కార్పోరేట్ రంగంలో కొన్నేళ్ళు పని చేసి విరమించుకున్న స్మితా మూర్తి పర్యాటక రంగంలో ప్రవేశించి స్వతంగా ట్రిప్పిన్ ట్రావెలర్ అనే స్టార్ట్-అప్ కంపెనీ స్థాపించారు. అదే సమయంలో లైఫ్ వర్డ్‌స్మిత్ అనే కంటెంట్ ఫర్మ్‌ని నడుపుతున్నారు.
ప్రస్తుతం స్మితా మూర్తి తనను తాను వాండరింగ్ జిప్సీగా అభివర్ణించుకుంటూ, ప్రయాణాలకు అంతగా ప్రసిద్ధం కాని ప్రాంతాలలో తిరుగుతున్నారు. సోల్ మ్యూజర్ అనే పేరుతో బ్లాగు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తన తొలి నవలపై పని చేస్తున్నారు. గతంలో తన చైనా అనుభవాలను Worlds Apart అనే పుస్తకంగా తీసుకువచ్చారు.
రచయిత్రి పర్సనల్ వెబ్‌సైట్ http://www.smithamurthy.com
|
అది ఉదాసీనంగా అనిపిస్తున్న ఓ శనివారం ఉదయం. మబ్బులు మసకగా ఉన్నాయి, సూర్యూడేమో బలహీనంగా, మందంగా ఉండి, క్షమాపణ చెప్తునట్టుగా… కప్పులోని చల్లారిపోయిన టీ లా ఉన్నాడు. క్లినిక్ బాగా రద్దీగా ఉంది. ఈ క్లినిక్ ఎప్పుడూ జనాలతో నిండి ఉంటుంది. బహుశా జనాలకు ప్రతీ వారాంతంలో తమ సమీపంలోని క్లినిక్‌లకి వెళ్ళి, తమకేవయినా ఖరీదయిన జబ్బులున్నాయేమోనని పరీక్ష చేయించుకోడం ఒక కార్యక్రమమేమో! అలాంటివేవయినా ఉంటే, మరికొన్ని వారాంతాలు క్లినిక్‍వద్దే గడపవచ్చు! వెయిటింగ్ ఏరియాలో బోలెడు పత్రికలు ఉన్నాయి, డెస్క్ వెనక ఉన్న రిసెప్షనిస్ట్ జనాల్ని బాగానే నియంత్రిస్తోంది. ఇక్కడ ఆమెదే అజమాయిషీ. ఆమె నిర్ణయంతోనే వెయిటింగ్ ఏరియాలో ఉన్న వారెవరైనా డాక్టరు గదిలోకి వెళ్ళగలుగుతారు, బయటకు రాగలుగుతారు.
గోడనిండా పోస్టర్లు అతికించి ఉన్నాయి – కొన్ని పరీక్ష చేయించుకోకుండా నిర్లక్ష్యం చేసిన మధుమేహం వ్యాధి గురించి హెచ్చరిస్తున్నాయి, మరికొన్ని… అసంబద్ధంగా… ఓ సమ్మర్ క్యాంప్ గురించీ, మ్యూజికల్ ఈవెంట్ గురించీ, సరుకులను డోర్ డెలివరీ చేసే కిరాణా షాపు గురించీ చెబుతున్నాయి.
ఆ రిసెప్షనిస్ట్ దేవత ఎట్టకేలకు మాకేసి చూసి నవ్వి, మమ్మల్ని డాక్టరుగారి గదిలోకి వెళ్ళమంది. చదువుతున్న మాగజైన్‍ని పక్కనబెట్టి నేను లేచాను. ముందుకు నడిచి, డాక్టరు గారి గది తలుపును తెరిచాను, నాన్న లోపలికి వెళ్ళడం కోసం. తర్వాత నేనూ లోపలికి నడిచాను.
“పేషంట్ ఎవరు?” అడిగారు లావుపాటి డాక్టరు భారీ టేబుల్ వెనుక నుంచి. ఆయన ఆర్థోపెడిక్ సర్జన్ అని చెప్పే నేమ్ బోర్డ్ పై, అనేక సంవత్సరాలుగా ఆయన సాధించిన డిగ్రీలు… వ్రాసున్నాయి. ఎంబిబిఎస్.. ఎఫ్.హెచ్.ఆర్.సి.ఎస్… ఎం.ఎస్.. ఇలా రకరకాల అక్షరాలు ఆయన పేరు కింద తోకచుక్క తోకలా… రాసున్నాయి. కూర్చోమన్నట్టుగా తన ముందున్న స్టూళ్ళను చూపించారు. నేను డాక్టర్‌కెదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చున్నాను, నాన్న కాస్త నెమ్మదిగా వంగి, డాక్టరుగారికి పక్కగా ఉండే స్టూల్ మీద కూర్చున్నారు. ఇంతలో నా సెల్‌లో మెసేజ్ వచ్చినట్టు శబ్దం వచ్చింది. ఓ బ్యాంకు నుంచి నాకు ప్రీ-అప్రూవ్డ్ లోన్ పది లక్షలు శాంక్షన్ చేస్తున్నామని ఆ సందేశం!
“చెప్పండి సర్…” అన్నారు డాక్టర్. ఆయన చాలా త్వరపడుతున్నారు. ఓ పేపర్ వెయిట్‍ని తిప్పుతూ వాళ్ళిద్దరి సంభాషణని వినసాగాను.
చాలా వేగంగా డాక్టర్ రోగనిర్ధారణ చేసేశారు. అయితే దీన్ని నిర్ధారించడానికి డాక్టరే అక్కర్లేదు. మేము లోపలికి అడుగుపెట్టినప్పటి నుండి అందరికీ కనబడే సమస్యే కదా? నేను నడుస్తూ వచ్చాను, నాన్న కుంటుతూ!
“ఇది… ఈ…” చెప్పాడాయన, నాన్న ఆత్రుతగా ఆయన ముఖంలోకి చూస్తుండగా. ఆయనకి నాటకీయత ఇష్టమేమో… ఆపి ఆపి మాట్లాడుతున్నారు. కానీ మాటలకి సరైన చోట విరామం ఇవ్వలేకపోయారు..
“ఈ మోకాలి నొప్పి ముసలితనం వల్ల వచ్చేదే.”
నాన్న ముఖంలో నిరాశ. కాదు, ఆయన గుండె బద్దలయినట్టుగా ఉన్నారు. అయన ఊహించిన లేదా కోరుకున్న రోగనిర్ధారణ ఇది కాదు. ముసలితనం అనేది రోగనిర్ధారణ కానేకాదు. అదో శిక్ష! జీవితకాలపు శిక్ష!
డాక్టరు కేసి చూసి నవ్వాలనుకున్నారు నాన్న, బహుశా తన డయాగ్నోసిస్‍ని మరోసారి సరిచూడ్డానికి డాక్టర్‌ని ఒప్పించవచ్చని అనుకున్నారేమో. ఆ నవ్వులో సిగ్గు, ఆందోళన ఉన్నాయి.
“ముసలితనమా? కానీ డాక్టర్ గారూ! నొప్పి భరించలేనంతగా ఉంటోంది. రాత్రుళ్ళు నిద్ర పట్టట్లేదు. ప్రతీ రాత్రి నేను నిద్రపోవాలంటే…. స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తోంది. నేను నా గది మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాను… ఇది కేవలం ముసలితనం సమస్య కాకపోవచ్చు…” అన్నారు బ్రతిమాలుతున్నట్లుగా.
“నాకర్థమైంది సర్. నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ రాస్తాను, కానీ మీ వయసుకి.. మీ మోకాళ్ళు చక్కగా ఉన్నాయనే చెప్పాలి. ఇది వయసు పెరగడం వల్లే. మీ మోకాళ్ళు, మీ అమ్మాయి మోకాళ్ళు ఇప్పుడు ఒకేలా ఉండవుగా…” అన్నారు డాక్టర్ నాకేసి వేలు చూపిస్తూ. నేను ఆయన అందమైన, భారీ టేబుల్‌కి ఎదురుగానే కూర్చుని ఉన్నాను ఇంకా. “అసలు మెట్లు ఎక్కద్దండీ…” అన్నారు నవ్వుతూ, నాన్న సమస్యలకి అదే కారణం అన్నట్టుగా. ఆ నవ్వులో వెటకారం ధ్వనించింది.
నేను నాన్నా ఒకరి కేసి ఒకరం చూసుకున్నాం. అద్దం అమర్చిన భారీ బల్ల వెనుక కూర్చుని ఇంత సొంపైన సలహా ఇచ్చినందుకు ఆ క్షణంలో నాకు డాక్టర్ మీద చిరాకు కలిగినా, మర్యాద కోసం నవ్వడానికి ప్రయత్నించాను. కానీ ఆయన చాలా ప్రాక్టికల్‍గా ఉన్నారని తర్కం చెబుతోంది. భావోద్వేగానికి లోనవ్వాల్సిన అవసరం లేదు ఆయనకు. మా నాన్న ఆయనకు మరో పేషంట్ – అంతే! నాన్న మోకాలు ఆయనకు ఇంకో ఎక్స్‌రే! ఆ మోకాళ్ళు నాతో మాట్లాడినట్టుగా, డాక్టరుగారితో మాట్లాడవు. “ముసలితనం”. ఇదే మాట పదే పదే నా చుట్టూ మారుమ్రోగింది, ప్రతిధ్వనించింది. నిరాశాకుడ్యాలపై యెగిసి పడింది. ఆ మాట ఇంకా ఆ గదిలోనే తచ్చాడుతోంది.
నేను అసౌకర్యంగా కదిలాను, ఉన్నట్టుండి పేపర్ వెయింట్ ఎంతో బరువుగా అనిపించింది. నాపక్కనే ఓ వికారమైన కంకాళం ఉంది. దాని చేతి పంజా తెరిచి ఉంది, ఒక కాలు వంకరగా ఉంది. అన్నీ పద్ధతిగా ఉండాలన్న నా ధోరణిని అనుసరించి, వెళ్ళి దాన్ని సరిచేయాలన్న కోరిక కలిగింది. ఏమీ లేని చోట కూడా అన్నీ సక్రమంగా ఉండాలనుకుంటాను నేను..
నాన్న భుజాలు జారిపోయాయి. ఇంకేదో కఠినమైన నిర్ధారణ ఉంటుందన్న ఆశతో వచ్చారిక్కడికి. ఏదైనా లాటిన్ పేరున్న రోగమని, తర్వాత దాని గురించి గూగుల్‌తో వెతుక్కోవచ్చని అనుకుంటూ వచ్చారు. కాని గూగుల్‌లో ఆ లాటిన్ పేరు గల జబ్బు గురించి వెతికితే వచ్చేంత థ్రిల్ “ముసలితనం” అని వెతికినప్పుడు రాదు కదా? ఇంక చెప్పేదేం లేదన్నట్టు – తనకి బయట ఎక్కడెక్కడ అపాయింట్‌మెంట్లు ఉన్నాయోనని డాక్టర్ తన ల్యాప్‌టాప్ చూసుకుంటున్నారు. మరింత శక్తివంతమైన పెయిన్ కిల్లర్స్, మోకాళ్ళకి పూసుకోడానికి ఓ ఆయింట్‍మెంట్ రాశారు. తమ క్లినిక్‌లో ఫిజియోథెరపీ సెషన్స్‌కి రమ్మని చెప్పారు. అంతే! 450 రూపాయల కన్సల్టేషన్ ఫీజు చెల్లించి బయటకి నడిచాం. ముసలితనం ఫీజు ఇది!
మౌనంగా కారు నడిపాను. నాన్న నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ క్లినిక్‌లో చూసిన కంకాళమే నా కళ్ళ ముందు కదులుతోంది ఇంకా. దాని కాలు ఇంకా వంకరగానే ఉంది. బహుశా కాలం రాగాలకు నాట్యం చేస్తోందేమో! టిక్ టక్… టిక్ టక్… కాలమే డిజె.
ఈ క్లినిక్‍కి వెళ్ళొచ్చినప్పటి నుండీ నాన్న వయసు తొందరగా పెరిగిపోతున్నట్టు అనిపిస్తోంది. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న అమెరికా ట్రిప్ గురించో లేదా సింగపూర్ ట్రిప్ గురించే అస్సలు మాట్లాడడం లేదు. అసలు నడవడం గురించే బెంగపడిపోతున్నారు. నాకు గుర్తున్నంతవరకూ ఆయన రోజుకు ఐదు కిలోమీటర్లు నడిచేవారు. “నేను రోజూ ఐదు కిలోమీటర్లు నడుస్తాను, అదీ బ్రిస్క్ వాక్!” అని వీధిలో తనని ఆపిన వారికి చెబుతూండేవారు. ఇప్పుడాయన వాకింగ్ మానేశారు.
బ్రిస్క్ వాక్‌కి బదులుగా ఆయనిప్పుడు మా మేడ మీదే ఒకే వరుసలో మెల్లగా అడుగులు వేస్తూ అటుఇటూ నడుస్తున్నారు. ఎందుకలా అని అడిగితే, బెంగళూరులోని పేవ్‌మెంట్స్ బాలేవనీ, రోడ్ల మీద గుంతలు ఎక్కువయ్యాయనీ, అందుకే బయటకు వెళ్ళడం లేదని చెప్తున్నారు. గుచ్చి గుచ్చి అడిగితే, “నాలో బలం లేదు…” అని కోపంగా అంటున్నారు. “నాకిప్పుడు 81 ఏళ్ళు…” అంటున్నారు.
ఇదంతా మానసికమని ఆయనకి చెప్పాలని ఉన్నా, మౌనంగా పెదాలు కొరుక్కుంటాను. ఎక్కడైనా ముసలితనం బుర్రలో ఉంటుందా? ఈ మాటే అంటారేమో నాన్న! వయసనేది ఒక సంఖ్య మాత్రమే కదా? ఒక సంఖ్య మనిషిని ఇంతగా క్రుంగదీస్తుందా? కానీ నాన్న వినడం లేదు. డ్రైవర్‌తో పాటు జయనగర్ వెళ్ళి ‘ఊతం’ కోసం ఓ వాకింగ్ స్టిక్ కొనుక్కున్నారు.
అదేమంత అందంగా లేదు. ఎన్నో సినిమాలలో చూసినట్టు చెక్కతో చేసినది కాదు. ఇది అడుగున నాలుగు ప్లాస్టిక్ కాళ్ళుండి, పైన పిడి ఉన్నస్టిక్. దీన్ని పట్టుకునే నడిచేవాళ్ళని అది వెక్కిరిస్తోందా అనిపిస్తుంది.
ఆ ఊతకర్రని చూస్తే నాకు రోతగా ఉండేది. నాన్న గదిలో మంచం పక్కన దాన్ని చూస్తుంటే, అది నన్ను వెక్కిరిస్తున్నట్టుగా ఉండేది. దాని నాలుగు కాళ్ళంటే నాకు అసహ్యం. కర్రని పట్టుకునే వారికి అరచేతికి అమరేలా అమర్చిన దాని ప్లాస్టిక్ పిడి అంటే అసహ్యం. సౌష్ఠవపూర్వకంగా ఉండేది ఏదీ నాకు నచ్చదు, ఎందుకంటే సౌష్టవంగా అనిపించేందుకు నా జీవితంలో ఎన్నిటినో పోగొట్టుకోవాలి, పోగొట్టుకున్నాను కూడా. నేను ఆ వాకింగ్ స్టిక్‍నీ మరీ అంతంగా అసహ్యించుకుంటున్నానంటే, జీవితంలో నాకు నచ్చని విషయాలకి అది ప్రతీకగా అనిపిస్తుంది. కాలం గడిచిపోతునే ఉంటుంది, మనం దాని నిష్ఠురమైన కౌగిలిలో చిక్కుకుపోయినట్లుగా అనిపిస్తుంది. ప్రేమికులు ఎన్నడూ విడిపోరు. మరణం వరకు. నా అన్ని బంధాలలోనూ – నాకున్న అత్యంత విశ్వసనీయమైన ప్రేమికుడు కాలమే. మిగతా అందరినీ వదిలేయగలను, కానీ కాలం నన్ను విడవదు! పైగా అదిప్పుడు నా చెవిలో రొద పెడుతోంది. గడచిపోతున్న క్షణాల టిక్ టిక్ చప్పుడు ఓ సైరన్‌లా!
ఈమధ్య కాలంలో నేను ఆ ఊతకర్ర చప్పుడికి నిద్ర లేస్తున్నాను. ఠంగ్… ఠంగ్… ఠంగ్… అనే చప్పుడు… కాల గమనాన్ని సూచిస్తున్నట్టు! నా గది పక్కగా ఉన్న మెట్లు ఎక్కుతూ నాన్న మేడ మీదకి వెళ్ళినప్పుడల్లా ఏదో నిరాశ నా మెదడులో ప్రతిధ్వనించేది. దాన్ని తప్పించుకోడానికి నేనెంతగానో ప్రయత్నించేదానిని. చెవుల్లో దూది పెట్టుకునేదానిని, హెడ్‍ఫోన్స్ పెట్టుకునేదానిని! వినకూడదనుకున్నా ఆ శబ్దం నాకు వినబడుతూనే ఉండేది.
ఇక, నాకా స్టిక్ రోజూ కనబడుతోంది. దాని బూడిద రంగు పిడి, దిగువన గుండ్రని ప్లాస్టిక్ నాబ్. దాన్ని మా నాన్న నా బుక్ షెల్ఫ్ పక్కనే పెడతారు. ఎంతో విలువైన నా పుస్తకాల పక్కన అది పొగరుగా ఉంటుంది. దాని అహంకారం నాకు మరింత కోపం తెప్పిస్తోంది. దాన్ని వాడుతున్నందుకు నాన్నని తిట్టేదాన్ని.
“అది మీకు అవసరం లేదు నాన్నా. అదో క్రచ్ అంతే.”
మామూలుగా నాన్నకి ఓర్పు చాలా తక్కువ. కానీ ఈ స్టిక్ విషయానికొస్తే, ఓ యువ తండ్రి, చిర్రుబుర్రులాడే తన కూతురికి నచ్చజెబుతున్నట్టుగా ఉండేవారు. నిస్సత్తువగా, డాక్టరు చెప్పిన మాటలనే వల్లెవేసేవారు – “ముసలితనం అమ్మాయీ”! బలవంతంగా నవ్వేవారు.
“కాదు నాన్నా… ముసలితనం కానే కాదు…” అని ఇంకా ఏదో చెబుతామనుకుంటాను.. కానీ వాక్యం పూర్తవదు.
ప్రతీ రోజు నాకు నా ఊతకర్ర చప్పుడుతోనే మెలకువ వస్తుంది. ఆ ధ్వని నా అలసిన మనసులో ప్రతిధ్వనిస్తూనే ఉంటోంది. నేను ఎడ్గర్ అలాన్ పో ప్రియమైన శవపేటిక లాంటిదాన్ని, గతకాలపు మృత ధ్వనులను భారంగా మోస్తున్నాను, దాని బరువు రోజు రోజుకీ పెరిగిపోతోంది.
మా రోజులు… మా జీవితం.. మా సమయం ఎంత నిరర్ధకంగా సాగుతున్నాయో ఆ ఊతకర్ర జ్ఞాపకం చేస్తుంది – అది ఇంట్లో ఉండకూడదని నేను నిర్ణయించుకున్న రోజు వరకూ…! ఇది జరిగి తీరాలి. ఇప్పుడు కాకపోతే, ఇంకెన్నటికీ జరగదు. ఆ రెండు ప్రమాణాలు లేనే లేవు. కాలాన్ని తలచుకుని నవ్వుకుంటాను. ‘నువ్వు ఇక్కడే ఉన్నావు’ అనుకుంటాను.
బెంగళూరులో ఆరోజు వాతావరణం బాగా తేమగా ఉంది. ఋతుపవనాలు వచ్చేశాయి, వర్షం కురిసేలా ఉంది. నాన్న అక్క దగ్గరికి వెళ్ళారు. దాని అడ్డు తొలగించుకోవాలంటే ఇదే సరైన సమయం, వెంటనే ఆ ఊతకర్రని తీస్కుని కారులో పెట్టాను. నేను బయటకి నడిచిన చప్పుడు అమ్మకి వినబడలేదు, నెమ్మదిగా తలుపు దగ్గరకేసి వచ్చేసాను. ఇందులో ఇంకెవరి ప్రమేయమూ అక్కర్లేదని నిర్ణయించుకున్నాను.
నడుపుతునే ఉన్నాను. వీధుల వెంబడి పోనిస్తున్నాను.. కుడివైపున ఆటో గారేజ్ దాటిపోయింది… ఎడమవైపున డ్రైవింగ్ స్కూల్ దాటిపోయింది… పాత బిఇటి కాన్వెంట్, ఎవరూ వెళ్ళని ఓ బిర్యానీ రెస్టారెంట్… దాటిపోయాయి. కాఫీ డే దాటాను, బిడిఎ కాంప్లెక్స్ దాటాను. గత కొన్నేళ్ళుగా నాన్న నడిచిన దారిలోని ప్రతీ గుర్తునీ దాటాను.
అసలు ఎటు వెళ్తున్నానో కూడా నాకు తెలియడం లేదు. ఇలా ఎంత సేపు నడపగలనో కూడా తెలియదు. కానీ నా కారు దానంతట అదే నడుస్తోందేమో అనిపిస్తోంది. నాకిష్టమైన కాఫీ అడ్డాని దాటాను… నేను నా నేస్తం, అక్కడ కూర్చుని ఎన్ని కప్పుల కాఫీ తాగామో… రంగు వెలసిన పోలీస్ స్టేషన్‌ని దాటాను. చివరగా… నాకు కావలసిన చోటుకి చేరాను. అది ఓ ఖాళీ స్థలం – ‘ఈ స్థలం అమ్మకానికి లేదు’ అని హెచ్చరిస్తూ, యజమాని పేరు గర్వంగా పెద్ద అక్షరాలతో రాసి ఉన్న ఓ బోర్డు తప్ప ఇంకేమీ లేని స్థలం!
ఇది చాలు, అనుకున్నాను. వెనుక సీట్లోంటి దాన్ని బయటకు లాగాను. ఎత్తుగా పెరిగిన తుప్పలలోకి బలంగా విసిరేశాను. అమ్మయ్య! సాధించాను! వయసునీ, మర్త్యత్వాన్నీ, ఒకరిపై ఆధారపడే దుర్బలతనీ విసిరేశాను. కాలాన్ని కూడా విసిరేశాను… ఎందుకంటే నాకు మా నాన్న కావాలి.
ఇంటికొచ్చేశాను. చాలా రోజుల తర్వాత నేను నవ్వుతున్నట్టు గమనించాను. ఎన్నో రాత్రుల తర్వాత ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాను. పొద్దున్నే చిరపరిచితమైన ఉడుతల కిచకిచల శబ్దానికి నిద్రలేచినందుకు మళ్ళీ హాయిగా నవ్వుకున్నాను. ఇప్పుడు ఠంగ్… ఠంగ్… చప్పుడులేదు. భీతిగొలిపే చప్పుడు నాకిప్పుడు వినబడడం లేదు. నా పాత ప్రేమికుడి జాడలు నా మనసులోంచి చెదిరిపోయాయి.
నేను గదిలోంచి బయటకు రాగానే ఊతకర్ర ఏమైందని నాన్న అడిగారు. నాకు తెలియదని చెప్పాను. తికమకపడ్డా, ఆయన ఇక దాని గురించి ప్రస్తావించలేదు. అది మాయమైనందుకు పనివాళ్ళనెవరినీ అనుమానించలేదు, ఎందుకో ఏమో నాన్న ఇంకో వాకింగ్ స్టిక్ కొనుక్కోలేదు.
బహుశా అప్పుడేనేమో… అది లేకపోయినా నాన్న బాగానే నడవలగలరని మా ముగ్గురుకీ అనిపించింది! మేము దాని గురించి మాట్లాడుకోవడం లేదు… ఏదైనా జరిగితే ‘ఎందుకిలా జరిగింది, ఎవరు కారణం’ అని మాట్లాడుకునే కుటుంబం కాదు మాది, మేం మిగతా విషయాలు మాట్లాడుకుంటాం.
ఒకవేళ నడుస్తున్నప్పుడు కాళ్ళు నొప్పులనిపించినా, నాన్న ఫిర్యాదు చేయడం లేదు. ఆయన ముఖంలో బాధా వీచికలు కనబడినా, నేనూ అడగడం లేదు.
మెల్లిగా మేమొక క్రమానికి అలవాటుపడ్డాం, జీవితం సౌకర్యవంతంగా, ఆస్వాదించేలా మారింది. నాన్న పొద్దున్నే నన్ను నిద్రలేపుతారు. నేను ఆయనతో పాటు బెంగళూరులోని ఇరుకు సందుల్లో నడుస్తాను. గుంతలను తప్పుకుంటూ, పార్కుకి వెళతాము. నడుస్తూ మధ్యలో నిలబడతాం, పరిగెత్తేవాళ్ళు చెమట్లు చిందిస్తూ మమ్మల్ని దాటడాన్ని చూస్తాం. ఇంకా కొన్ని రౌండ్లు నడిచి, కాసేపు కూర్చుంటాము. కాసేపయ్యాక, లేచి మళ్ళీ నడుస్తాం. అదో ‘స్టాప్-స్టార్ట్-వాక్’ ప్రక్రియ. బ్రిస్క్ వాక్ ఏ మాత్రం కాదు.
ఒక్కోసారి నాన్న ఆసరాకి నా భుజం మీదకి ఒరుగుతారు. కాని నిజానికి ఎక్కువసార్లు నేనే ఆయన భుజం మీదకి ఒరుగుతుంటాను ‘ఊతం’ కోసం! ఎందుకంటే ఒక్కోసారి… ముసలితనం (అనుభవం)… అవసరమదే.
ఆంగ్ల మూలం: స్మితా మూర్తి
అనువాదం: కొల్లూరి సోమ శంకర్
Add comment