కాలచక్ర పరిభ్రమణమో, పాలకవర్గ భావజాలమో, యథాస్థితి వాదమో, కొత్తగా ఆలోచించడానికీ ఆచరించడానికీ భయమో, అమాయకత్వంలో, అజ్ఞానంలో ఉండే ఆనందమో కారణమేదైనా కావచ్చు, అత్యంత అసాధారణ సందర్భాలను కూడ అతి సాధారణ సందర్భాలుగా చలామణీ చేసుకునే నేర్పు మానవజాతికి అబ్బింది.
నిజానికి ప్రతి సందర్భమూ అసాధారణమే. ఏ సందర్భమైనా మరే సందర్భంతోనూ పోల్చడానికి వీలు లేనంత విశిష్టమైనది. ఇద్దరు మనుషుల మధ్య పోలిక ఉన్నట్టే, రెండు సందర్భాలలోని ఏవో కొన్ని దృగ్గోచరాంశాలలో పోలిక ఉండవచ్చు గాని ప్రతి ఒక్క మనిషీ తనకు తానే అయినట్టుగానే ప్రతి సందర్భమూ దానికదే. దాన్ని మించినవీ ఉండవచ్చు, దాన్ని చేరరానివీ ఉండవచ్చు గాని దానితో సర్వసమానమైనది మాత్రం లేదు, ఉండదు. ఒక వేలి ముద్ర లాంటి మరొక వేలి ముద్ర ఉండనట్టు ఏ సందర్భానికి ఆ సందర్భమే. అందువల్ల ప్రతి సందర్భమూ అసాధారణమే, ప్రత్యేకమే. విలక్షణమే.
మరి అంత అసాధారణత్వాన్ని గ్రహించే, భరించే, అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు మానవ మేధకు లేవా? ఏ కారణం వల్ల మనం అటువంటి అసాధారణ అనుభవాన్ని కూడ అతి సాధారణంగా గ్రహించి ముఖం తిప్పుకుని పోతున్నాం? ఎందువల్ల అది మన కళ్లకు కనబడలేదన్నట్టు, చెవులకు వినబడలేదన్నట్టు, దాని విశిష్టతను మన మెదడు గ్రహించలేదన్నట్టు నిర్లిప్తతలో కొనసాగుతున్నాం? లేదా ఎందువల్ల నటిస్తున్నాం? అసాధారణతను గుర్తించడం మన ఆచరణను అపేక్షిస్తుందని భయమా? ఆచరణంటే అది ఎంత సూక్ష్మస్థాయి, స్వల్పస్థాయి ఆచరణైనా బలి కోరుతుందనే అనుమానమా?
ఇది మానవ సహజం కాదేమో. అట్టడుగున అంతమందిమీ మానవులమే అని శ్రీశ్రీ అన్నట్టు, అట్టడుగున ప్రతి ఒక్కరమూ శైశవం దాటి వచ్చినవాళ్లమే గనుక మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అబ్బురపడి, దాని అసాధారణత్వాన్ని గుర్తించి నడిచి వచ్చినవాళ్లమే. ఎక్కడో ఆ స్వభావం మారిపోయింది. ఆ సహజ, సహజాత, నైసర్గిక, శైశవ అంతరాంతర లక్షణాన్ని వదులుకొని దేనికీ ఆశ్చర్యపడని, ఏదీ ఆశ్చర్యపరచని నిరామయ నిస్సంగ అవర్ణ స్థితప్రజ్ఞ మానసాలుగా మనను మనం ఎప్పుడు ఎక్కడ పోగొట్టుకున్నామో వెతుక్కోవలసే ఉంది.
అటు చివరికో ఇటు చివరికో కూడ పోనక్కరలేదు. అన్నిటినీ అసాధారణంగా చూడనక్కరలేదు. అన్నిటినీ సాధారణంగానూ చూడనక్కరలేదు. ఉన్నదేదో ఉన్నట్టుగా చూడడం, రాగమో ద్వేషమో సహజంగా ప్రకటించగలగడం, ఉద్వేగాల ఉధృత జలపాతాలను మర్యాదల జల్లెడల మీదా మన్ననల ఆనకట్టల వెనుకా ఆపకపోవడం ఇవాళ కావలసి ఉంది. మరీ ముఖ్యంగా ఈ అసాధారణత్వానికీ సాధారణత్వానికీ మధ్య గతితార్కిక సంబంధం అర్థం చేసుకోవలసి ఉంది. మనిషిని లోలోపలినుంచి కదల్చి, ఊగించి, శాసించి నినాదంగా, పతాకగా, పిడికిలిగా మార్చగల అసాధారణ సందర్భాలను సాధారణ సందర్భాలుగా దిగజార్చడంలో వ్యవస్థ ప్రయోజనం ఉందేమో, మనను అనార్ద్ర ఘటాలుగా మార్చి వ్యవస్థ తన పబ్బం గడుపుకుంటున్నదేమో అర్థం చేసుకోవలసి ఉంది.
ఈ ద్వంద్వం గురించి లోతుగా ఆలోచిస్తుంటే ఈ అంశాన్ని చర్చిస్తూ ఒకే తలంలో వెలువడిన రెండు పరస్పర విరుద్ధమైన వాదనలు గుర్తుకొస్తున్నాయి.
పాబ్లో నెరూడా జీవితం మీద, కవిత్వం మీద అపారమైన కృషి చేసిన ఆడమ్ ఫెయిన్ స్టీన్ మహాకవి రాసిన ఓడ్స్ గురించి వ్యాఖ్యానిస్తూ అవి సాధారణాన్ని అసాధారణంగా మార్చడానికి జరిగిన అద్భుత ప్రయత్నాలని అన్నాడు. “తన స్నేహితుడు పాబ్లో పికాసో లాగనే నెరూడాకు కూడ సాధారణాన్ని అసాధారణంగా మార్చే గొప్ప నైపుణ్యం ఉంది. ఆ పరుసవేది విద్య అన్నిటికన్న జేగీయమానంగా ఆకర్షణీయంగా ఓడ్స్ లో వ్యక్తమైనట్టుగా మరెక్కడా వ్యక్తం కాలేదు. అందుకే అవి పాఠకులలో ఆపుకోలేని జీవితేచ్ఛను రగిలించేలా ప్రకాశిస్తాయి” అన్నాడు.
మరొకపక్క, సగటు మనుషులలో అత్యవసరమైన, ముఖ్యమైన చేదునిజాల పట్ల ఉదాసీనతను పెంచడానికి వ్యవస్థ ఉపయోగించే కుతర్క వ్యూహంలో వాటిని మామూలు ఘటనలుగా మార్చడం ఒకటని మహాశ్వేతాదేవి అన్నారు. నాజీల దుర్మార్గాల మీద వెల్లువగా వచ్చిన సినిమాలు మొదట్లో నాజీల పట్ల కొంత వ్యతిరేకతను రగిల్చినప్పటికీ క్రమక్రమంగా అవి అందుకు వ్యతిరేకంగా మారిపోయాయన్నారు. ఆ దుర్మార్గాలను చూడడం, ప్రతిస్పందించకపోవడం, మౌనంగా, పరోక్షంగా ఆమోదించడం, చివరికి ప్రత్యక్షంగా ఆమోదించి, పాల్గొనడం అనే వరుస సాగిందని ఆమె అన్నారు.
ఆధునిక మానవ జీవనంలో రెండు పరిణామాలూ నిజమే కావచ్చు.
మన కళ్ల ముందర కశ్మీర్ విషాదం, పౌరసత్వ రద్దు విషాదం వంటి లక్షలాది మంది మనుషుల మీద అమలవుతున్న దుర్మార్గం నుంచి, ఏ ప్రబలమైన కారణమూ సాక్ష్యాధారమూ లేకుండా సంవత్సరాల తరబడి వాక్సభాస్వాతంత్ర్యాలు రద్దయి చెరసాలలో మగ్గిపోతున్నవాళ్ల దాకా, ఆకలి, దుఃఖం, రోగం, నిరుద్యోగం, అత్యాచారం, హింస, దౌర్జన్యం… ఎన్నెన్ని నిష్పూచీగా జరిగిపోతున్నాయి! అన్నిటినీ ఎంత మామూలుగా తీసుకుంటున్నాం! మనుషులమైనందుకు, నాగరికులమని చెప్పుకుంటున్నందుకు ఎంతమాత్రమూ సహించడానికి వీలులేని ఎన్ని అసాధారణ పరిణామాలు ఎంత సాధారణంగా, మన నుంచి ఉలుకూ పలుకూ లేకుండా జరిగిపోతున్నాయి!
*
Add comment