గోదారి ఒడ్డున వున్న ఒక చిన్న పల్లె రేపాక. గట్టునే వున్న గుడి మెట్ల మీద కూర్చుంటే అవతలి ఒడ్డు, వస్తూపోతూ వున్న పడవలు, మధ్యమధ్యలో లాంచీలు.. నిండుగా ప్రవహిస్తున్న గోదారమ్మ రోజూ చూస్తున్నాసరే కళ్లకు, మనసుకూ గొప్ప సంతోషాన్ని ఇస్తూనే ఉంటుంది.
ఇలా నిండుగా వున్న గోదారే వేసవికాలం వస్తే చాలు.. వయ్యారి వాలుజడలా సన్నటి పాయలో వొదిగిపోతుంది. మండే వేసవిలో ఒడ్డు పైనుండి కిందికి నీళ్లలోకి దూకటం ఒక ఎత్తయితే, ఇసుకలో వేసిన తాటాకు పొదరిళ్లలో రాత్రి చల్లని వెండి వెన్నెల వాకిట కూర్చుని కబుర్లు చెప్పుకోవటం మరపురాని గొప్ప సరదా.
బహుశా నది ఒడ్డున వరుసగా కొలువుదీరి వున్న ఊర్లన్నిటిదీ దాదాపు ఇదే కథ. ఇలాంటి సరదాలే ఉంటాయి అంతటా. యేటికి కొత్తనీరు వచ్చినపుడు ఊరి మహిళలు పసుపు కుంకుమలు తాంబూలంలో పెట్టి, కొత్త చీరను ఆయమ్మకి నీళ్లలో వదిలి, ఊరిని చల్లగా చూడుతల్లీ.. అని వేడుకుంటారు. ఒకోసారి ఏ రాత్రో మమ్మల్ని ముంచేస్తుందేమో అనే భయం కూడా వారిని వెంటాడుతూ ఉంటుంది.
1986 ఆగస్టు నెల. ప్రశాంత గంభీర గోదారి నది భీకర వరదై పొంగి ఓ అర్థరాత్రి మావూరి పైకి విరుచుకుపడింది. ఏం జరుగుతోందో తెలిసేలోపే యువకులమంతా లాంతర్లు చేత పట్టుకుని వీధుల్లోకొచ్చాము. ఇళ్లలో నిద్రిస్తున్నవాళ్లను, నడవలేని వాళ్లను, పశువులను ఇలా తలా ఒకరం అందరమూ పక్కనే వున్న గుట్ట మీదికి చేర్చుతున్నాము. మావూరి కరణం గారబ్బాయి కృష్ణబాబు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నాడు.
అందరినీ గుట్టపైకి చేర్చుతుండగానే గంటగంటకూ వరద ఉద్ధృతి పెరుగుతూ దాదాపు మోకాళ్ల లోతు నీరు వచ్చేసింది ఇళ్లలోకి. కృష్ణబాబు గారిది రెండంతస్తుల డాబా. ఆ భవంతిలో వారి మిరప బస్తాలను పైఅంతస్తుకి చేర్చి, పడవలు సిద్ధం చేసి ఉంచాం. నది ఒడ్డునే కావటం వల్ల మాలో చాలామందిమి తెడ్లతో పడవ నడపడం, లోతునుబట్టి కర్ర వేయటం, తెరచాప ఎత్తటం సులువుగా చేసేస్తాం. గజ ఈతగాళ్లతో సరిసమానంగా ఈత కొడతాం. ఎలాంటి ఆపత్సమయంలోనైనా ఊరివాళ్లను కాపాడుకోగలం అనే మొండిధైర్యం మా గుండెల నిండా ఉంటుంది.
చూస్తుండగానే వరద హోరున ఉరకలెత్తుతోంది. గుట్టపైకి వెళ్లలేనివాళ్లు కృష్ణబాబు గారి ఇంటికి వస్తుంటే, అందరినీ డాబాపైకి ఎక్కిస్తున్నాము. వాళ్లంతా ఉండటానికి పైన భద్రపర్చిన పంట బస్తాలను వరద నీళ్లలోకి నెట్టేస్తూ, వచ్చినవాళ్లకు వచ్చినట్టు ఇంత చోటిస్తున్నాడు కృష్ణబాబు. గొప్ప మనసు చాటిన తను మా అందరికీ దేవుడిలా కనిపించాడు. ఓ కాళరాత్రి ముగిసి తెలతెలవారుతోంది. అప్పుడు గుండెలవిసిపోయే భయానక దృశ్యమొకటి మా కంటపడింది.
ఎల్లమ్మ తన ఇద్దరు చిన్నారులతో పూరిగుడిసె పైకి ఎక్కినట్లుంది. ఎంతసేపు గడిపిందో, తనెలా తట్టుకు నిలబడిందో కానీ, పైకప్పు వరద ఉద్ధృతికి ఊడిపోయి, తెప్పలా తేలుతూ నీటిలో కొట్టుకొస్తోంది. ఏనాడో తన భర్త పాముకాటుకు బలైపోతే, ఒక్కతే కూలిపనులు చేస్తూ పిల్లల్ని పెంచిపోషిస్తోంది. అవేర్ సంస్థ లాంచీ వాళ్లు వచ్చి కాపాడతారని చాలామంది తప్పనిస్థితిలో ఇళ్లపైకి, చెట్లపైకి ఎక్కి ఎదురుచూస్తూండటం ఇక్కడ అలవాటే.
కృష్ణబాబు గారి ఇంటికి సమీపంగా పూరిగుడిసె వరద ప్రవాహంలో కొట్టుకుపోతోంది. డాబాపై వున్న మావైపు చూస్తూ “మమ్మల్ని కాపాడయ్యా కృష్ణబాబూ..” అంటూ, పిల్లలిద్దరితో దండాలు పెట్టిస్తూ, గావుగావున కేకలుపెడుతూ ఏడుస్తోంది ఎల్లమ్మ. ఒక్క క్షణం ఏంచేయాలో మాకర్థం కాలేదు. అంతలోనే తేరుకుని వెంటనే కృష్ణబాబు, మరో ఇద్దరం కలిసి సిద్ధంగా ఉంచిన పడవకు తెడ్లు వేస్తూ, ఆ గుడిసె తెప్పను అందుకోవాలని వెనకే బయలుదేరాము.
వరద నీటి ప్రవాహంలో గుడిసె కొట్టుకుపోతున్న వేగాన్ని పడవ అందుకోలేకపోతోంది. దాదాపు అలా పోటాపోటీగా వెళ్ళటం, దగ్గరకు వచ్చినట్టే వచ్చి గుడిసె మెలికలు తిరుగుతూ సర్రున దిగువకు తోసుకుపోవటం మమ్మల్ని కలవరపెడుతోంది. అలా జారిపోయిన ప్రతిసారీ ఎల్లమ్మ, పిల్లల ఏడుపులు, వాళ్లు పెట్టే దండాలు మా గుండెల్ని పిండేస్తున్నాయి. దాదాపు ఒక గంట వారి వెనకే ప్రయాణం చేసి ఉంటాము. మేమూ – వాళ్ళు… వాళ్లూ – మేమూ .. బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో ఎల్లమ్మా, పిల్లలూ… కాపాడగలం అనే మొండి ధైర్యంతో మేము.
పడవ నుంచి దూకుదామా అంటే ఉద్ధృతంగా పారుతున్న వరద నీటిలో ఈదడం సాధ్యం కాని పరిస్థితి. ఇంతలోనే ఊహించని మరో షాక్. కొంచెం దూరంలో నీళ్లు సుడులు తిరుగుతూ కనిపిస్తున్నాయి. ఎల్లమ్మ ఇక ఆశలు వదులుకున్నట్లుంది. ఎలాగైనా సరే పిల్లల్ని కాపాడుకోవాలని ఆ పిచ్చితల్లి తన చీర చెంగును పిల్లల నడుముకు ముడేసింది.
“కృష్ణబాబూ.. నా పిల్లల్ని కాపాడయ్యా” అని దీనంగా రోదిస్తూ.. “తల్లీ గోదారమ్మా.. నీకు కోక పెట్టుకుంటాను, నా బిడ్డల్ని దయచూడమ్మా..” అని దండాలు పెడుతోంది. నిస్సహాయ స్థితిలో చేసేదేమీలేక ఎల్లమ్మ బలంగా చీరను పడవ వైపు విసిరేసింది. చూస్తుండగానే చీర నుంచి విడిపోవటం, పిల్లలు, ఎల్లమ్మ గుడిసె సహా సుడిలోకి జారిపోవటం కళ్లముందే క్షణాల్లో జరిగిపోయింది. ఆ క్షణంలో తాను, పిల్లలు వేసిన కేకలు మా గుండెల్ని కోసినట్లైంది. చీర నీళ్లపైన తేలుతూపోతోంది. ఎల్లమ్మ గోదారమ్మకు చీరైతే పెట్టింది కానీ.. గంగమ్మ తల్లే పెద్దమనసు చేసుకోలేకపోయింది. దిక్కులేని ఆ తల్లీ పిల్లల్ని కాపాడలేకపోయింది.
మా నిస్సహాయ స్థితికి మా కళ్ళెంట ఒకటే జలపాతం. అంతకంటే ఎవరో మా మనసును కత్తితో పొడుస్తున్నట్లు – కడుపులో చేయిపెట్టి కెలికేస్తున్నట్లు లోపలేదో అలజడి. సముద్రంలా మారిన ఆ వరద నీటిని నెట్టుకుంటూ ఇంటికైతే చేరాం కానీ – చాలారోజుల వరకూ ‘నా పిల్లల్ని కాపాడండి’ అనే ఎల్లమ్మ ఆర్తనాదం మమ్మల్ని నిద్రపోనివ్వలేదు. ముద్ద మింగనివ్వలేదు. ముఖ్యంగా కృష్ణబాబైతే బేలగా చాన్నాళ్లు ఏడ్చేసేవాడు. ఎంతో అందంగా కనువిందు చేసే గోదారమ్మ వరదల్లో ఇలా ఎందరి జీవితాలో అర్ధాంతరంగా ముగిసిపోవటం జీవితంలో మరపురాని విషాద ఘట్టం.
( మూడున్నర దశాబ్దాలుగా గుండె లోతుల్లో గూడుకట్టి వున్న కన్నీటి యదార్థ గాథకు అక్షర రూపం )
*
Add comment