ఎండమావులు

“పొద్దుపొడిశి బారెడెక్కింది. ఎవరన్న మబ్బుల్నేలేశి వాకింగో ఎక్సర్‌సైజో చేస్తరు. వీళ్లేమొ రాత్రి పన్నెండుదాక ఫోన్ల తలవెట్టి తెల్లారి ఎనిమిదింటిదాక నిద్రలేవరు. అయ్యా కొడుకులు నవాబుల్లెక్క పండుకున్నరు! లేవండి” అంటూ దుప్పటి లాగేసి, కిటికీ కర్టెన్ పక్కకు జరిపింది సునీత.

ఎండపొడ సురుక్కుమని తగిలేసరికి చిన్నోడు మరింత దగ్గరికి జరిగి తండ్రిని బల్లిలా కరుచుకుని పడుకున్నడు. అమ్మ సుప్రభాతం మొదలైంది అనుకుంట పెద్దోడు తలగడ తీసి చెవుల మీదుగా పెట్టుకుని గట్టిగ అదుముకున్నడు

“ఏందే నీలొల్లి? ఈరోజాదివారమే కదా! దొర్కక దొర్కక ఒక్కరోజు సెల్వు దొర్కితే లెవ్వక ముందే భజన మొదలుపెట్టినవ్” అని చందు దుప్పటి పైకి లాక్కున్నడు.

“రాత్రేమో బుద్దిమంతుని లెక్క కథలు బాగనే చెప్తవు! తెల్లారితే అన్ని మర్చిపోతవు” అనుకుంట ఈసారి దుప్పటి మొత్తం లాగేసి సోఫాలోకి విసిరేసింది సునీత.

ఇక లేవక తప్పేటట్టు లేదని పెద్దోడు కళ్ళు నులుముకుంట, ఫోన్ చేతిలో పట్టుకుని హాల్లోకి నడిచిండు.

“డాడీ చిప్‌‌లో మెమోరీ ఫుల్ అయితదని చెత్తనంత ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తడు! కద డాడీ” అంటూ చిన్నోడు ఆవలింతలు తీసిండు.

“వెధవా! ముందు నిన్ను తన్నాలే! వేలెడంతలెవ్వు నువ్వూ, నీ మొబైల్ భాషా” అంటూ వాడి పిర్ర మీద ఒక్కటిచ్చుకొని, “వెళ్ళు! లేచి పండ్లు తోమి, స్నానం చేసి హోంవర్క్ పూర్తి చెయ్” అంటూ బయటకు పంపింది.

“ఏంది మీ గోల? నిద్రనన్న తృప్తిగా పోనియ్యవా” అంటూ లుంగీ సదురుకున్నడు చందు. “లే! ఇవన్ని ఎవడు మడతపెట్టాలె? నాకు బయట పనుంది. గాడిదలోలగ పెరిగిండ్రు. గీ పక్క దులిపి మడిచిపెట్టరాదు‌ ఒక్కనికి. మొత్తం మొగోల్లరాజ్యమైపోయింది. అంతా దోడ్, దోడు. ఒక్క ఆడపిల్లున్నా ఇల్లెంత ప్రశాంతంగుండునో” అని దుప్పట్లు మడత పెట్టింది సునీత.

“ఫంక్షన్లకు పోయినప్పుడు బంధువులు అడుగుతుంటే తలెత్తుకోలేకపోతున్న! పిల్లలు పెరుగుతున్నరు. పెద్దోనిది వచ్చే యాడాది టెంత్ అయిపోతది. తర్వాత రెండేండ్లకే చిన్నోడు. వీళ్ళ అత్తెసరు చదువులకు ర్యాంకులొచ్చి ఫ్రీసీట్లేమి తెచ్చుకోరు. డబ్బులు కట్టి చదువులు కొనాల్సిందే! ఎన్నేండ్ల నుంచి మొత్తుకుంటున్నా నీకు చెవి మీద పేను పారుతలేదు. ఇప్పటికన్నా మించిపోయింది లేదు. ఏదో వొకటి ధైర్యం చెయ్యకపోతె పోరగాండ్ల నోట్లె మన్నువోసినట్టే” అనుకుంట వంటింట్లకి నడిచింది.

చందు మొబైల్ ఆన్‌చేసి నాలుగు నెంబర్లను వెతికి పట్టుకున్నడు. మొదటి నెంబరుకు డయల్ చేస్తే స్విచ్ఛాఫ్‌. రెండో నెంబర్‌కు ట్రై చేశిండు. ‘దయచేసి నెంబరు సరిచూసుకోండి” అని సమాధానమొచ్చింది. ఎప్పుడో నాలుగేళ్ళ కింద తీసుకున్న నెంబరు. ‘నాలాగ వాడు యేండ్లకేండ్లు ఒకటే సిమ్ వాడుతడా?’ అనుకుంట మూడోనెంబర్‌కు డయల్ చేశిండు. బిజీ. ‘ఎవరితోనో మాట్లాడుతుంటడులే! నేను తప్ప అందరూ బిజీనే’ అనుకుంట నాలుగో నెంబర్‌కు చేద్దామనుకునేలోపు ఇన్‌కమింగ్ కాల్ వచ్చింది. ఆత్రంగా లిఫ్ట్ చేశిండు.

“అన్నా నమస్తే! చాలా రోజులకు మా మీద దయగలిగిందేమే! ఏం సంగతన్నా” అవతలివైపు నుంచి రవ్వంత వ్యంగ్యం ధ్వనించింది.

“తమ్మీ! ఎక్కడున్నవు? కొంచెం పనివడ్డది. ఎక్కడ కలవాలె నిన్ను?” అన్నడు చందు.

“మార్కెట్ల వున్న అన్నా! అర్దగంటల బ్లాకాఫీసు దగ్గరికొస్త. అక్కడికి రా” అన్నడు అవతలి వైపు నుంచి.

“సరే వస్త” అని కాల్ కట్ చేసి బాత్రూంలోకి దూరిండు.

పదిహేను నిముషాల్ల రెడీ అయ్యి హాల్లకొచ్చిండు. బయటకు నడవబోతుంటె, “ఆగు! టిఫిన్ చేసిపో. బయటకు వెళ్తే ఎంతసేపైతదో?” అనుకుంట ప్లేట్లో రెండు దోశెలు వేసి చేతికిచ్చింది సునీత.

“ఫోన్ చేస్తే నాన్న రెండు లక్షలు తెస్తానన్నడు. నీ చిట్టీ ఎలాగూ ఆఖరి నెల కాబట్టి అవి రెండు లక్షల వరకూ వస్తయి. నా నెక్లెస్ ఇస్త. దానిమీద లోను తేవచ్చు. అవీఇవీ కలిపి అయిదారు లక్షలైతయి. ఇంకో లక్ష రూపాయలు అటోఇటో అయినా పర్లే, నువ్వు గీత గీసుకొని కూర్చోకు” అని తల్లిలా చందుకు జాగ్రత్తలు చెప్పింది సునీత.

“సరేలేవే! ఏదో వొకటి అయితది. ముందు వెళ్ళనీ” అన్నడు చందు. పని‌ అవుతుందో లేదో అన్న సందేహంలో మూతి తుడుచుకుంట బయటకొచ్చి బైక్ స్టార్ట్ చేశిండు.

*****

సిద్ధిపేట బ్లాకాఫీసు చౌరస్తా. ఒకప్పుడు అక్కడ పురుగు గూడా కనిపించేదిగాదు. ఇప్పుడు అదీ బిజీసెంటరే కాదు, మంచి బిజినెస్ సెంటర్. నాలుగురోడ్ల కూడలిలో బాబూజగ్జీవన్ రామ్ ఎత్తైన విగ్రహం. చుట్టూ ఫౌంటెయిన్లు నీళ్ళు చిమ్ముతుంటె చూడముచ్చటగ వుంటది. నాలుగు వైపులా ఉన్న రోడ్లకు రెండు వైపులా డివైడర్ల మధ్యలో పచ్చగ, ఏపుగ పెరిగిన చెట్లు. పేరుకు తగ్గట్టు కనిపించినంత దూరంలో సీతాకోకచిలుకలు వరుసలో ఎగురుతున్నయా అన్నట్టు బటర్‌ఫ్లై లైట్లు. సుడా(సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) వాళ్ళు పెట్టిన భారీ హోర్డింగులు, పెద్ద పెద్ద భవనాలు, ఖరీదైన షాపింగ్ మాల్స్, టిఫిన్ సెంటర్లు, టీపాయింట్లు.. వచ్చీపోయే బండ్లతో రద్దీగ వుంటుంది. పరిశుభ్రతలోగాని, పచ్చదనంలోగాని రాష్ట్రంలో పట్టణానిదొక ప్రత్యేకత. మొత్తంగ మెట్రోపాలిటన్ మహానగరాన్ని తలపిస్తున్నది.

బైకు పార్కు చేసి జేబులోంచి ఫోన్ తీస్తుంటే దూరంగ ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ ఇటువైపు రమ్మని సైగ చేశిండు. అతను తిరుపతిరెడ్డి అని పోల్చుకున్నడు చందు. తిరుపతి ఆజానుబాహుడేం కాదుగానీ మంచి పర్సనాలిటీయే. ఐదువేళ్ళకు ఐదుంగరాలు. చేతికి రెండువేళ్ళ వెడల్పున్న బ్రాస్‌లెట్. మెడలో నాలుగు వరసల లే‌టెస్ట్ డిజైన్ చైన్, జేబులో రేబాన్ కళ్ళజోడు. దేహమంతా లోహకళ.

ఫోన్ మాట్లాడుతూనే హోటల్ లోపలికి తీసుకెళ్ళి ఒక మూలనున్న టేబుల్ చూపిస్తూ కూర్చోమన్నట్టు సైగచేశిండు.

“అన్నా! హైదరాబాద్ రోడ్ రాజీవ్ రహదారి. కలెక్టరేట్‌కు కిలోమీటర్ దూరం. డి.టి.పి.సి లేఅవుట్. రోడ్ దిగంగనే రెండోబిట్టు. తూర్పు మొఖం ప్లాటు. గజానికి పదివేలు నువ్వు మనోనివి కాబట్టి కోషిశ్ చేశి ఎనిమిది వేలకు పెట్టిస్త. నీకు సిద్దిపేట సుట్టుపక్కల ఇంతసస్త ఎక్కడ దొరుకది! నువ్వు రా అ‌న్నా, ముందుగాల వెంచర్ చూడు. నువ్వేకొంటవు” మోకు లేకుంటనే తాటిచెట్టు ఎక్కిస్తున్నట్టు ఫోన్లో ఎవర్నో గాలిలో ఊరేగిస్తున్నడు తిరుపతి.

“ఇగో అన్నా! నువ్వు ఏముచ్చటైన గంట వరకు ఆలోచించుకొని చెప్పు. ఇంకో పార్టీరెడీగ వున్నది. నువ్వు కాదంటె వాళ్ళకు బయాన రాయిస్తా. ఓకేనా…” అంటూ ఓ రాయి విసిరి ఫోన్ పెట్టేశిండు.

“ఏం జెయ్యాలన్నా! దమాక్ తింటరు. కొనరు, పీకరు. వొర్రిత్తరు. ఆర్నెల్ల నుంచి గిదే నస. వీనికి చూపిచ్చినంక ఇప్పటికి ఇర్వై ప్లాట్లమ్మిన. మీవోడే నరేందర్ సారు! మీ టీచర్లేగిట్లుంటరేందే?” అని, “అన్నా ఏమనుకోకు. నువ్వట్లగాదులే” అంటూ నవ్విండు తప్పును సరిదిద్దుకుంటున్నట్టు.

“అన్నా టిఫిన్ చేస్తవా?” అన్నడు తిరుపతి.

“వద్దు తమ్మీ! ఇప్పుడే తిన్న” అన్నడు చందు మొహమాటంగా.

“షరీఫ్ భాయ్! దో చాయ్‌ లావ్” అని “అన్నా చెప్పు” అంటూ అసలు విషయంలోకొచ్చిండు తిరుపతి. విషయం వున్నదున్నట్టు చెప్పేశిండు చందు.

“నేను చెప్తే విన్నవా అన్నా! ఎన్నిసార్లు మొత్తుకున్ననే. అప్పుడు టౌన్లనే దొరికేది. ఇప్పుడైతే ఎటూ పదిహేను కిలోమీటర్ల దూరంలోనైన ఏడెనిమిదివేలకు తక్కువ లేదు. రేట్లు అగ్గిమండుతన్నయి అన్నా! ఆసాములు గూడ హుషారైండ్రే. మాకే చుక్కలు చూపెడుతుండ్రు. కొత్తగ వెంచర్ చేయాల్నంటె జాగలు అమ్మెటోడు లేడు. భయమైతంది” అంటూ టీ తాగి బయటకొచ్చి బండి అక్కడే వుంచి కారెక్కిచ్చుకున్నడు.

కారు పొన్నాల దాబాల వైపు దూసుకుపోతుంది. తిరుపతి డ్రైవ్ చేస్తూనే ఇయర్ ఫోన్లలో మాట్లాడుతున్నడు. రోడ్డుకు అటువైపు ఇటువైపు తను అమ్మిన ప్లాట్లు, వాటి రేట్లు,ఇప్పుడున్న ధరలూ, మధ్యమధ్యలో కొనలేనందుకు చందును నిందిస్తూ, లోకం ఎంత వేగంగా పరుగెత్తుతుందో, తనెంత నిదానంగ వున్నడో గుర్తుచేస్తున్నడు.

కారు పొన్నాల దాబా హోటల్లు దాటి రిలయన్స్ పంపు దాకా వచ్చింది. కారు ఫుల్‌ట్యాంక్ చేయించి పెట్రోల్ ధరల పెరుగుదలను నిందిస్తూ ప్రభుత్వ దోపిడీని ఎండగడుతున్నడు.

“అన్నా! మీరు ఉద్యమాలు బాగా చేస్తరు గదనే! గీపెట్రోలు గింత పెరిగితే సప్పుడు చేస్తలేరేందే?” అన్నడు అదేదో వాళ్ల కనీస బాధ్యత అన్నట్టు.

తిరుపతి బైకు ఇన్‌స్టాల్మెంటు కట్టకపోతె పాతబస్టాండు దగ్గర ఫైనాన్సోల్లు ఆ చెంప, ఈ చెంప వాయించి బండి గుంజుకుంటె, చందు ష్యూరిటీ ఇచ్చి బండి ఇప్పిచ్చిండు. అమ్మ పుట్టుపూర్వోత్తరాలు మేనమామకెర్కలేదా అన్నట్టు తిరుపతిరెడ్డి గొప్పలు వింటుంటె నవ్వొచ్చింది చందుకు.

కారు కలెక్టరేటు వరకు చేరుకున్నది. మొన్నమొన్ననే కలెక్టరేట్ ప్రారంభించడంతో అక్కడ జనసంచారం ఎక్కువైంది. స్టాల్స్ వెలిసినయి. రియలెస్టేట్ జోరందుకున్నది. చుట్టుపక్కల భూములకు రెక్కలొచ్చినయి. కొత్త వెంచర్ల తోటి సందడిగా కనబడుతుంది. బందారం దర్గావైపు కారును తిప్పి కొంచెం స్లో చేసుకొని విండో దించిండు తిరుపతి. నలుగురు మనుషులు దగ్గరకొచ్చి వినయంగా నమస్కరించి, ‘అన్నా! జెర మమ్ముల్ని గుర్తుపెట్టుకో’ అన్నట్టు చూశిర్రు.

“ఇప్పుడే వస్త తమ్మీ! దర్గా దాటినంక మన నలబై ఎకరాల వెంచరుంది గదా! అన్నకు చూపించుకొస్త” అంటూ గేరు మార్చిండు. కొంచెం దూరం వెళ్ళగానే కారును ఎడమవైపు తిప్పి రోడ్డు దించి వెంచర్లోకి నడిపించిండు.

“అన్నా! దిగు, మనదే ఈ వెంచర్. అప్పట్ల నీకు మూడువేలకు గజం లెక్కన ఇస్తాంటె వద్దన్నవు. ఇప్పుడు పదిహేనువేలు. మూడేండ్లల్ల గింత పెరిగింది. అప్పుడు కలెక్టరేటొస్తదంటె ఎవలన్న నమ్మిండ్రాయె‌? నేను ఇంకా అయిదు ప్లాట్లు వుంచుకున్న, అమ్మలేదు. నయమైంది” అన్నడు తన తెలివితేటలకు తనే మురిసిపోతూ.

కారు స్టార్ట్ చేసి రోడ్డెక్కించిండు.

“నిజమే! అసలు వీళ్లకు ఇంత ఖచ్చితంగ ఎట్ల తెలుస్తదిరా?” అన్నడు చందూ అనుమానంగ.

“ఏమున్నదన్నా! మేము చిన్నచేపలం. పదిపైసల పార్ట్‌నర్‌షిప్‌గాల్లం. అసలోల్లు వేరే వుంటరే. భూములు జాడ తీసుడు వరకే మా పని. రేట్లు మాట్లాడుకునుడు, పర్మిషన్లు తెచ్చుడు లేఅవుట్లు కొట్టిచ్చుడు.. అంతా వాళ్లదే! ఖాళీ మేం పార్టీలను తెచ్చుడు, అమ్ముడు. మాకు వేలల్ల అయితే వాళ్లకు కోట్లల్ల. అధికారులు వాళ్లశేతుల్లనేనాయె. తెల్లారె వరకు అన్ని పర్మిషన్లు ఇంటికస్తయి. అన్నా పైసతోని ఏదైన అయితదే”.

కారు దర్గా దాటింది. బీసీ కాలనీలోంచి దుద్దెడ వైపు తిరిగింది. కొంతదూరం వెళ్ళాక రోడ్డుకు కుడివైపు రెండు, మూడు హిటాచి బండ్లు, డోజర్లు నేలను చదును చేస్తున్నయి. కారును సైడ్‌కు ఆపగానే పని చేయిస్తున్న వాళ్లలోంచి ఇద్దరు వర్కర్స్ పరుగెత్తుకొచ్చింరు.

“ఏమయ్యా! గిట్ల జేస్తే యాడాదైనా అయెటట్టు  లేదు. మీ వోనరొస్తె నాకు ఫోన్చెయ్యమను. మ్యాప్ రెడీ అయింది. పాట్నర్లు నా మీదెక్కుతండ్రు. పైసలు తీసుకుంటిరి, పని అయితలేపాయె. గిట్లయితె ఎట్ల?” అంటూ వాళ్లని మందలిస్తూ బండి ముందుకు కదిలించిండు.

“ఏం జెయ్యాలన్నా! మూన్నెల్లల్ల కంప్లీట్ చేస్తనన్నడు. ఇప్పటికి ఆర్నెల్లయింది. పాట్నర్లు వొత్తిడి జేస్తుండ్రు. కోట్ల పెట్టుబడాయె. వాళ్లనేమనస్తది? మనల్ని నమ్మి పదిపైసల పార్ట్‌నర్‌షిప్‌ ఇచ్చి డెవలెప్, చెయ్యిమన్నరు” పీతకష్టాలు పీతవి అన్నట్టు తన కష్టాలు ఏకరువు పెట్టుకున్నడు తిరుపతి.

“ఏం రేటు ఫిక్స్ చేసిండ్రు” అన్నడు చందు తనకేమైనా కుదురుద్దేమోనని లోలోపల ఆశచిగురిస్తుంటే.

“అన్నా! ఏడువేలు పెట్టినమే. నీకు పనికిరాదు. అయ్యేదుంటె నేను చెప్పనా” అన్నడు.

ఎందుకని అన్నడు చందు నిరాశను బయటపడనీయకుంట.

“వేరేవాళ్ళకైతే చెప్పకపోదు. నీకయెపటికే చెప్తున్న. ఇది కొంచె కిరికిరిలుందే! సెటిల్ అయేసరికి టైం పడుతది. అయినా నీ బడ్జెట్ల ఇది రాదు” అన్నడు నిర్మొహమాటంగ తిరుపతి.

కిలోమీటర్ దూరం పోయిన తర్వాత కారును రోడ్డు పక్కన ఆపి, “అన్నా దిగు” అంటూ ప్యాంటును మీదికి మలుచుకొమ్మన్నడు. చెప్పులు అక్కడే విప్పేయమన్నడు. ముందు రోజు వాన పడి పొలాలల్ల నీళ్ళు నిండినయి. అక్కడక్కడా బర్లు మేస్తున్నయి.

కొంతదూరం నడుస్తూ వెళ్లిన తర్వాత “అన్నా! ఇదేనే మన వెంచర్. నలబై ఎకరాలు. తొండలు గుడ్లుపెట్టె జాగ. రాళ్లు, ముండ్లకంపలు. ఎవడు కానని జాగను మూడు లక్షలకు ఎకురంకొని డెవలప్ చేసినం. మేమొచ్చినంకనే చుట్టుపక్కల జాగలకు డిమాండ్లచ్చినయి. ఒక్కొక్కలు కోటీశ్వరులైండ్రు” అన్నడు తామేదో ఉద్దరించినట్టు.

“ఏం జేసిండ్రు? ఎవుసాలు బందుచేసి అమ్ముకునేటట్టు చేసిండ్రు. వచ్చిన పైసలతోటి గుంటెడు జాగ కూడా కొనలేక దేశాలు పట్టుకొని బతుకవొయ్యింటరు. అంతేగా!” అన్నడు చందు.

ఊహించని సమాధానంతో తిరుపతి కాస్త తడబడినా తమాయించుకొని ఏమీ పట్టించుకోనట్టే, “అన్నా! అక్కడ గుట్ట కనిపిస్తుంది చూడు. హిటాచీలు నడుస్తున్నయి. అక్కడేదో ఫుడ్‌ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ పడుతుందటనే. దీనికిగూడా మస్తు డిమాండొస్తదే” అన్నడు.

నమ్మబుద్ధి కాకపోయినా మొదటిసారి నమ్మాలనిపించింది చందుకు. కలెక్టరేట్ అనుభవంతో కొట్టిపారేయలేకపోతున్నడు. కనీలన్నీ కూలిపోయి వుండటంతో నంబర్లు గుర్తుపట్టడం కష్టమవుతున్నట్టుంది. చివరకు ఓ మూలకు ప్లాటు దొరికిచ్చుకున్నడు. ముండ్లకంప, వయ్యారిభామ చెట్లతోటి మూసుకపోయివున్నది.

ఒగ కట్టె తీసుకొని గడ్డిని పాయదీస్తూ నెంబరు కనీ కోసం వెతుకుతున్నడు. బర్రెలకాపరి చెందును కింది నుంచి మీది దాకా ఎగాదిగా చూసిండు. ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నడు.

తనే మాట కలిపి “ఏ ఊరే పెద్దమనిషీ?” అన్నడు. అతను సమాధానం చెప్పేలోపు తిరుపతి కలుగజేసుకుని, “ఏయ్! ఇక్కడ బర్లను మేపుకుంట, కనీలన్ని పడగొట్టుకుంట మ్యాల్యంబెట్టినారు! చల్.. అవుతలికి నడువుండ్రి” అని దబాయించిండు. పాపం అతను పులుకుపులుకున మొఖం చూస్తూ దూరంగా వెళ్ళిపోయిండు.

“అన్నా! ఈ ప్లాటున్నది రెండువందల నలబై గజాలు. కొంచెం క్రాసుంటది. లాస్ట్ ప్లాటు గదా! మెట్నకు చేసిస్త. ఎంతెల్తె అంతకే రేటు కట్టియ్యి” అంటూ కిందికి వంగి నాలుగు మట్టిబెడ్డలు తీసుకుని విసురుకుంట హద్దులు చూపించిండు తిరుపతి.

“ఇక్కడికి మేన్ రోడ్డు ఎన్ని కిలోమీటర్లొస్తది?” అన్నడు చందు నిట్టూర్చుతూ.

“అయిదు కిలోమీటర్లన్నా” అన్నడు తిరుపతి.

అంటే టౌను నుంచి పది, ఇటు అయిదు, పదిహేను కిలోమీటర్ల దూరంలో, బురదలో, ఈ అష్టావక్ర ప్లాట్ కోసం వీడు నన్ను ఇంతదూరం తీసుకొస్తడా అని పట్టరాని కోపమొచ్చింది చందుకు. ఎందుకో నామోషీగా కూడా అనిపిచ్చింది.

చందు తీరును పసిగట్టిన తిరుపతి “అన్నా! నీకు నచ్చనట్టున్నది. మనోల్లదే ముందటొకటున్నది. చూసి పోదాంపద” అంటు వెనుదిరిగిండు. కొద్దిదూరంల ఇంకొక వెంచరులోకి నడిపించిండు. అది రోడ్డుకు కొంచెం దగ్గరగుంది.

“అన్నా! ఇవి రెండున్నయి. నూట ఇరువై గజాలయి తూర్పుదక్షిణం ఫేసింగు. ముప్పై ఎనిమిదిదాకియ్యొచ్చు” అన్నడు. చందుకు నచ్చింది. ప్రాణం లేచొచ్చినట్టయింది. రోడుకు దగ్గరుంది. పైగా తన బడ్జెట్లో నూట ఇరవైగజాలొస్తది చాలు అనుకున్నడు. అదే మాట తిరుపతితో అన్నడు.

“అన్నా వొక్క ప్లాటు అమ్మరే! రెండు కలిపే అమ్ముతరు. తూర్పుమొఖంది పొయినంక దక్షిణంది ఎవడు కొంటడే? దానికి వ్యాల్యూయే వుండదు” గీమాత్రం గూడా తెల్వదా అన్నట్టు వొక నవ్వు నవ్విండు.

చందు ఆశలపై నీళ్ళు కుమ్మరించినట్టయింది. అప్పటికి తను అనుకుంటనే వున్నడు, వీడు ఏదో వొక లిటిగేషన్ పెడుతడు అని. అంత ఈజీగ కానిస్తడా అనుకుంట తిరుపతిని అనుసరించిండు. మధ్యమధ్యల రెండు, మూడు వెంచర్లల్లో ఆపుతూ వీధిపోట్లు, క్రాస్‌వి అమ్ముడుపోని ప్లాట్లు చూపిస్తున్నడు. ఇది అయ్యే పని కాదనిపించింది చందుకు. నిరాశ, నీరసం ఆవహించింది.

“అన్నా! ముంగట మన ఫాంహౌజ్ ఉంది. చూసిపోదాం” అంటూ లోపలికి కొంతదూరం వెళ్ళాక ఒక షెడ్డు ముందు కారాపిండు.

“అన్నా! ఇదే మన ఫాంహౌజ్. రెండువేల పదిహేడులో పదిలక్షలకు కొన్న. ఫెన్సింగ్ చేయించి జామతోట పెట్టిన. ఇది అమ్మద్దనుకుంటున్న” అన్నడు. వాచ్‌మెన్ పరుగెత్తుకొచ్చి షెడ్ తలుపులు తీశిండు. లోపల పివోపి చేయించి ఏసీ పెట్టించిండు. ఫ్రిజ్, ఎల్యీడీ, స్టౌ, వంటపాత్రలు, బెడ్ అమర్చి వున్నయి.

“ఎప్పుడన్న హైదరాబాద్ నుంచి పార్టీలు వస్తే సిట్టింగ్ ఇక్కడ్నే అన్నా” అంటూ వాచ్‌మెన్‌ను పిలిచి ‘తోటలో ఏమన్న జామకాయలుంటె తెంపుకరాపో! సార్ తీసుకపోతడు” అని పురమాయించిండు.

“అన్నా ముంగట వొక వెంచరేస్తన్నం చూద్దాం రా” అని ముందుకు నడిచిండు. కొంచెం దూరం పోయేసరికి రెండు జేసీబీలు పెద్దపెద్ద బండరాళ్ళను పెకిలిస్తున్నయి. “ఇది పదెకరాల వెంచర్. నేనొక్కన్నే! పాట్నర్లెవరూ లేరు. బ్రోకర్లకు కూడ చెప్తలేను. డైరెక్ట్ పార్టీకే అమ్ముదామనుకుంటున్న. మొత్తం సీసీ రోడ్లు పోయిస్త. నాలా కన్వర్షన్ కట్టిన. జి.పి పర్మిషన్ తీస్తన్న. గేటెడ్ కమ్యునిటి లెక్క చేస్త. ఇక్కడికి కలెక్టరేటు మూడు కిలోమీటర్లొస్తది. ఎనిమిదివేలు పెడదామనుకుంటున్న. మరి ఆలోచించు” అన్నడు ఇక ఇదే ఫైనల్ అన్నట్టు. చందు ఆలోచన్ల పడ్డడు.

“అన్నా! నీకు మస్తు సర్కిలుంది. పది ప్లాట్లు దోస్తులకు చూపించు. అంతా నేను మాట్లాడుత. నీ కమీషన్ అనుకో, ఏమన్ననుకో నీకు ఆరువేలకాడికి రాస్త” అంటూ ఆఫర్ ఇచ్చిండు తిరుపతి.

చందుకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. నాల్రోజులు పోతె వీడు నన్ను బ్రోకర్ను చేసేటట్టున్నడు అనిపించింది.

“అన్నా! నువ్వొక్కనివేనాయె దునియాల. చానామంది మీ టీచర్లే బ్యారాలు చేస్తుండ్రు. తప్పేముందే” అన్నడు.

“తప్పు కాదారా! పక్కపక్కనే నాకు ఆరువేలకు, వాళ్లకు ఎనిమిదివేలకు ఇచ్చుడు మోసంగాదా? పైగా నా మీద నమ్మకంతోటొచ్చేటోళ్లకు..” ఆ ఆలోచనే వెగటుగా అనిపించింది చందుకు.

“అన్నా! రేపు ఇంకో రెండేండ్లకు పదివేలకు అమ్ముకుంటరు. అప్పడు నువ్వు చూపిచ్చినవని నీకేమన్నిస్తరాయె?” అన్నడు తిరుపతి.

“అరే! వాడు పెట్టుబడి పెట్టుకుంటడు. లాభమొస్తె తీసుకుంటడు. గదంత మనకెందుకుగని, తమ్మీ! అవన్నీ మననుంచి కాని పనులు. నాకు ఎంతకు చేస్తవో చెప్పురా” అన్నడు చందు.

ఇక వర్కౌటు అయ్యేటట్టు లేదనుకున్నట్టున్నడు ఫైనల్ ఏడువేలైతదే అన్నడు తిరుపతి. వానితో బేరమాడాలనిపించలేదు చందుకు.

“ఆలోచిద్దాంలే తమ్మీ! ఆకలవుతుంది పోదామా” అన్నడు నీరసంగ.

“అన్నా! నాకో అర్జంట్ కాలొచ్చింది. కొమురవెళ్ళి దగ్గరొక వెంచర్ స్టార్ట్ చేస్తున్నం. హైదరాబాదు నుంచి పాట్నర్లు వచ్చిండ్రటన్న. వస్తవా పొయ్యొద్దాం. దారిల దాబా హోటల్ల తిందం” అన్నడు తిరుపతి.

“లేదు తమ్మీ! నాకు వేరే పనుంది. నేను పోవాలి” అన్నడు చందు.

“అయితె నిన్ను దర్గస్టేజి దగ్గర దింపుత. పోతవానే! ఏమనుకోకు” అంటూ రిక్వెస్ట్ చేశిండు తిరుపతి.

“పర్వాలేదు తమ్మీ! నేను వెళ్తాలే” అన్నడు చందు.

స్టేజి దగ్గర దింపి “అన్నా ఇగలాస్ట్ ఆరువేల అయిదు వందలకాడికి అయితదే! ఇంటికాడ వదినెను ఇషారచెయ్యి. సాయంత్రం ఇంటికస్త. ఒకే అయితె బయాన తీసుకుంట. నువ్వనుకున్న దానికంటె రెండు లక్షలు ఎక్కువైతయి. చూసుకుంటవోతె గిట్లే వుంటది. టౌన్ల కొనాల్సింది దుద్దెడదాక వచ్చినం. రేపు ఇటే‌ పెరుగుతది టౌను. ఎట్లాగు ఇప్పుడు ఇల్లైతె కట్టవు. పదేండ్ల వరకు నడమల పడుతవు. వస్తా మరి” అంటూ వెళ్ళిపోయిండు.

కొంచెంసేపు ఎదురుచూసినంక ఒక ఆటోలో ఎక్కి ఇంటిముఖం పట్టిండు చందు. నోరెండిపోతుంది. నీరసంగుంది. అన్నింటికంటె ఈరోజు ఏదో ఒకటి అయిపోతుందన్న భరోసాతోటి నవ్వుమొఖంతో ఎదురుచూసే సునీత గుర్తుకొస్తె గుండె బరువెక్కుతుంది.

ఇరవైయేళ్ళుగా తను ఉద్యోగం, ఉద్యమాలు అంట ఊరూరూ తిరిగినా, ఏనాడు అడ్డు చెప్పలేదు. అందరిలా షాపింగులూ, నగలూనట్రా అని ఆడంబరాలకు పోలేదు. ఏమడిగింది? పిల్లల్ని రెక్కల కింద దాచుకునే తల్లికోడిలాగ చిన్నగూడు కోసం ఇంత జాగడిగింది. పాపం తనది తీరని కలనే అవుతుందా అనే ఆలోచనొస్తనే గుండెలో కలుక్కుమన్నట్టయింది. కనీసం అది కూడా చేయలేని తన అసమర్థత మీద తనకే అసహ్యం పుట్టింది. ఉద్యోగం చేసుకునే తన లాంటి వారికే ఇలా వుంటే మామూలు మనుషుల గతేంటి?

“సార్! బ్లాకాఫీస్. దిగాలె”. ఆటోడ్రైవర్ అరుపుతో ఈలోకంలోకొచ్చి ఇరవై రూపాయల నోటు చేతిలో పెట్టి బైకు పార్కు చేసిన వైపు రోడ్డు దాటుతూ ముందుకు నడిచిండు. మనసులో ఒక నిర్ణయానికొస్తూ..

ఆ రోజు సాయంత్రం తిరుపతి ఇంటికొచ్చిండు. ఓ పట్టాన వొదులుతాడా! ఎప్పుడు దొరుకుతాడా అని కాచుకుని కూర్చున్నడు. పైగా సునీత పట్టుదల. ఈరోజు ఏదో వొకటి తేలిపోవాలన్న మంకు ఆమెది. ఎరకు చిక్కిన చేపపిల్లలా గిలగిలలాడటం తప్ప చేయగలిగిందేమీ లేదు చందుకు. అటోఇటో తండ్లాడుతే చివరకు ఆరువేలకు రేటు ఫిక్సైంది. ఇంకోసారి ఇంటిల్లిపాదికి రెక్కలు తొడిగి ఆకాశంలోకి ఎగిరేసి బయానా తీసుకొని, ఒప్పందపత్రం రాసుకుని వెళ్ళిపోయిండు తిరుపతి. ఎలాగూ నలబైఐదు రోజులు వాయిదా వుంటది డబ్బులు మొత్తం కట్టేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అనుకున్నడు చందు. కానీ సునీత వింటేనా? ‘అన్ని రోజులు ఎందుకు? నీ మూడ్ ఎప్పుడు ఎట్ల మారుతదో, ఏమో’ అని తనే చొరవదీసుకొని పుట్టింటి నుంచి, తెలిసినవాళ్ళ నుంచి, అటోఇటో మొత్తానికి వారం పదిరోజుల్లనే డబ్బు సర్దుబాటు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా చేసింది. వాళ్ళ సంతోషానికి అవధుల్లేవు.

***

సరిగ్గా వారం తర్వాత..

పొద్దుపొద్దున్నే లేవడంతోనే కళ్ళు నులుముకుంట ఆరోజు పేపర్ అందుకున్నడు చందు. హెడ్డింగ్స్ చూస్తూ జిల్లా టాబ్లాయిడ్ చూశి ఒకచోట సడెన్‌గ ఆగిపోయిండు. తను నమ్మలేనట్టు మళ్ళీ ఒకటికి రెండుసార్లు చదువుకున్నడు. నిజమే అని నిర్ధారించుకున్నంక పక్కనున్న మొబైల్ అందుకుని వొక నెంబరుకు డయల్ చేశిండు. అవతలి వైపు నుంచి “మీరు డయల్ చేసిన నెంబరుకు సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడినవి” అని వినిపిచ్చింది. నీరసంగ మొబైల్ పక్కన పడేసి అదే హెడ్డింగును పదేపదే చదువుతున్నడు.

‘అక్రమ వెంచర్లపై ఉక్కుపాదం’ అనే మెయిన్ హెడ్డింగు కింద ‘పట్టణ శివార్లలో వ్యవసాయ భూములని ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లుగా చేసి అమ్ముతున్న వెంచర్లపై సుడా అధికారుల దాడి’ అనే సబ్‌హెడ్డింగ్‌తో పెద్దపెద్ద అక్షరాలు. అక్రమ వెంచర్లలో ఎవరూ ప్లాట్లు కొనవద్దని, దళారులను నమ్మి మోసపోవద్దని, గతంలో జరిగిన లావాదేవీలన్నీ రద్దు చేస్తామని అధికారుల వివరణ. దానికిందనే వెంచర్లను డోజర్లతో కూల్చేస్తూ కనీలన్నీ ట్రాక్టర్లలో ఎక్కిస్తున్న ఫోటోలు.

అయిదేళ్ళ తరువాత తాము కట్టబోయే ఇంట్లో ఏమేం ఉండాలో ఉత్సాహంగా చెప్పుకుంటూ టీకప్పు చేతిలో పట్టుకొని అటువైపే వొస్తుంది సునీత. పేపరు మడిచి పరుపు కింద దాస్తూ, రాని చిరునవ్వును మొఖం మీదకు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తూ చెమటలు తుడుచుకుంటూ సర్దుకుంటున్నడు చందు.

*

భూమి కోల్పోయిన రైతుల గురించి ఒక నవల రాయాలని వుంది

 

* నమస్తే మల్లారెడ్డి గారూ! మీ గురించి చెప్పండి.

నమస్తే! మాది సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్. పుట్టింది, పెరిగింది అక్కడే! ప్రస్తుతం సిద్దిపేటలో ఉంటున్నాను. కుకునూరుపల్లి హైస్కూల్‌లో బయోలజీ టీచర్‌గా పనిచేస్తున్నాను.

* కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

చిన్నప్పుడు పద్యాలు రాసే అలవాటు ఉండేది. డిగ్రీలో కవితలు రాసేవాణ్ని. 1996లో ఉద్యోగం వచ్చాక రచనను సీరియస్‌గా తీసుకోవడం మొదలైంది. ఎక్కువగా కవిత్వం రాసేవాణ్ని. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో అది మరింత ఎక్కువైంది. వాటిని నాలుగు పుస్తకాలుగా ప్రచురించాను. ఆ తర్వాత కథలు రాసినా ప్రచురణకు పంపలేదు. 2018లో నవతెలంగాణ దినపత్రికలో వట్టికోట ఆళ్వారుస్వామి స్మారక కథలు పోటీ పెట్టారు. దానికోసం ‘వాగవతలి మడి’ అనే కథ రాసి పంపాను. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ఒక ఊరిలో సాగే ఉద్యమం అందులోని అంశం. దానికి రెండో బహుమతి వచ్చింది. 2019 మార్చిలో నవతెలంగాణ ఆదివారం అనుబంధం సోపతిలో ప్రచురితమైంది. అదే నా తొలి కథ. ఇప్పటికి తొమ్మిది కథలు రాశాను. అందులో ఐదు ప్రచురితమయ్యాయి.

* తొమ్మిది కథలు రాసి ఐదే ప్రచురించారెందుకు?

కథైతే నేను రాయగలను. దాన్ని టైపు చేయించేందుకు కొంత ఆలస్యమవుతోంది. నా స్నేహితుడొకరు తీరిక సమయాన్ని బట్టి నా కథలను టైపు చేసి ఇస్తారు. ఇప్పుడిప్పుడే సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఆ సమస్యను అధిగమిస్తున్నాను.

* మీరు ఇప్పటిదాకా రాసిన కథల్లో ‘కొమ్ముల బర్రె’ ఎక్కువ ప్రాచుర్యం పొందింది కదా! ఆ కథ నేపథ్యం చెప్పండి.

తప్పిపోయిన తన బర్రెను వెతుకుతూ ఓ రైతు చేసిన ప్రయాణమే ఆ కథాంశం. నాకు కేశవరెడ్డి గారి నవలలంటే చాలా ఇష్టం. ‘అతడు అడవిని జయించాడు’, ‘మునెమ్మ’ నవలల్లో పెంపుడు జంతువుల కోసం మనుషులు పడే ఆరాటం నాకు నచ్చింది. దాన్నే అంశంగా మార్చుకుని ఒక కథ రాయాలని అనుకున్నాను. అందుకు నా చిన్నప్పటి అనుభవాలను నేపథ్యంగా ఎంచుకున్నాను. అదే ‘కొమ్ముల బర్రె’. 2021 ఆగస్టు 8 సాక్షి ఫన్‌డే సంచికలో ప్రచురితమైంది. నాకు చాలా పేరు తెచ్చింది. కథాసాహితి వారి ‘కథ 2021’లో ఆ కథ ఎంపికైంది.

* మీకు నచ్చిన రచయితలు?

ఫలానా రచయిత అంటూ ఏమీ లేదు. దాదాపు అందరి రచనలూ చదువుతాను. అల్లం రాజయ్య, పెద్దింటి అశోక్‌కుమార్, తుమ్మేటి రఘోత్తమరెడ్డి లాంటి రచయితల కథలు బాగా చదివాను. ఇటీవల విడుదలైన పుస్తకాలతో సహా అన్నీ ఇష్టంగా చదువుతుంటాను.

* ఇంకా ఎలాంటి రచనలు చేయాలని ఉంది?

మరిన్ని కథలు రాయాలని ఉంది. ప్రాజెక్టుల నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతుల గురించి ఒక నవల రాయాలని అనుకుంటున్నాను.

*

కొండి మల్లారెడ్డి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగా రాశారు సార్. కథ ఆసాంతం చదివించేలా బాగుంది.

  • మీ రచనలు చాలా బాగున్నాయి .
    కొమ్ముల బర్రె కూడా చదివాను.
    స్వచ్ఛమైన పల్లె పదాలు , సులభంగా అర్థం అయ్యెవిధంగా ,చదువుతుంటే కథలో జీవిస్తున్నట్టుగా వుంది. నేను కూడా ఆ వెంచర్లన్నీ తిరిగాను.
    👍👌

  • సార్ మల్లారెడ్డి గారు మీ ఎండ మావుల కథ బాగుంది దీని వల్ల రియలరస్టేట్ వ్యవహారాలంతా ఇలాగే ఉంటాయని తెలిసింది తెలంగాణ మాండలికాన్ని బాగా పలికించారు అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు