ఊహల అల్లికలో “యెర్రగబ్బిలాల వేట”

సాహిత్య ప్రక్రియలో ఊహా ప్రపంచంలో కథ( Fantasy Story) రాయడం చాలా కష్టమైన ప్రక్రియ అనుకుంటాను. కల్పిత కథలో(Fiction Story) మనకి తెలిసిన ప్రపంచంలోనే మనకి తెలియని కథ చెప్పడం ఐతే, ఈ ఫాంటసీ కథల్లో రచయితే కథను, ఆ కథా ప్రపంచాన్ని కూడా  సృష్టించవలసి వస్తుంది. అలా సృష్టించిన ప్రపంచాన్ని పాఠకుడు కూడా నమ్మే విధంగా రాయాలి. ఇతర భాషల్లో ఈ ఫాంటసీ కథలు,నవలలు ఎన్నో వచ్చినా, తెలుగులో మాత్రం వేళ్ళతో లెక్కపెట్టేంత మాత్రమే ఉన్నాయి. అలా ఒక కల్పిత ప్రపంచంలో మనల్ని తీసుకొని వెళ్లి ఒక రసవత్తరమైన కథను ఇండ్ల చంద్రశేఖర్ “యెర్రగబ్బిలాల వేట” అనే పుస్తకం ద్వారా చూపించారు.

భూమి మీద మనుషులు ఇంకా తెగలుగా ఉన్న రోజుల్లో బారాడ తెగకు చెందిన వరాలయ్యాకు అనుకోకుండా ఒక వింత వ్యాధి వస్తుంది. ఆ వ్యాధికి మందు ఎప్పుడో మూడు వందల ఏళ్ల క్రిందట ఈ ప్రాంతం నుంచి వలస వెళ్లిన  యెర్ర గబ్బిలాల వద్ద మాత్రమే ఉంది అని తమ తెగ వైద్యుడు చెప్పగా, వరాలయ్యా కొడుకైన కొరయ్య, యెర్ర గబ్బిలాల అన్వేషణకు బయలుదేరుతాడు. ఆలా వెళ్లిన కొరయ్య చివరికి యెర్ర గబ్బిలాలను కలుసుకున్నాడా..?, అసలు తన తండ్రికి వచ్చిన జబ్బు ఏంటి..?, యెర్ర గబ్బిలాలు అసలు ఎందుకు వలస వెళ్లిపోయాయి..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ నవల చదవాల్సిందే.

ఇది ఒక అన్వేషణ కోసం జరిగే కథ లాగ అనిపించినా, తాను సృష్టించిన ప్రపంచంలో ఉన్న తెగలు, వాటి మధ్య ఉన్న సంబంధాలు, రాజకీయాలు అన్ని కూడా చాలా ఆసక్తికరంగా చూపించారు. ముఖ్యంగా యెర్ర గబ్బిలాల చరిత్ర, వాళ్ళ వలస గమనంలో జరిగిన సంఘటనలు మనల్ని కథలో లీనమైలాగా ఉన్నాయి.

నాగరికత మొదలైనప్పుడు కేవలం తెగలుగా ఉన్న మనుషుల జీవన విధానం ఎలా ఉండేది, తెగల మధ్య జరిగే యుద్దాలను, ప్రస్తుత ప్రపంచంలో రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేవో వాటిని ప్రామాణికంగా తీసుకొని ఈ కల్పిత ప్రపంచాన్ని సృష్టించారేమో అని నా అభిప్రాయం. ముఖ్యంగా ప్రజాస్వామ్యం పాలనలో ఉండే తెగ మీద నియంత పాలనలో ఉన్న తెగ దాడి, వేరే జాతి వాళ్ళు ఈ తెగలకు వచ్చి, వాళ్ళ వేషా, భాషా నేర్చుకొని వాళ్లలోనే కలిసిపోయి బ్రతకడం లాంటివి కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ తెగలు మాట్లాడుకొనే భాష గురించి. ఇది కొంచెం రాయలసీమ ప్రాంత యాస లాగ ఉన్నా కూడా ప్రస్తుత వాడుక భాషలో లేని ఎన్నో పదాలను ఈ తెగల మధ్య సంభాషణలు ద్వారా రచయత మనకు పరిచయం చేశారు.

తెగలు, కల్పిత ప్రపంచంలో మనల్ని తీసుకొని వెళ్లిన రచయత అంతే సమర్థవంతంగా కథ గమనం కూడా సాగి ఉంటే పాఠకుడుగా నేను ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవాడిని. తెగల మధ్య ఉన్న రాజకీయ సంబంధాలు గురించే నవల అనేలా చివర్లో మారిపోవడం వలన, మనం అంత వరకు ఊహిస్తున్న కథ కాస్త పక్క దారి పట్టినట్టు అనిపించింది. కొర్రయ్య అంత వరకు ఏ యెర్ర గబ్బిలాలు కోసం తన ప్రయాణం చేస్తూ ఉంటాడో.. చివర్లో వాటి గురించి పెద్దగా మనకి రచయత చెప్పకపోవడం కొంచెం నిరుత్సాహపరుస్తుంది.

తెలుగులో ఒక ఊహా  ప్రపంచం నిండిన  కథ చదవాలి అనుకొనే వాళ్ళు తప్పకుండా ఈ పుస్తకం చదవడానికి ప్రయత్నించండి.

ఈ పుస్తకంఅమెజాన్ లో దొరుకుతుంది.   ధర : ₹200/-

దయచేసి పుస్తకాలను కొని చదవండి..!

అమెజాన్ లింక్ : https://amzn.to/3r572Ka

*

ఆదిత్య అన్నావఝల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు