ఉక్క పోతనుంచి ఎగసిన లావా!

   ఒక సాంస్కృతిక కార్యకర్త అకడమిక్ గా మారాక రాయగూడని రాయలేని తనం నుండి చీల్చుకుని వచ్చినవి. 

  తం ముసుగు తీసుకుని రంకెలు వేస్తున్న పాడు కాలం ఇది. కులాల మతాల మధ్య  కుంపట్లు రాజేస్తున్న కాలం ఇది.  ఒక వైపు దేశాల మధ్య సరిహద్దుల్లో యేలాడుతున్న కళేబరాలు. మరో వైపు దేశం లోపల మనుషుల మధ్య కట్టబడిన బారికేడ్ల కు యేలాడుతున్న శవాలు. భూమిని నమ్ముకున్న రైతు తన పంటకు గిట్టుబాట ధర కావాలి అని నగరం దిగ్బంధనం చేసిన సంక్షుబిత కాలం లో బారికేడ్ల మధ్య రగిలే లావాలాగా ఎగజిమ్ముతున్న అసమ్మతిస్వరాల చుట్టూ కంచెలు.  దేశాల మధ్య వేలాడుతున్న కంచెలు కంచెకు  వేలాడుతున్న కళేబరాలు . మన దేశభక్తి ని కొలవాలి అంటే ఎదుటి దేశాన్ని దునుమాడడం మినహా మరే ప్రమాణాలు లేని కాలంలో  జాతి, వర్ణ, లింగ కుల వివక్ష పరివ్యాప్తం అయిన కాలం లో కంటికి కనబడని వైరస్ ఏదో ప్రపంచ మానవాళిని  మనం  కనిపెట్టిన విజ్ఞాన శాస్త్రాన్ని సవాలు చేస్తున్న కాలం లో ఆ ఉక్క పోతనుంచి తాను రాసుకున్న లావానే బ్రహ్మ ప్రకాష్ రాసిన బాడి ఆన్ ద బారికేడ్స్ అనే పుస్తకం.

రెండు నెలల కింద లెఫ్ట్ వర్డ్  ప్రచురించిన రెండు వందల పేజీల ఈ పుస్తకం వివిధ సందర్భాలలో ఎనిమిది వేరు వేరు వ్యాసాలు గా రాసుకున్నప్పటికీ మొత్తం పుస్తకం ఒక దీర్ఘ కావ్యంలా దృశ్య కావ్యంగా  ఏకబిగిన చదవ గలిగేలా రిథమిక్ గా రాసుకున్నాడు. ఇది వచనంలో ఉన్నప్పటికీ కవిత్వమా , తత్వమా, ఆవేదననా , భావావేశమా ఆక్రోశమూ కలగలిపి ఒక దీర్ఘ కావ్యం చదివిన అనుభూతి. అవి ఒక ప్రణాళికాబద్ధమైన ఎత్తుగడ తో రాసుకున్నవా ?  అలవోకగా రాసుకున్నవా అనలేము  కానీ గడిచిన దశాబ్ద కాలంలో జరిగిన అన్ని అలజడుల మీద అతని తక్షణ స్పందన ఉంది.  ప్రచురణ కర్తలు ఆ అకడమిక్ సంవిధానంలో ఉన్న సందిగ్థత గురించి అడిగారు. ఇద్దరు ముగ్గురు ప్రచురణ కర్తలు గిరాటు వేసారు. దానికి కారణం అది నిందా స్తుతి నా ఇంకా ఏదన్నా ప్రక్రియ నా గుచ్చి గుఛ౮ఇ మరీ అడిగారు. అదే ప్రచురణ కర్తలు ఒక రెండు నెలలలోనే మూడో ముద్రణను జీర్ణం చేసుకోలేక పోతున్నారు. ఒక వైపు బయట పౌర సమాజం మరో వైపు దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ద విశ్వవిద్యాలయాలు ఆ పుస్తకం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికి కలకత్తా, ఢిల్లీ, బెంగళూరు హైదరాబాద్ లో నల్సార్, ఎఫ్లూ, హైదారాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రాంగణాల లో అనేక ఇంటర్ డేసిప్లినరీ పండితులు చర్చ చేస్తున్నారు. ఇది అకడమిక్ బౌండరీల మధ్య లేదు అని గిరాటేసిన పుస్తకానికి లభించిన ఆదరణ  నేను స్వయంగా హైదరాబాద్ లో జరిగిన చర్చ లో పాల్గొన్న.  ఏముంది ఈ పుస్తకంలో ?!  అసహనం పరివ్యాప్తం ఐన చోట, హక్కులు నిరాకరించ బడుతున్న పాడు కాలాన,  ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్న సమయాన, కట్టే బట్ట తినే తిండి విషమ పరీక్షలకు దాడులకు గురి అవుతున్నప్పుడు, పుట్టి పెరిగిన వూరు తినేందుకు తిండి ఉండేందుకు ఆవాసం ఇవ్వనప్పుడు వలస అనివార్యం అయినప్పుడు కోట్లాది మంది విస్తాపితులుగా మారి నప్పుడు అ వలసకూలీల స్వప్నం కునారి ల్లుతున్న దగ్గర, సామాజిక న్యాయం కరువైన కాడ, ఒక కలవరింత, వలపోత, ప్రతిఘటనల సమాహారం తో కూడిన మద్దతు వాక్యాలు ఇవి . బ్రహ్మ ప్రకాష్ ఈజీ చైర్ రాతలకు మాత్రమె పరిమితం అయిన బద్ర లోక్ బాబూ కాదు. ఒక నాడు ప్రపంచానికి శాంతిని సహనాన్ని ప్రసాదించి అశాంతికి నిలయం భూమి పుత్రుల శోకానికి కారణం అయిన హంతక భూమిహార్ పదఘట్టన ల మధ్య పుట్టి పెరిగిన వాడు కనుక పోరాటం కేవలం ఆదర్శం అని కాకుండా అవసరంగా భావించిన వాడు  .

ఒక సాంస్కృతిక కార్యకర్త అకడమిక్ గా మారాక రాయగూడని,రాయలేని తనంనుండి చీల్చుకుని వచ్చినరాతలు ఇవి జగమంతా  చిమ్మచీకటి ఆవరించిన చోట  ఒక వెలుతురు లాంటిది’ ఈ పుస్తకం  అన్న అరుంధతి రాయ్ మాటలు అక్షర సత్యాలు.

‘వివక్ష పీడన పరివ్యాప్తం అయిన చోట, హింస వ్యవస్థీకృత మైన చోట, గుడికీ బడికీ నిన్ను దూరంగా నెట్టి వేసిన చోట, నువ్వు ఎకలవ్యుడివి అవుతావు. నీ తలపోతలు నువ్వే అల్లుకోవాలి. అలా నేను నాకు చదువు చెప్పని గురువులను అనుసరిస్తూ వచ్చాను వాళ్ళ వెలుగులో నన్ను నేను రాజేసుకున్నాను. నిప్పుల కొలిమిలో నా  పనిముట్లను నేనే తయారు చేసుకున్నాను’. అని తన ముందుమాట లో రాసుకున్నాడు . రాసే క్రమం లో తనను నడిపించిన చోదక శక్తులు దానికి వెన్నుదన్నుగా ఉన్న తాత్విక చింతనలు చెప్పే క్రమంలో  జాన్ బెర్గేర్ నాకో ప్రాపంచిక దృక్పదాన్ని ఇచ్చాడు అనీ . అరుంధతి రాయ్ వాక్య విన్యాసాన్ని నేర్పింది. బెల్ హుక్స్ నన్ను కన్న తల్లిలా సాకి,  రాతలో అర్ధాన్ని పరమార్ధాన్ని విడమర్చి చెప్పి మన రాత ఏ లక్ష్యం కోసమో అంటూ  ఒక లక్ష్యాన్ని ఇచ్చింది అంటూ,  ‘వేలాది వాక్యాలు రాయడం కన్నా వాటికి ప్రాణం పోయడం ముఖ్యం’ అని అమరుడు గద్దర్ నుండి నేర్చుకున్న అంటాడు.  మార్క్స్ పదాలకున్న శక్తి జీవన సారాన్ని చెబితే, సార్త్రే జీవితానికి ఉన్న సత్యాన్ని స్వేఛ్చ గురించి, అంబేద్కర్ కుల నిర్మూలనా సారాన్ని గురించి,  పదాలకు ఎగిరే శక్తిని ఇచ్చిన టోని మారిసన్ పదాల మూలంగా ఒనగూరె సాంత్వన తోబాటు అవి మానవ ఇతిహాస తంత్రులను మీటే సాధనాలు నాకు అయ్యాయి అని  వినమ్రంగా చెప్పుకున్న  బ్రహ్మ ప్రకాష్.

తన పరిశోధన మొదట అత్యయక స్థితి తర్వాత దేశవ్యాప్తంగా బయలుదేరిన సాంస్కృతిక రంగం లో జరిగిన పోరాటాల నేపధ్యంలో కళారంగం పాత్ర గురించి లోతైన పరిశోధన చేసాడు. చైనీస్  ఈస్తటిక్స్ అధ్యయనం చేసిన బ్రహ్మ ప్రకాష్ మొదట నేషనల్ యూనివర్సిటీ తైవాన్ లో చైనీస్,  తర్వాత జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లో కొంత కాలం,చివరిగా లండన్ రాయల్ హాల్ వే లో పరిశోధన చేశాడు. ‘కల్చరల్ లేబర్’ అనే తన సిద్దాంత గ్రంధం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు ప్రచురించారు.  అతను  ఇప్పుడు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో స్కూల్ అఫ్ ఆర్ట్ ఈస్తటిక్స్ ఫిలాసఫిలో అసిస్టెంట్ ప్రొఫెసర్. నాకు రెండేళ్ళు సీనియర్.

ప్రజా ఉద్యమాలలో పాట అనే అంశం మీద బీహార్, తెలంగాణ లో నడిచిన కొనసాగుతున్న సాంస్కృతిక ఉద్యమాల కేంద్రంగా చేసిన తన పరిశోధన  ఆక్స్ఫర్డ్  యూనివర్సిటీ ప్రెస్  నాలుగేళ్ల కింద కల్చరల్ లేబర్ పేరుతో ప్రచురించారు. బ్రహ్మ ప్రకాష్ తన సహచరి శర్మిష్ట  స్వతహాగా సాంస్కృతిక ఉద్యమాలతో  నడిచారు. ఆమె అర్బన్ ఫోక్ లో స్రష్ట . జవహర్ లాన్ నెహ్రూ విశ్వవిద్యాలయం లో విప్లవ సాంస్కృతిక సంస్థ ను స్థాపించి అందులో భాగమై  పార్టిసిపెంట్  అబ్జర్వర్ గా తాను నమ్మింది ఆచరించి చూపాడు.  తెలంగాణ ప్రజా ఉద్యమం, జననాట్యమండలి, ముఖ్యంగా గద్దర్ కేంద్రంగా ఒక ప్రత్యేక అధ్యాయం రాయడమే కాకుండా బీహార్, తెలంగాణ, మహారాష్ట్ర, దండకారణ్యం చుట్టూ అల్లబడిన ప్రజా పోరాటాల ప్రేరణతో నడుస్తున్న సాంస్కృతిక ఉద్యమాలను  అధ్యయనం చేశాడు. ఇప్పటి వరకు ప్రజా కళల మీద ఎంతో మంది ఎన్నో వేల పేజీలు రాసి ఉంటారు. గద్దర్ మీద నా  మిత్రుడు  రాసినంత ప్రభావవంతంగా ఇక్కడ ఆయా ఉద్యమాల లో బాగమై న వాళ్ళు  ఎందుకు రాయలేదో తన సిద్దాంత గ్రంధాన్ని తిరగేస్తుంటే అర్ధం అయ్యింది.

కులం వికట్ట హాసం చేసే విప్లవ వీధుల్లో అటువంటి పరిశోధన ఆశించడం అత్యాశ. నా దోస్త్ స్వతహాగా విప్లవ అభిమాని, గాయకుడు నాయకుడు అందునా లండన్ రాయల్ హాల్ వే , యూనివర్సిటీ అఫ్ లండన్ లాంటి ఒక బలమైన కేంద్రం లో చదువు తనకు మంచి తాత్విక చింతన మాత్రమె కాకుండా రచయితను కూడా చేసింది. అన్నిటికన్నా తాను నమ్మి ఆచరించిన అంశాలనే పరిశోధన అంశం గా స్వీకరించడం మూలంగా సాధికారమైన సిద్దాంత గ్రంధాన్ని రాయగలిగాడు. మంచి వచనం లిరికల్ బ్యూటీ దానికి అదనపు సొబగు.

తన బాల్యం నుండీ చూస్తున్న వ్యవస్థీకృత హింసను పీడనను తన చుట్టూ అనుభవించిన నెత్తుటి గాయాలను గుర్తెరిగిన వాడు కనుకనే తాను పెరిగిన  బీహార్ తర్వాత తన యవ్వన కాలంలో తను భాగమైన ప్రజా ఉద్యమాలు, ఇప్పుడు ఒక అధ్యాపకుడిగా తన చుట్టూ జరుగుతున్న దేశ రాజధాని కేంద్రంగా జరిగిన అన్ని అలజడుల సారాన్ని ఒడిసిపట్టి రాసాడు. ఆయన రచనలు కేవలం రొడ్ద కొట్టుడు అకడమిక్ రాత మాత్రమె కాదు సిలిగురి, తెబాగ, బస్తర్, తెలంగాణ వ్యాప్తంగా త్యాగాలు చేసిన కళారంగాన్ని ఔపోసన పట్టిన ప్రామాణికమైన సిద్దాంత గ్రంధం రాసిన బ్రహ్మ ప్రకాష్ రెండో పుస్తకం బాడీ ఆన్ ది బారికేడ్స్.

బ్రహ్మ ప్రకాష్ బీహార్ లోని పాట్నా దగ్గర గంజ్ పర్ లో  నలంద విశ్వవిద్యాలయ శిధిలాల మధ్య పెరిగిన వాడు. ఆగ్రహించిన గంగలో ఆవిరైన ఆశల సేద్యాన్ని కన్నీళ్లను దిగమింగినవాడు. బాల్యం లోనే తన తండ్రి చనిపోగా ఇంటికి నిట్టాడై  తనను పెంచిన తల్లి  సోనాదేవి చెప్పిన కథల అనుభవాల ను జోలెలో వేసుకొని విద్యా బిక్ష కోసం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మెట్లెక్కినాడు ఆధిపత్య బీహార్ రణబీర్ సేన భూమిహార్ ల అహంకారాల మధ్య నలిగిన జీవితాలను చూస్తూ పెరిగాడు.

తన నెత్తురు చెమట సాకబోసిన తల్లికి ఈ పుస్తకం అంకితం ఇచ్చాడు.  ఒక వైపు మండల్ మరో వైపు కమండల్ అల్లర్ల మధ్య తన బ్రతుకు అక్షరాలను ప్రోదిచేసుకున్నాడు.  ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అలజడులు ఆందోళనలు, కళా ఉద్యమాలు, సాంస్కృతిక. ప్రజా  ఉద్యమాలు, పురాణ పాత్రలు కలగలిసి ఉంటాయి తన రచనల్లో. ఆ క్రమం లోనే ‘చరిత్ర లో వధ అనే భావన ఎప్పుడు మొదలై ఉండొచ్చు అంటూ జమదగ్ని తన కొడుకు పరుశరామున్ని కన్న  తల్లిని కత్తికి ఖండ ఖండాలుగా నరకమని ఆదేశించిన ప్పుడు కదా హింస మొదలైంది అంటాడు.  గాంధీ ప్రవచించిన మూడు కోతుల చెడు వినని, కనని,చూడని చింతనల మధ్య  దేశంలో  వర్తమాన రాజకీయాలలో జీవించే హక్కుకోసం నినదించే , కళలు సంస్కృతులు ఫరిడవిల్లాలి అని నినదించే నేపథ్యం లో రాయబడిన ఈ పుస్తకం పాండమిక్, షహీన్ బాగ్, నిప్పుల కుంపటిలా మండుతున్న విశ్వవిద్యాలయ ప్రాంగణాలు, డిల్లీ వీధుల్లో కదన రంగంలో తమ హక్కుల కోసం పోరాడిన సఫాయీ కార్మికుల ఆకలి కేకలు. బస్తర్ ఆదివాసీలు, కాశ్మీరీ ఆందోళనలు, మేధావుల నెత్తిమీద వేలాడుతున్న కత్తి  సాక్షిగా రాసిన ఈ పుస్తకం మీద చర్చ మొన్న నల్సార్ విశ్వవిద్యాలయంలో,  తర్వాత ఎఫ్లూ లో,  ఆ తరవాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిచయ సభ నాకు తెలిసి కలకత్తా ఢిల్లీ ఇంకా చాలా చోట్ల ఈ పుస్తకం గురించి మాట్లాడుతున్నారు.

ఒక్కదగ్గర పెట్టి చూస్తే  వేరువేరు అంశాలు అయినప్పటికీ ఒక దశాబ్ద కాలంలో దేశంలో పెరిగిన అనిశ్చితి కి అక్షర రూపం ఈ. పుస్తకం . ఆశ నిరాశ లమధ్య కొట్టిమిట్టాడుతున్న కాలం లో మన శ్వాశ మనం  స్వేచ్చగా పీల్చలేని చోట ఎలా కట్టడి చేయబడ్డామో పౌర సమాజం రాజకీయంగా మానసికంగా ఒక సంక్షుభిత కాలంలో కి ఎలా నెట్టివేయ బడ్డదో. ఇంటికీ బయటకీ చెందని వలస కార్మికుల పరదేసీ బ్రతుకు యుద్ధం గురించి వందలాది కిలోమీటర్ల మేరా నడిచిన రక్త సిక్తమైన పాదాల కోసం పరామర్శ  ఉంది. బారికేడ్ అనేది ఆయన రెండో పుస్తకంలో ప్రధాన ఇతివృత్తం. మన కుత్తుకలను నియంత్రిస్తున్న రాజ్య నిర్భంధం, స్వేచ్చకై  తపిస్తున్న మేధావులను ఏళ్ళకు ఏళ్ళుగా జైళ్ళ లో కుక్కేసిన బారికేడ్లు , ఇందులో  హక్కుల కార్యకర్తలు,  మేధావులు, ప్రజా కవుల మీద ప్రయోగించిన తప్పుడు కేసులు మూలంగా ప్రజాస్వామ్యం ఎలా అపహాస్యానికి గురి అవుతుందో  షాహీన్ బాఘ్ లో పెల్లుబికిన ఆందోళన, ఘజియాబాద్ లో యాడాది కాలంగా కొనసాగిన రైతుల ఆక్రందన. హత్రాస్ ఘటన అనంతరం జరిగిన ఘటనల సమాహారం.

ఈ పుస్తకం లో చివరి వ్యాసం చివరి వ్యాసం నాకు బాగా నచ్చింది.

మృత్యువునివాళి,సంఘీభావం

(డెత్ మౌర్నింగ్ అండ్ సాలిడారిటీ)

ఒక వైపు పాండమిక్ చావులు మరో వైపు రాజ్య పీడన లో నమోదు అవుతున్న అసహజ మరణాలు ఏదో ఒక రూపంలో చావు వార్త   నీ తలుపు తట్టినప్పుడు, ఏడ్చేందుకు నీకు కన్నీళ్లు ఇంకినప్పుడు. కోల్పోతున్న ప్రతి నిష్క్రమణ నిన్ను కుదిపి కుదేలు చేసినప్పుడు అసలు ఏడ్వ కూడదు అంటాడు.  నీ చుట్టూ నిస్సత్తువ ఆవహించి నప్పుడు ,నీ కుత్తుక నుత్తరించు నపుడు, నీ ఉనికి నడక నడత శ్వాసని కూడా నియంత్రణ చేసినప్పుడు ఏం చేస్తావ్ ? అని అడుగుతాడు. అందుకె ఢిల్లీ, కశ్మీర్ తెలంగాణ , ఉత్తర్ ప్రదేశ్ చోటెక్కడ అయిన కావొచ్చు మీరు కోల్పోయిన సహచరుల కోసం, ఒక సంఘీభావం కోసం కూడా నువ్వు కొట్లాడాల్సి వస్తోంది . గుర్తుందా తప్పుడు ఎన్కౌంటర్ లో చనిపోయిన ఒక అమరుని బాడీ ని ఇవ్వకుంటే గద్దర్ వెళ్లి ఆ కాడి మీద పడుకొని ముందు నన్ను కాల్చి తర్వాత మీరు చేయాల్సింది చేసుకోండి అని నినదించిన సాహసం గుర్తుందా బిడ్డా ?? అలాంటి పరంపర మిగిల్చిన కాలం మనం దాటి వచ్చాం. ఒక చోట నీ వలపోత మొదలు కాకముందే నీ వాళ్ళు మాయం అవుతారు అంటాడు అలా మాయం అయిన వాడు ఉన్నాడో పోయాడో తెలియదు కనీసం శవం అయినా వస్తుందా అనే వెతుకులాట. మణిపూర్, కాశ్మీర్, బస్తర్, ఎన్ని కాన్సన్ట్రేషన్ క్యాంపు లు బారికేడ్లు గా విస్తరించాయి నేడు ?

బొంద తీసి పోయిన వాడి కోసం ఎదురు చూసే ఘటనలు ఎన్ని చూసి ఉంటది జీలం నది అంటాడు. ఫయీమ్ అబ్దుల్లా రాసిన ‘జీలం రొయా’ ని ఆశ్రయిస్తాడు

జీలం రోదిస్తోంది జీలం రోదిస్తోంది

కాశ్మీర్ కోసం ఏడుస్తోంది

అందరూ పోయారు

అందరూ కనుమరుగు అయ్యారు. 

బ్రతికున్న వాళ్ళు కూడా

రాబోయే మృత్యువు గురించి

ప్రతిరోజూ రోదిస్తున్నారు.

తీహార్ జైలులో ఉరితీయ బడి జైలు లోనే ఖననం కాబడిన ముఖ్బుల్ భట్  కోసం తనవాళ్ళు తన ఊరి కబరస్థాన్ లో తవ్వబడిన స్మారక  ఫలకం మీద –

‘ఈ సమాధి నీ పార్ధివ దేహం కోసం ఎదురు చూస్తోంది” అని దశాబ్దాల కింద రాసి ఉన్న స్మారక ఫలకాన్ని గురించి రాస్తాడు.  అందుకే మనం ఎందుకు ఎవరి కోసం ఏడుస్తున్నాం కోల్పోయిన మన సహచరుల కోసమా?  వ్యవస్థాగత వైఫల్యాల కోసం ఏడుస్తున్నారా అని అడుగుతారు. నమ్మిన విశ్వాసం కోసం పోయిన వాళ్ళ కోసం ఏడుస్తాం ఇప్పుడు రాజ్యమే ఏడ్పుని రాజకీయం చేస్తోంది కానీ ఒక సంస్మరణ సభ కోసం కూడా ఆంక్షలు ఎందుకు పారివ్యాప్తం అయ్యాయి అని అడుగుతున్నాడు.

చావు పరివ్యాప్తం అయిన చోట ఎన్ని చావులని లెక్కిస్తావ్ ? ఎన్ని చావుల కోసం రోదిస్తావ్ ? ఎన్ని కాయాలను కాలుస్తావ్  ? ఎన్ని శవాలను పాతిపెడతావ్ ? ఒక్కరా ఇద్దరా ఎందరో…నమ్మిన విశ్వాసాల కోసం ప్రాణాలు ఇస్తున్నారు కదా అన్ని చావులు ఎందుకు ఒక్కటి కావెందుకు అంటాడు .

కానీ అదే పాలక వర్గం కొన్ని శవాలను రాజ్య లాంచనాలతో సాగనంపుతారు, దేశ రక్షణ లో రాజకీయ పావులుగా మారి ప్రాణాలు కోల్పోయిన శవాలను తమ రాజకీయానికి వాడుకునే అదే రాజ్యం ఒక అత్యాచార బాదితురాలి కోసమో, కుల హింస లో అర్ధంతరంగా చంపబడిన వాళ్లకు ఎందుకు గౌరవం ఇవ్వడం  లేదు. ‘ప్రత్యామ్నాయ రాజకీయాలలో అసువులు బాసిన అమరుల కోసం చిన్న స్థూపం కట్టుకోవడమో, చిన్న కలయికను కూడా ఎందుకు సహించడం లేదు’ అని నిలదీసి అడుగుతాడు. గుర్తుందా   శివసాగర్ అనలేదు ”నువ్వు చస్తే వీరజవాన్ బ్రతికొస్తే  మాల జవాన్’ అని’ మృత్యువు పరివ్యాప్తం అయిన చోట మనం ప్రకటించే నివాళి వెనక దాగున్న అంతర్గత రాజకీయాలను నిక్కచ్చిగా ఈ పుస్తకం లో నమోదు చేశాడు.

*

గుర్రం సీతారాములు

పుట్టెడు పేదరికంలోంచి వచ్చి, కష్టపడి చదువుకొని, ప్రతిష్టాత్మకమైన ఇఫ్లు నుంచి డాక్టరేట్ అందుకున్న బుద్ధిజీవి గుర్రం సీతారాములు. సామాజిక సాంస్కృతిక పోరాటాల మీదా, ప్రతిఘటన రాజకీయాల మీద సునిశితమైన అవగాహన వున్న కల్చరల్ క్రిటిక్-- బహుశా, తెలుగులో ఆ భావనకి సరైన నిర్వచనం అతనే.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు