…ఈ విధంగా ‘మధుశాల ‘ అతని నిలువుటద్దమే!

పెక్కు రుబాయిలలోని మధువు, తడిఆరని కుండ, తత్సామీప్యంగల స్త్రీ వంటివన్నీ కవి తన లోకంలోకి ఒంపుకున్నట్లే కదా అని మధుశాలలోని కవితల వంటివి చదివితే అనిపించింది.

ద్దంలోకి తదేకంగా చూస్తూ వుండిపోతే మనలోని అంత:శత్రువు దర్శనమివ్వకపోడు. ఆ శత్రువుతోపాటు కామం కొండచిలువలాగా చుట్టువిడిచి ఇవతల పడకపోదు. అది శాంతించిన తరువాత, కరుణ కలగలిసిన ప్రేమ ఉబికిరానూవచ్చు వునరుథ్థానంలాగా. ఒక దిక్కుమాలిన అద్దం ఇంత పని చేయగలిగితే మనకి యోగులు, మధురవాణిలు దేనికి? చెలం గారు మొత్తుకున్నట్టు నమ్మిన కాళ్ల కింద భూమి ఉట్టిపుణ్యాన దొలుచుకుపోడం వంటి చిత్రావస్థ ఏర్పడ్దందేనికి? అయినను అనిల్ బత్తుల తన యువ కవితల ద్వారా నిలువుటద్దాన్ని మించిన స్వీయ ముఖదర్శనం చేయించగల వేశ్యలను, వెంటాడే ప్రియురాళ్లనూ చవిచూశాడు. ఐతే స్త్రీ, ప్రేమ, కామం, జ్ఞానంలో పుట్టిన స్వేచ్ఛలను ఏకకాలంలో మనోరధానికి గుర్రాలవలే కట్టి నడిపించడం సాధ్యమా? ఇలాటి దృక్కోణాల పేచీ, పంచాయితీ పెట్టదలచలేదు ఇక్కడ. పైబాపతు నైతిక, తాత్విక, మానసిక విశేషాలు పరాయివాళ్లలో చూస్తే చాలు ధర్మాసనంలో న్యాయమూర్తి అయి కూర్చునేవారు కోకొల్లలు. వారు ఆల్బర్టో మొరావియో వంటి ఆసాములను సంప్రదించి తెలుసుకోవచ్చు. అబ్బీ, ఈ  కుర్ర కవితాంశం మెటాఫర్ వంటిదా? లేక గందరగోళపు స్వీయాకృతి సందర్శన భాగ్యమా అని వీలువెంట వాదించుకోగలరు. అలాగే లాటిన్ అమెరికన్ కవిత, చైనీయ కవితల్లోని దర్శనాలు స్ట్రా వేసి పీల్చిన పెద్దల వద్ద పై కవితాంశాల మీద కచేరీ పెట్టుకోవచ్చు…వారి వారి జిజ్ఞాసకు వదిలేస్తా. పెక్కు రుబాయిలలోని మధువు, తడిఆరని కుండ, తత్సామీప్యంగల స్త్రీ వంటివన్నీ కవి తన లోకంలోకి ఒంపుకున్నట్లే కదా అని మధుశాలలోని కవితల వంటివి చదివితే అనిపించింది.

నిజానికి అనుభవరాహిత్యం, లోలోతులు చూడని అనుభవం, చిన్నపాటి పరామర్శ వంటివి, పైపై పరిమిత దృష్టి గోల వంటివే. జ్ఞానానందం వేరు, జిజ్ఞాస దారి చూపే పరిశోధనానుభవం వేరు. చివరికి వాటి అనుభవసారం సిద్దాంత స్థాపన దగ్గరో, తాత్విక మలుపు దగ్గరో అట్టే నిలిచిపోకుండా ‘కళ ‘ గలిసిన సౌందర్యాత్మకమైతే నా యొక్క సామిరంగా అది సాహిత్యరూపం ధరించకమానుతుందా?!  కాబట్టి ఆర్ట్ లెస్, స్టెరయిల్, లాంగ్ ఫేస్డ్ జీనియస్ కానేకాని అనిల్ బత్తుల నిలువెల్ల తపనతో గింజుకున్న దినసు కలవాడేనన్న అనుమానం నాకు ఒక కేవల పాఠకుడిగా తోచింది. అందుకే మధుశాలలో పదాల వరస కవిని పారదర్శకంగా చూపెట్టింది. ఆ విధంగా ‘మధుశాల ‘ అతని నిలువుటద్దం.

తరచి చూడగా మనసు నిండా కప్పుకొన్న బుద్దితోగాని, ‘బుద్ది ‘ సంగతంలేని వెర్రి సినీమనసుతోగాని ఈ ‘మధుశాల ‘ చదివి నేను కిందా మీద అయిపోలేదు. సరే, కవితల్లో అంతర్లయ తప్పిన ప్రొజాయిక్ మొజాయిక్ చాలా మంది కవులకుమల్లె ఇందులోనూ కనిపించకపోలేదు. అలాగని ఇట్టి మధువు ‘నాకు వలదనినాను ‘ అని పక్కన పెట్టేయ్యలేని గుప్పెడు కవితలు చిత్రలోకం చూపెట్టాయి. ఎక్కడా వ్యక్తావ్యక్తపు చిందర వందర పదాలు గాని దృశ్యాలు గాని లేవు. కాబట్టి కంచు ఢక్కులు గల చండ శాసన విమర్శకులు నిరాశ చెందగలరు. తన్నుకువచ్చే భావదృశ్యధార కొత్త దృశ్యాలనూ చూపేవి ఈ ‘ మధుశాల ‘లో పుట్టెడు వున్నాయి. ‘ మధుశాల ‘ లో చిత్రచాయలు చూపిన ముచ్చటలు చూడండి. ఘన నగ్న సౌందర్యరాసి అమ్మాయి క్షణం లో దయాపారవంతం గావటం, విస్తరించుకుపోయే నీడలు గల గొప్ప వృక్షంగా కనబడటం, కవి తచ్చాడిన స్త్రీ ఆవరణం చెట్టు కొమ్మలు గావటం, దాని మీద తాను ఒక ఉడుతగావటం…వంటివి ‘హైకూ ‘ ‘ జెన్ ‘ వర్ణాలను చూపించాయి! కవిలో అంతరంగం అంబ పలికిస్తే అక్షరాలు ఆకారం ధరించకపోతాయా మరి! చూద్దాం, దిగంబర ఛాయల్లో అనిల్ నడకలు గొంతు సవరించుకున్నాయి. మరింత పరిపక్వతతో మన ముచ్చట తీర్చేవి కవితలుగా మరిన్ని వస్తాయనిపించింది. పాడనివ్వండి, గొంతు పెగిల్చే దశలో పచ్చివెలక్కాయ ఒకటి అక్కడ పడెయ్యకండి అని విమర్శకులని కోరుదామని అనిపించింది నాకు. ‘మృత్యుకన్య ‘, ‘ ఆమె నీడ ‘, ‘గాంధారి కొండ ‘, ‘ఆమె వస్త్రం ‘, ‘ ఆమె వంట ‘, ‘ నత్త శాపం ‘ , ‘తాబేళ్ల దీవి ‘ , ‘ చేపల కూర ‘ ,’ గుప్త నిధి ‘ , ‘ ఆమె తొలి అనుభవం ‘ , ‘ పెంపుడు తోడేళ్లు ‘ , ‘ ఆమె ఏకాంతం ‘ వంటి కవితలు జానపద గాధలు, మార్మిక లోకాలు, ఫోక్ ఆర్ట్ లాగా పట్టుకున్నాయి నన్ను.

ఇక పుస్తకాన్ని ముద్దొచ్చేలా తీర్చాడు బ్రహ్మం గారు.

భయపడకు అనిల్
రెక్కల గుర్రం మీద
నగ్నంగా ఎగరవచ్చు.

*****

మధుశాల ప్రతులు నవోదయ, అమెజాన్ లలో దొరుకుతాయి. 

తల్లావజ్ఝుల శివాజీ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు