దోస్తాయెవస్కీ ఎవరంటే… తన రాతలతో ప్రపంచాన్ని దుఃఖపు లోతుల్లో ముంచినవాడు. మేధను, పిచ్చితనాన్ని కలగాపులగం చేసిన వాడు.
దుఃఖంలో ఓదార్పు వెతుక్కున్నవాడు. అలాంటివాడు ఏది రాసినా మన లోపలి దుఃఖపు తెర ఏదో సిగ్గుగా అనిపించినా చిన్న పిల్లల్లా వెక్కి వెక్కి ఏడ్చేలా చేస్తుంది.
ఇక ‘ఇడియట్ ‘విషయానికి వస్తే… మనిషి జీవితంలో మేధస్సుకి-అమాయకత్వానికి మధ్య ఒక ప్రత్యక్ష లంకె కడితే అదే దోస్తాయెవస్కీ ‘ఇడియట్’ రచన. మూర్ఖత్వాన్ని, లోకజ్ఞానం లేని తనాన్ని, పిచ్చి తనాన్ని మేధో సంపత్తిగా భ్రమింపజేయడంలోనే దోస్తాయెవస్కీ ఇందులో విజయం సాధించాడు. అందుకే ఈ నవల అంటే నాకు ఇష్టం, ఈ నవలే కాదు దోస్తాయెవస్కీ రాసింది ఏదైనా ఇష్టమే!
ఇక ఈ వేణుగోపాల్ గారూ ఎవరూ? ఒక లాయర్. వృత్తి రీత్యా ఎంతో బిజీ. అక్షరాల్లోకి ప్రవేశిస్తూనే సరాసరి దోస్తోయెవస్కీతో దోస్తీ కట్టి ‘ఇడియట్’ను అనువాదం చేశారు. అస్సలు అనువాదానికి లొంగనని మొండిగా ఉండే దోస్తాయెవస్కీ పాత్రలు, కథలను తన దారికి బుజ్జగించో, అదిలించో… ఎలాగో ఆ పాత్రల లోకాన్ని పట్టుకుని వందల ఏళ్ళ అవతలకి మనల్ని లాక్కుపోయారు వేణుగోపాల్ గారూ ఈ అనువాదంతో. ఈ సందర్భంగా ఆయనతో నాలుగు మాటలు-
*
మొట్టమొదటి అనువాదమే దోస్తాయెవస్కీ ‘ఇడియట్’ కావడం ఒక పెద్ద బాధ్యత. ఈ బాధ్యతను మీరు సక్రమంగానే నెరవేర్చాననుకుంటున్నారా?
నేను “ఇడియట్”ను అనువదించడం బాధ్యత కంటే, ఒక రకమైన ఉత్సుకతతో ,అభిరుచితో చేశాను. నిజానికి నేను ఆ నవల మూల ప్రతి చూచేవరకూ దాని విస్తృతి నాకు తెలియదు. అంత పెద్ద నవల నేనెక్కడ చేసేది అని మిన్నకుండిపోయాను. కానీ మిత్రుడైన కూనపరాజు కుమార్ ఒత్తిడితో దాన్ని పూర్తి చేయగలిగాను. అయితే పూర్తయ్యాక సంతృప్తి కలిగింది.
ఇడియట్ అనువాదంలో ప్రిన్స్ కాకుండా ఏ పాత్ర మిమ్మల్ని వెంటాడింది?
ఇడియట్ నవలలో “అగ్లాయా ఇవనోవనా” పాత్ర మనల్ని ‘నస్టస్య’తర్వాత బాగా వెన్నాడుతుంది. అమాయకంగా అనిపించే ఆ పాత్ర చాలా తెలివైనది. అలాంటి అమ్మాయిలను నేనెరుగుదును. నిర్ణయాలను తీసుకునే శక్తి కొరవడిన ఆ పాత్ర మీద మనకు విపరీతమైన జాలి కలుగుతుంది.
జీవితపు విషాదమే ఎక్కువ నిండిన ఈ నవల అనువాదం ఈ తరపు పాఠకులకు ఎందుకు అవసరం అనుకుంటున్నారు?
ఇది చాలా అవసరమైన ప్రశ్న. విషాదం లేనిదెక్కడ? సంతోషాన్నానుకుని విషాదమే ఉంటుంది. అయితే యే పరిస్థితులనయితే మనం ఎదుర్కోబోతుంటామో వాటిని సక్రమంగా హ్యాండిల్ చేయలేకపోతే విషాదం కమ్ముకుంటుంది. అది ఈ నవలలో ప్రతి పాత్ర ద్వారా మనకవగతమవుతుంది.ఈ తరం పాఠకులు ఈ నవల చదివితే సంతోష, విషాదాలను ఎలా స్వీకరించాలో అర్థం చేసుకోగలుగుతారు.
అనువాదం చేస్తున్నప్పుడు మీకు ఎదురైన సవాళ్ళు ఏమిటి?
అనువాదం చేస్తున్నప్పుడు నేను ఎదుర్కొన్న సమస్య సమయం.ఎక్కడి సమయమూ చాలేది కాదు. నాకు ఉన్న అలవాట్ల మూలంగా అది ఇంకా ఎక్కువయ్యేది. భాష ఇంగ్లీషు అనువాదాలు ఒక అయిదు దగ్గర పెట్టుకున్నాను. ఒక్కొక్క చోట ఒక్కో రచయిత ఒక్కోలా వ్యక్తపరిచాడు.దాన్ని సరిగ్గా ఆకళింపు చేసుకునేసరికి చాలా సమయం పట్టేది. ఒక్కోసారి ఒక్కో పేజీ చేయడానికి ఒకరోజు పట్టేది, ఒక్కోసారి ఒక రోజులో 20 పేజీలు చేసేవాణ్ణి. ఒక ఇస్లాం సామెత అదీ. కేవలం నాలుగు వాక్యాలు అనువాదం చేయడానికి అరపూట తీసుకున్నాను.
ఇడియట్ లో ప్రిన్స్ ఇప్పుడు మీ పక్కనే ఉంటే మీరు అతన్ని మేధావిలా చూస్తారా, మూర్ఖుడిగా చూస్తారా?
డెఫినెట్ గా మేధోమూర్ఖుడనిపిస్తాడు. యే దశలోనూ ఇప్పటి విలువలపరంగా ఈ సమాజానికి ఫిట్ అవ్వడు. అతని నిగ్రహశక్తి, అతని మేధో సంపత్తి, ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగని అతని గుణం చూస్తే ముచ్చటేస్తుంది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని ‘మూర్ఖుడు’అనుకోలేను.
*
Add comment