పల్లవి:
“ఇంకెం ఇంకెం ఇంకెం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరనాల్లే
గుండెల్లోన వేగం పెంచావే
గుమ్మంలోకి హోళి తెచ్చావే
నువ్వు పక్కనుంటె ఇంతెనేమోనే
నాకొక్కో గంట ఒక్కో జన్మే
మళ్ళీ పుట్టి చస్తున్నానే
ఇంకెం ఇంకెం ఇంకెం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరనాల్లే
చరణం1:
ఊహలకు దొరకని సొగసా
ఊపిరిని వదలని గొలుసా
నీకు ముడి పడినది తెలుసా
మనసున ప్రతి కొస
నీ కనుల మెరుపుల వరసా
రేపినది వయసున రభసా
నా చిలిపి కనులకు బహుశా
ఇది వెలుగుల దశ
నీ ఎదుట నిలబడు చనువే వీసా
అందుకుని గగనపు కొనలే చూసా.
ఇంకెం ఇంకెం ఇంకెం కావాలే
చాల్లే ఇది చాల్లే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరనాల్లే
చరణం 2:
మాయలకు కదలని మగువా
మాటలకు కరగని మధువా
పంతములు విడువని బిగువా
జరిగినదడగవా
నా కథని తెలుపుట సులువా
జాలిపడి నిముషము వినవా
ఎందుకని గడికొక గొడవా
చెలిమిగ మెలగవా
నా పేరు తలచితె ఉబికే లావా
చల్లబడి నను నువు కరుణించేవా
ఇంకెం ఇంకెం ఇంకెం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరనాల్లే
*
రచయిత:అనంత శ్రీరామ్
సంగీతం:గోపిసుందర్
గానం:సిద్ శ్రీరామ్
సినిమా:గీత గోవిందం
అందరి మనసులలో పచ్చబొట్టేసాడు.పాటలతో ఏదో మాయ చేసి ” ఏం మాయ చేసావే” సినిమా పాటలకు ఫిల్మ్ ఫేర్ అవార్డు,నంది అవార్డు గెలుచుకున్నాడు.
“మరువాలి కాలాన్ని” అనే పాటతో తూటా పేల్చాడు.
ఇప్పటికీ సూమారుగా ఓ వెయ్యి పాటలు రాసి ఇంకా ఇంకా అంటూ పాటల వేటలో నిమగ్నుడైన అనంతుడు
అనంత శ్రీరామ్ ఈ రోజు మన పాట రచయిత.పేరు చెప్పకముందే ఇంకా ఏదైనా చెప్పొచ్చు .పేరు చెప్పాక ఇక అతని గురించి చెప్పనవసరం లేదన్న నిజం అందరం ఒప్పుకోవాలి.పశ్చిమగోదావరి జిల్లా దొడ్డిపట్ల ఈయన స్వస్థలం.సత్యనారాయణ,ఉమారాణి ఈయన తల్లిదండ్రులు.పన్నెండు సంవత్సరాల వయసునుండే పాటలు రాసేవాడు.ఇంజనీరింగ్ విద్యనభ్యసించి పాటల మీద మక్కువతో సినీరంగం వైపుకు మొగ్గుచూపాడు.”కాదంటే ఔననిలే “అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు.
“పాటకు ప్రాణం పల్లవి అయితే” అనే పాట విన్నాం కాని ఈ పాట ఆ విషయాన్ని నిరూపించింది. రచయిత పల్లవిని మళ్ళీ మళ్ళీ రాస్తూ ఇంకేం రాయాలి అనుకుంటూ విసిగిపోయి ఈ వాక్యాలను రాశానని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఇలాంటి పదాలు అరుదుగా ఓ మెరుపుమెరిసినట్టుగా తగులుతాయి.ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి కాని పాట రాయటమంటే యాగమే.పల్లవిలో రచయిత ప్రేమ సంబంధిత అంశాల కలబోతల సంతోషాన్ని “తిరునాళ్ళ”తో ముడిపెట్టాడు.తిరునాళ్ళు అంటే “జాతర” లేదా ప్రతి ఏటా జరుపుకునే ఉత్సవము.ఇటువంటి జాతరలు ఇప్పుడు తక్కువే జరుగుతుండొచ్చు కానీ కొద్దిగా వెనక్కి వెళ్ళి అవగాహన చేసుకుంటే ఆ జాతరలో ,దేవుని పండగలలో ప్రజలు పాలుపంచుకొని ఎంత ఆనందంగా ఉండేవారో మనం అర్థం చేసుకోవచ్చు.రచయిత ఈ ఒక్క పదాన్ని తీసుకొని ప్రేమికుని జీవితంలోకి ఆ అమ్మాయి ఓ పండగలా వచ్చి చేరిందని పరోక్షంగా అర్థాన్ని స్ఫురింప చేశాడు.
పల్లవిలో వేగం,హోళి అనే పదాలను చాకచక్యంగా వాడుకొని పొరలు పొరలుగా పాటకు పటిష్టమైన నిర్మాణాన్ని అమర్చాడు.అనుకోని సంఘటన ఎదురైనప్పుడు గుండె వేగం పెరగటం సహజం.తన ఊహల్లోని అమ్మాయే అనుకోకుండా తన జీవితంలోకి ప్రవేశిస్తే ఎవరి గుండైనా గుర్రమై దౌడుతీస్తుంది.హోళి అంటే రంగుల పండగ .అన్ని రంగులు ఒకే సారి జీవితంలోకి రావు .అలా వచ్చాయంటే gifted అని అనుకోవచ్చు.ఇక్కడ రచయిత అమ్మాయి,ప్రేమికుడి జీవితంలోకి రంగులు తెచ్చిందని చెబుతూ ఆమె పక్కనున్నంత సేపు రంగుల పండగేనని వాక్యాల రూపంలో పురివిప్పాడు.
మనిషికి ఒకటే పుట్టుక,ఒకటే మరణం.విభిన్నంగా రచయిత ” నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చస్తున్నానే” అనే వాక్యాలను పలికిస్తాడు.ఈ వాక్యాల్లోని సాహిత్య పరిమళాల గుబాళింపును పీల్చుకోని హృదయం ఉండదనుకుంటా. రచయిత ఇక్కడ ప్రేమికుడికి దగ్గరగా ఆ అమ్మాయి ఉండే స్థితిని పుట్టుకగా,లేనప్పటి బాధను మరణంగా తీసుకొని ఉంటారు.మొత్తంగా ఆమె తనతో ఉన్నంతసేపు అతనికిక మరణంలేదన్న సారాంశం పాటకు కావలసిన సాహిత్య దాహన్ని తీర్చినట్టుగా కనబడుతుంది.
చరణంలో రచయిత సొగసు,గొలుసు అనే పదాలతో చక్కని ప్రాసతో ప్రారంభించాడు.మనసు కొసలను ముడేసే వాక్యాల నిర్మాణం రచయిత యొక్క సాహిత్యపరమైన లోచూపును పట్టిస్తుంది.ఈ చరణంలో కళ్ళకు మెరుపులను అద్దుతాడు,వయసుకు వయసుతో గొడవ పెట్టిస్తాడు.మెరుపులతో వెలిగిపోతున్న ఆమె కౌమారాన్ని వైవిధ్యంగా పదాలలో పేర్చిపెట్టి ఒద్దికగా దృశ్యీకరించాడు.”వీసా” అనే పదాన్ని వాడడం రచయిత నవీన దృక్పథాన్ని తెలియపరుస్తుంది.వీసానిక్కడ ఆ అమ్మాయితో చనువుగా మాట్లాడడానికో అనుమతిపత్రంగా చెప్పటాన్ని,గగనపు కొసలను అందుకోవడమనే ఊహలను పరిశీలిస్తే రచయిత అభివ్యక్తులలో కొత్తదనాన్ని నింపటం కోసం ప్రాముఖ్యతనిస్తాడని అర్థమవుతుంది.
ఇక రెండవ చరణమంతా అమ్మాయి స్వభావాన్ని అబ్బాయి మాటలలో వివరించి చెప్పించినట్టుగా సాగుతుంది.ఇందులో రచయిత ఒక నిబద్దత గల అమ్మాయి గురించి రాస్తూ,అనుకోకుండా తన ప్రమేయం లేని తప్పుతో అమ్మాయితో ఇరకాటంలో పడ్డ అబ్బాయి పలికే వాక్యాలు రాయాలి.అమ్మాయి గురించి రచయిత మాయలకు లొంగదని,మాటలకు కరగదని ,పంతం విడువదని రాస్తూ ఆమె గురించి “మధువా”అని తేనెతో పోలుస్తాడు.ఇంతలా బెట్టు చేస్తున్న ఆ అమ్మాయి సోయగాన్నంతా ఈ ఒక్క పదంలో కూర్చొబెట్టి సాహిత్య పిపాసకుల మదిని తుత్తునియలు చేస్తాడు.మిగిలిన సగంలో తనని అర్థం చేసుకోవాలని నన్ను కరుణించాలని వేడుకుంటున్నట్టుగా అమ్మాయిని చల్లబరిచే వాక్యాలు రచయిత అబ్బాయి నోటితో పలికిస్తాడు.వీళ్ళిద్దరి మధ్య ఉండే గొడవను తెల్పటానికి “లావా” పద ప్రయోగం చేయటం ఈ పాటకు కొసమెరుపు.
*
ఆ పాటలోని అంతర్లీనమైన భావాలను పండును వలిచినట్లు విశదీకరించడం బాగుంది మిత్రమా అభినందనలు
ధన్యవాదాలు అన్న..
మమ్మల్ని పాటవైపు మళ్ళించి అందులో ఎవరూ చూడని లోతులని చూపించారు అన్నా.ఒక్కో పదం వెనుక అంతరార్థం బాగా పట్టుకున్నారు.తిరునాళ్ళు,హోళి మొదలైన పదాలను విశ్లేషించిన తీరు చాలా బాగుంది అన్న.
ధన్యవాదాలు తమ్ముడు..
Good analysis on inkem inkem kavali song.It shows your ability on literature.So good Hareesh.
Thank you very much sir..
మా అబ్బాయి చాలా ఇష్టమైన పాట ఇది. ప్రతిరోజూ ఉదయం మా ఇంట్లో వినోపించే పాట ఇది. ఈ పాటపై మీ విశ్లేషణ చాలా బాగుంది.
Thank you very much anna..
‘ఎందుకని గడికొక గొడవ’ అనే పాట పై నీవు రాసిన వ్యాసం చదివాను. బాగుంది. అభినందనలు హరీష్ !
Thank you very much sir..