ఈ శోకం అందరిదీ!

ఈ కథ చదివినపుడు, విశాఖ రోడ్లమీద పెడరెక్కలు విరిచికట్టి పడేసిన డాక్టర్‌ సుధాకర్‌ ఎందుకో గుర్తుకొచ్చాడు నాకు.

కథను చెప్పింది స్త్రీయా, పురుషుడా?

ఎవరైతే ఏం..ఇద్దరూ ఒక్కరే!

ఈ కథ..భ్రమా, నిజమా?

తేడా ఏముంది..రెండూ ఒక్కటే!

ఈ కథ దుఃఖాన్ని వినిపించిందా, స్వీకరించిందా?

బహుశా రెండూ చేసింది.

‘శోకం: ఒక పరిశీలన’ కథను చదువుతున్నపుడు గుండె దడదడలాడుతూనే ఉంది. కథ పూర్తయ్యాక బొరోమని ఏడవాలనిపించింది.

ఏడుపు కూడా ఉపశమనమే!

పారిపోవాలనుకున్నపుడు  గుండెబరువు  దించేసుకోవడం సులభమే. అన్నిసార్లూ ఇది సాధ్యం కాదు.

అద్దాన్ని నీ ముందు పెట్టి,  ‘ఇది కథ.. ఇక చదువుకో’ అంటే తట్టుకోగలమా?

పూర్ణిమా తమ్మిరెడ్డి, సాధారణ తెలుగు కథకుల వరుసలో ఎప్పటికీ  నిలబడదు.

కథలు ఎలా రాయాలంటే.. అంటూ ఎవరైనా ఉపన్యాసం ఎత్తుకుంటే, పూర్ణిమా తమ్మిరెడ్డి రాసిన కథలతో ఈడ్చి ముఖం మీద కొట్టచ్చు. వెబ్‌ పత్రికల్లోనే కనిపించే ఈమెను, హైదరాబాద్‌ నవోదయలో పట్టుకున్నాను. ‘ఎమోషనల్‌ ప్రెగ్నెన్సీ’ కథల పుస్తకంలో ఉంది ‘శోకం: ఒక పరిశీలన’కథ కూడా. పుస్తకం చేతికి తీసుకోగానే అనిపించినంత తేలికగా ఇందులోని కథలుండవు. ఇవి బరువైవనవి. బలమైనవి. ఎంతగా అంటే, చదువరిని వడలాగేసుకుని, మెలేసుకుని అంతం చేసేంతగా.

శోకమే లోకమై, సమస్తం  దహించివేసే  దీపమై.. దగ్ధమైన పట్టుదారపు పోగై..అనంతమై..అంతమై..అంతర్ధానమై..

– పూర్ణిమా తమ్మిరెడ్డి చెప్పింది ఇదేనా? ఏమో.. ఇది మాత్రమే కాదేమో!

ఈ కథ చదివినపుడు, విశాఖ రోడ్లమీద పెడరెక్కలు విరిచికట్టి పడేసిన డాక్టర్‌ సుధాకర్‌ ఎందుకో గుర్తుకొచ్చాడు నాకు. ఈ కథ చదివినపుడు, ఇంటింటి తలుపు తట్టిన ఉజ్జయిన బాలిక గుర్తుకొచ్చింది. ఈ కథ చదువుతున్నపుడు, మా ఊళ్లో రెండు రూపాయలకే  తన గుడిసె తడికె జరిపి, కుర్రకారును లోపలికి స్వీకరించే యానాది చెంగమ్మ కూతురు ఆఖరి రోజులు గుర్తుకొచ్చాయి నాకు. ఎందుకో తెలీదుగానీ ఈ కథ చదువుతున్నపుడు నాకు, డాక్టర్‌ వి. చంద్రశేఖర్‌రావు కథల్లోని మోహనసుందరం గుర్తుకొచ్చాడు.

బహుశా ఇవన్నీ పరిశీలనార్హమైన శోకగీతాలే కావచ్చు.

‘శోకం: ఒక పరిశీలన’ కథలో కథ ఏమిటి అని ఎవరైనా అడిగితే, చెప్పడానికి ఏమీ దొరకదు. అలాగని ఏమీ లేదా? అంటే.. చెప్పలేనంత ఉంది అని అర్థమవుతుంది.

ఆమ్మ పాలిండ్లను వెతుక్కునే పసిబిడ్డ – ఈ కథను చెప్పడం మొదలు పెడుతుంది కానీ, కొనసాగించేది ఎవరో మాత్రం స్పష్టపడదు. కథ చెప్పే పాత్ర జండర్‌ మారిపోతూ ఉంటుంది. ఆ పాత్ర  అమ్మా..కూతురా? తేల్చి చెప్పలేం.  కథ నడుస్తున్నది  హైదరాబాద్‌లోనా, బెంగళూరులోనా, విదేశాల్లోనా.. అర్థం కాదుగానీ, ఏక్కడైనా ఒక్కటే అని రచయిత చెబుతున్నట్టుగా అనిపించింది నాకు. కథా కాలం కూడా ఇంతే. గతమా, వర్తమానమా.. రెండింటి నాడుమా దూరం భ్రమ మాత్రమే అంటోందా రచయిత? ఈ   కథ చెబుతున్నది టీచరా, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగా..? ఏవరైనా తేడా ఏముంటుంది , ప్రయాణంలో అని పాఠకలకు  అర్థమవుతుంది. ఆసుపత్రిలో అమ్మ కేన్సర్‌ వైద్యం గురించిన ప్రస్తావన చేస్తున్నపుడు కీమో థెరపీ, కోడింగ్‌ సమస్యా  సంభాషణల్లో కలగలిసిపోయి వినిపిస్తాయి. ఓవర్‌లాపింగ్‌ టెక్నిక్‌లో సాగే ‘శోకం: ఒక పరిశీలన’ కథలో ఒక తాత్విక సందేశం ఏదో అంతర్లీనంగా ప్రవహిస్తున్నట్టు ఉంటుంది. అట్లా అని ఇది నేలవిడిచి సాగదు.

దీపావళి రోజున అమ్మ కట్టుకున్న పట్టుచీరకి నిప్పంటుకుంది. కొంగు దీపానికి తగిలిందని చెప్పింది అమ్మ. ‘కాదు నాన్నే! నాన్నే’ అంటించాడని  గగ్గోలు పెడుతున్న అన్న నోరు మూయించింది అమ్మే. ఇదంతా అమ్మ పొట్టలో ఉన్న పాపాయి చూస్తోంది. అయినా ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చి చెప్పదు. నిజానికి ఒక్కటే కోణం ఉండదన్న సత్యం తెలుసుకోండి అని పాపాయి వెటకరిస్తున్నట్టుగా ఉంటుంది. అమ్మకి కేన్సర్‌ అని తేలడం, అన్న టీవీ యాంటెన్నా సరిచేస్తూ కరెంటుషాక్‌కి గురై చచ్చిపోవడం.. తట్టుకోలేని ఈ దుఃఖాలన్నీ నిజమూ కాదు, అలాగని ఒట్టి భ్రమ కూడా కాదు. ఇక్కడ కాకపోతే ఎక్కడో ఒకచోట రోజూ జరుగుతున్నవే. అందుకే ఈ సంఘటనలని  ఏవో రెండు పాత్రలకీ, ఏదో ఒక కాలానికీ మాత్రమే పరిమితం చేసి ఇరించడానికి ఇష్టపడలేదు రచయిత.

అనేకానేక దుఃఖాలకు హేతువును వెతకడం క్షేమం కాదు. అన్వేషణ- ప్రశ్నకు దారి తీస్తుంది. ప్రశ్నకన్నా ప్రమాదకరమైనది  ప్రపంచంలో లేదు. అందుకే కథ చెప్పే పాత్రకు పిచ్చి అని తేల్చారు బంధుమిత్రులు. పచ్చ పొడిపించారు. సూదులు గుచ్చి వైద్యం చేయించారు. బాధ కన్నా పిచ్చే నయం కాబట్టి  ‘ సారీ! సారీ! ఇంకెప్పుడూ ఎదురు ప్రశ్నించను’ అని కథ చెప్పే పాత్ర  నేరాంగీకారానికి  సిద్ధపడింది.

నటిస్తోందా? నమ్మేదెలా?

పరీక్ష పెట్టింది లోకం. థియరీ సరే, మాయ చేయచ్చు. చేసింది. ప్రాక్టికల్‌ పరీక్షతోనే చిక్కు. ‘మీరు మీది కాని కథలో బందీయైు ఉన్నారు. అక్కడి నుంచీ తప్పించుకుని చూడండి’ .. ఇదీ ప్రశ్న.

తప్పించుకోవడం ఎలా?

‘ఇష్టంలేని పెళ్లి అవుతున్న హీరోయిన్  నాలుగైదు చీర కొసలను మూడేసి కిందకి జార్చి తప్పించుకున్నట్టు’ ఎన్ని సినిమాల్లో చూడలేదు!

అల్మారా  తెరిస్తే రంగు రంగుల చీరలు. ‘లేత గులాబీ రంగులో అక్కడక్కడా చిన్న బుటా, అరంగుళమంత మామిడి పిందెలు ఉన్న బూడిద రంగు చీర’ కిందికి జారింది. చీర ఒంటికి చుట్టుకుని దొర్లినపుడు, ‘అది చీరలా కాకుండా, అరవై కేజీల మనిషిని మోయగల గర్భసంచి’ లా అనిపించింది.

‘చీర పొరల్లోంచి సన్నగా జారుతున్న వెలుగుతో మెరుస్తున్న మామిడి పెందెను నిమురుతూ  చిన్నగా’.. ఇంకా చిన్నగా.. నిమిరేకొద్దీ మరీ చిన్నగా మారిపోతూ ‘ ఒక దారపు పోగంత’ సన్నగా మారిపోయి  చీరలో కలిసిపోయింది  కథ చెప్పే పాత్ర.

పాత్ర ఆడో, మగో ఎవరైతే ఏం.. అనంతమైన అమ్మలో కలగలిసిపోయింది.

ఇదొక చిత్రమైన అమ్మకథ. అమ్మకి అనారోగ్యం అని తెలిసి ఇండియాకు బయలుదేరినపుడు జెనీవా పార్క్‌లోని బొమ్మ గుర్తుకొచ్చింది. ‘తల కిందకు వంచి, భుజాలు వంగిపోతూ, చేతులు మోకాళ్లపై పెట్టుకొని కూర్చున్న బొమ్మ. ఆడో మగో తెలిసే వీలు లేని బొమ్మ. ఛాతీ లేదు. పక్కటెముకలు లేవు. పొట్ట లేదు. మెడ నుండి తుంటి వరకూ పెద్ద సున్నా. అంతా ఖాళీ’. ‘ముమ్మాటికీ ఆమ్మే. అమ్మ పైట వెనుక దాచేది ఆ ఖాళీనే!’ అనడం ద్వారా రచయిత, అమ్మలోని శూన్యానికి కారణాలను వివిధ సంఘటనలు చూపి  వెతుక్కోమంటుంది. ఈ శూన్యం అమ్మది మాత్రమేనా? బహుశా అలా తేల్చరాదనే యేమో.. అమ్మ చుట్టూనే నడిపినా ఈ కథను అమ్మదనీ, బిడ్డదనీ విడదీసి చూపించలేదు రచయిత.

రాయడం కళ అయినట్టే, చదవడమూ ఒక కళే! ఆ కళను నేర్పిస్తాయి కొన్ని కథలు. అటువంటి కథ అందించింది పూర్ణిమ తమ్మిరెడ్డి.

*

ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పదునైన విశ్లేషణ.. నిగూఢమైన నిర్మాణం వున్న కథను విప్పి చెప్పే వివరణ. పూర్ణిమ కథలు మెల్లగా అంటుకొని నిరంతరాయంగా కాల్చే మంటలు. విశ్లేషణ చేసిన ఉమకూ, పూర్ణిమ కూ అభినందనలు.

  • ఉమామహేశ్వరరావు సార్ నమస్కారం..
    . తెలుగు సాహిత్యంలో, ఎలాంటి సమస్యలకు సంబంధించిన కథలనైన రాస్తూన్నారు. వీరు కథలకు సంబంధించి చేసే విశ్లేషణలు చక్కగా, హృద్యంగా ఉంటాయి..

  • సర్,

    మనసు లోతుల్లోంచి పొంగుకొచ్చే ఇలాంటి స్పందనలకు ఎలా స్పందించాలో నాకు తెలీదు. మామూలుగా అయితే గమ్మునైపోతాను. కానీ ఇక్కడోటి పంచుకోవాలనుకుంటున్నాను.

    ప్రముఖ నాటకకర్త, సునీల్ షాన్‍భాగ్ గారి నుంచి పాఠాలు నేర్చుకునే అదృష్టం ఈ మధ్యన కలిగింది. ఆయన నాటకాల కోసం ఎలా తర్జుమాలు చేయవచ్చనే అంశం విశిదీకరిస్తూ, ఒక నాటకంలోని క్లిప్ చూపించారు. కశ్మీరీ అమ్మాయి తన భాషలో కవిత చెప్తుంటే ఆమె వెనుక కూర్చున్న ఇంకో ఆమె హిందుస్తానీ అనువాదం వినిపిస్తూ ఉంటుంది.

    అయితే నన్ను ఆకట్టుకున్న విషయమేమిటంటే, కశ్మీరీ అమ్మాయి గుండెలు బాదుకుంటూ కవిత వినిపిస్తుంటే, హిందుస్తానీ అమ్మాయి నిటారుగా కూర్చుని, ఏ భావావేశం లేకుండా, ప్రేక్షకులను సూటిగా చూస్తూ చెప్పుకొస్తుంది. కవిత చివర్లో మాత్రం ఒక బలమైన వాక్యం రాగానే హిందుస్తానీ-ఆమె ఉలిక్కిపడి పక్కనున్న కశ్మీరీ-ఆమెను చూస్తూ ఆ చివరి వాక్యాలు వినిపిస్తుంది. కవిత పూర్తవ్వగానే కశ్మీరీ-అమ్మాయి సొమ్మసిల్లిపోతుంటే, హిందుస్తానీ అమ్మాయి చటుక్కున పట్టుకుని ఆమెను గుండెలకు హత్తుకుంటుంది.

    ఇంగ్లీషులో “holding space for someone” అని అంటారుగా… దానికి visual representationలా అనిపించింది నాకీ సీన్.

    “శోకం: ఒక పరిశీలన”, “ఎమోషనల్ ప్రెగ్నెన్సీ”, “ఆరెక్స్ మారేజ్” లాంటి జటిలమైన, కష్టతరమైన అంశాలపై కథలు రాసి రాసి మానసికంగా అలసిపోతున్న నాకు మీ ఈ స్పందన “holding space for me”లా అనిపిస్తోంది. వెన్నుతట్టి ప్రోత్సహించడానికి మించి, “నాకెంత కష్టం కలుగుతున్నా, నువ్వేం చెప్తున్నావో వింటాను” అన్న స్పందన అపురూపమైనది.

    అంతటి అపురూపాన్ని నా సొంతం చేసినందుకు మీకు తహ్-ఎ-దిల్ సే షుక్రియా!

    ఈ స్పందనకు ఇక్కడ చోటిచ్చిన సారంగ పత్రికవారి ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు