‘అద్వంద్వం’ తొలి కవిత్వసంపుటితో ఇటు కవిగా తానేంటో నిరూపించుకున్న శ్రీరామ్ పుప్పాల అటు విమర్శలోనూ తనదైన సొంతముద్రతో కొనసాగుతున్నాడు. జి,ఎన్ సాయిబాబా తల్లి సూర్యవతి గారి మరణానికి కదిలిపోయి రాసిన కవిత “తల్లి మరణం”. తనపని తాను చేసుకోలేని, నిస్సహాయుడైన, చక్రాల కుర్చీకే పరిమితమైన వ్యక్తిని కుట్రకేసులో భాగస్తుడిని చేసి, అరెస్ట్ చేసి, విచారణ లేకుండానే అండా సెల్ లో వుంచి, కరోనా సాకుతో మరింత నిర్భంధానికి గురిచేస్తూ మానవత్వం లేని ప్రభుత్వం తన ఫాసిస్టు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ క్రూరంగా వ్యవహరిస్తుంది. చివరికి తన తల్లి ఆఖరిచూపుకు కూడా నోచుకోనివ్వని పరిస్థితి. అధికార ప్రభుత్వాలు చేసే అనధికార చర్యలను ప్రజాస్వామ్యయుతంగా అడ్డుకుంటున్న మేధావుల్ని, రచయితల్ని అడ్డుతొలగించుకునే వికృతపంథాను ఎంచుకోవడం అంతమంచిదికాదని, దేశ భవిష్యత్తుకి తీవ్రనష్టాన్ని కలిగిస్తుందని హెచ్చరిస్తున్న సందర్భమిది.
*
తల్లి మరణం
~
ఆ జైలు గోడల మధ్య కూడా
ఒక కుంభవృష్టి వానకు ముందు బిగదీసిన గాలి
అతణ్ణి మూగవాణ్ణి చేసి ఉంటుంది
కదల్లేని కాళ్ళకి ఆమె రాసిన ఏ చేదు పసరు మందో
వైకల్యం వెన్నులోంచి జ్ఞాపకమయి సన్నగా మూలిగే ఉంటుంది
తుఫాను బీభత్సం లోంచి తప్పించుకుని
ఇనుప చువ్వల చీకటి కిటికీలోకి
అతను ప్రేమించే పావురాయి తడిచిన రెక్కలతో
అమ్మెళ్ళిపోయిన కబురు తెచ్చి ఉంటుంది
ఎదురు చూపులు
ప్రాణదీపాల్నెంతసేపు కొండెక్కనీకుండా ఆపుతాయి !
పడ్డ కుక్కి మంచంలోంచి
తానెన్ని లోకాల సరిహద్దులతో పేచీ పడి ఉంటుంది
చెరబడ్డ కలల్నెలా విడిపించుకోవాలో చనుబాలు పట్టిన తల్లి
బతుకు నిప్పుల దారిమీద చక్రాల బండికి నడక నేర్పిన తల్లి
నిశ్శబ్దంగా తలవంచుకు వెళ్ళిపోయింది కదా !
బిడ్డల కోసం
ఆమె కన్నీటితో కడసారి పాడిన లాలిపాట
ప్రేమార హత్తుకోలేకుండా నిప్పంటుకున్న వొంటిమీంచి గజ్జలమోతై మోగి
అండాసెల్లో అతణ్ణారాత్రి చిత్రవధ చేసి, చిటపటమని కాల్చి ఉంటుంది
తల్లెవరికైనా తల్లేకదా; వాడెవడో అమ్మ పాలు తాగనివాడు
ఇద్దరు కొడుకుల్లో తలకొరివి పెట్టేందుకొక్కడుంటే చాలన్నప్పుడు
చచ్చిపోయిన పాడి ఆవు పాల పొదుగు నాకుతున్న
బెదురు లేగ దూడ దుక్ఖమేదో జైలు గదిని ఉప్పెనై ముంచి ఉంటుంది
తల్లి మరణించినపుడు
పేగు బంధం కదిలి
నదీ గర్భంలో కార్చిచ్చు రేగి ఉంటుంది
ఎప్పుడో దాచిన మందుపాతర పేలి
నేల గుండె బద్దలయ్యుంటుంది
(సూర్యావతి గారి మరణానికి కదిలి)
*
తల్లి మరణవార్తను తన సహచరి ఎలాంటి విపత్కర పరిస్థితులను దాటుకుని వచ్చి చేరవేసి వుంటుందో ‘తుఫాను బీభత్సం’ తెలుపుతుంది. ఇక్కడ తడిచిన రెక్కల పావురాయి తన సహచరి. మరణవార్త తెలిసిన తర్వాతి పరిస్థితిని ‘కుంభవృష్టివాన’ తెలియజేస్తే, కబురు తెల్వడానికి ముందరి స్థితిని ‘బిగదీసిన గాలి మూగవాణ్ణి చేయడం’, ‘చేదు పసరుమందు సన్నగా మూలగడం’ ధ్వనిస్తాయి. ఇదంతా కవి ఇలా జరిగి వుండొచ్చునని అంచనావేసుకున్న పరికల్పనలకి సంబంధించిన విషయం. ఒక సంఘటనకు ముందరి, తర్వాతి వాతావరణస్థితిని అత్యంత సహజంగా కల్పించి చెప్పడం కవి ఊహపై ఆధారపడి వుంటుంది. ఇది ఏ కొంచెం అటూఇటూ అయినా రసాభాసగా మిగిలిపోతుంది. ఉద్వేగానికి సంబంధించిన అంశాల్లో ఔచిత్యమైన ఊహ కవి అంతర్గత భావావేశాల్నితోడి అక్షరాలుగా కుమ్మరిస్తుంది. అది పాఠకునిలో కల్గించే రసస్థాయిని సమర్ధవంతంగా నిర్వహిస్తుంది.
*
ఆ తల్లి అవస్థ ఎసుంటిది? నిప్పులదారుల్లో చక్రాల బండికి నడక నేర్పిన తల్లి, చెరబడ్డ కలల్ని ఎలా విడిపించుకోవాలో పురిట్లోనే శిక్షణ ఇచ్చిన తల్లి, ఎన్ని లోకాల సరిహద్దులతో కొట్లాడి కొట్లాడి జీవిడ్శిందో గని తన కొడుకును ఒక్కసారన్న కండ్లార చూసుకుందామనుకున్న తల్లి తనను తాను ఎదురుచూపుల్లోనే గాల్లో కలిపేసుకుంది. ఇక్కడ ‘నిశ్శబ్దంగా తలవంచుకు వెళ్ళిపోవడం’ లోని ఆంతర్యాన్ని గ్రహించగలగాలి. నిప్పంటుకున్న ఒంటిమీది గజ్జెలమోత, కొడుకును చిత్రవధ చేసి చిటపట కాల్చడం-తల్లి మరణం కొడుకునెంతగా కుంగదీసిందో చెబుతుంది. జైలుగదిని ఉప్పెనై ముంచిన బెదురు లేగదూడ దుక్కం అందుకు సాక్ష్యం అవుతుంది.
*
Hypothesisని నిర్ధిష్టంగా చెబుతూనే ముగింపును సాధారణీకరించి చెప్పడం గమనించదగింది. నదీగర్భంలో కార్చిచ్చు రేగడం, మందుపాతర నేలగుండెల్ని బద్దలుచేయడం లాంటివి నిర్ధిష్టత యొక్క తీవ్రతను అమాంతం పెంచేసిన సాధారణీకరణలోని గాఢత స్థితిని పట్టిస్తుంది. తల్లి మరణవార్త విన్న కొడుకు పరిస్థితిని, ఎలాంటి దుర్భర పరిస్థితుల్నైనా తట్టుకుని నిలబడగల ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన తల్లి నేర్పిన జీవితపాఠాల్ని , ఎంతటి కష్టమెదురొచ్చినా తోడు నిలిచే సహచరి మనోనిబ్బరాన్ని చూఛాయగా పరిచయం చేస్తుందీ కవిత.
*
కవిత్వ నిర్వహణలో చూపిన ఒడుపు మెచ్చుకోదగింది. ‘ఆ జైలుగోడల మధ్య కూడా’ అనే ఎత్తుగడ చాలు. ఇక దాని గ్రాఫ్ ఒక ఆరోహణ వక్రాన్ని ముగించుకుని సంపూర్ణమైన మెరుపులాంటి సారవంతమైన వాక్యాలతో బ్లాస్ట్ అయింది. అది సాధారణీకరించబడిన వాక్యమే కావొచ్చు. ఈ నిర్ధిష్ట సందర్భానికి అదనపు చేర్పును కూర్చిపెట్టింది. జి.ఎన్ సాయిబాబ తల్లి మరణానికి మౌనం పాటిస్తూ, తనకి, తనలాంటి యితరులకి సత్వర న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ, కవికి శనార్తులు.
*
Add comment