!” అనుకుంటూ వెళ్లింది కొత్త నర్సు.

తర్వాత చాలారోజుల వరకూ తమ హాస్పిటల్లో మొహమ్మీద చెరగని తృప్తీ, ఆనందాలతో చనిపోయిన ఒక రోగి గురించి వింతగా ఆ కొత్త నర్సు తనకు తెలిసిన వాళ్లందరికీ చెప్తూనే ఉంది.

*

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు