“If a nation loses its storytellers, it loses its childhood.”—Peter Handke
సాహిత్యం నిరంతర స్రవంతి. ఎప్పటికప్పుడు కొత్త ప్రవాహాలు వచ్చి చేరి దాన్నినిత్య నూతనం చేస్తుంటాయి. కొత్త తరానికి చోటు లేని సాహిత్యం ఎంతో కాలం నిలబడదు. ఐతే సోషల్ మీడియా వ్యాప్తి వేగంగా పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో నేటి యువతరం సాహిత్యాన్ని అందునా కథా ప్రక్రియను పట్టించుకుంటోందా? కథలు చదివేవాళ్లే కరువైతే-మరి రాసే వాళ్ల పరిస్థితి?
ఇవన్నీ ఇవాళ్టి కథాభిమానులను కలవరపెడుతున్న ప్రశ్నలు. ఈ సందేహాల మధ్యనే మేమున్నాం అంటూ తమ గొంతుక వినిపిస్తున్నారు నవతరం కథకులు. కథలు చదవడమే కాదు… కొత్తగా రాసి చూపిస్తాం కూడా అని నిరూపిస్తున్నారు. కథను నేటి తరం అవసరాలకి అప్ డేట్ చేసుకుంటూ, రేపటి కథ పట్ల ఆశను పెంచుతున్నారు. అటువంటి నవతరం కథకులను పరిచయం చేయడమే రేపటి కథ శీర్షిక ఉద్దేశం.
ఉర్సు
ఎర్రటి ఎండాకాలం. సాయంత్రమైనా ఉక్కపోత అలాగే ఉంది.పెళ్లి హడావుడి అప్పటికే మొదలైనా, ఆ ఇల్లెందుకో నిశ్శబ్దంగానే ఉంది. ఎవ్వరూ ఏ పనీ చేయట్లేదేమో అన్నట్లుంది. ఏ పనీ జరుగకుండా అయితే లేదు.
చెక్క బల్లపీట మీద చిన్న చెద్దరేసి ఆ పిలగాణ్ని పడుకోబెట్టిందామె.
‘అమ్మెప్పుడొస్తది?’ అనడిగాడు ఆ పిలగాడు. అప్పటికది పదమూడోసారి ఆ పిలగాడు అడగడం.
‘అబ్బ! పొద్దుగూకెకల్ల ఒస్తదిలేరా! పండుకో..’ అందామె.
ఆ పిలగానికి మేనత్త ఆమె. వాడితో పాటొచ్చిన నాన్న వేరే ఊరెళ్లాడు.. ఏదో పనిమీద. అన్న ఎండకు తట్టుకోలేక తిరిగెళ్లిపోయాడు. ఊరనగానే అమ్మ లేకుండా ఉండగలనా అన్న ఆలోచనే చేయకుండా నాన్న వెంట వచ్చేశాడు ఆ పిలగాడు. అమ్మ గుర్తొస్తోంది.
వాళ్ల ఊరికి, పిలగాడున్న ఊరికి ముప్ఫై కిలోమీటర్ల దూరం. అన్న వెళ్లిపోయాడు, పదహారేళ్లొచ్చాయి కాబట్టి. ఆ పిలగానికి ఆరేళ్లే. ఉండిపోయాడు.
అమ్మకోసం చాలాసేపు ఏడ్చాడు. ఎండిపోయిన కన్నీళ్ల ఊసు బుగ్గలనిండా పేరుకుంది. నోరు ఎండుకపోయింది.
అంతకుముందే అత్త నీళ్లు తాగించింది. ఇప్పుడే కొంచెం సర్దుకున్నట్టు ఉన్నాడు.
‘పండుకోరా!’ అందామె మళ్లీ.
ఒకపక్క ఒరిగి ఆ పిలగాడు బల్లపీట మీదనే అటూ ఇటూ కదులుతున్నాడు. కళ్లు తెరిచే చూస్తున్నాడు. పడుకోవట్లేదు.
అత్త సజ్జ రొట్టెలు చేస్తోంది. పొయ్యిలో మంట ఆరినప్పుడల్లా, గొట్టమందుకొని గట్టిగా ఊదుతోంది. పొయ్యి అంటుకుంటోంది. ఆ కొట్టమంతా పొగ చుట్టుకుంటోంది. కొట్టంలో ఓ మూలకే ఉన్నా పిలగాడు ఆ పొగకు దగ్గుతున్నాడు.
ముద్ద చేసి పెట్టుకున్న పిండిని ఒత్తి పెట్టడం, రొట్టెలు కాల్చడం.. అంతా చేత్తోనే చేస్తోంది అత్త. ఏదో నైపుణ్యం కావాలేమో ఆ చేతులకు, ఈ పని అలా చేస్తూండడానికి.
‘రొట్టె తింటవా?’ అనడిగింది అత్త.
ఆ పిలగాడు వద్దన్నట్టు తల అడ్డంగా ఊపాడు.
మళ్లీ అడిగాడు – ‘అమ్మెప్పుడొస్తది?’.
చిన్నగా నవ్వింది అత్త. పొయ్యి దగ్గర్నించి బల్లపీట దగ్గరికొచ్చి, పిలగాని జుట్టు చెరుపుతూ.. ‘ఒస్తదిలేరా!’ అంది. పిలగాడు నవ్వినట్టు చూశాడు.
అప్పుడే కొందరు చుట్టాలు వస్తున్నారు. రేపు పెళ్లికొడుకును చేస్తారు. ఎల్లుండి పొద్దునే పెళ్లి. పెళ్లికొడుకు రెండు మూడు సార్లు ఆ పిలగాణ్ని పలకరించి వెళ్లిపోయాడు.
వచ్చిన చుట్టాలంతా అత్తను పలకరిస్తూనే, ‘ఎవరీ పిలగాడు?’ అంటున్నారు.
అత్త వాణ్ని చూసి నవ్వుతూ, సమాధానం చెప్తోంది. పిలగాడు అలా చూస్తూనే ఉన్నాడు. బల్లపీట మీదినుంచి కదలట్లేదు.
చాలాసేపు ఏదో చెప్పాలనుకున్నట్టు చూస్తూ పిలగాడు అన్నాడు – ‘దొడ్డికొస్సోంది!’.
‘అర్రే..!’ వాణ్ని చూసి ఆ మాటని, ‘లక్ష్మీ’ అని కేకేసింది అత్త.
లక్ష్మి ఆ కేకకు పరిగెత్తుకుంటూ వచ్చింది. లక్ష్మి అంతసేపు ఇల్లు అలుకుతోంది. పైకి లాగి కట్టిన చీర అలా ఉంచుకొనే వచ్చింది.
‘ఆ! ఏందే?’
‘పిలగానికి దొడ్డికొస్సుందంట. అట్ల దీస్కపో..’ అంది.
పిలగాడిని లక్ష్మి బయటకు తీసుకుపోయింది.
పొలాల మధ్య కూర్చొని, హూ.. హూ.. అని కష్టపడుతున్నాడు పిలగాడు. మూత్రం రావట్లేదు. కొద్దిసేపటికి రెండు చుక్కలు పడ్డాయి. ఆ తర్వాత ఇంకో రెండు చుక్కలు. రక్తం.
కొద్దిసేపటికి వాడి ముడ్డికడిగి, ఎత్తుకొని తీస్కొచ్చి, ఆ బల్లపీట మీదనే పడుకోబెట్టింది లక్ష్మి.
అత్త ఇంకా రొట్టెలు కాలుస్తూనే ఉంది.
‘అమ్మెప్పుడొస్తది?’ అడిగాడు పిలగాడు మళ్లీ.
‘దోశలన్నజేస్త.. తిను..’ అంది అత్త.
‘ఒద్దు. అమ్మెప్పుడొస్తది?’.
అత్త ఈసారి నవ్వింది. అప్పటివరకూ చేసిన రొట్టెలన్నీ తీస్కొని ఇంట్లోకెళ్లింది.
తిరిగొచ్చి, పిలగాణ్ని తీసుకొని ఊర్లోకెళ్లింది.
ఆరయింది. కోంటోళ్ల షాపులో రెండు బిస్కెట్‌ప్యాకెట్లు కొనిచ్చింది అత్త. వాడు అందులో ఒకటి చింపి మూడున్నర బిస్కెట్‌లు తిన్నాడు.
అప్పుడే చెట్టుమీది నుంచి దింపిన కల్లు పట్టుకొస్తున్నాడు లింగయ్య.
‘ఇంట్లనె పొయియ్యాళ! రేపటెల్లుండిగుడ..’ అంది అత్త లింగయ్యతో. సరేనన్నాడు లింగయ్య.
‘కల్లు తాగుతవా?’ పిలగాడిని అడిగింది అత్త.
‘ఊహూ..’ అన్నాడు ఆ పిలగాడు.
చుట్టాలు ఎక్కువయ్యారు. ఎక్కడెక్కడో ఊర్లలో ఉన్న చుట్టాలంతా దిగుతున్నారు. పిలగాణ్ని ఒక దగ్గర కూర్చోబెట్టి, పనిలో పడిపోయింది అత్త.
ఎవరైనా వస్తున్నారని అర్థమవుతున్నప్పుడల్లా, గేటు దాకా పోయి చూస్తున్నాడు ఆ పిలగాడు, అమ్మ అయి ఉండొచ్చని.
కొద్దిసేపు కొట్టం చుట్టూ తిరిగాడు.
కొద్దిసేపు మిద్దెక్కి కూర్చున్నాడు.
వచ్చిన చుట్టాల్లో కొద్దిమంది ఆ పిలగాని బుగ్గగిల్లి, ‘ఏం పేరు నీది?’ అనడుగుతున్నారు.
అమ్మెప్పుడొస్తదని మూడుసార్లు అత్తనడిగాడు ఈలోపు.
గేటు దిక్కు పోయి నిలబడ్డాడు. వీధివంక చూస్తూ ఉన్నాడు. ఒక పరిచయం ఉన్న ముఖం.
అతణ్ని చూడగానే, పిలగాడు చెయ్యి చాపి అతనికి దగ్గరగా వెళ్లాడు. ఎత్తుకొమ్మన్నట్టు చూశాడు.
అతడు ఆ పిలగాణ్ని ఎత్తుకొని వీధంతా నడుస్తున్నాడు. ఏడు కావొస్తున్నా చీకటి పడలేదింకా!
ఆ పిలగాడు కాసేపటికి కుదురుకున్నట్టు ఉన్నాడు. అతనితో ఆడుతూ కూర్చున్నాడు ఓ షాప్‌ముందు.
చీకటి పడింది. ‘అమ్మెప్పుడొస్తది?’ మళ్లీ అడిగాడు ఆ పిలగాడు, అటుగా వచ్చిన అత్తను చూసి.
అత్తేదో చెప్పబోయింది.
పిలగాడి చూపు వీధి చివరి లైటు స్థంభం దగ్గర కనిపించిన ఇద్దరు మనుషుల మీద పడింది. వాళ్ల చేతిలో ఏవో సంచులున్నాయి.
‘అమ్మ’ అనుకున్నాడు పిలగాడు. అత్తవైపు చూశాడు. ఆమె నవ్వింది.
వీధివైపు నడుస్తూ వస్తోన్న ఆ ఇద్దరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు.
కాటన్‌చీర కట్టుకుందామె. ఆమెకు దగ్గరగా జరిగి, నడుము చుట్టూ చేతులు చాపి పట్టుకున్నాడు ఆ పిలగాడు.
గట్టిగా అరిచాడు.
గట్టిగా ఏడ్చాడు.
‘అమ్మా!’ అంటూ ఆమె చుట్టూ చేరి ఇష్టమొచ్చినట్టు చేత్తో కొడుతున్నాడు.
అమ్మ ఎత్తుకోబోతే గట్టిగా లాగి విడిపించుకున్నాడు. ఆమెనలా కొడుతూనే ఉన్నాడు. అమ్మ పక్కనే ఉన్నాడు అన్న. నవ్వుతున్నాడు.
అమ్మ మళ్లీ ఎత్తుకున్నప్పుడు, విడిపించుకొని కిందికి దూకాడు.
అమ్మ రెండు చేతులనూ దగ్గరకు లాగి గట్టిగా ఆ చేతులను ఒకదగ్గర చేర్చి కొట్టాడు.
అమ్మ చేతికున్న రెండు గాజులు పగిలాయి. మళ్లీ అలాగే చేశాడు. ఇంకో రెండు గాజులు పగిలాయి.
పిలగాడిని గట్టిగా అల్లుకుందామె. మళ్లీ ఎత్తుకొని ముద్దులుపెట్టింది.
వాడు ‘పో పో పో’ అంటూనే ఉన్నాడు.
అలాగే ఎత్తుకొని కొన్ని అడుగులు వేశాక, అమ్మకు ఒక షాపు కనిపించింది. గోలీసోడా కొనిచ్చింది. పిలగాడు అది తాగాడు. జేబులో దాచిపెట్టుకున్న బిస్కెట్లు తీసి తిన్నాడు.
ఆ రాత్రంతా అమ్మను పట్టుకొనే ఉన్నాడు ఆ పిలగాడు.
ఆ తర్వాతరోజు పెళ్లికొడుకును చేసినప్పుడు, ఆ తర్వాతి పెళ్లిరోజూ.. పిలగాడు అమ్మను పట్టుకొనే ఉన్నాడు.
ఆమె కొంగుచుట్టూ చేరి నిలబడో, చంకనెక్కి కూర్చొనో, చెయ్యి పట్టుకొనో, ముందో, వెనకో, అమ్మతోటే ఉన్నాడు.
పెళ్లయి ఒక రోజయింది. నాన్న, అన్న వ్రతానికి ఉంటానన్నారు. ఆ సాయంత్రమే వ్రతం.
పిలగాడు ఉండనంటే ఉండనన్నాడు. అమ్మ సరేనంది. జాకెట్‌లోంచి పర్సు తీసి చూసింది. డెబ్భై రూపాయలున్నాయి.
ఆ పర్సును మళ్లీ అక్కడే పెట్టుకుంది. వెళ్తున్నట్టు అందరికీ చెప్పి బయల్దేరింది అమ్మ.
‘రతానికి ఉండొచ్చుగానే!’ అంది అత్త.
‘పిలగాడు చూశినవ్‌గా! సుస్తు గుడ జేసినట్టుంది..’ అంది అమ్మ.
బస్సెక్కింది.
గడియారం సెంటర్లో బస్సు దిగింది. మధ్యాహ్నమయింది. ఎండ. పిలగాడు పడుకున్నాడు. ఓ చేతిలో సంచి పట్టుకొని, ఇంకో చేత్తో పిలగాణ్ని ఎత్తుకొని, చంకలో వేసుకొని నడవడం మొదలుపెట్టింది.
ఉర్సు దగ్గరకొచ్చేసరికి పిలగాడు లేచి చూశాడు.
ఉర్సొచ్చి రెండు వారాలయింది. రెండు వారాలనుంచి పిలగాణ్ని తీసుకొని ఉర్సుకు రావాలనుకుంది అమ్మ. రెండు వారాల పాటు కళకళలాడిన ఉర్సులో ఇప్పుడు షాపులన్నీ ఖాళీ. నిన్న పెళ్లయ్యాక ఎవరికి వాళ్లు ఊరెళ్లిపోతే సంబరమంతా వెలిసిపోయినట్టుంది ఆమెకు, ఉర్సును చూస్తే.
ఇరవై రూపాయల స్వీట్‌చెప్పింది. లతీఫ్‌సాహెబ్‌కు ఆ స్వీట్‌చదివించి, పిలగానికి కొంత తినిపించింది. ఆమె కొంచెం నోట్లో వేసుకుంది. మిగిలింది సంచిలో వేసుకుంది.
ఉర్సు మొత్తమ్మీద నాలుగు షాపులున్నాయంతే. పిలగాడు ఓ షాపు దగ్గరకొచ్చాక అమ్మను దింపమన్నట్టు అడిగాడు.
దిగి, షాపు ముందు నిలబడి, ఒక చిన్న కారు బొమ్మ చూయించాడు.
‘కావాల్నా?’ అనడిగింది అమ్మ.
అవునన్నట్టు తలూపాడు.
‘ఎంత?’ షాపతణ్ని అడిగింది అమ్మ, పర్సు చేతిలోకి తీసుకొని.
‘నల్భై..’ అన్నాడు షాపతను.
‘నల్భై ఆ? ఇర్వైకియి..’
‘రాదమ్మా!’
‘ఇర్వై..’
‘ముప్ఫై ఇయి..’
‘ఇర్వై ఉన్నయంతే!’ అంటూ పిలగాణ్ని ఎత్తుకుంది అమ్మ. పర్సు మళ్లీ జాకెట్లోకి దోపింది.
‘తీస్కొ ఇగ..’ అన్నాడు షాపతను.
షాపతనికి ఇరవై ఇచ్చి కారు బొమ్మ పిలగాని చేతిలో పెట్టింది అమ్మ.
పిలగాని కళ్లు మెరిశాయి. చిన్నగా నవ్వాడు.
అమ్మ పర్సు చూసుకుంది. రెండు రూపాయల బిళ్ల ఉంది. ఇంటికి ఆటో ఐదు రూపాయలు.
పర్సు మళ్లీ జాకెట్లోకి దోపి, పిలగాణ్ని ఎత్తుకొనే, వాడివైపు చూసి నవ్వింది. వాడూ నవ్వుతూనే ఉన్నాడు.
ఉర్సు దాటి బయటకు రాగానే, చెట్ల నీడ మొత్తం పోయింది. ఎర్రటి ఎండ. పిలగాణ్ని ఎత్తుకొనే ఉంది అమ్మ. పిలగాడు ఆ కారు బొమ్మనే చూస్తూ అమ్మ చంకలో కూర్చున్నాడు. వాణ్ని గట్టిగా దగ్గరకు లాక్కొని ముద్దుపెట్టింది అమ్మ, ఇంటివైపు నడుస్తూ.
*
కథ వెంటబడటమే పెద్ద హోమ్‌వర్క్
నల్గొండకు చెందిన మల్లిఖార్జున్ ఇప్పటి వరకు పదకొండు కథలు రాశారు. ప్రతి కథలోనూ కొత్తదనం. కొత్త కథను చెప్పాలన్న ఆరాటం… కొత్తగా చెప్పాలన్న తపన కనిపిస్తాయి. నేటి తరం కథను ఎలా చూస్తోంది, కథ గురించీ, దాని భవిష్యత్ గురించి తన మాటల్లోనే-
*కథల వైపు ఆసక్తి ఎలా మళ్లింది?
ఇలా అని చెప్పడం కష్టం. మా అమ్మ చదువుకోలేదు. కానీ కథలు బాగా చెప్తుంది. చాలా ఈజీగా చెప్తుంది. ఎక్కడ ఏ పాజ్ ఇచ్చి ఎలా చెప్పాలో అమ్మకు బాగా తెలుసు. నాకలా కథలంటే ఇష్టం పుట్టింది. ఎవ్వరు ఏ కథ చెప్పినా వినేవాడ్ని. ఎక్కడ ఏ కథ కనిపించినా, (అది కథ కాకపోయినా, ఏదైనా రాసున్న ఏ చిన్న పేపర్ ముక్కైనా) చదివేవాడ్ని. నాకప్పుడు చుట్టూ లెక్కలేనన్ని కథలు కనిపించేవి. అవి రాయాలనుకుంటా. అవన్నీ ఎప్పుడో ఎవరో చెప్పే ఉంటారుగా అన్నప్పుడు రాయొద్దనుకుంటా. మళ్లీ నాలాగే వాళ్లెందుకు చూసుంటారు? అన్నప్పుడు రాయాలనుకుంటా. ఈ మధ్యలో ఎప్పుడో, ఏ కథ దగ్గరో ఆగిపోతా. రాస్తా. అంతే. అలా ఇప్పటికి పదకొండు కథలు రాశా.
*ఏ కథలు, రచయితలు ఇన్‌స్పైర్ చేశారు?
చలం, తిలక్, మొపాసా కథలు ఇష్టంగా చదువుతూంటా ఇప్పటికీ. రచయితలు వాళ్లకు కనిపించే కథలెక్కువ రాస్తారనుకుంటాన్నేను. అప్పుడు అందులో ’నేనూ చూశానివి’ అనిపించే అందరి కథలూ ఇష్టంగానే కనిపిస్తాయి. అందుకే కొన్నిసార్లు కథల కన్నా రచయితల వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తా. పూడూరి రాజిరెడ్డి వాక్యం నాకు బాగా ఇష్టం. ఎప్పుడైనా నా కథల్లోకి జొరబడతానంటాడు. నేను నవ్వి పంపించేస్తా. ( 😀 )
*మీ ప్రతీ కథా విభిన్నంగా ఉంటుంది. శిల్పం, వాక్యం పట్ల అధిక శ్రద్ధ కనిపిస్తుంది?
కొత్తగా చెప్పాలనుకొని పనిగొట్టుకొని నేనే కథా రాయలేదు. నా వెంటబడే కథలే బయటకొచ్చాయి. అన్ని వాదాలకూ పుట్టుక హ్యూమన్ ఎమోషన్స్ అని నేను నమ్ముతా. నాకు ఒక చిన్న కథ, దానిచుట్టూ నేను చెప్పాల్సిన అవసరం ఉన్న ఒక ఎమోషన్ దొరికితే, దాన్ని ఇంటిగ్రేట్ చేస్తూ పోతా. ఒక కథ పుట్టేస్తుంది. శిల్పం అంటారా.. ఆ కథలో ఏవేవి ఎప్పుడెప్పుడు ఎలా చెప్పాలన్నది ఆ కథ రాస్తున్నప్పుడు అనిపించడమే. అలా వెళ్లిపోతా. వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తా అని చెప్పినట్టు, నాకు ఒక్క వాక్యం ఎక్కువైనా చదవడానికి చికాకు అనిపిస్తుంది. అలా రాసేప్పుడే, నాకు నేనే కత్తెరలు వేస్తూ పోతా. ఫస్ట్ డ్రాఫ్ట్ రాశాకే చిరాకు తెప్పించే ఒక్క వాక్యం నా కథల్లో నాకు కనిపించదు. అది పబ్లిష్‌కు వెళ్లే వరకూ ఒక ఇరవై సార్లైనా చదువుతా. పెద్దగా ఏం మార్చాలనిపించదు కూడా!
*కథను చదివేవాళ్లు తగ్గిపోతున్నారు. ఫలితంగా కథలు రాసే కొత్త రచయితలు తగ్గిపోతున్నారు..? ఏకీభవిస్తారా?
ఇన్ని ఎక్కడ ఆలోచిస్తాం!? ( 😀 ). కథ అయిపోగానే, కరెక్షన్స్ అవీ చేసి చదువుకోగానే, ఐ విల్ రీచ్ ఆర్గాజ్మ్. అంతవరకే ఆలోచిస్తా. అయినా బాగానే చదువుతున్నారుగా? ట్విట్టర్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో రోజూ ఎవరో ఒకరు మెసేజ్ చేస్తూంటారు, నాకస్సలు పరిచయం లేనివాళ్లు. “మీ కథ చదివా” అని. అందులో కొన్ని “నేను కూడా రాస్తున్నా.. రాయాలనుకుంటున్నా” లాంటి మెసేజెస్ ఉంటాయి. అయితే చదువుతున్నారు. రాస్తున్నారు.
*కథ రాయడానికి ఎలాంటి హోమ్‌వర్క్ చేస్తారు?
ఆ కథ వెంటబడటమే నాకైతే పెద్ద హోమ్‌వర్క్. కొన్ని ఒకే రోజులో పుట్టి, అదే రోజులో కరెక్షన్స్‌తో సహా పూర్తి చేసిన కథలున్నాయి. కొన్ని చాలా రోజులు అలా మైండ్‌లో తిరుగుతూనే ఉంటాయి. అప్పుడు నేనే ఒక్కో వాక్యాన్ని మైండ్‌లో సేవ్ చేసుకుంటూ పోతా. ప్రతీలైన్ పేపర్ మీదకి వెళ్లేముందు నాకు పరిచయం. రెండు, మూడుసార్లు నాకు నేను చెప్పుకొని ఉంటా (అది ఒక్కరోజులోనే రాసిన కథైనా). ముందు చేత్తో రాస్తా. తర్వాత టైప్ చేసుకుంటా. ప్రింట్ తీసి చదువుకుంటా. కరెక్షన్స్ చేసుకుంటా. అయిపోతుంది.
చాలా చక్కటి కథ. చిక్కటి ఫిల్టర్ కాఫీ తాగినట్లు, అనిపిస్తోనే చివరికొచ్చేసరికి కాఫీ లోని గసి, మీగడ తరకలు అడ్డుపడ్డట్టు అనిపించింది. ఒక చిన్న సంఘటనని ఎంతో పెద్దగా, ఇంకెంతో హాయిగా, బరువుగా మలిచిన తీరులో ఒడుపు, నేర్పు, చాకచక్యం కనిపిస్తున్నాయి. ఈ యువ రచయిత కలం నుంచి మరెన్నో కథలు జాలువారాలని, పాఠకుల దోసిలి నింపాలని కాంక్షిస్తూ…
డీ వీ ఆర్ భాస్కర్
Sir !! Thank you so much. All your love. 🙂
Interesting story and inspiring interview
🙂 Thank youu..
కథ చాలా బాగుంది అన్న… మొదట్లో ఆ పి ల గా డి అమ్మ చనిపోయిందేమోనని భయపడ్డ! కానీ ముగింపు అమ్మ ప్రేమను కళ్ళకు కడుతూ చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ నా మనసులో కథ ప్రారంభం అయింది…భావోద్వేగాలను చిన్న వాక్యాలతో స్పష్టంగా అవిశ్కరించారు????????nice interview…మీరు ఎన్నో కథలు రాయాలని కోరుకుంటూ all d best anna????????????god bless you!!
Sweet. Thank you.. 🙂
చాలా బాగుంది… ????
నన్ను ఇంతసేపు వదిలిపెట్టి ఉంటావా? అని కొట్టటం చిన్నప్పుడు మనమందరం చేశాం.. ఇంటికి వెళ్ళడానికి సరిపడ డబ్బు లేకపోయినా, పిల్లాడికి బొమ్మ కొనిచ్చి అమ్మ వాడిని ఎత్తుకుని ఎర్రటి ఎండలో వెళ్ళటం, అత్త చిరాకు పడకుండా ఓపిగ్గా వాడికి సమాధానం చెప్పటం.. అన్నీ చాలా బాగున్నాయి… ఇంత చిన్న కథలోనే బాల్యానికి తీసుకెళ్లారు మల్లిగారు.
???????? Thank you so much. Love. 🙂
కథ చాలా బాగుంది మల్లి. ఈ కథ లో పిల్లగాడు మన నాని గాడే కదా. ఇలాంటి కథలు ఇంకెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు నీ మురళి యాదవ్.
Thank you Murali. Love. 🙂
I like the way you narrate each story. Simple ga ardham ayyey la cheptaru. Easy ga connect avtam. Keep doing your good writing ???? All the best Mallik 🙂
Thank you so much Ramani.. Love. 🙂
నాకు నేనే కత్తెరలు వేస్తూ పోతా—చాలా మంచి ప్రక్రియ. నేర్చుకోవాలి నేను కూడా.
ఇక కథ విషయానికి వస్తే, మీ కథలన్నీ ఒకే మూసలో పోసినట్టు ఉండవు. వైరుధ్యం చాలా ఉంటుంది. బాగుంది.
Ayyo! Chinnavaadini. 🙂 Thank you.
Thank you for this fresh story Mallikarjun ???? loved reading it…
Thank youuu.. 🙂
కథ చాలా చిక్కగా, చక్కగా వుంది.
అమ్మ మీది ప్రేమను, అమ్మ ప్రేమను చక్కగా చూపెట్టారు.
ఒక చిన్న అనుమానం.. పిల్లాడి మూత్రంలో రెండు రక్తం చుక్కలు పడటం, కథకు అవసరమా అని!
Thank you so much sir !!
వాడికి అమ్మ అవసరం ఇంకా ఎక్కువ ఉందిప్పుడు అని చెప్పడానికేమో! 🙂
నేను కవిత్వం ఎక్కవ రాస్తాను కాబట్టి ఎక్కువ కథలు చదవనని నా ఫ్రెండ్స్ అంటారు..ఎందుకో కథకులు చాలామంది వున్నా..ఫలానా అని లేకుండా అందరివి అరుదుగా చదువుతా..కథలు చీలికలు,పీలికలు చేసి ఎక్కడ నుంచి ఎక్కడో తేలి ఎక్కడో ముగిసే కథల్ని కథ ఎత్తుకొనే ముందు పదబంధంతోనే నా మనసు ఆ కథను చదవాలో చదవద్దో నిర్ణయించేస్తుంది…..అప్పుడు మాత్రమే ఆ కథ ను ఆసాంతం చదివేస్తా..మల్లికార్జున్ ఉర్సు కథ మెత్తగా,చల్లగా, హాయిగా సాగిపోయే పిల్లకాలువలా…నెమ్మది,నెమ్మదిగా… చిన్న చిన్న వాఖ్యాలతో ముద్దుగా,కమ్మగా సాగి తల్లీ కొడుకుల అనుబంధాల…లోగిలిని ఆవిష్కరించటం…భలే ముచ్చటగా కథను ముగించటం….కథలోని పాత్రలను కళ్ళముందు అతి సహజంగా విప్పిచెప్పటం…భలే నచ్చేసింది…అభినందనలు మల్లికార్జున్..మీ నుండి ఇంకెన్నో మంచికథలు రావాలని కోరుతూ…భండారు విజయ, ప్రరవే
That’s sweet. Thank you so much.. 🙂 Love.
Feeling great Malli .i feel proud as ur
teacher
Sir !! Love you.. 🙂
పిలగాడి పండగ గురించి బాగా చెప్పావు, మల్లి!
🙂 Thank you so much sir.. Means a lot.
పసితనం అలాగే వాక్యాల్లోకి ఒంపేశారు. ఎక్కడా అదనపు వర్ణన లేదు.పసితనపు వాస్తవం అలాగే జీవం తో ఉంది.అమ్మ బిడ్డ,బిడ్డ అమ్మ,కాలుతున్న కాళ్ళు,నవ్వుతూన్న పెదాలు,ఏదో అంతర్లీన ప్రేమ ప్రవాహం బస్!ఇంతకంటే ఏమి కావాలి కథ కావడానికి ఒక జీవిత శకలానికి!
చాలా బాగా రాసారు మల్లికార్జున్. అవ్వడానికి ఒక సాధారణమైన విషయం కని చిన్నతనం లొ ప్రతి ఒక్కరు ఎదురుకునే అనుభవం. నాకు నా చిన్నతనం కళ్ళ ముందు మెదిలింది. నేను అమ్మ కోసం అలా ఎదురుచుసిన సంధర్భాలు అనేకం. బిడ్డ తల్లడిల్లడాన్ని సున్నితనమైన మాటల్లో బాగా చూపించారు.