ఎర్రమట్టి గాజులతో భారతీయత్వ దర్శనం

“The best way to express gratitude is to recognize the sorrows of other people.”

― Benyamin, Jasmine Days

కొటేషన్ కి పూర్తిన్యాయం చేసిన కవితా సంకలనం రేణుకా అయోలా గారి “ఎర్రమట్టి గాజులు”. జీవిత సంఘటనలన్నిటినీ ఏర్చి కూర్చి పేర్చిన ఓ సమాహారం. ఓ మంచి పుస్తకం చదూతూన్నప్పుడు ఓ పేజీ తిరగెయ్యటమే ఓ అనుభవంగా కొన్ని పుస్తకాలే దొరుకుతాయి. అందులో ఇదొకటి. ఉన్నవి నలభై నాలుగు కవితలే ఐనా ఒక్కొక్కటీ హత్తుకునేవే. “నాన్నను పోగొట్టుకుని” అనే ఓ నెగటివ్ టైటిల్ కవితతో పుస్తకం ప్రారంభం ఐనా అది కవయిత్రి నోస్టాల్జిక్ భావప్రకటనే.

“ఇల్లు ఖాళీగా లేదు/ ఓ చీకటి గుహ దేహంలోకి ప్రవేశించినట్టుంది” అన్న ఈ వాక్యాలతో మొదటి పేజీ ముగిసినా రెండొ పేజీలోకి వెళ్ళటానికి మనసొప్పదు.

తన ఈ సంకలనం ఓ స్త్రీ ప్రయాణంగా చెప్పుకున్న రేణుకా అయోలా మొత్తం కవితల్లో నోస్టాల్జియానే ప్రధాన కవితా సాధనంగా తీసుకున్నట్టు కనపడుతుంది. (నోస్టాల్జియా అంటే ఏంటని అడగొద్దు. వీలైతె ఈ పదానికి అర్ధం కోసం ఆంగ్ల డిక్షనరిల్లో మాత్రమే వెతకండి. )

కొంతమంది కవులు తమ భావజాలాన్ని పాఠకులపైకి వెదజల్లుతారు. మరికొంతమంది పాఠకుల ఆలోచనలనే తమ వాక్యాల్లో ఇముడ్చుకుంటూ తమ అభిప్రయాలని కూడా జతచేర్చుకుంటూ రాస్తుంటారు. రేణుకా ఈ రెండీంటినీ సమయోచితంగ వాడారనే అనుకోవాలి. ఉదాహరణకి ఇది చూడండి

ఇంక ఏం ఈ లేదు ఈ రోజులో అనుకున్న ప్రతీ సారీ / సూదిలో దారం కొత్త రొజుని కుట్టి చూపిస్తుంది” ఇందులోనే మరో భావప్రకటన ఇలా ” ఊదారంగు డిసెంబరాలు/ జీవితం చూపుల్లో విరబూస్తాయి” ఊదారంగు జీవితంలోని ఓ వెలితిని, చరమాంకాన్ని చెప్పకనే చెప్తాయి.

ఈ వాక్యం పేజీ చివరన ఉంటుంది. ఇంతకు ముందు చెప్పినట్టు ఈ పేజీని వదిలి వెంటనే మరొ పేజీలో కి వెళ్లబుధ్ధికాదు. ఎందుకంటె అక్కడె మనమేదొ ఓ సాలిగూడులోకి ఇరుక్కు పోయిఉంటాం కదా.

ఇక ఈ సంకలనానికి శీర్షికగా రాసుకున్న “ఎర్రమట్టి గాజులు” కవిత భలేగా ఆకట్టుకునేదే.

“అమ్మని చూడాలంటె ప్రయాణించాలి/ నిద్రపోతున్న గాజులని సవరించాలాంటే ప్రయాణించాలి/ పక్షిలా నేను/ రెక్కలు కట్టుకుని దృశ్యాల వెంట వాలుతున్నాను/బాల్యం యవ్వనం స్నేహితురాళ్ళు/ రెక్కలమీద కూర్చుని కథ చెప్తునట్టుగా ఉంది” ఇక్కడ నాకు సర్ ఫిలిప్ సిడ్నీ గుర్తుకొచ్చాడు, అతనిలా అంటాడు Poetry is a “speaking picture.” అని. అది నిజమే కదా అనిపించె వాక్యాలివి.

ఫిలిప్ సిడ్నీని గుర్తుకుతెచ్చే మరొ కవిత “గ్రాండ్ కెన్యాన్”. కొలరాడో నదిని చూస్తూ ఆమె రాసిన ఈ వాక్యాలు తప్పక చదవాల్సిందే.

“కళ్ళనిండా కొన్ని వేల చిత్రాలు/నక్షత్రాలని లెక్కపెట్టినట్లు వాటిచుట్టూ తిరిగినా/వేళ్లమీద ఒక్కభావం కూడా వాలటంలేదు ” ……..”రంగులన్నీ గుండె గోడమీద అమ్మకానికి పెట్టి/ ఆకుపచ్చని కొలరాడో నదిలోకి ద్దూకి/ మలుపు రహస్యంలో వొదిగిపోతానేమొ”

 

మ్యాస్కులిజం లేదా మ్యాస్కులినిజం (Masculinism) — పదం ఏదైనా అర్ధం ఒక్కటె.

“ఒక సండాసు కథ” ఈ సంకలనంలో చెప్పుకోదగ్గ కవిత. “అర్ధరాత్రి శానిటరీ ప్యాడ్ అవసరం/ నిద్రని చెడగొట్టి బాత్రూం తలుపులు తెరుస్తుంది” అనిమొదలైన కవితలో ఓ స్త్రీ వేదనని ఇంతకంటే చిక్కగా మరొకరు చెప్తారని అనుకోము.

మగ తృష్ణ ప్రకారం ఆ మూడురోజులు అతనికి ఆమెతో సెక్స్ కావాలి కాని తెల్లారితే ఆమె ఓ “అసుంట” ఎందుకంటే ఆమె ఆ మూడు రోజులూ ‘అపవిత్రత’ కాని రాత్రి మాత్రం ఆమె కావాలి. ఓ సామజిక వర్గపు కట్టుబాట్లపై ఇలా విరుచుకుపడిన కవితని నేను చదవటం మాత్రం ఇదే మొదటిసారి.

రాత్రి ముట్టుకొట్టులో ఆక్రమించుకున్న భర్త

నూతిమీద చేదడు నీళ్ళతో పవిత్రమై

తెల్లవారి “అసుంటా వుండు” అంటూ

తప్పుకు తిరుగున్న మగడి చేష్టల నుంచి పుట్టిన రవ్వ

తోటల్లో దొడ్లల్లో తిరిగిన మైలకి నిప్పు పెట్టింది”

మాస్కులిజాన్ని మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఎంత తప్పుగా అన్వయించారో ఈ వాక్యాల్లో సుస్పష్టం చేశారు రేణుకా అయోలా. ఈ కవిత చదూతూన్నంతసేపూ రూపీ కౌర్ అనే భారతీయాంగ్ల రచయిత్రి గుర్తుకు వస్తుంటారు. ఆమె మాటల్లో Our backs tell stories; no books have the spine to carry—Rupi Kaur (Women of Colour)

 

****

భావుకత్వపు గాఢతా తీవ్రతా ఎక్కువగా కనిపించే ఈ సంకలనంలో కొన్ని చదివాక చదువుతున్నదె చదివామా అన్న భావన కలగకమానదు. కవిత్వం అంటే కేవలం భావుకత్వాన్ని తొడుక్కున్న వాక్యం కాదుకదా! మిగిలిన కవితా సాధనాలని కూడా వాడి ఉండాల్సింది ఈమె. ఓ సంకలనం కేవలం ఓ కవితానుభవానికో లేక ఓ కవితా ప్రక్రియకో, ఓ సాధనానికో పరిమితం కాకూడదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

 

మరికొన్ని విషయాలు ఆమె మాటల్లోనే ఇలా :

 

1.మీ సంకలనానికి “ఎర్రమట్టి గాజులు” టైటిల్ గా ఎందుకు అనుకున్నారు?

మట్టి గాజులు కేవలం మన సంప్రదాయం మాత్రమే కాదు వొక సంస్కృతి కూడా. ఇందులో మా అమ్మ వున్నారు,నేను వున్నాను, మొత్తం సంకలనం వొక స్త్రీ ప్రయాణం, అందుకే ఈ టైటిల్ అనుకున్నాను.

  1. చాలా కవితలు భారతీయ వనితల జీవన విధానంపై కామెంట్రీ అనుకోవచ్చా?

స్తీ వాదం బలంగా దేశదేశాలతో పాటూ భారత దేశంలో వొక కదలిక తెచ్చింది అయినా ఇప్పటికీ ఏ మార్పు లేదు, అందుకే భారతీయ వనితల  జీవన విధానం మారలేదు అని నా అభిప్రాయం.

  1. మిమ్మల్ని మీరు వొక ఫెమినిస్ట్ కవయిత్రి గా ప్రకటించుకుంటున్నారా?

స్తీ పైనా, దేహాలపైనా దాడి జరిగినప్పుడు ప్రశ్నించే హక్కు నాకు వుంది అనుకుంటాను దాన్ని సమాజం ఫెమినిస్ట్ కవిత్వం అంటుందా, లేక మానవీయ కోణం వున్న కవిత్వం అంటుందా అనే లేబుల్స్ గురించి నేను ఎప్పుడూ పట్టించుకోలేదు.

  1. ఎడాదికి ఆర్నెల్లు అమెరికా లో వుండే మీకు రెండు దేశాల మధ్య ప్రస్పుటంగా కనిపించే భేదం? ముఖ్యంగా సమాజంలో స్త్రీల స్థితి గతుల విషయంలో….

రెండు దేశాల నడుమ నాకు కనిపించిన తేడా అభివృద్ధి. అదే సమయంలో మనదేశీయులలో కనిపించే వొంటరితనం. అది పోగోట్టుకొవడానికి ఎక్కువైన భక్తి, సంస్కృతి సాంప్రదాయాలు. ఇక్కడ స్థానికంగా ఉండే వారితో నా పరిచయం పరిమితమే ఐనా నేను చూసినంతవరకూ ఇక్కడి స్త్రీలు మనవారికంటే స్వేచ్చా స్వాతంత్రాలలో చాలా వరకూ ముందున్నారు. సో అది వారి ఉనికిని విస్తారంగా చాటుకునే అవకాశమూ, ఒంటరిగా బ్రతకగలిగే అవకాశమూ కల్పిస్తుండటంతో వారి సెల్ఫ్ రెస్పెక్ట్ మనవారికంటే ఎక్కువే అని చెప్పగలను. మరీ ముఖ్యంగా ఆర్ధిక స్వతంత్రం వారి ఆలోచనా విధానంపై చా ప్రభావం చూపుతుందని అనుకోవచ్చు.

  1. స్త్రీవాద కవిత్వం/ సాహిత్యం పై మీ అభిప్రాయం?

ఇంకా విస్తృతంగా రావాల్సి వుంది. మహిళల సంఖ్య సంఘటితం కావాలి, గ్రూపులు తగ్గాలి, సభల్లో వేదికలపై సంఖ్య పెరగాలి. కేవలం అవార్డులకోసమే కాకుండా తమ గళాన్ని ధైర్యంగా నలుగురికీ వినిపించగలిగేలా రాయాలి. అలాగే స్త్రీవాద సాహిత్యం కేవలం స్త్రీల నుంచే కాకుండా ఇంకా ఎక్కువగా పురుషుల నుంచికూడా రావాలి. సాహిత్యంలొ స్త్రీవాదం ఒక అంతర్భాగం కావాలి తప్ప అది ప్రత్యేకంగా ఉండకూడదని నా అభిప్రాయం.

*

వాసుదేవ్

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Thank you very much vasudev gaaru

    నా కవితా సంపుటి పై ఇంత మంచి సమీక్ష అందించినందుకు
    ప్రచురించిన అఫ్సర్ గారికీ ధన్యవాదాలు …

  • నేను చదివాను, నాకు చాలా బాగా నచ్చిన కవితలు. రేణుక గారికి హ్రుదయపూర్వక అభినందనలు.

  • వాసుదేవ్ గారు మీ వ్యాఖ్యానం బాగుంది. కవిత్వమంటే కేవలం భావుకత్వాన్ని తొడుక్కున్న వాక్యం కాదుగదా అన్న మీ వాక్యం చాలా నచ్చింది.

    రేణుక గారి బుక్ బాగుంది. ఆమెకు హృదయపూర్వక అభినందనలు . ఇంటర్వ్యూ లో గ్రూపులు తగ్గాలి, దేహాలపై దాడి, విదేశీ స్త్రీల ఆర్ధిక స్వేచ్చ గురించిన ఆమె అభిప్రాయాలు ధైర్యం గా చెప్పడం బాగుంది.

    • శ్రీరామ్ గారు నమస్తే. మీ ఆత్మీయ స్పందనకు నెనర్లు.

  • నేను పలకని, రాయని శబ్దాలను ఆమె కవిత్వం గా మార్చారు. మీరు ఈ రకమైన ఇంటర్వ్యూ లాంటి వ్యాసాన్ని కవయిత్రి అంతరంగాన్ని బాగా ఆవిష్కరించారు.

    అభినందనలు

    • ధన్యవాదాలు. మా ఈ కొత్త ప్రయత్నాన్ని ఆదరిస్తున్నందుకు నెనర్లు గీత గారు

  • ఎర్ర మట్టి గాజులు భారతీయ స్త్రీ జీవన విధానాన్ని ప్రతిబింబిస్తూ రాసిన సంకలనం అనొచ్చు నిస్సందేహంగా. ద్విభాషా కవి అయిన వాసుదేవ్ గారి విశ్లేషణ బాగుంది. ఆంగ్ల కవితల్ని అక్కడక్కడా ‘quote ‘ చేయటం ఇంకా అద్భుతం.

    రేణుకా అయోలా is lucky ఇలా ఓ మేటి కవి చేతిలో తన సంపుటి సమీక్ష కు
    నోచుకృవటం .👌👌

    భారతీయ వనితల జీవితంలో పెద్ద మార్పేమీ లేదు అనే కవయిత్రి ఉద్దేశంతో నేనూ ఏకీభవిస్తాను.

    ఈ సమీక్ష చదవి ఆస్వాదించటంలో జాప్యం జరిగింది వాసుదేవ్ జీ .అందుకు మన్నించండి. 🙏🏻

    కవయిత్రి కవితాత్మనే కాక అంతరంగాన్ని కూడా విపులంగా సారంగ ద్వారా అందించిన మీకు హేట్సాఫ్!

    • మీ హృదయపూర్వక స్పందనకు నెనర్లు. మనస్ఫూర్తిగా చదివి మరీ రాసారు కాబట్టి టైం తీసుకున్నా సమీక్షపై లోతైన స్పందనను సరిగ్గా ఇవ్వగలిగారు. ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు