ఎస్డీ బర్మన్: ప్యార్ కా రాగ్ సునో రే!

దిల్ పుకారే

ఆరే ఆరే

అభీ న జా మేరే సాథీ

దిల్ పుకారే

ఆరే ఆరే

ఇంత ప్రేమగా పిలిస్తే ఏ గుండె మాత్రం పరిగెట్టుకు రాదు చెప్పండి! ఈ పాట తెర మీద ప్రేమ ఒలికించడమే కాదు, తెర వెనక అభిప్రాయ భేదాలతో విడిపోయిన ఇద్దరు స్నేహితులను కలిపింది. అవును! 1963లో మధుర గాయని లతా మంగేష్కర్, ఆడియో కంపెనీలు గాయకులకు కూడా రాయల్టీ చెల్లించాలన్న వాదన వినిపించారు. ముకేశ్, తలత్ మహమూద్, కిశోర్ కుమార్, మన్నాడే వంటి ఉద్దండులు ఆమె వాదనను బలపరిచారు. కానీ మొహమ్మద్ రఫీ, ఆశా భోస్లే మాత్రం ఆవిణ్ణి వ్యతిరేకించారు. అది మొదలు రఫీ, లతా దీదీ మధ్య దాదాపు నాలుగేళ్ళ పాటు పాటలేంటి, మాటలు కూడా లేవు. 1967లో ఎస్డీ బర్మన్ వల్లే ఆ కోల్డ్ వార్ ముగిసింది. ‘జువెల్ థీఫ్’ సినిమా కోసం ‘దిల్ పుకారే’ పాటను కలిసి పాడాలని పట్టుబట్టి మరీ ఇద్దరి మధ్య ఆయన సయోధ్య కుదిర్చారు. అలా నాలుగేళ్ళ పాటు నడిచిన మౌన యుద్ధానికి ఈ అందమైన పాట చరమ గీతం పాడేసింది.

‘దిల్ పుకారే’ ఎస్డీ బర్మన్ మార్కు పాట. సరోద్, తబలా, వయోలిన్, సితార్ వంటి అతి తక్కువ వాయిద్యాలతో కంపోజ్ చేసిన ఈ పాటలో, ఆయన మిగతా పాటల్లోలాగే మురళి ప్రస్ఫుటంగా వినిపిస్తుంది. బంగ్లాదేశ్ లో ని ‘కొమిల్లా’ అనే ప్రాంతంలో అక్టోబర్ 1, 1906లో పుట్టిన సచిన్ దేవ్ బర్మన్, తన ప్రాంతపు జానపద రీతులను శాస్త్రీయ సంగీతంతో మేళవించి గొప్ప మెలొడీలను సృష్టించారు. జానపద పోకడలు కలిగిన ‘రాగ్ పహాడీ’ని ఆయన వాడినంత అందంగా ఇంకెవరూ వాడి ఉండరేమో! ‘దిల్ పుకారే’ ఆ రాగంలో స్వరపరిచిన పాటే. దాంతో పాటు ‘జువెల్ థీఫ్’లోనే ‘రులాకే గయా సప్నా మేరా’, ‘ఆరాధన’లోని ‘కోరా కాగజ్ థా’, ‘ప్రేమ్ పుజారి’లోని ‘ఫూలోంకే రంగ్ సే’ పాటలు కూడా పహాడీ రాగం ఆధారంగా స్వరపరిచినవే. మనసును సుతిమెత్తగా తాకే ఈ పాటలు జానపద ఆధారిత రాగంలో కూర్చినవంటే నమ్మగలమా?

అసలు ఎస్డీ బర్మన్ స్వరపరిచిన ఏ బాణీ అయినా మధురంగానే అనిపిస్తుంది. అందుకే ఆయన మెలోడీ కింగ్ అయ్యారు.

మెలొడీ కింగ్ అంటే గుర్తొచ్చింది! సచిన్ దేవ్ బర్మన్ నిజంగానే రాజకుమారుడు. తల్లి మణిపూర్ రాజకుమారి, తండ్రి త్రిపుర యువరాజు. ఐదుగురు పిల్లల్లో సచినే చిన్నవాడు. రెండేళ్ళ వయసులోనే తల్లి చనిపోయింది. ఆయన విద్యాభ్యాసం త్రిపుర రాజధాని అగర్తలలో మొదలైంది. 1924లో ఎమ్మే చేయడానికి కోల్ కతా వచ్చిన సచిన్ ఆ కోర్సునైతే పూర్తి చేయలేదు గానీ కె.సి. డే దగ్గర ఐదేళ్ళ పాటు సంగీతం నేర్చుకున్నారు. రేడియో సింగర్ గా తన స్వర ప్రస్థానం మొదలుపెట్టారు. హిందూస్తానీ సంగీతాన్ని జానపద రీతులతో మేళవిస్తూ ఎన్నో పాటలు కంపోజ్ చేశారు, పాడారు. 1935లో మొదటిసారిగా ఒక బెంగాలీ సినిమాలో పాట పాడారు. ఆ తర్వాత 1944లో బొంబాయి వచ్చేశారు. 1947లో గీతా దత్ పాడిన ‘మేరా సుందర్ సప్నా బీత్ గయా’ పాట ఆయనకు కంపోజర్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది. 1950ల్లో దేవానంద్ నిర్మాణ సంస్థ నవకేతన్ ఫిలిమ్స్ తో కలిసి పని చేయడం మొదలుపెట్టాక ఎస్డీ బర్మన్ దశ తిరిగింది. ఆయన కంపోజ్ చేసిన హిట్ పాటల్లో చాలా వరకు దేవానంద్ వే, అందులోనూ నవకేతన్ ఫిలిమ్స్ నిర్మించిన సినిమాల్లోవే!

‘బాజీ’లోని ‘తద్బీర్ సే బిగ్డీ హుయీ’ పాట అంతవరకు విషాద గీతాలు, భజనలు పాడుకుంటున్న గీతా దత్ లో దాగున్న మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఆ తర్వాత గీతా దత్ బర్మన్ దా కంపోజిషన్ లోనే మరికొన్ని అద్భుతమైన పాటలు పాడారు. ‘ప్యాసా’లోని ‘జానే క్యా తూనే కహీ’ వింటుంటే ఎప్పటికీ మైమరపే కదా. ఇక ‘కాగజ్ కే ఫూల్’లో ఆవిడ పాడిన ‘వక్త్ నే కియా’ ఏడిపించేస్తుంది. ‘జాల్’లోని ‘యే రాత్ యే చాందినీ’ పాటతో హేమంత్ కుమార్ కి కెరీర్ బెస్ట్ ఇచ్చిన బర్మన్ దా ‘ప్యాసా’లోని ‘జానే వో కైసే’ పాటతో ఆ గొంతును అజరామరం చేసేశారు. ‘సుజాత’ సినిమా కోసం ‘జల్తే హై జిస్కే లియే’ తలత్ మహమూద్ పాడిన ఆణిముత్యాల్లో ఒకటి.

ఇక రఫీ, కిశోర్ కుమార్ ఇద్దరితోను దాదాపు సమానంగా పాటలు కంపోజ్ చేసిన ఘనత ఎస్డీ బర్మన్ కే దక్కుతుంది. రఫీ, ఎస్డీ బర్మన్ కాంబలో వచ్చిన ఆణిముత్యాలకు ‘దిన్ ఢల్ జాయే’, తేరే మేరే సప్నే, ‘మేరా మన్ తేరా ప్యాసా’, ‘దిల్ కా భవర్ కరే పుకార్’ లాంటి పాటలు మచ్చుతునకలు మాత్రమే. ఇక కిశోర్ కుమార్ నైతే బర్మన్ దా తన రెండో కొడుకుగా భావించేవారట. ‘చల్తీ కా నామ్ గాడీ’లో సరదా పాటలు మొదలుకొని ‘రూప్ తేరా మస్తానా’ లాంటి కొంటె పాటలు, ‘మీత్ నా మిలా రే’ లాంటి హుషారైన పాటలు, ‘ఖిల్తే హై గుల్ యహా’ లాంటి మనసైన పాటలు ఈ కాంబినేషన్ లో వచ్చినవే!

ఇక లతా మంగేష్కర్ తో ఎస్డీ బర్మన్ అనుబంధం అంతా ఇంతా కాదు. నా మటుకు నేను దీన్నో గోల్డెన్ కాంబినేషన్ అంటాను. బర్మన్ దా స్వరపరిచిన సెమీ క్లాసికల్ సాంగ్స్ కి లతాజీ న్యాయం చేసినంతగా మరెవరూ చేయలేదేమో! ‘అభిమాన్’లోని ‘పియా బినా’, ‘నదియా కినారే’, ‘షర్మీలీ’లోని ‘మేఘా ఛాయే ఆధీ రాత్’, ‘చుప్ కే చుప్ కే’ టైటిల్ సాంగ్ ఆ కోవలోకే వస్తాయి. అలాగే ‘చుప్ కే చుప్ కే’లోని ‘అబ్ కే సజన్ సావన్ మే’ లాంటి అల్లరి పాటలు, ‘బందిని’లోని ‘మోరా గోరా అంగ్ లైలై’ లాంటి లలితమైన పాటలు కూడా ఈ ఇద్దరి కాంబోలోని మరికొన్ని ఆణిముత్యాలు.

‘గైడ్’లోని ‘ఆజ్ ఫిర్ జీనే కీ తమన్నా హై’ గురించి చెప్పకపోతే లతా, ఎస్డీ బర్మన్ జాబితా అసంపూర్ణమే. ఈ కంపోజిషన్ పై వెస్టన్ జాజ్ ప్రభావం కనిపిస్తుంది. ఇదే సినిమాలోని ‘పియా తోసే’ మాత్రం లతా, బర్మన్ దా కాంబినేషన్ లో వచ్చిన మాస్టర్ పీస్. రాగ్ ఖమాజ్ (హరి కాంభోజి) రాగంలో స్వరపరిచిన ఈ పాటను నాట్యానికి అనువుగా అందంగా మలిచారాయన. మెలోడీ, రిథమ్, సమపాళ్ళలో కుదిరిన క్లాసికల్ క్లాసిక్ ఈ పాట. కానీ ఇంతగా కలిసి పని చేసిన ఈ ఇద్దరి మధ్య కూడా కొన్నేళ్ళ పాటు విభేదాలు తప్పలేదు. 1950ల్లో వచ్చిన ఈ విభేదాల వల్ల ఎస్డీ, ఆశా భోస్లే, గీతా దత్ లతో పాటలు పాడించారు.

ఈ సమయంలోనే కాదు అంతకుముందు, ఆ తర్వాత కూడా ఆశా భోస్తే సచిన్ దా సంగీత దర్శకత్వంలో ‘అచ్ఛా జీ మై హారీ’, ‘ఛోడ్ దో ఆచల్’, గున్ గునా రహే హై, రాత్ అకేలీ హై, ఆంఖోం మే క్యా జీ – ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాటలే పాడారు. ఆశా భోస్లేతో బర్మన్ దా బంధం పాటలకే పరిమితం కాలేదు. ఆర్డీ బర్మన్ ని పెళ్ళి చేసుకుని కోడలిగా ఎస్డీ ఇంట అడుగు పెట్టారూ ఆశా.

ఇక కొడుకు ఆర్డీ బర్మన్ తో ఎస్డీ బర్మన్ ది గురుశిష్య బంధం కూడా. ఆర్డీ బర్మన్ తండ్రికి అసిస్టెంట్ గా ఎన్నో సినిమాలకు పని చేశారు. తండ్రి కంపోజ్ చేసిన ‘మేరే సప్నేం కీ రానీ’, ‘హై అప్నా దిల్ తో ఆవారా’ పాటలకు ఆర్డీ బర్మన్ మౌత్ ఆర్గాన్ వాయించారు.

ఇంతవరకు చెప్పుకున్నదంతా ఎస్డీ బర్మన్ స్వర రచన గురించి మాత్రమే. కానీ విలక్షణమైన ఆయన స్వరం గురించి మాట్లాడుకోకపోతే ఈ కథనం అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. ‘వహా కౌన్ హై తేరా’ – గైడ్ సినిమా చూసినవాళ్ళు టైటిల్స్ వచ్చేటప్పుడు ఈ పాట వినే ఉంటారు. అది పాడింది ఎస్డీ బర్మనే. సన్నగా ముక్కుతో పాడినట్లుండే ఆయన స్వరంలో జానపద పోకడలతో పాటు గుండెను పిండే విషాదం కూడా చక్కగా పలుకుతుంది. ‘ఆరాధన’లోనూ ఇదే తరహా గీతం పాడారాయన. ‘సఫల్ హోగీ తేరీ ఆరాధన’ అన్న ఈ పాటకు బర్మన్ దాను నేషనల్ అవార్డు వరించింది. ‘సుజాత’లోని సునో మేరే బంధు రే’ ఆయన గొంతు నుంచి జాలువారిన మరో ఆణిముత్యం. ఇలా ఆయన హిందీలో మొత్తం ఓ 14 పాటల దాకా పాడారు.

1975 అక్టోబర్ లో ‘మిలీ’ సినిమా కోసం పాటల రిహార్సల్స్ జరుగుతున్నాయి. ‘బడీ సూనీ సూనీ’ అన్న పాట కోసం కిశోర్ కుమార్ రిహార్సల్స్ చేస్తున్నారు. ఆ సమయంలోనే ఎస్డీ బర్మన్ కోమాలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎప్పటికీ కోలుకోలేదు. అలా చివరి నిముషం వరకు తన జీవితాన్ని పాటలకే అంకితం చేసిన ఆ స్వర స్రష్ట అక్టోబర్ 31న 69 ఏళ్ళ వయసులో దూర తీరాలకు వెళ్ళిపోయారు.

దిల్ కా భవర్ కరే పుకార్

ప్యార్ కా రాగ్ సునో

ప్యార్ కా రాగ్ సునో రే

సచిన్ దా తన గుండెను తుమ్మెదగా మలిచి ప్రేమ రాగాలను వినిపించి వెళ్ళిపోయారు. ఆ ప్రేమ గీతాలు ఇప్పటికీ ఎప్పటికీ మన మనసుల్లో జుమ్మని మారుమోగుతూనే ఉంటాయి.

(అక్టోబర్ 1 ఎస్డీ బర్మన్ జయంతి)

శాంతి ఇషాన్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు