ఉప్పొంగవే!

ఇంతక ముందే

స్వర్ణముఖి వంతెనపై వచ్చాను

చాన్నాళ్ల క్రితం భర్తను పొగుట్టుకుని

కొడుకులు కూడా ఆదరించని ఒంటరి అమ్మలా ఉంది

 

పద్యంలో ఎంత పదాల్ని చేర్చుదామన్న

గరుకు గరుకు గా ఇసుకే చేరుతోంది

దేహం నిండా గొట్టపు బావుల్ని తగిలించుకుని

వెంటిలేటర్ పై ఉన్న రోగిలా ఉంది

నీటి కుచ్చిళ్ళు తో, బుడగల అడుగులతో

మా అక్కలా చెంగు చెంగు న తుళ్ళిపడ్డ స్వర్ణముఖి

నీటి చుక్కల బోణి లేక

దివాళా తీసిన చిరువ్యాపారి లా ఉంది

 

అప్పుడెప్పుడో పెద్దేరు పొంగిందంటే

చేపపిల్లల్ల ఎగిరెగిరి పడే వాళ్ళం

శ్రీకాళహస్తీశ్వరడు నీలోకి చూసి

జటాఝటం సవరించుకునే వాడు

 

ఇప్పుడేమయందే స్వర్ణముఖి

ఈ ఎడారి గుండె ఎలా వచ్చింది

గూడలి సంగమేశ్వరుడు

నీ నీళ్లే తాగేవాడు

నీ ఇసుక లో బంగారం దొరికేదట

ఇప్పుడు కన్నీళ్ళుకూడా కరువు

 

ఈ నీళ్లే ధూర్జటి శతకం లో

పద్యపాదాలై వాతలు పెడుతాయ్

మామిడి కాలువ నుండి

నువ్వు పరవళ్లు తొక్కుతూ

టీనేజ్ పిల్ల లా

నువ్వు చేసిన నాట్యం చూడాలని ఉంది

సిద్దవరం దగ్గర

నువ్వు సముద్రం లో

కలుస్తూ చెప్పే ,జానపద గాధ వినాలని ఉంది.

పొంగవే స్వర్ణముఖి

ఉప్పోంగవే స్వర్ణముఖి….

(నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ప్రవహించే స్వర్ణముఖి నదిని చూశాక)

 

 

 

 

 

 

సుంకర గోపాలయ్య

పిఠాపురం రాజా డిగ్రీ కళాశాల లో తెలుగు అధ్యాపకులు. సొంత ఊరు నెల్లూరు.
సంపాదకుడిగా పిల్లల కవిత్వం రెండు పుస్తకాలు తెచ్చారు.రంజని కుందుర్తి,తానా, ఎక్సరే ,పాటూరి మాణిక్యమ్మ మొదలైన పురస్కారాలు అందుకున్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాకులలో ఒకరు.

26 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాగుంది అని చెప్పడం చాలా చిన్న మాట అవుతుంది.. కానీ దానికి మించిన పదం మరొకటి దొరకడం లేదు…చాలా చాలా బాగుంది సర్..

  • చాలా చాలా అద్భుతమైన నిజాన్ని కళ్ళకు కట్టినట్టు రాసి నెల్లూరు ప్రజల మనసులోని బాధను, స్వర్ణముఖి నది ఒకప్పటి గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించారు…. చాలా చాలా అద్భుతం మీ కవిత్వం…….
    మీ
    కృష్ణకాంత్

  • ఒకప్పటి స్వర్ణముఖి గొప్పస్థితిని నేటి దుస్థితిని చాలా చక్కగా చెప్పారు సార్…..

  • స్వర్ణముఖి పై రాసిన ఈ కవిత అత్యద్భుతంగా ఉంది గోపాల్.. లక్షల మంది దాహార్తని తీర్చే ఈ గొప్ప నది ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ ప్రకృతే మనపై పగ పట్టిందా అన్నట్లుంది।। తన పూర్వ వైభవం చూడాలన్న నీ..మన కోరిక తీరాలని కోరుకుంటున్నా।।

  • స్వర్ణముఖి పొంగిందో లేదోగానీ.. మీ కవిత మాత్రం కాళహస్తీశ్వరుణ్ణి అభిషేకించింది గోపాల్ గారు.. అభినందనలు.

  • మీ కవితా, కల్పనా చాతుర్యంతో స్వర్ణముఖీ నది ఆవేదనను వ్యక్తం చేసిన తీరు చాలా బాగుంది సార్

  • Good.. a lot of deep meaning ..!!! As i understood it’s not the poet questioning river..!! It’s a question and slap to Current public..who made that natural river to such a situation..!!!

    Great work Gopal..!!!

  • సార్, ఏమి చెప్పిన తక్కువే, కానీ మీరు కవితపెట్టారు అంటే అది ఎలావుంటుంది, దేని పై ఉంటుంది అనే ఆత్రుత నాలో ఏక్కువుగా ఉంటుంది, కారణం అన్ని నాకు తెలిసిన చూసిన వస్తువే మీ కవిత, అందుకే చదువుతుంటే నేను రాసి నాకు నేను చదువుకున్నట్టు వుంది. నాకే కాదు మీ కవిత చదివిన అందరికి ఇలానే ఉంటుంది.. ధన్యవాదములు

  • కలం కదిలిస్తే చాలు పొంగే నదిలా మారుతారు
    ఎండిన హృదయాల పై పచ్చటి కవిత్వమై ప్రవహిస్తారు

  • స్వర్ణముఖి నది
    దుఃఖాన్ని వినిపించారు.

  • నీ అనుభవాలు జ్ఞాపకాలు అందరిలోనూ చిగురింపచేసావు.ఇది ఒక స్వర్ణముఖి కథే కాదు అన్ని నదుల కథ

  • స్వర్ణ ముఖి దుస్థితికి మాలో దుఃఖం ఉప్పొంగుతోంది .
    మీ కవితావేదనకు కరిగి స్వర్ణముఖి ఉప్పొంగాలని ఆశిస్తూ ….

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు