ఈ సమాజం మరో జార్జిరెడ్డిని సృష్టించగలదా?!

నాకు విప్లవం అంటే ఇష్టం. విప్లవం కంటే ముందు విప్లవకారులను ఇష్టపడ్డాను. ఏమీ తెలియకుండానే పీడియస్యూ (PDSU) ని ప్రేమించాను. 1978 ఖమ్మం జిల్లా మధిర గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకునే రోజులు. అప్పటికే ఆ కాలేజీలో ASFI, SFI సంఘాలు పని చేస్తున్నాయి.  ఎస్. ఎఫ్, ఐ త రపున మా కజిన్  కాలేజీ ప్రసిడెంట్ గా గెలిచి వున్నాడు. మాసిన గడ్డం, మాసిన బట్టలతో హాస్టల్ కి సాయంత్రం ఒక యువకుడు వొచ్చాడు. డిగ్రీ పాసై వుద్యోగం లేక రోడ్ల మీద తిరుగుతున్న మా చుట్టాల అబ్బాయిలాగా వున్నాడు ఆ యువకుడు. మాలో కొంత మందిని కలిసాడు.  ఏదో పేరు చెప్పాడు. ఏదో మాట్లాడాడు. మాట్లాడుతుండగానే కొంత మంది మధ్యలోనే లేచిపోయారు. పీడియస్యూ  విద్యారుల సంఘం అని, అది విద్యారుల కోసం పని చేస్తుందని, దాన్ని మీరు ఇక్కడ నడపాలని ఆయన మాటల సారాంశం. నడపటం అంటే ఏమిటి అని మా వాడొకడు అడిగాడు. వాల్ రైటింగ్ చేయాలి. పోస్టర్లు అంటుపెట్టాలి. మరీ ముఖ్యంగా గోడ మీద ఫోకస్ వెయ్యాలి అని అన్నాడు. ఫోకస్ అంటే ప్రొజెక్టర్ ఇస్తాడేమో, సినిమాలు లాంటివి వేసుకోవొచ్చు అనుకోని నేను ఫోకస్ వేస్తాను అని అన్నాను.  తర్వాత మాటల్లో తెలిసిందేమిటంటే ఆయన చెప్పిన మూడు పనులు “గోడ పనులే”.

ఎవరమూ వాల్ రైటింగ్  రాయలేదు. పోస్టర్లు రాలేదు, అంటించలేదు. ఒక వారం తర్వాత ఆయన ఫోకస్ రాసుకొని తెచ్చాడు. చదవకుండానే దాన్ని కాలేజీలో అంటుపెట్టాము. కొన్ని కరపత్రాలు ఇస్తే అందులో కొన్నిపంచాము. ఆ సంవత్సరానికి అదే మా మొదటి కార్యక్రమం. చివరి కార్యక్రమం కూడా.

ఖమ్మంలో పీడియస్యూ  రెపరెప లాడుతుంది. 1980 లో బీయస్సీ  కోర్సులో ఖమ్మం  కాలేజీలో చేరినాను.  దానికి కొంచెం ముందుగానో, తర్వాతో గుర్తులేదు, ఆ కాలంలో కామ్రేడ్ పి.పి (పి పుల్లయ్య)ని దేనికో అరెస్టు చేసి మధిర సబ్ జైలుకి తెచ్చారు. వేసవి కాలం అనుకుంటా, కామ్రేడ్ పిపి ని చూడటానికి మేము కొంత మందిమి వెళ్ళాము. వొంటి మీద చొక్కా లేకుండా, లుంగీ కట్టులో, మాసి పోయిన వొంటితో అప్పుడే కూలి పని నుంచి వొచ్చిన మా పెద్దనాన్న కొడుకులా అనిపించాడు.

1980 / 81 లో ఖమ్మం కాలేజీలో విద్యార్ధి ఎన్నికలు.  పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఏ రకంగానూ తీసిపోనట్లున్నాయి.  పిపి వెళ్ళిపోతున్నాడు. రంగారావు జనరల్ సెక్రెటరీగా, శ్రీహరి ప్రసిడెంట్ గా, ఇంకా కొంతమందితో పీడియస్యూ  తమ అభ్యర్ధుల లిస్టుని  పంచింది. ఆవుదూడ గుర్తుకు మా గూడెపోల్లు గంపగుత్తగా వోట్లేసినట్లు నేను ఆ లిస్టు చూసుకుంటూ అందరికి ఓటేసాను. బంపర్ మెజార్టీతో పీడియస్యూ  గెలిచింది. ఆ ఆనందంలో పాట వెంట పాట విప్లవ పాటలు పాడుతున్నకామ్రేడ్ MP.  (యం. పుల్లయ్య). పుల్లన్నని చూస్తూ వింటుంటే  –  చలికాలం పొద్దున్నే పేడకళ్ళుతీస్తూ, సినిమా పాటల్ని, దేవుని పాటల్ని దుమ్మురేపే జీతగాడు మా వెంకటేశ్వర్లన్నలా అనిపించాడు.

పిపి మాటల కవాతులు, ఉపన్యాస ఉద్రేకం రక్తాన్ని స్పృశించినట్టుండేది. “జీనాహైతో మర్నా సీఖో – కదం కదం పర్ లడనా సీఖో”, హంసే జో టక్ రాయేగా ఓ మిట్టి మే మిల్ జాయేగా” విద్యార్ధుల నినాదాలు కణ కణగా మోగే డప్పుల దరువుల్లా వినిపించేవి. అదొక తెలియని ఆకలి. అదొక తెలియని దాహం. తెలిసీ తెలియని పోరాట సంబరం.

వొంటరిగా భయం భయంగా వుండే మనసుకు, మనుషుల గుంపు కనిపిస్తే –  పోతాయనుకున్న ప్రాణాలు లేచి వస్తాయి. అన్ని హక్కులకి, అవకాశాలకి దూరం చేయబడి  కన్నీళ్ళతో బతికే బతుకుకు పోరాటం ఒక సంబరంలానే వుంటుంది. ఆపదలు మృత్వువులై అందరిని కమ్మివేసినప్పుడు కళ్ళముందు కనిపించే మనుషుల్లో తారతమ్యాలు, వివక్షలు వుండవు. వాళ్ళని  బంధువులతో పోల్చుకొంటాం. క్రమంగా ఒక కొత్త బంధం ఆవిష్కృతమవుతుంది. ఒక అంటరాని మాదిగ కులంలో పుట్టి పెరిగిన నాకు మాసిన గడ్డం, మాసిన బట్టలు, మాసిన వొళ్ళు, పాత చెప్పులు, భయం లేని తనం, లేనితనం గురించి బాధ లేకపోవటం, నన్ను ఆకర్షించి వుంటాయి.  కసి కసి మాటలు, బతుకును పలికే పాటలు నన్ను పలకరించి వుంటాయి. అందుకే ఏమీ తెలియకుండానే పీడియస్యూ  ని ప్రేమించాను. ఆ ప్రేమతోనే విశాఖపట్నంలో జరిగిన పీడియస్యూ  5వ రాష్ట్ర మహాసభలకి వెళ్ళాను. జీవితంలో ఖమ్మం జిల్లా దాటి ప్రయాణం చేయటం మొదటిసారి. టికెట్ లేని ప్రయాణం. చాలీ చాలని డబ్బులు. జగదాంబ సెంటర్లో రోడ్డు మీద ఒక టిఫిన్ బండి దగ్గర సభకి వొచ్చిన అనేక మంది విద్యార్దులు. సగం కాలిన దోసెలు. కింద బండి చుట్టూ బురద బురద అయింది. అర్ధ గంటకు నాకు ఒక దోసె దొరికింది. ఎటువంటి కాలకృత్యాలు తీసుకోకుండా, పళ్ళు తోముకోకుండా ఆవురావురుమంటూ తినేసాను. అలా ఒక్క దోసె కోసం ఎదురుచూస్తూ కాలం గడపటం, రుచి, శుచి లేకుండా ఒక ఆహారాన్ని తినటం నాకు కొత్త అనుభవం. తిరుగు ప్రయాణంలో అనకాపల్లి దగ్గర మా రైలుని ఆపి పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారు. సాంబయ్య చని పోయాడు. భయం భయంగా బండి కదిలింది. ఖమ్మం చేరుకున్నాము. భయం పోయింది. భావోద్వేగం మిగిలింది. పీడియస్యూ  నన్ను ఇష్ట పడింది. నన్ను నేను కొత్తగా ఇష్ట పడేలా పీడియస్యూ  చేసింది.

ఒక సంవత్సరం తర్వాత బీయస్సీ  వొదిలి 1982 లో హైదరాబాద్ JNTU లో జాయిన్ అయ్యాను. పీడియస్యూ  సానుభూతిపరుడుగా వున్న నేను పీడియస్యూ  సభ్యుడనయ్యాను.  ఉపేందర్ రెడ్డి, రమేష్ చంద్ర, వెంకటస్వామి, సంపత్ లాంటి పీడియస్యూ  నాయకులు పరిచయం అయ్యారు. నగేష్, వీర ప్రకాష్, నారాయణస్వామి, సుధాకిరణ్, గోవర్ధనచారి, నర్సారెడ్డి, సహజానంద, మర్రి రమేష్, అర్జున్ లాంటి వాళ్ళతో పీడియస్యూ  స్నేహంగా మారింది. ర్యాగింగ్ రాయుళ్ళని అరికట్టింది.  JNTU కాంపస్ అబివృద్దికి పోరాటం, హాస్టల్ వర్కర్స్ సమస్యలపై పోరాటం, ఆరెస్సెస్  భావజాల లెక్చరర్ల కుల మత వివక్షలపై పోరాటం, మతోన్మాద శక్తులపై పోరాటం, ఇతర ప్రజా పోరాటాలకి సంఘీభావం – పీడియస్యూ  బిగియించిన పిడికిలిగా నా మనసులో కుదురుకుంది. పిడికిలంటే ఓంకారన్న గుర్తుకొస్తాడు.  ఓంకారన్న చేతులలో ఎన్నిబిగి పిడికిళ్ళు పొదిగి  పెద్దయ్యాయో!  ఎన్నిబ్యానర్లు పరుచుకున్నాయో. ఎన్నిజెండాలు ఎర్రెర్రగా రెప రెప లాడాయో!

“గ్రామాలకి తరలండి” పిలుపునందుకొని 1983 వేసవిలో దాదాపు 20 రోజులు పాటు తూర్పు గోదావరి జిల్లాలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాను.  ఇదొక అద్భుతమైన అనుభవం. JNTU నుండి నేను, నర్సారెడ్డి, సహజానంద, మాతో పాటు శ్యామల, వాణి, మణి, నరసింహ, నర్సయ్య కలిసి సత్తిబాబు నాయకత్వంలో ఆ 20 రోజులు గడిపాం. స్థానిక పీడియస్యూ  నాయకుడు నాగయ్య మాకు తోడుగా, అండగా చివరి వరకూ వున్నాడు. అందరం కలిసి తినటం, తిరగటం, కలిసి పాడటం, నాటకాలు ఆడటం, ఉపన్యాసాలు ఇవ్వటం, గుడుల్లో, బడుల్లో, ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకోవటం…మల్లీ ఎప్పటికి రాని రోజులు.. తోటల్లో నడిచాం. పొలాలలో పరుగెత్తాం. పనస పండ్లు, అరటి పండ్లు తిన్నాం. బోర్లు కనిపిస్తే అక్కడ స్నానాలు చేసే వాళ్ళం. బట్టలు వుతుక్కునే వాళ్ళం.

“మా టీం లో లీడ్ సింగర్ నరసింహ. నాకు డాన్సు రాదు. “హే నగరే నగా నగారే”  పాటని నేను డప్పు కొట్టుకుంటూ పాడితే మిగతా వాళ్లు డాన్స్ చేసేది. “ఇయ్యాల రేపంట లష్కర్ బోనాలు” పాటకి మణి, నర్సయ్య డాన్సు చేసేది. ఏ దేశాన పుట్టినవే నా చెల్లేల చిలకమ్మ” పాటని నేను పాడేవాడిని. మిగతా వాళ్ళు కోరస్. “ఎర్ర ఎర్ర దారుల్లోనా నా చెల్లెమ్మా” పాట శ్యామల పేటెంట్ సాంగ్. నర్సారెడ్డి స్పీకర్. “నడవరోరెంకన్న నడవరా” సత్తిబాబు, నర్సారెడ్డి పాడేది. ప్రతిరోజూ రెండు మూడు సార్లు వీధి నాటిక వేసేవాళ్ళం. రాత్రి ఏ చెట్టు నీడనో పడుకున్నప్పుడు సత్తిబాబుతో “ కూటికోసం, కూలికోసం, పట్టణంలో బ్రతుకుదామని, తల్లిమాటలు చెవిన పెట్టక, బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం!” పాడిచ్చుకునే వాళ్ళం. సత్తిబాబు మమ్మల్ని పిల్లల కోడిలా చూసుకునేవాడు. ఎప్పుడూ చిరునవ్వుతో ప్రోత్సహించేవాడు. భయాన్ని, బాధని దగ్గరికి రానిచ్చేవాడు కాదు. ఎక్కడ గ్యాప్ వస్తే అక్కడ ఉండేవాడు. అది పాటైనా, నాటకమైనా, ఉపన్యాసమైనా.

“ప్రజల ఇంటికెళ్ళినప్పుడు మీరు భోజనానికి ముందు లేదా తర్వాత వాళ్లకి రాజకీయాలు చెప్పాలండి” అని నాగయ్య ప్రతి రోజూ చెప్పేవాడు. మాకు రాజకీయాలు తెలియకపోయినా వాళ్ళకి రాజకీయాలు చెప్పేవాళ్ళం. నాగయ్య అప్పట్లో రైతు కూలి సంఘం నాయకుడు సోమాచారి గారి ప్రియ శిష్యుడు. ఒక్కోసారి పెద్ద సెంటర్లలో మీటింగ్ పెట్టేవాళ్ళు. స్టేజి, మైక్ ఏర్పాట్లు చేసేవాళ్ళు. మేము వెళ్ళే వాళ్ళం. కొన్ని మీటింగ్స్ లో జనం ఎవరూ లేక పోయేది. “మెల్లగా వస్తారులెండి. మీరు పాడండి” అనేవాడు నాగయ్య. మేం పాడే వాళ్ళం. అయినా ఎవరూ రాకపోయేది. సోమాచారి గారు ఉపన్యాసం మొదలయ్యేది. నాగన్నా! ఎవరూ లేకుండానే ఈ పెద్దాయన ఉపన్యాసం మొదలుపెట్టాడు ఏంటి” అడిగాను. “ఎందుకు లేరండి. ఇళ్ళల్లో వున్నారు. షాపుల్లో వున్నారు. ఎక్కడోల్లు అక్కడ వింటారు” అని చెప్పాడు. మీటింగ్ అయినాక సోమాచారిగారు మాతో “జనం మన దగ్గరికి రాకపోతే, మనమే వాళ్ళ  దగ్గరికి పోవాలి” అన్నారు. అప్పటికప్పుడు నవ్వు వొచ్చింది కాని తర్వాత తర్వాత ఆలోచిస్తే సోమాచారి గారు అనుభవంతో చెప్పిన మాటల అర్ధం తెలిసింది.

ప్రజలతో మమేకం కావటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ మాటలు వినటం అదే గొప్ప చదువు.   ప్రతి వీడ్కోలులో ప్రజలు “మాతో వుండండి, ఇక్కడే వుండండి, మేం మిమ్మల్ని చూసుకుంటాం” లాంటి మాటలు, ఇంటికి ఒకరు చొప్పున మమ్మల్ని  పంచుకొని వేడి వేడిగా, కారం కారంగా, ప్రేమని కలిపి, పళ్ళెం నిండా వడ్డించిన బువ్వలు, కూరలు, ఆత్మీయ చూపులు, అమాయక కోరికలు, అవసరమైతే ప్రాణాల్ని సైతం ఇస్తామనే వాళ్ళ వాగ్ధాన సూచికలు ఆధ్యాత్మిక ప్రబోధంలా అనిపించేది. ఒక్క మాటలో చెప్పాలంటే it was an emotionally profound philosophical experience.

వాళ్ళకు విప్లవం అంటే ఇష్టం. విప్లవం కంటే ముందు విప్లవకారులను ఇష్టపడతారు. ఏమీ తెలియకుండానే మాలాంటి వాళ్ళని ప్రేమిస్తారు. వాళ్ళ కోసం కొంతైనా పనిచేయాలని నిర్ణయించుకున్నాను. ఒకవేళ పీడియస్యూ  లేకుంటే ఈ విలువైన అనుభవాన్ని, తత్వాన్ని కోల్పోయేవాణ్ని కదా! అప్పుడు నుండి పీడియస్యూ  ని తెలుసుకుంటూ ప్రేమించటం మొదలు పెట్టాను.

పీడియస్యూ  అనేక మంది మేధావుల్ని పరిచయం చేసింది. కాశీపతి, వరవరరావు, బాలగోపాల్, హరగోపాల్, కోదండ్ రామ్, కంచె ఐలయ్య,  కాళోజీలతో పాటు అనేక మంది జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల్ని, పౌరహక్కుల నేతల్ని శ్రీశ్రీ, శివసాగర్, వంగపండు, గద్దర్ లాంటి కవుల్ని, కళాకారుల్ని చూపెట్టింది.

క్రమంగా రాజకీయ తరగతులకి తీసుకెళ్ళింది. రాజకీయాల్ని తెలుసుకుంటూ వాటిని ఇష్టపడటం మొదలు పెట్టాను. పీడియస్యూ  పూర్వనాయకులు బి. ప్రదీప్, కూర రాజన్న నా రాజకీయ గురువులు, మార్గదర్శకులు. వీళ్ళని ఎంతగా ఇష్టపడ్డానంటే  ప్రదీప్ అన్నతో కూసుంటే కాలేజీ స్నేహితుడితో కూర్చున్నట్టే వుంటుంది. అన్నీ ఓపెన్ గా మాట్లాడుకునే అవకాశం వుంటుంది. రాజకీయాలు మాత్రమే కాకుండా, సాహిత్యం, సంగీతం, సినిమా, తిండి, జోకులు వేసుకునే చొరవ వుంటుంది. ప్రదీపన్న మా అందరికి ఒక trouble shooter. రాజన్నని పెద్దన్న అని పిలిచేవాడిని. పిలవటమే కాదు పెద్దన్నగానే భావించేవాడిని. ప్రతిఘటనా పోరాటం, నిర్మాణం, చరిత్ర, రాజకీయాలు, గతితార్కిక భౌతికవాదం, కుల సమస్య అంశాలపై రాజన్న మాట్లాడుతుంటే రోజులు గంటల్లా, గంటలు నిమిషాల్లా గడిచి పోయేవి.

అరుణోదయ రామారావు అన్నగొంతు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ని పరిచయం చేసింది. అనేక మంది పీడియస్యూ  అమరవీరుల్ని గానం చేసింది. రామారావుని చూడాలని, ఆయన పాటని వినాలని, వీలయితే ఆయన్ని అనుకరించాలని ఎదురు చూస్తున్న రోజుల్లో ఒక రోజు బొగ్గులకుంట ఎస్పీ  హాల్ దగ్గర పీడియస్యూ  మీటింగ్ లో అన్న కనపడ్డాడు. “ఉయ్యాలో జంపాలా” పాటని రామారావు అన్న పాడుతుంటే హృదయంలో తన్మయత్వం. మనసులో రమణీయం. It was a harmonious blend of spiritual insight and heartfelt emotion.

పీడియస్యూ  అమర వీరుల్లో మారోజు వీరన్న ఒక ప్రత్యేక సంచలనం. పీడియస్యూ  లో వీరన్న శక్తివంతమైన నాయకుడు, గాయకుడు, వక్త, కళాకారుడు. “యువతరమా, నవతరమా” పాటలో పుష్పించిన  రక్తంలా వుండేవాడు.  వీరన్న పాటలు వంటిలో పోరాట తరంగాలు పుట్టించేవి.  వీరన్న ప్రసంగాలు ఆగ్రహించే తుఫానుల్లా ఉండేవి.

ఇన్నిరకాల అనుభవాల్ని, అమరుల్ని, ప్రేమల్ని, పోరాటాల్ని, పాటల్ని, పాఠాల్ని అందించిన ఆ శక్తి ఏది? పీడియస్యూ  కి ఊపిరి, రక్తమాంసాల్ని అందించిన ఆ వ్యక్తి ఎవరు? ఆ శక్తి జార్జిరెడ్డి. ఆ వ్యక్తి జార్జిరెడ్డి.

గౌరవం, ఆత్మీయత, అహింస, మానవ హక్కులు కలలుగా కాకుండా నిజాలుగా  మారే సమాజం కోసం జార్జిరెడ్డి దారులు వేసాడు. ఆ దారిలోనే పీడియస్యూ  అడుగులు వేసింది. పరుగులు తీసింది. అప్పుడప్పుడు అలిసిపోయినా 50 సంవత్సరాలుగా నడిచింది. ఇంకా నడుస్తూనే వుంది. అయితే ప్రశ్న ఏమిటంటే పీడియస్యూ  జార్జిరెడ్డి దారిలోనే ఉందా?

“జీనా హైతో మర్నా సీఖో, కదం కదం పర లడ్నా సీఖో” – ఇది జార్జిరెడ్డి నినాదం. జీవించాలంటే చావడం నేర్చుకో, ప్రతి అడుగులో పోరాడడం నేర్చుకో.

ఈ రోజు బతకటం కోసం చచ్చి పోతున్నదెవరు? ప్రతి క్షణం పోరాటం అవుతున్నది ఎవరికి? రాజస్తాన్‌లో నీటిపంపు దొంగిలించారని 40 ఏళ్ల దళిత వ్యక్తిని చితకబాదారు. ఉత్తరాఖండ్‌లో వివాహ విందులో అగ్ర కులాల ఎదుట భోజనం చేసినందుకు 23 ఏళ్ల దళిత యువకుడిని కొట్టారు. గుజరాత్‌లో మౌలిక్ జాదవ్ అనే యువకుడు ఫేస్‌బుక్‌లో తన పేరు మౌలిక్ సింగ్ జాదవ్‌గా మార్చుకున్నందుకు ఆ యువకుడి ఇంటిని ద్వంసం చేశారు. తెలంగాణలో అగ్ర కులానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నందుకు 24 ఏళ్ల దళిత యువకుడు ప్రణయ్‌ను నడిరోడ్డుపై నరికి చంపారు. గుజరాత్‌ ఊనా లో  గోవులను చంపుతున్నారనే ఆరోపణలతో దళిత కుటుంబంలోని ఏడుగురిని బట్టలూడతీసి , కర్రలు, ఇనుప రాడ్స్ తో కత్తులతో కొట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత యువతిని నలుగురు అగ్ర కుల వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి చంపారు. ఢిల్లీలోని శ్మశానవాటిక వద్ద 9 ఏళ్ల బాలికను నలుగురు మధ్యవయస్కులు, ఒక హిందూ పూజారి తో సహా అత్యాచారం చేసి హత్య చేశారు. హైదరాబాద్‌లో 25 ఏళ్ల శివ, 45 ఏళ్ల అంతయ్య అనే ఇద్దరు సఫాయి కర్మచారులు మరుగుదొడ్డి శుభ్రం చేస్తుండగా ఊపిరి ఆడక చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లో గోరక్షక్ సభ్యులు మాంసం అమ్ముకునే మహమ్మద్ షకీర్‌ను పెద్ద పెద్ద  కర్రలతో అమానుషంగా కొట్టారు. మధురలో గొడ్డు మాంసం తీసుకెళ్తున్నారని అనుమానంతో ఇద్దరు ముస్లింలను చితకబాదారు. ఇలా  బతకటం కోసం ఎంతో మంది చచ్చి పోతున్నారు. బతకటం కోసం ప్రతి క్షణం పోరాటం చేస్తున్నారు.

జార్జి రెడ్డి ఇప్పుడు వుండి వుంటే ఈ పోరాటాలకి నాయకత్వం వహించేవాడు కాదా? ఈ హింసల్ని ఎదిరించటానికి సైన్యాన్ని తయారుచేసే వాడు కాదా?  దళిత వాడలకి, ముస్లిం వీధులకి, ఆదివాసుల నివాసాలకి తరలండి అని చెప్పే వాడు కాదా? రాజకీయ తరగతులను ఎంతో  సృజనాత్మకంగా నిర్వహించిచేవాడో కదా. అప్పుడు ఎప్పటిలాగే ఏమీ తెలియకుండానే  విద్యార్థులు, పీడిత ప్రజలు పీడియస్యూ  ని ప్రేమించేవాళ్ళు కాదా.

విప్లవ కారులు కొంత మంది అమరులైనారు. కొంత మంది జీవించే వున్నారు. వీళ్ళలో ఎవరు ఎలా వున్నారో, ఎక్కడ వున్నారో, ఏమి చేస్తున్నారో తెలియదు కాని ప్రజలు మాత్రం బతకటం కోసం చచ్చిపోతున్నారు. బతుకు కోసం ప్రతిక్షణం పోరాడుతుతున్నారు.  వాళ్లకి విప్లవం అంటే ఇష్టం అని చెప్పటానికి ఇంత కంటే రుజువు ఏమి కావాలి. రానున్న కాలంలో మనం మరో జార్జిరెడ్డిని చూడగలమా?  ఈ సమాజం మరో జార్జిరెడ్డిని సృష్టించగలదా. సమసమాజ కలని కాపాడుకోగలదా!

“గూండాలను గడగడ వొణికించిన మహా ఘనుడా

క్యాంపస్ అన్యాయాలను అంటించిన అగ్నికణం

సమ సమాజ వెలుగులోన సాగిన ఓ బాటసారి

వెయ్యి కత్తి వేట్లకైనా చలించని వీరుడా

ఆమరుడ ఓ జార్జిరెడ్డి అందుకో లాల్ సలాం”.

(50 సంవత్సరాల PDSU సంబరాన్ని తలుచుకుంటూ)

 ***

లెల్లే సురేష్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాస్
    అచేతనావస్థ లో ఉన్న జనం
    సిద్ధాంతాలు అనవసరం
    మతం పావు కి బలౌతున్న ప్రజలు
    pdsu లాంటి సంస్థలను కాలేజీల్లో ఎన్నికలు నిషేధించాక విద్యార్థులకు చేరువ కాలేక పోతున్నాయి
    సిద్ధాంతం సజీవం
    పిడికిళ్ళు బిగించే జనం లేరు

    మీ స్వగతం ఈ తరానికి అవసరం

  • ఒక జీవిత అనుభవం. మా లాంటి వాళ్ళకి పాఠం. చదువుతున్నంత సేపు ఏదో ఉద్విగ్నత. మీరు లేవనెత్తిన ప్రశ్న సరైనదే. అసలు మనం ప్రశ్నిస్తున్నామా ?? పోరాడుతున్నామా..??.

  • చివరగా మీరు వ్యక్త పర్చినట్లు PDSU లు జార్జి రెడ్డి దారిలో నడవడం లేదు. … దారి తప్పాయి. వాళ్ళ వాళ్ళ దారుల్లో వాళ్ళు నడుస్తున్నారు. మతోన్మాదాన్ని పేరుకే వ్యతిరేకించడం . మనువదులు దళిత బహుజనుల పై చేస్తున్న దాడులపై PDSU స్పందన అంతంత మాత్రమే. నాకు గుర్తున్నది .. బీహార్ లో దళితుల ఊచకోత పై ఆనాడు మనం అబిడ్స్ సెంటర్ లో పికెటింగ్ చేశాము. ఎంతో మంది విద్యార్ధులు లాఠీ దెబ్బలు తిన్నారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు