ఎన్నటికీ మానదు గాయం.
ఇది మాయని గాయం
ఎన్నటికీ తీరని శోకం
ఇది ఆకలి చేసిన గాయం
అధికారం చేసిన గాయం
లాఠీలు, కుర్చీలు, నోట్లు
మౌనమూ, మొసలి కన్నీరు
జమిలిగా చేసిన గాయం
గాయం..గాయం..
***
ఎటు పోగలవు!
ఊరు, ఏరు దాటి
నేల, నింగి దాటి
సప్త ఖండాలు,
పంచ సముద్రాలు దాటి…
వెంటాడే ఈ గాయం నుండి
వేటాడే ఈ పాదం నుండి
రోడ్లన్నీ ముంచేసిన
ఈ దుఃఖిత మానవ ప్రవాహం నుండి
తుది దాకా వెన్నాడే
ఈ ఆమరణాంతక విషాదం నుండి!
మనిషితనానికి అంటుసోకి
మంచం పట్టిన
ఈ దుష్ట దుర్మార్గ లోకం నుండి
పాపపు అగాథంలోకి జారిన
ఈ శాపగ్రస్త దేశపు
జబ్బు పడ్డ మనస్సాక్షి నుండి
ఈ శతాబ్దపు అతి భయానక,
ఆత్మ భీతావహ
ఙ్నాపకాల బందీఖానా నుండి
నగర దేశం నుంచి
పల్లె దేశానికి
తరిమివేయబడిన ఈ కాందిశీకుల
దుర్భర దారిద్ర్య ప్రవాసం నుండి
రక్తమండల ప్రాణాంతక ప్రయాణం నుండి
కంచెలు కట్టిన ఈ పరాయితనం నుండి
ఎలా పారిపోగలవు!
ఈ బక్క మనుషుల
మౌనదృక్కుల నుండి
శూలాలై గుచ్చుకుంటున్న
ఈ ఎముకల పోగుల నుండి
***
ఎటు తప్పించుకు
పారిపోగలవు!
ఉప్పెనై ఊడ్చేసే
ఈ తిరోగమన కాలం నుండి
సుడి గుండమై మింగేసే
ఈ ముగింపు లేని దుఃఖం నుండి
నిప్పుల కుంపటై మండుతున్న
ఈ ఆకలి కేకల ధ్వానం నుండి
సాటి మనిషిని
క్రిమి కంటే హీనంగా చూసే
ఈ నీచ నికృష్ట రోగం నుండి
మనసంతా అంటుకొని
ఎప్పటికీ రగిలే
ఈ రావణ కాష్టం నుండి
గుండెలోని శాంతిని పెకిలించి
నిమిషం నిలువనియ్యక
కాల్చి బూడిద చేసే
ఈ కార్చిచ్చు నుండి
రక్తసిక్త రహదారులపై
గుట్టలుగా పేరుకుంటున్న
నగర బహిష్కృత జీవుల
ఈ సామూహిక హత్యాకాండ నుండి
***
ఎలా పారిపోగలవు
ఈ రాకాసి గాయం నుండి!
ఈ శోకతప్త గేయం నుండి!
ఇది అగ్ని పర్వతమై పగిలి
నీపై చింత నిప్పులు కక్కే గాయం
అంతరంగాన
కల్లోల కడలై ఉప్పొంగి
నిన్ను నిలువునా ముంచేసే గాయం
హృదయాకాశంలో
కారుమబ్బై కమ్ముకొని
ఎడతెగక కన్నీరై వర్షించే గాయం
ఈ గాయం
పరాజిత సైన్యం
యుద్ధభూమిలో
చేజార్చుకున్న పతాకం
ఇది జాతి నుదుటి పై
ఆత్మ హనన
ఖడ్గ లేఖనం
ఇది దగాపడ్డ
దేశ దేహం పై
రసి కారుతున్న
రాచపుండు
ఇది నిలువెల్లా చుట్టుకొని
తనువంతా దహిస్తున్న
సామాన్యుల
అసామాన్య అమానవీయ శోకం
ఇది
నిన్ను, నన్ను
ముద్దాయిలను చేసి
బోనులో నిలబెట్టిన-
ఎవ్వరినీ వదలని
ఎన్నటికీ మారని
ఎప్పటికీ మానని
గుండె లోపల
సెలవేసే గాయం!
*
మంచి poem అండి
గుండె లోపల సెల వేసే గాయం గురించి…బాగా రాశారు.. సర్👌👍.అభివందనలు.. మనసు ను కదిలించింది. కవిత!
.
చాలా బాగా వచ్చింది భాయ్ పొయెం. మీదైన ప్రత్యేక.శైలిలో శిల్పంతో…