ఊపిరి సలుపదు
గాలి ఆడదు
భాషకు అందదు
నోరు పెగల….. దు.
అడవిని కమ్మేసిన చీకట్లలోకి
రాజ్యాంగపు వెల్తురు సోకదు
**
చెరువుల్ని తోడి
చేపల్ని పట్టినట్టు
ఆదివాసీల్ని వెళ్లగొట్టి
అడవిని కొల్లగొడ్తారు
ఆదివాసి కంకాళాల మీద
అభివృద్ధి నమూనా అమలుజేస్తారు
దుఃఖ గాథల తొక్కి పట్టి
శాంతి భద్రతల జపం చేస్తారు
చెప్పుకునే వీల్లేదు
చేరదీసే వీల్లేదు
ఆదివాసికి ప్రపంచానికి మధ్యన
ఇనుప తెరల్లా క్యాంపులు
ఎటు చూస్తే అటు
పుట్టగొడుగుల్లా క్యాంపులు
ఒంట్లో జీవ జలాలను
హరించే క్యాంపులు
నాజీల దారుణ మారణ కాండల్ని
తలపించే గ్యాస్ చాంబర్లు
నిన్ను నిలబెడతాయి
నిన్ను పడగొడతాయి
ప్రశ్నించినందుకు
అశుద్ధంలా మూటగట్టి
అడవి నుండి విసిరేస్తాయి
సత్యమిక్కడ బందీ
స్వేచ్ఛ ఒక మాయ
సమానత్వం ఒక పరిహాసం
సొంత బిడ్డల్ని
నిర్లజ్జగా చంపుకునే
ఏకైక జాతి మనది..
ఇంకెందుకు ఈ ధర్మశాస్త్రాలు..
ఎవరికోసం ఈ న్యాయ శాస్త్రాలు?!
*
చిత్రం: చంద్రం
చాలా బావుంది
బాగుంది. వాస్తవానికి దర్పణం. అరుణ్ సాగర్ గుర్తుకు వచ్చాడు.