ఊర్మిళ

 ఒడియా మూలం : గౌర హరిదాస్

 తెలుగు అనువాదం : వంశీకృష్ణ

గౌర హరి దాస్ ఒడియా సాహిత్య రంగం లో బహుముఖ ప్రజ్ఞావంతుడు  . కేంద్ర సాహిత్య అకాడమీ , ఒడిశా సాహిత్య అకాడమీ , సంబల్పూర్ యూనివర్సిటీ అవార్డు ,పలు ప్రముఖ అవార్డుల తో పాటు  భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ  ఫెలోషిప్, సాహిత్య అకాడమీ రైటర్ ఇన్ రెసిడెన్సీ గౌరవం పొందారు . యాభై కి పైగా పుస్తకాలు రచించిన ఆయన  కథలు  పలుభాషలలోకి అనువాదం పొందాయి . కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఆయన  కథలను  మరొక ప్రముఖ ఒడియా సృజన శీలి మోనాలిసా జెనా  ది నెయిల్  అండ్ అదర్  స్టోరీస్ శీర్షికన ఆంగ్లం లోకి అనువదించారు .కోరాపుట్ , ది  లిటిల్ మాంక్ అండ్ అదర్  స్టోరీస్ శీర్షికలతో మరో రెండు కథా  సంపుటాలు  ఆంగ్లం లో అందుబాటులో వున్నాయి .  సరళంగా , గోదావరీ ప్రవాహం లా సాగిపోతున్న కథ  చివర చిన్న ట్విస్ట్ తో  పాఠకుడు ఊహించని ముగింపులను ఇవ్వడం లో గౌర హరిదాస్  సిద్దహస్తుడు

*

ర్మిళ త్వరగా చనిపోవాలి

చనిపోక పోతే కనీసం ఏదైనా పెద్ద ప్రమాదానికి గురి అయి పరీక్షలు రాయకుండా ఫెయిల్ అయిపోయి స్కూల్ వదిలి వెళ్ళిపోవాలి

దేవుడిని ఎప్పుడు వేడుకునే , ప్రార్ధించే అవకాశం లభించినా ఈ రెండు కోరికలే కోరుకుంటాను నేను . మొదటి కోరిక మరీ కష్ట సాధ్యం అయితే రెండవ కోరికను అయినా దేవుడు తీర్చకూడదా ? ఇలాంటి రాక్షసమైన కోరిక కోరుకున్నందుకు నేను ఎప్పుడూ బాధ పడలేదు . కానీ నా కోరికలు ఏవీ దేవుడు తీర్చలేదు . ఊర్మిళ శుభ్రంగా , చురుకుగా  చెంగు చెంగున గెంతే లేడిపిల్ల లా చలాకీగా వుంది . అప్పుడు నేను నా మిత్రుడు పద్మలోచన్ సలహా మీద ఒక తాంత్రికుడిని సంప్రదించాలి అనుకున్నాను . పద్మలోచన్  చెప్పిన ఆ తాంత్రికుడికి చాలా మంత్రశక్తులు వున్నాయి . ఆయన వాటితో దేన్నయినా సాధించగలడు . ఆ శక్తిని సాధించగలిగితే నేను ఎవరిని అయినా మెస్మరైజ్ చేయవచ్చు . ముఖ్యం గా ఊర్మిళను నా చెప్పు చేతలలో వుంచుకోవచ్చు .

పద్మలోచన్ ప్లాన్ చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది . అదే స్థాయి లో భయాన్ని కూడా కలిగించింది . ఈ ప్రణాళిక అమలు చేయాలి అంటే స్మశానం లో ఉన్న  మహాలిక్ సమాధి దగ్గరికి అర్ధరాత్రి పూట అమావాస్య నాడు వెళ్లి కొన్ని పూజలు చేయాలి . కాస్త ఆలోచిస్తే దీనికంటే  దేవుడిని మరిన్ని సార్లు ఊర్మిళ చనిపోవాలని ప్రార్ధించడమే ఉత్తమమైన మార్గం అని నాకు తోచింది . తాంత్రికుడు దగ్గరకు వెళితే , నేనే ఆ పూజలు గట్రా చేసిందని అందరికీ అర్ధం అవుతుంది . ఇలా మౌనంగా ప్రార్ధించడం వలన నా దుర్మార్గపు ఆలోచనలు గురించి ఎవరికీ తెలియదు . ఇంకాస్త తీక్షణముగా  ప్రార్ధిస్తే దేవుడికి నా మీద జాలి కలగపోతుందా ? ఇలా ఆలోచించాక  పద్మ లోచన్  చెప్పిన తాంత్రికుడి ఆలోచన ను పక్కన పెట్టేసాను .

ఊర్మిళ పట్ల నా ద్వేషం  హేట్   ఎట్  ఫస్ట్ సైట్ లాంటిది . అంటే తొలి  ప్రేమ లాగా తొలి  ద్వేషం అన్నమాట . ఆ రోజు క్లాస్ కి ఒక్కరు కూడా గైర్ హాజరు కాకుండా అందరూ హాజరు అయ్యారు . నేనొక పాట  పాడుతూ , తరగతి గదిలోని బెంచీ మీద దరువు వేస్తూ వున్నాను . నా స్నేహితులు అంతా నా పాటకి కోరస్ కలిపారు . నా ఉత్సాహం లో నేను వున్నాను . తరగతిలోకి ప్రధాన ఉపాధ్యాయుల  వారు ఎప్పుడు వచ్చారో నేను గమనించలేదు . ఆయన ఒక్కసారిగా ఉరుము ఉరిమినట్టు గర్జించి ” పాట పాడుతున్నది  ఎవరు “? అని ప్రశ్నించారు . నేనే పాడుతున్నాను అని ఆయనకు తెలుసు . నేను పాడటాన్ని ఆయన స్వయానా కళ్ళతో చూశాడు . కానీ తాను  చూసిన దానికి కూడా ఆయనకు ఒక సాక్ష్యం కావాలి . ఆయన కోపం తరగతి గదిని ఒక్కసారిగా నిశ్శబ్దం లో ముంచేసింది . అందరూ మౌనంగా వున్నారు . అప్పుడు అకస్మాత్తుగా ఊర్మిళ లేచి ” సార్  వైకాష్  పాడుతున్నాడు ” అని చెప్పింది నా వంక వేలు చూపిస్తూ .

ఊర్మిళ ముందే మా ప్రధాన ఉపాధ్యాయుడు నా చెవుల మీద గుద్దిన బాక్సింగ్ గుద్దుల కంటే ఊర్మిళ చేసిన ద్రోహమే నన్ను ఎక్కువ బాధించింది . సరిగ్గా ఆ క్షణమే ” ఓ దేవుడా నువ్వు అంటూ ఉంటే ఈ అమ్మాయి మళ్ళీ తరగతి కి రాకుండా చూడు ” అని ప్రార్ధించాను .

కానీ  ఊర్మిళ  రోజూ వస్తూనే వుంది . రోజు మొత్తం మీద ఏదో  ఒక సమయం లో నా మీద కసి తీర్చుకుంటూనే వున్నది . నా పట్ల ఆమె శత్రుత్వానికి తగిన కారణమేదీ నాకు కనిపించలేదు . నేను ఎక్కడో మారుమూల గ్రామం  నుండి వచ్చి ఆమె ఇంటికి దగ్గరగా వున్న స్కూల్ లో చదవడమే అందుకు కారణమేమో ? అని నా అనుమానం .  నా అనుమానాన్ని  పద్మలోచన్ తో పంచుకున్నాను

ఆమెతోనాకున్న ఘర్షణ ను రాజీచేసుకోవడానికి కానీ,  ఆమె మీద నేను ఆధిపత్యం సాధించడానికి కానీ పద్మ లోచన్  నాకు సహాయపడక పోగా  . ” ఈ అమ్మాయి ఏదో  తలతిక్క అమ్మాయిలాగా వుంది . ఆమెతో నీకెందుకు ? ఆమె అన్న ఒక పోలీస్ ఇనస్పెక్టర్ తెలుసా ? అయినా నీకేమీ భయం లేదు . మేమందరం లేమా “?  అన్నాడు

పద్మలోచన్ మాటలు నన్ను కాస్త ఆందోళనకి గురి చేశాయి . ఇదంతా నేను తొమ్మిదవతరగతిలో వున్నప్పుడు జరిగింది . మా గ్రామం లోని బడిలో ప్రాధమిక విద్య పూర్తి చేసుకున్నాక నేను హై  స్కూల్ విద్య కోసం పతా పూర్ స్కూల్ కి వచ్చాను . మా క్లాస్ లో కేవలం పద్నాలుగు మంది విద్యార్థులే వున్నారు . పన్నెండు మంది మగ  పిల్లలు , ఇద్దరు ఆడ పిల్లలు . అది చిన్న స్కూల్ . పైకప్పు కూడా కాంక్రీట్ తో పోసిన స్లాబ్ కాదు . గడ్డితో కప్పిన రూఫ్ టాప్ . దీర్ఘ చతురస్రాకారం లో వున్న ఒక తోట . తోట కి పక్కగా పెద్ద నీటి కొలను .   నా ఊహలలో వున్న హై  స్కూల్ వేరు . అదొక పెద్ద బిల్డింగ్ . నా  ఊహలల్లోని స్కూల్ కీ నేను చదువుకునే స్కూల్ కీ అస్సలు పొంతనే లేదు . ఈ హాస్టల్ కి వచ్చేంతవరకు నేను మా దూరపు బంధువుల ఇంట్లో ఉన్నాను

క్రమంగా నేను తాలబంధ  గ్రామానికీ , దాని పరిసరాలకు అలవాటు పడ్డాను . విశాలమైన ఆకుపచ్చని పొలాలు , పెద్ద పెద్ద చెరువులు , నన్ను ఎంతగానో  మోహపెట్టాయి . ఏరువాక రోజులల్లో కనిపించే కుంకుమ రంగు కీటకాల అందాలు, చెట్ల కొస  కొమ్మల మీద కొంగల బారులు ఎంతో అద్భుతంగా ఉంటాయి . నేను రోజూ స్కూల్ కి వెళ్లే దారిలో ఈ అందాలన్నీ ఆహ్లదంగా గిలిగింతలు పెట్టేవి . తాలబంధ గ్రామం మీద మేఘాలు గుంపులు .గుంపులుగా రకరకాల వర్ణాలలో కనిపించి ఎవరినైనా ఆకట్టుకునేవి . క్రమంగా నేను మా ఊరిని మరచిపోయేలా చేసింది తాలబంధ గ్రామం  .

పద్మలోచన్ నన్ను సెలవులలో వాళ్ళ వూరికి తీసుకుని వెళ్ళాడు . ఉడికించిన గుడ్ల తోనూ , చికెన్ కర్రీ తోనూ పద్మలోచన్ నాకు ఆతిధ్యం ఇచ్చాడు . సాంప్రదాయ వైష్ణవ కుటుంబం లో పుట్టిన నేను మాంసాహార విషయం లో ఎంత నిక్కచ్చి గా ఉండాలో అంత నిక్కచ్చిగానూ ఉండ లేకపోయాను .

త్వరలోనే నేను టీచర్లందరకు ఇష్టమైన విద్యార్థిని అయ్యాను . స్కూల్ ఫుట్ బాల్  జట్టుకు ఎంపిక అయి  గోల్ కీపర్ గా కుదురుకున్నాను . క్లాస్ లో మానిటర్ గా ఎన్నిక కావడం మాత్రమే కాక తాలబంధ గ్రామ  పిల్లల లో నాయకుడుగా  కూడా నిలదొక్కుకున్నాను . క్లాస్ లో నేను ఏమి చేసినా నా మిత్రులు అందరూ ఆమోదించే వారు . కానీ నేను ఏమి చేసినా ఊర్మిళ ఎగతాళి చేసేది . మిగతా వాళ్లకు నా మీద ఉన్న  గౌరవాన్ని కానీ , ప్రేమను కానీ ఊర్మిళ పట్టించుకునేది కాదు . పదే  పదే  నాకు ఎదురు నిలిచి నన్ను గాయ పరచేది .

ఒకసారి విక్రమ్ మరో ఇద్దరు విద్యార్థులను కూడా గట్టుకుని  నా మానిటర్ షిప్ ను సవాల్ చేసాడు . నాకు కోపం ముంచుకు వచ్చి విక్రమ్

మీద చేయి చేసుకున్నాను . వాడి చెంప పగుల కొడుతూ ” మాదిగోడా ! ఎంత ధైర్యం నీకు ?” అన్నాను . నా మాట పూర్తి అయ్యేలోగా  నా తల  మీద బలంగా ఎవరో కొట్టినట్టు అయింది . నేను వెనక్కు తిరిగే సరికి సివంగిలా ఊర్మిళ . మీదకు దూకబోతున్న సివంగిలా కనిపించిన ఊర్మిళ ను చూడగానే  నాక్కొంచెం భయం వేసింది .

” ఇప్పుడు నువ్వు అన్నమాట ఇంకోసారి అన్నావంటే చంపేస్తాను . మాదిగవాడికీ , బ్రాహ్మణుడికీ  మధ్య తేడా ఏమున్నది ? మనందరం స్నేహితులం . మనం ఎప్పుడూ ఎవరినీ నీ కులం ఏమిటని అడగలేదు . నువ్వు వైష్ణవుడివి అయి ఉండి  పద్మ లోచన్  ఇంట్లో మాంసం  తిన్నావు అని మేము గగ్గోలు పెట్టామా ?”

ఆకాశం నుండి కింద పడినట్టు అయింది నాకు . గబగబా క్లాస్ కి వెళ్లి అటునుండి అటే  హాస్టల్ కి వెళ్ళాను. ఊర్మిళ నా తల  మీద కొట్టడమే నాకు పదే  పదే  గుర్తుకు రాసాగింది . ” ఒక ఆడ  పిల్లకి నన్ను కొట్టడానికి ఎంత ధైర్యం ?” నా పెదవుల మీద ఇంకా మొలవని మీసం , ఆడపిల్లల బుగ్గలలాగా ఎర్రగా ఉండే  నా బుగ్గలు  నన్ను నిస్సహాయుడిని చేశాయి . ధ్రువ కు లాగో నకులుడు కి లాగో నాకూ మూతి మీద దట్టమైన మీసాలు ఉంటే ఆ రాక్షసికి నేను తగిన గుణపాఠం చెప్పేవాడినేమో

ఊర్మిళ నాకంటే రెండు సంవత్సరాలు పెద్దది . మిగతా ఆడపిల్లలాగా ఆమె ఎప్పుడూ తన వయసును దాచుకునే ప్రయత్నం చేసేది కాదు , పైగా ” నేను నీ కంటే సీనియర్ ను . జాగ్రత్త !” అని మిగతా విద్యార్థులతో గట్టిగా హెచ్చరించేది . ఊర్మిళ పొడవుగా ఉండేది . ఆమె శరీరాకృతి ఆమెకు ఒక ఆధిక్యతను దానికి అదే కట్టబెట్టేది . గుండ్రటి మొహం , వెనుక బలమైన పోనీ టైయిల్ , కళ్ళకి కాటుక , నుదుటి మీద పెట్టుకునే సింధూరపు బొట్టు , గుండెల మీద కప్పుకుని విలాసవంతమైన తెల్లని స్కార్ఫ్

ఊర్మిళ అందంగా ఉంటుందని అందరూ అంటూ వుంటారు   . ఆ అభిప్రాయాన్ని నేను ఎప్పుడూ బలపరచలేదు  . ఆమెను నేను ఎప్పుడూ నా శత్రువు గానే చూశాను . శత్రువులు ఎప్పటికీ అందంగా , ఆకర్షణీయంగా వుండరు . అది శత్రుత్వం లో ఒక రూలు . నేను ఆమెను రాక్షసి , పిశాచి లాంటి పేర్లతోనే పోల్చుకునే  వాడిని . ఆమె ఎదుట ఒక్క మాట కూడా మాట్లాడే వాడిని కాను .ఒకరోజు నేను కొత్త షర్ట్  వేసుకున్నాను . అందరూ షర్ట్  బావుందని మెచ్చుకున్నారు . ఒక్క ఊర్మిళ మాత్రమే ” లోపల ఏమీ లేని వాళ్ళే బయట అందమైన దుస్తులతో ఏమీ లేదన్న విషయాన్ని కప్పేసుకుంటారు ” అన్నది . అందరూ నా వంక చూసి ఒక్కసారిగా ఫక్కున  నవ్వారు . ఆ తరువాత ఆ షర్ట్  నేనెప్పుడూ వేసుకోలేదు . ఊర్మిళ మాటలకి నేను ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చానో తెలియదు . ఆమె మాటలు శాసనాల్లాగా ఉంటాయి . బహుశా అలా శాసించే స్వభావం ఆమె అన్న పోలీస్ ఇనస్పెక్టర్ నుండి వచ్చి ఉంటుంది

ఒకసారి తాలబంధ  కి తిరిగి వస్తుంటే ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని  వర్షం కురవడం మొదలు పెట్టింది . దగ్గరలో ఒక్క చెట్టు కూడా లేదు తల దాచుకోవడానికి . పుస్తకాలని తలకు అడ్డంగా పెట్టుకుని నడుస్తున్నా తడిసి పోయాను . అకస్మాతుగా ” ఎందుకలా వానలో తడుస్తూ నీ దేహ ప్రదర్శన చేస్తావు . ఇలా రా నా గొడుగులోకి ” అన్న మాటలు వినిపించాయి . నేను తల తిప్పి చూస్తే ఊర్మిళ . ఏమి చేయాలో ఆలోచించుకునే లోగానే నేను ఊర్మిళ గొడుగులోకి వచ్చాను . ఒకే గొడుగు లో మేమిద్దరం పక్కపక్కనే నడుస్తూ . ఒక తెలియని భయం నన్ను ఆవరించుకుంది . ఆమెకు కొంచెం దూరంగా  నడుస్తున్నాను . ఆమె నా తల మీద కొట్టిన దెబ్బ ఇంకా తాజాగానే ఉంది  నా మనసులో . ” ” కొంచెం దగ్గరగా జరుగు . నేనేమైన నిన్ను చంపేస్తానా ?” అన్నది ఊర్మిళ . నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా నడవసాగాను . ఆమె ఊపిరి  చప్పుడు నాకు స్పష్టంగా వినిపిస్తోంది . తాల బంధ  చెరువు దగ్గర నేను వీడ్కోలు తీసుకున్నాను . ఎవరైనా చూసి వుంటారా అన్న భయం మనసులోకి వచ్చింది కానీ , నిర్మానుష్యమైన జొన్న చేల  దారిమీద కలికానికి వెతికినా ఒక్క మనిషీ  కనిపించకపోడం తో నాకు నేనె  భరోసా ఇచ్చుకున్నాను

కొన్నాళ్ల తరువాత ఊర్మిళ ఒక రోజు కొన్ని జామకాయలు , దోసకాయలు తీసుకుని క్లాస్ కి వచ్చింది . అందరికీ అవి పంచి పెట్టింది . నా శత్రువు నుండి ఏదీ తీసుకోవద్దని నేను గట్టిగా నిర్ణయించుకోవడం తో  జామకాయలు నేను తీసుకోలేదు . నా  స్నేహితులు అంతా జామకాయలు తీసుకుని కొరుక్కుని తినడం నాకు అస్సలు బాగా లేదు ” ఈ రాక్షసి ఎవరితోనైనా ఎందుకు లేచి పోదు ? ఏ చెరువు లో నైనా  పడి  ఎందుకు చచ్చి పోదు ?  ఓరి  దేవుడా నువ్వసలు  ఉన్నావా ?”

ఏ హానీ ఊర్మిళకు జరగలేదు . ఆమె రోజురోజు కు అందంగా తయారవుతున్నది . టీచర్లు నాకంటే ఆమెనే ఎక్కువగా ఇష్ట పడుతున్నారు . ఆమె మ్యాథ్స్ పరీక్షలో ఘోరంగా విఫలం అయినా చింతామణి సార్ ఒక్క మాట కూడా అనలేదు . మా ప్రధాన ఉపాధ్యాయుల వారు కూడా ఆమె తో మాట్లాడటానికి ఆసక్తి చూపిస్తున్నారు . వేగంగా పెరిగిపోతున్న ఊర్మిళ పాపులారిటీ నాకు నిద్ర పట్టకుండా చేస్తున్నది . ఊర్మిళ జామకాయలు తో ఫ్రెండ్స్ ను , తన నవ్వులతో టీచర్లను ఆకట్టుకుంటున్నది . నాకేమి చేయాలో తోచడం లేదు .

కాలం అలా నిశ్చలంగా ఉండదు కదా . ఊర్మిళ తన పదకొండవ తరగతి పరీక్ష ఫెయిల్ అయింది . రాత్రికి రాత్రి ఆమె కలలు అన్నీ తుడిచి పెట్టుకుని పోయాయి . ఆమె స్కూల్ రావడం మానేసింది . ఆమె స్కూల్ మానేయడం తో నేను స్వీట్స్ పంచిపెట్టాను  కారణం చెప్పకుండా . నా ఆనందాన్ని  ఎంతో ఘనంగా నాతో  నేనే పంచుకున్నాను . ఎట్టకేలకు దేవుడు నా మొర  ఆలకించాడు అని ఆనంద పడ్డాను . నా హై  స్కూల్ చదువు పూర్తి కావచ్చింది . మార్చి  మొదటి వారం లో సంవత్సరాంతపు పరీక్షలు జరగనున్నాయి . పరీక్షల తరువాత మేము మా వాళ్ళకి వెళ్ళాలి . స్కూల్ ముందు వున్న కొలను గట్టున కూర్చున్నాను . కొలనులో అలల్లా గడచిన రోజులన్నీ నా మనసులోకి సినిమా రీల్ లా తిరగసాగాయి . మా జానియర్ విద్యార్థులు మాకు వీడ్కోలు చెప్పడానికి సిద్ధం అవుతున్నారు . మమ్మల్ని మరచి పోవద్దు , గుడ్ బై మంచి స్నేహితులారా ? లాంటి నినాదాల తో స్కూల్ గోడలని అలంకరించారు . ఫేర్ వెల్ ఫంక్షన్ అయిపోయాక మేము మా ఊళ్ళకి  వెళ్ళిపోవాలి . మా సామాను అంతా సర్దేసుకున్నాము .

ఆ మధ్యాహ్నం నేను హాస్టల్ గదిలో వున్నప్పుడు హఠాత్తుగా ఊర్మిళ నా గదిలోకి వచ్చింది . ఆమెను చూసి నేను దిగ్భ్రాంతి చెందాను . ఆమె వంక చూడటానికి భయపడ్డాను . ఆమె నాకు లాస్ట్ పంచ్ ఇవ్వడానికే వచ్చి ఉంటుందని నా నమ్మకం . కానీ ఆమె నా పక్కన నిశ్శబ్దంగా కూర్చుంది . ఆమె విశాలమైన కళ్ళు నా దుస్తుల వంకా , సర్దుకున్న వస్తువుల వంకా తేరిపారా చూస్తున్నది . ఆమె చూపులను నా కళ్ళు అనుసరించసాగాయి . . ” నీకు వాచీ లేదు కదా . ఇదుగో నా వాచీ తీసుకో . పరీక్షలలో ఈ వాచీ పెట్టుకో . ” అని వాచీ ఇచ్చి నా జవాబు కోసం ఎదురు చూడకుండా గదిలోనుండి బయటకు వెళ్ళిపోయింది . నేను నోట మాట రానట్టు ఆమె వెళ్లిన వంకే చూస్తూ ఉండిపోయాను  ఆమె కనుమరుగయ్యేదాకా

నాకు వెంటనే , అత్యవసరంగా కావలసి న వస్తువులలో వాచీ ఒకటి . నేనా విషయం గురించి ఒకరిద్దరు దగ్గర స్నేహితులకు తప్పిస్తే ఎవరికీ చెప్పలేదు . కానీ ఊర్మిళ కి ఎలా తెలిసి ఉంటుంది ?

నన్ను బాగా ఆశ్చర్య పరచింది ఏమిటంటే ఊర్మిళ  ప్రవర్తన లో వచ్చిన ఆ పెద్ద మార్పు . ఊర్మిళ నన్ను అవమాన పరచకుండా వాచీ ఇవ్వడం నా కస్సలు జీర్ణం కావడం లేదు . ఊర్మిళ ఇచ్చిన వాచీ బంగారు వాచీ . నల్లటి బెల్ట్ తో చాలా ఆకర్షనీయంగా వుంది . ఆడపిల్లలు పెట్టుకునే సన్నటి, చిన్న, వాచీ లా కాక ఈ వాచీ కాస్త పెద్దగా వుంది . ఊర్మిళ వెళ్ళిపోయాక ఆ వాచీ ను నేను పెట్టుకోకుండా ఉండలేకపోయాను .  ఆ వాచీ ను నా చేతికి పెట్టుకుంటే ఒక వింత ఆనందం లాంటి సంతోషం నా గుండెలనిండా నిండింది

2

నేను పతా పూర్ వదిలేసి చాల రోజులయింది . ఆ వూరు జ్ఞాపకాలు అన్నీ మరపు పొరల్లోకి వెళ్లిపోయాయి . పాతికేళ్ల సుదీర్హ్గమైన కాలం నా జీవితం లో ఎన్నో మార్పులు తీసుకుని వచ్చింది . నేను ఎప్పటికీ మరచిపోలేను అనుకున్న వాళ్ళు నా జ్ఞాపకాలలో కూడా లేకుండా వెళ్లిపోయారు . నన్నెప్పటికీ మరచిపోను అని ప్రమాణం చేసినవాళ్లు నన్ను ఉపేక్షించారు . ఊర్మిళ అందుకు మినహాయింపు కాదు . ఇసుకలో రాసిన ఆమె పేరు ను బలంగా వచ్చిన ఇసుకతుఫాను గాల్లోకి ఎగరేసింది .

ఈ  మధ్య మా అమ్మకి పెద్ద జబ్బు చేసింది . ఆమెకు ఒక ఆపరేషన్ చేయాలనీ అందుకోసం ఒకరోజు హాస్పిటల్ లో చేరాలని డాక్టర్ చెప్పడంతో అమ్మను ఒక రోజు ముందుగా హాస్పిటల్ లో చేర్పించాను . ఉదయం పదిగంటలకు ఆపరేషన్ . సిస్టర్ ని పిలవడం కోసం హడావిడి గా బయటకు వస్తూ  లోపలకు వస్తున్న ఆయాను  చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాను . అప్రయత్నంగా నా నోటి నుండి ఊర్మిళ అన్న పేరు బయటకు వచ్చింది . పాతికేళ్ల క్రితం జ్ఞాపకాలలోకి నా మనస్సు ఒక్క సరిగా పరుగు తీసింది .

చివరి సారి నేను ఊర్మిళ గురించి విన్నది సనాతన్  దగ్గర . భద్రక్ నుండి కటక్ తిరిగి వస్తున్నప్పుడు నేను విన్న మాటలు నన్ను బాగా కల్లోల పరచాయి . ఊర్మిళ లాంటి అమ్మాయి కి అలాంటి అనుభవం ఎదురవుతుందా ?  సనాతన్  ఇలా చెప్పాడు

” ఒకరోజు ఊర్మిళ తండ్రి ఒక తాంత్రికుడిని పూజ కోసం పిలిపించాడట .  పసుపుపచ్చ చీర కట్టుకున్న ఒక కన్య పవిత్ర అగ్నిహోత్రం ముందు కూర్చుని వారం  రోజుల పాటు పూజ చేస్తే ఎనిమిదవ రోజున అంచులదాకా బంగారం తో నిండిన కలశం భూమిలో నుండి ఉబికి వస్తుందట .   . ఊర్మిళ నాన్న కి సహజంగానే ఊర్మిళ బెస్ట్ ఛాయిస్ అయింది . వారం  రోజులపాటు పూజ ఘనంగా జరిగిందట . ఎనిమిదవ రోజు గ్రామం  లోని చిన్నా పెద్దా అంతా ఆ అద్భుత దృశ్యాన్ని చూడటానికి  వింటి ముందు బారులు తీరారట . ఉదయం మధ్యాహ్నం లోకి జారుకున్నాడు కానీ  పూజ గది తలుపులు తెరుచుకోలేదు. ఊర్మిళ నాన్న మాటమీద కొంతమంది పూజ గది  తలుపులు బద్దలుకొట్టారు . పూజా సామగ్రి , బారా కోలి ఆకులూ , పసుపు, కుంకుమ నెయ్యి, అగ్నిహోత్రం మీద వండిన అన్నం గదిలో చెల్లా చెదురుగా పడివున్నాయి . సగం కాలిన మోదుగు పుల్లలు ఇంకా పొగను విరజిమ్ముతూనే వున్నాయి .   తాంత్రికుడు కానీ ఊర్మిళ కానీ లేరు . వాళ్లిద్దరూ చీకటిని చాటుగా చేసుకుని  వెళ్లిపోయారు

ఆ సంఘటన తో  పోలీస్ ఇనస్పెక్టర్ అయిన  ఊర్మిళ అన్న షాక్ కి గురిఅయ్యాడు . తండ్రి సిగ్గుతో సగం చచ్చి పోయాడు . తాంత్రికుడు గురించీ , ఊర్మిళ గురించి  అసహ్యకరమైన కధలు ఎన్నో జనం నోళ్ళ లో నుండి  రెక్కలు విప్పుకుని బయటకు వచ్చాయి “అని ఒక్కసారి ఆగాడు  సనాతన్ . ఆ విరామం కూడా నేను భరించలేకపోయాను

“తర్వాత ఏమైంది ?”

సనాతన్  ఏమీ మాట్లాడలేదు , కానీ అతడి మౌనం లో నాకొక విషయం అర్ధం అయింది . ఊర్మిళ అప్పటికే గర్భవతి . తాంత్రికుడి తో వెళ్లిపోవడం తప్ప ఆమెకు వేరే దారి ఏదీ లేదు .
ఇది జరిగి కూడా చాలారోజులు అయింది . ఇన్నాళ్లకు ఇప్పుడు మళ్ళీ ఆయా రూపం లో ఊర్మిళ . ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి
“మీరు ఊర్మిళ  కదూ “అన్నాను
“ఊర్మిళా ? ఊర్మిళ ఎవరు ? నా పేరు వనలత  . వనలతా ఫరీదా “అన్నది ఆయా

ఆమె అలా అనేసరికి ఒక్క క్షణం పాటు సిగ్గుపడ్డా . తలవంచుకుని “క్షమించండి . మీరు అచ్చు నాస్నేహితురాలు ఊర్మిళ లాగే ఉంటే … “నా మాట పూర్తి కాక ముందే ఆయా గదిలోనుండి వెళ్ళిపోయింది . మా అమ్మ మంచం పక్కనే కూర్చున్నాను . నా ఆలోచనలు ఏటో వెళ్లిపోయాయి . “మనుషులను పోలిన మనుషులు వుంటారు అంటారు . మరీ ఇంతలా వుంటారా ?” నాకు తెలిసిన ఊర్మిళ , యవ్వనం తో మిసమిసలాడే ఊర్మిళ పోలికలను ఈ నలభయ్ ఏళ్ళ మధ్య వయసు ఆయా లో వెతకడానికి ప్రయత్నం చేశాను . నాకు మళ్ళీ ఆయను కలవాలి అనిపించింది . లేదు . ఆమె అబద్దం చెపుతున్నది . ఆమె వనలతా  ఫరీదా కాదు . నా కళ్ళు నన్ను ఎప్పటికీ మోసం చేయవు ,.

మా అమ్మ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది . హాస్పిటల్ బిల్లు చెల్లించి అమ్మను ఇంటికి తీసుకుని వచ్చాను . ఊర్మిళ జ్ఞాపకం నన్ను వెంటాడుతోంది . ఊర్మిళ నాకు ఇచ్చిన వాచీ ఆమెకు నేను తిరిగి ఇవ్వలేదు . ఆ వాచీ ఇవ్వమని అమ్మ ఎన్నోసార్లు నాకు చెప్పింది . మెట్రిక్యులేషన్ పరీక్షలు అయినా తరువాత నాకు మళ్ళీ ఊర్మిళను కలిసే అవకాశం లభించలేదు .

ఆ రోజు ఆదివారం

సాయంత్రం హాస్పిటల్ కి వెళ్ళాను . రిసెప్షన్ లో నాకు తెలిసిన అమ్మాయే వున్నది . “వన లతా ఫరీదా ఇవాళ వచ్చిందా ?”ఆమె నా మాట విని తల  తిప్పి మరొక సిస్టర్ తో “వనలత  ఇవాళ వచ్చిందా ?”అని అడిగింది . ఆ పక్క నుండి సిస్టర్ “లేదు . వారం రోజుల నుండి రావడం లేదు “అన్నది
“ఆమె అడ్రెస్ తెలిస్తే చెప్పగలరా ?”
“సెక్టార్ 3 లో దేవాలయం పక్కన ఉంటుంది . వాళ్ళ ఇంటి ముందు ఒక బోర్ వెల్  ఉంటుంది ”
రిసెప్షన్ లో అమ్మాయికి థాంక్స్ చెప్పి వచ్చేసాను . నా ఆలోచనలు ఆగలేదు , ఎలాగైనా ఈరోజు ఆమెను కలుసుకోవాలి అనుకున్నాను . ఆలోచనలోనే దేవాలయం దగ్గరకు వచ్చాను . ఎడమ పక్కన ఒక బోర్ వెల్ కనిపించింది . దాని చాలా రోజుల నుండి వాడుతున్నట్టు  లేదు . చుట్టూ పక్కల అంతా చెత్త పేరుకుని వుంది . ఎదురుగా ఆస్బెస్టాస్ రేకులతో కప్పిన ఒక ఇల్లు కనిపించింది . ఆ ఇల్లు లోపలనుండి గడియ వేసి వుంది .

లోపల  నుండి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి . గిన్నెలు విసిరి వేస్తున్న శబ్దం . ఒక స్త్రీ ఎవరో కొట్టొద్దు , కొట్టద్దు అని వేడుకుంటున్న మాటలు . ఎవరా స్త్రీ ? వన  లతా ఫరీదా నా ? ఎవరిని అడగాలి ? చుట్టూ చూసాను . ఎవరూ లేరు . ఇంతలో తలుపు తెరుచుకుని ఒక ఎముకల పోగు బయటకు వచ్చింది . అతడి కళ్ళు ఎర్రగా మోదుగు పువ్వుల లాగా వున్నాయి . అతడిని చూడగానే ఒక్క క్షణం  పాటు గగుర్పాటు కలిగింది . అతడు బాగా  తాగి వున్నాడు .నా వైవు చూసి

“అబార్షన్ చేయాలా ? యాభయి రూపాయలు అవుతుంది ”

“లేదు . లేదు నేను వన లతా ఫరీదా కోసం వచ్చాను . ఆమెతో మాట్లాడాలి “అప్పటికే నా చేతులు ఆవేశం తో బిగుసుకుంటున్నాయి . అతడిని పడేసి కొట్టేయాలి అన్నంత ఆవేశం వచ్చింది . నన్ను నేను అతి కష్టం మీద నియంత్రించుకున్నాను . అతడు వరండా లో నుండి కిందకు దూకి చీకట్లో మాయమయి పోయాడు

వన లతా ఫరీదా ఇల్లు ఆకలితో అరుస్తున్న అనాధ పిల్లాడిలాగా వుంది . నేను ఇంట్లోకి నడిచాను . వనలత  కళ్ళు తుడుచుకుని నా వంక చూసింది . ఆమె కళ్ళు ఎర్రగా వున్నాయి . వంట్లో జ్వరం ఉండి  ఉంటుంది , అరవై క్యాండిల్ బల్బ్ ఆ గదికి సరిపడినంత వెలుగును ఇవ్వడం లేదు

“నాతో  ఏదైనా పని ఉందా ?”

“లేదు . లేదు ఏ పనీ లేదు . కానీ ఊర్మిళ ”

“ఊర్మిళ ఎవరు ? “ఆమె చెప్పలేనంత అసహనం తో అడిగింది

“ఊర్మిళ నా స్నేహితురాలు ”

“ఆవిడ ఎవరో నాకు తెలియదు . నాతో  ఏమైనా పని ఉంటే చెప్పండి ?”

“మీరు ఊర్మిళ లాగే వున్నారు . లాగే వున్నారు కాదు . మీరే ఊర్మిళ . నేను ఊర్మిళ కి బాకీ వున్నాను . ఇదుగో ఈ వాచీ బాకీ . ఆ వాచీ తిరిగి ఇవ్వాలని వచ్చాను “గబగబా గుక్కతిప్పుకోకుండా చెప్పాను .

“అది మీ దగ్గరే ఉంచుకోండి . ఆ రాక్షసి కి సంబంధించిన ఒక వస్తువు అయినా మీ దగ్గర ఉంటుంది ”

ఆ మాటతో నా  సందేహం తీరిపోయింది .ఆమె ఊర్మిళ కాక పోతే రాక్షసి అని ఎందుకు అంటుంది ? నేను వెంటనే పతా పూర్ హై  స్కూల్ గురించీ , ఊర్మిళ నన్ను పెట్టిన టార్చర్ గురించీ , ఒకే గొడుగు లో మేమిద్దరం నడిచిన సంగతీ  అన్నీ చెప్పాను . ఆమె లాంటి అమ్మాయికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందా ? ఆమెకు చెపుతూనే ఆలోచిస్తున్నాను . ఆ తాగుబోతు ఎందుకలా ఆమెను కొట్టాలి ?
అంతా చెప్పి “నాకు తెలుసు నువ్వు వనలత కాదు . కానీ ఊర్మిళ అని నిజం చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నావో అర్ధం కావడం లేదు “అన్నాను .

“మీకెన్ని సార్లు చెప్పాలి . నేను ఊర్మిళ ను కాదు . వనలతను.     ఊర్మిళ,  ఆ రాక్షసి చాలా ఏళ్ళ క్రితమే చచ్చి  పోయింది . మీరిక వెళ్లొచ్చు ”

ఆమె నా మొహం మీద బలంగా తలుపు వేసింది . నేను వెను  తిరిగి ఇంటివైపు నడుస్తుండగా ఆమె బిగ్గరగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది .

చిన్నప్పుడు నేను ఆమె కి ఎలాంటి స్థితి ఎదురవ్వాలని పదే  పదే  దేవుడిని ప్రార్ధించానో ఇప్పుడు ఆమె అదే స్థితి లో వుంది . నేను ఆనందం తో గంతులు వేయాలి . కానీ నా లోపల ఎవరో చిన్న పిల్లాడు ఓదార్చ లేనంత దుఃఖం తో ఏడుస్తున్న చప్పుడు . ఆ పిల్లాడిని ఒక్క మాటైనా చెప్పి నేను ఓదార్చలేను . నా కాళ్ళు  అలవాటుగా అడుగులు వేస్తున్నాయి కానీ ఒక పెద్ద అపరాధ భావం ఒక పెద్ద కొండలా నా హృదయాన్ని నుజ్జు నుజ్జు చేస్తోంది

***********

 

వంశీ కృష్ణ

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ, కథనం చాలబాగుంది. తెలుగు అనువాదంతో ఒక మంచి కథని ఇతర భాషనుండి అందించినందుకు సారంగకి, అనువాదకుడికి కృతజ్ఞతలు.

  • చిక్కగావుందికథాకధనం…ఝల్లుమంది ఓసారి ముగింపుచదివాక…అప్పటిలో ఊర్మిళపై అక్కసు అనేకన్నా కోపం…కాలానుగుణంగా ఆమెకుచెంతచేరి స్వాంతన అందజేయాలని అనిపించడం కథాగమనంలో రచయిత ఆ హిరోపట్ల హిరోయిజాన్ని మార్పునీ అసంకల్పితంగా మెట్యూర్డుగ ఆలోచింపచేసేటట్టుమలిచారు. పాపంఊర్మిళ ఎంతో తెగింపుతో యుక్తవయసులోవున్నది…ఇపుడిలా బలి అయిందీ. ఆమెపై కథలో హీరోకి సాఫ్టకార్నర్ .
    కథను మలచినతీరు చక్కగవుంది.
    మూలకథలోని పట్టును, బిగువును సడలనీయకండా అనువాదంచేయగలిగారని నమ్ముతున్నా…అందుకనే చిక్కగావుంది కథ. గుండెదిటవచేసుకుని చదివా! అనువాదకులు మూలకథను బాగా ఆకళింపుచేసుకున్నారు అందుకనే చేవతిరిగినరచయితగా అందించగలిగారు కథలోని మూలభావాన్ని. చదివించింది అనువాదకుని కలం…వీరి బలం ఆలోచనాపఠిమకూడా చెప్పుకోతగ్గదే.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు