అటు ప్రపంచాన్నీ, ఇటు భారతదేశాన్నీ 1940-50ల నాటి దశాబ్దం అతలాకుతలం చేసింది. ఆ దశాబ్దంలోనే – లెనిన్‌గ్రాడ్ దిగ్బంధం, మాస్కోలో ఎర్రసైన్యాల ఎదురుదాడి, స్టాలిన్‌గ్రాడ్ విజయం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచాయి. అమెరికన్ల నాయకత్వంలో ఫ్రాన్సు విముక్తి జరిగింది. బెర్లిన్‌లో ఎర్రజెండా ఎగిరింది. నాజీ జర్మనీ ఘోరంగా ఓడిపోయింది. జపాన్‌మీద అమెరికా అణుబాంబులను ప్రయోగించింది.
మన దేశంలో – బ్రిటిష్, భారతీయ సేనలు ఇంఫాల్ వద్ద జపాన్ సైన్యాన్ని నిలువరించాయి. బర్మానుండి లక్షలాది భారతీయులు కట్టుబట్టలతో, కాలినడకన దేశానికి తిరిగివచ్చారు. ‘క్విట్ ఇండియా’ ఉద్యమం భారత దేశాన్ని కుదిపివేసింది. సుభాష్‌చంద్ర బోస్, బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు పక్కలో బల్లెం అయ్యాడు. బెంగాల్ కరువు ముప్ఫై లక్షల ప్రాణాలను బలి తీసుకుంది. ‘నావికుల తిరుగుబాటు’ విషాదాంతంగా ముగిసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందిగానీ, దేశవిభజన శాశ్వత విషాదాన్ని రగిలించింది. గాంధీజీని మతోన్మాదులు హత్యచేశారు.
యుద్ధానంతర కాలంలో – ఫాసిస్టుల అకృత్యాలు, జననష్టం వెలుగులోకి వచ్చాయి. బ్రిటిష్ ఆధిపత్యం అంతరించింది. సోషలిజం, కమ్యూనిజం ఆశాజ్యోతులుగా వెలిగాయి. అమెరికా, సోవియట్ యూనియన్‌లు అగ్రరాజ్యాలుగా అవతరించాయి; ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది.
పై పరిణామాలు భారతీయులందరిపైనా ఏదో ఒకమేరకు తన ప్రభావాన్ని చూపాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, బర్మా కాందిశీకుల అనుభవాలకు సాహిత్యంలో, సామాజికశాస్త్ర పరిశోధనలలో తగిన స్థానం, ప్రాచుర్యం లభించలేదు. ఆ దశాబ్దపు సంక్షోభాన్ని ఆధారంగా చేసుకొని బర్మా విషాదంపై నవలను వ్రాయాలనే ప్రగాఢమైన కోరిక ఈ రచనకు దారితీసింది.
-ooo-
ప్రపంచవ్యాప్తంగా – సామ్రాజ్యవాద దేశాలకు వ్యవసాయ కూలీలు, శ్రామికులు అవసరం అయ్యారు. వరి, గోధుమ పంటలకే కాకుండా ప్రత్తి, చెరుకు, టేకు, వెదురు, రబ్బరు, కాఫీ, టీ, ద్రాక్ష, పండ్లు, కూరగాయలు – ఈ తోటల్లో వారి సేవలు అత్యవసరం అయ్యాయి. అప్పటికే బానిసవ్యవస్థ రద్దయింది. వ్యావసాయక నిపుణత కలిగిన భారతీయ శ్రామికుల్ని పెద్ద ఎత్తున ప్రపంచం నలుమూలలకీ ఎగుమతి చెయ్యడానికి ‘కూలీ ఓడలు’ వినియోగింపబడ్డాయి.
కూలీ వ్యవస్థ (indentured labour) నిషేధించబడే నాటికి (1920) సుమారు 13 లక్షల మంది భారతీయ వ్యవసాయ కూలీలు వలస దేశాలకు ‘ఎగుమతి’ అయ్యారు. ఆ తరువాతి ప్రవాసాలన్నీ ఉపాధి కోసం చేసిన స్వచ్ఛంద ప్రయాణాలే. వ్యవస్థ ఏదైనప్పటికీ, ఆ శ్రమజీవులకు చదువు లేదు. వీసాలు, కాంట్రాక్టులు, హక్కులు, కనీస భద్రత లేవు.
ఆ కోవకి చెందిన వ్యవసాయ కూలీలను అందించిన ప్రాంతం, ఆర్థికంగా వెనుకబడిన, వర్షాధార ప్రాంతమైన కళింగాంధ్ర; ముఖ్యంగా – ఇచ్ఛాపురం, టెక్కలి పట్టణాల మధ్య ఉన్న తీర, మైదాన ప్రాంతమైన ఉద్దానం. (ఉద్యానం నుండి ఉద్దానం అనే పదం పుట్టిందంటారు).
-ooo-
రెండు దశాబ్దాలబాటు (1920-1940) సుందర స్వప్నంగా నిలిచిన బర్మాదేశం, రెండవ ప్రపంచ యుద్ధంతో పీడకలగా మారి, విషాద వృత్తాంతంగా మిగిలిపోయింది. అసంఖ్యాకులైన సామాన్యుల ప్రాణాలను బలిగొన్న బాటల వెంట, ఆనవాళ్లు లేకుండా చెదరిపోయిన వారి పాదముద్రలకై మొదలుపెట్టిన అన్వేషణ ఈ ప్రయత్నం.
అయితే గతాన్ని తలచి వగచుట ఈ నవల లక్ష్యంకాదు. రెండవ ప్రపంచ యుద్ధంతో మానవ సమాజం త్వరితగతిన మారిపోయిందనీ, ఈ మార్పులను కొన్నిశక్తులు నడిపిస్తున్నాయనీ, వాటిపట్ల జాగరూకతను కలిగి ఉండాలనీ హెచ్చరించడం దీని ముఖ్యోద్దేశ్యం.
*
నవల నుంచి…
“నల్లదారి బాగా ఉత్తరానికి పోతుంది. దట్టమైన అడవి, నిట్టనిలువుగా ఉండే ఎత్తైన కొండలు దాటుకుంటూ వెళ్లాలి. పెద్ద నదులేవీ తగల్లేదు; వాగులు, గెడ్డలూ చాలానే దాటాం. కాలిబాటలు అక్కడక్కడ కనిపిస్తాయిగానీ, రోడ్డంటూ లేదు. ఆ దారిన వెళ్లినవాళ్లెవరూ ఉండరు; అందరికీ కొత్తే. ఎప్పుడైనా స్థానికులు కనబడితే వాళ్లని అడగడమే. మన భాష వాళ్లకి రాదు; వాళ్ల భాష మనకి తెలీదు.”
“తెల్లదారిలో వస్తూ రాత్రిపూట మంటలు వేసుకొనేవాళ్లం. జంతుభయంతో,” అన్నాడు, రాంబాబు.
Very interesting. Love to read the book