ఒక ఉన్మత్త పదప్రయోగంతో
నీ పరాధీనతని స్మృతం చేసుకుంటున్నాను.
నువ్వు నా కలలు కనే సీతాకోకచిలకవి
కానే కావు
విస్తరించే సముద్రాల్లోని అంతర్భాగాల
ఆత్మఘోషవి
నన్నేనా…
ఇంతకాలం మోసగించనిచ్చిందీ…
నా ఛాతీ మీద ఒట్టు
కండరాలలో భయంగా జారుతోన్న
నా అస్తిత్వపు క్రిమి మీద కూడా ఒట్టు
నువ్వు నేను తెలుసుకున్న
ఏ చీకటి ఖండానివీ కావు
దొర్లుతూ పోయే నా ఆకుపచ్చటి అగ్నిగోళాల
ఆలోచనల మీదుగా
విరబూసిన నెత్తుటి రెల్లుపువ్వా
కాస్తయినా నా అధికారాన్ని నువ్వెందుకు సహించావు
యుగాల మీద పరుచుకున్న
నా భద్రత మీద రెక్కలల్లారుస్తోన్న
నా శూన్యనేత్రపు అహంకారమే సాక్షి
ఈ యుద్ధోదయాన నా చెయ్యిని తన్ని
తప్పకుండా వెళ్ళిపో….
ఈ నెత్తుటి పెనం మీద కాంక్షగా దొర్లుతూన్న
నా మగతనాన్ని తన్ని తప్పకుండా వెళ్ళిపో…
దారులు సమాంతర ద్వీపాలే కావచ్చు
శృతి కలవని దగ్థాలాపనతో…
భూపతనమయ్యింది మొదలు
ఈ శరీరం నిశ్శబ్దంగా గాయం చెయ్యనిచ్చిందే
అనుకో…
తప్పకుండా నరికేయ్యి దారుల్ని
నా కన్ను కొలిచే విషపు భాగాల్ని మండిస్తూ
పెనుమంటలా దాటుకుని వెళ్ళు….
లీలా…. వెళ్ళు
ఒక ఉన్మత్త పదప్రయోగంతో
నీ పరాధీనతని స్మృతం చేసుకుంటున్నాను.
నువ్వు నా కలలు కనే సీతాకోకచిలకవి
కానే కావు
** **
1990 తొలినాళ్లలో ‘లీలా..’ శీర్షికతో సిద్ధార్థ రాసిన కవిత ఇది.
మగవాడు ఉన్మత్తంగా ప్రయోగించే పదాలు- ముండ, రండ… వగైరాలతో ‘ఆమె’ పరాధీనతని ‘అతను’ స్మృతం (recollect, record) చేసుకోవడం దగ్గర ఆగితే,
మా శరీరాలు మీ పెరట్లో ముఱ్ఱా జాతి గేదలైనప్పుడే
మా గర్భాలు మీ వంశాలకు ఇంక్యూబేటర్లయినప్పుడే
మా బిడ్డలు మీ మగతనాలకు
అడ్డ్రసులైనప్పుడే
మా నిషిద్ధ శృంగారాలు మీ విల్లులో అమ్ములైనప్పుడే ….
…. అని స్వాతి వడ్లమూడి ఆ పరాధీనతని బాహాటంగా ప్రకటిస్తున్నారు.
తెలుగు సాహిత్యానికి సంబంధించిన ఆధునిక- ఆధునికోత్తర transitionకి అక్షర ప్రతినిధిలా నిలిచిన సిద్ధార్థ అనే కవి ‘కలలుగన్న సీతాకోకచిలక’ వంటి స్త్రీకి, ప్రబంధ కవి రూపుగట్టిన స్త్రీకి సంబంధం లేదు. భావకవి గీసిన రక్తమాంస రహిత ఊహా ప్రేయసి బొమ్మని రద్దు చేసి, చలం గారు నిలిపిన మనఃశ్శరీరాల మానుషి- సిద్ధార్థ ‘కలలు గనే సీతాకోక చిలుక’కి స్ఫూర్తి.
‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతిగా ఈ జగతికి జీవనజ్యోతి’గా మండిన స్త్రీ, మాతృత్వంలోనే ఆడజన్మ సార్థకతని కనుకొని, ‘అమ్మా’ అనిపించుకోవడమే గౌరవ’మనుకోవాలని నియంత్రిచబడ్డ స్త్రీ, జగజ్జనని, జగన్మాత అమూర్త భావనగా పూజలందుకుంటూ, mundane ప్రపంచంలో second sex గా, ముండగా… రండగా ఉన్న సగటు స్త్రీ కాదు సిద్ధార్థ ‘లీల’. మగవాడ్ని విరాట్పురుషుడిగా, జగన్మోహనుడిగా, విశ్వనాథుడిగా చేసి, స్త్రీని మాత్రం అంబగా, అమ్మలగన్నయమ్మగా, జగన్మాతగా నిలపడంలోని కుట్రని బద్దలు చేసి చలం గారు హారతెత్తిన జగత్ప్రేయసి, విశ్వమోహిని – లీల.
అక్కడితో ఆగక, ‘….పురుషుణ్ణి కాల్చి, మెడవంచి కళ్ళు తెరవడానికి, అతని ఆత్మను అతనికి చూపడానికే… స్త్రీ, ఆమె సౌందర్యం సృష్టించబడిందని…’ అన్న (చలం గారి) ఊర్వశి, ‘సర్వభూవలయ ఛత్రాధిపతి మాణిక్య విరాజిత మకుట భూషిత పాదారవిందను, నమస్కరించు…. ఆరాధించు నన్ను…’ అని ఆజ్ఞాపించిన, ‘స్త్రీ ముందు మోకరించడం నేర్చుకోని నువ్వు ఏం తెలుసుకున్నావు! ఏం జీవించావు?…’ అని ఈసడించిన సౌందర్య దేవత, ప్రేమదేవి ఊర్వశిని కూడా దాటి, ‘Feminism ‘ వెలుగులో మరింత విస్తృతమైన, విశాలమైన స్త్రీ- సిద్ధార్థ ‘లీల’.
సిద్ధార్థ ‘లీలా’ కి ముందు సుమారు ఓ అర్ధదశాబ్దం నుంచి, ఇప్పుడు స్వాతి వరకూ ఈ ముప్పై ఐదు ఏళ్ళ కాలంలో ‘మగవాడి’ని ‘మనిషి’గా పరిణామం చెందించే ప్రయత్నాన్ని ఫెమినిజం సాహిత్య రంగంలో కొనసాగిస్తూనే ఉంది. ఇన్ని దశాబ్దాల ఆమె ఆరాటం… పోరాటం- మగవాడ్ని ఏ మేరకు sensitise చేసిందో ఇంకా ప్రశ్నార్థకంగానే మిగలడం మహా విషాదం.
ఆ మధ్య వైజాగ్ జగదాంబ జంక్షన్ దగ్గర్లో అందరూ ఆడవాళ్లతో నడిచే ఓ మెస్ కి భోజనానికి వెళ్ళాను, నా బంధువు ఒకరితో. ఆయన (academically ) బాగా చదువుకున్నవాడే, (ఆదాయపరంగా) మంచి హోదాలో ఉన్నవాడే, ఎక్కడో ఒంటిస్థంభం మేడలో నక్కి కాకుండా సమాజంతో సంపర్కంలో ఉన్నవాడే…. భోజనం చేసినంత సేపూ సణుగుతూనే ఉన్నాడు, “అంతా ఆడముండలున్నారు ఇక్కడికి తెచ్చేవేం… ఏది ముట్టులో ఉందో… ఏది పురిటి మైలలో ఉందో ఏం ఖర్మో…”.
ఆ స్థాయిలో ఉన్నవాడికి ‘Happy To Bleed…’ అని ‘ఆమె’ చేసిన ధర్మాగ్రహం గురించి చెప్పి చేతనవంతం చేయడం సాధ్యమేనా?
(తన) వ్యావహారికంలో భాగమైపోయిన ‘అది… ఇది…ముండ… రండ…’ ఉన్మత్త పదప్రయోగంతో ఆమె పరాధీనతని నిత్యం… నిరంతరం స్మృతం చేసుకునే నా బంధువు బతుకుతున్న కాలానికీ, సృజనరంగంలో కొత్త చేతనల్ని ఆశిస్తున్న ‘ఆమె’కీ మధ్య చెరపలేని బహు దశాబ్దాల దూరం కదా. వైరానికి…. ఘర్షణకీ కూడా పనికిరాని స్థాయీబేధం ఉన్నప్పుడు యుద్ధమేమిటి? Fifth-rate TV show ‘జబర్దస్’ నటుడికి, దేవి గారి వంటి చైతన్యశీలికి మధ్య TV 9 చర్చలా ఉంటుంది.
కళా సాంస్కృతిక తలంలో ఉన్న మగవాళ్లని ‘ఆమె’ పోరాటం ఎంతమేరకు చైతన్యవంతం చేసింది అన్నదే చూడాల్సిఉంది. 21వ శతాబ్దంలో తొలి పాతికభాగం దాదాపుకు ముగింపుకు వచ్చినప్పటికీ, “కవితని విమర్శిస్తే వాడూవీడూ అంటావేందే కొజ్జా. నీ సపోర్టర్స్ ఉంటే వాళ్లతో సంక నాకిచ్చుకో. విర్ర వీగబాక” అని ఒక మగ రచయిత impulsive ఉన్మత్త పదప్రయోగానికి తెగబడి ‘ఆమె ‘ పరాధీనతని మరింత బలంగా స్మృతం చేసుకోవడం కంటే దుఃఖ్ఖ సందర్భమేముంది?
‘ఆమె ‘ పరాధీనతని గుర్తించి, ఆక్రోశించి, ప్రకటించిన స్త్రీలలో స్వాతి గొంతుక తొలి కాదు, తుదీ కాదు. “పొలతి నమ్మగరాదు పురుషులనెపుడు/ పలురీతి కృష్ణ సర్పములై యుండ్రు…” అని హెచ్చరించిన తాళ్ళపాక తిరుమలమ్మ (తిమ్మక్క- అన్నమయ్య అర్ధాంగి) వంటి కవయిత్రులు ప్రాచీన కవిత్వంలో ఎటువంటి యుద్ధం చేశారో నాకు తెలియదు గానీ, ఆధునిక యుగంలో జయప్రభ, ఓల్గా, కొండేపూడి నిర్మల వంటి కవయిత్రులదే తొలి నగారా. 1980 ద్వితీయార్ధంలో వచ్చిన జయప్రభ గారి ‘యుద్ధోన్ముఖంగా’ (1986), ‘వామనుడి మూడో పాదం'(1988), కొండేపూడి నిర్మల గారి ‘సందిగ్ధ సంధ్య'(1988), ‘నడిచే గాయాలు'(1990) కవితా సంకలనాలు, అదే కాలవ్యవధిలో పత్రికల్లో అడపాదడపా వచ్చిన ఓల్గా, విమల, ఘంటసాల నిర్మల వంటి మరికొందరు స్త్రీవాద కవుల కవితలు- ‘అతను’ స్మృతం చేసుకుంటున్న ‘ఆమె’ పరాధీనతని పలు కోణాల్లో ఎత్తిచూపి, ఎదిరించారు, ధిక్కారాన్ని ఎలుగెత్తి చాటారు. ‘మా గర్భాలు మీ వంశాలకు ఇంక్యూబేటర్లయినప్పుడే… మా బిడ్డలు మీ మగతనాలకు అడ్డ్రసులైనప్పుడే…’ అని స్వాతి రాస్తే, అంతకు ముందు పాతికేళ్ల క్రితమే ‘స్త్రీ వాద నిఘంటువు’ పేరిట ‘వంశాంకురం: అయ్య చూపించిన మగాడికే ప్రామిస్ చేసి, కన్న పిల్లాడు’, ‘పతివ్రత: డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మొగుడి జబ్బులన్నీ తన శరీరంలో … చచ్చేదాకా మోసే పవిత్ర మతగ్రంథం’… అంటూ అనేక అణిచివేత పదాలకి నిర్వచనాలు ఇచ్చారు జయప్రభ.
అప్పటి స్త్రీ ధిక్కార స్వరాలన్నింటినీ ఒక సంకలనంలో చేర్చి త్రిపురనేని శ్రీనివాస్ తన కవిత్వం ప్రచురణల కింద ‘గురిచూసి పాడే పాట’ (1990)గా తేవడం తెలుగు స్త్రీవాద సాహిత్యోద్యమంలో ఓ కీలకఘట్టం. ఈ స్త్రీవాద సాహిత్యం తెలుగు సాహిత్యకారుల్ని ఏ మేరకు చైతన్య పరచిందో తెలుసుకోవడానికి ఆ కవిత్వం మీద తొలినాళ్లలో జరిగిన దాడిని గమనించాల్సి ఉంది.
దిగంబర కవుల్లో ఒకరైన జ్వాలాముఖి గారు ఆ కవితల్ని ‘వార కవితలు’ అన్నారు, నీలిచిత్రాలతో సరిపోలుస్తూ ‘నీలికవితలు’ అన్నారు. ఎంతో చింతనాశీలి అయిన రంగనాయకమ్మ గారు కూడా ‘ఫెమినిస్టులందరూ వ్యభిచారులే’ అన్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించవల్సింది, గర్హించవల్సింది ఏమిటంటే- స్త్రీకి సంబంధించి జరిగే దాడి ప్రధానంగా లైంగికతకి సంబంధించి. వాడపాప… కులట… రండ… రంకులాడి… నుంచి ఇప్పుడు స్వాతీ వడ్లమూడి ఆక్రోశానికి కారణమైన ఉన్మత్త పదప్రయోగాలన్నీ స్త్రీ లైంగికతే ప్రమాణంగా స్త్రీ గుణగణాలను ఎంచేవే.
లోభత్వం, అసూయ, స్వార్థం, క్రౌర్యం, కౌటిల్యం, అసత్యం…. వంటివి పుణ్యనామాలతో వర్ధిల్లుతుందటం, ఎన్ని సుగుణాలున్నప్పటికీ స్త్రీ గుణగణాలు తన లైంగికత మీదే ఆధారపడి ఉండటాన్ని సుమారు నూరేళ్ళ క్రితమే చలం గారు పదే పదే ఈసడించినా తెలుగు సాహిత్యకారులు ఒంటబట్టించుకోలేకపోయారు. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో ముందుండి, కమ్యూనిస్టు పార్టీకి జీవితాన్ని అంకితం చేసి, వైద్యసేవలు కూడా అందించిన అచ్చమాంబ అనే యోధురాలి (లైంగిక) నడవడిక మంచిది కాదని ఆమెని పార్టీ వెలివేసిందని తెలుగు స్త్రీవాద సాహిత్యం తొలినాళ్లలో ప్రచురితమైన ‘మనకు తెలియని మన చరిత్ర’ గ్రంథం – చెబుతుంది. భావజాలాలకి అతీతంగా స్త్రీ లైంగికత పట్ల (మగ) ప్రపంచానిది ఎంత నైతికదృష్టో ఎప్పటికప్పుడు బైటబడుతూనే ఉంది. ఎవరిని కించపర్చాలన్నా, తక్కువచేయాలన్నా, నోర్మూయించాలన్నా వారిని వేశ్యలతో పోల్చడం, ‘presstitute’ వంటి coinage చేయడం కొనసాగటం ఎంత హేయం, ఎంత భావదారిద్ర్యం!
స్నేహంగా అరవిరిసి, ప్రేమగా వికసించి, ప్రపంచాన్ని పరిమళభరితం చేయవల్సిన స్త్రీ- పురుష నిసర్గ రమణీయ సాంగత్యంలోకి డబ్బు, ఇతర ప్రలోభాలు వచ్చి చేరడం కదా విషాదం! అటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడ్డ స్త్రీ బాధితురాలు కదా, నిందని, నైచ్యాన్నీ ఆమెకెలా అంటగడతాం? అంతే కాదు, సహజ సుందరమైన కలయికలో ఆమెని అతను ఆక్రమించడం… అనుభవించడం… గెల్చుకోవడం (మరీ చవకబారుగా ఎక్కడం… తొక్కడం…) వంటి male chauvinistic పదాలే చెలామణిలో ఉండటం ఘోరం. ‘సతి నిన్ను గెలిచెను జవ్వనపు గరిడిలో…’ అని 600 ఏళ్ళ క్రితమే అన్నమయ్య అది గెలుపోటముల ప్రసక్తి లేని వివశ విమోహపు జగడమని అంటే, ‘ఆమె’ ఆత్మాభిమానం అణచడానికి, పొగరు దించడానికి, కాలి కింద తొక్కడానికి సంభోగాన్ని ఒక దొమ్మిగా, దౌర్జన్యంగా గుర్తించడం ఆధునికయుగ జాడ్యం. అలాంటప్పుడే ‘ఆమె’ ఉన్మత్త పదప్రయోగానికి లోనవడమే కాదు, ‘ఆమె’ మర్మావయవం కూడా ఉన్మత్త పదప్రయోగం పాలిటే పడుతుంది. వాటిని స్వాతి యథాతథంగా వాడటం వెనక ఇన్నాళ్లుగా కొంచెమైనా చావని chauvinism ని బట్టబయిలు చేసిన చైతన్యమే కాదు, ఆక్రోశం, ఆవేదన కూడా ఉన్నాయి.
‘Vagina is a wound that never heals up’ అని Norman Mailer అన్నది chauvinism తో కాదు, ఆమెతో సంఘీభావంతో. కాబట్టి vigina ఉన్మత్త పదం కాదు. అలానే, ‘నిశాకేశాల మధ్య స్త్రీ జననాంగంలా వెలుగుతున్న దీపం’ అన్న కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ గారి పదప్రయోగం గురించి,
“…. అదేరా ఆ దారేరా మనవందరం
వందనాలు చేస్తో నడిచి వచ్చిన దారేరా
అంతం అనుకొంటాం అహోబిలమనుకొంటాం
కానీ అదో స్వయం నియంత్రిక
మాంత్రిక ద్వారం…..” అన్న ‘మో'(వేగుంట
మోహన్ ప్రసాద్ గారు) అభివ్యక్తీకరణ గురించీ ఏ స్త్రీ ఆక్రోశపడలేదు. అంతే కాదు, ‘నా జననాంగాన్ని ఒక మృదుపుష్పం’ (Mi vulva es una flor…) అన్న మెక్సికన్ కవయిత్రి Rosa Maria
Roffiel(1945లో)
రాసిన Gioconda కవితని ‘ఆరని
చిరునవ్వు’ పేరిట తెలుగు సాహిత్యప్రపంచంలోకి తీసుకువచ్చారు జయప్రభ
గారు.
నా జననాంగం ఒక మృదుపుష్పం
అది ఒక ఆల్చిప్ప
ఒక అత్తిపండు
అతి మెత్తని మఖ్మల్ వస్త్రం
అనేక సుఖాల … సువాసనల… రుచులతో
సమృద్ధి భరితం
అది మృదువైనదీ! నాకు సన్నిహితమైనదీ!!
నాకు పన్నెండేళ్లప్పుడు
దానిపై మొలకలొచ్చాయి
అప్పుడే కొత్తగా దూది మబ్బులు
నా తొడల మధ్య ప్రవేశించాయి
అది స్పందిస్తుంది… స్రవిస్తుంది…
కోపిస్తుంది కూడా!
ద్రవాల ప్రకంపనలతో నాతో మాట్లాడుతుంది
అది నాలోని మరో స్వరం!
నీటిగొట్టంలా నన్ను నిలువెల్లా తడిపేసే
దాన్నిండా చిలిపితనమే! నిర్లక్ష్యమే!!
చుంబించే నాలికలంటే దానికెంత ఇష్టమనీ!!
వాటిని చూసి…
ఎగిరే సీతాకోక చిలకలనుకుంటుంది!
గట్టిపడిన పురుషాంగాలన్నా దానికెంతో ఇష్టం!
అది…
చిక్కటి కోర్కెల ద్రాక్షగుజ్జు!
ప్రియమైన లలిత చుంబన స్పర్శ!!
అది…
నా నల్ల చిరుత
కొమ్ముల దుప్పి
కుందేటి పిల్ల!
అదే జయప్రభ గారు అన్నమయ్య ప్రేయసిగా మారిపోయాక ‘మరుని నగరిదండ మాయిల్లెరగవా…’ అన్న అన్నమయ్య కీర్తన- స్త్రీ దేహ సంబంధిగా interpret చేసి, కొత్త revelations కలిగించారు, ‘విరుల తావులు వెల్లవిరిసేటి చోటు..’, ‘మరగు మూక చింతల మాయిల్లెరగవా/ గురుతైన బంగారుకొండల సంది’, ‘మరపు దెలివి యిక్క మాయిల్లెరగావా/ వెరవక మదనుడు వేటాడేచోటు…”, “మదనుని వేదసంత మాయిల్లెరగవా/ చెదరియు జెదరని చిమ్మ జీకటి..”, ‘మరులుమ్మెతల తోట…’, ‘మరుముద్రల వాకిలి…’ వంటి ఎన్నో metaphors, పదబంధాలను రుజువులుగా చూపిస్తూ!
కానీ దురదృష్టమేమిటంటే, ఇంత తెలివిడి, ఎరుక ఉండి, సరికొత్త చైతన్యానికి ప్రతినిధి అయ్యి ఉండి కూడా, జయప్రభ గారు తన మీద వచ్చిన దాడిని ఎదుర్కోవడానికి ప్రత్యర్థి పనిముట్లే వాడటం!
జ్వాలాముఖి మీద ప్రతిదాడి చేస్తూ రాసిన ‘సోమిదేవమ్మలు సాహిత్యంలో మరి కన్పించరని…’ కవితలో “ఏమే కవయిత్రీ ఏవో రెండు పాతగుడ్డలుంటే పారెయ్యే /చుట్టుకుని స్పృహలోకన్నా వస్తాడు !” అంటారు జయప్రభ. అక్కడ పాతగుడ్డ అంటే ‘ముట్టుగుడ్డ’ అని ఆమె ఉద్దేశం. బాపు గారు గయ్యాళితనానికి అప్పడాలకర్ర ప్రతీకగా వాడినట్టు, స్త్రీ బహిష్టు సంబంధిత అంశాలు… సాడు… రేతస్సు… ముట్టుగుడ్డ… హేళనకి సంబంధించినవి. స్త్రీవాద స్ఫూర్తిని అందిపుచ్చుకున్న రెండవ తరం కవుల్లో ఒకానొక ప్రస్ఫుటమైన స్వరమైన కె. గీత – ‘నేను రుతువునైన వేళ’ – కవితని అద్దేపల్లి వంటి వారు అవహేళన చేశారు. ముట్టుగుడ్డలు ముఖాన కొట్టడం ఎగతాళి అనుకోవడం, కించపరచడమని అనుకోవడం మగ (దురహంకార) దృష్టి. ముండ… అని తిడితే, ముండాకొడకా… అని తిరిగి తిట్టడం; అది స్త్రీవాద సాహిత్యోద్యమ సారథి చేయదగిన ప్రతిదాడి కాదు.
ఇక స్త్రీవాద సాహిత్యం మీద అప్పట్లో దాడి చేసిన male chauvinistic రచయితల్లో రావిశాస్త్రి గారి పేరు కూడా ప్రస్తావిస్తుంటారు. ‘ఫెమినిస్టులు గయ్యాళులు ‘ అన్నారని, ‘అవును మేము గయ్యాళులమే’ అనే కవిత రాశారు ఓల్గా, ‘… మధురవాణి మధుర వాక్యాలు మీ/ దళసరి చర్మాలకు ఎక్కకపోతే…’ అని రావిశాస్త్రిని దుయ్యబడుతూ. ఏ పోరాటానికైనా పలు సుగుణాలతో పాటు, కొంత వేలంవెర్రి, మరికొంత పటాటోపం అనివార్యంగా ఉంటాయి. కానీ, తెలుగు ఆధునిక (ప్రగతిశీల) సాహిత్యోద్యమాల్లో (వాటి కొనసాగింపుగా ఆధునికోత్తర అస్తిత్వ ఉద్యమాల్లో కూడా) ఆ పటారం, ఆర్భాటం… ఇంకాస్త ఎక్కువ మోతాదులో కనిపిస్తాయి. ఆ డాంబికం తెచ్చే దబాయింపునే రావిశాస్త్రి గారు ‘గయ్యాళితనం’ అన్నారు. కవితగా ప్రకటించిన దాంట్లో కవిత్వం లేదంటేనో, రచనలో ‘ఆర్ట్ ‘లోపించిందంటేనో సహించలేకపోవడం, ప్రగతినిరోధమని, మగ దురహంకారమనీ ముద్రలు వేస్తూ అదరగణ్ణానికి దిగడం- రావిశాస్త్రి గారు గయ్యాళితనం అన్నారు. ఇక బేషరతు సంఘీభావ సమూహాల హంగామా అయితే చెప్పడానికి లేదు. అంతకుముందు ఊహించలేని, స్త్రీలకి తప్ప మరొకరు రాయలేని కవితావస్తువుల కారణంగా, యుగాలుగా అణుచుకున్న కన్నీళ్లు, దాచుకున్న నవ్వులు స్వేచ్ఛగా, నిస్సంకోచంగా బైటపెట్టుకోగల ఆవరణాన్ని స్త్రీకి కల్పించిన కారణంగా స్త్రీవాద రచనల్ని ఇష్టపడాల్సిందే తప్ప, ఆ సాహిత్యపు శైలీరూప ఔన్నత్యం వల్ల కాదు. వాక్యాల్ని విరవడం వల్ల కవిత్వమని, పాత్రలకేవో పేర్లు పెట్టడం వల్ల కథ అని, నిడివి పెరిగితే నవలిక అని అనుకోవల్సిందే తప్ప, ఆయా genres ప్రామాణికతల పరంగా కాదు. అతి తక్కువ మినహాయింపులతో తెలుగు కవయిత్రులు, రచయిత్రులందరికీ వర్తిస్తుందిది. చలామణి కావడానికి అనుకూలంగా ఉన్న వాతావరణం, దబాయింపు చేయడానికి ఇబ్బడిముబ్బడిగా ఉన్న సంఘీభావ గణం వల్ల సృజనాప్రమాణాలు పెంచుకోవల్సిన అగత్యం లేకుండాపోయింది స్త్రీవాద సాహిత్యవేత్తలకి.
ఇప్పుడు స్వాతి విషయంలో కూడా ఈ హోరు పాలే ఎక్కువయ్యింది. నేను గ్రహించిన మేరకు, తన రాతలకు సాహిత్య గౌరవం కలుగుతుందా లేదా అన్న స్పృహ స్వాతికి ఉన్నట్టు తోచదు (గతంలో తన రచనల్లో కొన్నింటిని కూడా చూసినప్పుడు సైతం ఇదే అభిప్రాయం కలిగింది). గీసే గీతలు… రాసే రాతలు… అన్నీ ధిక్కారాలు, సహానుభవాలు. అందులో style ని, కవితానిర్మాణ పద్ధతుల్ని సాధన చేయాలని తాను అనుకోవడం లేదేమో.
“బాధపడకండి
మీ బూతులు మా హృదయాల్ని గాయపరుస్తాయనీ…” అంటూ రాసిన ఆమె రచనని పేరాగ్రాఫులుగా, syntactical వాక్యవిన్యాసంగా మార్చి పేర్చి చదువుకుంటామని అన్నా, ఆమె అభ్యంతరపెట్టరేమో.
స్త్రీల తాటస్థ్యాన్ని బలంగా ప్రతిపాదించాలని చూసిన ఈ ప్రకటనలు- ‘
“జండా కు జరిగే అవమానం జండాది కాదు.
గుడిలో బొమ్మను తంతే
బొమ్మ తిరగబడదు.
శత్రువు దురాక్రమిస్తే
సరిహద్దు కేం నొప్పి?
ఎవడి పాదాలైతేనేం తన్నులు
తినడానికి!…”- అన్వయానికి కుదరడం లేదంటే పట్టించుకోరేమో స్వాతి. ‘అసలు ఇందులో
కవిత్వం లేదు…’ అంటే “పాతపదాలు, డిక్షన్, వర్ణనలు, అలంకారాలు, ఛందస్సు, ఉపమానాలు, పద్ధతులు, ఆచారాలు, కవిత్వంలోవీ, జీవితంలోవీ ఇంక
మళ్ళీ లేవకుండా వాటి నడ్డి విరక్కొట్టి, ధ్వంసం చేసి
రోడ్డు వేశా..”నంటూ ‘యోగ్యతాపత్రం’ స్టైల్ లో అనకపోవచ్చు. బహుశా హఠాత్ విస్ఫోటన
వంటి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కటమే తన లక్ష్యమై ఉండొచ్చు. కానీ, ఆమె ఆవేశాన్ని ఆవాహన చేసుకొని,
ఆమె రచనను own చేసుకొని అనేకానేక shares తో ఆగని అంకమ్మశివాళ్ళతో చెలరేగిపోతున్న
సంఘీభావోన్మాద సందోహాలు- ‘ఇదొక అద్భుతమైన
కవిత’ అని, ‘తెలుగు
సాహిత్యచరిత్రలో ఒక నవశకమ’ని చేస్తున్న ఆగం, ఆగడం వల్ల ఆశించిన లక్ష్యం నెరవేరే అవకాశముందా?
అదలా ఉంటే, “….అవేవీ మావి కాకుండా పోయాయి / వాటికి జరిగే అవమానాలు మావెలా అవుతాయి?” అన్నారు స్వాతి. స్త్రీల శరీరాలు… గర్భాలు…. బిడ్డలు పరాధీనం కాకుండా తమవే అయిన స్వతంత్ర, విముక్త సందర్భంలో కూడా మగవారి ఉన్మత్త పదప్రయోగాలు అవమానాలు కానేకాకూడదని స్వాతి గ్రహించాలి.
** ** **
Thought provoking
Thank you Rambabu Garu..
ఇంత మంచి వ్యాసం చదివి చాన్నాళ్ళయింది. మధ్యలో కొంత పక్కకి జరిగినా వ్యాసం అద్భుతంగా ఉందంటే ఆశ్చర్యం లేదు.
అభినందనలు నరేష్.
ఇంద్రప్రసాద్ గారూ, మీ వంటి మంచి poet, profound scholar మెచ్చుకోలు, గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది (ఇస్తోంది).
” మీ నోళ్ళల్లో మా బతుకులు బ్లూ ఫిల్ములైతే
అవమానంతో ఉరికొయ్యలకు వేలాడతామనీ
భ్రమపడకండి అయ్యలూ, భయపడకండి ”
అని కూడా అన్న Swathi Vadlamudi is a journalist. She is very bold in her previous writings also. వారి గురించిన చిన్న వివరణ కూడా ఇవ్వలేదేమండి వ్యాసం అద్భుతంగా రాసిన నరేష్ నున్నా గారూ.
( స్వాతి గారి వాక్యాలు కొరడాల్లా ఉంటే భరించగలం కానీ మరీ కత్తివేటుల్లా ఉండాలా సామే. )
“స్వాతి వడ్లమూడి గురించి మీ అభిప్రాయం చెప్పండి” అని నరేష్ ని అడిగారా, అతను “దానికేం, కవిత్వం చాలా బావుంటుంది. ఓ బాగా వ్రాస్తుంది. నేను ఆమెని కూడా బాగా ఎరుగుదును. నా అభిప్రాయం ఏమిటంటే-” అన్నాడా, అతను చాలా సన్నిహిత ప్రియమిత్రు డన్నమాట కవికి. చిరునవ్వుతో స్వాతి విషయమై మీ కళ్ళలో కారం కొట్టిపోతున్నాడు. పొగడ్తలతో మీ నోట్టో విషం కక్కి పోతున్నాడు జాగ్రత్త!
(చలం యోగ్యతాపత్రం స్టైల్‌లో… )
స్వాతి గురించి నేను చెప్పడం- “అభివృద్ధికి రాతగినదానవు” అని ఆకాశమంత ఎత్తుగా వుండే ఆమె వీపు తట్ట చూస్తున్నట్టు, రామయ్య గారూ (ఇది కూడా యోగ్యతాపత్రం స్టైల్‌లోనే) 🙂
నరేష్ గారూ, చాలా
బాగా రాశారు. Well balanced article. స్వాతి గారి ధిక్కార కవిత తీవ్రత, నేపథ్యం
గుర్తిస్తూనే..
దాని పరిమితిని కూడా మృదువుగా , సముచితంగా చెప్పారు.
సందర్భోచితంగా ఉదాహరించిన కవితలూ, కొటేషన్లూ ప్రశంసనీయంగా ఉన్నాయి.
‘ఫెమినిస్టులందరూ వ్యభిచారులే’
అని రంగనాయకమ్మ గారు అన్నారని మీరు కోట్ చేశారు.
నాకు తెలిసి ఆమె అలా ఎప్పుడూ అనలేదు.
ఓసారి ‘ఆంధ్ర
భూమి’లో ప్రకాష్ చేసిన ఇంటర్వ్యూ ఇలాంటి హెడింగ్
తోనే వస్తే
దానిపై అభ్యంతరం తెలుపుతూ లేఖ రాశారామె. మీరు రాసిన కొటేషన్..
ఆ హెడింగ్ కంటే మించి అపార్థాలకు తావిచ్చేలా ఉంది.
Verify it once and tell me whether I am wrong!
వేణూ!
ఆలస్యంగా బదులిస్తున్నందుకు క్షమించండి, వృత్తి, ప్రవృత్తి సంబంధిత ఒత్తిళ్లే ఈ జాగుకి కారణం.
వ్యాసాన్ని మెచ్చుకున్నందుకు థ్యాంక్స్.
ఇక రంగనాయకమ్మ గారి వ్యాఖ్యల గురించి:
ఆ వ్యాఖ్య నిజానిజాల గురించి చెక్ చేసుకోమని మీరు చేసిన సూచన, 20 ఏళ్లుగా నన్ను సలపరిస్తున్న మరో సందేహానికి సమాధానాన్ని ఇచ్చింది. ఆ revelation గురించి చెప్పడం మొదలు పెడితే, సందర్భం పూర్తిగా పట్టాలు తప్పి స్వకీయం అయిపోతుందనే జంకుతో, ప్రస్తుతం రంగనాయకమ్మ గారి వ్యాఖ్యకు సంబంధించిన నా వివరణకే పరిమితమౌతాను.
‘ఫెమినిస్టులందరూ వ్యభిచారులే’ అని రంగనాయకమ్మ గారు అనడం, ‘అంత దుందుడుకు వ్యాఖ్యానాలు తప్ప’ని మల్లాది సుబ్బమ్మ గారు రంగనాయకమ్మ గారిని మందలించడం ఆంధ్రభూమి దిన పత్రికలోనే వచ్చాయి.
దీని వెనక ఒక నేపథ్యాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి.
Alexandra Kollontai రాసిన ‘The Loves of Three Generations’ని ఓల్గా గారు (మరొకరితో కలిసి ??) అనువాదం చేశారు- ‘మూడు తరాల ప్రేమ కథ ‘ పేరిట. తన స్వేచ్ఛాప్రణయ సిద్ధాంతానికి కళారూపం ఇవ్వడానికి అలెక్సాండ్రా కొల్లొంటాయ్ చేసిన ప్రయత్నమే ఆ రచన. ఆమె ఫ్రీ లవ్ ని లెనిన్ వ్యతిరేకించడమే కాకుండా, ఆమెతో వాదిస్తాడు కూడా. నైష్ఠిక మార్క్సిస్టు గానే కాకుండా, స్వతహాగా కూడా లెనిన్ పరమ నైతికవాది అని కొన్ని సందర్భాల్లో బైటబడుతుంటుంది. తాగుతూ సేదతీర్చుకుంటున్న కొందరు శ్రామికులు (రైతులు) ఉల్లాసం కోసం పాడుకుంటున్న జానపద గీతాల్లో సహజంగా ధ్వనించే సరసం, లైంగికత లెనిన్ కి పచ్చి బూతుల్లా అనిపించి, అసహ్యపడి, ‘సంస్కారం లేని ఈ అలగా జనం సాయంతోనే కదా విప్లవాలు చేయాలి… ‘ అని (అక్టోబర్ విప్లవానికి ముందు) నిర్వేదానికి గురయ్యాడని చదివానెక్కడో. ఆ ఫక్తు నైతిక దృష్టితోనే కొల్లొంటాయ్ స్వేచ్ఛాప్రణయ ప్రతిపాదనల్ని వ్యతిరేకించాడు. స్త్రీవాదంతో సహా అనేకానేక వాదాల్ని వామపక్ష వర్గ వాదాన్ని పలచన చేయడానికి పన్నిన కుట్రలుగానే (తొలినాళ్ళలో) చూడటం వల్ల, మార్క్సిస్టు లెనినిస్టు అయిన రంగనాయకమ్మ గారు సహజంగానే ‘మూడు తరాల ప్రేమకథ’ని వ్యతిరేకించారు. అయితే, ఆమె చేసిన విమర్శ – ఓల్గా గారి వ్యక్తిగత జీవితం వరకూ వెళ్లడం, ప్రతిగా ఓల్గా కూడా రంగనాయకమ్మ వైవాహికత మీద దాడి చేయడం – అప్పటి పరిణామాలు. Monogamous సంబంధాలే సమస్యకి పరిష్కారమంటూ తాను చేసిన వాదనకి దన్నుగా (అప్పటి తన చర్చల్ని చేర్చుతూ) రంగనాయకమ్మ ‘అసమానత్వం’లోనించి ‘అసమానత్వం’ లోకే!’ అన్న పుస్తకం తెచ్చారు. సైద్ధాంతిక చర్చ వ్యక్తిగత దూషణ స్థాయికి దిగజారిన పరిస్థితుల్లో, ఓల్గా, ఇంకా కొంత మంది ఫెమినిస్టుల్ని ఉద్దేశించి – ‘కొంత మంది నీతి లేని వాళ్ళు తమ తిరుగుబోతుతనాన్ని సమర్థించుకోవడానికి…’ ఫ్రీ లవ్ సిద్ధాంతాలు వెనకేసుకొస్తున్నారని విమర్శించారు రంగనాయకమ్మ. అనేక మంది మగవాళ్లతో సంబంధం పెట్టుకోవడం వ్యభిచారమేనని వాదించారామె. ఆ ఉద్దేశంతోనే, ‘ఫెమినిస్టులందరూ వ్యభిచారులే’ అనేశారు.
బాగా విశ్లేషించారు. ధన్యవాదాలు.
నాలుగైదు వాక్యాలు చదివాక మీరేనా రాసారు అని నిర్థారించుకోవడం కోసం మళ్లీ పేరు చూసుకుని మరీ చదివాను. ఒక్కొక్క వాక్యం చాలా ఆశ్చర్యపోతూ చదువుతూ వచ్చాను. మీ నుంచి ఇంత decent వాక్యాలు, ఇంత సమర్థనా (స్త్రీల పట్ల feminist కోణంలో) ఊహించలేదు. మీరు మీనుపు రాసిన ‘సుఖవ్యాధి’ కి ఆ పేరు సరైనదే సుఖం ద్వారా వచ్చే వ్యాధి అని రాసిన వాక్యాన్ని ఈ జీవితానికి మర్చిపోలేను. అంత జుగుప్సాకరమైన వాక్యాన్ని నా జీవితంలో ఇంతవరకూ చదవలేదు. ముండ, రండలే నయం అనిపించేంతటి వికారమైన వాక్యం/ఆలోచన అది.
ఈ నేపధ్యంలో ఈ వ్యాసంలో మీరు ప్రస్తావించిన అంశాలు, ఇచ్చిన సపోర్ట్ ఆశ్చర్యం కలిగించవా మరి! సరే, బావుందే అనుకుంటూ చదువుతూ ఉంటే అప్పుడు కనిపించింది అసలు విషయం…వణుకుతున్న మీ వేళ్లు, శరీరాన్ని వణికిస్తున్న సన్నని జ్వరం… స్వాతి కవిత, దానిపై స్త్రులు చూపిస్తున్న సంఘీభావం కలిగించిన భయం, జ్వరం. సరదా వేసింది. మాయాబజార్ లో ‘భలే మామ భలే’ అన్నట్టు, ‘భలే స్వాతి భలే’ అనుకున్నా! తను పక్కనే ఉండుంటే ముద్దు పెట్టుకుని హత్తుకునేదాన్ని! వాళ్లు, వీళ్లు అని తేడా లేకుండా అహంకారులందరిలోనూ స్వాతి కవిత కలిగించిన అదురు, బెదురు ఎంత సంతోషాన్నిచ్చిందో మాటల్లో చెప్పలేను.
ఒకప్పుడు వ్యవహారికం రాస్తున్నవాళ్లనూ ఇలాగే అన్నారులెండి. తరువాత పట్టాభి ‘నడ్డి విరగ్గొడతా’ అని ప్రకటించి మరీ విరగ్గొట్టారుగా! స్వాతి కవిత అలాంటిదే…నడ్డి విరగ్గొట్టింది. ఫరవాలేదు లెండి అందమైన పదాల వెనక, అన్నమయ్య వెనక దాగి రాస్తున్న బూతునే భరిస్తున్నాం. ఇది కవిత కాదనో, హిస్టీరిక్ సంఘీభావం అనో అంటే భరించలేమా!!
ఒక సమూహాన్ని కొరడాలతో కొడుతుంటే, ఒక వ్యక్తి ధైర్యం చేసి పైకి లేచిన కొరడాని పట్టుకుని ఆపితే, కొరడా పట్టుకోవడం మంచిదేగానీ పట్టుకునే పద్ధతి బాలేదు, ఆ మాత్రం దానికే కిందపడ్డ సమూహంలోనందరూ జేజేలు పలుకుతున్నారు, కొరడాని ఆపడంలో ఆత్మ, శిల్పం, వల్లకాడు మిస్ అయ్యాయి. అని బాధపడినట్టుంది మీ విమర్శ!
లం.., పూ.. ఎలా మావి కావు, మాకు అంటవు అన్నామో అలాగే గయ్యాళితనం మాది కాదు, మాకు అంటదు.
Excellent
చాలా బాగానూ సరిగ్గానూ స్పందించారు సౌమ్య గారూ
భలే సౌమ్య! భలే!
వ్యక్తిగతమైన పని ఒత్తిళ్ల వల్ల ఆలస్యంగా బదులిస్తున్నాను సౌమ్యా (స్నేహం, అభిమానం, గౌరవాలతో పాటు, వయసులో (మాత్రమే) బాగా చిన్నదానివి కాబట్టే ఏకవచన సంబోధన; అంతే తప్ప అగౌరవం కాదు).
Rolland Barthes రచన ‘From Work to Text’ కి ఉన్న విస్తృతార్థాన్ని ప్రస్తుతం నా context కి తగ్గట్టుగా కుదించుకొని ఈ వివరణ:
“మీ నుంచి ఇంత decent వాక్యాలు, ఇంత సమర్థనా (స్త్రీల పట్ల feminist కోణంలో) ఊహించలేదు.”- అన్నావు.
– ఫెమినిస్టు కోణం నుంచి స్త్రీలను సమర్థిస్తూ, డీసెంటుగా రాసినవి, నీ మెప్పు పొందగలిగినవి నా పాత రాతలలో (ఏవైనా ఉంటే) నుంచి ఏకరువు పెట్టి, నా సౌశీల్యం, స్త్రీజన పక్షపాతం నిరూపించుకోబూనడం బాగుంటుంది గానీ, స్ఫూర్తి కాదు సరిగదా అది తప్పు. “ఉన్మత్త పదప్రయోగం- ‘ఆమె’ పరాధీనత!” అన్న శీర్షికన ఉన్న text ని బట్టే, ఆ పరిధికి లోబడే నా కేస్ వాదించుకోవాలన్నదే ‘From Work to Text’ ఇచ్చే సందేశం. అసలు నరేష్ నున్నా ఎవడు? గతంలో రాసినవి ఏమిటి? ఆ రాసిన వాటిలో ముసుగులెన్ని? దాచేస్తే దాగని సత్యాలెన్నెన్ని?- ఇవన్నీ తెలుసుకోవల్సిన అవసరం ఏ పాఠకుడికీ లేదు. ఈ text ఏమి అంటోంది అన్నదే ప్రధానం.
“అప్పుడు కనిపించింది అసలు విషయం…వణుకుతున్న మీ వేళ్లు, శరీరాన్ని వణికిస్తున్న సన్నని జ్వరం… స్వాతి కవిత, దానిపై స్త్రీలు చూపిస్తున్న సంఘీభావం కలిగించిన భయం, జ్వరం ……… వాళ్లు, వీళ్లు అని తేడా లేకుండా అహంకారులందరిలోనూ స్వాతి కవిత కలిగించిన అదురు, బెదురు ఎంత సంతోషాన్నిచ్చిందో మాటల్లో చెప్పలేను.”
– నా వ్యాసం ‘ముసుగు’ వెనక ఉన్న ‘అసలు రూపం’ అలా కనిపించిందింది నీకు. నా text నీకు అటువంటి అభిప్రాయం కలిగిస్తే, ఆ అభిప్రాయం నాకు నచ్చినా, నచ్చకున్నా, దానికి నేను ఇవ్వగలిగిన సంజాయిషీ ఏమీ ఉండదు. ఒక నవశకారంభాన్ని చూసి బెంబేలు పడిపోతున్న నా ‘బెదురు అదురు…’ చూసి ‘భలే… భలే..’ అని నువ్వు నవ్వుకున్నట్టే, అహంభావ కవుల నవ్య సాహిత్య విప్లవాలతో, వైతాళిక ప్రయత్నాలతో సరిపోల్చుకొని నువ్వు సగర్వించడాలు, ‘చాలా బాగానూ సరిగ్గానూ స్పందించారు…. భళి భళీ అని కొందరు …. ‘భలే సౌమ్యా భలే’ అని మరి కొందరు పంబజోళ్ళు వాయించడాన్ని చూసి నేను కూడా అలానే నవ్వేసుకోవచ్చు ఎంచక్కా.
“నాలుగైదు వాక్యాలు చదివాక మీరేనా రాసారు అని నిర్థారించుకోవడం కోసం మళ్లీ పేరు చూసుకుని మరీ చదివాను”- అని పాత texts ను బట్టి అన్నావు కాబట్టి, నేను ఈ text హద్దులు మీరి మరీ నీకు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది.
“మీరు మునుపు రాసిన ‘సుఖవ్యాధి’ కి ఆ పేరు సరైనదే సుఖం ద్వారా వచ్చే వ్యాధి అని రాసిన వాక్యాన్ని ఈ జీవితానికి మర్చిపోలేను. అంత జుగుప్సాకరమైన వాక్యాన్ని నా జీవితంలో ఇంతవరకూ చదవలేదు. ముండ, రండలే నయం అనిపించేంతటి వికారమైన వాక్యం/ఆలోచన అది.”
– ఏ పాత text ను బట్టి నా ఆలోచనల సారాంశాన్ని నువ్వు నిర్ధారించుకున్నావో చెప్పడం నాకు చాలా ఉపయోగపడింది. లేకుంటే, నా ఏఏ రాతలు నీలో జుగుప్సని, నా (ఆలోచనల ) మీద రోత కలిగించాయో గ్రహించలేక జుట్టు పీక్కునే వాడిని.
నువ్వు refer చేసిన ఫేసుబుక్ పోస్ట్ ఇది: https://www.facebook.com/naresh.nunna/posts/1568001463254314
“పడమటి దొరలు వేరేలాగానూ ప్రాచ్య భావుకులు వేరేగానూ సెక్స్ చేసుకుంటారా?” అని అడిగిన మెహర్ కు నా సమాధానమది.
“నా చిన్నప్పుడు చిలకలూరిపేట వెళ్లొచ్చిన గురువు వంటి ఓ సీనియర్ మిత్రుడికి సుఖవ్యాధి వచ్చిందని తెలిసి, ఆ వ్యాధేమిటో గానీ, దాని వల్ల తీపరం ఎలాంటిదో గానీ, దాన్ని ‘సుఖపర్యవసానం’గా నిర్ధారించిన మన భాషావేత్తలకు మనసులోనే దణ్ణాలు పెట్టుకున్నాను.” అని రాసాను.
పై నా వాక్యమే నువ్వు జీవితానికి మర్చిపోలేనన్నది. ‘అంత జుగుప్సాకరమైన వాక్యాన్ని నా జీవితంలో ఇంతవరకూ చదవలేద’ ని చెప్పింది పై వాక్యమే. ‘ముండ, రండలే నయం అనిపించేంతటి వికారమైన వాక్యం/ఆలోచన అది’-
సెక్స్ కి సంబంధించి అరకొర శ్రుతజ్ఞానమే ఉన్న 15 ఏళ్ల మగ పిల్లవాడి adolescent… puerile… primitive… అపోహ… ఆరాటం – నీకు జుగుప్స కలిగించిందని ప్రకటించి నీ పరమ moralistic దృష్టిని బాహాటం చేసినందుకు చాలా సంతోషం కలిగింది. అంతే కాదు, అంతటి ‘అనైతికత’ నీ జీవితం మొత్తంలో ఎన్నడూ కనీవినీ ఎరగనిదిగా కూడా ప్రకటించి నీ జీవితము చుట్టుకొలతలు, వైశాల్యం స్పష్టం చేయడం కూడా చాలా బాగుంది. Thank you very much.
.
“ఇక స్త్రీవాద సాహిత్యం మీద అప్పట్లో దాడి చేసిన male chauvinistic రచయితల్లో రావిశాస్త్రి గారి పేరు కూడా ప్రస్తావిస్తుంటారు. ‘ఫెమినిస్టులు గయ్యాళులు ‘ అన్నారని, ‘అవును మేము గయ్యాళులమే’ అనే కవిత రాశారు ”
రావిశాస్త్రి ఫెమినిస్టులు గయ్యాళులు అనలెదు.ఫెమినిస్టులకన్నా గయ్యాలులే నయం అని అన్నారు. రచన పత్రికలో జయ అనే కవయిత్రి ఆయనను ఇంటెర్వూ చేసిన సందర్భంలో ఆయన ఆ మాట అన్నారు.
Amazing..Amazing amazing…Claps to this article..Please share the phone number of this author..
Kudos…
C.v.Suresh
9966078281