కొండకి తోలిన ఆవులన్నీ మెల్లగా ఇండ్లకి చేరుకుంటున్నాయి. చేలల్లో వాలిన పక్షులు దొరికిన గింజలని నోటికి కరుచుకొని గూళ్ళకి చేరుకున్నాయి. మధ్యాహ్నం కన్నెర్ర చేసిన సూరీడు సాయంత్రం వేళకి చల్లబడి, కొండెక్కి ఆకాశం చాటుకి జారుకుంటున్నాడు. కంది పంట కోతలు అవ్వగొట్టి కొందరు ఆడవాళ్ళు అప్పుడే ఇంటికి చేరుకుంటున్నారు.
ఊళ్లో కంది కోతలు జోరుగా సాగుతున్నాయి. అందరికీ చేన్లుండటం వల్ల పంటకోతలకు మనుషులు దొరకటం లేదు. పక్కూళ్లో పనుల వల్ల అక్కడి కూలీలు కూడా రావటం లేదు. కసాలుగా ఉందని ఊరివాళ్ళు ఒకరి పంట తర్వాత మరొకరి పంట కోస్తూ ఉన్నారు.
కాసేపటికి చీకటి పడుతుందనగా గాటిపాటున కట్టేయడానికి ఎద్దుల్ని ముక్కుతాడు పట్టుకొని లాక్కెళ్తున్నాడు నాగేష్. ఇంటి బయట కూర్చొని, ఇసుక రాయి మీద కోత కొడవళ్ళు నూరుతూ వెంకటసామి కనబడ్డాడు.
“ఏంది మామా? యాలపొద్దున కొడవళ్ళు నూరుతన్నావు?” అడిగాడు నాగేష్.
“రేపు ఎగువ చేనులో కోత ఉందిరా అల్లుడూ! దానికే కొడవళ్ళు నూరుతాండ”.
“ఊరికి దగ్గరుండే చేలల్లో అయిపోయినాయా మామా కోతలు?”
“నిన్ననే! మొదటి మారు కొత్త కుంట చేన్లలో కోతలైనాయి. ఎగువ చేను దూరం కదా, రేపు చీకట్లో పోతే బూపొద్దుకి ఇంటికి వచ్చేయొచ్చు” అన్నాడు వెంకటసామి.
“సరే మామా! మబ్బయితా ఉంది. ఎద్దులు కట్టేసి, మేత పెట్టాలి. పోయొస్తా” అని నాగేష్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
‘రత్నమ్మా…ఓ రత్నమ్మా’ అని బయటి నుండి పిలుస్తూ వచ్చింది శివమ్మ. ఇంట్లో ఎవరూ లేరేమో, పలకలేదు. శివమ్మ గొంతు పెంచి ‘రత్నమ్మా..’ అని పిలిచింది. ‘‘ఎవరూ..’’ అని లోపల నుండి ఆడగొంతు వినిపించింది. ‘‘ఓసారి బయటికి రావమ్మా’’ అంది శివమ్మ.
కరెంటు పోయింది. చుట్టూ అంతా చీకటి. రత్నమ్మ కొడుకు నాని చెల్లితో ఆడుకుంటూ కడుగు నీళ్ళతొట్టిలో టార్చిలైటు పడేసాడు. దాన్ని వెంకటసామి విప్పదీసి పోయిన తేమని తుడిచి పెట్టినా పని చెయ్యటం లేదు. ఇంకో లైటు కొనాలంటే టౌనుకి పోవాలి.
రత్నమ్మ చేతిలో లాంతరు పట్టుకొని బయటికొచ్చింది. శివమ్మ వైపు చూసి “ఏంది చిన్నమ్మా ఈ యాలకాడ వచ్చినావు?” అంది.
“రేపు నేను, నా కోడలు ఊరికి పోవాలమ్మా! కోతకి రాలేము. అది చెప్పేకి వచ్చినాను” అంది శివమ్మ.
“ఏంది చిన్నమ్మా? ఇప్పుడు చెపితే ఎట్టా? ఈయాలప్పుడు ఇంకో ఇద్దర్ని నేను యాడ యెతికేది?”
“నేను ఏం చెయ్యనమ్మా? మా కోడలు నాయనకి పాణం బాలేదంట, మీ చిన్నాయన ఇప్పుడు చెప్పినాడు’’ అంది శివమ్మ.
“అయ్యో! అట్లాగా! చీకట్లోనే పోతాము కాబట్టి బూపొద్దుకి వచ్చేస్తాములే చిన్నమ్మా! ఈయలప్పుడు ఎవరినీ పిలవలేను. మనుషులు తగ్గితే పొద్దు దాటిపోతుంది. కొదవ పడుతుంది చిన్నమ్మా” అని రత్నమ్మ బతిమాలింది.
“రత్నమ్మా! నువ్వు ఇంతలా అడగాల్నా? కుదరదు కాబట్టే నేను రాలేనని చెప్తున్నా” అని చెప్పి శివమ్మ వాళ్ళ ఇంటివైపు వెళ్లిపోయింది.
నాని తన చెల్లి చిట్టిని ఆడిస్తున్నాడు. రత్నమ్మ వంట చేసుకుంటూ ఉంది. వెంకటసామి బయట నుండి ఇంట్లోకొచ్చాడు. రత్నమ్మని చూసి “ఏంది? ఇంకా అన్నం వండలేదా? ఇంతసేపు ఏం చేస్తున్నావ్?” అని గట్టిగా అరిచాడు.
“చేస్తున్నాగా! నాకేమైనా నాలుగు చేతులున్నాయా ఏంది? ఉన్నది రెండు చేతులాయే! పిల్లల్ని చూసుకోవాలి. ఇంటిని చూసుకోవాలి. ఇంగా పశువులు..” అని రత్నమ్మ కోపంగా అంది.
ఆ మాటల్లో కోపం కనపడింది వెంకటసామికి. ఆమెని ఎక్కువ కదపలేదు. ఇంటి బయట కట్టేసిన ఎద్దుల్ని గాటిపాటున కట్టేసి వాటికి శనగపొట్టు వేసి, చిట్టి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు.
రత్నమ్మ వంట పూర్తి చేసి, గిన్నెలు నట్టింట్లో పెట్టి భర్తని, కొడుకును పిలిచింది. పాపని పక్కనే కూర్చోబెట్టుకొని తినడానికి కూర్చున్నాడు వెంకటసామి. భర్తకి అన్నం పెట్టింది రత్నమ్మ. ‘‘శివమ్మ, ఆమె కోడలు రేపు కోతకి రారంట’’ అంది. వెంకటసామి ఏమీ అనకుండా తింటున్నాడు.
“ఇంకొంచెం పెట్టనా?’’ అని కొడుకు వంక చూసి అడిగింది. ఊ అన్నట్టు తలూపాడు.
‘‘ముందు ఇది తినువాయ్. మళ్ళీ కావాలంటే పెట్టించుకుందువులే’’ అంది. రత్నమ్మ కూడా కంచంలో వడ్డించుకొని తింటోంది. పక్కన పాప ఆడుకుంటోంది.
“చిట్టికి పాలు పట్టినావా?” అడిగాడు వెంకటసామి.
“ఇంకా లేదు. దానికి ఆకలిగా లేదనుకుంటా. ఇందాక పాలు పడితే తాగలేదు” అంది రత్నమ్మ.
తినటం పూర్తి చేసి, చేయి కడుక్కొని లేచి బయటికి వెళ్ళిపోయాడు వెంకటసామి. ‘‘నాకింక చాలుమా’’ అని తన పల్లేన్ని పక్కకి తోసాడు నాని.
పల్లెం వైపు చూసి “అందుకే అడిగినా ఎంత పెట్టాలని. నీ కళ్ళు కావాలంటాయి, కడుపు వద్దంటాది. చూడు, కూరతో ఎలా కలిపి పడేసినావో! ఇప్పుడు ఎవరు తింటారు? పోయి కడుగు నీళ్ళ తొట్టిలో పడేయి. నువ్వు రోజూ తొట్టిలో వెయ్యటం, ఆ జాల మేక వచ్చి తినటం. నువ్వు పడేసిన ముసర తిన్నాక, అదేమో మేత తినదు” అని రత్నమ్మ కొడుకును చూసి అంది. రత్నమ్మ చెప్పినట్టే మిగిలిన అన్నాన్ని తొట్టిలో వేసి, పళ్ళెం వాళ్ళ అమ్మ చేతిలో పెట్టాడు నాని.
“ముసిలాయమ్మ కిట్టమ్మ వాళ్ళ అరుగు కాడ ఉంటాది, పోయి పిలుచుకోరాపో. ఆయమ్మకు యవ్వారాలుంటే కూడు నీళ్ళు కావట్టవు” అని అత్త గురించి కొడుకుతో అంది రత్నమ్మ.
మొహం అంతా మాడ్చుకొని “పోమా, నేను పోలేనుపో అంత దూరం. ఆ దారంతా మొబ్బు” అన్నాడు నాని.
“ఏమి భయంరా నీకు? ఊరోల్లంతా బయట మంచాలేసుకొని కూచునుంటారు”.
‘నేను పోనే పోను’ నాని మొండిగా అన్నాడు. ‘‘మీ నాయనతో చెప్తానుండు’’ అని బయటికి నడిచింది రత్నమ్మ. ‘‘వద్దులే.. నేనే పోతా” అని బయటికి పరిగెత్తాడు నాని.
కాసేపటికి ముసలావిడ వచ్చి, అన్నం తిని బయట మంచంలో పడుకుంది. వెంకటసామి ఆవులకి మేతేసి, నీళ్ళు పెట్టి ఇంట్లోకి వచ్చాడు. రత్నమ్మ పాపకి పాలిస్తోంది. పక్కనే నాని నేల మీద పడుకున్నాడు. కొడుకుని ఎత్తుకొని మంచంలో పడుకోబెట్టాడు వెంకటసామి. పక్కనే ఇంకో మంచంలో నడుం వాల్చాడు. కాసేపటికి పాపని తీసుకొని వెంకటసామి పక్కన కూర్చుంది రత్నమ్మ.
“ఆ శివమ్మ చిన్నమ్మేందీ చివర్లో ఎగ్గొట్టినాది పనికి?” అంది.
“మన చేతుల్లో ఏముంది? ఆమె రానంటే ఏం చేస్తాము? ఉండేవాళ్ళతోనే కోత అవ్వగొట్టి రావాల. నువ్వు రాకుంటే చేనులో పని కాదు. బిడ్డ కోసం పనాపితే పంట కొదవ పడుతుంది. చాన్నాళ్ళకు పంట బాగొచ్చింది. అన్నీ బాగా అయితే రొంత అప్పయినా తీరుతాది. నానిగాణ్ని టౌన్ బళ్ళోకి పంపాలని చూస్తున్నా. కొదవ పడితే మళ్ళీ మనుషులు దొరకటం చాలా కష్టం” అన్నాడు వెంకటసామి.
“నేను కోత కొదవపడతాదని బయపడటం లేదు”
“మరి?”
“బూపొద్దు దాకా అంటే మీ అమ్మ పాపని పట్టుకొని ఉంటాది. ఇంకా ఆలస్యమైతే యాడ పట్టుకుంటాది? పోనీ చేన్లోకి మనతోపాటు తీసుకుపోదామంటే ఆడ నన్ను పని చెయ్యనియ్యదు. ఎత్తుకొని తిప్పాల” అంది రత్నమ్మ.
“మాయమ్మ బానే చూసుకుంటాదిలే! నానిగాడున్నాడు, ఇంకేమి? నువ్వు పడుకో. పొద్దున్నే లేపితే లెగనే లెగవు” అని అటు పక్కకి తిరిగి పడుకున్నాడు వెంకటసామి.
‘నేను లేయ్యకపోతే ఈయప్పే కదా ఇంటి పనంతా చేసేది’ అనుకొని పాపని నిద్రపుచ్చడానికి జోకొడతా ఉంది రత్నమ్మ. ఎంత జోకొట్టినా పాప నిద్రపోవటం లేదు. రత్నమ్మకి ఒళ్ళు అలిసి నిద్ర ముంచుకొస్తోంది. పాపేమో నిద్రపోవటం లేదు. ఏ అర్ధరాత్రో పాప కళ్ళు మూసుకుంది. అయితే రత్నమ్మ కంటికి కునుకు రాలేదు. రేపటి గురించే ఆలోచిస్తోంది. పాపని అత్త చూసుకుంటుందన్నా మనసు ఊరుకోవడం లేదు. చంటిబిడ్డని వదిలి వెళ్లాలంటే ఏదోలా ఉంది. అలా ఆలోచించుకుంటూ నిద్రపోయింది.
పాప ఏడుపు విని రత్నమ్మ ఉలిక్కిపడి లేచింది. పాపను జోకొట్టింది. దోమలు కుట్టాయేమో పాప ఏడుపు ఆపడం లేదు. అంతలా పాప ఏడుస్తున్నా పక్కనే పడుకున్న వెంకటసామి, నాని మాత్రం నిద్ర నుండి లేవలేదు. రత్నమ్మ పాపను ఎత్తుకొని కాసేపు తిప్పింది. ఎన్ని చేసినా పాప ఊరుకోవడం లేదు. ఆఖరికి ఉయ్యాల్లో వేసి, కాసేపు ఊపగానే మెల్లగా నిద్రపోయింది. రత్నమ్మ కూడా అక్కడే నేల మీద పడుకుంది. కాసేపు పడుకుందో లేదో కోడి కూసింది.
వెంకటసామి నిద్ర లేచి, ఉయ్యాల పక్కనే పడుకొని నిద్రపోతున్న రత్నమ్మ దగ్గరికి వెళ్లి “ఏయ్ లెయ్యి. కోడి కూసింది. నువ్వింకా పడుకున్నావు” అని తట్టి లేపాడు.
నిద్ర సరిపోక రత్నమ్మకి తలంతా పట్టేసినట్టు ఉంది. మెల్లగా లేచి ఉయ్యాల్లో ఉన్న బిడ్డ వంక చూసింది. చిట్టి చక్కగా నిద్రపోతోంది. రత్నమ్మ ఆ చీకట్లోనే కూలీ వాళ్ళందరి ఇళ్లకి వెళ్లి కోతలకు తయారవ్వమని చెప్పి వచ్చింది. ఇంటిపనంతా పూర్తి చేసి చేనుకి వెళ్ళేందుకు తయారైంది. బయట అరుగు మీద కూర్చున్న అత్తకి పాప జాగ్రత్త అని మరీ మరీ చెప్పింది. నానిని నిద్ర లేపి, ‘చెల్లాయిని ఏడిపించకుండా ఉండు, నేనొచ్చేదాకా’ అని చెప్పింది.
కూలీలతో కలిసి చేనుకి వెళ్లారంతా. మెల్లగా తెల్లవారుతోంది. ఇంట్లో ముసలావిడ ఆ పనీ, ఈ పనీ చేస్తూ ఉంది. నాని లేచి ఆడుకుంటున్నాడు. చిట్టి ఇంకా నిద్ర లేవలేదు. ‘వాళ్ళమ్మ ఇంటికొచ్చేదాకా ఇట్లాగే నిద్రపోతే బాగుండు’ అనుకుంది ముసలావిడ.
కాసేపటికి చిట్టి నిద్ర లేచి ఏడ్చింది. నాని చిట్టి దగ్గరికి వెళ్లి ఉయ్యాల్లో నుండి బయటికి తీసి ఎత్తుకొని తిప్పుతున్నాడు. కాసేపు ఏడ్చి పాప ఊరుకుంది. ఏడుపు ఆపగానే నేల విడిచిపెట్టాడు నాని. ఇందాక పిండిన పాలు తెచ్చి ముసలావిడ మనవరాలికి పట్టింది. ఆ పాలు తాగి తృప్తిగా నవ్వుతున్న చిట్టి పాలబుగ్గల్ని ముసలావిడ ముద్దాడింది.
కాసేపు అన్నతో ఆడుకున్న చిట్టికి అమ్మ గుర్తొచ్చినట్లుంది. ‘మా అమ్మ ఏదీ? నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళింది’ అన్నట్టు గట్టిగా ఏడుపు మొదలుపెట్టింది. బొమ్మ కోసం ఏడుస్తుందేమోనని నాని తన చేతిలో బొమ్మ పెట్టాడు. బొమ్మ పక్కన పడేసింది చిట్టి. ఆకలేస్తుందేమోనని పాలు పట్టాలని చూసింది ముసలావిడ. పాలు తాగడం లేదు. ఏడుపు ఆపడం లేదు. ఎత్తుకొని తిప్పినా ఏడుపు లాభం లేదు. గొంతు పగిలేలా ఏడుస్తోంది చిట్టి.
పాప ఏడుపుని ఎలా ఆపాలో అవ్వామనవళ్లకు తెలియడం లేదు. నాని చెల్లెల్ని బయటికి తీసుకెళ్ళి తిప్పుతున్నాడు. అయినా ఏడుపు ఆగడం లేదు. చుట్టుపక్కలుండే పిల్లలందరూ చిట్టి చుట్టూ చేరి తనను ఊరుకోబెట్టాలని చూస్తున్నారు. కానీ చిట్టి మాత్రం ఏడుపు ఆపటం లేదు. తన ఏడుపు ఇంకా పెరుగుతోంది. ఊళ్లో ఆడవాళ్ళు కొందరు వీళ్ళ దగ్గరికి వచ్చారు.
‘‘ఏమిరా, దాన్నట్లా ఏడిపిస్తా ఉన్నారు. ఏడ్చి ఏడ్చి దాని ముఖం చూడండి ఎట్లా అయినాదో! ఎంతసేపయ్యిందిరా ఇది ఏడ్సబట్టి” అని అడిగింది రవణమ్మ.
“కొంచేపునుండి ఏడుస్తా ఉందకా” అన్నాడు నాని.
“మీ యమ్మ యాడికి పోయుండాదిరా?” అని అక్కడికొచ్చిన ఆడవాళ్ళలో ఒకామె అడిగింది.
“కంది కట్టె కోసేకి పోయుండాది”.
“చిన్న బిడ్డని వదిలేసి పనికి పోయుండాదా?’’ అంది ఇంకో ఆమె.
“మా సేనులోకే మా యమ్మ పోయుండాది” అన్నాడు నాని. చిట్టి గుక్కపట్టి ఏడుస్తూ ఉంది.
పసిబిడ్డని ఇలా వదిలేసి పోతారా అని ఇంకో అమ్మఅంది. ‘ఏం చేస్తారు? మనుషులు దొరకడంల్యా. పంట కొయ్యకుండా ఉంటారా? పంట గూడా బిడ్డతోనే సమానమాయె. అందుకే పసిబిడ్డని కూడా వదిలిపెట్టి పోయుంటాది’ అని ఇంకో ఆమె సమాధానంగా అంది.
ఎన్ని చేసినా చిట్టి ఏడుపు ఆపడం లేదు. చిట్టికి ఏమైనా అవుతుందేమోనని అక్కడున్న ఆడాళ్ళంతా భయపడుతున్నారు. ‘‘ఓయమ్మా! ఈ పిల్ల ఏడ్చి ఏడ్చి అలిసిపోతా ఉంది. అయినా ఏడుపు ఆపడంల్యా. వాళ్ళమ్మ కాడికి తీసుకుపో రవణమ్మా’’ అన్నారు గుంపులోంచి ఎవరో.
‘‘ఎగువ సేను కాడికా? అది చానా దూరం. ఇదేమో ఏడుపు ఆపటంల్యా’’ అంటూ రవణమ్మ ఎగువ చేనువైపు కదిలింది. వెనకాల నాని, ఇంకొందరు పిల్లలు, ముగ్గరు ఆడవాళ్ళు కదిలారు.
‘‘ఒరేయ్ నానీ! నువ్వు బిరీన పోయి మీ అమ్మకి చెప్పుపో. మీ యమ్మ ఎదురొస్తాది’’ అంది రవణమ్మ.
సరే అన్నాడు నాని. కాని వాడికి దారి తెలియదు. ఊరికి దగ్గర్లో ఉండే చేనుకే తప్ప ఎగువ చేనుకు ఎప్పుడూ వెళ్లలేదు. పక్కిరమ్మ చేను దాటి, మొదటి మారులోకి వెళ్ళాడు. అక్కడ రెండు దారులున్నాయి. ఎటు నుండి వెళ్ళాలో తెలియటం లేదు. ఒక దారి వైపు మళ్ళాడు. అది ఎగువ చేనుకి పోయే దోవ కాదు. వాడు తప్పు దోవలో పోతుండటం చూసి ‘‘ఒరే! అటు కాదురా, ఇటు’’ అని దారి చూపించింది రవణమ్మ. నాని ఆ వైపు పరుగందుకున్నాడు.
అక్కడ పొలంలో “యవ్వారాలు సాలించి కొంచెం బెగ కొడవళ్ళు ఆడించండమ్మో” అని మునాల్లో వెనకబడిన కూలోళ్ల దిక్కు చూసి అన్నాడు వెంకటసామి. ‘‘ఆడించి ఆడించి సేతులు నొప్పిపుడతా ఉండాయప్పా యజమానీ, తొందర పడమాక! బూపొద్దుకి అయిపోతాదిలే’’ అంటున్నారు కూలోళ్లు.
వెంకటసామి పక్కనే మునం పట్టిన రేవతమ్మ ‘‘యో యజమానీ! నువ్వేందీ ఆడోల్ల మధ్యలో మునం పట్టినావు? ఆ చివరకు పోయి పట్టుపో. బాగొచ్చినవే ఆడోల్ల మధ్యలోకి. ఓ రత్నమ్మా! మీ ఆయప్పని నీ పక్కన ఉండే మునంలోకి పిలుసుకో. నిన్ను చూసుకుంటా మా మీద రొప్పకుండ ఉంటాడు” అంది ఎగతాళిగా.
“ఇంకేం సూస్తాడు రత్నమ్మని ఇద్దరు బిడ్డలు పుట్టినాక? బిడ్డలు పుట్టినాక కూడా వీళ్ళింకా పెళ్ళాల మొగాలు చూస్తారా రేవతమ్మా? వీళ్ళందరూ అంతే! ఇంగా సెప్పాలంటే ఆ నడూరి నాగేషుగాడి పెళ్ళాం మల్లెపూలు తేరా మొగుడా అంటే, తెచ్చిన కానీ పక్కింటి మంగమ్మ కొప్పులో పెట్టినా అన్నాడంట” అని తిరుపతమ్మ అనగానే అందరూ పెల్లున నవ్వారు.
రత్నమ్మ కూడా నవ్వుకుంటూ పని చేస్తోంది. ఉన్నట్టుండి చిట్టి నవ్వు మొహం గుర్తుకొచ్చింది. ‘చిట్టికి నేను కనపడకపోతే ఏడవకుండా ఉండదు. నానిగాడు, అత్త పట్టుకోగలుగుతున్నారో లేదో’ అనుకుంది. మొహంలో నవ్వు మాయమైంది. ఏమి బతుకులివి? కన్నబిడ్డల్ని చక్కగా చూసుకోలేని బతుకులు అనుకుంది. కోత కోస్తున్నా మనసంతా చిట్టి మీదే ఉంది. ఆ ధ్యాసలో కొడవలితో పంట కోస్తూ రత్నమ్మ చేయి తెంపుకుంది. నొప్పి పుట్టి చేయి చూసుకుంది. రక్తం కారుతోంది. ఈ రక్తం చూస్తే కూలోళ్లంతా పని ఆపి నా దగ్గరికొస్తారు. పనంతా నిలిచిపోతుంది అనుకొని చేతికి బట్ట చుట్టుకొని ఆ నొప్పిని భరిస్తూ కోత కోస్తోంది.
నాని ఎగువ చేనుకి చేరుకున్నాడు. ‘అమ్మా.. అమ్మా’ అని అరుస్తూ ఆయాసపడుతున్నాడు. దూరం నుంచి ఆ పిలుపు విన్న రత్నమ్మ గుండె చల్లబడింది. చిట్టికి ఏమైనా అయ్యిందా అన్న ఆలోచన రాగానే కాళ్ళు చేతులు ఆడలేదు. కొడవలి పక్కన పడేసి, నాని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్లి ‘ఏమైంది’ అని అడిగింది.
నాని జరిగిందంతా చెప్పాడు. వెంటనే రత్నమ్మ దారి పట్టింది. అడుగులు గబగబా వేస్తోంది. చేను దాటి, ఒక మలుపు దాటగానే రవణమ్మ, తన చేతుల్లో చిట్టి కనపడ్డారు. వాళ్ళని చేరుకొని చిట్టిని చేతుల్లోకి తీసుకుని గుండెలకి హత్తుకుంది. వెంటనే చిట్టి ఏడుపు మానేసింది. అక్కడే ఉన్న సీతాఫలం చెట్టు కింద కూర్చొని చిట్టిని ఒళ్లో పడుకోబెట్టుకొని చీరకొంగుని కప్పి పాలిచ్చింది రత్నమ్మ. అమ్మ కోసం ఏడ్చి, అలిసిపోయిన చిట్టి తల్లిపాలు తాగుతోంది.
చిట్టి చెంపలపై కన్నీటి చారలు చూసి, ‘అయ్యో! బిడ్డనింత కష్టపెట్టానే’ అని రత్నమ్మ గుండెల్లో బాధ నిండింది. కంట్లో నీటి చెమ్మ కిందకు జారింది.
*
ఇది నా చిన్నప్పడు నేను చూసిన కథే!
* హాయ్ రేణుక్! మీ గురించి చెప్పండి.
హాయ్! మాది కడప జిల్లా పులివెందుల దగ్గర్లో ఉన్న నల్లపురెడ్డిపల్లె. మా అమ్మానాన్నలు రైతులు. డిప్లొమా వరకు పులివెందులలో చదివి, ఆ తర్వాత మదనపల్లెలో ఇంజినీరింగ్ పూర్తి చేశాను. ప్రస్తుతం బెంగళూరులో ఐటీ రంగంలో పని చేస్తున్నాను.
* చిన్నప్పటి నుంచి సాహిత్యంపై ఆసక్తి ఉండేదా?
అలా ఏమీ లేదు. మా ఇంట్లో పుస్తకాలు చదివేవాళ్ళు ఎవరూ లేరు. నాన్న ఏడో తరగతి వరకు చదువుకున్నారు. అమ్మ అసలు బడికే వెళ్లలేదు. నేను చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్‌లో సినిమా పేజీ, స్పోర్ట్స్ పేజీ ఇష్టంగా చదివేవాణ్ని. ఇంట్లో ఏవైనా పుస్తకాలుంటే చదివేవాణ్ని. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో పీడీఎఫ్‌లు దొరికితే చదువుతూ ఉండేవాణ్ని. 2020లో లాక్‌డౌన్ టైంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన ‘చివరకు మిగిలేది’, ‘మైనా’, ‘కీర్తి కిరీటాలు’ పుస్తకాలు కొని చదివాను. అప్పట్నుంచి పుస్తకాలు ఇంకా చదవాలన్న ఆసక్తి మొదలైంది.
* పుస్తకాలు చదవడం ఎలాంటి అనుభవాన్నిచ్చింది?
నేను మనుషుల మధ్యలోనే ఉంటాను. కానీ మనుషులతో ఎక్కువ మాట్లాడను. టైం ఉంటే క్రికెట్ ఆడతాను. లేదా పుస్తకాలు చదువుతూ ఉంటాను. కళ్లకు కట్టినట్లు రాసిన రచనలంటే నాకు చాలా ఇష్టం. శీలా వీర్రాజు గారు రాసిన ‘మైనా’ నవల నేను మొదటిసారి కొనుక్కుని చదివిన పుస్తకం. అది నాకు చాలా నచ్చింది. పుస్తకాల గురించి తెలుసుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో రకరకాల పేజీలు చూసేవాణ్ని. వాళ్లు చెప్పిన పుస్తకాలు కొని చదివేవాణ్ని. ఇప్పటివరకు ఓ 30 పుస్తకాల దాకా చదివాను.
* రచయితగా ‘భగీరథ కోన’ నవలతో పాఠకులకు పరిచయమయ్యారు. దాని నేపథ్యం ఏమిటి?
పుస్తకాలు చదువుతూ ఉన్న సమయంలో నేను కూడా రాస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. మొదట ఓ సినిమా స్క్రిప్టు మొదలుపెట్టాను. ఒక పేజీ రాసి ఆపేశాను. ఆ తర్వాత బ్లాగ్ మొదలుపెట్టి రెండు, మూడు ఆర్టికల్స్ రాసి ఆపేశాను. ఆ తర్వాత చిన్నపిల్లల కథలు రాశాను. ఆ తర్వాత మరో పెద్ద కథ మొదలు పెట్టి ఆపేశాను. ఏదీ పూర్తి చేయలేదు. ఆ తర్వాత ‘భగీరథ కోన’ నవల రాశాను. అది బాగుంటే పుస్తకంగా తెద్దామని, లేదా నేనే దాచుకుందామని నా ఆలోచన.
నవల పూర్తి చేసి మా తమ్ముడికి పంపాను. చదివి బాగుందన్నాడు. ఆ తర్వాత జయ్‌పాల్ అని మా ఫ్రెండ్‌కి పంపాను. తను చదివి చాలా మెచ్చుకున్నాడు. ధైర్యం వచ్చింది. ఆ తర్వాత పుస్తకాన్ని ప్రచురించేందుకు పబ్లిషర్ల కోసం వెతుకుతూ ఉంటే ‘రేగి అచ్చులు’ ప్రచురణ సంస్థ నుంచి సాయివంశీ, గూండ్ల వెంకటనారాయణ కలిశారు. వాళ్లే పుస్తకాన్ని ఎడిట్ చేసి, పబ్లిష్ చేశారు. మొన్న డిసెంబర్ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో అది అందుబాటులోకి వచ్చింది.
* ‘ఎగువచేను’ మీ మొదటి కథ కదా! ఈ కథ నేపథ్యం ఏమిటి?
ఇది నా చిన్నప్పడు నేను చూసిన కథే! నేను పుట్టిన ఊరు ‘యంగన్నగారి పల్లె’. అది మా ఊరికి కొద్ది దూరంలో ఉంటుంది. ఆ ఊరికి ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు. అక్కడున్నప్పుడు మా బాబాయి కూతుర్ని ఇంట్లో ఉంచి, పిన్ని చేనుకు వెళ్లింది. పాప పాల కోసం ఏడుస్తుంటే తనను ఎగువచేనుకు తీసుకెళ్లారు. ఈ కథలోని వాతావరణం, పాత్రలు.. అన్నీ నిజమైనవే!
* ఇంకా ఏమేం రాయాలన్న ఆలోచనతో ఉన్నారు?
మరో నవల రాస్తున్నాను. అలాగే మరిన్ని కథలు రాయాలన్న ఆలోచన ఉంది.
*
Excellent
Nice story Renu…. great job, in future you make wonders