ఏం చేస్తారు?
ఎన్నటికీ కలవని రైలుపట్టాల మీద
జీవితకాలం లేటనిపించే నడవని రైళ్ల కోసం
కూర్చునీ, కూర్చునీ
ఆకలితో సొమ్మసిల్లి సోలిపోతూ
ఆకాశాల్ని మోసుకుంటూ
మెలకువలో భారంగా ఎదురుచూస్తారు
ఇంకేం చేస్తారు?
దూరం మరిచిన పాదాలతో చేరలేని గమ్యానికి
నడుస్తూ, నడుస్తూ
కంకర పరిచిన ఆ సిమెంటు స్లీపర్ల పైన
అలసి తూలిపోయే కనులలో
దుఃఖ సముద్రాల్ని దాటుకుంటూ
సోయిలేని నిద్రలో ఈదుకుంటూ మునిగిపోతారు
ఏం చేస్తున్నారక్కడ వాళ్ళు రైలు పట్టాల మీద?
ఏంచేస్తారు?
మండే ఎండలలో వడగాడ్పులలో
గూడులేకుండా తరిమిన నగరాలనుంచి
బతుకు కోసం, బతుకుతెరువుకోసం
తెగిన చెప్పులతో, గాయపడిన పాదాలతో
బారులు తీరి ఒంటరిగా, గుంపులుగా చేరి ఒక్కటిగా
అదిగో ఆ పట్టాల వెంట
పుట్టిన ఊరి వైపు, కూలిన గుడిసెల వైపు
అలసటతో, ఆశతో
కలత నిద్రలో చెదిరిన కలలతో
చీకటి గుహలా నోరుతెరిచిన భవిష్యత్తులోకి
నడుస్తూ, నడుస్తూ
అస్తమయం వైపు అడుగులు వేస్తూ సాగిపోతారు
ఇంకేం చేస్తారు?
పరుగులు తీసే గూడ్సురైలు చక్రాలకు
నెత్తుటి కందెనగా మారిపోతారు
కళ్ళు మూసి తెరిచి చూసే లోపు
మోసుకెళ్లడానికి రైళ్లు
తీసుకెళ్లడానికి టికెట్లు
ఆధార్ కార్డులు, అనుమతి పత్రాలు
పౌరసత్వపు రుజువులు
ఏవీ అవసరంలేని ప్రయాణీకులై
తిరిగిరాని గమ్యానికి వెళ్ళిపోతారు
అవయవాల ఆనవాళ్ళు తెలియని
విగత జీవులౌతారు
ఎవరూ చప్పట్లు కొట్టకుండానే
పైనుంచి పూల వర్షం కురిపించకుండానే
రాళ్ళ మీద రక్తపు మరకలై ఇంకిపోతారు
ఎక్కడా దీపాలు వెలిగించకుండానే
బుద్ధ పూర్ణిమ రాత్రి వెన్నెలలో
ఆరిపోతారు
బతుకు తెరువు వేట నుంచి
చివరకు బతుకునుంచే తప్పించుకుని
అక్కడే, ఆ రైలుపట్టాల మీద
భళ్ళున తెల్లారిపోతారు!
(మధ్యప్రదేశ్ వలస కార్మికులు ఔరంగాబాద్ రైలు పట్టాల మీద ఏం చేస్తున్నారని కొంతమందికి సందేహం కలిగింది!)
Goods rail chakrapani kandenaga mararu.most pathetic situation. Dukkam aavaran his kavitha.
కవిత చాలా బాగుంది.
గుండె తడిసిపోయింది.
కవిత బాగుంది. వాస్తవ స్తితిని కళ్ళకు కట్టినట్టు చూపించింది. వలస కూలీల ఆర్త నాదాలను వినిపించింది. పట్టాలపైన దొర్లిన రక్తపు ధారల వాసనలు చూపించింది. తలులు తెగి గుర్తుపట్టరాని మొండాల స్పర్శ తో ఒళ్ళు తడిపిందీ కవిత… కవి హృదయ ఆద్రత పాఠకులను సైతం తడిపింది. హృదయవిదారక భయానక స్తితికి ఎవరు కారణం…… “నిజమే ఎవరు వారిని పట్టలపైన పడుకోమన్నారు?”.
నేను FB లో “పాలక వ్యవస్థ ల నిర్లక్షం” పెట్టిన పోస్ట్ చూసి, ఒక మిత్రుడు ఇదే అడిగాడు……….. “వాల్లు పట్టాలపైన ఎందుకు పడుకున్నారు సార్? తప్పు వాళ్ళదే కదా సార్” అని,………………… వలస కూలీల హత్య వెనక వున్నా నిర్లక్ష రాజయకీయ క్రీడా అర్థం కానిచో ఇలాంటివే సందేహాలు……….. మళ్ళీ మళ్ళీ పుడతాయి.
ఈ కవిత దీనికి సరైన జవాబు…. అది అందిచిన సుధాకిరన్కు అభినందనలు