ఉదయకాంతుల ఖడ్గధారీ కత్తి మహేష్…

“ఎంత కాలం బతికామన్నది ముఖ్యం కాదు. ఎంత మహోన్నతంగా బతికామన్నది ముఖ్యం” అని బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్య కత్తి మహేష్ కు చక్కగా వర్తిస్తుంది. నాలుగు పదుల వయసులో తను మనల్ని విడిచి వెళ్లిపోయాడు. కానీ తను జీవించిన కాలమంతా చాలా గొప్పగా బతికాడు. ఆయన్ను అకాల మృత్యు శకటం నలిపి వేయకపోతే, తను మనువాద వ్యవస్థను పెకిలించే పనిని కొనసాగిస్తూనే వుండేవాడు. ఉదయకిరణ ఖడ్గధారీ కత్తి మహేష్ అస్తమయం అనూహ్యమైన సత్యం.

సార్వజనీనమైన మహోన్నత విలువల పరివ్యాప్తి కోసం కృషి చేశాడు. ఉనికి కోల్పోతున్న స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సోదరభావాలను కాపాడుకోవడానికి తను అలుపెరుగని పోరాటం చేశాడు. ప్రజాస్వామ్య భావనను ఒక రాజ్యాంగ నియమంగానే కాకుండా, ఒక జీవన విధానంగా ఆచరించాలని తను ఆరాట పడ్డాడు. తన వైరి పక్షాలతో సంవాదించే సమయంలో కూడా తాను ఆ విధానాన్ని ఆచరించాడు. ఈ గుణమే తనకు అసంఖ్యాకమైన అభిమానులను,శత్రువులను సమకూర్చింది. గ్రీకు పౌరాణిక నాయకుడు ఒడిస్సీ మాదిరి, అతను అనేక కష్టాలు, భారమూ మోశాడు. భారత ఇతిహాస నాయకుడైన శంబూకుడు, శంబరుల మాదిరిగా నక్షత్ర ధూళిలో అమరుడిలా ప్రకాశిస్తున్నాడు.

చిత్తూరు జిల్లాలోని ఒక అతి సామాన్యమైన దళిత కుటుంబంలో కత్తి మహేష్ జన్మించాడు. పిజీ, పిహెచ్‌డి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో పూర్తి చేశాడు. సినిమా రంగం మీద తను విశిష్టమైన పరిశోధన చేశాడు. ఆ తర్వాత సినిమా రంగంలో మంచి విమర్శకుడిగా మన్ననలు పొందాడు. సినీ విమర్శలో తను వ్యక్తం చేసిన అభిప్రాయాలు వివాదానికి కారణమయ్యాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు వ్యక్తిగత దూషణలకు దిగడమే కాకుండా మానసికంగా బాగా వేదించారు. వాటిని ప్రజాస్వామిక చట్రంలోనే కత్తి మహేష్ ఎదుర్కొన్నాడు. ఆ సందర్భంలో తను చూపిన సహిష్ణుత, సంయమనం, పరిణితి అందరినీ ఆశ్చర్యపరిచింది. అన్ని వర్గాల ప్రజలు తనను సొంతం చేసుకొనేలా చేసింది. ఆ క్రమంలోనే తను స్వీయ రక్షణ కోసం వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒక వారియర్ లా మారిపోయాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో సానుకూల అంశాలను స్వాగతిస్తూనే, ప్రతికూల అంశాలను సున్నితమైన స్వరంతో తిరస్కరిస్తూ వచ్చాడు. అయితే ఆయన అధికారికంగా ఆ పార్టీ సభ్యుడు కాదు.

సాహిత్యం, సమాజం, సంస్కృతి, రాజకీయం తన అభిమాన క్షేత్రాలు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ సాహిత్యాలను చాలా ప్రేమగా చదువుకున్నాడు. సనాతన వైదిక సాహిత్యంతో కూడా తనకు మంచి ప్రవేశం వుంది. ఆధునిక సాహిత్యంలోని క్లాసిక్స్ మీద స్పష్టమైన అభిప్రాయాలు తనకున్నాయి. సాహిత్యం మీద స్పష్టమైన అభిప్రాయాలు వున్నాయి కత్తి మహేష్ కు. పుస్తకాలను, సినిమాలను, రాజకీయాలను అమితంగా ప్రేమించిన తను ఇతరుల మెహర్బానీ కోసం మాట్లాడడు. ఏదైనా సరే, ఒక తార్కిక వివేచనతో ఇతరుల వివేకాన్ని వెలిగించేలా చెప్పడం తన వ్యక్తిత్వం. భావజాలాన్ని ఎంత కచ్చితంగా వ్యక్తం చేస్తాడో, మనుషులతో అంతే ప్రేమగా వ్యవహరిస్తాడు. తనకు వ్యక్తుల మీద వెగటు లేదు. వ్యతిరేకత లేదు. తనను దూషించిన వాళ్లను, తన మీద దాడి చేసి చంపాలని చూసిన వాళ్లను కూడా ప్రేమించే హృదయం తనది.  సమకాలీన కవులు, రచయితల రచనలను చదవడమే కాదు, వాళ్లను ప్రోత్సహించే వాడు. పుస్తకావిష్కరణ సభలలో తప్పకుండా కనిపించే వాడు. టివి ఛానల్స్‌ లో తరుచుగా కనిపించినట్టే, సాహిత్య సభలలో తప్పకుండా కనిపించే వాడు. సాహిత్యాన్ని సంపన్న వర్గాల వినోద కార్యకలాపంగా చూసే దృక్పథాన్ని కత్తి మహేష్ స్పష్టంగా తిరస్కరించాడు.

“సాహిత్యాన్ని “ఎలీటిస్ట్”(గొప్పోళ్ళకి మాత్రమే సంభందించిన విషయం) చెయ్యడమంత తిరోగమనం మరొకటి లేదు. మన తెలుగు సాహితీచరిత్ర అంతా అదే ధోరణి!” ( కత్తి మహేష్, 15 జూన్, 2021). తెలుగు సాహిత్య చరిత్రను ఈ విధంగా అర్థం చేసుకోవడం సహజమే. ఈ మధ్యకాలంలో ఈ ధోరణికి సానుకూల ఆమోదం బాగా పెరుగుతుంది. పుస్తకాలు ప్రచురించే కొన్ని సంస్థల ధోరణీ, బాగా పేరున్న రచయితల ప్రవర్తనా ఇలా భావించడానికి ఉపకరిస్తుంది. అభ్యుదయ, విప్లవ, దళిత, స్త్రీ వాద, బిసివాద, మైనార్టీ వాద, తెలంగాణ వాద సాహిత్య క్రమం అంతా కూడా సాహిత్యాన్ని ప్రజాస్వామికరించడం, సామాజీకరించడం అనే దిశగా సాగింది. కానీ ఉద్యమాలు బలహీనపడి, నయాఉదారవాద భావజాలం బలపడుతూ, తత్ సంబంధ సంస్కృతి ఉనికి వ్యవస్థీకృతం అవుతున్న ఒక నయాదృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన మేధావి కాబట్టి అలాంటి లోతైన వ్యాఖ్య చేశాడని బోధపడుతుంది.

దళిత దృక్పథం నుంచి సనాతన ఫాసిజాన్ని విమర్శించాడు. హిందూ సమాజిక వ్యవస్థలో సంస్కృతి పేరుతో, అస్పృశ్యత పేరుతో దళితులను దూరం పెట్టే విధానాన్ని బలంగా ప్రతిఘటించాడు. అది విద్యావంతుడైన దళితుడిగా తన బాధ్యత అంటాడు.

“బుద్దున్న ఎవరికీ కులం ఉండదు” అంటాడు  మా మిత్రుడు అరవింద్ జాషువా. మరీ ముఖ్యంగా క్రైస్తవుడైన తనకి కులం లేదు అని సగర్వంగా చాటుకున్నాడు. ఆయనకి నా అభినందనలు. దురదృష్టవశాత్తు నాకు అలా కులాన్ని తృణీకరించే సౌలభ్యం లేదు. కారణం…  కొన్నివేల సంవత్సరాల అణచివేత నా కులానికి నేపధ్యం. ఇప్పటికి కొనసాగుతున్న వివక్ష నా వర్తమానం. ప్రతిరోజూ పోరాటం నా నిత్యగమనం. నాకు కులం ఉంది. దానిపైన సాగుతున్న ఆరాచకాన్ని పోరాడటానికికూడా కులమే నాకు ప్రాతిపదిక. కులం పేరుతో నా మీద దౌర్జన్యాలు చేసిన అధికార కులాలను ఛాలెంజ్ చెయ్యాలి. నా అస్తిత్వాన్ని నిలుపుకోవాలి. ఆత్మగౌరవం చాటుకోవాలి. నా బుద్ధిని, జ్ఞానాన్ని అందుకే వాడతాను. నా బలాన్ని అందుకే ఉపయోగిస్తాను. కనీసం రాబోయే తరాలలో అయినా ఈ వివక్ష ఉండదనే ఆశతో కొనసాగుతాను. గొంతుకనిస్తాను. నేను పొందిన అవకాశాలు. నాకు అందిన సుఖాలు ఎందరో చేసిన త్యాగాల ఫలం అని అనునిత్యం గుర్తుపెట్టుకుంటాను. వాళ్ళని స్మరిస్తాను. వాళ్ళను ఆదర్శంగా తీసుకుని పోరాడతాను. ఫలాయనవాదాన్ని పఠించను. అదే నాకు ఉన్న కులస్పృహ. నాకు అవసరమైన కులతత్వం. ఇదే నేను కోరుకునే మార్పు. నేను నా సహచర కులాల మనుషుల నుంచీ ఆశించే మార్పు.   అస్తిత్వాన్ని వదులుకుని. అన్యాయాన్ని చూసీచూడనట్టు లౌక్యంగా బ్రతకేవాళ్ళకి నా అభినందనలు. కానీ నా పోరాటం కులం చట్రాన్ని సగర్వముగా చేధించడానికే సాగుతుంది. ఏరుదాటి తెప్పగతలెట్టకుండా అదినా బాధ్యత అనుకుంటాను. అక్కడే నాకు అరవింద్ జాషువాకి తేడా అనుకుంటాను” ( 8 జూన్).

ఇదీ కత్తి మహేష్ నిబద్ధత. కుల నిర్మూలన కోసమే తన ఆలోచనలు, ఆచరణ అని బహిరంగంగా ప్రకటించాడు. ఆ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేపట్టిన దళిత గోవిందం కార్యక్రమాన్ని విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించాడు.

“ఒకప్పుడు గుడిలో ప్రవేశం నిషేధం అన్నారు. ఇప్పటికి అడపాదడపా అదే గోల. మధ్యలో దళిత గోవిందం అని దేవుణ్ణి దళితవాడల్లో తిప్పారు. ఆ విగ్రహానికి తిరిగి అలయప్రవేశం జరిగిందో లేదో తెలీదు. ఇప్పుడు వేంకటేశ్వరుడి ఆలయాలు వాడల్లోనే కడతాం అంటున్నారు. మరి పూజారులుగా ఎవర్ని పెడతారు. మతంలో మార్పు అవసరం. వివక్షనిమాపే సంస్కరణలు అత్యవసరం. పైపై పూతలు మెరుగులు కాదు. అంతర్గత సంస్కరణలు కావాలి. టిటిడి మెంబర్స్ లో దళితులు ఎంత మంది? పూజరుల్లో దళితుల శాతం ఎంత? (ఆల్రెడీ వేద పాఠశాలలో దళితులు చదువు కుంటున్నారు). కులవివక్ష పోగొట్టడానికి టిటిడి చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి? గుళ్ళతోపాటు కళ్యాణ మంటపాలు. ఫంక్షన్ హాళ్లు. కమ్యూనిటీ సెంటర్లుకూడా టిటిడి ఏర్పాటు చేస్తుంది. మరి దళితులకోసం వాడల్లో ఇలాంటివాటి ఏర్పాటు చేస్తుందా?” ( జూన్ 13, 2021). ఈ ప్రశ్నకు టిటిడి జవాబివ్వ గలదా? దళితులను ఇతర మతాలను స్వీకరించకుండా ఆపాలనే ఆలోచనతో హైందవీకరణ (శ్రీ వైష్ణవీకరణ) ప్రాజెక్టును మొదలు పెట్టారు. ఇతర మతాలను స్వీకరించిన దళితులకు రిజర్వేషన్ తీసెయ్యాలని వాదించే వాళ్లకు చక్కని జవాబు ఇచ్చాడు.

“రిజర్వేషన్ల మూల ఉద్దేశం సామాజిక న్యాయం. అణగారిన, అణచివేయబడ్డ, ఉద్దేశపూరితంగా అవకాశాలకు దూరం చేయబడ్డ కులాలకు అవకాశాలు పొందే సౌలభ్యాన్ని కల్పించడం. మతం మారితే కులం మారని సమాజంలో, కులపరమైన రిజర్వేషన్లకు మతాన్ని ఆపాదించడం అవగాహనారాహిత్యం” (10 జూన్, 2021).

మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని, ఉద్యోగం వచ్చిన తర్వాత మతం మారినా కూడా రిజర్వేషన్ వర్తించదని మద్రాసు హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆ సమయంలో చాలా పెద్ద చర్చ జరిగింది. క్రైస్తవం స్వీకరించిన దళితులు ఎస్సీ రిజర్వేషన్ పొందడాన్ని కత్తి మహేష్ ఒప్పుకోలేదు. అయితే మతం మారినా కులం మారడం లేదు కాబట్టి కులపరమైన రిజర్వేషన్లకు మతాన్ని ఆపాదించడాన్ని ఆయన తిరస్కరించాడు.

కత్తి మహేష్ కు రాజ్యాంగం పట్ల అమితమైన విశ్వాసం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం పట్ల ఆసక్తి వుంది. బహుజన దృక్పథంతో రాజకీయాలను విశ్లేషించడం చూస్తాం. ముఖ్యంగా బిజెపి అధికారంలోకి వొచ్చిన తర్వాత గోరక్షక దళాలు చేసిన దుర్మార్గమైన దాడులతో ప్రపంచ మంతా ఆందోళన చెందింది. అలాగే విద్యా కేంద్రాలలో ఆర్ఎస్ఎస్, బిజెపి భావజాలంతో విబేధించే విద్యార్థులు, ప్రొఫెసర్లను అరెస్టు చేసి జైలులో పెట్టడం ఎక్కువ అయ్యింది. ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో రోహిత్ వేముల హత్య జరిగినప్పుడు కత్తి మహేష్ చలించి పోయాడు. రోహిత్ వేముల ఆలోచనలను లోకానికి అర్థం చేయించడానికి తను ప్రయత్నం చేశాడు. అలాగే వరవరరావు, సాయిబాబ, హనీబాబు, స్టాన్ స్వామి, ఆనంద్ తేల్ తుంబ్డే వంటి వాళ్లను భీమా కొరేగావు కుట్ర కేసులో, ఇతర కల్పిత కేసులలో నిర్బంధించి, జైలులో యేళ్ల తరబడి పెట్టినప్పుడు తను ఒక ప్రజాస్వామ్య విశ్వాసిగా రాజ్య నిర్బంధాన్ని నిరసించాడు.

బిజెపి, దానికి మద్దతు ఇచ్చే అనేక సంస్థలు చేసే పలు రకాల చర్చలకు తాను సైద్ధాంతిక సమాధానం ఇచ్చాడు. ఆ క్రమంలో తను హైదరాబాదు నగర బహిష్కరణ కు గురయ్యాడు. అదే సమయంలో వివాదాస్పద స్వామి పరిపూర్ణానంద కూడా నగర బహిష్కరణకు గురయ్యాడు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టుకు వ్యతిరేకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బహుజన కవులు, రచయితలు, మేధావులు నిర్వహించిన సదస్సులో రాముడికి నెమలి కూర అంటే యిష్టమని, రామాయణంలో అనేక పాఠ్యాలు వున్నాయని అన్నాడు. ప్రజలు బహుముఖాలుగా చెప్పుకొనే రామాయాణాన్ని కాదని,  ఆర్ఎస్ఎస్ వర్షన్ను మాత్రమే అంతా ఒప్పుకోవాలని వాదించడం సరికాదని ఆ సదస్సులో మాట్లాడాడు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని అభియోగం మోపి, మూడు నెలలు కత్తి మహేష్ ను జైలులో నిర్బంధించారు తెలంగాణ పోలీసులు. ఆ సమయంలో నేను చొరవ తీసుకొని ఎఫ్ఐఆర్ కాపీ తెప్పించి తన సోదరికి అందేలా చేశాను. ఆ తర్వాత బెయిల్ మీద బయిటికి వొచ్చాక కలిసి మాట్లాడాను.

బహుజన రాజ్యాధికారం అనే భావన కార్యరూపం దాల్చడానికి ఏమి చేయాలో చర్చించాలని నేను ప్రయత్నాలు మొదలు పెట్టాను. మేధావులతో ఒక ఆంతరంగిక సమావేశం ఏర్పాటు చేశాను. చాలామంది ప్రముఖులు ఆ సమావేశానికి హాజరు అయ్యారు. కత్తి మహేష్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. కులం, ధనం రాజకీయాలను నడిపిస్తున్నాయని, ధనబలం లేకుండా బహుజన రాజకీయాలు చేయలేమని అన్నాడు. ఆ తర్వాత నేను ద్రవిడ బహుజన సమితి అనే ఒక పొలిటికల్ పార్టీని  ఏర్పాటు చేసి పని చేయడం మొదలు పెట్టాను. దళిత పంచాయతీ డిమాండ్ కు తను మద్దతు తెలిపాడు. నా ప్రయాణం సక్సెస్ కావాలని అభిలషించాడు.

కత్తి మహేష్ ఒక నిఖార్సయిన వ్యక్తి. ఎవరి సాయం కోసం ఎదురు చూడని పోరాట ధీరుడు. ఆలోచనలు సమాజాన్ని నడిపిస్తున్నాయి కాబట్టి, తిరోగమన ఆలోచనలు సమాజానికి హానీ చేస్తాయని భావించిన మేధావి. బతికినన్ని రోజులు సమాజ హితం కోరిన కరుణాశీలి. ఈ తెలుగు సమాజ చిత్తం మీద చెరిగిపోని సంతకం కత్తి మహేష్. సనాతన నాజీలు ఈ దేశాన్ని నాశనం చేస్తున్న సమయంలో, కత్తి మహేష్ లాగా పోరాడే మేధావులకు కొరత వుంటుందా?

*

జిలుకర శ్రీనివాస్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా గంభీరమైన విశ్లేషణ శ్రీనివాసు గారు. కత్తి మహేష్ తత్వం గురించి వ్యక్తిత్వం గురించి, వారి జ్ఞాన స్థాయి గురించి, మనువాదుల తనపైన చేసిన దాడులను ఎదుర్కొని ,దైర్యంగా నిలిచిన తీరును, మీరు ఆవిష్కారం చేసిని తీరు కత్తి స్థాయిని పెంచే విధంగా ఉంది.

  • సార్. . జ్ఞాన సంపన్నుడైన కత్తి మహేష్ గారు గురించి రాసినటువంటి వ్యాసం చాలా అద్భుతంగా ఉన్నది. అదేవిధంగా దళితుల మార్పు కోసం ఆయన పడిన కష్టాలు ఆవేదనలు కళ్ళకు కట్టినట్టు మీ వ్యాసంలో మాకు కనిపిస్తుంది ఆయన ఆశయాలను నెరవేర్చే దిశగా మనం ముందుకు వెళదాం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు