‘‘నేనిక్కడున్నా ఇప్పుడు. ఎటెళ్లాలో తెలీక. అస్పష్టంగా. నీ గురించే ఆలోచించడమంత అందంగా!’’ నీకు ఈ మెసేజ్ పెట్టి, పంజాగుట్ట జంక్షన్ దగ్గర తీసి పంపిన ఫొటోలో… కింద రోడ్, పైనొక ఫ్లై ఓవర్, దానిపైన మెట్రో ఫ్లై ఓవర్ ఉన్నాయి చూశావా?
‘‘ఇప్పుడు కుదరదులే! నీ ప్లేస్‌కే వచ్చి కలుస్తా. నువ్వెళ్లిపో’’ అన్నావు నువ్వు.
నేన్నీకు మెసేజ్ పంపాక, నీ నుంచి మెసేజ్ రావడానికి మధ్యలో ఒక చాయ్ తాగుతూ ఉంటే ఫ్లై ఓవర్ మీద కనిపించిన హోర్డింగ్ ఒకటి – ఇయర్ రింగ్స్‌ది. ‘LOVE’ అని రాసి ఉందక్కడ. లవ్ షేప్ డిజైన్స్ ఉన్నాయి.
నీ చెవితో ఆడుకోవడం గుర్తొచ్చింది. నీ చెయ్యి లాక్కొని ముద్దు పెట్టడం కూడా. ఇద్దరం ఒక్కో వేలు ఒక్కో వేలుతో కలుపుకుంటూ చెయ్యి చెయ్యందుకోవడం గుర్తొచ్చింది.
నీ మెసేజ్ వచ్చింది.
సో, నేను నీ దగ్గరకు రావడం కుదరదు. నువ్వే వస్తానన్నావు. నువ్వే వస్తే ఐదు నిమిషాలకెక్కువ కలవలేవు.
‘‘ఆ కాసేపైనా నిన్ను చూసుకుంటాలే!’’ అన్నాన్నేను.
నువ్వు రావడానికి గంటన్నరపైనే పట్టొచ్చు. ఈలోపు నేనే నడిచెళ్లొచ్చు కదా అనుకున్నా.
అమ్మకు ఫోన్ చేశా. అక్కకు ఫోన్ చేశా. నరేశ్‌కు చేశా. కనెక్ట్ అవ్వలేదు.
సరిగ్గా ఆ రెండు ఫోన్ కాల్స్ కట్ చేశాక, ప్లే హౌస్ మాల్ వచ్చింది.
అక్కడొక అరటిపండు బండతన్ని ఒక చిన్న బాబు అంగి పట్టి లాగుతున్నాడు. వాడు కొడుకై ఉండొచ్చు. ఐతే ఎదురుచూస్తున్నాడు నాన్న కోసం. ఇంటికి పోవచ్చనేమో!
అవును, నువ్వెప్పుడొస్తావు కలవడానికి?
ముందుకెళ్తే బిగ్‌బజార్ ముందు జనాలే జనాలు. ఇవ్వాళ సెలవు కదా? ఒక సెలవు రోజంతా నీతో ఉంటే బాగుంటుంది. మొన్నటిరోజులా!
ఆ పక్కనే చిన్న కాంప్లెక్స్ నుంచి బయటకొచ్చారొక బాబు, వాళ్లమ్మ. వాళ్లిద్దరూ డ్రైవర్ కారును తీస్తుంటే నిలబడి వెయిట్ చేస్తున్నారు.
బస్టాప్ వచ్చింది. ఇవ్వాళ బస్సులు తక్కువేశారా? లెక్కలేనంత మంది అక్కడ.
వాళ్లంతా ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్‌కి వెళ్లాల్సి ఉంటుంది. ఏయే నెంబర్ల కోసం చూసుకుంటున్నారో. అందరూ ఎదురుచూస్తున్నారు.
బస్టాప్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఒక క్యాబతను కస్టమర్ కోసం ఎదురుచూస్తున్నాడు. చూడూ.. కొంచెం డబ్బెక్కువ పెడితే, నువ్వు ఎదురుచూడటం దగ్గర్నుంచి, నువ్వు కూడా ఎదురుచూయించేలా చేయొచ్చు. ఆ కస్టమర్ పక్కన్నే ఎక్కడో ఉండుంటాడు. వీడో, వాడో కాల్ చేస్కొని ఉంటారు.
‘‘ఎక్కడా? నేనిక్కడే ఉన్నా. హా.. హా.. చూశా’’ ఇలాంటి మాటలేవో వినిపించిన కొద్దిసేపటికి ఆ ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి క్యాబ్‌లో ఉంటాడు. చాలాకాలానికి కలుసుకోవాలనుకున్న ఇద్దరు ప్రేమికులు కలుసుకోవడం కొంచెం ఇలాగే ఉంటుందేమో!
నేనక్కడ ఒక నిమిషం నిలబడాల్సి వచ్చింది. ముందుకెళ్లనీయకుండా బండ్లు. రోడ్డు దాటడం కోసం ఒక ముసలాయన నిలబడ్డాడు. రోడ్డు మధ్యలో సరిగ్గా అన్నీ కాలుక్యులేట్ చేసుకుని పెట్టుకునట్టు.. ఆ కొన్ని సెకండ్లు బండ్లు ఆగినట్టనిపించింది. ఆయన ఆ రోడ్డు దాటగానే అవి వెంటనే వాటి పనుల్లో అవి పడిపోయాయి.
ఇలాంటప్పుడే అనిపిస్తుంది నాకు… కాలాన్ని సెకండ్లలో లెక్కేసుకున్నా, ఇంకా తక్కువ మిల్లీ సెకండ్లు కూడా ఉంటాయి కదా అని!
ఏ మిల్లీ సెకండ్లో నువ్వు వచ్చేశావో, ఇప్పుడిక్కడ ఈ జీవితంలోకి. ఇలాగే!
ముగ్గురమ్మాయిలు. ముగ్గురూ జామకాయలతను జామకాయలు కోసిస్తుంటే అవి నోట్లో వేస్కోవడం కోసం ఎదురుచూస్తున్నారు. బాగుంది.
రోడ్డు పక్కనే బండి మీద ఒకమ్మాయి ఏదో వస్తువు కొనుక్కుంది. ‘హరేక్‌మాల్’ అని చిన్నప్పుడు ఈ బండ్లు ఇంటింటికి తిప్పి అమ్మేవాళ్లు.
ఆ అమ్మాయి ఏ వంద రూపాయలో ఇచ్చి ఏ ముప్ఫై కొందేమో. చిల్లర లేదని పక్కనొక షాప్‌కి వెళ్లాడతను. ఈ అమ్మాయి అతనీ బండి దగ్గరికి చిల్లరతో రావడం గురించి ఎదురుచూస్తోంది.
పానీపురి బండతను కర్రీ కట్‌లెట్ వేడి చేస్తోంటే, ఒకమ్మాయి చేతిలో చిన్న పేపర్ గిన్నె పట్టుకొని ఎదురుచూస్తోంది.
స్పీడ్‌గా సందు నుంచి నడిచొస్తున్న అమ్మాయి, నేనివ్వాల్సిన దారికోసం ఎదురుచూస్తోంది.
రోడ్డు ఎప్పుడెలా ఖాళీ అవుతుందా అని చూస్తున్నాడేమో, ఫుల్ స్పీడులో నా ముందు నుంచి సందులోకి కొట్టాడొకడు బండి. మిల్లీ సెకండ్లో యాక్సిడెంట్ తప్పించుకున్నా.
నీకు మొన్నొకటి చెబ్దామనుకొని మరచిపోయా యాక్చుల్లీ! నాకు లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ అయిన తేదీ రోజునే, అదే చోట, సరిగ్గా అదే సిగ్నల్ పడ్డ ప్రదేశంలో, నేను ఆటో బుక్ చేసి వెయిట్ చేస్తున్నా. నేను ఆ రోడ్డు వైపు ఈ సంవత్సరకాలంలో మూడే మూడు సార్లు వెళ్లా. సరిగ్గా అదే రోజు ఎందుకెళ్లుంటా మొన్న? వెళ్తున్నా, అక్కడే ఆగాల్సొచ్చింది చూడు!
ఈ ఆలోచన రాగానే నాకు వెంటనే నువ్వు గుర్తొచ్చావు. ఎక్కడున్నావు బేబీ నువ్వు? నిన్ను చూడాలిప్పుడు. ఇప్పుడే!
అనుకుంటాం కానీ…
గతాలెప్పుడూ వర్తమానంలోనే ఉంటాయి. వర్తమానంగా!
నీకంటే ముందు నా జీవితంలో ఉన్న అమ్మాయి గుర్తొచ్చింది. తనేం చేస్తూ ఉండొచ్చు ఇప్పుడు?
మెట్రో స్టేషన్ రాగానే మళ్లీ మనం మొన్న మెట్రో ఎక్కడం గుర్తొచ్చింది.
మైత్రివనం రాగానే నువ్వు నాకోసం మొన్న ఇక్కడ వెయిట్ చేయడం గుర్తొచ్చింది. అక్కడంతా నువ్వు, నేను ఉన్నట్టే ఉంది. అక్కడంతా!
చాలామంది ఉన్నారు బస్సు కోసం ఎదురుచూస్తూ.
ఈ ప్రపంచంలో ప్రతిక్షణం, ప్రతిమనిషి ఏదోకటి జరగడం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. కొందరు సెకండ్లు, కొందరు నిమిషాలు, కొందరు గంటలు, కొందరు సంవత్సరాలు, కొందరొక జీవితకాలం.
నువ్వింకో గంటలో వచ్చేస్తావు కదూ!
హస్టల్ సందులోకి వచ్చేశా. పార్క్‌లో చాలామంది ఎవరికోసమో ఎదురుచూస్తున్నారు. వాళ్లు కలుసుకోవడానికి ఎంతసేపో పట్టదు. హాస్టల్‌కి దగ్గరవుతున్నానా, నువ్వు ఇప్పుడిక్కడికి వస్తావని తెలుస్తోంది.
నరేశ్ నుంచి మెసేజ్ – ‘‘రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తా.’’
నువ్వెప్పటికల్లా వచ్చేస్తావు బేబీ?
రూమ్‌కొచ్చి, బ్యాగ్ అక్కడ పడేసి, షర్ట్ విప్పి పక్కనపడేసి మొహం కడుక్కొనొచ్చి కూర్చున్నా.
ఎక్కడ మొదలైందీ కథ?
పంజాగుట్ట దగ్గర? నువ్వు నన్ను రావొద్దని, నువ్వే వస్తావని చెప్పినప్పుడు?
అవునూ.. నువ్వు రమ్మనుంటే నీకు ఏ కథ చెప్పుండేవాడిని?
ఇదంతా కాదు! నువ్వసలు అప్పటికే నాకోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే? పంజాగుట్ట నుంచి నేనెలా వచ్చుండాలి? ఇవేవీ చూడకపోదునేమో.
ఇది కూడా కాదు, మనం ఈరోజు కలవనే కూడదంటే ఈ కథ ఉంటుందా? వీళ్లందరూ ఈ కథకు కనిపించరేమో అసలు.
ఇది కూడా వదిలెయ్! నువ్వసలు నాకు పరిచయమే కాకుంటే ఈ కథ ఉండేదా?
అవును బేబీ! నువ్వు ఏ అర్ధరాత్రొచ్చిన కలవో అయి ఉంటే, అసలీ కథే ఉండదు కదా?
నీకప్పుడు ఏ కథ చెప్పాల్రా!
*
ప్రతి అడుగులోను ఒక సన్నివేశాన్ని చూసి దాన్ని సరికొత్తగా ఊహించుకుంటూ ఒక అద్భుతమైన కథగా మలచడంలోనీకు ఎవరు లేరు సాటి, ఎవరు రాలేరు పరిపాటి.. చాలా చక్కగా ఉంది సారంగ ఎదురుచూపుల కథ ఒక పెళ్లిచూపుల వలె