ఊర్మిళ నిప్పుకల

పుస్తకం ప్రచురించే క్రమంలో ఈ కవిత్వం పలుమార్లు చదివి ఉంటాను. ప్రతిసారీ కొత్తగానే స్ఫురించింది. ఆద్యంతం ఎడతెగని దాహార్తి కనిపించింది.

క బాలికగా ఆమె తండ్రి పద్యాలు పాడితే నిదురించారు. ఒక యువతిగా కేవలం పుస్తకాలు చదువుకునేందుకు జాగరణ చేశారు. ఒక కవయిత్రిగా జీవనజలధి ఒడ్డున విరిగిపడే విషాదోల్లాసపు కెరటాలని నలభయ్యేళ్ళకు పైబడి దోసిట పడుతున్నారు. ఆమె ఊర్మిళ.

బాల్యం నుంచీ కవిత్వం రాస్తున్న ఆమె గేయాలతో ఆరంభించి వచన కవితకి మళ్ళారు. ఇప్పటి వరకు సుమారు రెండు వందల కవితలు రాశారు. ఆ రాతప్రతులు, అచ్చుకాగితాలన్నీ పోగొట్టుకున్నారు. ఆఖరికి తొలిపుస్తకం తీసుకు రావాలనుకున్నప్పుడు, అరవయి కవితలు మాత్రమే సేకరించగలిగారు. అలాగ ‘అంగారస్వప్నం’ (2017) రూపుదిద్దుకుంది. ఈ సంకలనంలో 1992 నుంచి 2017 మధ్య ఆమె రాసిన పాతికేళ్ళ కవిత్వం చోటుచేసుకుంది.

*

శరత్, చలం, కృష్ణశాస్త్రి, చండీదాస్, రంగనాయకమ్మ, నటరాజన్‌లను ఆసక్తిగా చదివిన ఊర్మిళ ఇప్పటికీ శరత్‌ని ఇష్టపడతారు. ఆయన రచనల్లోని స్త్రీ, శతవిధాల ప్రయత్నించి తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటుందని ముచ్చటపడతారు. ఆడపిల్లల ఎడల ఆంక్షలు లేని కుటుంబంలో తను పుట్టి పెరిగినప్పటికీ, మిగిలిన కొన్ని సాంప్రదాయాలను ధిక్కరించివేశానంటారు. కౌటుంబిక వ్యవస్థలో మహిళగా తనకు సమాన హక్కులు లేకపోయినా వ్యక్తిత్వాన్ని మాత్రం కోల్పోలేదని చెబుతారు. ఈ పూర్వరంగంలో ఆమె కవిత్వధోరణి తెలుగు సారస్వాతాన విలక్షణమయింది. ఆది నుంచీ ఆమె హృదయ సంబంధి. నిరంతర అన్వేషి. ఎప్పటికప్పుడు రిక్తహస్తాలతో ఆమె అన్వేషణే ఈ కవిత్వమూలం.

రిక్తహస్తాలు

 

రిక్తహస్తాలు ముకుళించి

హృదయాన్ని వేడుకున్నా

నేనేంటో నాకొకమారు

మనసు ప్రతిబింబంలో

ఎరుక పరచమని

ఎప్పుడు

జారుకుందో ఏమో

ఏపుగా పెరిగిన

భావనల పొదరిల్లులోకి

 

వెతికి తీద్దామని

వెతుకుతూనే వున్నా

నిరంతరం. (పుట: 111)

*

తెలుగు కవుల్లోని సాధారణ వస్తు వ్యామోహం ఊర్మిళలో మచ్చుకి కూడ కనిపించదు. కవి భావన (feeling) మాత్రమే కవిత్వమని ఆమె విశ్వసిస్తారు. భావనని ఇతరులతో పంచుకోవడానికి వాహికగా కవిత్వప్రక్రియని ఆశ్రయించారు. కవిత్వమంటే ఒక సహజ ప్రవాహమని కూడ భావిస్తారు. కాబట్టి ఆమె కవిత్వంలో కాలానుసారం పరిభాష, ప్రతీకలు, నిర్మాణంలో మార్పు అనివార్యమయింది. అన్నిటికంటే ముఖ్యంగా అప్రయత్నంగానే రాయగలిగారు. ఈ సుగుణాల వల్లనే ఈ కవిత్వం ప్రత్యేకతను సంతరించుకుంది.

మధురవాణి నవ్వు

 

ఒకానొక రాతిరి

విరుచుకుపడ్డ మంచుబిందువునై

చీకటి నిండిన వెన్నెల తునకనై

 

ఒకానొక రాతిరి

నిటారుగా నిలిచిన గబ్బిలాన్నయి

తిరగబడిన తారకనై

ఎలకోయిల కఠోర షడ్జమమై

ఉదయించిన చీకటి నీడనై

 

ఒకానొక రాతిరి

కత్తులు పొదిగిన కూలిన వంతెననై

ఎగసిపడని కల్లోల తీరాన్నయి

ఎండి రాలిన పుష్ప సౌరభాన్నయి

రెక్క తెగిన సీతాకోకచిలుకనై

చెదిరిన కుంకుమ బొట్టునై

అసందర్భపు గర్భధారణనై

 

ఒకానొక రాతిరి

స్రవించిన ప్రసవ గీతాన్నయి

చిగురించిన సమాధి మొక్కనై

తల తెగిన మొండాన్నయి

ఉత్తరించిన కల కొనసాగింపునై

గాలి దుమారపు ఎండ వేడినై

పగిలిన అద్దపు ప్రతిబింబాన్నయి

నల్లని మేని ఛాయనై

తిమింగలం మింగిన ఖడ్గాన్నయి

 

ఒకానొక రాతిరి

వయసు తొడిగిన కుచ్చుల గౌనునై

వాంఛ తీరని కోరికనై

అంతరంగపు కుఠారంలో

కూరుకుపోయిన కింజల్కాన్నయి

నీటతేలే గుర్తుతెలియని శవాన్నయి

రేణువునై

అణువునై

పుప్పొడినై

గాఢాంధకారపు పొరనై

కరిగిపోని కొవ్వొత్తినై

తెరుచుకోని కంటిపాపనై

సవ్వడిలేని కాలి అందెనై

 

ఒకానొక రాతిరి

ఆడమనిషినై

ఆలినై వెలయాలినై

అంటువ్యాధినై

తెగిపడిన అవయవాన్నయి

ఉరగాంగననై

మెహబూబ్ కీ మెహందీ సెక్స్‌వర్కర్‌నై

ఎయిడ్స్ భూతాన్నయి నిన్నావహిస్తాను

రమిస్తాను

కాటేస్తాను

దహిస్తాను

గ్లోబంతటా వ్యాపిస్తాను

 

చివరారి రాతిరి

విలాసంగా సిగరెట్ అంటించి

నీ గుండెల్లో మందుపాతరనై పేలుతాను

విలయతాండవం చేస్తాను

మధురవాణినై పగలబడి నవ్వుతాను

నిషిద్ధ ఫలాన్ని మునిపంట కొరికి

జ్ఞానసుందరినై సృష్టి కావ్యాన్ని రచిస్తాను

పునర్ నిర్వచిస్తాను

కుప్రిన్‌ను కౌగిలించి

యమకూపాన్ని రద్దు చేస్తాను

నాక్కొంచెం నమ్మకం ఇవ్వమని

నిన్నడక్కుండానే ఇదంతా చేస్తాను (పుట: 24)

*

ఈ అనేకనేక రుతువుల్లో కవయిత్రి ఎవరిని సంబోధిస్తున్నారు? ఎవరితో సంభాషిస్తున్నారు? మరెవరితో సంవాదిస్తున్నారు? ఊర్మిళ తనని తానే పిలుచుకున్నారు… ముద్దుపేరుతో, అసలు పేరుతో, మారుపేరుతో. తనలో తనే మాట్లాడుకున్నారు… తనలోని అమ్మాయితో, పడుచుదనంతో, ప్రియురాలితో, పిల్లల తల్లితో, స్త్రీతత్వ అశక్తతతో, ఆగ్రహంతోనూ మాట్లాడుకున్నారు. కొన్ని మాటలకి ఊకొట్టారు. మరి కొన్నిటిని ధిక్కరించారు. అప్పుడప్పుడూ స్నేహితుడితోనో, సహచరుడితోనో పంచుకున్నారు. మిత్రవైరుధ్యంగానే జగడమాడారు. చివరికి రాజీపడి ఊరకుండిపోయారు. ఏమి చేయాలో పాలుపోక రంగురంగుల తీగలాగ ఒక కవితని అల్లుకొచ్చారు. ఆ స్వగతభాషణ (monologue), ఆ సంభాషణ (dialogue), ఆ మారుపలుకు (echologue) ఈ కవిత్వం. శరీరాన్ని అధిగమించిన, భౌతికస్థితిని అతిక్రమించిన, బాహ్య ప్రపంచాన్ని నిరసించిన అంతర్లోకంలోంచి విప్పారింది ఈ కవిత్వం. అందుకనే స్త్రీవాద కవిత్వంలో ఆమె భిన్నమయిన గొంతుకగా పలుకుతుంది.

*

పుస్తకం ప్రచురించే క్రమంలో ఈ కవిత్వం పలుమార్లు చదివి ఉంటాను. ప్రతిసారీ కొత్తగానే స్ఫురించింది. ఆద్యంతం ఎడతెగని దాహార్తి కనిపించింది. ఒక ఉదాహరణ చెబుతాను. ఈ సంకలనంలోని కవితల్లో ఇటీవలిది ‘రేగునూహ’.

 

రేగునూహ

 

గూటిలో ఒదిగిన గువ్వ

నిర్నిద్ర కలవరింత

 

చెదరని కలలో

నిజమై నిలుస్తావు

 

మల్లె మరువాల ఊసులెందుకు

బంతీ చామంతుల ఆనవాలు అసలెందుకు

 

గడ్డిపూవు విచ్చుకున్న పరువంలో

తేనియ వన్నె జాడ

 

సౌగంధిక పరిమళాల ఒంపులో

తుమ్మెదల రొద వెదజల్లుతావు

 

ఒక్క నేనే

పెక్కు నీవుల ఛాయలో నర్తిస్తాను

 

నదీనదాల సంలీనంలో

ఒక పొద ఒదిగిపోయింది

దాగుడుమూతల రేరాజు

అమృతం గుప్పిస్తాడు

ముడుచుకున్న పిడికిలి నుంచి

వెలుతురు ధార కడుతుంది

 

చిరుతడి

నేలమాళిగలో

కనకాంబరాలు మండిస్తావు

 

ఆవిర్లు కక్కని జలపాతం

గట్టు తెంచుకుంటుంది

నీట మునిగిన నీడ

చెరువు గట్టుపై కూచుంటుంది

మెలికలు సాగిన దారులు రెండూ

రాజీపడి ఒత్తిగిల్లుతాయి

 

కాటుక దిద్దని చూపు అద్దిన

ముద్దరలెన్నో

 

దిగబాకిన మడవేర్లలా

పిడికత్తులు పొదిగిన ఒర

మోహం కాక

ఇంకేమిటి (పుట: 132)

*

అప్పటికే ఈ పుస్తకం అచ్చయిపోయింది. ఊర్మిళ కవిత ఒకటి కవిమిత్రులు పెన్నా శివరామకృష్ణగారు మాకు అందజేశారు. సంకలనంలో చేర్చలేకపోయిన ఆ అరవై ఒకటో కవిత ‘తపోభంగం’.

తపోభంగం

 

అకస్మాత్తుగా రాలిపడే క్షణాలను

అరచేయి చాచి పట్టుకుంటాను

ఒక్కో అల కరిగిపోకముందే

గులకరాళ్ళు విసిరేస్తాను

ఎదలోతుల్లో పల్టీలు నీట మునకలు

గుప్పిట మూస్తే జారిపోయే అనుభూతులు

చెక్కిలిపై జాము రాతిరి జాడలు

తడారిన స్వప్నచారికలు

బిగిసడలిన బాసలు

పెదవి దాటని పదధ్వనులు

అయినా అరమోడ్పు కనులు తెరిచి

ఆలకిస్తూనే వుంటాను

అరికాలితో తడుముకుంటూ

పైకి ఎక్కాలనే అనుకుంటాను

అడుగెప్పుడూ తడబడదు

మెట్లన్నీ మామూలుగా ఎక్కేస్తాను

పై వరండాలోనే కళ్ళు తిరిగి పడిపోతాను

 

ఎప్పటికీ నిండని చెరువు

నా దాహం తీర్చదు

గజ ఈతగాడు రాడు

ఈ కాష్ఠం చల్లారదు (ఉదయం ‘రసన’ 22.11.1993)

పాతికేళ్ళ క్రితం రాసిన ‘తపోభంగం’, ఇటీవలి  ‘రేగునూహ’ కవితల్ని పోల్చిచూసిన చదువరికి ఊర్మిళ కవిత్వంలోని తాజాదనం తెలియవస్తుంది.

*

గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఆమె కొంతకాలం అస్మితలో పనిచేశారు. శ్రీశైలంలో చెంచులు, మెదక్‌లో జోగినుల సమస్యల పరిష్కారం దిశగా కృషిచేశారు. విభిన్న మహిళా సంఘాల్లోను; బహుజన, తెలంగాణ ఉద్యమాల్లోను పాలుపంచుకున్నారు. వివిధ పత్రికల్లో పలు అంశాల మీద కాలమిస్టుగా రచనలు చేశారు. ఈ మొత్తం ప్రయాణంలో సామాజిక, రాజకీయ, సాహిత్యరంగాల్లో సంభవించిన అనేక పరిణామాలను దగ్గరగా గమనించారు.

ఓ సందర్భంలో ఊర్మిళ నాతో చెప్పారు, ఒకసారి కవిత రాసిన తర్వాత మళ్ళీ దాని వంక చూడాలంటే తనకు సిగ్గేస్తుంది అని. ఈ మాట నాకు ఎంతో చిత్రంగా వినిపించింది. కవిత్వ సృజన ఆమె దృష్టిలో ఓ నిరంతర ప్రవాహం అవ్వడం వల్లనే, బహుశా ఓ బాల్యచేష్ట వంటిది కావడం వల్లనే ఆ విధంగా అన్నారనుకుంటాను. అయితే అందుకు రుజువుగా శిశువు నవ్వులోని నైర్మల్యంతోను, కవి సత్యవాక్కులోని దేహళీ దీపకాంతితోను ఆమె కవిత్వం నిండి ఉంటుంది. సరోజినీ నాయుడు అన్నారొక చోట,  ‘నేను జీవితానికి అత్యంత సమీపంలోకి వెళ్ళాను. కాని దానిలోని మంటలు నన్ను కాల్చివేశాయి’ అని. అలాగ ప్రేమవృక్షపు చిటారుకొమ్మకి కట్టిన ఊయల ఊగుతో ఊర్మిళ ఈ నిప్పుకలని కన్నారు.

*

(‘ప్రేమలేఖ ప్రచురణ’ ఇప్పటివరకు వెలువరించిన ఆరు కవిత్వ సంపుటాల్లో  రెండు కవయిత్రులవి. శివలెంక రాజేశ్వరీదేవి సత్యం వద్దు స్వప్నమే కావాలికి 2016లో ఇస్మాయిల్ కవిత్వ పురస్కారంఊర్మిళ అంగార స్వప్నంకి 2019లో రొట్టమాకురేవు కవిత్వ పురస్కారం పొందారు. ఊర్మిళకి అభినందనలుయాకూబ్శిలాలోలిత గార్లకు ధన్యవాదాలు)

నామాడి శ్రీధర్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు