ఋతురాగాల సరిగమలు

కఠినమైన మండు-వేసవి-సమ్మెట పోట్లకు గురై

చెట్ల వేళ్ళూ, వాటి కొమ్మలూ,

ఎండిన నాలుకలతో మనుషులు-పక్షులు-వృక్షాలూ;

బీటవారి పగిలిన నేలతల్లి విషన్న వదనమూ —

ప్రతి ఒక్కరూ ఋతుపవన వర్షాలకై –

దాహార్తితో ఎదురు చూపు…

నైఋతి వైపునుంచి పయనమై,

మన గుండెల రెక్కలను తట్టుతూ,

లెక్కకు అందని తమ దూదిపింజల గొడుగులతో,

అల్లన ఆకాశ మార్గాన పయనిస్తూ,

మన శరీరాల-నోళ్ళను ఊరిస్తూ

సకాల వర్షపుటాశలను చిగురిస్తూ–మేఘ బృందాలు…
మనపైన…, ఆపైన అల్లల్లడాయి, కాసేపు తచ్చాడాయి.
హ్హు !!! అంతే, చేయిచ్చేసి,

మనవంక చూడకుండానే, ముందుకు సాగిపోయాయి.

అయినా, వాటికి కాస్తో కూస్తో మనసుంది…

అందువల్లనే, ఆ మేఘాలు

హృదయం వక్కలై, మనసు కరిగి, కుండపోతగా కురిసాయి…

కాకపోతే, ఇంకో ప్రాంతంలో; మన నగరంలో మాత్రం కాదు–

మన కన్నీటిని తుడవకుండానే, మన కోరికలను నీరు కారుస్తూ.

మన ఏలికల పాక్షిక వర-వర్ష విధానాలను అనుకరిస్తూ

ఆచరణలో పెడుతున్న ప్రకృతి మాత వికృతి అయిట్లుగా!

“వర్షమా, వర్షమా, దయచూపవమ్మా!

ఇప్పుడే రావమ్మా, ఇక్కడికే రావమ్మా !

కొన ఊపిరితోనున్న మా ప్రాణాలను నిలబెట్టవమ్మా!

మమ్ములను కాదనకమ్మా , మమ్ములను జావకార్చవద్దమ్మా!

“వర్షమా, వర్షమా దిగి రావమ్మా

ఎండైనా, మబ్బైనా ఒకింత కురువుమమ్మా

చల్లని నీ చూపును మాపై ఉంచవమ్మా”–

ఇలా గొంతెత్తి జీరగా ఎన్నో గొంతుకలతో పిలుస్తున్న

పిల్లల చేతులూ-కాళ్ళూ, కర్షకుడి నాగలీ,

ప్రతి వాగూ, ప్రతి చెరువూ, ప్రతి బావీ, ప్రతి ఇంకుడు గుంటా.

“వస్తాను, తప్పక వస్తాను

అయితే ఇరుకైన మీ షరతులతో కాదు

సువిశాలమైన నా సంయోజనతో.

అప్పుడప్పుడు నేను తప్పుడు బాటలో

వెళ్తున్నట్లు మీకు కనిపిస్తున్నానంటే

అది మీ కళ్ళద్దాల లోపం వల్ల, లేదా

మీ దగ్గర నేను నేర్చుకున్న పాఠాల చలవ వల్లనే…

“నేను ఉధృతంగా వస్తే

వరదకు బలిపెడుతున్నావంటారు–

మమ్మల్ని నట్టేట ముంచేస్తున్నావు, అంటారు.

కానీ, మీ వీధులను, బాటలను, మురికి కాలవలను,

దుర్గంధ కూపాలను నా చెమట చీపుళ్ళతో కడిగివేస్తున్నా,

దాని గురించి ఒక్క మంచిమాటైనా చెప్తున్నారా!

పైగా, తీయటి నా జల సంపదను పోగుచేసుకోకుండా

నిర్లక్ష్యంగా ఉప్పుకడలి పాలు చేయటం లేదా!

“పెను-చీకటి రాచ-బాటలపై, సందులు గొందులలో

మీ ప్రభువులు కుక్కగొడుగుల్లా ఏర్పాటు చేసిన

మొసలి నోళ్లలాంటి మురికి బిలాలు

మీ చంటి-పిల్లలను గుటుక్కున మింగితే

నీటి-మూటల మాటలను వల్లించే

మీ రాజకీయులను, అధికారులను ప్రశ్నించలేక,

కొంప కొల్లేరు చేస్తున్నావని నాపై మండి పడతారా

అత్తమీది కోపం దుత్తమీద చూపించినట్లు!

“మనుజుల్లారా, గుర్తుంచుకోండి!

సుఖ దుఃఖాలు బొమ్మా బొరుసులని.

అయినా,

ఋతువుల సమైక్య రాగాన్ని అర్థం చేసుకొనడానికే

ఇష్టం లేని చంచల స్వభావులైన మీకు…

ఉన్నత తత్వాలు ఎలా వంటబడతాయి!

“చలి కాలం వచ్చినపుడు,

చలిపులివి, అని, నా చెల్లెలిని చెండాడుతూ

వెలుగు జిలుగుల ఎండలు కావాలని కలలు గంటారు మీరు.

వేసవి విచ్చేయగానే, మమ్ములను కాల్చుకు తింటున్నావు, అని,

నా తమ్ముణ్ణి అనరాని మాటలు అంటూ, వాడికి వీడ్కోలిచ్చేసి,

పన్నీటి తుంపర్ల వానల జల్లే మా స్వర్గం, అని, అంటారు…

“పడితే అతివృష్టి అంటారు, పడకపోతే అనావృష్టి అంటారు;

చిత్తడి లేని తడి కావాలంటారు, మీ బట్టలు తడవకూడదంటారు;

మీ మీ వేళల్లోనే వర్షాలు కురవాలంటారు, ఆగాలంటారు.

“సకాల ఔచిత్యం లేకుండా, అకాల రుచులకై అర్రులు చాస్తూ

కాలానికే, ప్రకృతికే పాఠాలను… నేర్పుదామనుకుంటున్నారా!!!”

******

ఉప్పలూరి ఆత్రేయ శర్మ

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఋతు రాగాల సరిగమలు బాగున్నాయి,!పాఠాలను నేర్పిదాం అనుకుంటున్నారా?అన్న వాక్యం చెంప పెట్టు లా తగిలినది. రచయిత కు,ధన్యవాదాలు!💐👌.

  • We worry and accuse nature of her fury, unmindful of our incorrigible nature to meddle with her.My pranams to Sri Sarma garu and congrats on penning a purposive poem—SM Kompella
    <

    https//magazine.saarangabooks.com

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు