గెలుపు, ఓటమి
కాలగమనంలో అంతరించి పోయిన మాటలు.
గెలుపు చుట్టూ గుడి కట్టిన ఓటమి
ఓటమి వెన్నంటి నీడై మిగిలే గెలుపూ రెండూ
హద్దులు చెరిగిపోయిన హరివిల్లు రంగుల కలగలుపే.
ఎప్పుడో రాలిపోతూ మెరిసే మెరుపు గెలుపైతే
పిడుగుపాటై కుప్పకూలే అనంత శక్తి పుంజం ఓటమి.
రెంటికీ ఒక అవినాభావ సంబంధం
మనిషిని పల్లకిగా మార్చుకు ఊరేగే అధికార పర్వం.
ఎక్కడికక్కడ రూపం కోల్పోయి జడలు విరబోసుకున్న ఉనికి.
మిడిసిపడుతూ గడిచిపోయిన వైభవాలు
వెలవెలబోతూ వెలుగులు పోగొట్టుకున్న పగటి నక్షత్రాలు
నిండుగా నవ్వే నది గుండెలోకి వలవేసి లాగిన కాలం
అరచేతుల్లోంచి జారి
కన్నీటి సముద్రాల్లోకి వలసపోతున్నప్పుడు
ఎవరిది ఓటమి ఎవరిది గెలుపు?!
నట్టింట్లో మొలిచి విస్తరించే వయ్యరి భామలూ
మనసులోయల్లో అల్లుకుపోయే గుర్రపు డెక్కలూ
కంటి చూపును కమ్మేసినప్పుడు
గురి తప్పిన ఆలోచనలు వెనక్కు తిరిగి వచ్చి
నిశ్శబ్దంగానే చుక్క రక్తం చిందకుండా
లోలోపల గాయాలుగా వికసించినప్పుడు
పెదవులపై మాసిపోయిన నవ్వుకు మళ్ళీ సభ్యతను అద్దుకుని
నిలువెత్తు కరిగిపోయిన నీడలా మిగిలినప్పుడు
అది గెలుపా? ఓటమా?
పిడికెడు మట్టినీ గుప్పెడు ఆకాశాన్నీ మూటగట్టుకు
నింగీ నేలా నాదంటూ పొంగిపొర్లే అల్పత్వాలముందు
నీళ్ళు నములుతూ వాలుతున్న మాటల వెన్ను నిమిరి
గుప్పిట్లో రహస్యపు రామ చిలుకలుగా మార్చుకున్నప్పుడు
నైపుణ్యానికీ నాణ్యతకూ చెక్ పెట్టి
ఆడంబరానికీ అధికారానికీ పట్టం గట్టే వేళ
ఏది గెలుపు ఏది ఓటమి?!
రెండూ కళావిహీనమై
మాడిపోయిన విద్యుత్ బల్బులే!
*
Add comment