1
డైనింగ్ హాలు చిరాగ్గా ఉంది – రోజూ హడావిడిగా ఉండేది! ఖాళీపళ్ళాల చప్పుళ్ళు, ఎవడో పాడుతున్నాడు. నలుగురు కూర్చుని తింటూ అరుస్తూ ఆనందిస్తున్నారు. ఎవరెవరో వచ్చిపోతున్నారు.
రవి ఒక్కడూ వచ్చి పళ్ళెంలో టోకెనుపెట్టి టిఫిను కౌంటరు దగ్గర క్యూలో నించున్నాడు. ‘‘ఇద్దరు – ఒక్కరు – నేను’’… పంచింగ్ అయింది. కిచిడీ ముద్ద, పచ్చడి అడ్డదిడ్డంగా వేశాడు. – కౌంటర్లో వాడు. కాస్త పచ్చడి ఒలికి చెయ్యి మీద పడింది.
రవి వాడికేసి చూశాడు. వాడేదో పాడుకుంటున్నాడు. – ‘‘వైదిస్ కొలవరి, కొలవరి, కొలవరి’’ ప్రయోజనం లేదు! తన చూపుకి, అనుకుని మెల్లగా మూలమీద టేబుల్ దగ్గరికెళ్ళాడు. ఖాళీ పళ్ళాలు తీసే కుర్రాడు అటూ ఇటూ తిరుగుతూ స్పాంజితో పడిపోయిన మెతుకులవీ తుడుస్తున్నాడు.
‘‘వీడెందుకు బతుకుతున్నాడు? ఎలా ఈ చెత్తపని చేస్తున్నాడు?’’ రవి బుర్రలో ప్రశ్నలు. గొంతులో కాయ అడ్డంగా నిలువుగా తిరుగుతోంది. ఇదేం జబ్బో? మొన్న డాక్టరు చూసి ‘‘ఫర్లేదు, ఎనీమియా, బాగాతిను’’ అని చెప్పాడు. ‘‘తినడానికే అడ్డుపడుతుందిరా’’ అంటే వింటే కదా! సీరియస్ గా నాలుగు రకాల మందులు రాసి ఇచ్చాడు.
ఈ నాయర్ కిచిడీ ప్రతీసారీ ఒకేలా రుచీ పచీ లేకుండా ఎలా చేస్తాడో! ఉడికినట్లు, ఉడకనట్టు, మాడు వాసన ఉందోలేదో తెలీనట్టు.
అమ్మ! పాపం, ప్రతీ రోజూ ఎవరో ఒకరు, రాముడో, శివుడో, హనుమంతుడో, గణపతో ఎవరో ఒక దేవుడి పాటలు, దండకాలు పాడుకుంటూ, ప్రతిసారీ గొప్ప రుచిగా చేస్తుంది!
ఊర్నుంచి తను వస్తే కాస్త నెయ్యి తగిలిస్తుంది. నాలుగు జీడిపప్పులు కూడా పెడుతుంది. అమ్మ, నాన్న నే లేనప్పుడు ఏం తింటారో అని అనుమానం! దొంగతనంగా వెళ్ళి చూడాలనిపిస్తుంది.
నాన్న జెడ్. పి. ఆఫీసులో ఆఫీసరు. ఏమాత్రం ధనాసక్తి, ఫలాపేక్ష లేనివాడు. అమ్మకి నాన్న కూడా దేవుడే! హాయిగా రెండు గదుల్లో పెద్ద విల్లాలో ఉన్నట్టు సంతోషంగా ఉంటారు. కబుర్లు, సెటైర్లు, ‘‘ఏవోయ్’’ అని నాన్న, ‘‘చాల్లెండి చూసాం’’ అని అమ్మ.
ఇప్పుడు వాళ్ళు కూడా కళ్ళకి కనిపించట్లేదు. అలుక్కుపోయారు. రవి సగం తిని నీళ్ళ గ్లాసు పూర్తిగా ఖాళీ చేసి, లేచి పోబోయి, పళ్ళెం తీసుకెళ్ళి నీలం టబ్ లో వేసేడు.
‘‘థాంక్యూ భయ్యా’’ ఆ కుర్రాడి అరుపు, విజిల్ వినిపించాయి.
2
తల బరువుగా తోచింది రవికి. సరే, షాపులో సిగరెట్ కొన్నాడు. ఇందాక ఆఖరి టోకెన్, ఇది ఆఖరి పదిరూపాయలు. సిగరెట్ వెలిగించి నోట్లో పెట్టాలని ఉద్ధేశ్యం. ‘‘సాలే ఈ పక్క కాదు, ఆ పక్కరా వెలిగిస్తారు’’ ఎవరో ఎస్.ఎస్. (సూపర్ సీనియర్) నెత్తిమీద జెల్లకాయ కొట్టాడు. ‘‘ఛల్, నికల్ ఫో! ఇక్కడ్నుంచి’’ గదమాయించాడు.
అవ్వాల్సిందే తనకి. పొగరు నెత్తికెక్కి, వెధవపని చేద్దామంటే, వాతావరణం సహకరించట్లేదు!
రెండు రోజులుగా కేంపస్ సెలక్షన్లు, పగలూ, రాత్రి పడీ పడీ రిఫరెన్సులు, రౌండ్లు, ఇన్ని టీలు ఎప్పుడూ తాగలేదు. అన్ని బిస్కెట్లు తినలేదు.
మెకానికల్ ప్రొఫెసరు ఇంటిపక్క నుంచి ఫుట్ బాల్ గ్రౌండుకి దారి తీసాడు రవి.
ఎందులోనూ తనకి ఓపెనింగ్సు కుదరట్లేదు. ‘‘ఏరా! కేంపస్ వస్తుందంటావా’’ నాన్న ఫోన్లో మాట తనకి ఛాలెంజింగా తోచింది. ‘‘కుదిరితే బాగుంటుంది, దూరంగా వెళ్ళి చదువుకున్నందుకు నలుగురిలో పరువూ దక్కుతుంది’’ ఆఖరి మాటలు ఇంకా బరువైపోయాయి.
ఎవరో బాగా తయారై, బంతిని అటూ ఇటూ తన్నుకుంటున్నారు. పాపం బంతికి షూస్ దెబ్బలెన్నో!
ఛ కనీసం ఓ గర్ల్ ఫ్రెండు లేదు. మూడేళ్ళు పూర్తిగా భాషే రాలేదు. ఎవర్నైనా ఇంప్రెస్ చేసేంత పెర్సనాలిటీ కాదు. ‘‘ఒరే టైంపాస్ రా! కలర్ ఫుల్ గా ఉంటుంది’’ అన్న సీనియర్ మాటల్ని వాళ్ళవాడే ఖండించాడు. ఇంకోడు, ‘‘ఒద్దురా బాబూ! సెంటిమెంటుతో మంట పెట్టేస్తారు. బోలెడు మెయింటెనెన్స్ కాస్టు! ఓ బండి కొనుక్కోవచ్చు’’ అంటూ..
‘‘నాకంతలేదులే’’ అని డిసైడైపోయాడు రవి.
ఎవరో పిలిచారు, ‘‘అన్నా! ఏమి ఒక్కడివీ వెళ్తున్నావ్’’
చేత్తోనే ‘‘ఏం లేదని’’ ఊపి, ‘‘వ్యూ పాయింటు’’కు వెళ్ళాడు రవి.
కాస్త ఎత్తుగా, కింద 15-20 అడుగుల వరకు రాళ్ళు, కంపలు, చిన్న అర్ధచంద్రాకారంలో ఓ పారాపెట్ గోడ. పూర్తిగా చీకటి పడ్డాక, దూరంగా వెళ్ళే వాహనాల వెల్తురు కళ్ళలో పడుతోంది. ‘‘నా కళ్ళు గేదె కళ్ళల్లా మెరుస్తాయా? వాళ్ళకి కనపడతాయా?’’
ఇవాళ లేదు గానీ రేపు పొద్దున్న ఇంకో ఇంటర్వ్యూ ఉంది, అదే ఆఖరుది. విసుగ్గా ఉంది. తనకేంరాదు. మైండ్ బ్లాంకైపోతోంది. ఏం జబ్బో ఏంటో!
నెమ్మదిగా లైబ్రెరీ లోపలికెళ్ళాలా వద్దా అని తటపటాయించాడు. అరిగిపోతున్న చెప్పుల్ని కాలి బొటనవేలికి, పక్క వేలికి మధ్య గట్టిగా పట్టుకొని నిశ్శబ్దంగా మెట్లెక్కాడు.
‘‘తలుపు తొయ్యాలా? లాగాలా?’’ ఆలోచిస్తున్నాడు. తోసాడు, ఓ బల్ల దగ్గర కూచున్నాడు. పాతబల్ల, మూలవైపు అక్కడ దుమ్ముపట్టిన కొన్ని పేపర్లుంటాయి. కానైతే కిటికీలోంచి కేంటిన్ కనబడుతుంది. ఎంత సేపైందో తెలీదు. సహ్ లే బేటా!’’ అన్న మాటతో ఇహలోకంలోకొచ్చాడు రవి.
3
ఎప్పుడూ మాట్లాడని లైబ్రేరియన్ విఠల్, తన ఎదురుగా స్టూల్ మీద ఉలిక్కిపడ్డాడు. రవి తలమీద చెయ్యిపెట్టి, జుట్టు సర్దాడు. వేళ్ళతో అటూ ఇటూ వెంట్రుకలు పాయలు తీసి ‘‘సహ్ లే బేటా’’ బేస్ వాయిస్ లో లాలనగా మళ్ళీ అన్నాడు ఆయన.
‘‘ఓర్చుకో బిడ్డా! కొంచెం ఓర్చుకో’’
రవికి, తన కళ్ళజోడు తీసి పక్కన పెట్టడం గుర్తుంది. ఆ తర్వాతంతా విఠల్ మాటలే. నెమ్మదిగా పి.బి. శ్రీనివాస్ పాటని నాన్న పాడుతున్నట్టు! ‘‘ఈ ఇంటర్వ్యూలు ఇక్కడిలాగే జరుగుతాయి. ఉదయం అంతా రాయిస్తారు. సాయంకాలం వాయిస్తారు. బోలెడు ప్రశ్నలు. జల్లెడపట్టి, నీ బుర్రలో గుజ్జు ఎంతుందో అని ఓ పద్ధతిగా అంచనావేస్తారు’’.
‘‘కానీ, ఓర్చుకో బిడ్డా! వాళ్ళకి కత్తులు కావాలి. కానీ సత్తురేకు కూడా పనికివచ్చేదే ఏం ఫర్వాలేదు! అమ్మా నాన్నకి నువు చదువుతున్నావని తెలుసు. ఇందులో ఒకో పరీక్షకూ నువు పడే కష్టం తెలీదు. ఎందుకంటే వాళ్ళకి జీవించడం ఒకటే తెలుసు. కష్టం కూడా తమతోపాటే ఇంట్లో సభ్యుడు వాళ్ళకి!’’
రవికి కడుపులో పేగు తిప్పినట్టయింది.
‘‘ఓ రోజు తక్కువతిన్నా, నిన్నూ, నీ తోడబుట్టిన అయ్యనో, అమ్మనో ఎలా పెంచుకోవాలో, ఎంత ప్రేమగా చూసుకోవాలో తప్ప వాళ్ళకి పెద్దగా ఏం తెలీదు. సుఖమంటే తెలీదు. వాళ్ళకి అక్కర్లేదు. పిల్లలే ముఖ్యం’’ రవి కళ్ళల్లో అమ్మ, నాన్న కదులాడారు.
‘‘ఓర్చుకో బిడ్డా, నడిచినంత దూరం రహదారి ఉంటే, అది పెద్ద నగరం. నీకు నువ్వే ముళ్ళు, రాళ్ళు తీసుకుంటూ, అడ్డొచ్చిన కంప సరిచేసి చదును చేసుకుంటూ వెళ్తే అది నువ్వేసిన దారి. కొత్తదారి.’’
‘‘ఇంతట్లోనే భారమా? అలవాటు లేనివాడివి సిగరెట్ కొన్నావు. ప్లేటు కిచిడీ తిన్లేపోయావు! కేంపస్ లో తిరుగుతున్నావా? నీ మెదడును అడవిచేసి అందులో అనవసరపు కుంగుబాటు ఆలోచనలతో తిరుగుతున్నావా? ఓర్చుకో బిడ్డా!’’
‘‘నేనూ! ఏం…’’ రవి ఏవో అడ్డు చెప్పబోయాడు. విఠల్ స్టూలు మీద సర్దుకుని కూర్చున్నాడు. పొడుగు చేతుల చొక్కా, కుడిచేతిది మడత పెట్టుకుంటూ రవి కళ్ళల్లోకి చూడకుండా, పట్టి పట్టి జాగ్రత్తగా కోర్టులో నిజాలని ప్రవేశపెట్టే పోలీసులాగ అన్నాడు, ‘‘దేఖో బేటా! కేంటిన్ ఛోటూ, గార్డినర్ పాండూ నా సి.సి. టి.వి. కెమేరా కళ్ళు. వాళ్ళ దగ్గర నువ్వు నాకు దొరికావు బేటా’’
రవి గుండె ఝల్లుమంది.
‘‘ఇలా తెలుసుకున్నాడా ఈయన!’’ దీర్ఘ నిశ్వాస విడిచాడు. చాలా వేడిగా ఉంది.
‘‘కాస్త ఓపిక తెచ్చుకో బేటా!’’
విఠల్ గొంతు ఈసారి రేడియోలో వార్తలు చదువుతున్నట్టుగా లేదు. మెత్తగా, తండ్రి ఒక కొడుకునో, పెద్ద అన్నయ్య తన ఆఖరు తమ్ముడితోనో మాట్లాడుతున్నట్టుంది.
‘‘ఓటమిని ఓర్చుకో, ఇంటర్వ్యూలో ప్రశ్నలకి జవాబు చెప్పలేని నీ మౌనాన్ని ఓర్చుకో. నీకన్నా నీ పక్కవాడు ముందుకెళ్ళిపోతుంటే నీ చేతకానితనాన్ని నువ్వే ఓర్చుకో’’.. ఒక్కో వాక్యం రవికి ఒకో బిందెనీళ్ళు పోసినట్లు! ‘‘నేను నీలాగే ఇంజనీరింగ్ చదివాను. ఉద్యోగాలు రాలేదు. ఇంట్లో తెలిస్తే తిడతారని మేడెక్కి దూకాను. కాలు విరిగింది. లైబ్రెరీ సైన్సు చదువుకొని, ఇలా పి.హెచ్.లో ఇక్కడే ఉద్యోగం తెచ్చుకున్నాను. ఏ పిల్లాడైనా వాడి కళ్ళల్లో చీకటితో, గుండెల్లో నిరాశతో ఖాళీ కోక్ డబ్బాలా ఫ్లాట్ పిచ్ లో బయటకు వినపడని ఘోష పెడుతూ ఉంటే, నా కళ్ళు నా చెవులు పనిచేస్తాయి. ఇవాళ నువ్వు..’’
రవి గుండెలు హోరుమన్నాయి. కళ్ళు చెరువులయ్యాయి, రెండు నిమిషాలు వెక్కి వెక్కి ఏడ్చాడు. బల్లమీదే తలవాల్చి. విఠల్ లేచి వీపు రాసాడు.
‘‘ఓర్చుకో బిడ్డా, ఓర్చుకుంటే నేర్చుకుంటావు’’ ఆఖరు వాక్యం చెప్పి మళ్ళీ దూరంగా వెళ్ళిపోయాడాయన. మూడు సంవత్సరాలు. నార్త్ ఇండియా..చెప్పుకోదగ్గ స్నేహితులు లేరు, రవి గుండె గట్టిపడిందిప్పుడు.
అయినా, విఠల్! ఎప్పుడూ ‘‘చెక్కముఖం’’, ‘‘పిల్లిగడ్డం’’, ‘‘సినికల్ ఫెలో’’, ‘‘ముంగి’’, ‘‘ఎవర్ డిటాచ్డ్’’, ‘‘జీరో వాట్’’ అని అందరూ రకరకాల నిక్ నేమ్స్ తో పిలిచే విఠల్, ఇలా!
చిత్రం, గొంతులో కాయ పోయింది! ఆకలేస్తోంది. అమ్మతో మాట్లాడాలి. రేపు ఇంటర్వ్యూ రాకపోయినా ఫర్లేదులే!!!
*
Excellent description of an average student’s feelings and great counselling by not much known elder. Well designed story madam.
థాంక్యూ శివ సర్
సగటు విద్యార్థి మానసిక సంఘర్షణని అత్యంత సహజంగా ప్రెసెంట్ చేసారు.అటువంటి వారిలో కృంగుబాటు లక్షణాలని సమయానికి గుర్తించి ఓదార్పునివ్వాల్సిన బాధ్యత చుట్టూ ఉన్న వారందరికీ ఉన్నదని రచయత్రి చాలా సూక్ష్మంగా తెలియచేసారు.చక్కటి రచనకు అభినందనలు
థాంక్యూ హేమంతి
నీ అభినందనలు బహు అమూల్యం
Namaste madamgaru story chalabagumdi Ravi badhanu chuchi naku badha anipimchimdi.nijamga riyel story suparr
Very well written emotions of a struggling student madam…
True feelings of any average student. Today’s competition in life is like that. If not taken control over life at this stage, people go into depression. In this situation, the librarian came to rescue with a positive feeling that it is not the end of life and not to run away from the situations.
Hats off to you madam to give such message through the story????
ఎంత మంచి కథ! ఎంత బాగా రాశారు! అభినందనలు
థాంక్యూ అండీ
Wish every student in depression gets a ” Vittal ” to offer a shoulder to cry on …..
BTech క్యాంపస్ లైఫ్ గిర్రున తిరిగింది, very difficult to write this close
థాంక్యూ అండీ
Chala manchi kathanam…katha chala bavundandee
థాంక్యూ అండీ
Nijalu chepparu aunty. Ee alochana sakti lekha Chalaa Mandi pillalu tevramaina othidiki guravutunnaru. Avagahana peragali pillalalo.. chaduvu okate valla talli tandrulani Ananda pedatadi Ani.. mariyu pedda vallu kuda chaduvu okate korukokudadu. Swecha annadi Chala avasaram pillallaki. Pillalo peddalalo alochana paddathi marali. Idi chadivite pillalaki peddalaki kachitanga marpu vastadi.
This is non fiction story about an average Indian undergraduate. This happens more often than not.Only difference is we need more mentors like Vittal in day to day life than folks who are judgemental .
Having more private colleges that provide
sub standard education raises the bar of hopes and debts for students and their families which creates a huge pool of unemployed youth .We need more action from government and other firms to address the Problem .
And thank you Sailaja for small gesture of wake up call .
శైలజ గారూ
ఓర్చుకో బిడ్డా, ఓర్చుకుంటే నేర్చుకుంటావు
ఇవాళ ఈ మాట చెప్పడానికి, చెప్పించడానికీ పలువురు పెద్దలు ఫీజు రూపం లో వేలూ లక్షలూ పిండుతున్నారు. కానీ వారి గొంతులలో నిజాయితీ లేక ఫలితాలు కూడాలేవు.
కానీ ఎక్కడో ఉండే విఠల్ ని మీరు పట్టుకున్నారు. ఉంటారు వెతుక్కోండని చెప్పేరు
ఇంకా ఇలాంటి కథలకోసం ఎదురు చూస్తూ…
A story as precise as an article in The Economist. Precise. Concise. Heartwrenching.
The boy could come out of the pain in his throat but I gained one out of empathy to all such youngsters. Yes. We all need counsellors – may their tribe increase.
కళ్ళల్లో చీకటితో గుండెల్లో నిరాశతో ఖాళీ కోక్ డబ్బాల్లా చేసే మరణం మదంగ ధ్వనిని ఆర్తితో విని అమృతాన్ని చిత్రీకరించారు శైలజగారూ… బాగుంది కథ…
..
కళ్ళల్లో చీకటితో గుండెల్లో నిరాశతో ఖాళీ కోక్ డబ్బాల్లా చేసే మరణం మదంగ ధ్వనిని ఆర్తితో విని అమృతాన్ని చిత్రీకరించారు శైలజగారూ… బాగుంది కథ…
..
Madam ,
real experiences r very well expressed madam ….
1., A man’s thoughts are known to their fellows …only if ,,,, expressed through his words or actions ….not by their mere facial features ….
2. An emotionally unstable individual tend b impatient and on sum day become a patient !!
3. Every outcome ( either +/_) of a conversation ,,,, depends on d way… we communicate and d language we use.!!
నైస్ మీరు చాల Baga రాసారు Hats ఆఫ్ Sailaja garu
Thanku dear Narmada.
Yes Mouna. Very true…
మంచి కధ, అభినందనలు.
కథలో పాత్రే అయినా – చూశారా నేనెంత ఘనకార్యం చేస్తున్నానో అన్నట్లు కాకుండా ఆ విఠల్ చాలా subtle గా రవిని తన capabilities & limitations గుర్తించేలా, ఒప్పుకునేలా చేసిన తీరు చాలా చాలా బావుంది. మీ కథ నాకు చాలా నచ్చింది శైలజగారు!
Thanku very much… ya. You understand my point. Counselling should not be preaching.
nice story.
suddenly remebered ” ampasayya”
what todays’s students need, explained very nicely.
pl do keep writing