పదాలు ఆంగ్ల వస్త్రాలను విడిచిపెట్టి
ఈ రాత్రి ఖబరిస్తానంచున నృత్యం చేస్తూ
తన నాలుకను తానే పదే పదే
నిశ్శబ్దంతో పొడుచుకుంటున్న
పిచ్చి సాయిబు భాషను సంతరించుకుంది
నీలి కన్నీరు ఇంకీ ఇంకని వెన్నెల
నిస్సత్తువతో తన నైట్ షిఫ్టుకు వచ్చింది
పోరంబోకు హృదయాలు
అర్ధ నిమీలిత నేత్రాలు
వీటినే కవచాలుగా ధరించి
ఒక విరహపు ఉన్మాది గుంపు
మెల్లగా డాబా పైకెక్కీ
ఏ అడ్రస్సూ లేని
ఏ స్టాంపూ కోరని
పగిలిన గుండెల్ని మాత్రం
లంచంగా పుచ్చుకునే ప్రేమలేఖల్ని
రాయటం మొదలెట్టాయి
ఓ సున్నితమైన
సార్వజనీనమైన ఘోష
ఆకాశాన్ని మెత్తగా వెచ్చగా
అలుముకుంది
వాక్యాలు వ్యాకరణాంచుల్ని తోసిపారేసి
అసహజ వాంఛలున్న సమూహంతో కలిసి
అర్థరాహిత్యపు వీధుల్లో నగ్నంగా
దిక్కులు దగ్ధమయ్యేలా రోదిస్తున్నాయ్!
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
Awesome poetry bro. Welcome to the telugu poetry world.
Thank you !
Excellent poem