ఎవరు?కుట్రదారులెవ్వరు? 

వరవరరావుగారు మళ్ళీ అరెస్ట్ అయ్యారు.  మరో ఎన్ కౌంటర్ యథాలాపంగా జరిగినట్లు, ఆ వార్తని దిన పత్రికలో ఆరో పేజీలో ఓ మూల వేసినంత మామూలుగా వరవరరావు మరోసారి అరెస్ట్ అయ్యారు.

నా నోటికి ఎప్పుడూ ఎవరో ఒక ప్లాస్టర్ అంటించటానికి ప్రయత్నం చేస్తున్నట్లుంటుంది.  మనుషులందరూ చీకటిపడ్డ ముఖాలతో తారట్లాడుతున్నట్లుంటుంది. నా పక్కనెప్పుడూ పోలీసు బూటు కాళ్ళ కవాతు వినపడుతుంది.  వెనక్కి తిరిగి చూస్తే నా నీడ మీద తుపాకీ బాయొనెట్ పాకుతున్నట్లుంటుంది.  నేను మౌనంగానే వుంటాను.  నన్ను దాటుకొని కవాతు వెళ్ళిపోతుంది.  బాయొనెట్ దాటిపోతుంది.  నా ముఖం మీద చీకటి మఫ్లర్ చుట్టుకుంటుంది.  నా వీపు మీద భద్రజీవిననే అధికార రాజముద్ర పడుతుంది.  నన్ను దాటిన పోలీసు కవాతు మనుషుల్ని తడుముతూ దేశం నాలుగు మూలలకు వెళుతుంది.  జనం చొక్కా జేబుల్లోని కలాల్ని అనుమానంగా చూస్తుంది.   పదునైన పాళీని చూడగానే మారణాయుధాల్ని చూసినట్లు ఉలిక్కిపడుతుంది. జేబుల్లో రుమాలు  ఎర్రగా కనబడ్డా గుర్రుమంటుంది.  స్వేఛ్ఛగా భావ ప్రకటనా విన్యాసాలు చేసే నోళ్ళని వినగానే మందుపాతరలు పేలినట్లు అదిరిపడుతుంది.  నిజమే ఈ రాజ్యం దృష్టిలో నిర్భయంగా రాసే కలం మారణాయుధమే.  హక్కుల గురించి మాట్లాడే నాలికలన్నీ రాజద్రోహులే.
****
రాజ్యం తనకుండాల్సిన లేదా తాను హామీ ఇచ్చిన శ్రేయో స్వభావానికి విరుద్ధంగా తయారైనప్పుడు  రాజ్యానికి ప్రజలకి మధ్య ఒక అగాధం ఏర్పడుతుంది.  ప్రజల ఆకాంక్షలకు, ప్రభుత్వ వైఫల్యాలు లేదా దుర్మార్గాలకు మధ్యనున్న వైరుధ్యం కారణంగా ప్రజలు పడే బాధలకి అక్షర రూపం, ఆలోచన రూపం, కార్యాచరణ రూపం ఇచ్చేవారికి ప్రభుత్వానికి మధ్య ఒక శతృత్వం ఏర్పడుతుంది.  అప్పుడు రాజ్యం ఆయుధం మీద ఆధారపడుతుంది.  పోలీసుల్ని ఉపయోగిస్తుంది. సైన్యాన్ని వాడుకుంటుంది.  చట్టాల్ని భ్రష్టుపట్టిస్తుంది.  రాజ్యాంగానికి వక్రభాష్యాలు చెబుతుంది.  జనం లేదా జనం తరపున నోరెత్తడమే ఒక క్రైమ్ గా చూస్తుంది.  అసలు చట్టాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే ప్రజల కంటే ఎక్కువగా చట్టాన్ని ఉల్లంఘిస్తుంటాయి.
ప్రభుత్వంలో ఉండేవారిని మించిన చట్టవ్యతిరేక శక్తులు సాధారణ ప్రజల్లో  వుండరు  నిజానికి. నోరెత్తిన వారి నోరు మూయించటానికి లేదా వారిని భౌతికంగా నిర్ములించటానికి ఏలికలెప్పుడు తాము సృష్టించిన చట్ట వ్యతిరేక శక్తుల మీదనే ఆధారపడుతుంటారు.  ఒకానొక సమయంలో బాలగోపాల్ మీద జరిగిన దాడులు ప్రభుత్వాలు పూనుకున్న చట్ట వ్యతిరేకి పనులేనన్న విషయం బహిరంగ రహస్యం.  ఆ దాడుల తీవ్రత మరింత ముదిరి  మేధావుల హత్యాకాండకు దారితీసింది. నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సారే, ఎం.ఎం.కల్బుర్గి, గౌరీ లంకేశ్ వంటి వారిని ఊరకనే  చంపలేదు. వారి ఆలోచన, ఆచరణ, ప్రశ్నించే తీరు ప్రభుత్వాల్ని కలవర పరిచింది.  పాలకుల దుర్మార్గాలకు చట్ట ముఖం, చట్ట వ్యతిరేక ముఖం రెండూ ఉంటాయి.  చట్ట పరిధిలో చేయలేము అనుకున్నప్పుడు చట్ట వ్యతిరేకంగా తామనుకున్నది చేస్తారు.  సాయిబాబాని చట్టబద్ధంగా  హింసిస్తే గౌరీ వంటి వారిని చట్ట వ్యతిరేకంగా నిర్ములిస్తారు.
సాయిబాబా వంటి తొంభై ఐదు శాతం ఫిజికల్లి చాలేంజ్డ్ మేధావిని కూడా ప్రభుత్వం వదల్లేదు.  తనని ప్రశ్నించేవారుంటే రాజ్యం ఎంత అమానుషంగా తయారవగలదనే దానికి సాయిబాబా అనుభవిస్తున్న జైలుశిక్షే తార్కాణం.  ఒక తొంభై ఐదు శాతం వికలాంగుడు ఏ విధంగానూ రాజ్యాన్ని కూలదోయటానికి కుట్ర పన్నలేదని మనకంటే రాజ్యానికి ఎక్కువగానే తెలుసు.  కానీ అది ఒక ఉదాహరణాత్మక హెచ్చరికగా ప్రభుత్వం భావించింది.  ఒక మేధావిని, వికలాంగుడిని అన్యాయంగా జైల్లో వేయగలం, ఇంకా మామూలు వారెంత? అనే సందేశం  ఆ శిక్ష వెనుక వుంది.
****
అమ్ముడుపోయే వాళ్ళుండొచ్చుగాక! నిజమైన రచయితలు, మేధావులు, కళాకారులూ ఎప్పుడు ప్రభుత్వ ఆస్థానాల్లో బతకాలని ఆశించరు.  నిజాయితీపరులైన బుద్ధిజీవులెప్పుడూ వారి సృజనాత్మకతని  ప్రజా శ్రేయస్సు కోసమే వినియోగిస్తారు.  వాళ్ళు ఏ తలపాగాలకి లొంగరు. ఏ శాలువాలు వాళ్ళని కమ్ముకోలేవు.  నిజాన్ని నిజంగానూ, అబద్ధాన్ని అబద్ధంగానూ చూడగలరు. చెప్పగలరు.  వారి స్వరానికి, హ్రదయానికి మధ్య వ్యత్యాసం ఉండదు.  జైళ్లు నోళ్లు తెరిచినా తడబడరు. తప్పుకోరు.   ప్రముఖ న్యాయవాది సుధా భరద్వాజ్‌, రచయిత అరుణ్‌ ఫెరారా, వెర్నన్‌ గొంజాల్వజ్‌ వరవరరావు సరిగ్గా ఇటువంటి వారే!    వీరు ప్రధానిని చంపటానికి కుట్ర చేశారట.
****
వరవరరావుగారు మళ్ళీ అరెస్ట్ అయ్యారు.  మరో ఎన్ కౌంటర్ యథాలాపంగా జరిగినట్లు, ఆ వార్తని దిన పత్రికలో ఆరో పేజీలో ఓ మూల వేసినంత మామూలుగా వరవరరావు మరోసారి అరెస్ట్ అయ్యారు.  ఆయన మీద కుట్ర ఆరోపణలు చేసి, లోపలేసే కుట్ర రాజ్యానికి కొత్త కాదు.  జైలు గోడల్ని కౌగిలించుకోవటం ఆయనకూ కొత్త కాదు. పైన చెప్పినట్లు ప్రజా శ్రేయస్సు పట్టని రాజ్యానికి, ఒక ప్రజా పక్షపాతికీ మధ్య ఈ మాత్రం అనివార్య శతృత్వం వుంటుంది.   సంవత్సరాలకు సంవత్సరాల కాలం ఆయన జైలులో గడిపారు.  గడుపుతారు.  ఎందుకు గడపరు?  ఆయనేమైనా విజయ్ మాల్యా వంటి ఆర్ధిక నేరస్తుడైన పార్లమెంటు సభ్యుడా దేశం విడిచి పారిపోటానికి?  ఆయన ప్రజా ఉద్యమకారుడు కదా?   ఈసారి ఆయన ఒక దేశాధినేత హత్యకే కుట్ర చేసారని ఆరోపించారు ఏలినవారు.  ఆయనొకరే కాదు మరో ముగ్గురిని కూడా కుట్రదారులుగా తేల్చి చెప్పింది ప్రభుత్వం.  త్రివిధ దళాలకు చెందిన లక్షలాది సైనికుల బలం, సీఆర్పీఎఫ్, పోలీసులు, కమెండోలు, అత్యాధునిక నిఘా వ్యవస్థల చాటున బతికే ప్రధానిని ఈ డెభై ఎనిమిది సంవత్సరాల ఉద్యమకారుడు మరో నలుగురితో కలిసి హత్య చేయటానికి ప్రయత్నం చేసారట. ఇది ప్రజాస్వామ్యం చెవిలో పెట్టిన ప్రపంచంలోకెల్లా అతి పెద్ద పువ్వైన “రఫ్లెసియా అర్నొల్డి”.
విరసం వ్యవస్థాపక సభ్యుడైన వరవరరావు జీవితమంతా పోరాటమే.  బహుశ ఆధునిక భారతదేశంలో రాజ్యాన్ని, దాని దుర్మార్గాన్ని ప్రజా జీవితంలో ఉంటూనే ఇంత సుదీర్ఘ కాలం పాటు ఢీకొన్న కవి మరొకరు లేరు.  ఇంతగా నవ్వుతూ చెరసాలాల్ని జీవితంలోకి ఆహ్వానించిన బుద్ధిజీవి మరొకరు లేరు.  అయితే ఆయనకీ, ఆయనకీ అండగా వున్నా సంస్థకి తగినంత మద్దతిచ్చేంత నిజాయితీగా మనం వున్నామా? ప్రభుత్వ దుర్మార్గాలకు చింతనపరుల ఉదాసీనత దోహదం చేయదా?
****
“రచయితలు, మేధావులు, కళాకారులూ కుట్రదారులు కారు. ప్రభుత్వమే అసలు కుట్రదారు!”  అన్నది విరసం భావన.  ఈ  సందర్బంగా వరవరరావుగారు రాసిన ఈ కవితా పాదాలు అనివార్యంగా గుర్తుకొస్తాయి.
“బాంబులూ పంచలేదు
భావాలూ పంచలేదు
చీమల పుట్టనుకొని
ఇనుప బూటుతో తొక్కినప్పుడు
పుట్ట పగిలి పుట్టినవి
ప్రతిక్రియా భావాలు!”
*

అరణ్య కృష్ణ

15 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • జనాల్ని ముంచిన ఆర్థిక నేరగాళ్లు తో రాజ్యానికి ఉపయోగం రేపు ఓట్లు కొనడానికి కావాలిగా …వరవర రావ్ తో ఏమిపని …అయన..నోరునొక్కిఇంకా కొందరిని భయ పెట్టొచ్చుగా మొన్న ట్రాఫిక్ పోలీస్ ని ప్రశ్నించిన యువకుడ్ని…కడపలో అనుకుంట పిచ్చకొట్టుడు కొట్టారు ..పాపంఎంతమంది prsninchi ..pramadala palavuthunnaro …ప్రమాదంలో పడింది ప్రజాస్వామ్యం వరవర రావు గారిలాంటి వాళ్ళ అరెస్ట్ తో

  • చాలా బాగా రాశారు అరణ్యకృష్ణ గారు . ముఖ్యంగా అభ్యుదయం పేరుతో రాస్తున్న చాలా మంది సాహిత్యకారులను (ఉద్దేశిస్తూ) రాసిన ఈ మాటలు చాలా బావున్నాయి .”అమ్ముడుపోయే వాళ్ళుండొచ్చుగాక! నిజమైన రచయితలు, మేధావులు, కళాకారులూ ఎప్పుడు ప్రభుత్వ ఆస్థానాల్లో బతకాలని ఆశించరు. నిజాయితీపరులైన బుద్ధిజీవులెప్పుడూ వారి సృజనాత్మకతని ప్రజా శ్రేయస్సు కోసమే వినియోగిస్తారు. వాళ్ళు ఏ తలపాగాలకి లొంగరు. ఏ శాలువాలు వాళ్ళని కమ్ముకోలేవు. నిజాన్ని నిజంగానూ, అబద్ధాన్ని అబద్ధంగానూ చూడగలరు. చెప్పగలరు. వారి స్వరానికి, హ్రదయానికి మధ్య వ్యత్యాసం ఉండదు. జైళ్లు నోళ్లు తెరిచినా తడబడరు. తప్పుకోరు. ప్రముఖ న్యాయవాది సుధా భరద్వాజ్‌, రచయిత అరుణ్‌ ఫెరారా, వెర్నన్‌ గొంజాల్వజ్‌ వరవరరావు సరిగ్గా ఇటువంటి వారే! వీరు ప్రధానిని చంపటానికి కుట్ర చేశారట.”

    అలాగే ఆయన వేసిన ఈ ప్రశ్నను కూడా ఆలోచించేలా ఉంది.”అయితే ఆయనకీ, ఆయనకీ అండగా వున్నా సంస్థకి తగినంత మద్దతిచ్చేంత నిజాయితీగా మనం వున్నామా? ప్రభుత్వ దుర్మార్గాలకు చింతనపరుల ఉదాసీనత దోహదం చేయదా?”

  • వ్యవస్థకి అద్దం పట్టింది కథ! ధన్యవాదాలు కృష్ణగారు!

  • అయితే ఆయనకీ, ఆయనకీ అండగా వున్నా సంస్థకి తగినంత మద్దతిచ్చేంత నిజాయితీగా మనం వున్నామా? ప్రభుత్వ దుర్మార్గాలకు చింతనపరుల ఉదాసీనత దోహదం చేయదా?……..ఈ వాక్యాలు చాలా సూటిగా ఉన్నాయి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు