ఎడారిలో ఒక రేయి

నా పేరు ల్యారి డెరెల్. పూర్తి పేరు చెప్పినా నన్ను గుర్తు పట్టే వాళ్ళు తక్కువే. ల్యారి అనుకోండి, సరిపోతుంది. నాకు ప్రపంచంలో తిరగడం, అదీ ప్రాచ్య దేశాలలో తమ ఆధ్యాత్మిక చింతన పంచుకునే గురువుల సత్సంఘంలో గడపడం మరీ ఇష్టం. అరుణాచలం, ఆ చుట్టు ప్రక్కల ఉన్న ప్రాంతాలలో కొంత సమయం గడపాలనిపించింది. టికెట్ ఎమిరేట్స్ ఫ్లైట్ లో దొరికింది. దుబాయ్ మీదుగా పోతుందని తెలిసిన తరువాత, దుబాయ్ లో ఒక వారం గడపాలనుకున్నాను. అలానే టికెట్ బుక్ చేసాను.

ఎప్పుడు ప్రయాణం చేయాలనుకున్న, నాకు సోమర్సెట్ గుర్తుకు వస్తాడు. సోమర్సెట్ ను కాఫీ షాప్ కు రమ్మని కలిశాను.

“ఏంటి మళ్ళీ ఇండియా ప్రయాణమా? కొన్ని నెలల క్రితమే పోయి వచ్చినట్లు ఉన్నావు,” అన్నాడు సోమర్సెట్.

“అవును. నా సంగతి తెలుసు కదా. ఇక్కడికి వచ్చి ఏదో ఒక ఉద్యోగంలో కొంత డబ్బు చేతికి వస్తె, అది మరో ప్రయాణం పై ఖర్చు పెడితే కాని, నా మనస్సు ఊరుకోదు. మళ్ళీ అరుణాచలం వెళ్తున్నాను. ఆశ్రమంలోనే ఉంటున్నాను. ఈ సారి దుబాయ్ లో కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నాను. నువ్వు ఇదివరకే ఆ ప్రాంతం అంతా తిరిగేసావు కదా. చూడడానికి అక్కడ ఏమి ఉన్నాయి. ఉన్న సమయం గడపడం ఎలా?” అన్నాను నేను.

“ దుబాయ్ లో సమయం ఇట్టే గడిచిపోతుంది. ఎయిర్ బి ఎన్ బి లో రూము తీసుకో. అక్కడ ఉన్న వారింట్లో నే ఉంటావు కాబట్టి, అక్కడ నివసిస్తున్న వారి జీవన శైలి ఇట్టే అర్థం అయ్యిపోతుంది.”

“గ్రేట్ ఐడియా. అలానే వెదికి బుక్ చేస్తాను.”

“ఎయిర్ బి ఎన్ బి అంటే గుర్తుకు వచ్చింది. నువ్వు అక్కడ ఉన్ని ని కూడా తప్పక కలవాలి. అతను అక్కడ టూర్ గైడ్. ఒక రోజు అతని తో బాటు ఎడారిలో విహార యాత్ర చేసి రా. నేను గతంలో దుబాయ్ పోయినప్పుడు అదే నా ట్రిప్ హైలైట్. నీకు లింక్ పంపిస్తాను.”

“ఎయిర్ బి ఎన్ బి  అంటే వసతి సదుపాయాలే అనుకున్నాను. ఇలా సైట్ సీయింగ్ విహార యాత్రలు కూడా బుక్ చేయొచ్చు అని తెలియదు.”

అలానే ఇద్దరు చాయి లాటే త్రాగుతూ, ఇరువురి ప్రయాణాలు గురించి కబుర్లు చెప్పుకుంటుంటే సమయం, ఇట్టే గడచి పోయింది. మళ్ళీ ఇండియా నుండి తిరిగి వచ్చిన తరువాత కలుద్దాం అని సోమర్సెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాను.

దుబాయ్ ఎయిర్పోర్ట్ నా కళ్ళ ముందే చాలా మారింది. ఎయిర్ పోర్ట్ గేట్ ల నుంచే, ట్రాన్సిట్ ప్యాసింజర్ గా ఇది వరకు, దుబాయ్ చూసాను. అలా చూసినా, ఈ ఎయిర్పోర్ట్ లో జరిగిన, జరగుతున్న మార్పులు, ప్రజలను ఆశ్చర్య పడేలా, ఆకట్టు కొనేలా ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ బయట పడడానికి ఇమ్మిగ్రేషన్, బ్యాగేజ్ , కస్టమ్స్ ద్వారా వెళ్తుంటే ఎయిర్పోర్ట్ మరింత ఆకర్షణీయంగా అనిపించింది. ప్రపంచంలోని గొప్ప దేశాల ఎయిర్పోర్ట్ లతో ఏ మాత్రం తీసిపోదు.

ఒక బ్యాక్ ప్యాక్ తప్ప నా దగ్గర మరేమీ లేదు కాబట్టి ఎయిర్పోర్ట్ బయట పడడానికి అట్టే సమయము పట్టలేదు. ఉబర్ లో బుక్ చేస్తే టెస్లా కార్ వచ్చి నిలబడింది. ఎయిర్పోర్ట్ నుంచి ఒక ముప్పావు గంట దూరంలో ఉన్న నా ఎయిర్ బి ఎన్ బి వసతి పోయే దారి మొత్తం పెద్ద పెద్ద హర్మ్యాలు రెండు వైపులా నిలబడి స్వాగతం పలికాయి. బుర్జ్ ఖలీఫా కూడా అన్నిటి కన్న ఎత్తుగా నిలబడి, కళ్ళను ఆకట్టు కుంది.

ఉబర్ టాక్సీ దిగి, నేను ఎంచుకున్న ఒక బెడ్రూం అపార్ట్మెంట్ కు వెళ్ళితే , అక్కడ తలుపుకు డిజిటల్ తాళం ఉంది. అప్పటికే ఆ వసతి హోస్ట్ వాట్సప్ లో నాకు కోడ్ పంపించడం వల్ల, కోడ్ నొక్కి ఇంట్లోకి వెళ్ళ గలిగాను.  ప్లేన్ లోనే డిన్నర్ తినేసాను కాబట్టి వెంటనే ఫ్రెష్ అయ్యి, పళ్ళు తోముకుని, పడుకొన్నాను.

ప్రొద్దున లేస్తూనే బయట కిటికీలో చూసాను. ఇదో అపార్ట్మెంట్ కాంప్లెక్స్.  హోస్ట్ ని ఇంత వరకు చూడలేదు. నేనున్న చిన్న అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొన్నదని అర్థం అయ్యి పోయింది. కాబట్టి హోస్ట్ ను చూసే అవకాశం శూన్యమే. అసలు హోస్ట్ ఈ దేశం లో ఉన్నాడో లేడో?  అదీ తెలియదు. ఇంటర్నెట్ పుణ్యమానని వేరే దేశం లో ఉన్న ఈ దేశం లోని ఆస్తులను, ఇలాంటి ఎయిర్ బి ఎన్ బి సదుపాయాలను మేనేజ్ చేసుకో వచ్చు.

తరువాతి రోజులు నా అంతటికి నేనే దుబాయ్ వీధులు తిరిగాను. బుర్జ్ ఖలీఫా, పామ్ జుమైరా, గోల్డ్ సూక్, దుబాయ్ మిరికిల్ గార్డెన్ అన్నీ చూసేసాను. కానీ నాకు గుర్తిండిపోయేది నేను కలిసిన మనుష్యులే,  వాళ్ళ తో గడిపిన కొద్ది నిమిషాలు. హిజాబ్, అభయా లు వేసుకున్న వారిని, అవేవీ కాకుండా ఖరీదైన  అమెరికన్ ఫ్యాషన్ దుస్తులు వేసుకున్న వారినీ చూసాను. బజారు వీధులంతా బంగారం పోసి అమ్ముతున్న అంగళ్ళ మధ్యలో చాయి, బిస్కెట్ లు అమ్ముతున్న వారిని చూసాను. ఒక పక్క ధవళ వస్త్రాలు ధరించి భార్యలను, పిల్లలను వేసుకొని మాల్ లలో తిరుగుతున్న ఆ దేశం నివాసులు, మరో పక్క జీవనోపాధి కని ఆ దేశం వచ్చిన విదేశీయులు, చెత్త ఊడవడం నుంచి, షాప్ లు మేనేజ్ చేసే వారి వరకు చూసాను. ఆ షాప్ లు చూసుకుంటున్న విదేశీయులు ఆ షాప్ యజమానులా లేక పని వారేనా? ఆ ప్రశ్నకు సమాధానం నాకు ఉన్ని ని కలిసిన తరువాత కానీ దొరక లేదు.

ఉన్ని తో ఎయిర్ బి ఎన్ బి లో బుక్ చేసిన ‘ఎడారి అనుభవం’ ఆ రోజు మధ్యాహ్నం ఉంది. పొద్దున్నే టంచనుగా ఉన్ని నుండి వాట్సప్ లో మెసేజ్ – నేను ఎక్కడ వున్నానని. నేనున్న అపార్ట్మెంట్ అడ్రస్ ఇచ్చాను. కానీ తను వచ్చే సరికి బుర్జ్ ఖలీఫా కిందనున్న మాల్ దగ్గర ఉంటాను అని చెప్పాను.  నన్ను మాల్ బయటనే ఉన్న పిక్ పాయింట్ దగ్గరకు రమ్మని లోకేషన్ మ్యాప్ పంపించాడు.

మధ్యాహ్నం ఒక పది నిమిషాలు ముందే పిక్ అప్ పాయింట్ చేరి వేచి ఉన్నాను. ఆ స్థలం, టూరిస్ట్ లను దింపుకుంటూ, ఎక్కించుకుంటూ తిరుగుతున్న బస్సులు, కార్లతో, జన సంచారంతో  గిజ, గిజ లాడు తున్నది. నేనున్న స్థలం ఉన్ని తో షేర్ చేయడం వల్ల అనుకున్న  సమయానికి ఉన్ని హాజరు అయ్యాడు.

“ల్యారీ?”

“అవును ల్యారి నే. గుడ్ ఆఫ్టర్నూన్ ఉన్ని. హౌ ఆర్ యు? “ అంటూ ఉన్ని ని, ఉన్ని తెచ్చిన ఎస్ యు వి వెనుక సీట్లో కూరుచున్న ఒక యువ జంట ను చూసి విష్ చేస్తూ కారు ఎక్కాను.

ఉన్ని లో మొదట కనిపించింది, నచ్చింది – అతని ముఖం లోని ప్రసన్నత, చిరు నవ్వు. అతను చేస్తున్న పనికి తగిన వాడని నాకు నిమిషాలలోనే అర్థం అయ్యిపోయుంది. మేము చూడ బోతున్న దృశ్యాలు, చేయబోతున్న పనులు ఎంతో ఉత్సాహంగా, కుతూహాలంగా చెప్పడమే కాక, అందరితో వారొస్తున్న దేశాల గురించి, వారి వ్యక్తి గత పరిచయాల మీద పశ్నలు వేస్తూ, జవాబులకు తగిన విధంగా స్పందిస్తూ, అతి తొందరలోనే అందరికీ ఆప్తుడు అయ్యిపోయాడు.

మేము పోవాల్సిన ఎడారి ప్రదేశం అల్ బడేయర్.  ఒకటిన్నర గంట ప్రయాణం. వెనుకనున్న పడుచు జంట, వాళ్ళ లోకంలో వారున్నారు. ఉన్ని, నేను, బయట ప్రపంచం,  వాళ్ళకి కనపడటం లేదు. ఉన్ని, ముందు సీట్లో తన పక్కన కూర్చున్న  నేను సంభాషణలో పడిపోయాం.

“ఉన్ని, నీవు ఇండియా నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నావు అనుకుంటున్నాను. ఎక్కడ నుంచి వచ్చావు?” అడిగాను ఉన్ని ని.

“ముంబై నుంచి,” అన్నాడు ఉన్ని.

“ముంబై లో ఎక్కడ?”

“‘ఆంటీల్ల’ పేరు విన్నారా?” ఉన్ని ఒక క్షణం నా వైపు తిరిగి, తరువాత రోడ్డు పక్కన వేగంగా కదులుతున్న ఆకాశ హర్మ్యాలు చూసి, మళ్ళీ రోడ్డు వైపు దృష్టి పెడుతూ అన్నాడు. అతని ముఖంలో, నాకర్ధం కాని ఒక నర్మ గర్భ రహస్యం ఉన్నట్లు, అతని చిరు నవ్వు రూపాంతరం చెందింది.

ఆంటీల్ల  పేరు విన్నాను. పోర్చుగీస్ వారు సముద్ర తీరం లో ఉన్న చిన్న దీవులని ఆ పేరుతో పిలుస్తారని తెలుసు. ముంబై బ్రిటిష్ వారికి, పోర్చుగీస్ వారి వర కట్న దానమే కదా. అలా మొత్తం ముంబై ఒక ఆంటీల్ల నే.  సంభాషణ కొన సాగిద్దామని ప్రశ్న వేస్తే, నాకో క్విజ్ పెడుతున్నాడేమిటి అని మనస్సులోనే నవ్వుకుంటుంటే, వెంటనే సమాధానం దొరికింది.

“భారత దేశం లోనే అతి ఖరీదైన అంబానీల స్వగృహం పేరు ‘ ఆంటీల్ల ‘ కదూ. అది ముంబై లోనే ఉన్నట్లు విన్నాను,” అన్నాను నేను.

“ఆ ఇంటి దగ్గరే మా ఇల్లు”

“అంటే మీరు బాగా డబ్బున్నవారన్న మాట. ప్రపంచంలోనే ఒక గొప్ప ధనవంతుడి ఇంటి దగ్గర ఉండడం అందరికీ సాధ్య పడదు కదా?”

“అక్కడే పొరబడ్డారు,” ఈ సారి రోడ్డు పైనే దృష్టి ఉంచి గట్టిగా నవ్వుతూ అన్నాడు ఉన్ని,” అంబానీలు రాక ముందే మా ఇల్లు అక్కడ ఉండేది. నేను పుట్టి పెరిగింది అంతా అక్కడే.  ఈ అంబానీలు మేమున్న మా ప్రజల సమద్ర తీరంకు అతీతంగా తమ ‘ఆంటీల్ల’ ద్వీపం కట్టు కున్నారు. మీకు ముంబై గురించి పూర్తిగా తెలిసినట్లు లేదు. గోలిబార్ పేరు విన్నారా?”

వెనుకనున్న యువ జంట, ఇంకా వాళ్ళ లోకం లోనే ఉన్నారు. వారి డిజైనర్ దుస్తులు, చేతికి కట్టుకున్న వాచీలు, మెడలో గొలుసులు, కళ్ళకి తగిలించు కున్న షేడ్స్ వారు బాగా డబ్బున్న వారే అని చెప్పేస్తున్నాయి.

“అబ్బే వినలేదు ఉన్ని”

“ ఒక ఇరవై క్రితం ఎక్కువ న్యూస్ లోకి వచ్చింది లెండి. గోలిబార్ కూడా ధారావి లాగా ముంబై లో ఒక స్లం, మురికి వాడ.”

“స్లం లో పెరిగావా? అక్కడి నుంచి నువ్వు ఇక్కడ దుబాయ్ వచ్చి, ఇప్పుడిలా కారు లో మమ్మల్ని తిప్పడం, నీ కంతటికీ నువ్వే ఈ ఎయిర్ బి ఎన్ బి ద్వారా డబ్బు సంపాదించడం, నాకు చాల ముచ్చట గా ఉంది.”

ఫక్కున నవ్వేసాడు ఉన్ని. వెనువెంటనే ముఖంలో అర్థం కాని ఛాయలు.

“అదేంటో నా జీవితమంతా ఈ హై రైస్ బిల్డింగ్ లు చూస్తూ, వాటి నీడలలో నే బ్రతకాల్సి వస్తున్నది. ముంబై నుంచి పారిపోయి బ్రతుకు తెరువు కోసం దుబాయ్ వచ్చాను. ఇక్కడా అదే కథ. చూస్తున్నారు కదా బ్రహ్మాండ మైన ఈ కట్టడాలు, వాటి నీడే నా బ్రతుకు ఇంకా కొనసాగుతున్నది. చాల సార్లు ముంబై లో ఉన్నానా, లేక దుబాయ్ లోనా అన్న అనుమానం కలుగుతుంది. పాల్మ్ జుమైరా చూసారా. అక్కడ కూడా మన అంబానీ ది అతి పెద్దది, ఖరీదైన విల్ల ఉంది.”

“ భారత దేశం లోని డబ్బున్న వారు, ప్రభుత్వంలో ఉన్నతోగ్యాలు చేసే వారు, రాజ కీయ నాయకులు దుబాయ్ లో కూడా నివాస గృహాలు కొంటున్నారని ఎక్కడో న్యూస్ లో చదివాను.”

“అవును సినిమాలలో అంతో , ఇంతో సంపాదించిన వారికి, అండర్వరల్డ్ మాఫియా డాన్ లకు దుబాయ్ లో ఇళ్ళు ఉన్నాయి. ఒకప్పుడు, నివసిస్తున్న నగరానికి కొద్ది దూరంలో ఫాం హౌస్ లని కట్టుకునే వారు. ఇప్పుడు దుబాయ్ లో కూడా ఒక ఇల్లు సొంతం చేసుకోవడం, మామూలయ్యిపోయింది. మీరు ఇల్లు ఇక్కడ కొనుక్కోవచ్చు,” అంటూ ఉన్ని వెనుకనున్న జంటకు కూడా చెప్పాడు . ఆ జంట “వీ ఆర్ ఫైన్” అంటూ ఒక నవ్వు నవ్వి తమ మాటలలో మళ్లీ పడిపోయారు. కారు దుబాయ్ నగరం దాటి మేము పోవలసిన ఎడారి వైపు పరుగులు తీస్తున్నది.

“నాకు స్వంతం అంటూ పెద్దగా ఏమీ లేదు. పెళ్లి కూడా చేసుకోలేదు. ఇల్లు కూడా ఇంత వరకు కొనలేదు. ఇంక నేను ఈ దుబాయ్ లో ఎందుకు ఇల్లు కొంటాను. అన్నట్టు ఇందాక నువ్వు పని చేస్తున్న తీరు మెచ్చు కుంటుంటే, నవ్వి మాట దాటేశావు,” అడిగాను నేను. ఉన్ని నవ్వు వెనుకున్న అర్థం కనుక్కుందామని.

ఒక క్షణం నా వైపు తిరిగి చూసాడు ఉన్ని. తిరిగి రోడ్డు వైపు చూస్తూ, సాయంత్రం మనకు డిన్నర్ చేసే టప్పుడు సమయం ఉంటుంది. అప్పుడు మాట్లాడుకుందాం, అంటూ మాట త్రుంచి, రోడ్డు పక్కనున్న పల్లెలు, దుబాయ్ లోని చూడాల్సిన ప్రదేశాల మీద మాట్లాడడం మొదలెట్టాడు. దాంతో, సంభాషణ కారులో ఉన్న వారందరి మధ్య దొర్లడం మొదలెట్టింది.

ఉన్ని ఈ టూర్ చాల సార్లు ఇది వరకే చేసి ఉండాలి. మమ్మల్ని సాండ్ డ్యూన్స్ అదే ఇసుక మెట్టల మీద నడపటానికి బైకు లు, ఏ టి వీ లాంటి బగ్గీలు అరువిచ్చే అంగడి ముందు వదిలేసి తన కారు దగ్గరకు పోయి టైర్లలో గాలి తగ్గించడం మొదలెట్టాడు. తను నడుపుతున్నది ఫోర్ వీల్ డ్రైవ్ ఎస్ యు వి అయ్యిన, ఇసుకు మీద నడపటానికి టైర్ లలో ప్రెజర్ తగ్గించడం అవసరం. కార్ ట్రాక్షన్ పెరిగి, ఇసుక లో కూరు కోకుండా, దొర్లకుండా చక్కగా ప్రయాణం చేయ గలుగుతుంది.

పడుచు జంట డ్యూన్ బగ్గి లో తిరిగి ‘ ఆ సం ‘ అంటూ తిరిగి వచ్చేంత వరకు నేను అక్కడే ఉన్న చిన్న, చిన్న స్టోర్ లు, వాళ్ళు అమ్ముతున్న వస్తువులు చూసాను.

తరువాత అసెంబ్లీ లైన్ లో పని చేస్తున్నట్లు ఉన్ని ముందు మమ్మల్ని కళ్ళు తిరిగేలా తన కారులో ఆ ఇసుక డ్యూన్ లలో తిప్పాడు. తరువాత అక్కడే ఒక డాబా లాంటి ప్రదేశానికి తీసు కెళ్ళి, ఒంటె పై సవారికని,  అరబ్బు లు లాగ దుస్తులు ధరించి ఫోటోలు తీసుకోవడానికి, డేగ ను చేతి పెట్టి మరిన్ని ఫోటోలు తీసుకోవడానికి మమ్మల్ని అప్పగించేసాడు. అవన్నీ గంటలో పూర్తి చేశాం. ఇక మిగిలింది, డిన్నర్ చేస్తూ, అక్కడ మధ్యలో వేసిన స్టేజ్ పైన ప్రదర్శనలు చూడటమే. మాతో వచ్చిన జంట,  అమ్మయ్యి చేతికి మెహెంది వేయించుకొని, పక్కనే అమ్ముతున్న డ్రింక్స్ కొని స్టేజి దగ్గరున్న బల్ల దగ్గర కూర్చున్నారు. వేరే ట్రిప్ ల ద్వారా అదే ప్రదేశానికి వచ్చిన మరో రెండు యువ జంటలు కూడా మా బల్ల దగ్గరే కూర్చోవడం తో నేను ఉన్ని మాత్రం మిగిలి పోయాం.

“ఉన్ని ఈ ప్రదేశం బాగుంది. ఎడారి మధ్యలో ఇలా నాలుగు ప్రాకారాలు ఉన్న ఇండ్లు కట్టడం, లోగిలి అంతా ఇంత విశాలంగా, ఖాలీగా వదిలేయడం.”

“అవును. ఇదే ఇక్కడ నివసిస్తున్న వారి యిండ్లు. అక్కడ బార్బెక్యూ చేస్తున్న వారిని అడిగాను ఇంకా డిన్నర్ చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు. అటు పక్కనున్న గుడిసెలో బఫెట్ ఉంటుంది. కానీ మనకు కనిపిస్తున్న ఆ బార్బెక్యూ కౌంటర్ మాత్రం మిస్ కాకండి, కబాబ్స్ చాలా బాగుంటాయి. వేడి వేడిగా కూడా వడ్డిస్తారు.”

“థాంక్స్ ఫర్ ది టిప్స్. సమయం ఉందంటున్నావు. ఇందాక వస్తున్నప్పుడు మళ్ళీ చెప్తానన్నావు. అదేంటో, ఇప్పుడు చెప్పు”

“పెద్ద మిస్టరీ ఏమి లేదు. మీరు నేను చేస్తున్న పని చూసి మెచ్చుకుంటే నవ్వు వచ్చింది.”

“అదే, ఎందుకని అడుగు తున్నాను.”

“నా అస్సలు పేరు ఉన్ని కాదు. నా పేరు ఉద్ధవ్ పాటిల్.”

“ అదెలా? ఎయిర్ బి ఎన్ బి లో ఉన్ని అనే ఉందే.”

“ నేను పని చేస్తున్నది ఒక ట్రావెల్ కంపెనీకి. వారు వ్యక్తిగతంగా పేర్లు వేసిన బొటిక్ టూర్ ఆపరేటర్ లకు బాగా లాభాలు వస్తున్నాయని ఈ పద్ధతి కని పెట్టారు. ఎవరు ఈ ఉన్ని కోసం టూర్ బుక్ చేసిన, మా ట్రావెల్ కంపెనీ ఆ రోజు ఎవరు ఉంటారో వారిని ఈ టూర్ గైడ్ ఉన్నిగా పంపిస్తారు.”

“ అంటే నువ్వు నడుపుతున్న ఈ ఎస్ యు వి కూడా నీది కాదను కుంటాను. “

“ అవును. మాలాంటి వారు ఇలాంటి కారు కొనగలగడమా?”

ఉన్ని అదే ఉద్ధవ్ ముఖంలో నిస్పృహ కొట్టొచ్చినట్లు కనిపించింది.

“ ఉద్ధవ్ అని పిలుస్తాను లే. నీవు టూర్ గైడ్ కు పర్ఫెక్ట్. నువ్వే ఒక కంపనీ పెట్టుకోవచ్చు కదా?”

ఉద్ధవ్ నవ్వాడు. “ మీకు ఈ దేశం లో వ్యాపారం ఎలా చేస్తారో తెలిసి నట్లు లేదు. ఎవరు కంపెనీ మొదలెట్టాలన్న వారికి ఒక స్పాన్సర్ ఉండాలి ఆ స్పాన్సర్ ఈ అరబ్ దేశీయుడై ఉండాలి. అది అంత సులభం కాదు లెండి .”

“ పోనీలే డబ్బు బాగానే సంపాదిస్తున్నట్టే ఉన్నావు. చాల మంది కలలు కనే దుబాయ్ లో నివసిస్తున్నావు.”

ఉద్ధవ్ మాటలు ప్రవాహానికి అడ్డు వేయ లేక పోయాను. “ ఎక్కడి సంపాదన? ఎక్కడి లైఫ్ స్టైల్. నేను ఉండేది షార్జా లో. మరో నలుగురు బ్రాహ్మచారులతో ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నాను. దుబాయ్ ఇండ్ల బాడుగ లు నేనిచ్చు కోలేను. షార్జా నుంచి వచ్చేటప్పుడు చూస్తే నాకు దుబాయ్ మొత్తం ఒక ‘ ఆంటీల్ల ‘ లాగా, నేను నివసిస్తున్న షార్జా ఒక గోలిబార్ స్లమ్ లాగా అనిపిస్తుంది. నా జీవితంలో అయితే మార్పు ఏమి లేదు “

“ మరీ అంతగా నిరాశ, నిస్పృహ పడద్దు. ఈ దేశంలో ఇంకా కొన్ని ఏండ్లు జీవితం గడప బోతున్నావు. తప్పకుండా బాగానే సంపాదిస్తావు. మీ అమ్మ నాన్నలకు డబ్బు పంపించ వచ్చు. నీవు కొంత వెనుకేసుకోవచ్చు. దుబాయ్ లో లేక ముంబై లో నువ్వు సెటిల్ అయ్యిపోవచ్చు,” అన్నాను.

బఫెట్ మొదలయ్యింది. ముందు ఉద్ధవ్ చెప్పినట్లు, బార్బెక్యూ పిట్ దగ్గరికి వెళ్లి కబాబ్ ముక్కలు, గ్రిల్డ్ ఫిష్ తీసుకున్నాను. బఫెట్ లోకి వెళ్లి మొత్తం డిన్నర్ తినాలని పించలేదు. డిజర్ట్స్ లో కొన్ని పళ్ళ ముక్కలు, డేట్స్ దానితో బాటు ఒక వాటర్ బాటిల్ తీసుకొని తిరిగి ఉద్ధవ్ తో బాటు స్టేజీ దగ్గరున్న బల్ల దగ్గర కూర్చున్నాను. రాత్రి చీకటి కావడంతో, స్టేజ్ మీద ఫైర్ ఈటర్ చేస్తున్న విన్యాసాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.  ఒక నాలుగైదు అడుగుల అగ్గి గాలిలోకి ఊదుతున్నాడు. స్టేజీ కి పక్కన, జిగేలు వస్త్రాలు వేసుకున్న డ్యాన్సర్ తన వంతు కోసం ఎదురు చూస్తున్నది.

“ఇందాక ఈ దేశం లో నా ప్రగతికి మార్గాల గురించి చెప్పారు. అవన్నీ అడియాసలే. నాకు వచ్చే డబ్బుతో మా అమ్మ నాన్న లు ముంబై లో ఇల్లు కొనుక్కోవడం అసాధ్యం. అందుకే వారు  కొంకణ్ తీరం దగ్గర ఉన్న మా పల్లె కు వెళ్లి పోయి ఒక చిన్న ఇల్లు కట్టుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక ఈ దేశం లో స్థిర పడడం నా లాంటి వారికి అసాధ్యం. ఉద్యోగం లేకుంటే, దేశం వదలి పోవాల్సిందే. మాలాంటి వారికి ఇక్కడ సిటిజన్ షిప్ కానీ, సోషల్ సెక్యూరిటీ లాంటి రిటైర్మెంట్ సదుపాయాలు లేవు. వయస్సు, జవసత్వాలు ఉన్నంత వరకు పనిచేయ వచ్చు. అటు తరువాత భారత దేశం తిరిగి పోవాల్సిందే.”

స్టేజీ మీద జిగేలు దుస్తుల పిల్ల బెల్లి డ్యాన్స్ మొదలెట్టింది. అది వరకే చాల సార్లు చూసి ఉండటం వల్ల ఉద్ధవ్, అలాంటి ప్రదర్శనల పై ఇంటరెస్ట్ లేనందు వల్ల  నేను, స్టేజ్ మీద నుంచి చూపులు తిప్పి  మా సంభాషణ కొనసాగించాము.

“ దుబాయ్ లో ఒక చిల్లి గవ్వ కూడా లేకుండా వచ్చి, డబ్బులు సంపాదించే చాల మంది నాకు తెలుసు. నువ్వు మరీ పెసిమిస్ట్ లాగా మాట్లాడుతున్నావు,” నామాటలు అపార్థం చేసుకోకూడదని, ఉద్ధవ్ భుజాన్ని ఆప్యాయంగా,  అతన్ని ఉత్సాహ పరచడానికి,  తట్టాను.

ఉద్ధవ్ దోరణి లో మార్పు లేదు. తన వంటి సూటిగా జీవితం గడపాలి అనుకున్న వారికి దుబాయ్ , ముంబై లాంటి నగరాలలో సాధ్యం కాదని వాదిస్తూనే ఉన్నాడు. నాకు ఉద్ధవ్ నిజంగానే తీవ్ర ఆత్మన్యూనత తో బాధ పడుతున్నాడో లేక మన జీవితాలలో యుగాలుగా పేరిపోయిన అసమాన్యతల గురించి ఆలోచించి ఈ విధంగా, నిజంగానే తన బాధను వ్యక్త పరుస్తున్నాడా? నాకు ఆ రోజు ఉద్ధవ్ తన మాటలతో మరింత నిరాశ, నిస్పృహలు బయట పెట్టాడు. నా ఉపశమనపు మాటలు,  వాటిని ఏ మాత్రం తగ్గించ లేక పోయాయి.

తిరుగు ప్రయాణానికి, ఉద్ధవ్ కారు టైర్ల లో మళ్ళీ గాలి సరైన ప్రెజర్ కు ఎక్కించి దుబాయ్ వైపు మమల్ని తిరిగి డ్రాప్ చేయడానికి బయలు దేరాడు. ముందు యువ జంట ఉండే హోటల్ కి వెళ్లి వారిని డ్రాప్ చేశాడు. నేనున్న అపార్ట్మెంట్ వైపు పోతుంటే ఉద్ధవ్ కి ఏదో మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసిన వెంటనే ఉద్ధవ్ ముఖంలో మార్పులు చూసాను.

“అంతా బాగానే ఉంది కదా,” అన్నాను నేను.

“హా. ఏమీ లేదు. నాకు ఎడారిలో స్లీప్ ఓవర్ కని ఒక గ్రూప్ బుకింగ్ ఈ రాత్రి ఉండింది. అది కేన్సిల్ అయ్యింది. అన్నట్టు మీరు, నేను ఎప్పుడూ నిరాశ, నిస్పృహలతో ఉండడం బాగా లేదని, ఈ అసమానతలను జీర్ణించుకోవాలని నా మంచి కోరే చెప్పారు. మనసు విప్పి మాట్లాడి, నన్ను కూడా ఒక ఆత్మీయుడుగా చూసిన అతి కొద్ది మందిలో మీరు ఒకరు. నాతో రండి. మీకు ఏమి చార్జి లేకుండా   ‘ ఎ నైట్ ఇన్ ద డిజర్ట్ ‘ ట్రిప్ ఇస్తాను. మీకు ఎడారిలో  ఒక రియాల్ కూడా ఖర్చు పెట్టకుండా ఒక రేయి గడిపే అవకాశం.”

“ థాంక్స్. నా ఫ్లైట్ రేపు మధ్యాహ్నం. సమయం తో సమస్య లేదు. కానీ నువ్వు అనవసరంగా ఇబ్బంది పడతావేమో కదా. వద్దులే,” అన్నాను. అలా అనడానికి, కొత్త దేశాలలో జాగ్రత్తగా ఉండాలి, కొత్త దేశాలలో తక్కువ పరిచయం ఉన్న వారి మాటల్లో పడి ప్రాణం కోల్పోయిన కేసులు చాల ఉన్నాయి అని మరో గొంతు అరవడం కూడా ఒక కారణం.

“ ఇబ్బంది ఏమి లేదు. నా ట్రిప్ ఎలా కేన్సిల్ అయ్యింది. ఇప్పుడు షార్జా పోయే బదులు ఎడారిలో రాత్రి గడపటమే నాకు ఇష్టం. ఒంటరిగా గడపడం బదులు, మీకు ఆ అనుభవం ఇప్పించ వచ్చు నని చెప్పాను. ఇక ఈ కారు, రేపు పొద్దున్నే  వాపసు చేస్తే చాలు. “

కారులో లైట్ లేనందు వల్ల ఉద్ధవ్ ముఖం సరిగా కనపడటం లేదు. కానీ దేదీప్య మానంగా వెలుగు తున్న దుబాయ్ వీధుల కాంతులు అప్పుడప్పుడు కారులో దూరి కావలసినంత వెలుగు నిస్తున్నాయి. ఉద్ధవ్ ను చూస్తే మోసగాడనిపించ లేదు. ఉద్ధవ్ లాగా అసమానతల గురించి ఇంత సెన్సిటివ్ గా మాట్లాడిన వారిని నేనూ అరుదుగానే చూసాను.

“సరే. నా అపార్ట్మెంట్ దగ్గర ఆపు. నైట్ కని నా పైజామా దుస్తులు, పొద్దున కని టవల్ బ్రష్ తెచ్చుకుంటాను,” అన్నాను.

“తప్పకుండా. దుప్పట్లు లాంటివి తేకండి. నా దగ్గర, కారు ట్రంక్ లోఎడారిలో రాత్రి గడపడానికి కావలసిన టెంట్, స్లీపింగ్ బ్యాగ్స్, ఇంకా కావలసిన గేర్ మొత్తం ఉంది.”

మరో ముప్పావు గంటలో మళ్ళీ దుబాయ్ నుండి బయట పడి ఎడారి లో ఉన్నాము. కారు ఇసుక మెట్టల పై పోనించి ఒక చోట ఆపాడు. అక్కడే కారు హెడ్లైట్ వెలుగులో ఒక టెంట్ వేసి మా ఇద్దరికీ స్లీపింగ్ బ్యాగ్స్ పరిచాడు. టెంట్ లోపల కూడా దీపం ఉంది. కారు ఆపుజేసి, టెంట్లో ఎవరి స్లీపింగ్ బ్యాగ్స్ లో వారు దూరి పడుకున్నాము. లైట్ ఆపేస్తే పైన లెక్క లేనన్ని నక్షత్రాలు. టెంట్ పైన కవర్ ట్రాన్స్పరెంట్ గా ఉండటం వల్ల బయట ఇసుక లో పడుకున్నట్లె ఉంది.

అలసిపోయాను కాబట్టి నిమిషాలలోనే ఉద్ధవ్ కు గుడ్ నైట్ చెప్పి నిద్ర పోయాను.

పొద్దున్నే మెలుకువ వచ్చింది. పక్కన చూసాను. ఉద్ధవ్ అప్పటికే లేచి బయట తూర్పున ఎర్ర బడుతున్న ఆకాశం చూస్తున్నాడు. నేను టెంట్ బయట బడి ఉద్ధవ్ కు గుడ్ మార్నింగ్ చెప్పి అతని పక్క కూర్చున్నాను. బ్లాంకెట్ కప్పుకున్నా ఇంకా చిరు చలి. గాలి కూడా చల్లగ ఆ ఇసుక గుట్టల మధ్య మలయమారుతంల వీస్తున్నది. కాలుష్యం లేని ప్రకృతి సువాసనల భరితమైన గాలి. గుండెల నిండా పీల్చుకున్నాను. ఆకాశంలో అది వరకు తళుక్కని మెరిసిన తారలు వెలవెల పోతున్నాయి. ఆకాశం ఇంకా ఎరుపై, మా ఎదుగా ఉన్న ఇసుక డ్యూన్ లను ఎర్రటి వెలుగు నీడలు లో ముంచెత్తింది. తన రాక కోసం అరుణ వర్ణలతో అలంకరించినా రంగస్థలం పైకి చివరికి సూర్యుడు వెచ్చగా, కళ్ళ తో చూడ గలిగె ఇంపైన అరుణ వర్ణంతో తన ప్రవేశం మొదలెట్టాడు. ఎటు చూసినా ఇసుక, ఆకాశం. ప్రకృతి లో మానవులు ఎంత చిన్న వారో అని నాకు మరొక్కసారి ఎపిఫని తెచ్చిన క్షణం అది.

అదే క్షణం లో ఉద్ధవ్ గొంతు లో పొద్దున లేస్తూనే ముద్దగా వచ్చే మాటలు విన్నాను. “ల్యారి, ఇదొక్క చోటే నాకు మనస్సు ప్రశాంతం గా ఉంటుంది. ఎంతో మంది బాగా డబ్బున్న వారిని ఈ ఇసుక తిన్నెల పై రాత్రి గడపడానికి తీసుకు వచ్చాను.  ఈ ఎడారిలో నాకు కంటికి అడ్డు వచ్చే ‘ ఆంటీల్ల ‘ హర్మ్యాలు లేవు. ఇక్కడ ఎలాంటి అసమానతలు లేవు. ఇలాంటి సమయంలో అంబానీలు, నేను ఒకటే అనిపిస్తుంది.”

***

( ల్యారి డెరెల్ గురించి మరిన్ని వివరాలకు సోమర్సెట్ మామ్ వ్రాసిన ‘ది రేజర్స్ ఎడ్జ్’ చదవండి)

నిర్మలాదిత్య

జీవితం చక్కగా నడుస్తున్నా, అవతల వైపు ఏముందో అన్న ఉత్సుకత తో 1998 అమెరికాకు వలస రావడం ఓ గొప్ప మలుపు - ప్రస్తుత నివాసం టాంపా బే , ఫ్లారిడ, USA . 1986 నుంచి 1998 వరకు విపుల, ప్రభ, జ్యోతి, స్వాతి వంటి పత్రికల లో కథలు అచ్చైయాయి. 1998 నుంచి 2004 వరకు evaram.com తెలుగు పత్రిక వెబ్లో నడపడం అందులో రచనలు చేయడం మరువరాని అనుభవం . 2004 నుంచి అమెరికా జీవనం ప్రతిపలించే మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నం, దాదాపు అన్ని కథలు వంగూరి ఫౌండేషన్ పోటీలలో నెగ్గినవే. యూనివర్సిటీ అఫ్ అయోవా రైటర్స్ వర్క్షాప్ ద్వారా రెండు కథలు ఇంగ్లీషు లో అచ్చయాయి. దాదాపు ముప్పై ఏళ్లు పాటు వ్రాసిన మొదటి 24 కథల సంకలనం ' సైబీరియన్ క్రేన్స్' 2023 లో విడుదల అయ్యింది.

జీవితము అనుక్షణం సంతోషంగా గడపడానికి నా స్నేహితురాలు, సహచరి నిర్మల, అబ్బాయి ఆదిత్య కారకులు. అబ్బాయి ఆస్టిన్ లో ఉండడం వల్ల, ఈ నగరం కూడా తరచూ రావడం ఈ మధ్యనే మొదలయ్యింది.

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ కంటే అక్కడి ప్రదేశాల వర్ణనలు నన్ను కట్టిపడేశాయి. నేనూ మూడోవాడిగా మీతో ఉన్నట్టు అనిపించింది. తెలియని విషయాలు చాలా తెలిసాయి.ఉన్నదాంట్లో తృప్తి పడ్డం కు మించిన ఆనందం ఉండదని చాలా బాగా చెప్పారు.

  • Very thought provoking story. I felt the end is a bit abrupt though it does allow me to reflect more… Thank you.

    • థాంక్స్ సాయి…రాజీ పడలేని సమస్యలకు ప్రతీ ఒక్కరూ తమకు తాము వెదుక్కునే సమాధానాల గురించిన ఈ కథకు వర్ణనలు కూడా బలం కూర్చాలని ప్రయత్నం. అది నెరవేరిందని మీ స్పందనతో తేలింది. ధన్యవాదాలు 🙏

    • Prasad

      Thanks for your feedback. If it made you reflect after you read the story, then the purpose is served. Coming from you, it means a lot to me 🙏

    • ఉమాభారతి గారు

      ఆనేక మంచి రచనలు, వాటికి బహుమతులు పొందిన మీలాంటి వారి నుండి ఇలాంటి మంచి స్పందన రావడం సంతోషం.

      ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు