మగతనం
రచన: దండిభట్ల నాగేంద్రరావు
నాకు పంచె కట్టు అంటే చాలా ఇష్టం. అసలు పంచె సరిగ్గా కట్టడం రావాలే కానీ, ఆ కట్టులోనే ఎంతో హుందాతనం, అందం వుంటుంది. తెల్లగా తళతళలాడే ఖద్దరు పంచె కట్టి దానిపైన ఇంతింత అంచు వున్న కండువా వేసుకుంటే ఆ అందం, ఆ కళ.. ఎంత బాగుంటుంది?
మా రాజాగాడికి ఆ విషయం చెప్పి చెప్పి నా ఓపిక నశించింది. ఎంతకీ ఒప్పుకోడే.
“కనీసం పెళ్ళి పీటల మీద కూర్చునేటప్పుడైనా పంచె కట్టుకోరా” అంటే –
“నీకు అంత ఇష్టమైతే నువ్వే కట్టుకో” అంటూ కొత్త పంచెని నా ముఖం మీద విసిరేసి చరచరా బయటికి వెళ్ళిపోయాడు. చేసేది లేక పంచె లోపల పెట్టి బయటికి వచ్చి వరండాలో పడక్కుర్చీలో కూర్చున్నాను. కాస్సేపు కళ్ళు మూసుకోని ఆలోచిస్తే పంచెకట్టుతో కళకళలాడుతూ అన్నగారు రామారావుగారు కళ్ళముందు మెదిలారు. ఆ వెనుకే అక్కినేని, సినారే..!!
బయట గేటు చప్పుడైతే అటువైపు చూశాను. మా ఇంటికి రెండిళ్ళ అవతల వుండే పంకజంగారు.
“ఏం పంకజంగారు బాగున్నారా?” అన్నాను.
“బాగున్నాను పిన్నిగారు. మీరెలా వున్నారు” అందావిడ.
నేను లేచి ఊడిపోయిన తల కొప్పు సరిగా చుట్టుకుంటూ “రండ్రండి..” అన్నాను.
***
గత ఎపిసోడ్‌లో ఇచ్చిన కథా ప్రారంభం ఇది. ఈ కథ చదినప్పుడు మీకేమనిపించింది, ఏమైనా ఇబ్బంది ఎదురైందా అని అడిగాను. సమాధానం నేను చెప్పాల్సిన అవసరం లేకుండానే మీరు తెలుసుకుని ఉంటారని అనుకుంటున్నాను.
“ఈ కథ చెప్తున్నది ఒక మగవాడు అనుకున్నాం కానీ ఒక స్త్రీ ఈ కథ చెప్తోందని అని తరువాత తెలిసింది”
ఇలాంటివి – కథ ఎవరు చెప్తున్నారో తెలియని – కథలు చాలా తరచుగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా స్త్రీ రచయితలు రాసిన మగవారి కథల్లో, పురుష రచయితలు రాసే స్త్రీ కథల్లో ఈ సమస్యలు వుంటాయి. ఈ మధ్య నేను చదివిన ఒక యువ రచయిత కథ పది పేజీలు వుంటే నాలుగో పేజీలో కానీ కథ చెప్తున్నది ఎవరో అర్థం కాలేదు. ఇలాంటి కథనం పాఠకుడికి చిరాకు తెప్పిస్తుంది. ఏ పాఠకుడైనా కథ మొదలుపెడితే చివరి వరకు ఒకే వేగంతో వెళ్లాలి. అలా వెళ్లేలా కథా నిర్మాణం వుండాలి. ఒక పాఠకుడిగా నేను ఒక్క క్షణం ఆగి మళ్లీ వెనక్కి వెళ్లి వాక్యాలు చదవాల్సివస్తే ఆ రచన మీద నాకు సదభిప్రాయం కలగదు. రచయిత మీద గౌరవం కలగదు.
పాఠకులని బురిడీ కొట్టించడానికి రచయిత పూర్తి స్పృహతో ఇలాంటి ప్రయత్నం చేసి వుండచ్చు కదా అని కూడా కొంతమందికి అనుమానం రావచ్చు. ఇలాంటి కథనం సస్పెన్స్ కథలలో వాడచ్చేమో కానీ మిగిలిన తరహా కథలకి ఇలాంటి టెక్నిక్ నప్పదు. పైగా కథ బెడిసికొట్టే ప్రమాదం వుంది.
దీన్నుంచి ఎలా తప్పించుకోవాలి? మొదటి పేరా ముగిసేలోగా కథ ఎవరు చెప్తున్నారో పాఠకుడికి తెలియాలి. ఇది నాకు నేను పెట్టుకున్న నియమం. దానికి అనేక మార్గాలున్నాయి. పైన ఇచ్చిన కథా ప్రారంభం –
“అమ్మా నువ్వెన్నైనా చెప్పు నేను మాత్రం పంచె కట్టుకోనుకాక కట్టుకోను” అన్నాడు రాజేష్.
నాకసలే పంచె కట్టు అంటే చాలా ఇష్టం. అసలు పంచె సరిగ్గా కట్టడం రావాలే కానీ…
ఇలా మొదలుపెడితే ఈ తికమక వుండేదే కాదు.
ఒక స్త్రీ తన కథ తానే చెప్పుకున్నట్లు కథ రాయాల్సి వస్తే నేను ఖచ్చితంగా సరి చూసుకునే అంశం ఇది. ఒక సంబోధనతోనో, స్వగతంలోనే ఏదోక విధంగా (కనీసం రెండుసార్లు) కథ ప్రారంభంలోనే కథ చెప్తున్న నరేటర్ జండర్ తెలిసేలా చేస్తాను. తుదిబంధం అనే నా కథ ప్రారంభాన్ని ఒక్కసారి చూడండి –
“ఎలా చెప్తే అర్థం అవుతుంది మీకు…” ఈ మాట ఎన్నిసార్లు అన్నానో నాకే గుర్తులేదు. ఎన్నిసార్లు అన్నా, ఎలా చెప్తే ఈయనకి అర్థం అవుతుందో నాకు అర్థం కాలేదు. ఎలా చెప్పినా కొన్ని విషయాలి మగవాళ్లకి అర్థం కావు. అంతే…
“ఈయన” అనే మాట దగ్గర పాఠకుడికి కథ చెప్తున్నది స్త్రీ అని అర్థమవ్వాలి. ఒకవేళ తప్పినా “మగవాళ్లకి” అన్న దగ్గర అర్థమౌతుంది.
ఈ అవగాహన కలగని పాఠకులు కథతో మమేకం కారు. కథలో పాత్రతో సహానుభూతి చూపించలేరు.
ఈ అంశానికి మరో కోణం కూడా వుంది. మీరు ఎవరి కథ చెప్తున్నారు? మీరు రాస్తున్నది దళిత కథా? స్త్రీ వాద కథా? పేదవాడి కథా? బాగా డబ్బున్న సినిమా స్టార్ కథా? ఈ విషయం కూడా వీలైనంత వరకు కథ ఎత్తుగడలోనే పాఠకుడి చేరవెయ్యాలి. అలాగని నేరుగా చెప్పడం కూడా తప్పే.
అతనిపేరు దేవుడు. కడు బీదవాడు. పిల్లల్ని పోషించుకోడానికి చెప్పులు కుట్టుకునే పని చేస్తుంటాడు.
విషయం తెలుస్తోంది. కానీ చాలా పేలవమైన ప్రారంభం ఇది.
కుడుతున్న చెప్పుని పక్కన పెట్టి కళ్లు తుడుచుకున్నాడు దేవుడు. ఈ మధ్య కళ్లు సరిగ్గా కనపడకపోవటంతో పని చెయ్యడం కష్టమౌతోంది.
“కళ్లద్దాలు కావాలేమో” అంది అతని భార్య సీత ఈ విషయం చెప్పినప్పుడు.
“పిల్లలకి మూడు పూట్లా తిండి పెట్టడానికి గతి లేదు కానీ కళ్లద్దాలు కావాల్నా” అనుకుంటూ తల కొట్టుకున్నాడు దేవుడు.
ఈ రెండు ప్రారంభాలలో ఒకే విషయం చెప్తున్నాడు రచయిత. కానీ ఈ రెండు విధానాలలో వున్న తేడా గుర్తించండి. ఆ తేడా పేరు “చెప్పకు, ప్రదర్శించు”. ఇంగ్లీష్‌లో “show, don’t tell” అంటారు. దాని గురించి మరో సందర్భంలో వివరంగా చెప్తాను. ప్రస్తుతానికి ఎవరి కథ ఎవరు చెప్తున్నారు అన్న సబ్జెక్ట్ మీద ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇలా ఒకరి కథ మరొకరు చెప్పడంలో పాఠకుడు తికమకపడటం మాత్రమే కాకుండా ఇంకో పెద్ద సమస్య ఉంది. అది రచయితకి మరొకరి కథ చెప్పే సాధికారికత (authenticity) లేకపోవటం.
కింద ఇస్తున్న కథ చదవండి. ఆ తరువాత మాట్లాడుకుందాం.
ఉద్యోగపర్వం
రచన: కోనకంచె వెంకటసుబ్బయ్య
అది ఒక బహుళ అంతస్థుల భవనం. అందులో ఒక బహుళ జాతీయ సంస్థ. అందులో పని చేస్తుంటాడు సీతాపతిరావు. ఈ కాలం అందరిలాగే ఇతను కూడా ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరు. ఆరెంకల జీతం. అక్కడ ఆ జీతానికి తగ్గట్లే గొడ్డు చాకిరీ చేయిస్తారు.
సంక్రాంతికి ఇంటికి వెళ్లాలని శెలవు చీటీ పట్టుకోని ఆఫీసర్‍ని కలిశాడు సీతాపతి. ఆఫీసర్ గారు అతన్ని కూర్చోమని చెప్పి, తన టేబుల్ మీద వున్న ఫైల్స్ మొత్తం పక్కకి జరిపాడు. బెల్ కొట్టి ఆఫీస్ బాయ్‍ని పిలిచి ఆ ఫైల్స్ అన్నీ తీసుకెళ్లి మేనేజరుకి ఇవ్వమని చెప్పాడు. అంతలోనే “ఆగు” అని అందులోనుంచి ఒక ఫైల్ తీసుకున్నాడు. ఆ ఫైల్‍లో అన్నీ గులాబి రంగు కాగితాలు వున్నాయి. ఉద్యోగంలో నుంచి తీసేయాల్సిన ఉద్యోగస్తుల పేర్లు వున్నాయి వాటిలో.
“నా పేరుగానీ వాటిల్లో వుందా?” అని మనసులోనే అనుకున్నాడు సీతాపతిరావు
ఒకవేళ ఉద్యోగం ఊడిపోతే? భయం ఒక్కసారిగా చుట్టుముట్టింది. అప్పులు, అనారోగ్యంతో మంచం పట్టిన తల్లి, ఇంట్లో భార్య పోరు. నెలకి అంత జీతం వస్తుంటే సరిపోవట్లేదు. ఇప్పుడు అది లేకుండా పోతే! ఆత్మహత్యే శరణ్యం ఇక.
ఛీ! ఛీ!! ఎందుకిలా ఆలోచిస్తున్నాను. భగవంతుడు ఇచ్చిన ఈ ప్రాణాన్ని తీసుకునే హక్కు నాకెక్కడ వుంది? అలాంటి పని ఆ దైవాన్ని దూషించడంతో సమానం. పాపం కూడా.
“మిస్టర్ సీతాపతిరావ్, ఏమిటి ఆలోచనలో పడ్డారు?” ఆఫీసర్ అడగటంతో ఈ లోకంలోకి వచ్చాడు.
“ఇవన్నీ మీ టీమ్‍లో ఉద్యోగంలోనుంచి తీసేయాల్సిన ఉద్యోగస్తుల లిస్టు. వెంటనే పని జరిగేలా చూడండి” చెప్పాడు ఆయన. ఫైల్ అందుకోగానే వడివడిగా అందులో వున్న కాగితాలను తిప్పి చూశాడు.
“హమ్మయ్య నా పేరు లేదు. భగవంతుడి దయ” అనుకున్నాడు సీతాపతిరావు. “కానీ నా జట్టులో పని చేస్తున్నవాళ్ల పరిస్థితి? ఇప్పుడు వాళ్లని ఇలా ఉన్నపళంగా ఉద్యోగంలో నుంచి తీసేస్తే వాళ్లు మాత్రం ఏం చేస్తారు? వాళ్లు కూడా నాలాగే ఆలోచించి ఆత్మహత్య చేసుకుంటే? ఆ పాపం మాత్రం నాకు అంటుకోదా?” ఆలోచిస్తూ తన సీట్ వద్దకు వచ్చి కూలబడ్డాడు సీతాపతిరావు.
***
వాక్య నిర్మాణ దోషాలు, వ్యాకరణ దోషాలు ఉంటే వాటిని పక్కనపెట్టండి. అవి కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని పరిశీలించండి. కథలో చాలా విషయాలు కృతకంగా వున్నాయని మీకు అర్థమయ్యే ఉంటుంది. అందుకు కారణం ఏమై వుంటుంది అని అడిగితే రచయితకు కథలో వున్న పరిస్థితులు, వాతావరణం మొదలైనవాటి గురించి అవగాహన లేకపోవడం అని సులువుగానే చెప్పేస్తారు.
రచయిత తనకి తెలియని విషయాన్ని కథాంశంగా తీసుకోని రాయాలనుకున్నాడు. నా దృష్టిలో ఇది ఈ కథలో ఉన్న కృతకత్వానికి కారణం. ఇంకొంత వివరణ ఇస్తాను
కార్పొరేట్ సంస్థలో జరిగే జాబ్ రిట్రెంచ్‍మెంట్ గురించి కథ రాయాలనుకున్నాడు కోనకంచె వెంకటసుబ్బయ్య (రచయిత పేరండీ. పైన చదవలేదా?). ఆయనకి ఆ ప్రపంచం తెలియదు. తెలిసిందల్లా రిటరయ్యే దాకా పని చేసిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ గురించి. దాన్నే అటూ ఇటూగా మారిస్తే సరిపోతుందిగా అనుకున్నాడు. ఈ కథ రాశాడు. మనకి తెలియని కథ రాయాకూడదు అని ఏం లేదు. కానీ అలాంటి కథ రాయాలంటే దానికి సరిపడ రీసర్చ్ చెయ్యాలి. పదాలు, వాతావరణ చిత్రణ, పాత్రల స్వభావాలు ఇవన్నీ ప్రత్యక్ష అనుభవంతో తెలియాలే తప్ప ఊహించి రాసేవి కాదు. (జానపద కథ అయితే తప్ప. అప్పుడు ఊహే ప్రధానం). కార్పొరేట్ ఆఫీసులో ఆఫీసర్ ఉండడు, ఫైల్స్ తీసుకెళ్లి మ్యానేజర్‌కి ఇచ్చే ఆఫీస్ బాయ్‌లు ఉండరు, టీంని ఎవరూ జట్టు అనరు, పింక్ స్లిప్స్ గులాబి రంగులో ఉండవు. అంతెందుకు సీతాపతిరావు అనే పేరుగల వ్యక్తి ఇలాంటి కంపెనీలో ఉండే అవకాశం తక్కువ. ఉండకూడదని రూలేమీ లేదు, కాని పాఠకుడు ఊహించలేడు. పాఠకుడి ఊహను ఒకవైపు నడిపి, కథ ఇంకొక దిక్కుకు నడపడం వల్ల పాఠకుడిలో పఠనాసక్తి పోతుంది. “మగతనం” కథలో పాఠకుడు ఊహ ఆ కథ ఒక మగవాడు చెప్తున్నాడని నడుస్తోంది. కథ మాత్రం అందుకు భిన్నంగా నడవటం వల్లే మధ్యలో ఒక బ్రేక్ పడింది.
ప్రతి రచయితకి ఒక అస్థిత్వం ఉంటుంది. ఆ అస్థిత్వం నుంచి పుట్టిన అవగాహన ఉంటుంది. అనుభవం ఉంటుంది. అభిప్రాయం ఉంటుంది. అదంతా కథలోకి వస్తుంది. రావాలి కూడా. అదే అస్థిత్వ వాద కథలన్నింటికీ మూలం. అలా కాకుండా రచయిత తన అస్థిత్వానికి భిన్నమైన అస్థిత్వం గురించి రాయాల్సి వస్తే ఏం చెయ్యాలి?
అస్థిత్వం లాంటి పెద్ద మాటలు అవసరం లేకుండా సరళంగా మాట్లాడుకుందాం. ఉదాహరణకి ఒక పురుష రచయిత ఒక స్త్రీ గురించి కథ రాయాలనుకున్నాడనుకోండి. రాయకూడదని రూలేం లేదుగా, కాబట్టి అలా అనుకోవడంలో కూడా తప్పులేదు. ఒక స్త్రీ నెల నెలా వచ్చే పీరియడ్స్ వల్ల ఎదుర్కునే ఇబ్బందులు, ఆ కారణంతో ఆమెను ఆఫీస్‌లో చులకన చేసే ఆమె బాస్‌ను ఆమె ఎలా ఎదుర్కుంది అనేది కథ. మంచి సబ్జెక్ట్. ఇప్పుడు సదరు మగ రచయిత ఈ కథాంశానికి ఎంతవరకు న్యాయం చెయ్యగలడు? ఆ విషయం ఆ రచయితకి ఈ సబ్జెక్ట్ మీద ఉన్న అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. లేదా ఈ సబ్జెక్ట్ మీద కథ రాయాలి అనుకున్న తరువాత ఆ రచయిత చేసిన రీసర్చ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ రచయిత ఒక మధ్యతరగతి, అగ్రవర్ణ, పురుషాధిక్య భావజాలం ఉన్న వ్యక్తి అయితే ఈ కథ ఎలా ఉంటుంది? ఆ కథలో స్త్రీ పాత్ర ఒక దళిత స్త్రీ అయ్యి, ఆమె పని చేసేది కార్పొరేట్ ఆఫీసులో కాకుండా ఆమె ఒక వ్యవసాయ కూలీ అయితే ఏమౌతుంది?
ఈ సమస్య నుంచి తప్పించుకోడాఇకి ప్రతి రచయితకి ఉపయోగపడే సలహాలు రెండు ఉన్నాయి. మొదటిది – అసలు మీకు తెలియని విషయాల గురించి రాయకండి. రెండో సలహా – మీరు రాయాలనుకున్న సబ్జెక్ గురించి పూర్తి అవగాహన వచ్చే వరకు రాయకండి. రెండింటిలో మొదటిది ఉత్తమం.
ఒకసారి నేను భూటాన్‍లో జరిగే ఒక కథ రాయాలనుకున్నాను. కానీ నేను భూటాన్ ఎప్పుడూ వెళ్లలేదు. అందువల్ల భూటాన్‍కి సంబంధించిన వీడియోలు రెండు నెలలపాటు చూస్తూ ఎన్నో పేజీల నోట్స్ రాసుకున్నాను. అక్కడికి వెళ్లిన చాలా మందితో మాట్లాడాను. గూగుల్ మాప్స్ చూస్తూ ఊర్లూ, దారులు తెలుసుకున్నాను. కథ రాసిన తరువాత భూటాన్ వెళ్లి వచ్చిన వాళ్లకి కథ చూపించి అంతా సరిగ్గానే వుందని నిర్థారించుకున్నాను. నేను చేసుకున్న రీసర్చ్ అంతా కథలోకి రాలేదు. కానీ నేను రాసిన కథలో జరిగే సంఘటనలకు ఆ రీసర్చ్ ఒక ఆథెంటిసిటీ తీసుకొచ్చింది.
ఈ విషయాన్ని మరింత విశ్లేషించడానికి కొంచెం వెనక్కి వెళ్దాం. తెలుగు కథా చరిత్రలోకి. మొదటి తెలుగు కథా రచయితల్లో భండారు అచ్చమాంబగారు ఒకరని చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఆ తరువాత ఎంతమంది స్త్రీలు కథలు రాశారు? గురజాడ, శ్రీపాద, కొకు, చలం, రావిశాస్త్రి వంటి వాళ్లు కూడా స్త్రీల కథలను రాశారు. స్త్రీల మాటల సొగసుని కథల్లో పలికించారు శ్రీపాద. సామాజిక రాజకీయ కారణాన వచ్చిన మధ్యతరగతి సమస్యలను కథలు చేశాడు కొకు. చలం చేసిన పని మనందరికీ తెలుసు. ఉక్కిరిబిక్కిరి చేశాడు. అధోజగత్ కథలు, స్త్రీల ధిక్కార స్వర కథలు రావిశాస్త్రి కూడా రాశారు. కానీ వీళ్లలో నిజంగా స్త్రీవాదిగా మనం గుర్తించగలిగేది ఒక్క చలంని మాత్రమే! మిగిలినవాళ్లలో స్త్రీల పట్ల కాస్త సహానుభూతో, సానుభూతో వుంది కాదనలేం. కానీ వాళ్ల రచన పూర్తి స్త్రీవాద రచన మాత్రం కాదు. బీనాదేవి, ఆచంట శారదాదేవి, ఇల్లిందల సరస్వతీదేవి, వాసిరెడ్డి సీతాదేవి, అబ్బూరి ఛాయాదేవి, డి కామేశ్వరి, ఇంద్రగంటి జానకీబాల వంటి మహిళా రచయితలు రాసిన కథలే నిజమైన స్త్రీల కథలు అయ్యాయి. ఆ తరువాత ఓల్గా, పి. సత్యవతి, కుప్పిలి పద్మ వంటి కథకుల రాకతో స్త్రీవాద కథల బలం పెరిగింది.
ఇంత వరకు బాగానే వుంది కానీ, ఈ స్త్రీ కథకులు రాసిన స్త్రీవాద కథలలో దళితవాదం ఎంత వరకు వుంది? మళ్లీ అంతే – జాజుల గౌరి, జూపాక సుభద్ర, గోగు శ్యామల, వినోదిని, చల్లపల్లి స్వరూప వంటి రచయితలు అట్టడుగు వర్గ స్త్రీల సమస్యలపైన గొంతెత్తారు. మిగిలిన వాళ్లు రాయలేదని కాదు. సాధికారికంగా (authentic) రాయగలిగినవాళ్లు ఆ జీవితాన్ని అనుభవించినవాళ్లే తప్ప కేవలం వాటిని చూసిన వాళ్లు, ఊహించినవాళ్లు కాదు. ఇదీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. స్వలింగ సంపర్కం గురించి విశ్వనాథ సత్యనారాయణ రాశారు, ఇంద్రకంటి జానకీబాల రాసింది, మొన్నామొన్నటి మానస ఎండ్లూరి కూడా రాసింది. కానీ నిజంగా ఒక గే లేదా లెసిబియన్ కథ రాసినప్పుడు (కన్నడంలో వసుధేంద్ర రాసిన మోహనస్వామిని ఎప్పుడైనా కలవండి), అది చదివిన తరువాత ఏ కథలో ఎంత వాస్తవం వుందో, ఏ కథలో నిజమైన, సహజమైన పాత్రల చిత్రణ వుందో అర్థం అవుతుంది.
చెప్పొచ్చేదేమిటంటే – వీలైనంత వరకు మనకి తెలియని విషయాల గురించి కథలు రాయకూడదు. ఒకవేళ అలాంటి కథ రాయాలంటే అందుకు తగ్గ రీసర్చ్ తప్పనిసరి. పైన చెప్పిన కథలో రచయిత వెంకటసుబ్బయ్య అలాంటి రీసర్చ్ చేస్తే బహుళ జాతీయ సంస్థ అనకుండా ఎమ్.ఎన్.సీ. అనేవాడు. సెలవు చీటీ, ప్యూన్, బెల్ లాంటివి వుండేవి కాదు. ముఖ్యంగా పింక్ స్లిప్ అంటే కాగితం గులాబి రంగులో వుండదని తెలిసుకోగలితే ఇలాంటి ఫ్యాక్చువల్ ఎర్రర్ చేసేవాడు కాదు.
కథ అర్థం అవుతోంది కదా ఇలాంటి తప్పులు చేస్తే మాత్రం ఏమిటి? అని మీరు అడగచ్చు. కథ పాఠకుడికి అర్థం కావడం వేరు, కథలో చెప్పదల్చుకున్న విషయం అర్థమవడం వేరు. అది అర్థం చేసుకోవాలన్న కుతూహలమే చచ్చిపోతుంది. పాఠకుడికి రచయిత మీద గౌరవం పోతుంది. రచయితకి పాఠకుడి మీద గౌరవం లేదని అర్థమైన పాఠకుడు రచయితతో కలిసి కథతో కలిసి ప్రయాణం చెయ్యడానికి ఒప్పుకోడు. దీని గురించి ఇంతకు ముందు కూడా చెప్పాను.
నాకు చాలా కాలం నుంచి ఒక ముస్లిం కుటుంబం గురించి కథ రాయాలని కోరిక. కథలో మూలమైన అంశం, ముగింపు కూడా తెలుసు. కానీ ఒక ముస్లిం కుటుంబంలో వాతావరణం ఎలా ఉంటుంది, ఏ వస్తువు ఎక్కడ ఉంటుంది, ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటారు ఇలాంటివి ఎన్నో తెలిస్తే కానీ (నాకు తెలుసు అన్న ధైర్యం, నమ్మకం వస్తే కానీ), నేను ఆ కథ రాయలేను. రాయను కూడా.
“మీరు మరీ చెప్తారండీ, అందరిళ్లలోనూ అవే వస్తువులుంటాయి. దానికి ఇంత డిస్కషన్ అవసరమా?” అని మీకు అనిపించచ్చు. ఒక పాతతరం బ్రాహ్మణ కుటుంబంలో భోజన పాత్రలని మడి, మైల, అంటు అని మూడు విభాగాలు చేస్తారని మీకు తెలుసా? బ్రాహ్మణ తద్దినపు భోజనంలో విస్తరికి ఏ పక్కన పప్పు వెయ్యాలో, ఏ పక్కన గారెలు వెయ్యాలో చెప్పే నియమాలు ఉన్నాయని తెలుసా? ఒకసారి ఒక చిత్రకారుడు వేసిన బొమ్మలో ఒక వ్యక్తి భోజనం చేస్తుంటే మంచినీళ్ళ గ్లాసు ఎడమ పక్కన ఉండాలా? కుడి పక్కన ఉండాలా అని పెద్ద చర్చ జరిగింది తెలుసా? ఇవన్నీ తెలియకుండా ఒక బ్రాహ్మణ ఇంటిలో జరిగే కథ (authenticగా) రాయడం సాధ్యమేనా? కథ దాకా ఎందుకు? నేను ఇక్కడ ఉదాహరణ ఇవ్వాలనుకున్నా, నా సామాజిక నేపథ్యం నుంచే ఉదాహరణలు ఇవ్వగలిగాను. నల్లి బొక్క గురించి బావ బావమరుదుల గొడవ (బలగం సినిమా) కథ నేను ఏ నాటికి రాయలేను. చిన్న కథ అయితే కొంత రీసర్చ్ చేయటం, ఆ విషయం గురించి పరిజ్ఞానం ఉన్న వ్యక్తులతో చర్చించడం ద్వారా కొంత సాధించచ్చేమో. అదే ఒక నవలో, సినిమా కథో అయితే “నేను రాయలేను” అని చెప్పుకోడానికే నేను మొగ్గు చూపుతాను.
తెలియనిది రాయకపోవటం ఉత్తమం. విషయ సేకరణ (రీసర్చ్ అనడమే కరెక్ట్) చేసి రాయడం మధ్యమం. తెలియకుండా తెలిసినట్లే రాయడం అథమం. ఈ మూడు కాకుండా ఇంకో పద్ధతి ఉంది. అది మనకి తెలిసిన దృష్టికోణంలో అవతలివాళ్ల కథ రాయడం. వీలైతే సహానుభూతితో రాయటం. వెంకట్ సిద్ధారెడ్డి రిసరెక్షన్ అనే కథ ఉదాహరణ.
ఇంతా చెప్పొచ్చిందేమిటంటే – మనకి తెలిసిందే రాయాలి.
అలా అనీ మనకి తెలిసినదంతా రాసేస్తే ఏమౌతుంది? ఇంత రీసర్చ్ చేశాను కదా పాఠకులతో ఇదంతా పంచుకోవాలని ప్రయత్నిస్తే ఏమౌతుంది?
నేను చెప్పడం ఎందుకు? కింద ఒక కథా ప్రారంభం ఇస్తున్నాను. చదవి తెలుసుకోండి. చర్చ మళ్లీ కలిసినప్పుడు.
కథ: విరాక్స్ 3.0
రచన: ప్రొఫెసర్ శ్రీరంగరాజన్
కాంటైన్మెంట్ జోన్ అంతా క్రయో చాంబర్ బ్యాకప్‌ల నుంచి వస్తున్న లోఫ్రీక్వెన్సీ విద్యుదైస్కాంత ధ్వనులతో నిండి ఉంది. డాక్టర్ ఆరవ్ ఆటోక్లేవ్ ప్రెషర్ డయల్‌ను సరిచేసి, తన కళ్లద్దాలను ముక్కు మీదికి దించి వస్తున్న డేటాను గమనించాడు.
అప్పుడే లోపలికి వచ్చిన డాక్టర్ త్రిషా మెహతా వేసుకున్న బయోసూట్‌కి ఉన్న ప్రెషర్ లాక్స్ నుంచి వస్తున్న శబ్దం వినిపించి వెనక్కి తిరిగాడు ఆరవ్.
“మీ యాంటీ-ఆర్ఎన్ఏ సింథసిస్ డేటా స్ట్రీమ్ స్టేబుల్‌గానే ఉంది,” అన్నదామె చేతిలో ఉన్న టాబ్లెట్‌లోకి చూస్తూ. “కానీ ఇసోటానిక్ కండీషన్‌లో ఎక్సోన్యూక్లియేజ్ మార్కర్ నుంచి సరిగ్గా కోడాన్-127 దగ్గర అనవసరమైన కట్ అవుతోంది.”
ఆరవ్‌కి ఆమె చెప్పిన మాటలు ఇబ్బందిగా అనిపించాయి. ఎన్నో ఏళ్ల శ్రమ ఈ రీసర్చ్. అయినా స్థిరంగా నిలబడి సమాధానం ఇచ్చాడు. “అది ఊహించిందే కదా. ఆ కట్ రైబోజైమ్ కటాలిటిక్ కోర్‌లో మొత్తాన్నీ తిప్పేస్తుంది. అదే ఈ మాక్రోమాలిక్యూల్‌ను మ్యూటెంట్ స్పైక్ ప్రోటీన్‌లోని RBD లూప్‌కి అటాచ్ కావడానికి సహాయపడుతుంది.”
“కానీ ఆ తిప్పేయడం వల్ల, తరువాత ఎప్పుడైనా గ్లైకోసిలేషన్ దారిలో ముడతలు పడే ప్రమాదం ఉండదా?”
“అది hydrogen bonding సరిగ్గా లేకపోతే మాత్రమే. నేను ముందు నుంచే డైసోడియం ఫాస్ఫేట్ స్కాఫోల్డ్‌తో pH 7.4 స్థాయిలో ప్రె-బుఫ్ఫెర్ సిద్ధం చేశాను. ఇది డీనేచరేషన్‌ను, రిసెప్టర్ డికప్లింగ్‌ను నిరోధిస్తుంది.”
అప్పుడే డాక్టర్ రమేష్ వరుణ్ తన నైట్రైల్ గ్లోవ్స్‌ను తీస్తూ లోపలికి వచ్చాడు.
“నేను పేషెంట్ Z-46 పైన రెండు రౌండ్ల ప్లాస్మా ఎక్స్చేంజ్ పూర్తి చేశాను. బయోమార్కర్లు EL-6, TNF-ఆల్ఫా, D-డైమర్ స్థాయిలను ఎక్కువగా చూపిస్తున్నాయి. ఇది స్పష్టంగా ఒక సైటోకైన్ స్టార్మ్. నీ సింథటిక్ పెప్టైడ్ మాడ్యులేటర్ సిస్టమ్‌లోకి వేగంగా చేరగలదా?”
“అది మీడియం పైన ఆధారపడి ఉంటుంది,” అని ఆరవ్ తన కన్సోల్‌ను తడుతూ చెప్పాడు.
ముగ్గురు ముఖాల్లోనూ తమ ప్రయోగం ఫలిస్తుందా అన్న టెన్షన్ ఉంది. కొంచెం కొంచెంగా ప్రపంచాన్ని. కబళించేందుకు సిద్ధంగా ఉన్న Virax-3.0 వైరస్‌ను నిరోధించే ప్రయత్నాలు గత ఆరు నెలలుగా చేస్తున్నారు ఆ ముగ్గురూ. ఆ వైరస్‌ను పూర్తిగా కట్టడి చేసే యాంటీడోట్ కనిపెట్టానని అర్నవ్ చెప్పడంతో, దాన్ని పరిశీలించడానికి వచ్చారు మిగిలిన ఇద్దరు.
*
చాలా బాగా రాశారు ఇవ్వాల్టి కధల గురించి. “వీలైనంత వరకు మనకి తెలియని విషయాల గురించి కథలు రాయకూడదు. ఒకవేళ అలాంటి కథ రాయాలంటే అందుకు తగ్గ రీసర్చ్ తప్పనిసరి. పైన చెప్పిన కథలో రచయిత వెంకటసుబ్బయ్య అలాంటి రీసర్చ్ చేస్తే బహుళ జాతీయ సంస్థ అనకుండా ఎమ్.ఎన్.సీ. అనేవాడు. సెలవు చీటీ, ప్యూన్, బెల్ లాంటివి వుండేవి కాదు. ముఖ్యంగా పింక్ స్లిప్ అంటే కాగితం గులాబి రంగులో వుండదని తెలిసుకోగలితే ఇలాంటి ఫ్యాక్చువల్ ఎర్రర్ చేసేవాడు కాదు.
ఈనాటి కధకులు చదవవలిసిన వ్యాసం