ఎవరి జీవితాలకి ఎంత విలువుందో…..

మూలం:  జుడిత్ బట్లర్ 

నం తప్పనిసరిగా ప్రజారంగంలో చర్చించాల్సిన విషయాలు, అత్యవసరంగా మాట్లాడాల్సిన విషయాల చర్చని మనకి అందుబాటులో ఉన్న ఆలోచనా చట్రాలు కష్ట సాధ్యం చేస్తున్నాయి. విషయం దగ్గరికి సూటిగా వెళ్లకుండా ఈ చట్రాల పరిమితులు మనల్ని అడ్డుకుని, చెప్పాల్సిన విషయాలని చెప్పనియ్యకుండా చేస్తున్నాయి. నాకు హింస గురించి, ప్రస్తుతం జరుగుతున్న హింస గురించి, ఆ హింస కున్న చరిత్ర గురించి, దాని వివిధ రూపాల గురించి మాట్లాడాలనుంది. కానీ హింస గురించి మాట్లాడే క్రమంలో, హమాస్ ఇజ్రాయేల్ పై చేసిన దాడులు, చేసిన హత్యల వెనుక చరిత్ర గురించి అర్ధం చేసుకోవాలి ఎవరయినా అంటే, వారు వెంటనే హింసని సాపేక్ష దృష్టితో చూస్తున్నారని, దానికొక నేపధ్యం సృష్టిస్తున్నామనే  నిందని ఎదుర్కోవలసి వస్తోంది. అంటే మనం ఖండిచటమో, ఆమోదించటమో చెయ్యాలి, అది చేస్తే మాత్రమే అందరికీ అర్ధం అవుతుందన్న మాట. కానీ, ధర్మబద్ధంగా ఆలోచిస్తే, మనం ఖండన లేక ఆమోదం తప్ప మరేమీ చేయలేమా అనే ప్రశ్న రాక తప్పదు.

ముందుగా హమాస్ చేసిన హింసని నేను బేషరతుగా ఖండిస్తున్నాను. అది ఒక భయానకమైన, అసహ్యం కలిగించే నరమేధం. ఇది నా ప్రాధమిక స్పందన, ఇప్పుటికి కూడా నేను దానికే కట్టుబడి వున్నాను. కానీ ఇది కాకుండా నాకు వేరే రకమైన స్పందనలు కూడా వున్నాయి. ‘నువ్వు ఎవరిని సమర్ధిస్తావు’ అనే ప్రశ్న వేస్తె, ఎవరయినా సరే అటువంటి హత్యలకి పాల్పడితే నిర్ద్వందంగా ఖండించాల్సిందే అంటాను. అయితే, నైతిక ఖండన చెయ్యాలంటే అప్పుడు వేరే ప్రశ్నలు వేయకూడదని, ముఖ్యంగా మనం సరయిన భాష ఉపయోగిస్తున్నామా, అసలు చారిత్రక పరిస్థితుల గురించి అవగాహన మనకి ఉన్నదా అనే టటువంటి ప్రశ్నలు, అటువంటి ఖండనకి అడ్డు వస్తాయనే అనుమానం చాలామందికి వుంది. ఎందువల్ల?  మనం వ్యతిరేకించే రాజకీయ నిర్మాణాల్లో మనం నిర్దిష్టంగా దేన్ని ఖండిస్తున్నాం, ఎందుకు ఖండిస్తున్నాం, ఎంత మేరకి ఖండిస్తున్నాం అని అడగటం హింసని సాపేక్షికంగా చూడటం కిందికి వస్తుందా? మనం విషయాన్ని అర్ధం చేసుకోకుండా, దాన్ని నిర్దిష్టంగా వర్ణించకుండా వ్యతిరేకించటం విచిత్రం కాదూ? ఖండన అంటే అర్ధం చేసుకోకుండా వుండటమేనని, జ్ఞానం మన విచక్షణని దెబ్బ తీసి, విషయాన్ని సాపేక్షికం చేస్తుందని అనుకోవటం మరింత విడ్డూరం కాదూ? మీడియాలో పదే పదే చూపిస్తున్న నేరాలు-ఘోరాల వంటివి వేరే వాళ్లకి ఎదురయినప్పుడు వాటిని కూడా ఖండించటం మన నైతిక బాధ్యతల్లో భాగం కాదా? మన ఖండన ఎక్కడ మొదలయ్యి, ఎక్కడ అంతమవుతుంది? మన నైతిక, రాజకీయ ఖండనలతో పాటు పరిస్థితుల గురించి విమర్శనాత్మకమైన, సమాచారంతో కూడిన నిర్ధారణ మనకి అవసరం లేదా? అలాంటి జ్ఞానం వల్ల నలుగురి దృష్టిలో మనం కూడా ఆ హింసని, నేరాలని సమర్ధించే వాళ్లుగా మారిపోతామనే భయం ఎందువల్ల కలుగుతోంది?

ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ చేస్తున్న, చేసిన హింస కున్న చరిత్రని చూపిస్తూ హమాస్ ని నిర్దోషిగా ప్రకటించే వాళ్ళు వున్నారు కానీ వాళ్ళు ఆ లక్ష్యం కోసం వాడుకుంటున్న నైతిక తర్కం సరైంది కాదు. ఒక విషయం స్పష్టం చెయ్యాలి. ఇజ్రాయెల్ పాలెస్తీనా ప్రజల పైన చేస్తున్న హింస చెప్పలేనంత తీవ్రమైంది : ఆపకుండా బాంబులు వెయ్యటం, అన్ని వయసుల వారినీ వీధుల్లో, ఇళ్లల్లో చంపటం, జైళ్లల్లో బంధించి క్రూరంగా హింసించటం, తిండి లేకుండా చేసి ఇళ్లల్లోంచి తరిమేయ్యటం ఏదీ తక్కువ కాదు.  ఈ వివిధ రూపాల్లోని హింసనంతా జాతి వివక్షకు గురి చేసి, వలస పాలన క్రింద, రాజ్యం లేని ప్రజల మీద జరుపుతున్నారు. హార్వర్డ్ పాలస్తీనా కమిటీ సభ్యులు హమాస్ ఇజ్రాయెల్ పై చేసిన దాడుల్లో ‘జరిగిన దానికి బాధ్యత మొత్తం జాతి వివక్ష చేస్తున్న పాలక వర్గానిదే’ అని ప్రకటన చెయ్యటంలో తార్కికంగా ఒక తప్పు చేశారు. ఇలా బాధ్యత ని పంచి పెట్టటం తప్పు. హమాస్ తాను జరిపిన హత్యాకాండకు పూర్తి బాధ్యత వహించాలి. అయితే ఈ ప్రకటన విడుదల చేసినందుకు ఆ కమిటీ సభ్యులని బెదిరించకూడదు, బ్లాక్ లిస్టు చెయ్యకూడదు. వాళ్ళు పాలస్తీనాలో హింసకున్న చరిత్ర గురించి మాట్లాడటంలో ఏ తప్పూ లేదు. వారి ప్రకటనలోని  ఈ వర్ణన ఖచ్చితమయింది “పధ్ధతి ప్రకారం భూమిని లాక్కోవటం నుండి అదే పనిగా వైమానిక దాడులు చెయ్యటం, అక్రమంగా నిర్బందించటం, మిలిటరీ చెక్ పోస్టులు పెట్టటం, కుటుంబాలని విడగొట్టటం, గురి చూసి చంపటం వల్ల పాలస్తీనా ప్రజలు మరణ స్థితి లో జీవించే పరిస్థితులకి నెట్టబడ్డారు, ఆ స్థితి కొన్ని సార్లు మెల్లగా వస్తే, కొన్ని సార్లు ఆకస్మికంగా వస్తుంది”.

కానీ హమాస్ హింస, ఇజ్రాయెల్ హింసకి మరో రూపం కాదు. దీని నేపధ్యం – ఓస్లో ఒప్పందం విఫలం కావటంతో హమాస్ వంటి గ్రూపులకి ఇంత బలం రావటానికి కారణాలు, ఇజ్రాయేలీ ఆక్రమణలో మెల్లగా, ఆకస్మికంగా పాలస్తీనా ప్రజలకి మరణ స్థితి తెచ్చే పరిస్థితులు, అనుక్షణం వుండే నిఘా, విచారణ లేకుండా బంధించి పెట్టటం, గాజా ప్రజలకి మందులు, ఆహారం, నీళ్లు లేకుండా తీవ్ర స్వాధీనం లో ఉంచుకోవటం గురించి మనం అర్ధం చేసుకోవటం తప్పనిసరి. అయితే హమాస్ చేసిన దానికి నైతిక లేదా రాజకీయ సమర్ధన ఈ చరిత్ర లో మనకి దొరకదు.  హార్వర్డ్ పాలెస్తీనా సంఘీభావ కమిటీ అన్నట్లు ఇజ్రాయెల్ చేసిన దానికి కొనసాగింపే పాలస్తీనా హింస అని భావిస్తే అన్ని చర్యలకి నైతిక బాధ్యత ఒక్కరిదే అవుతుంది, అంటే పాలెస్తీనా వాళ్ళకి తాము చేసిన పనులని  కూడా తమవని చెప్పుకోవటానికి వీలుండదు. ఈ చట్రంలో పాలెస్తీనా చర్యల స్వయం ప్రతిపత్తిని గుర్తించటానికి అసలు వీలు పడదు. మనం ఇజ్రాయెల్ వలస పాలనని, అక్కడి జైళ్లలో జరిగే చిత్ర హింసలని, ఒక జాతి రాజ్యంగా అన్నం, నీళ్లు లేకుండా గాజా పై చేస్తున్న దిగ్బంధాన్ని ఆపాలంటే,  ఇజ్రాయెల్ రాజ్యం చేస్తున్న నిరంతర, విస్తృత హింసనీ, దాన్ని సమర్ధనగా వాడుకుని ప్రతి హింసకి పాల్పడడాన్ని వేరు చెయ్యటం అత్యంత అవసరం.

కానీ ఈ సందర్భంలో మనం అసలు పాలస్తీనాపై ఇజ్రాయెల్ ‘ఆక్రమణ’ గురించి మాట్లాడనే కూడదు (సమకాలీన జర్మనీ లో ‘ఆలోచించకూడని’ విషయాల్లో ఇదొక భాగం), అసలు ఇజ్రాయెల్ పాలన జాతి వివక్ష, వలస పాలన కాదా అన్న విషయం గురించి కనీసం చర్చ కూడా చెయ్యకూడదు అంటే మాత్రం మనం గతం, ప్రస్తుతం, భవిష్యత్తు గురించి అర్ధం చేసుకోగలమనే ఆశలు కూడా  వదిలేసుకోవాల్సి వస్తుంది. పాలస్తీనా-ఇజ్రాయెల్ ప్రాంతంలో జీవిస్తున్న ప్రజలందరికీ ఎటువంటి ప్రపంచం సాధ్యమనే ప్రశ్నకి సమాధానం అక్కడున్న విదేశీ-వలస పాలనని అంతమొందించే పద్ధతుల పైన ఆధార పడుతుంది. అవలంభించాల్సిన పద్ధతుల గురించి హమాస్ దగ్గరున్న భయానకమైన, ఘోరమైన సమాధానాలున్నాయి కానీ వాటి కంటే, వేరే సమాధానాలు చాలానే అందుబాటులో వున్నాయి.

జరుగుతున్న నరమేధం మీడియా ద్వారా చూస్తున్న చాలా మంది ప్రజలు తీవ్ర నిరాశకి లోనవుతున్నారు. దానికొక కారణం సెన్సేషనల్గా, నిరాశా జనకంగా, కేవలం నైతిక ఆక్రోశం తెప్పించే రీతిలో విషయాలని చిత్రీకరిస్తున్న మీడియా ప్రపంచానికి మాత్రమే వాళ్ళు పరిమితం కావటం. మనం ఆ నైతిక ఖండనకి అవసరమైన నైతిక దృష్టిని జోడించాలంటే దానికి అవసరమయ్యే భిన్న రాజకీయ నైతికత అలవర్చుకోవాలి. దానికి కొంత సమయం వెచ్చించాలి. నిర్భయంగా, ఓపిగ్గా విషయాల గురించి నేర్చుకోవాలి. నిర్దిష్టంగా వాటి గురించి చెప్పగలగాలి.

నేను హమాస్ చేసిన హింసని వ్యతిరేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర దాని గురించి ఏ సమర్ధన లేదు కాబట్టి. ఇలా నా నైతిక, రాజకీయ వైఖరిని స్పష్టం చేస్తున్నాను. ఆ ఖండన దేని మీద ఆధారపడిందో, దాని పర్యవసానాలేమిటో ఎవరయినా అడిగితే నేను చెప్పటానికి ఏ మాత్రం తటపటాయించను, నాకు అవేంటో చాలా స్పష్టంగా తెలుసు. నాతో పాటు ఖండించిన వాళ్ళని దీని ద్వారా మీరు దేన్ని వ్యతిరేస్తున్నామని ఎవరయినా అడిగితే, వాళ్ళు దానికి సమాధానంగా ‘అదంతా నాకు అనవసరం, జరిగిన దాన్ని ఖండించటానికి నాకు హమాస్ గురించి, పాలస్తీనా గురించి తెలియాల్సిన అవసరం లేదని’ అన్నారనుకోండి. వాళ్ళు రోజు వారీ మీడియా లో చూస్తున్న దానిపై ఆధారపడి, అక్కడే ఆగిపోయి, అలా చూపిస్తున్నవి సరయిన వేనా, ఉపయోగకరమైనవేనా, వాళ్ళు చరిత్రల గురించి చెపుతున్నారా అని అడగట్లేదు అన్నమాట. అలా అడగనప్పుడు కొంత అజ్ఞానాన్ని, ఆ మీడియా చిత్రీకరణల మూసలని వాళ్ళు ఒప్పుకున్నట్లే. మనలో చాలా మంది బిజీ వ్యక్తులం. అందరికీ చరిత్రకారులు, సామాజిక వేత్తలు అయ్యే వీలుండదు కూడా. అలా అనుకుని బ్రతికెయ్యటం సాధ్యమే, చాలా మంది అలాగే జీవిస్తారు కూడా. మంచి ఉద్దేశాలున్న వాళ్ళు కూడా అలాగే జీవిస్తారు. కానీ, దాని వల్ల జరిగే నష్టం గురించి మనలో ఎంత మంది ఆలోచిస్తాం?

మన నైతికత, రాజకీయాలకి ఒక్క ఖండన ప్రకటనతో ముగింపు పలక్కపోతే ఏం జరుగుతుంది? ఆ ప్రాంతంలో జీవించేవాళ్ల జీవితాల్లోంచి ఈ హింస పూర్తిగా పోవాలంటే ఏం చెయ్యాలనే ప్రశ్న తప్పకుండా వేసుకోవాలని మనం అంటే? తెగబడిన వాళ్ళు చేసే నేరాలని ఖండించటంతో పాటు, ఈ హింస కి అంతం పలికే భవిషత్తుని సృష్టిద్దామని మనం అనుకుంటే ఏమవుతుంది? ఇది అప్పటికప్పుడు ఇచ్చే ఖండన ప్రకటనలని దాటి ముందుకు పోయి విలువలు, లక్ష్యాల గురించి మాట్లాడటంగా పరిణమిస్తుంది. దాన్ని సాధించాలంటే, మనం ప్రస్తుత పరిస్థితుల చరిత్రని తెలుసు కోవాలి, ఓస్లో ఒప్పందం నాశనం అయిన పరిస్థితుల్లో, గాజా లో స్వయం పాలనా వాగ్దానాలు గాల్లో కలిసి పోయిన నేపథ్యంలో హమాస్ సంస్థ ప్రాబల్యం పెరగటం, పాలస్తీనా లో ఇతర లక్ష్యాలు, వ్యూహాలతో ఇతర సంస్థలు ఏర్పడటం, పాలస్తీనా ప్రజల చరిత్ర, స్వేచ్చా, స్వాతంత్య్రాల కోసం, రాజకీయ స్వయం నిర్ణయాధికారం, వలస పాలన నుండి విముక్తి కోసం, మిలిటరీ మరియు ఇతర రాజ్య హింస నుండి విముక్తి కోసం  వారి ఆకాంక్ష – ఇవన్నీ తెలుసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనం స్వేచ్చాయుతమైన పాలస్తీనా కోసం జరిగే సంఘర్షణలో భాగం అవుతాం. అప్పుడు హమాస్ తనంతట తానే కరిగి పోవటమో, లేదా కలిసి ఉందామనే లక్ష్యాన్ని  ఇతర అహింసా మార్గాల ద్వారా సాధించాలనే పాలస్తీనా గ్రూపులు దాన్ని దాటి పోయి ముందు కెళ్ళటమో జరుగుతుంది.

కేవలం ఖండన అనే నైతిక ఆక్రోశంతో ఆగిపోయే వాళ్ల లక్ష్యం ఇటువంటి అవగాహన కాదు. ఇటువంటి ఖండనలు మేధో మధనాన్ని వ్యతిరేకించి, ప్రస్తుతంలో కూరుకుపోయి ఉంటాయి. అయితే, అటువంటి నైతిక ఆక్రోశమే కొంత మందిని ‘అసలు ఎందుకిలా అయింది, పరిస్థితులు ఎలా మారితే, భవిషత్తులో ఈ హింస పునరావృతం కాకుండా ఆపొచ్చు’ అనే అన్వేషణలో చరిత్ర పుస్తకాల్లోకి కూడా తీసుకెళ్తుంది. కొన్ని రకాల తర్కాలు సమస్యల నేపధ్యాన్ని వక్రంగా వాడుకోవచ్చు గానీ, నేపధ్యం లోనికి వెళ్లినంత మాత్రాన నైతికంగా సమస్యలు వస్తాయి అని అనుకోవాల్సి పని లేదు. ఈ రెండు రకాల నేపధ్యీకరణని వేరు చేయొచ్చేమో చూద్దాం. ఏదో కొంతమంది నేపధ్యం లోనికి వెళితే హింస నుండి ద్రుష్టి తప్పిస్తున్నామనో, లేక హింసని సమర్ధిస్తున్నామనో అనుకున్నంత మాత్రాన అన్ని రకాల నేపధ్యీకరణ సాపేక్షీ కరణకి దారి తీస్తుందని అనుకోలేము.

హార్వర్డ్ పాలస్తీనా సాలిడారిటీ కమిటీ హమాస్ దాడుల గురించి ‘ఆపార్థీడ్ పాలనే దీనంతటికీ కారణం’ అని అనటంలో నైతిక బాధ్యత గురించి మనం ఒప్పుకోలేని తర్కం అవలంబిస్తోంది. ఒక సంఘటన ఎలా జరిగిందో అర్ధం చేసుకోవాలంటే లేక దాని అర్ధం తెలుసుకోవాలంటే కొంత చరిత్ర నేర్చుకోవాలి. ఆ దుర్ఘటన ని దాటి, దాని భయోత్పాతాన్ని తక్కువ చెయ్యకుండా, మన దృష్టిని విశాలం చేసుకోవాలి; అంతే కాక, ఈ భయోత్పాతం మాత్రమే అన్ని రకాల భయోత్పాతానికి ప్రతినిధి అయినట్లు, దీన్ని తెలుసుకుంటే అన్నిటినీ తెలుసేసు కున్నట్లు, దీన్ని వ్యతిరేకిస్తే, అన్నిటినీ వ్యతిరేకించినట్లు భావించకుండా దృష్టిని విశాలం చేసుకోవాలి. ప్రస్తుత మీడియా పాలస్తీనా ప్రజలు దశాబ్దాలుగా బాంబింగులు, నిరంకుశ దాడులు, అరెస్టులు, హత్యల రూపంలో చవిచూసిన భయోత్పాతాన్ని మనకి అతి తక్కువగా చూపిస్తోంది. గత కొద్ది రోజుల్లో జరిగిన భయోత్పాతం గత 70 ఏళ్లుగా జరిగిన భయోత్పాతాన్ని నైతిక ప్రాధ్యానతలో దాటి పోయిందంటే దాని అర్ధం ప్రస్తుతం జరిగిన దాని పట్ల మన నైతక స్పందన, దురాక్రమణకు గురయ్యి, బలవంతపు విస్థాపనకి గురయిన పాలస్తీనా ప్రజలు అనుభవించిన, అలాగే ఇప్పుడు జరుగుతున్న మానవత్వపు హననం, ప్రాణహరణ కి లభించాల్సిన నైతిక స్పందనని మించి పోయిందన్న మాట. కొంత మంది హమాస్ జరిపిన హింసాత్మక చర్యల నేపధ్యాన్ని చర్చిస్తే అది హమాస్ ని నిర్దోషిగా నిలబెడుతుందని, వాళ్ళు చేసిన హత్యల నుండి దృష్టిని మళ్ళిస్తుందని  భయపడుతున్నారు. అది కొంత అర్ధం చేసుకోగలిగే భయమే. కానీ అసలు భయోత్పాతమే అటువంటి నేపధ్యీకరణకు కారణం కాదా? ఈ భయోత్పాతం ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ అంతమవుతుంది?

పత్రికలు ‘హమాస్ కి, ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధం జరుగుతోందని’ విషయం గురించి మనకో అవగాహనా చట్రాన్ని అందిస్తున్నాయి. అంటే, ముందే ఈ రకమైన అవగాహనతో పరిస్థితిని అర్ధం చేసేసుకున్నారన్నమాట. కానీ, గాజాని దురాక్రమణకు గురయిన ప్రాంతంగా, బహిరంగ జైలుగా అర్ధం చేసుకున్నప్పుడు ఆ పరిస్థితికి భిన్నమైన వ్యాఖ్యానం ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఒక వర్ణన గానే అనిపించొచ్చు గానీ, భాష మనం ఏం చెప్పగలమో, ఎట్లా వర్ణించగలమో, దేన్నీ తెలుసుకోగలమో దానికి అవకాశం, పరిమితులు రెంటినీ కల్పిస్తుంది. భాష వర్ణిస్తుంది, కానీ చెప్పగలిగిన విషయంపై పరిమితులకి లోబడి వర్ణించినపుడే దానికొక శక్తి లభిస్తుంది. పాలస్తీనా దురాక్రమణ జరిగినప్పటి నుండి ఇన్ని సంవత్సరాలలో, ఈ సంవత్సరంలో వెస్ట్ బ్యాంకు లో, గాజాలో ఎంతమంది పాలస్తీనా చిన్న  పిల్లలు, వయసు పిల్లలు చనిపోయారనే సమాచారం మనకి అక్కర్లేదని మనం నిర్ణయించుకుంటే; ఆ సమాచారంతో ఇజ్రాయెల్ మీద జరిగిన దాడులకు, ఇజ్రాయెల్ ప్రజల మరణాలకు సంబంధం లేదని మనం భావిస్తే, మనం పాలస్తీనా ప్రజలు అనుభవించిన హింస, శోకం, ఆక్రోశం గురించి తెలుసుకోకూడదని కూడా నిర్ణయించుకున్నామన్నమాట!  కేవలం ఇజ్రాయెల్ ప్రజల నుభవించిన హింస, శోకం, ఆక్రోశం మాత్రమే మనం తెలుసుకోవాలనుకుంటున్నాము. జయోనిజం వ్యతిరేకించే నా ఇజ్రాయెలీ స్నేహితురాలు తన కుటుంబం, స్నేహితుల గురించి తీవ్రంగా భయపడుతున్నాననీ, కొంతమందిని పోగొట్టుకున్నాననీ సోషల్ మీడియాలో రాసుకుంది. నేనే కాదు, మనమందరం ఆమె బాధని అర్ధం చేసుకోవాలి. నిస్సందేహంగా ఆమె అనుభవించేది భయానక పరిస్థితే.  మరి, ఆమె, ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితుల గురించి అనుభవించే బాధ, భయోత్పాతం లాంటిదే అటు వైపు సంవత్సరాల తరబడి బాంబులు, జైళ్లు, మిలిటరీ హింస అనుభవిస్తున్న పాలస్తీనా ప్రజల బాధ కూడా అని ఎందుకు ఆమె కానీ, మనం కానీ అనుకోలేకపోతున్నాం?

నేను తరాల తరబడి అత్యాచారాలకి గురయ్యి, తీవ్ర మానసిక గాయాలతో బాధ పడే ఒక యూదు స్త్రీని. కానీ, నా కంటే భిన్నమైన వారిపై కూడా అటువంటి అత్యాచారాలు చెయ్యబడ్డాయి. వారి పేరులోనో, ముఖంలోనో నన్ను నేను చూసుకోపోయినంత మాత్రాన జరిగే అత్యాచారాన్ని అత్యాచారం అని గుర్తించకుండా ఉండలేను. కనీసం అట్లా చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను.

చెప్పాలంటే, సమస్య సహానుభూతి లేకపోవటం కాదు. సహానుభూతి మనలని వారిలో చూసుకోవటమో, వారి అనుభవాన్ని మన అనుభవంలోకి అనువదించుకున్నప్పుడు జరిగినప్పుడు మాత్రమే కలుగుతుంది. కానీ ఆధిపత్య చట్రంలో  కొన్ని ప్రాణాల కోసం ఎక్కువ శోకించాలని నిర్దేశించినప్పుడు వారి నష్టాలు ఇతరుల నష్టాల కంటే భయానకంగా అనిపిస్తాయి. ఎవరి ప్రాణాలు శోకానికి అర్హమో అన్న ప్రశ్న ఎవరి జీవితాలకి ఎంత విలువుందో అన్న ప్రశ్నతో ముడిపడి వుంది. ఇక్కడ జాత్యహంకారం నిశ్చయంగా ప్రవేశిస్తుంది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అన్నట్లు, పాలస్తీనా ప్రజలు ‘జంతువులు’ అయితే, బైడెన్ అన్నట్లు ఇజ్రాయెల్ ఇప్పుడు అందరు ‘యూదు ప్రజల’ ప్రతినిధి (ప్రపంచ వ్యాప్తంగా వున్న యూదులని, అమెరికాలోని అతివాదులు కోరుకుంటున్నట్లు ఇజ్రాయెల్ కి కుదిస్తే) అయితే, యూదు ప్రజలకి, వారిని చంపాలనుకుంటున్న ‘జంతువులకి’ మధ్య జరిగే ఈ యుద్ధంలో మనం శోకించాల్సింది, శోకానికి అర్హులయింది కేవలం ఇజ్రాయెల్ ప్రజల గురించి మాత్రమే.

వలస పాలనా సంకెళ్ళ నుండి విడిపించుకోవాలని చూస్తున్న ప్రజలని వలస పాలకులు ‘జంతువుల’ నటం ఇదేమీ మొదటి సారి కాదు. సమకాలీన హింస గురించి ఇటువంటి జాత్యహంకార పూరిత వర్ణనా చట్రం, తాము చేస్తున్నది ‘జంతువుల’ ను సంహారం చేసి, మట్టు పెట్టి ‘నాగరిక సమాజాన్ని’ కాపాడుతున్నామని చెప్పుకున్న వలస పాలకుల వాదనకి పునరావృత్తమే.ఈ చట్రాన్ని మన నైతిక వ్యతిరేకతకు దన్నుగా వాడుకుంటే, మనం కూడా పాలస్తీనా ప్రజలపై అమలవుతున్న జాత్యహంకార నిర్మాణంలో భాగమవుతాము. అటువంటప్పుడు మనం రాడికల్ పరిహారాన్ని చెల్లించాల్సి వస్తుంది.

మన నైతిక ఖండన ఏ నేపధ్యం, జ్ఞానంతో సంబంధం లేకుండా స్పష్టంగా, నిర్దిష్టంగా వుండాలని మనం భావిస్తే, దానితో పాటు ఖండనకి సంబంధించిన షరతులని, దాని కోసం ప్రత్యామ్నాయాలని పేర్చిన వేదికని కూడా ఆమోదించాల్సి వస్తుంది.  ప్రస్తుత సందర్భంలో, ఆ నిబంధనలని ఆమోదించటమంటే ఎప్పటినుండో జరుగుతున్న అన్యాయానికి దారి తీసిన వ్యవస్తీకృత వలస జాత్యహంకారాన్ని ఒప్పుకోవటమే. మనం నైతిక స్థిరత్వం పేరుతో అన్యాయాల చరిత్ర నుండి పక్కకి జరగలేము. అలా చేస్తే మరింత అన్యాయాలకు దారితీసే ప్రమాదం ఉంటుంది, ఎప్పుడో అప్పుడు మన స్థిరత్వం నైతిక పాకుడు బండపై జారి పడుతుంది. ఆలోచించి, జ్ఞానం పొంది, తీర్పు ఇచ్చే శక్తిని కోల్పోకుండా మనం నైతికంగా హీనమైన చర్యలని ఖండించలేమా? తప్పకుండా, రెంటినీ చెయ్యొచ్చు, చెయ్యగలం కూడా.

మీడియాలో చూపెడుతున్న హింసాత్మక చర్యలు అత్యంత భయానకమైనవి. ఈ సమయంలో మనం చూసే హింస మాత్రమే మనకి తెలిసిన హింస వుతుంది. మళ్ళా మళ్ళా చెప్పేదేమిటంటే – హింసని గర్హించి, మన కంపరాన్ని తెలపటం మనం చెయ్యాల్సిందే. నేను కొన్ని రోజుల పాటు ఏమీ తినలేక పోయాను. నాకు తెలిసిన వాళ్ళందరూ ఇజ్రాయెల్ మిలిటరీ ఏం చెయ్యబోతోందోననే భయంలో, జాతి హననం చేస్తానంటున్న నెతన్యాహు ఎంత మంది పాలస్తీనా ప్రజల ప్రాణాలు తీస్తాడో నన్న భయంలో బ్రతుకుతున్నారు. సాపేక్షికత, సమాన విలువల గురించిన చర్చలలో కూరుకుపోకుండా ఇజ్రాయెల్ లో, పాలస్తీనా లో పోయిన ప్రాణాల గురించి మనం శోకించ గలమా అని అన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను.

బహుశా మన శోక దిక్సూచిని విస్తృత పరుచుకుంటే, దృఢమైన సమానత్వ భావానికి దారి తీసి కోల్పోయిన ప్రాణాలన్నింటి గురించి సమానంగా శోకించచ్చని, ఇంకా చెప్పాలంటే, అసలా ప్రాణాలు పోయినందుకు ఆక్రోశానికి, చని పోయిన వాళ్ళు ఇంకా జీవించే వుండాలనటానికి, అందరి జీవితాలకి సమాన గుర్తింపు వుండాలనే భావాలకి దారి తీస్తుందేమో.  భవిషత్తులో జీవించి వున్న వారందరి సమానత్వాన్ని వూహించుకోవటానికి ఐక్య రాజ్య సమితి మానవతా విషయాల సమన్వయ కార్యాలయం కూడేసిన సమాచారం మేరకు ఇజ్రాయెల్ బలగాలు, అక్కడి సెటిలర్లు 2008 నుండి వెస్ట్ బ్యాంకు లో, గాజా లో, ఈ హమాస్ దాడులు జరిగే ముందే 3800 మందిని చంపారని తెలుసుకోకుండా ఉండలేం. ప్రపంచం వారి చావుల గురించి దుఃఖించిందా?

హమాస్ మీద ప్రతీకారం తీర్చుకోవటానికి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో వందల మంది పాలస్తీనా పిల్లలు చనిపోయారు, ఇంకా అనేక మంది రానున్న వారాల్లో చనిపోబోతున్నారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న దాని గురించి పత్రికల్లో వస్తున్న నివేదికలు, వివరణలు, వ్యాఖ్యానాలలో ఉపయోగిస్తున్న భాష, నేరేటివ్, అవగాహనా చట్రాల గురించి, ఇక్కడి వలసవాద హింస గురించి కొంచెం సమయం వెచ్చించి తెలుసుకుంటే మన నైతిక స్థానాలు కదిలిపోవు. జరుగుతున్న హింసని సమర్ధించటానికో, బలపరచటానికో ఈ జ్ఞానం ఉపయోగపడదు, కానీ ఆ జ్ఞానం చాలా కీలకమైంది.  జరుగుతున్న దాని గురించి ఏ సవాలు చెయ్యని అవగాహనా చట్రాలని కాకుండా ఒక వాస్తవిక అవగాహనని అటువంటి  జ్ఞానం కలుగ చేస్తుంది. మనకి ఇప్పటికే తెలిసి, అందరం ఒప్పుకునే నైతిక వ్యతిరేకతా మార్గాల కంటే – పాలస్తీనా ప్రజల దుఃఖించే హక్కు, తెలుసుకుని, ఆక్రోశం, సంఘీభావం వెలిబుచ్చే హక్కు, తమ స్వేచ్చాయుత భవిష్యత్తు కోసం తమదైన మార్గం వెతుక్కునే హక్కు, వారి జీవితాలని నింపేసిన మిలిటరీ, పోలీసు హింసని వ్యతిరేకించే హక్కులతో సహా -మరిన్ని కొత్త మార్గాలు దీని ద్వారా మనం కనుక్కోవచ్చు కూడా .

వ్యక్తిగతంగా నేను అహింసాయుత రాజకీయాలని బలపరుస్తాను. అది అన్ని సందర్భాల్లో ఉపయోగపడే అమూర్త సూత్రం కాదని నాకు తెలుసు. అహింసని అవలంబించిన విముక్తి పోరాటాలు మనమందరం జీవించాలని కోరుకునే అహింసాయుత ప్రపంచాన్ని సృష్టించటంలో సహాయ పడతాయని నేను నమ్ముతాను. హింసని పూర్తిగా గర్హిస్తాను గానీ నా వంటి అనేక మంది కోరుకున్నట్లే ఈ ప్రాంతంలో నిజమైన సమానత్వం, న్యాయం కోసం జరిగే పోరాటాల్లో, కల్పనలో భాగమవ్వాలని కోరుకుంటాను. ఆయా ప్రయత్నాల్లో హమాస్ వంటి గ్రూపులు మాయమవ్వాలని, ఇస్రాయెల్ దురాక్రమణ అంతం అవుతుందని, కొత్త రకాల రాజకీయ స్వేచ్ఛ, న్యాయం వర్ధిల్లుతాయని నా ఆశ. వలస పాలనని సహజమే నని సమర్ధించని ప్రపంచాన్ని, పాలస్తీనా ప్రజల స్వయం పాలనా, స్వేచ్ఛ లని సమర్ధించి, స్వేచ్ఛ, అహింస, సమానత్వం, న్యాయం తో సహజీవనం కోరుకునే ఈ ప్రాంత ప్రజల ఇచ్ఛ నిజమయ్యే ప్రపంచాన్ని నేను కోరుకుంటున్నాను. ఇది ఒక అమాయకపు ఆశ అని, ఇంకా చెప్పాలంటే అసాధ్యమైందని చాల మంది భావించచ్చు. అయినా సరే, మనలో కొంత మంది ఇప్పటి వ్యవస్థలు ఎప్పటికీ ఉండవనే నమ్మకంతో, అటువంటి ఆశని ఉన్మాదంగా పట్టుకు వెళ్ళడాల్సిందే. దానికోసం మనకు కవులు, కలలు కనే వాళ్ళు, మచ్చికవ్వని పిచ్చి వాళ్ళు, ఎలా సంఘటితం చెయ్యాలో తెలిసిన వాళ్ళు కావాలి.

*

సునీత అచ్యుత

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈవ్యాసంలో రచయత ఉద్దేశ్యం బాగానే ఉంది. కాని ఎవర్శి తప్పుపట్తాలి అనే విషయంలో మీమాంస ఉంది. అసలు యుధ్ధమే తప్పు, అణచీవేత ధోరణి సమర్ధనీయం కాదు.
    మోహనరావు మంత్రిప్రగడ

  • అంతా పదాడంబరమే తప్ప ఏమీ లేదు. కారణం చారిత్రక దృక్పథం లేకపోవడం. పదాడంబరాలు బాధితులకు న్యాయం చేయలేవు. ఊగిసలాట! ఎటుమొగ్గాలో తెలియక పోవడం! అసలు నైతిక విలువలు అంటే ఏమిటి? ఒక్కో సారి నైతికత బాధితులను మరీ అణచిపెట్టి ఉంచడానికి తప్ప మరెందుకు ఉపయోగపడవు. వేలాది జనాలను తినే రాక్షసుడు కూడా నైతిక విలువల గురించి మాట్లాడటమే విచిత్రం! యుద్ధాలు ఎందుకు జరుగుతాయో అనే ప్రశ్న వేసుకుంటే మంచిది!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు