ఎర్ర మరకలు

పల్లెలు దాటి, పట్నాలు దాటి, రాష్ట్రాలు దాటి, దేశం కాని దేశం నుంచొచ్చి ఈడ పడ్డాము.

ళ్ళు తెరవాలి.

గెట్టిగా అరవాలి.

ఈ చీకటి నుంచి, ఈ బాధ నుంచి, నాలుగ్గోడల ఈ నరకం నుంచి బయటపడేసే వెలుగుచుక్క కోసం గోడలు పగిలేలా అరవాలనుంది. కానీ గొంతు పెగలదే!

అయినా నా పిచ్చిగానీ తెరిచి చూస్తేనే కదా వెలుగైనా చీకటైనా. పుసులు కట్టి, ఎండిన పక్కులు మూసిన కళ్ళను తెరవనివ్వడం లేదు.

తెరవడానికి నోరే రానప్పుడు, కదలడానికి నాలుకే భయపడుతున్నప్పుడు వెలుగుచుక్కకు తావేదీ?

కనీసం గుండెల నిండా గాలి పీల్చడానికి కూడా ఓపిక లేదు. ఒంట్లోని శక్తినంతా ఎవరో లాగేస్తున్నట్టుగా ఉంది.

నా పరిస్థితే ఇలా ఉంటే గుంటిగాని సంగతి?

ఏమో..!

కళ్ళతో చూడలేకపోయినా కనీసం చెవులతో విందామన్నా చుట్టూ నిశ్శబ్దం. ఊపిరి బిగబట్టి వింటే సూది కిందపడినా వినపడేంత గాఢమైన నిశ్శబ్దం.

బయటినుంచి విసిరిన విసురుకు తెల్లెలోనుంచి కిందపడ్డ అన్నం మెతుకుల మింద జుయ్యిమంటూ ముసురుతున్న ఈగలు మాత్రం ఒకటే రొదపెడుతున్నాయి.

దూరంగా ఎక్కడో వినపడీ వినపడనట్టు చెవులను తాకుతున్న మాటలు, మధ్యమధ్యలో నవ్వులు.

ఎద్దుపుండు కాకికి ముద్దా..!

ఎవడి బతుకు.

ఎవడి బాధ.

ఎవడి సంతోషం.

గుంటిగాని శ్వాస కూడా వినపడట్లేదంటే నిన్నటి దెబ్బల ధాటికి గానీ?

తలుచుకోగానే ఒళ్లంతా పదురు ఒక్కసారిగా.

చూడాలి. చూడాలి.

కళ్ళు తెరవడానికి చిన్నపాటి యుద్ధమే అవసరమైంది. చెమట ఆరి ఉప్పుర్లిన గరుకుదనం రెప్పలపైన తెలుస్తోంది.

జైలు ఊచల సందుల్లోనుంచి ఏటవాలు గళ్లు గళ్లుగా పడుతున్న వెలుతురు వెలుగునీడల జీవితం అని గుర్తు చేస్తున్నట్టుగా ఉంది. గవాక్షంలోనుంచి దోసెడు మందాన పడుతున్న వెలుగురేఖలో ధూళికణాలు భారంగా కదులుతున్నాయి.

ఆ వెలుగు చాటు నీడలోనే పడి ఉన్నాడు గుంటిగాడు. ఒంటిమీద చొక్కా లేదు. బొక్కలు పడిన కాటన్ చెడ్డీకి అక్కడక్కడా నెత్తుటి మరకలు.

దెబ్బలను సలుపుతున్న చల్లగాలి నుంచి రక్షణ కోసమేమో మనిషంతా ముద్దలా ఒదుక్కుని పడుకున్నాడు.

వీపు మీద బెత్తెడు మందంతో ఈ మూలనుంచి ఆ మూలకు పడిన వాత తాలూకు రక్తం ఎండిపోయి నల్లగా మారింది. అక్కడక్కడా తడిగా రసి కారుతున్న చోట చీటీగలు గుంపులుగా వాలుతూ తమ ఆకలిని తీర్చుకుంటున్నాయి.

మనిషిలో ఏ కదలికా లేదు. కమిలిపోయిన దెబ్బలతో అచేతనంగా పడివున్నాడు.

జీవుడున్నాడా? ఏమో..!

చూద్దామంటే పక్కకు కదలాలన్నా ఒంట్లోని ఒక్కో కండరాన్నీ పట్టి పట్టి కదపాలన్నట్టుగా ఉంది. మెదడులో మొదలైన ఆలోచనలను కండరాల్లోకి తీసుకెళ్లే నరాలు శక్తుడినట్టుగా ఉన్నాయి.

పిడసకట్టి తడి ఆరిపోయిన పెదవులకు నాలుకతో తేమను అద్ది “రేయ్ గుంటిగా” అని పిలిచాను లేని ఓపిక తెచ్చుకుని.

ఆ పిలుపు వానికి చేరింటదా?

ఎక్కడో లోయల్లో గృహాంతర్భాగం నుంచి ఉధృతంగా మొదలై శిఖరాన్ని చేరకుండానే గాల్లో కలిసిపోయినట్టుగా ఉంది నా మాట నాకే.

నా చెవులనే చేరలేని నోటి మాట బారెడు దూరంలో పడున్న గుంటిగానిని చేరగలవా?

ఇంకాస్త గెట్టిగా పిలుద్దామనుకుంటుండగా ఏదో చప్పుడు.

టక్.. టక్… టక్….

అవే అవే.

బూటు కాళ్ల చప్పుళ్లు.

అరచేతులను గుజ్జుగుజ్జుగా నలిపే బండరాతి చప్పుళ్లు.

నోటి మాట గొంతులోనే ఆగింది. మూడడుగుల్లో ఆ బూట్ల నీడ దాటిపోయింది. రూలు కట్టెతో ఊచల్ని తాకించిన టపటపటపమనే శబ్దం తర్వాత బీగాలు కదులుతున్న చప్పుడు. పక్క సెల్ తెరుస్తున్నట్టుగా ఉంది.

కొద్దిసేపటిలో ‘వద్దు సా..’, ‘కొట్టాకు సా..’ అంటూ అరుపులు మొదలై, నొప్పులు తాళలేని కేకలుగా మారి, ఆర్తనాదాలుగా మారతాయి.

అరిచి, ఏడ్చి, ఓపిక నశించి స్పృహ తప్పి పడిపోతాయి.

టక్.. టక్… టక్….

మరో గది తలుపులు తెరుచుకుంటాయి.

మళ్లీ అవే అరుపులు, కేకలు, ఆర్తనాదాలు. తర్వాత ఇంకో గది.

నిజానికి ఒంటిమింద పడే దెబ్బలకంటే చెవులను తాకే పక్కవారి ‘అమ్మా..’, ‘అబ్బా..’ అరుపులే మరింత కుంగదీస్తాయి.

జరిగిందిది అని చెప్పాలనుంటుంది. వినేవాళ్లెవరు?

అరవాలని ఉంటుంది, పళ్లు ఊడేట్టు గుద్దుతారు.

పరిగెత్తాలని ఉంటుంది, కాళ్లు విరగేట్టు కొడతారు.

తిరగబడాలని ఉంటుంది, ఆ ఆలోచన మొత్తాన్నీ ఛిద్రం చేస్తారు.

నిరాశ. నిస్పృహ.

ఎందుకురా భగమంతుడా అనిపిస్తుంది.

ఈ దెబ్బలకంటే చావే నయం అనిపిస్తుంది.

ఖూనీలు చేశామా?

మానభంగాలు చేశామా?

భూములు లాక్కున్నామా?

లేకుంటే ఇంగొకరి పొట్ట కొట్టి కోట్లకు కోట్లు లెక్కలు కూడబెట్టినామా?

పల్లెలు దాటి

పట్నాలు దాటి

రాష్ట్రాలు దాటి

దేశం కాని దేశం నుంచొచ్చి ఈడ పడ్డాము.

రాజ్యాలు ఏలడానికి కాదు.

కూటి కోసం

కూలి కోసం

నిజ్జంగానే కూలి కోసమే. లేకుంటే ఇక్కడేం పని. దోవ తెలీదు, డొంకా తెలీదు. భాష అసలే అర్థం కాదు. మీకేం కాదు, ఏమన్నా అయితే మేం చూసుకుంటాం అని తెచ్చి అడివిలో పడేశారు.

రెండు పూటలా తిండి పెట్టి గొడ్డేలి చేతికిచ్చారు. చెట్టు చూపించి నరకమన్నారు.

పటా.. పటా… పటా… నిలువునా కూలబడిందది.

ముక్కలు చెయ్యమన్నారు. ఠంగ్.. ఠంగ్… ఠంగ్… తుంటలు తుంటలు. తొప్పట తీయమన్నారు.

మాకు చెమట, దానికి రక్తం. కారుతూనే ఉంది.

భుజానికెత్తుకోమన్నారు. నడుస్తున్నాం. ఏనెల మీదుగా మోరలు, తోకలు ఏకం చేస్తూ కొండలు గుట్టలు బోళ్లు తిప్పలు వాగులు వంకలు సెలలు లోయలు నారవలు దాటి అయిదు, పది, పదైదు కిలోమీటర్ల నడక. ఒకసారి ట్రాక్టర్, ఒక్కోసారి ఆటో, ఇంకో రోజు మరేదో. ఒకసారి పోయిన చోటుకు మళ్లా పొయ్యేది లేదు.

ఎందుకింత రహస్యంగా, చాటుమాటుగా అంటే వీటి గురించి బయటికి తెలిస్తే ప్రమాదమంట.

మరి తెలిసి తెలిసీ ప్రమాదంలోకి ఎందుకంటే? నరికిచ్చినందుకు వాళ్లకెంతొచ్చదో తెలీదు గానీ మాకైతే కూలిబాటు. బయట ఎంత కష్టపడితే సంవత్సరానికి లక్ష రూపాయలొస్తుందీ!

అంతగా ఏముంది దీంట్లో అనుకుంటాం మాలో మేము.

లెక్కలు కాసే చెట్టంట.

కోట్లు కోట్లు తెచ్చిపెట్టే చెట్టంట.

కార్లు, బంగళాలు ఏం కావాలన్నా కొనిచ్చే చెట్టంట. రకరకాలు.

ఎర్ర చందనమంట.

ఎవరికి తెల్సు?

మాకు మాత్రం ఆకలి తీర్చే చెట్టు.

నమ్ముకున్న కుటుంబానికి కడుపుకింత తిండి పెట్టే చెట్టు. ఇదే కూడు బయటే దొరికితే ఇంత దూరం ఎందుకొస్తాము..!

పొయ్యిలోకో, బొగ్గుల బట్టీకో, ఇంగో దానికో నరికినట్టే దీన్నీ నరికినాము. అది తప్పంట.

తప్పంటే గుర్తుకొస్తోంది. నేనన్నా డ్యూటీలో ఉన్న ఫారెస్టు గార్డును కిందపడదోసి ఆయప్ప కోపానికి ఈళ్ల చేతికి చిక్కినా గాని ఈ గుంటిగాడే ఏ పాపమూ ఎరగడు. మరి ఈ నరకంలో ఎందుకిరుక్కున్నాడు అంటే అంతే ‘ఖర్మ చెడ్డదైనప్పుడు కొన్నిసార్లు ఏ తప్పు లేకపోయినా ఆ ఖర్మఫలం మాత్రం అనుభవించాలి’.

పదేడేళ్లకు పెళ్లి.

ఇరవయ్యేళ్లకు తండ్రి.

కూతురంటే మురిపెం. రెండేళ్లకు పెండ్లాం కడుపులో మరో నలుసు. ఈసారి కొడుకైతే బాగుండు అనుకున్నాడు.

కట్టెలు కొట్టి కర్ర బొగ్గు కాల్చే పని. కష్టముంటది గానీ మూడు పూటలా తిండికైతే ఇబ్బంది లేదు. అంతా బాగుంది అనుకుంటాండగా కూతురు గుండెలో ఏదో రంధ్రం. పెద్దాసుపత్రికి పోతే లక్ష పైనే అన్నారు.

గుండె పదురు పుట్టింది. ఈరోజు ఒళ్లు అరగదీస్తే గానీ రేపటి కడుపు నిండని బతుకులు.

ఎక్కన్నుంచి తేవాలి లక్ష రూపాయలు?

ఎవరో వచ్చారు ‘ఒక సంవత్సరం మేం చెప్పిన పనిచెయ్యి నీ కూతురికి మేం బాగు చేయిస్తాం’ అన్నారు. అంతకంటే ఇంకేం కావాలి. ఆ సమయానికి దేవుడిలా కనిపించారు.

కూతురి ఆరోగ్యం బాగైంది. అడవికొచ్చిన ఎనిమిది నెలలకు భార్య కానుపయింది. కొడుకే. సంతోషం పట్టలేకపొయ్యాడు గుంటిగాడు.

పక్షులతో పంచుకున్నాడు.

చెట్టు పుట్టలతో మాట్లాడాడు.

మేఘాలతో కబురు పంపించాడు.

మనిషి మనిషికీ చెప్పి సంబరపడ్డాడు.

ఎప్పుడెప్పుడు ఇక్కన్నుంచి బయటపడదామా, కూతురి మొహంలో సంతోషం చూద్దామా, కొడుకునెత్తుకుని ముద్దాడుదామా అని రోజులు లెక్కపెట్టుకుంటూ మూడు నెలలు గడిచిపొయ్యాయి.

ఇంగొక్క నెల. ఒకే ఒక్క నెల. ముప్పై రోజులు.

అడివికి పడమటి దిక్కున పదైదు కిలోమీటర్ల దూరంలో కొండంచు పల్లె చెరువులో లోడెత్తి రమ్మన్నారు. రేపు ఇక్కడ కాదు తూర్పు దిక్కు వైపు వెళ్లాలని చెప్పాడు మేస్త్రీ. పనేం లేదు కదా అని అందరం నడుము వాల్చాం.

కొందరిది గురక నిద్ర.

కొందరివి ఊసుపోని కబుర్లు.

మరికొందరివి ఎడతెగని ఆలోచనలు.

గుంటిగాడు మాత్రం గుంపుకు కాస్త ఎడంగా మామిడిచెట్టు మొదుట్లో పడుకుని, కొమ్మల చాటున సాగిపోయే మేఘాలను చూస్తున్నాడు.

గుంపులో ఉన్నట్టుండి అలజడి. అయిదుమంది కొత్త మనుషులు. ఇద్దరు పోలీసు డ్రస్సుల్లో ఉన్నారు. ఫారెస్టోళ్లు.

చెట్టు చాటునుంచి వచ్చి గుంటిగానికి నాటుతుపాకీ గురిపెట్టారు. ఇంకొకతను వచ్చి చేతికి టవ్వాల వేసి పట్టుకున్నాడు.

తుపాకీ గురి గుంపువైపు చూస్తోంది. “మర్యాదగా పైకి లెయ్యండి” ఫారెస్ట్ గార్డ్ గొంతు కటువుగా పలికింది.

లేచినట్టు లేస్తూ గొడ్డేలి అందుకోబోయాడు గుంపులో ఒకడు.

“రేయ్” కర్కశంగా అరించింది తుపాకీ గుండె.

డెబ్బై జతల కళ్ళు. భీతిభీతిగా చూస్తున్నాయి తుపాకీ గొట్టం వైపు.

కదలమన్నారు.

పారిపోయే అవకాశం లేకుండా గుంటిగాని చేతికున్న టవ్వాల మరో కొస తన చేతికి ముడేసుకుని ముందు నడుస్తున్నాడు ఫారెస్ట్ పిలకాయ. ఇద్దరికీ ఒకే వయసుంటది.

ముందు పక్క ముగ్గురు, వెనుక ఇద్దరు.

ఒక నాటు తుపాకీ. అంతమందినీ గుంపు చేసి నడిపిస్తోంది.

వేగం తగ్గినప్పుడు గదమాయిస్తూ వెనకాల నడుస్తున్నాడు ఫారెస్ట్ గార్డ్. నా చొక్కా అతని చేతిలో ఉంది.

కిలోమీటరు, రెండు కిలోమీటర్లు.

నడుస్తూనే ఉన్నాం. ఏదో కొండ రేవు. అందరం నీళ్లు తాగాం. మళ్లీ నడక.

సెల అడుగున కొండ వరస మారాలి. మధ్యలో పెద్ద బండరాయి. జారుడుగా ఉంది. దాటుతుండగా గుంటిగాని చేతికి టవ్వాల చుట్టుకున్న అబ్బాయి సర్రున జారేడు. ఇద్దరూ దొర్లుకుంటూ వచ్చి కిందపడ్డారు.

అదను కోసం చూస్తున్నట్టు తన వీపుకు గురిపెట్టి ఉన్న తుపాకీ కిందపడేట్టు చేతులు వెనక్కి విసిరేడు మేస్త్రీ. దూరంగా రాళ్లల్లో పడిందది.

అవకాశం చిక్కింది. వాడుకో.. వాడుకో.. నా మెదడులో పురుగు.

ఒక్క తోపు. ఫారెస్ట్ గార్డు తమాయించుకోలేక రాతిమింద పడ్డాడు. తలే కొట్టుకుందో కాలే విరిగిందో.

స్తబ్ధుగా ఉన్న అడవిలో అలజడి. అరుపులు కేకలు.

మామిడిపిందెలను గిల్లుకుంటున్న చిలకలు కి.. కీ.. క్కీ… అంటూ ఎగిరిపొయ్యాయి.

తలో దిక్కున పరిగెత్తారు ఫారెస్ట్ వాళ్లు. గుంటిగాని చేతికి బేడీలు వేసుకున్న అబ్బాయి గుంపులో చిక్కుబడిపొయ్యాడు.

“మా మిందికే వచ్చరా.. మీ అంతు సూచ్చం” గార్డు అరుపులు గుంపులో కలిసిపోతున్నాయి.

మేస్త్రీ బామ్మర్ది వీపు వెనకపక్క దాచిపెట్టి తెచ్చుకున్న చేతి గొడ్డేలి బయటికి తీశాడు. కంటి నరాలు ఎర్రగా ఉబ్బినాయి.

టవ్వాల కట్టుకున్న పిలగాడు “రేయ్..” అంటూ గుడ్లురుముతున్నాడు.

గొంతులో అరుపు ఉన్నా ‘యుద్ధంలో అంతసేపూ వీరవిహారం చేసి శత్రు శిబిరంలో ఒంటరిగా చిక్కిన సైనికుని భయం’ కనిపిస్తోంది అతని కళ్ళలో.

మేస్త్రీ బామ్మర్ది ఆక్రోశమంతా ఆవేశంగా మారింది. ఆవేశం బుద్ధిని తినేసింది.

ఆ పిలగాడి మీద ఒకే దెబ్బ.

ఒకే ఒక దెబ్బ. కంటి దగ్గర పడిన ఏటు కిందికి చీల్చుకుంటూ పీక వరకూ.

అంతా నిశ్శబ్ధం.

‘అమ్మ్…ఆ….’ అనే చావు కేక సెల మొత్తం ధ్వని పలుకుతూనే ఉంది ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ.

అంతా రెప్పపాటు కాలం. ఇకపై రెప్పలు వాలని కనుగుడ్లు ముందుకు పొడుచుకుని వచ్చాయి.

మెదడు నుంచి రావలసిన సంకేతాలు అందక కాళ్లూ చేతులూ తనకలాడుతున్నాయి. అంతసేపూ పైకి ఎగజిమ్మిన రక్తం నిదానించింది.

గుంటిగాని ఒళ్లంతా రక్తపు మరకలు. పదిరిపోతున్నాడు మనిషి. చేతికి కట్టుకున్న టవ్వాల ఇంకా అలాగే ఉంది ఎర్రగా.

ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ క్యార్.. క్యార్.. మంటూ కోతుల అరుపులు. ‘బలమున్నోడిదే రాజ్యం’ అనే ఆటవిక న్యాయాన్ని తిరిగి అడవికే అరిచి గుర్తుచేస్తున్నాయి కాబోలు.

కొండముచ్చులు కొమ్మలమింద ఎగురుకుంటూ చిటారు కొమ్మకు రావడం, నెత్తురు చూడటం ‘ఊవ్.. ఊవ్…’ అని వికృతంగా అరుస్తూ భయంతో వెనక్కి పరిగెత్తడం.

దొరికితే మన బతుకూ అంతేననుకున్నారేమో మిగతా నలుగురు ఫారెస్టోళ్లూ అటునుంచటే ఎటో.

తెరిచిన నోటి నుంచి కొంచెం బయటికొచ్చి పక్కకు వాలిన నాలుక ఎన్నెన్నో ప్రశ్నలు సంధిస్తోంది మౌనంగా.

కూటి కోసం కూలి కోసం యజమాని తరపున చెట్లు కొట్టాలని మీరు.

అదే కూటి కోసం అదే కూలి కోసం ప్రభుత్వం తరపున మిమ్మల్ని ఆపాలని మేము.

నదికి ఆ గట్టునొకరు ఈ గట్టునొకరు. ఇద్దరి ప్రతిబింబం నదిలోనే.

ప్రాణమే న్యాయమా?

ఏమో..!

అక్కడున్న అందరికీ ఫారెస్ట్ వాళ్ల నుంచి ఎలాగోలా తప్పించుకోవాలని ఉన్నెది కానీ ఈ రకంగా మాత్రం కాదు.

పోయిన ప్రాణం ఒక్కటే. కానీ ఒక్కొక్కరికి ఒక్కోలా.

కొందరికి అన్నో, తమ్ముడో.

మరికొందరికి కొడుకో, అల్లుడో..!

గుంటిగాని కళ్ళ నుండి కారుతున్న నీళ్లు తప్ప సెల మొత్తంలో ఆకు కూడా కదలనంత శ్మశాన వైరాగ్యం.

ఏడుపు కాదది. కంటికి కనిపించని వ్యథ.

ఆరోజు రాత్రి పెద్ద యుద్ధమే జరిగింది. గుంటిగాడు మనిషిలా లేడు. పళ్లు పటపట కొరికాడు. జుట్టు పీక్కున్నాడు. అడ్డొచ్చినోళ్లందరినీ పిడిగుద్దులు గుద్దేడు. మేస్త్రీగాని బామర్ది మిందికి దూకి గోర్లతో రక్కేడు.

అయిదారుమంది పట్టి బలవంతంగా చెట్టుకు తాడుతో కట్టేస్తే ఆక్రోశంతో రంకెలేశాడు. అరిచి ఏడ్చి శోసొచ్చి పడిపోయాడు.

మరుసటి రోజు మధ్యాహ్నం అవుతుండగా రెండు మూడు కొండ వరుసల అవతల తుపాకీ గుండు పేలిన చప్పుడు. శవాన్ని తీసుకువెళ్లడానికి ప్రభుత్వ లాంఛనమేమో.

రెండ్రోజులపాటు ఎక్కడా కుదురులేదు. పిల్లి కదా పిల్లల తావులు మార్చినట్టు ఈ లోయనుంచి ఆ కొండకు, ఒక రేవు నుంచి మరో గుండానికి.

మేస్త్రీ ఒక్కడే సాయంత్రం ఉత్తర దిక్కుగా వెళ్లి నడిజాముకు తిరిగొచ్చి ‘ఒక నెల పాటు ఏ చెట్టూ కొట్టేది లేదు. రెండు మూడు రోజుల్లో వెళ్లిపోదాం’ అన్నాడు.

గుడ్డిలో మెల్ల. ఈ నెత్తుటి మరకల్లో మగ్గిపోడం కంటే అదే మేలు.

ఇంగో చోటుకు నడిపించారు. దాదాపు కొండ వరుసల తూర్పు హద్దుకు చేరుకున్నాం. కిందంతా లోయ. పెద్ద గుండమొకటుంది.

‘రేపు పొద్దుగూకినాంక అడవి నుంచి బయటికి చేరుకుని ఎవరి దోవన వాళ్లం పోతాం. ఈ రోజుకిక్కడే మకాం’ అని చెప్పారు.

రాత్రి పడుకునే ముందు మేస్త్రీ పక్కకు పిలిచి “నరికింది ఎవరంటే గుంటిగాడని చెప్పు” అన్నాడు.

“ఎవరికి?”

“ఎవరైనా అడిగితే..” నసిగాడు.

“చంపింది మీ బామ్మర్ది కదా” కటువుగా పలికింది నా గొంతు.

“వాని పేరు చెబితే అందరం ఇరుక్కుంటాం. గుంటిగాడైతే..”

“ఆ గుంటిగాడైతే..!” రెట్టించేసరికి ఏదో గొనుక్కుంటూ పక్కకు నడిచాడు.

నాతో మాట్లాడినట్టే మేస్త్రీ మిగతా వాళ్లతోనూ ప్రత్యేకంగా మాట్లాడటం నా కంట పడకపోలేదు.

వీళ్లేం చెయ్యబోతున్నారోనని నా భయం, చావును దగ్గరగా చూసిన గుంటిగాని బెదురు, అయిదారు మంది మౌనం తప్ప మిగతా అందరూ ఖూనీ తాలూకు గాయం తుడిచేసుకుంటున్నట్టే ఉంది.

మధ్యాహ్నం బువ్వ తిన్నేంక డెబ్బై మందిని మూడు గుంపులుగా విడిపొమ్మన్నారు. ఒక గుంపు కొండెక్కి దక్షిణంగా పోవాలి, మరో గుంపు నిండు తూర్పుగా దిగిపోతుంది, మిగిలిన పదిమంది గుండం దగ్గర దిగి ఈశాన్యంగా నడిచి రోడ్డెక్కాలి.

ఆ పదిమందిలో నేను, గుంటిగాడు, మరికొందరు. ఏదో అనుమానంగా తోచింది. అడిగాను.

“మీకేం కాదు. ఏదైన్నా అయితే బయిటికి తెచ్చే బాధ్యత నాది” ఏదేదో చెప్పాడు మేస్త్రీ.

ఉత్తిసిత్తు పిట్ట ఒకటి ‘ఉత్తిత్తీరు.. ఉత్తిత్తీరు…’ అరుచుకుంటూ బలంగా వీస్తున్న పడమటి గాలికి ఎదురెగరలేక గాలివాలులో కొట్టుకుపోతోంది ఈశాన్య దిక్కుగా.

నిలువుకొండ నుంచి రాళ్ల మీద జారుకుంటూ గుండం దగ్గరికి దిగాం. రెండు మూడు కిలోమీటర్ల మేర ఒకటే లోయ. బాగుంది. అటు ఇటు నిలువెత్తు కొండలు.

ఎవరైనా వచ్చినా తప్పించకునేదానికి కూడా లేదని మనసులో అనుకుంటుండంగానే ఉన్నట్టుండి ఇరవై మంది పోలీసులు చెట్ల చాటు నుంచి బయటికి వచ్చారు ఎవరో చెప్పినట్టు. అందరి చేతుల్లో మిషన్‌గన్‌లు.

కదిలేదానిక్కూడా లేకపోయింది. పరిగెత్తి తూటాలకు నేలకొరగడంకంటే లొంగిపోవడమే మేలు.

వ్యాన్‌లో ఎక్కించారు. వ్యాన్‌కు ముందొక జీబు, వెనకొక జీబు.

“వారం, పదిరోజుల్లో బయటికి పంపిచ్చరాన్నా..!” అమాయకంగా అడిగాడు గుంటిగాడు.

ఏమని చెప్పాలి?

ఎలుకకు పిల్లి..

పిల్లికి కుక్క..

కుక్కకు తోడేలు..

తోడేలుకు సింహం..

జాతి వైరం.

నిన్నటి వరకూ వాడు తమలో కూలీ. నేడు మేస్త్రీ. బుద్ధి చూపించాడు.

స్టేషన్లో అందరినీ మోకాళ్లమింద నిలబెట్టి ఫొటోలు తీశారు. రాత్రంతా అక్కడే. ఉదయన్నే మళ్లీ వ్యాన్‌లో ఎక్కించి ఇంకో చోటుకు. ఈసారి జనావాసాలకు దూరంగా.

వ్యాన్ దిగుతుంటే కొన్ని జతల కళ్ళు జాలిగా, మరికొన్ని రోజూ పంటను నాశనం చేసే అడవిపందుల గుంపులో కొన్ని పందులు బోనులో చిక్కితే రైతు గదా చూసినట్టు అదో రకంగా.

అందరినీ తీసుకెళ్లి ఒక పెద్ద గదిలో నిలబెట్టారు. పగలే రేయిలా చీకటి నిండిన గదిలో బూజు చాటున గుడ్డి బల్బు ఒకటి వెలుగు నింపడానికి ప్రయత్నిస్తోంది.

ఒక పోలీసాఫీసరు వచ్చి బల్లపై కూర్చున్నాడు. వెనకాల మరో ఇద్దరు. అందరివైపు చూస్తూ “ఎవర్రా నరికింది”? అడిగాడు.

అందరి చూపులూ గుంటిగాని వైపే. గుంటిగాడు మాత్రం కిందికి చూస్తున్నాడు అమాయకంగా.

వాళ్ల చూపులను పసిగట్టిన పోలీసాఫీసరు “ఎవర్రా” రెట్టించి అడిగాడు గుంటివాని వైపు కోపంగా కళ్ళెగరేసి.

“మె.. మ్మె.. మ్మేస్త్రీ బామర్ది సా..” భయంగా చెప్పాడు గుంటిగాడు.

అవునా అన్నట్టు తలూపి “ఎవుర్రా చంపింది” చుట్టూ చూశాడు.

“గుంటిగాడే సార్” ఒకరిద్దరి నోరు అతి బలవంతం మింద పెగిలితే మరికొందరి వేళ్లు మాత్రం గుంటిగాని వైపు చూపిస్తున్నాయి వణుకుతూ.

దిగ్గున తల తిప్పేడు గుంటిగాడు వీళ్లేం చెప్తున్నారో అర్థంకానట్టు.

ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి మేస్త్రీ చెప్పిన మాటల్లోని అంతర్యం అర్థమైంది.

నా వైపు చూశాడు పోలీసాఫీసరు.

మౌనంగా నిలబడ్డాను. ‘కూలోని వేలితో కూలోని కంటిని పొడిపించే బతుకాట’ను ప్రత్యక్షంగా చూస్తూ. అయితే అందులో ఆటబొమ్మ కూడా మళ్లీ ఆ కూలోడు కావడమే విచిత్రం.

‘మేస్త్రీ బామ్మర్ది సార్..’ నా సమాధానంతో ఆయనకు అవసరం లేకపోయింది.

రెండడుగులేసి గుంటిగాని దగ్గరికి వెళ్లాడు.

భయంతో చేతులు కట్టుకున్నాడు గుంటిగాడు.

“చెప్పురా ఎందుకు నరికావు?” మాటలో ప్రశాంతత.

“నేను.. నేను కాద్సార్. మేస్త్రీ..” చెప్పబోయేంతలో ఫాట్‌మని శబ్దం. గుంటిగాని చెయ్యి వాని చెంపమింద ఉంది. ఒళ్లు పక్కనున్న వాళ్లమింద తూలిపడింది.

చొక్కా పట్టుకులాగి “కొడకల్లారా! ఎర్రచందనం నరకడమే తప్పురా అనుకుంటే అది ఆపడానికొచ్చిన వాళ్లను కూడా నరుకుతార్రా? అంత ధైర్యం ఎక్కన్నుంచి వచ్చిందిరా మీకు!” ఒక్కో వాక్యానికి ఒక్కో దెబ్బ.

ఫాట్.. ఫాట్…

‘నేను కాద్సార్’, ‘అమ్మా..’, ‘అబ్బా..’ తప్ప వేరే మాటలేదు. అవకాశం లేదు. ఇవ్వలేదు.

మొహం కమిలింది.

జుట్టు చెదిరిపోయింది.

చెట్టుకంటూ చెప్పడానికి నోరుంటే ‘మీరు వేసే ఒక్కో గొడ్డలిపోటు ఇంతకు మించిన నరకం’ అని ఇలాగే రోదిస్తుంది కాబోలు.

మా అందరికీ కూడా గుంటిగానికి ఏమాత్రం తగ్గకుండా వడ్డించారు.

‘కొట్టాకు సార్..’, ‘తెలీక వచ్చినా సార్..’, ‘ఇంగెప్పుడూ రాను సార్..’ ‘నీ కాళ్లకు దండం పెడ్తా సార్..’, ‘సార్..’, ‘సార్..’, ‘సార్…’

గంటా రెండు గంటలపాటు గది మొత్తం ప్రతిధ్వనిస్తూనే ఉంది.

ఇద్దరిద్దర్ని కలిపి అయిదు గదుల్లో వేశారు. మరుసటి రోజు ఎవ్వరూ రాలేదు. అయిపోయిందిలే అనుకున్నాం.

కానీ తర్వాత తెలిసింది, అసలుది అప్పుడే మొదలైందని.

ఉదయమొక బ్యాచ్ సాయంత్రమొక బ్యాచ్. ఒకరికి మించి మరొకరు.

రూల్ కర్ర, వెదురు బర్ర, ఫైబర్.

అరికాళ్లు, పిర్రలు, అరిచేతులు, మోకాళ్లు, మోచేతులు, వీపుమింద అప్పుడప్పుడూ.

ఒక్కో దెబ్బా నరకం.

‘పెండ్లాం పిల్లోళ్లు గలోన్ని సార్’, ‘కూళ్లెక్క కోసం వచ్చినా సార్’, ‘ఎవురు తొడకచ్చినారో కూడా తెలీదు సార్’ ఎంత మొత్తుకున్నా దెబ్బలు ఆగవు. కొట్టడం ఆపుతారని వాళ్ల కాళ్లు గెట్టిగా పట్టుకుంటామా, వాళ్ల కోపం మరింత పెరుగుతుంది.

కాళ్లు గెట్టిగా జాడిస్తారు. మూతే పగులుతుందో, గోడకే కొట్టుకుంటామో.

తీరా దెబ్బలన్నీ అయిపొయినాక అరిచేతులు, కాళ్లు గెట్టిగా నేలకు కొట్టమంటారు. నొప్పితో కొట్టడానికి ఆలోచిస్తుంటే రక్తం గడ్డకట్టి సచ్చిపోతార్రా అని మాటలతో భయపెడతారు.

పచ్చిపుండు మింద ఉలి పెట్టి సుత్తితో కొడుతున్నట్టుగా ఉంటుంది.

ఇంగా ఎందుకు బతికే ఉన్నామురా దేవుడా అనిపిస్తుంది. దీనికన్నా తూటాలకు పోయింటే మేలేమో!

అదే ఒక్కోసారి బయటికి వస్తుంది నోట్లోంచి.

‘ఎవరు పంపిచ్చారు?

మీ వెనుక ఉన్న వాళ్లెవరు?

చెప్పు చెప్పు’ అంటారు.

ఎవరని చెప్పను?

ఏమని చెప్పను?

‘కూలిబాటుకుంటే చాలు ఏ పనైనా చేస్తా’ అంటే పలానా వాళ్లను కలువు అని చీటీ రాసి పంపిచ్చిన మా ఊరి తెల్లచొక్కా గురించి చెప్పేనా?

ఆ చీటీ ఎక్కించిన బస్సు గురించి చెప్పేనా?

ఆ బస్సు వీడ్కోలు చెప్పిన రైలు గురించి చెప్పేనా?

ఆ రైలు ఆపిన భాష తెలియని ప్రదేశం గురించి చెప్పేనా?

అక్కడ ఎక్కిన టమాటా వ్యాను నెంబర్ చెప్పేనా?

అక్కన్నుంచి చేరిన అడవి గురించి చెప్పేనా?

గొడ్డలిచ్చి నరకమన్న చెయ్యి గురించి చెప్పేనా?

ఒక్కటి మాత్రం నిజం.

ఏ పూటకాపూట, ఏ రోజుకారోజు చిల్లర తప్ప నోట్లు ఎరగని బతుకుల్లో ఇంటినుంచి బయల్దేరేప్పుడు ఇంట్లో ఇచ్చొచ్చిన యాభై వేల డబ్బులు, సంవత్సరం తర్వాత తెచ్చే యాభై వేలతో మరో సంవత్సరం భరోసా. అవి మాత్రమే నిజం.

మిగతాదంతా..

నాదన్నా ఒక రకం. పిల్లోళ్లు పెద్దోళ్లయ్యారు. వాళ్ల బతుకు వాళ్లు బతగ్గలరు. కానీ గుంటిగాడు?

నెలల కొడుకు

లోకమెరుగని బిడ్డ

వీన్నే నమ్ముకున్న భార్య. ఆ అమ్మాయికి కూడా పదైదు పదారేళ్లు ఉంటాయేమో.

దొరికినప్పుడు ఎలాగోలా విడిపిస్తారనే అనుకున్నాడు.

స్టేషన్‌కు వెళ్లినప్పుడు కోర్టుకు పంపిస్తారనుకున్నాడు.

జైలుకెళ్లినప్పుడు కొడ్తే కొడ్తారు రెండు, మూడు నెలల్లో ఇంటికి పోవచ్చనుకున్నాడు.

నాలుగు రోజులు.

నాలుగే నాలుగు రోజులు.

ఒంటి మీద పడే ఒక్కో దెబ్బా

నేటిని ప్రశ్నార్థకం చేసింది.

రేపటి ఆలోచనను ఛిద్రం చేసింది.

ఏదో ఒక రోజు ఇంటికి పోతామనీ

పోయినా ఒకప్పటిలా పని చేసుకుని బతగ్గలమనే నమ్మకం రెండూ లేవు.

కానీ ఏదో పాశం మాత్రం జీవున్ని లాక్కొస్తోంది.

తిండి.. దెబ్బలు.. నిద్ర.

తిండి.. దెబ్బలు.. నిద్ర.

నేడు లేదు, రేపు లేదు. గతం మాత్రమే నిజం అనే నిరాశలో కూరుకుపోతుండగా ఫారెస్ట్ గార్డ్ వచ్చినప్పుడు ‘చంపింది వీడు కాదు ఇంగొకడని’ చెప్తాడని ఎక్కడో చిన్న ఆశ.

అడియాశే అయింది. ఆయనేం చెప్పి వెళ్లాడో ఏమో గానీ ఆక్రోశం మరింత పెరిగినట్టు పోలీసోళ్ల చేతిలో కొత్త ఆయుధం.

లారీ టైరును క్రికెట్ బ్యాట్‌లా కోసి కొట్టిన దెబ్బలు మాత్రం ప్రత్యక్ష నరకమే. దెబ్బ తగిలిన చోటల్లా బెత్తెడు మందాన వేలెడెత్తు పొంగుతుంది. పిర్రలకు, కండ ఉన్న మెత్తని ప్రదేశాల్లో తగిలితే స్పర్శ కూడా పోతుంది కొద్దిసేపు.

అరిచేతులు, అరికాళ్లు నిప్పులు కొలిమిలో పెట్టినట్టు భగభగ మండుతాయి.

ఆ నొప్పి తట్టుకోలేక బతిమలాడి, బామాలి, ఓపిక నశించి కాళ్లు రెండూ పట్టుకున్నాడు గుంటిగాడు. తుళ్లిపడ్డాడు పోలీసు. అంతే.

‘ఎంత కొవ్వురా నీకు. నన్నే పడెయ్యాలని చూస్తావా’ అంటూ మరింత చెలరేగిపొయ్యారు. ఎక్కడపడితే అక్కడ, ఏది దొరికితే దానితో తుక్కుతుక్కు కింద నలగ్గొట్టారు. అడ్డొచ్చిన నన్ను కూడా.

ఇంకొంచెంసేపు కొడితే పోతాం అనుకున్నారో, లేక కొట్టి కొట్టి వాళ్లకే అలుపొచ్చిందో తెలియదు గానీ కొట్టడం ఆపి, బీగం వేసుకుని వెళ్లిపోయారు.

అతి కష్టం మీద నోరు కదిపాడు వెల్లకిలా పడుకుని ఉన్న గుంటిగాడు. కళ్ళు మూతలు పడుతున్నాయి. నోటినుంచి కారుతున్న రక్తం పైన పక్కులు కట్టింది.

“న్నా! ఇంగ నేను బతకలేనున్నా. పొయ్యేలోపు ఒక్కసారి.. ఒకే ఒక్కసారి నా కొడుకును, కూతురును చూపించమనున్నా” ఊపిరంతా ఉగ్గబట్టుకుని ఒక్కో పదమే చెప్తున్నాడు గుంటిగాడు.

పలకాలని నోరు తెరిచేంతలో దగ్గొచ్చింది. పొట్ట, పేగులు, ఊపిరితిత్తులు, గుండె అంతా కుప్పగా పోసి కుదేసినట్టు ఏదో తెలియని బాధ ఒళ్లంతా.

“న్నా.. ఓన్నా..” వినపడుతోంది కానీ పలకడానికి ఓపిక లేకపోయింది.

పలికినా కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు.

నా మీద పెట్టిన ఎర్రచందనం కేసు కోర్టుకు పోతే అయిదేళ్లో, ఏడేళ్లో. బయటికి వస్తా. కానీ గుంటిగానిది?

ఖూనీ కేసు.

పద్నాలుగేళ్లో.. జీవిత కాలమో!

సరిపోదనుకుంటే ఉరికొయ్యకు వేలాడదీస్తారేమో!

రేపటి వాని బతుకు తీపిని చంపడానికి ఈరోజు నేనెవ్వరు?

తర్వాత పిలవలేదు గుంటిగాడు.

మధ్యలో మాత్రం ఒకతను వచ్చి మొహం మింద నీళ్లు చల్లివెళ్లాడు, బతికున్నామా లేదా చూడ్డానికని.

ఒకరోజు పూర్తిగా గడిచింది.

లేవలేదు గుంటిగాడు. గుంటిగాడే కాదు, నేనూ లేవలేదు. లేవాలనే ఉంది కానీ ఒంట్లో శక్తి లేదు.

టక్.. టక్.. టక్…

బూట్ల చప్పుళ్లు. ఇటే వస్తున్నట్టున్నాయి.

కక్కూసు దొడ్డి మూలన కిచకిచమని చెప్పులు కొరుకుతున్న ఎలుకల శబ్ధం ఉన్నట్టుండి ఆగింది. భయంతో బొరియలోకి పరిగెత్తింటాయి.

వచ్చారు. వచ్చారు.

నీడ లోపలికి పడుతోంది.

టప.. టప… టప….

లాఠీతో జైలు ఊచల్ని తాకించిన శబ్ధం.

నిన్నటి నరకం కళ్ళముందరకొచ్చింది.

భయం. వణుకు. ఒళ్లంతా పదురు.

మూయాలి.

కళ్ళు మూసుకోవాలి.

తెరిస్తే ఇక అదే శాశ్వత నిద్ర.

గుంటిగాడు.. గుంటిగాడు…

సగం తెరిచిన కన్ను చాటునుంచి కనిపిస్తున్నాడు. వాని శరీరంలో ఏదో చిన్న కదలిక.

వద్దు. కదలొద్దు.

హ్హా.. గెట్టిగా ఊపిరి పీల్చిన శబ్ధం. వెల్లికిలా తిరిగాడు కాబోలు.

బీగం తెరుచుకుంటున్న చప్పుడు.

*

సీమ బతుకే నా నేపథ్యం :వివేక్ లంకమల

  • హాయ్ వివేక్! మీ గురించి చెప్పండి.

హాయ్! మాది కడప జిల్లా బద్వేలు మండలం లంకమల కొండలు, సగిలేటి మధ్యన నందిపల్లె అనే గ్రామం. కడపలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివాను. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాను.

  • చిన్నప్పటి నుంచి సాహిత్య పఠనంపై ఆసక్తి ఉందా?

లేదనే చెప్పాలి‌. నాకు పుస్తకాలంటే స్కూల్లో, కాలేజీలో ఉండే తెలుగు పాఠాలే! 2014లో ఇంజినీరింగ్ తర్వాత కొంతకాలం ఖాళీగా ఉన్నాను. ఆ సమయంలో మొదటిసారి యండమూరి వీరేంద్రనాథ్ నవలలు చదవడం మొదలు పెట్టాను. అవి చాలా ఆసక్తిగా అనిపించాయి. ఆ తర్వాతే ఇతర పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను. అలా ‘అతడు అడవిని జయించాడు’, ‘ఒంటరి’ నవలలు చదివినప్పుడు వాటిలో మా ఊరిలో మాట్లాడే మాటలు కనిపించాయి. పుస్తకాల్లో మా ఊరి భాష కూడా ఉంటుందన్న విషయం అప్పుడే తెలిసింది. అలా 2019 దాకా చాలా పుస్తకాలు చదివాను, ఇప్పుడు కూడా చదువుతున్నాను.

  • కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

కథల కన్నా ముందు ఫేస్‌బుక్‌లో అనుభవాలు రాయడం మొదలుపెట్టాను. తర్వాత నవల. అది ‘మల్లిగాని బత్తెం’ దానికో నేపథ్యం ఉంది. ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒకసారి మా ఊరి మిత్రులతో కలిసి అడవికి వెళ్లాను. అది ఎండాకాలం. నాకు విపరీతంగా దాహం వేసింది. కానీ తాగేందుకు నీళ్లు లేవు. దాహం తట్టుకోలేక ఏమైపోతానో అని భయం వేసి, ఒక్కన్నే ఇంటికి నడుచుకుంటూ వచ్చేశాను. ఆ ఆకలి, భయాలు కలగలిసిన అనుభవమే ‘మల్లిగాని బత్తెం’ నవలకు మూలం. కథ జరిగే మా ప్రాంత మాండలికంలో మొదట రెండు భాగాలు రాసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాను. వాటికి చాలా మంచి స్పందన వచ్చింది. దానికి ప్రేమ, గ్రామీణ నేపథ్యం, వ్యవసాయం, సవాళ్లు కలిపి మొత్తం 16 భాగాలు రాశాను.

  • తొలి కథ ఎప్పుడు రాశారు?

ఫేస్‌బుక్ వేదికగా దాదాపు 30 దాకా కథలు రాశాను. అందులో నాలుగు కథలు ప్రచురితమయ్యాయి. ‘ఓబుల్రెడ్డి ఎద్దులు’ అనే కథ ఫేస్‌బుక్‌లో రాస్తే దాన్ని మారుతీ పౌరోహితం గారి ద్వారా చదివిన రచయితలు ఇనాయతుల్లా, కెంగార మోహన్ తమ సంపాదకత్వంలో వచ్చిన ‘వాన మెతుకులు’ పుస్తకంలో వేశారు. ఫేస్‌బుక్‌లో కాకుండా బయట ప్రచురితమైన తొలి కథ అదే! ఆ తర్వాత రాసిన ‘కరువు సీమ’ కథకు సింగమనేని స్మారక కథల పోటీలో రెండో బహుమతి వచ్చింది. ‘నాటు పడింది’ కథ 2021 నమస్తే తెలంగాణ – ముల్కనూరు గ్రంథాలయం కథలపోటీలో బహుమతి అందుకుంది, ‘పిడుగు’ కథ ‘తెలుగు తల్లి కెనడా డే’ పోటీల్లో బహుమతి పొందింది.

  • మీ కథల్లోని అంశాలు ఎక్కువగా రైతులు, అడవి, పల్లెల నేపథ్యంలో ఉంటాయి. దానికి కారణమేంటి?

నేను పుట్టి, పెరిగిన ఊరు, నేను చూసిన జీవితాలు. ఇవే నా కథల్లో కనిపిస్తాయి. నేను రాసిన ప్రతి కథా కొండాకోనల వెంట, నదుల వెంట చేసే ప్రయాణంలోనే రూపుదిద్దుకుంది. నేను చూసిన మనుషులు, పరిసరాలు అందులో భాగమవుతాయి.

  • ఇంకా ఎలాంటి రచనలు చేయాలని ఉంది?

మూడేళ్లుగా లంకమల, నల్లమల, పెన్నా, సగిలేరు, చెయ్యేరు పరివాహకంలో నా ప్రయాణ అనుభవాలతో త్వరలో ‘లంకమల దారుల్లో’ అనే పుస్తకం వస్తోంది. కడప జిల్లా చెయ్యేరు పరివాహకంలో 2021లో వరద వచ్చింది. అది ఎంతోమంది జీవితాల్లో విషాదం నింపింది. వారి జీవన విధానం గమనిస్తున్నాను. ఆ నేపథ్యంలో త్వరలోనే నవల రాస్తాను. నా చుట్టూ ఉన్న సమాజంలో, ముఖ్యంగా రాయలసీమ జీవితాల్లో నేను గమనించిన మరికొన్ని అంశాలను కథలుగా మలుస్తాను.

*

వివేక్ లంకమల

15 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగా రాసారు బ్రదర్..👌 చదువుతుంటే కళ్లముందు జరుగుతున్న అనుభూతి వచ్చింది.

  • కథ,పరిచయం బాగుంది. ఫేస్బుక్ వేదికగా సాహిత్యాన్ని పరిచయం చేసుకొని తక్కువ సమయం లో ఇన్ని కథలు, నవల రాయడం అభినందనీయం..Way to go👏 Waiting for more from Vivek Lankamala 👍

  • వివేక అన్నా బాగుంది అన్నా ఇలాంటి ప్రపంచానికి తెలియని ఎర్రచందనం కథలు చాలా ఉన్నాయి 👍👌🙏

  • కథ బాగా రాసినావు వివేక్! కొంత క్లుప్తీకరించి వుంటే యింకొంచెం పదునుగా వుండేది.
    అభినందనలు.

  • కథలు అందరూ రాస్తారు. కానీ కదిలించే కథలు, మనసుని తడిపే వాస్తవాలు మాత్రం ఇలా కొందరే రాయగలరు. చాలా కదిలించింది వివేక్ నీ కథ.

  • కథ చాలా బాగుంది వివేక్,
    కథనం, యాస ఇంకా బాగుంది.
    ఇప్పటి కాలానికి తెలీని “తెల్లె ” లాంటి పదాలు ఉపయోగించడం మరీ బాగుంది.

    …………………. శ్రీనివాస్ దొండ్లవాగు

  • గుంటి గాడు ఉన్నాడా పోయాడా అని మాత్రం తెలియలేదు

  • సీమ పల్లెలో పుట్టిన ఈ పిల్లగాడు ఊరు గురించి, అడవి గురించి అద్భుతంగా రాస్తాడు. సీమ యాసలోనే ఓ ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ ను అద్భుతంగా పట్టుకున్న రచయిత. సాఫ్ట్ వేరు ఉద్యోగం చేస్తూ రచనలు కొనసాగిస్తున్న అభిరుచి అభినందనీయం. కథ బాగుంది. సారంగలో వివేక్ ఇంటర్ వ్యూలో అనేక విషయాలు తెలిసాయి. Congrats Vivek . Thanks saranga

  • చాలా బాగుంది అన్న …నీకే ఇలా జరిగినట్లు పాత్రలో నిమగ్నమై రాసవు అన్న…🙏

    – GV Raju yadav

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు