ఎవరీ సుబ్రహ్మణ్యం?

సుబ్బును తొలి సారి చూసి, ఆయన మాటలు విన్న కొత్త వారెవరైనా “ఎవరీ సుబ్రహ్మణ్యం?” అనుకోవడం సహజం.

దేశ రాజధానిలో స్వాతంత్రం   పూర్వం పుట్టిన ఒకాయన ఉన్నారు.

కాని ఆ విషయం ఆయనకు గుర్తున్నట్లే కనిపించదు. తనను ఎవరైనా ‘అంకుల్’ అన్నా, లేక నేను ‘సార్’ అని పిలిచినా ఆయనకు కోపం వస్తుంది. నన్ను ‘సుబ్బూ’ అని పిలవండి అంటాడు. ఆయన ఇంటికి వచ్చి శ్రీశ్రీ ఒక రాత్రంతా దేశ విదేశాల  కవితల్ని ఆశువుగా  చదివి వినిపించిన రోజులున్నాయి.అయినప్పటికీ ఇప్పుడిప్పుడే కవితలు, వ్యాసాలు రాస్తున్న యువతను చూసి పొంగిపోతాడు.

నాటకాలంటే ఆయనకు ప్రాణం. రావిశాస్త్రి నాటకాలనుంచీ, బారిస్టర్ పార్వతీశం వరకూ ఎన్నో నాటకాలను ఢిల్లీ ప్రజలకు చూపించి సంతోషిస్తాడు. గజ్జెకట్టి ఎవరైనా ఆడితే చాలు వారి మధ్యలో దూరి చిచ్చరపిడుగులా నృత్యం చేసి పిల్లలను సైతం సిగ్గుపడేలా చేస్తాడు. చిన్న పిల్లలను చూడగానే వయసు మరిచిపోయి వాళ్లతో కలిసి నీళ్లలో గంతులేస్తాడు. పేదలు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలపై దాడులను ఏ మాత్రం సహించడు.జంతర్ మంతర్ లో జరిగే  పౌరహక్కులు, ప్రజా సంఘాల ధర్నాలు, సభల్లో దూరి గొంతును శంఖం చేసి నినాదాలు చేస్తాడు. అతడు గమనించని విషయం అంటూ ఏమీ ఉండదు. ఫేస్ బుక్ లో అఫ్సర్ నుంచి శ్రీధర్ బాబు, యాకూబ్ వరకు, వినోదినీ మాదాసు నుంచి మానస ఎండ్లూరి వరకు, ఓల్గా నుంచి ఖదీర్ బాబు వరకు, మాడభూషి శ్రీధర్ నుంచి ఎన్ వేణుగోపాల్ వరకు అతడి కంటపడని పోస్ట్ అంటూ ఉండదు. ఆయనకు పరిచయం లేని తెలుగు సాహితీ వేత్త అంటూ లేరు. సమాజం పట్ల అవగాహనతో స్పందించే ఎవరి  పోస్టు చూసినా అక్కడ అతడి వ్యాఖ్య ఉంటుంది. లేదా ఇతరులకు షేర్ చేస్తాడు..  ఆయన ఎవరో కాదు దేవరకొండ సుబ్రహ్మణ్యం.

ఆయనను చూస్తే నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే వయసును మరిచి ప్రతి మంచి పరిణామానికీ కేరింతలు కొడతాడు. మంచి కవిత చూసి  “దాన్ని చదివారా” అని అంటారు. “అఫ్సర్ సాహిత్యంపై రాచపాళం రాసింది చదివారా, శ్రీధర్ బాబు రాసిన కొత్త కవిత చదివారా” అని పొద్దున్నే ఫోన్ చేస్తాడు ఢిల్లీ కి పరిచయస్తులు, కవులు, సాహితీ వేత్తలు ఎవరైనా వచ్చి తనను కలవకుండా వెళ్లిపోతే చాలా బాధపడతాడు. కలిస్తే నానా హడావిడి చేసి ఎక్కడో గుర్గావ్ లో ఉన్న తన ఇంటికి వారిని తీసుకెళ్లడమో, లేక తానే వారి వద్ద వచ్చి వాలడమో చేస్తాడు, తన పాత కారులో వారిని కిలోమీటర్ల కొద్దీ వేగంగా ఢిల్లీ అంతా తిప్పుతాడు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తాడు. ‘మీరు మరీ భోళా శంకరుడు సార్’ అంటే ‘అంటే వెర్రి వెంగళప్ప అనే కదా అని అర్థం’ అని నాతో పోట్లాడాడు.  ‘రెండింటికీ తేడా ఉందండీ’ అని నచ్చచెబితే కాని శాంతించలేదు. మనుషులు ని తీవ్రంగా ప్రేమించి అంతకంటే తీవ్రంగా నిరాశకు గురి అవ్వడం సుబ్బుకి  కొత్త కాదు.

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోలు సమీపంలోని అట్లపాడులో తన మాతా మహుల నివాసంలో 1945లో  దేవర కొండ వెంకట లక్ష్మీ నరసింహ శర్మ, సూర్యకాంతం దంపతులకు  జన్మించిన సుబ్బు బాల్యం అంతా విశాఖ పట్టణం సింధియా కాలనీలోనే గడిచింది. వాళ్ల నాన్న శర్మ గారు హిందూస్తాన్ షిప్ యార్డ్ లో పనిచేసేవారు. విశాఖ ఏవీన్ కాలేజీపాఠశాలలో సెకండరీ విద్య, పీయూసిని అభ్యసించిన తర్వాత 1960-66  మధ్య   ఆయన  ఆంధ్రా యూనివర్సిటీలోమాథమెటికల్ ఎకననామిక్స్ లో ఆనర్స్ కోర్సు, ఆర్థిక శాస్త్రంలో ఎంఏ, గణాంక శాస్త్రంలో ఎంఎస్సీ చదివారు.  తండ్రి ఆంగ్ల సాహిత్యం చదివిన మేధావి.ఆఫీసుకు నడిచి వెళుతూ పుస్తకాలు చదువుతూ దారి మరిచిపోయేవారు. మేనమామ షిప్ యార్ట్ లో ట్రేడ్ యూనియన్ నాయకుడు మాత్రమే కాదు,  హోవార్డ్ ఫాస్ట్  ‘స్పార్టకస్’ ను అనువదించిన ఆకెళ్ల కృష్ణమూర్తి. వారిద్దరి మిత్రుడు తెలుగు కథా సాహిత్యంలో పెనుకెరటం రాచకొండ విశ్వనాథ శాస్త్రి.

1961లోనే విశాలాంధ్ర పత్రికలో రావిశాస్త్రి గారి ఆరు సారా కథలు సీరియల్ గా వచ్చేది. యూనివర్సిటీలో రిజిస్ట్రార్ కూర్మ వేణుగోపాల స్వామి పర్యవేక్షణలో ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మాణమై నాటికలు, నృత్యాలకు ఆదరణ కల్పించడంతో సుబ్బు మనసు అటు మళ్లింది.యునివర్సిటీలో 1963లోనే గురజాడ సాహిత్యంపై సదస్సు నిర్వహించారు.  నాటక రంగ ప్రయోక్త అత్తిలి కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రదర్శించిన రావిశాస్త్రి నాటకం ‘నిజం’ ను ఆయన అప్పుడే చూశాడు. శ్రీకాకుళోద్యమం సాహిత్యాన్ని ప్రభావితం చేస్తున్న రోజులవి. రావిశాస్త్రి  మాత్రమే కాదు, కాళీపట్నంరామారావు, భూషణం, బిటి రామానుజం, శ్రీపతి లాంటి వారు సాహిత్యంలో ఝంజామారుతాన్ని సృష్టించిన రోజులవి. 1966 డిసెంబర్ లో సుబ్బుకు హైదరాబాద్ లో  ఆయిల్ సీడ్స్ విభాగంలో ఉద్యోగం వచ్చింది. శ్రీపతి ఆయనకు మంచి మిత్రుడయ్యారు.సుబ్బుతో  సృజన పత్రికను చదవించారు.ఈ ప్రభావం మధ్య,  తెలుగు సాహిత్యంలో ఉత్తేజకరమైన సాహిత్యం వెల్లువెత్తుతున్న సమయంలో సుబ్రహ్మణ్యంకు  1969లో ఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసర్చ్ లో ఉద్యోగం వచ్చింది. ఆ మరుసటి సంవత్సరమే సుబ్బు తండ్రి 46ఏళ్ల పిన్న వయస్సులోనే మరణించారు. బాధ్యతలూ మీదపడ్డాయి. తాను ఉద్యోగం చేస్తున్న చోటే తనకంటే ఏడు సంవత్సరాలు పెద్ద, తాను చేస్తున్న ప్రాజెక్టుకు ఇన్ ఛార్జి  అయిన ఒక తెలుగు అమ్మాయి రుక్మిణి పరిచయం అయ్యారు. ఆమె ‘వరవిక్రయం’ రచించిన కాళ్లకూరి నారాయణ రావు కుటుంబానికి చెందిన వారు. ఆ పరిచయం స్నేహమై, ప్రేమగా మారి వివాహానికి దారితీసింది. ఢిల్లీలోని ఆర్యసమాజ్ మందిర్ లో వారు వివాహం చేసుకున్నారు.

ఢిల్లీ వస్తేనేం,తెలుగునేలలో తనను తాకిన తుఫాను సుబ్బును వీడలేదు. ప్రధానంగా నాటకరంగం ఆయకు ఇష్టమైన వ్యాపకంగా మారింది.  దక్షిణ భారత నటీనట సమాఖ్యలో క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించారు. ఆదివిష్ణు, అత్తిలికృష్ణారావు,రావిశాస్త్రి, దాడి వీరభద్రరావు, పంతులజోగారావుతో కలిసి నాటకాలు వేశారు. “సంధ్యాఛాయ” నుంచి “బారిస్టర్ పార్వతీశం” వరకు ఎన్నో నాటకాలను ఆయన ఆధ్వర్యంలో ప్రదర్శించారు. అత్తిలి వారు భూషణం మాస్టారు రాసిన “కొండగాలి” ఆధారంగా రాసిన నాటకం “తూర్పురేఖలు”  ప్రదర్శన సుబ్బు ఢిల్లీలో  నిర్వహించారు. అత్తిలి కృష్ణారావు,ఆయన సతీమణి పద్మావతి, పిల్లలతో సుబ్బుకు ఆత్మీయ సంబంధాలున్నాయి. వారు ఢిల్లీలో ఆయన నివాసంలోనే కాలక్షేపం చేసేవారు.  ఉద్యోగ రీత్యాఢిల్లీ వచ్చిన బలివాడ కాంతారావు, వాకాటి పాండురంగారావులతో పాటు అనేకమంది  కూడా సుబ్బుకు సన్నిహితులే.  ఉత్తరాదిన అస్మిత, ప్రయోగ గ్రూప్ లతో పాటు అనేక సంస్థలతో కలిసి ఆయన నాటక ప్రదర్శనల్లో పాల్గొన్నారు. అనేక వీధి నాటకాలు కూడా నిర్వహించారు.

1976లోనే ఆత్రేయ రాసిన “భయం” నాటకంలో తాను, తన భార్య రుక్మిణితో కలిసి నటించారు.నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సౌజన్యంతో  హెచ్ఐవి సోకిన పిల్లలతో  నాటక వర్క్ షాప్ నిర్వహించారు.1983 లో ఢిల్లీలో డిల్లి లొ మొదటి అఖిల భారత విప్లవ సంస్కృతి కార్య క్రమం నిర్వహించినప్పుడు రంగస్థల నిర్వహణ, వంట శాల నిర్వహణ బాధ్యతలను ఆయనకు టంకశాల అశోక్ అప్పగించారు. ఆ సందర్భంగా విరసం సభ్యుల తోనూ, వంగపండు, గద్దర్ వంటి ఇతర రాష్ట్ర విప్లవ సంస్కృతిక సభ్యులతో ఢిల్లీలో పలు చోట్ల,  ముఖ్యం గా నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా వారి ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. “అప్పుడే చెరబండరాజు “కొండలు పగలేసినం” పాటను ఆయన కూతురు నృత్య రూపంలో ప్రదర్శించడం తాను ఎన్నటికీ మరవలేని జ్జాపకం” అని సుబ్బు చెప్పుకున్నారు. 1983లోనే రావి శాస్త్రి ఆరు సారా కధలను అత్తిలి కృష్ణ రావు  “సారాంశం” పేరుతో నాటకీకరణ చేస్తే ప్రగతి సాహితి మిత్రులతో కలిసి సుబ్బు నాలుగు చోట్ల ప్రదర్శనలు నిర్వహించారు. తర్వాత విజయవాడ లో  జరిగిన విరసం సభల్లోనూ ప్రదర్శించారు.

ప్రఖ్యాత జర్మన్ నాటక రచయిత-దర్శకుడు బెర్టోల్ట్ బ్రెక్ట్ నుంచి మాయాకృష్ణారావు, జోహ్రా సైగల్, ఇస్మత్ చుగతాయ్, భీష్మ సహానీ, సఫ్దర్ హష్మీ, మహాశ్వేతాదేవి  వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి రచయితలు, నాటక రంగ ప్రముఖుల గురించి పాఠకులకు సుబ్బు  అద్భుతంగా పరిచయం చేయగలరు .రంగస్థలం ఎలాఉండాలో, ధ్వని ఎలా ఉండాలో అన్న విషయాలపై ఆయనకు ఎంతో పరిజ్ఞానం ఉన్నందువల్ల అనేక సంస్థలు, పాఠశాలలు ఆయన అనుభవాల్ని తమ కళా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఉపయోగించుకున్నాయి,

‘సురా’గా, ‘సుబ్బా’గా పేరొందిన సాహితీ వేత్త, పౌరహక్కుల ఉద్యమకారుడు సుబ్బారావుకూడా విశాఖకు చెందిన వాడు. 1976లో ఢిల్లీ వచ్చిన సురా ఒక నాటక ప్రదర్శనలో సుబ్బును కలుసుకోవడంతో వారిద్దరి మధ్య స్నేహం బలపడింది. సురా  తన బంధువు కూడా కావడంతో ఆయనతో కలిసి పీయూడీఆర్ లో క్రియాశీలకంగా పనిచేశారు. సుబ్బారావు ఖాల్సా కాలేజీలో ఆర్థిక అధ్యాపకుడుగా పనిచేసేవారు. పిన్న వయస్సులోనే సురా మరణించారు. 1994 జనవరిలో  ఢిల్లీ ఎలెక్ట్రిక్ క్రెమిటోరియంలో సుబ్బారావు అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు సుబ్బు రోదిస్తూ గీతాలు ఆలపించిన సన్నివేశం నాకింకా గుర్తుంది.  పియుడిఆర్ సభ్యులు  షర్మిలా, కుల్బీర్, సహానా,హరీశ్, మౌసమీ, మేఘా తదితరులంతా తన కంటే చిన్న వారైనా ఆయనను  సుబ్బూ అని పిలుస్తారు.

శ్రీశ్రీ నుంచి వరవరరావు, శివారెడ్డి వరకు, గద్దర్ నుంచి అరుణోదయ రామారావు వరకు ఎవరు ఢిల్లీ వచ్చినా సుబ్బు కరస్పర్శ, ఆతిథ్యం వారిని తాకాల్సిందే. విమల, పిఓడబ్ల్యు సంధ్య, మృణాళిని, కాత్యాయనీ విద్మహే  ఇలా ఎందరో ఢిల్లీ వస్తే చాలు ఆయన వారి వద్ద వాలిపోతారు.  ఖదీర్ బాబును ఢిల్లీ అంతటా తిప్పారు. తన ప్రాంతానికి చెందిన ఉత్తరాంధ్ర రచయితలు వస్తే సుబ్బు వారిని, వారు సుబ్బుని వదలరు. దుప్పల రవికుమార్. అట్టాడ అప్పలనాయుడు,  బమ్మిడి జగదీశ్వర రావు , గంటేడ గౌరి నాయుడు, మల్లీశ్వరి తదితరులు అలా సుబ్బు కళ్లతో ఢిల్లీని చూసిన వారే.  “అన్ని భావజాలాల మనుషులకు వారి కుటుంబం ఇచ్చే ఆతిథ్యం నిజంగా మెచ్చుకోదగ్గ ది. సుబ్బు సర్ కుటుంబం ఉంటే ఢిల్లీలో మనకి ఒక ఇల్లు ఉన్నట్లే.”  అని ఒక రచయిత్రి వ్యాఖ్యానించారు.

సుబ్బు  ఢిల్లీ సాహితీ సంఘాల్లో చురుకుగా పాత్ర పోషించారు. అనేక సాహితీ సభలను నిర్వహించారు. మహిళా రచయితల సదస్సు, ఉత్తరాంధ్ర కథా సాహిత్యం, గురజాడ కన్యాశుల్కం, కాళీపట్నం, రావిశాస్త్రి సాహిత్యం, జాషువా సాహిత్యం తదితర అంశాలపై సదస్సులను నిర్వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును స్వీకరించేందుకు వచ్చిన రచయితలనెందరికో ఆయన ఢిల్లీలో సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు.

ఆర్థిక, గణాంక శాస్త్రాల్లో నిష్ణాతుడైన సుబ్బు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను, పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలను నిశితంగా విమర్శించగలరు. సామాజిక శాస్త్రాలను అధ్యయనంచేసినందువల్ల వ్యవస్థ తీరుతెన్నులను విమర్శనాత్మకంగా పరిశీలించగలరు. అభ్యుదయ, విప్లవసాహిత్య వాతావరణ ప్రభావంలో ఎదిగినందువల్ల ప్రతి ప్రగతిశీల సాహిత్యాన్నీ ప్రేమ నిండిన కళ్లతో చూడగలడు. ఆయన చేసే కొన్ని వ్యాఖ్యల్ని చూస్తేఆయనేమిటో అర్థం అవుతుంది,

“ఇవాళ సుప్రీంకోర్టు. రైతుల ఆందోళనని సహృదయం తో అర్దం చేసుక్పొన్నట్టు ఆ మూడు సాగు చట్టాల సవరణలను నిలిపివేసి, ఒక నలుగురితో ఒక కమిటీ వేసింది. కానీ ఆ కమిటీ లో సభ్యులందరూ అంతకు ముందే ఆ సవరింపులు మంచివని,  వ్యవసాయ రంగాన్ని వృద్ది పరుస్తాయి అని చెప్పిన వారే. 45 ఏళ్లు నాటకరంగంలో ఉన్నాను. కాని సుప్రీంకోర్టు అడినటువంటి మంచి నాటకం ఎక్కడ చూడగలమ్ చెప్పండి….” అని ఆయన ఒకరోజు వ్యాఖ్యానించారు.

అట్టాడ అప్పలనాయుడు గురించి రాస్తూ అభివృద్ధి పేరిట, ప్రపంచీకరణ పేరు మీదా చిన్న రైతులకీ, గిరిజనులకీ జరుగుతున్న అన్యాయాన్నీ, దోపిడినీ మనకి అర్ధమయ్యే భాషలో గొప్పగా చూపించిన రచయితగా అభివర్ణించారు.  “ఈ కొండలూ అడివి పూలూ పెట్టుబడిదార్లకి రాయకుండా గిరిజనులేమిటి చేయగలరు?” అని అప్పలనాయుడు రాసిన వాక్యాల్ని ఉటంకిస్తూ ఈ ప్రపంచీకరణ, అభివ ద్ది అంతా మోసమేనని, మన ప్రభుత్వాలు సామాన్య రైతుల్ని, గిరిజనుల్ని మోసం చేస్తున్నాయని సుబ్బు విశ్లేషించారు.

స్త్రీపురుష సంబంధాలు, ముఖ్యంగా భార్యభర్తల సంబంధాలు ప్రేమైక మానవసంబంధాలుకాకుండా పోయాయని ఓల్గా రచనల్ని విశ్లేషిస్తూ సుబ్బు వ్యాఖ్యానించారు. రావిశాస్త్రి ఆరుసారాకథల గురించి ‘సారంగ’లో అద్భుతంగా విశ్లేషించారు. దేవదాసీ వ్యవస్థలోనే పుట్టి, సంగీతమే ఊపిరిగా బతుకుతూ తమ అంతరంగాన్ని బయటపడనీయకుండా మనోధర్మం పాటిస్తున్న జీవితాలపై మథురాంతకం నరేంద్ర రచించిన ‘మనోధర్మ పరాగం’ నవలను కూడా సుబ్బు తన దైన శైలిలో సమీక్షించారు. రావిశాస్త్రి, పతంజలి,  ఓల్గా, కుటుంబరావు రచనలు, సురా రచించిన సందిగ్ద సందర్భం, విభాత సంధ్యల నుంచి తనకు నచ్చిన రచనలన్నింటినీ ఆయన వీలునప్పుడల్లా పరిచయం చేస్తూ వచ్చారు. కుప్పిలి పద్మ రచించిన ‘వాన చెప్పిన రహస్యం’ చదివి ముగ్ఢుడై పోయారు. ఆమె తనకు ఇష్టమైన  నాటక-సినిమా రచయిత గణేశ్ పాత్రో కి దగ్గర బంధువే కాక అభిమాని అని తెలిసి మురిసిపోయారు. “కథ జనరంజకంగా రాయటానికి కాదు. సామాన్యులు అర్ధం చేసుకోలేని జీవిత సత్యాలను వారికి అర్ధమేయేలా చెప్పటానికే కథ! అని సాహిత్య ప్రయోజనాన్ని లక్ష్యాన్ని ఒక్క ముక్కలో తేల్చి చెప్పేసారు కారా మాష్టారు” అని సుబ్బు ఒక సందర్బంగా రాశారు , వేణుగోపాల్ “మా అమ్మ బాపు-రాజారాం” పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఎంతోఉద్వేగానికి లోనయ్యారు. ఇలా సుబ్బు పరిచయం చేసిన పుస్తకాలెన్నో.

మహాకవి శ్రీశ్రీతో సుబ్బు సమావేశం గురించి  ఆయనే ఒక సందర్బంలో చెప్పారు. 1979 లో శ్రీశ్రీని సుబ్బు అనుకోని రీతిలో కలుసుకోవడం జరిగింది. శ్రీశ్రీని కర్ణాటక సంఘం సన్మానిస్తోందని తెలిసి ఢిల్లీలో ఉన్న తెలుగు నాటక సంస్థ దక్షిణ భారత నటీ నట సమాఖ్య కార్య దర్శి గా ఉన్న సుబ్బు ఆయనను కలుసుకునేందుకు వెళ్లారు. ఆ రోజు ఆదివారం. ‘అయ్యా, నాపేరు దేవరకొండ సుబ్రహ్మణ్యం, నాది విశాఖ. ఇక్కడ ఫలానా సంస్థకి కార్యదర్శిని’ అని పరియం చేసుకున్నారు.  దీనితో శ్రీశ్రీ వెంటనే ‘ఈ వెధవ వూళ్ళో ఇవ్వాళ మందు దొరకదుట కదా?’ అని ప్రశ్నించారు. సుబ్బు అందుకు ప్రతిస్పందిస్తూ ‘సార్, నాతో మా ఇంటికి రండి నేను ఏర్పాటు చేస్తాను’ అనగానే ఆయన లేచి ప్యాంటు వేసుకొని వచ్చి సుబ్బు స్కూటర్ వెనుక కూర్చున్నారు. దారిలో ఆయనతో “నా దగ్గర రమ్ము కొంచెం ఉంది అని సుబ్బు చెప్పారు. శ్రీశ్రీ ఆ మాటలకు నవ్వుతూ ‘ఇండియన్ రమ్మయిననేమి బ్రిటిష్ రమ్మమయిననేమి రమ్ము రమ్మే కదా’  అని  చమత్కరించారు. ఇంటి కెళ్లాక దగ్గరలో ఉన్న  సి.వి. సుబ్బారావును కూడా సుబ్బు ఆహ్వానించారు. రాత్రంతా  శ్రీశ్రీ, సురా దేశ విదేశాల కవితల్ని, అనర్గళంగా చదువుతూ పోవడం సుబ్బుకు ఒక కొత్త అనుభవం. “ఊగరా ఊగరా ఉరికొయ్యనందుకుని ఊగరా” అన్న తన కవితా శ్రీ శ్రీ చదివి వినిపించారు. “నేను చనిపోతే నా దేహాన్ని విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రికి ఇస్తా” అన్న కోరికనూ శ్రీశ్రీ సుబ్బు ఇంట్లో ప్రకటించారు.

సుబ్బు అభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి. “నేను దేముడిని నమ్మను కానీ నమ్మే వారి మీద వ్యతిరేకం లేదు. నేను  హిందూ మతవాదిని కాదు. ఆ వాదాన్ని వ్యతిరేకిస్తాను. నా భావజాలం , ముఖ్యంగా మానవతా వాదం. తరతరాలుగా అణచివేయబడుతున్న దళితులు , గిరిజనుల కోసమే నా అవేదన”  అని సుబ్బు చెప్పుకున్నారు. “నేను మార్క్సిస్ట్ అని చెప్పుకోలేను కానీ ఆ భావాలతో ఏకీభావం ఉంది” అని ఆయన అన్నారు. సివి సుబ్బారావు, బాలగోపాల్, ఎన్. వేణుగోపాల్ ల రచనలను చదివిన తర్వాత వారు అనుసరించే సమగ్రమైన  శాస్త్రీయ ఆలోచనా పద్దతి తనకు నచ్చిందని తెలిపారు.

సుబ్బును తొలి సారి చూసి, ఆయన మాటలు విన్న కొత్త వారెవరైనా “ఎవరీ సుబ్రహ్మణ్యం?” అనుకోవడం సహజం. కాని సుబ్బుది ఒక ఉద్వేగపూరితమైన చరిత్ర అని తెలుసుకోవడానికి వారికి సమయం పడుతుంది.

(ఢిల్లీలో సుబ్బు వివాహం జరిగి అయిదు దశాబ్దాలైన సందర్భంగా)

*

 

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

24 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మిత్రులు కృష్ణరావు గారికి ఏ విధంగా మీకు కృతజ్జ్ఞలు తెలుపగలనండి. మీరు రాసిన వ్యాసం లో నా గురించి ఇన్ని వివరాలతో బాగా రాశారు .

  • అద్భుతంగా చెప్పారు. మీకు అభనందనలు. సుబ్రమణ్యo గారికి శుభకాంక్షలు.

  • సుబ్బు గారు నాకూ మిత్రులే. ఆయన వ్యక్తిత్వం చక్కగా రాసావ్.
    వివిధ రంగాల పట్ల ఆసక్తే కాదు, అధ్యయనం ఉన్న వ్యక్తిగా, సమాజంలో మంచి కోసం, మార్పు కోసం పోరాడేవాళ్ల పక్కన నిలబడే మనిషి. స్నేహశీలి.
    చుట్టూ వున్న పరిస్థితులు, మనుషుల్లో ఉండే అవకాశవాద ధోరణుల పట్ల ధర్మాగ్రహం గలవాడు. మంచి చదువరి.
    అన్నింటికన్నా మించి మనుష్యుల్ని ప్రేమించే మంచి మనిషి.
    కొంచెం అలక, కొంచెం కోపం, కొంచెం అమాయకత్వం , ఇంకా అద్భుతాల్ని, ఆశ్చర్యంగా చూడగల అమాయక బాలుడు లోన మిగిలి వున్నవాడు.

  • సుబ్బు గారిని ఇలాగ పటం కట్టి సూపడం కృష్ణుడికి తప్ప మరోకరికి వల్ల కాదు. ఇద్దరికీ ధన్యవాదాలు .

  • Very comprehensive analysis of a simple but highly responsive person Subbu by our common friend Krishnudu. Congratulations to both.

  • ఎంతో అద్భుతంగా ఒక విశిష్టమైన కళాకారుడిని పరిచయం చేశారు. ఒక purposeful life మొత్తం ఈ వ్యాసంలో అక్షరం పోల్లు పోకుండా రచయిత కుదించారు. ప్రతి మాట సత్యమే. ఎక్కడా అతిశయోక్తి లేదు. రచయితకు దేవరకొండ గారికి అభినందనలు.

  • Krishnudoo – Superb introduction to a wonderful human being. I got introduced to him about a decade back and since then Subbu has become more and more close to me each day and he insisted that I call him Guru. I am waiting to meet him personally. I missed a chance to meet him in 2016 when he arranged a meeting for me on my arrival from US but unfortunately I couldn’t make it. I am still guilty about it. Will see you soon Guroojee!

  • అవును.ఎవరీ సుబ్రమణ్యం? ఢిల్లీ వెళ్లకపోవడం వల్ల పోగొట్టుకున్న పరిచయం వీరిది.ఇప్పుడే వీరి గురించి సమగ్రంగా తెలిసింది.

  • నాకు అత్యంత ఆత్మీయులు సుబ్బు సార్, వారి కుటుంబం.
    వారి గురించి ఇంత అద్భుతంగా రాసినందుకు మీకు కృతజ్ఞతలు కృష్ణుడుగారు..
    మీరు ఎదురుగా ఉంటే మీకు శిరస్సు వంచి నమస్కరించేదాన్ని.
    ఒకే వ్యక్తిలో పెద్ద మనిషి, పసి పిల్లాడు కలగలిసి ఉండడానికి ఉదాహరణ మా సుబ్బు సార్…
    మా దృష్టిలో ఆయన రాక్ స్టార్.
    నా స్కూల్ పిల్లలకు డ్రామాను నేర్పుతూ, వారిని నిష్కల్మషంగా ప్రేమించే తాత.
    నా భర్తకు ఆయన మంచి స్నేహితులు.
    నా బిడ్డ చాలా ప్రేమించే సుబ్బు తాతగారు.
    మీరన్నట్లు ఎవరు మంచిగా రాసినా పొంగిపోతారు. వెంటనే ఫోన్ చేసి అభినందిస్తారు.
    మీకు మరోసారి నమస్సులు. థాంక్స్ కృష్ణుడుగారు.

  • ఎవరీ సుబ్రహ్మణ్యం?
    కృష్ణుడు రాసిన ఏ వ్యాసమైనా కవిత అయినా, విమర్శ అయినా లోతుగా విశ్లేషించడం వ్యాసంలో
    ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అందులో భాగంగానే దేవరకొండ సుబ్రహ్మణ్యం గారి పై రాసిన వ్యాసం లో అజ్ఞాతంగా ఉన్న విషయాలు
    తెలుసుకో గలిగాను. ఈ మధ్యనే దేవరకొండ సుబ్రహ్మణ్యం గారి మిత్రుడు సుధాకర్ గారి ద్వారా చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది.
    అభినందనలు.

  • అద్భుతమయిన వ్యక్తి గురించి అద్భుతమయిన రచన. దేవరకొండ సుబ్రమణ్యం రక్తమాంసాలతో మనలాగా తిరుగాడే మనిషని వాస్తవ జగత్తులోకి రావడానికి కొంత సమయం పట్టింది. చదువుతున్నంతసేపు, చదివినతర్వాత కూడా కాస్సేపటి వరకు కాల్పనిక జగత్తులో ఓ పాత్ర అని అనిపించేలా చిత్రీకరణ చేసిన ఈ రచన సాహిత్యం లో శైలి ప్రాధాన్యత గురించి అధ్యయనం చేసేవాళ్ళకు ఒక పరికరంలా ఉపయొగపడుతుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు