ఉద్యమ చరిత్రలో కొండంత వ్యక్తిత్వం

ఒక ప్రజాలక్ష్యం కోసం ముఖ్యంగా స్త్రీలకు వాళ్ల స్వశక్తి గురించీ, తాము చేసిన కృషి గురించీ, వాళ్లపైన వాళ్లకే ఒక గొప్ప నమ్మకాన్ని కలిగిస్తుంది కోటేశ్వరమ్మ గారి జీవిత చరిత్ర

హుశ నిండైన నూరేళ్ళ జీవితాన్ని చూసిన వ్యక్తులు నా పరిచయంలో కోటేశ్వరమ్మ గారొక్కరే. అందులోనూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో, సముద్రమంత లోతైన గంభీరతతో జీవితంలో పెద్ద పోరాటాన్ని సాగించి, ఎత్తు పల్లాలని అధిగమించిన వ్యక్తి కోటేశ్వరమ్మగారు.

1983లో ‘స్త్రీ శక్తి సంఘటన’ బృందంగా వసంత కణ్ణబిరాన్‌, రమ మెల్కొటే, నేనూ విజయవాడలో కోటేశ్వరమ్మ గారిని మొదటిసారి కలిశాం. సందర్భం, తెలంగాణా రైతాంగ పోరాటంలో స్త్రీల గురించిన మా అధ్యయనం! అప్పటికే పోరాట విరమణ జరిగి ముప్ఫై సంవత్సరాలపైన అయింది. అప్పటికి దాదాపు మూడు దశాబ్దాలు పైగా జరిగిపోయినా కోటేశ్వరమ్మ గారు ఆ పోరాట జీవితాన్ని గురించి, దాని నేపథ్యం గురించి చెప్పిన విషయాలన్నీ కళ్ళకి కట్టినట్టు కనిపించినయి. అప్పటి జ్ఞాపకాల గురించి రాయటానికి గాను మళ్ళీ ఒకసారి ఆమె ఇంటర్వ్యూ చదివాను. చదివిన ప్రతిసారీ కొన్ని కొత్త విషయాలు తెలిశాయని అనిపించే విధంగా ఉండే కోటేశ్వరమ్మ గారి చరిత్ర రాబోయే ఎన్నో తరాల వాళ్ళకి స్ఫూర్తిగా నిలిచి ఉంటుందనటంలో ఏమాత్రం సందేహం లేదు.

ఆమె చెప్పిన చరిత్రలో కొన్ని ఆణిముత్యాలు మరొక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. మేము ఆమెను కలిసేనాటికి కోటేశ్వరమ్మ గారికి బహుశా 65 సంవత్సరాలు ఉండి ఉంటాయి. బాల్య వివాహం గురించి, చిన్నతనంలో భర్త పోవటం గురించి, తర్వాత కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీలో భాగంగా పనిచేస్తూ సాంస్కృతిక రంగం వైపు ఆకర్షితురాలైన విషయంతో ప్రారంభమైంది ఆమె ఇంటర్వ్యూ. నాటకాల ప్రదర్శనలో స్త్రీ పాత్రల్ని స్త్రీలే పోషించే సందర్భం లేని రోజులవి. ఆ సందర్భంలో ‘‘ముందడుగు’’ నాటకం వేస్తూ అందులో స్త్రీ పాత్రల్ని స్త్రీలే వెయ్యకపోతే అది ముందడుగు ఎట్లా అవుతుందని తను ప్రశ్నించింది. ఇది 40వ దశకంలో జరిగింది. ఇక భాష గురించి ఆమె చెప్పిన మాటలు వింటే, అప్పటి రోజుల్లో వాళ్ల చైతన్య స్థాయి ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించేదిగా ఉంటుంది. ‘‘చందస్సు, గణాలు ఈ బండి ‘ఱ’ ఇవన్నీ అనవసరం అనేది. ఈ అవగాహనతో తాపీ ధర్మారావు గారి నాటకాలు వేశాం అనీ, ప్రజలు పలికే పలుకు, మాట్లాడే మాట దానితోటే మొదలు పెడితే బాగుంటుందీ” అని  ప్రజల భాష గురించి అప్పట్లో తన అవగాహనని వెలిబుచ్చింది ఆమె.

ఇంకొక సందర్భంలో ‘‘అంటరాని వాళ్ళెంతో స్త్రీలూ అంతే’’ అనే మనువాద స్పృహను అంగీకరించకుండా  కోటేశ్వరమ్మగారు కులం గురించి చేసిన వ్యాఖ్యలు చూడాలి. కులం పేరుతో ‘సాకలి సచ్చినోడు, మంగలి సచ్చినోడు, మాదిగ సచ్చినోడు’ లాంటి తిట్లన్నీ (ఆ రోజుల్లో) మాన్పించేశాం అని’’ ఆమె చెప్పారు. అట్లాగే తాము తయారు చేసిన ‘పెటీ బూర్జువా’ వంటి కొత్త తిట్ల గురించి సరదాగా మాట్లాడారు. అదే సందర్భంలో అభ్యుదయ సాహిత్యం గురించి మాట్లాడుతూ “శ్రీశ్రీ ద్రోణాచార్యులయితే (మనకు) తెలియని ఏకలవ్యులెందరో” అన్న ఆమె వ్యాఖ్య ఇప్పటి దళిత ఉద్యమ ఆలోచనా ధోరణిని గుర్తుకు తెచ్చింది.

అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇక్కడ ప్రస్తావించాల్సినది చరిత్రలో స్త్రీల గురించి ఆమె చెప్పిన అంశాలు, ‘’స్త్రీలు లేకుండా చరిత్రలో ఏ ఉద్యమమూ లేదు. స్త్రీలు లేని చరిత్ర లేదమ్మ!’’ అన్న ఆమె గొంతు ఈనాటికీ నాకు వినపడినట్టే వుంది. స్త్రీలు ఎంత ధైర్యంగా, ఉత్సాహంగా ఉద్యమంలోకి వచ్చారు, ఎన్ని రకాల బాధ్యతల్ని నిర్వర్తించారు అని చెప్తూనే అప్పటికి మార్క్సిస్టు సిద్ధాంతాలు, విజ్ఞానం వంట బట్టించుకోవటం గురించి అందులోని సాధక బాధకాల  గురించి కోటేశ్వరమ్మ గారు చెప్పిన మాటలు ఇప్పటికీ ‘అవును కదా’ అనిపించేలా ఉన్నాయి. పార్టీక్లాసుల్లో రాజకీయాలు బోధించిన పద్ధతి చూస్తే ‘‘అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టినట్టుందనీ, అవి ఇనుప గుగ్గిళ్ళ ల్లాగా మింగుడు పడేవి కాదు’’ అని యదార్ధాన్ని ఎంత విచిత్రంగా చెప్పారో చూస్తే ఇప్పటికీ విస్మయం చెందుతాం!

ఆదర్శవాదం, మానవ విలువలు, పరస్పరం గౌరవించుకుని మసిలే ఉద్యమ ధోరణులు, రెండు వందల మంది దాకా ఏ సమయంలో వెళ్ళినా భోజనం దొరుకుతుందనే నమ్మకం కలిగించే విధంగా బుల్లెమ్మ లాంటి పార్టీ కార్యకర్తలు  నిర్వహించిన కమ్యూన్లు,  స్త్రీల  అనారోగ్యాలకు, ప్రసవ సమయంలో పుట్టింట్లో లేకపోయినా పుట్టింటికంటే ఎక్కువగా ఆదరించి ఆప్యాయతని పంచిన డా॥కొమర్రాజు అచ్చమాంబ గారి ఆస్పత్రి వంటి సంస్థలు, చుట్టాల కంటే ఎక్కువగా దగ్గరైన ఉద్యమకారులు-ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు వివరించిన కోటేశ్వరమ్మ గారి చరిత్ర మనని ఇంకొక అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ‘‘చాలా ముందుకెళ్లిన సమాజం’’ అనుకునే ఈ 21వ శతాబ్దంలోని దౌర్జన్య, అమానవీయ పరిస్థితుల్ని మరింత ఎత్తి చూపిస్తుంది.

ఉద్యమంలో భాగస్వాములుగా రావటం, ఒక ప్రజాలక్ష్యం కోసం పనిచేయడమన్నది, ముఖ్యంగా స్త్రీలకు వాళ్ల స్వశక్తి గురించీ, తాము చేసిన కృషి గురించీ, వాళ్లపైన వాళ్లకే ఒక గొప్ప నమ్మకాన్ని కలిగించింది. సంతృప్తి నిచ్చింది. పోరాటవిరమణ అనంతరం కూడా జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను, సంక్షోభాలను అధిగమించే శక్తిని వాళ్లు సాధించుకోగలిగారు.

కొండంత వ్యక్తిత్వం గల కోటేశ్వరమ్మగారి నూరేళ్ల జీవితం వెనుక, ఆమె రాజకీయ జీవితస్రవంతిలో భాగస్వాములయిన ఆమె కుటుంబసభ్యుల అండదండలు, ఆమెను ఇంతకాలం కంటికిరెప్పలా కాపాడుకున్నవారి ఆపేక్షలతోపాటు, స్నేహితులు, సన్నిహితులు, అభిమానుల ఆదరాభిమానాలు ఉన్నాయని మనం మరిచిపోకూడదు.  ఆమె జీవితం రాబోయే ఎన్నో తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకం!

*

 

కె.లలిత

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు