తల్లి కడుపు నుండి స్వేచ్ఛగా జన్మించిన మనిషి కాలగమనంలో అనేక అడ్డు గోడలు నిర్మించుకొని ఎన్నో సంకెళ్ళ మధ్య జీవిస్తున్నాడు. కులం, మతం, ప్రాంతం, ధనిక, పేద, నలుపు, తెలుపు… ఇలా వివిధ వృత్తాలు మనిషిని అదృశ్యంగానే బంధిస్తున్నాయి. ఆధిపత్య వర్గాల నుంచి దళిత, బహుజనుల దాకా అందరూ ఏదో విధంగా ఈ గోడలు బలబడడానికి సహకరిస్తూనే ఉన్నారు. ప్రకృతిలాగ అందరినీ సమాన దృష్టితో చూసే ఉన్నత వ్యక్తిత్వం ఎప్పుడు అలవడుతుందో కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ మనిషికీ మనిషికీ మధ్య ఈ ముళ్ళ కంచెలు పెరుగుతూనే ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంత ప్రగతి సాధించినా, ఎంత నాగరికంగా జీవిస్తున్నా, యుగాలు గడుస్తున్నా ఈ అంతరాలు సమసి పోవడమే లేదు. వాటి స్వభావాన్ని, రూపాన్ని మార్చుకుంటున్నాయే కాని పూర్తిగా మనుషుల మనసుల్లోంచి తొలగి పోవడమే లేదు. బహుశా అలాంటి కొత్త బంగారు లోకాన్ని మరో శతాబ్దమైనా కలగనలేమేమో! ఇవన్నీ దాటుకుని మనిషికి ప్రకృతిలాంటి మనసుండాలని ‘తమసోమా జ్యోతిర్గమయా’ అంటూ చీకటి నుంచి వెలుతురు వైపు తీసుకుపోయే అద్భుతమైన కథ ‘ఊరు-అడవి’.
ఊరు-అడవి కథ చదవండి.
విపరీతంగా దాహం వేస్తున్న కథకుడు ఎర్రటి ఎండలో తాగు నీటిని వెతుక్కుంటూ పోతుంటాడు. ఎంత దూరం నడిచినా నీటి జాడ కనిపించదు. దూరంగా ఒక ఊరు కనిపిస్తే వెళ్లి ఒక ఇంటి ముందు నిల్చొని ‘దాహం’ అని అరుస్తాడు. “ఏ ఊరు మీది?” అని అడుగుతాడు ఒకాయన. కథకుడికి చెప్పబుద్ధి కాదు. మరో ఇంటికి పోయి అడుగుతాడు. అక్కడ “ఎవరు మీరు?” అని ప్రశ్నిస్తాడు మరొకాయన. కథకుడికి చెప్పబుద్ది కాదు. అక్కడి నుంచి ఇంకో ఇంటికి పోతాడు. అక్కడ “నీ పేరేమిటి?” అని ప్రశ్న వస్తుంది. కథకుడికి విసుగు వస్తుంది. “నీరు నీరు అని ప్రాణాలు వదులుతున్నవాణ్ణి పేరు పేరు అని ఏడిపిస్తారేమిటి?” అని కోపంతో అక్కడి నుంచి వెళ్లి పోతాడు. కోపంగా నడుచుకుంటూ పోతుంటే ఊరు పోయి అడవి ఎదురవుతుంది. ఈ అడవిలో నీళ్ళు ఎక్కడ దొరకాలి? అనుకుంటూ పిచ్చివాడిలాగా తిరుగుతుంటాడు. శరీరం తూలిపోతుంటుంది. కాళ్ళు తడబడుతుంటాయి. చావు ముంచుకొస్తున్నట్టుగా కళ్ళకు చీకట్లు కమ్ముతుంటాయి. దాహంతో అడవిలోనే చనిపోతానేమోననే భయం పట్టుకుంటుంది. చివరికి దాహంతో అడవిలోనే చనిపోయాడా? లేదా ఏ అదృశ్య హస్తమో వచ్చి కథకుడికి ప్రాణ/నీళ్ళ దానం చేసిందా? తెలియాలంటే మనం కూడా అడవిలోకి పోవాల్సిందే!
ప్రకృతి అందరినీ సమానంగా చూస్తుందని, ప్రకృతిని మించిన దయామయి ఎవరూ లేరని చెప్పకనే చెప్తుందీ కథ. ఊరుకు అడవికి మధ్య ఎంతో దూరం విస్తరించి ఉంటుంది. ఈ నిడివిలో మనిషి ఎలా ప్రవర్తించాలో, ఏ విలువల మీద విశ్వమానవుడిగా జీవించాలో కథకుడు చెప్పిన తీరు అమోఘం. భూమ్మీద సర్వ ప్రాణికి జీవనాధారమైన నీరు మనుషుల మధ్య ఎంత అగాధాన్ని సృష్టిస్తుందో, ఎంత అక్కున చేర్చుకుంటుందో కళ్ళకు కట్టిస్తాడు కథకుడు. మనుషులున్న ఊరు కన్నా చెట్లతో నిండిన అడవే నయమని ధ్వన్యాత్మకంగా నిరూపిస్తుందీ కథ. సాయపడుతుందనుకున్న ఊరు అడవవుతుంది. ప్రాణం తీస్తుందనుకున్న అడవి మనిషిలా ఆదుకుంటుంది.
శిల్పపరంగా కూడా చాల గొప్ప కథ. ఎంతో సహజంగా, సరళంగా సాగిపోతుంది కథ. కథకు కావాల్సిన వాతావరణాన్ని కల్పించే నాలుగు వర్ణనాత్మక వాక్యాలతో మొదలయ్యే ఎత్తుగడ, సంఘర్షణతో కూడుకున్న కొనసాగింపు, పాఠకుడు ఊహించని ముగింపులో కథ బిగువు, శిల్పం, సంక్షిప్తత దాగి ఉన్నాయి. ఒక రకంగా కథా సాధకులకు ఆదర్శ ప్రాయమైన కథ. ఈ కథ నుంచి ఎంతో నేర్చుకోవాలి. కేవలం 55 చిన్న చిన్న వాక్యాలుగల కథలోనే కథకుడు మనిషి చుట్టూ పరచుకున్న ఎన్నో అసమానతల్ని ప్రతిభావంతంగా చిత్రించాడు.
ఏ కథకుడికైనా ప్రకృతి చాలా గొప్ప వస్తువునే ప్రసాదిస్తుంది. దాన్ని కథగా మలచడంలోనే కథకుడి నేర్పు దాగి ఉంది. ఈ కథలో కూడా దాహం తీరడమనే చిన్న కథా వస్తువు చుట్టూ ఎంతో సామాజిక, ఆర్ధిక స్థితిగతులు వర్ణించబడ్డాయి. మానవీయత ఒక వైపు, సామాజిక స్థితిగతులు మరోవైపు సంఘర్షణకు లోనై చివరకు ప్రకృతిలోనే పరిష్కారాన్ని వెతుక్కుంటాడు మనిషి.
ఊరులాంటి అడవిని, అడవిలాంటి ఊరును వర్ణించిన ఈ ‘ఊరు – అడవి’ కథను రచించింది వరంగల్ జిల్లాకు చెందిన తెలంగాణ తొలితరం కథకులు పొట్లపల్లి రామారావు. (1917-2001) నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వీరులలో వీరొకరు. వీరి కలం నుండి ‘జైలు’, ‘చుక్కలు’ అనే కథా సంపుటాలు వెలువడ్డాయి. ‘జోన్నగింజ’, ‘సమాధి స్థలము’లాంటి కథలు వీరికి చాలా పేరు తెచ్చాయి. ఇవేగాక పొట్లపల్లి రామారావు కొన్ని గేయాలు, నాటికలు కూడా రచించారు.
*
అబ్బా ఏం కథ చెప్పారండీ. తెలంగాణలో కథలు రచయితల గురించి వాఖ్యానించే వారికి ఈ ఒక్కటి చాలదూ…ఊరు -అడవిని ఇంత బాగా చెప్పిన కథకుడు ప్రపంచ సాహిత్యంలోనే బహుశా ఉండకపోవచ్చు. ప్రకృతికి జీవ లక్షణం ఆపాదించాడు. పొట్లపల్లి రామరావు గారి సమాధి స్థలం కూడా చాలా బాగుంటుంది. ఇంటర్ సిలబస్లో ఉండేది.
“కులం, మతం, ప్రాంతం, ధనిక, పేద, నలుపు, తెలుపు… ఇలా వివిధ వృత్తాలు మనిషిని అదృశ్యంగానే బంధిస్తున్నాయి. ఆధిపత్య వర్గాల నుంచి దళిత, బహుజనుల దాకా అందరూ ఏదో విధంగా ఈ గోడలు బలబడడానికి సహకరిస్తూనే ఉన్నారు”
పై వాక్యం చదివితే జీవి, జిడ్డు లాంటి ప్రసిద్ధ తాత్వికులు గుర్తుకొచ్చారు. నిజంగా డా. వెల్డండి శ్రీధర్ గారి విమర్శ దిన దిన ప్రవర్ధమానంగా రాటు తేలుతుంది. అభినందనలు.
కథా సమీక్ష విమర్శ కోసం ప్రతి ఇష్యూ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. ఎంతోమంది లబ్దప్రతిష్టులైన కథా రచయితలను ఈ వేదికగా చదివే అవకాశం ఇస్తున్నారు. సారంగ యాజమాన్యానికి ధన్యవాదాలు
నమస్కారం నాటి మేటి కథ. ఈనాటి కీ ….చక్కటి విశ్లేషణ. అభినందనలు
బాగుంది మీ పరిచయం. నేను తాటికాయలకు రెండుసార్లు వెళ్ళి వారితో గడిపాను. ఆయన ఒకసారి( 1996) నాకోసం మా ఆఫీస్ కు కూడ వచ్చారు. సహృదయులు ఆయన.
టి. శ్రీరంగస్వామి, హన్మకొండ