ఈ రోజు నగ్నముని గుర్తొచ్చాడు!

నగ్నమునీశ్వరుడి కథల్లో అక్షరాలు పాదాలు వెనక్కి తిరిగిన దయ్యాల్లా ఉంటాయి. భయపడితే ఆ దయ్యాలు హత్యలకు గురైన అభాగ్యులేనని మనమేనాడూ గ్రహించం.

ది సత్యం ఏదసత్యం?

నడుస్తూనే ఉంటాం కాని నడుస్తున్న రోడ్డంతా అగాధంలోకి కూరుకుపోయినట్లు గమనించం. అంతా వెలుగేనని మురిసిపోతుంటాం కాని చీకటినే మనం వెలుగుగా భ్రమిస్తున్నట్లు గ్రహించం. ఆర్తనాదాల్ని ఆనందాతిరేక శబ్దాలుగా, హత్యల్ని దేశ ప్రయోజనం కోసం జరుగుతున్న కార్యకలాపాలుగా భావిస్తుంటాం. ఆయుధాలు ధరించిన వాళ్లను దేవుళ్లుగా భావించడం మనకు అలవాటే. నెత్తుటి తీర్థాల్ని ఆస్వాదిస్తూ, తెగిపడుతున్న తలల కోనేరులో జలకాలాడుతూ క్షుద్ర దేవతల ప్రార్థనల్లో మైమరిచిపోతూ భారత దేశం అమృత కాలంలో ప్రవేశించిందని, కొన్ని వందల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారడం త్వరలో ఖాయమని పతాక శీర్షికల్లో చదువుకుంటూ దేశ భక్తి ఉప్పొంగిపోగా ఒళ్లును  ఒక మహాస్వామి పాదాల క్రింద తివాచీలా పరిచి ఒక చీకటి రోజు( సారీ, వెలుగురోజు)ను గడిపేస్తాం.

ప్రతి రోజూ చేయితో వీపును తడుముకుని వెన్నెముక ఉన్నదని నిట్టూర్పు విడవాల్సి వస్తోంది. మెడపై  చేయి వేసుకుని తల ఉందో లేదో ధ్రువపరుచుకోవాల్సి వస్తోంది. అసలు మనం మనుషులమేనా,లేక కాఫ్కా అభివర్ణించిన  పురుగులమా, మననెవరూ చీపురుతో ఊడ్చేయడం లేదు కదా అని అనుమాన పడాల్సి వస్తోంది.

మన రెండు చేతులు మన ప్రమేయం లేకుండా కలుసుకుని ఎవరి ప్రేలాపనకో కరతాళ ధ్వనులు చేస్తున్నట్లనిపిస్తోంది.  నిద్రలేచిన ప్రతి ఉదయం శరీరం ఛిన్నాభిన్నమైనట్లు,రాత్రంతా పిశాచ వందిమాగధ గణాలు మన శరీరాన్ని గట్టిగా పట్టుకోగా ఒక మహా క్షుద్ర స్వామి మనను ఘోరంగా రమించినట్లనిపిస్తోంది. వాడిని చూసి కళ్లు మూసుకోకుండా ఉండేందుకు ఎవరో కనురెప్పల్ని ముందే కత్తిరించారేమో. ఇదొక అద్భుత అనుభవమని,అదొక బ్రహ్మానందమని నిరంతరం  తన్మయత్వంలో ఉండే ప్రవచనకారులు చెప్పేంత వరకూ నాకు తెలియదు.

ఇవాళ ఆధునిక భారతంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాని మనకన్నా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో  ఉన్న జీవులెవరైనా ఉన్నారా..మనది సహజమైన, జన్మసిద్దమైన మేధ అనే భ్రమ ఎవరికైనా ఉన్నదా..నేలమీద పడగానే ఎవడికోసమో తలా కాళ్లూ,మెదడూ,చూపులూ ఆడించేందుకు, చేతుల్నిఅసంకల్పితంగా భజన చేసేందుకు ఉపయోగించే మన కంటే కృత్తిమ మేధాకారులెవరు?

ఎందుకో నాకు ఈ రోజు నగ్నముని గుర్తొచ్చాడు. అతడు తల క్రిందులుగా నడుస్తూ కనిపించాడు. ‘ఇదేమిటి సార్?’, అనడిగితే చిరునవ్వు నవ్వి.. ‘నీకలాగే అనిపిస్తుంది లే. ఒక్కసారి అద్దంలోకి చూసుకో’ అన్నాడు. అద్దంలో చూస్తే నా తల నడుస్తున్నట్లు, నేను పాదాలతో ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

కొన్ని దశాబ్దాల క్రితమే అతడు సమాజం విలోమంగా ఉన్నదని చెప్పాడు. నేను శీర్షాసనం వేసినప్పుడే అతడి పాదాలకు నమస్కరించడం కుదిరింది.

మన స్వంత భుజాలమీద మన స్వంత తలకాయ ఉండడం లేదని, మన చేతులూ, చేతలూ మనవి కావనీ, మనం మనం గాక మరొకళ్లంగా జీవితాంతం బతికేస్తున్నామని నగ్నముని ఎప్పుడో  చెప్పాడు.   మన స్వంత అవయవాల స్థానంలో మరొకళ్ల అవయవాలు చోటు చేసుకునే సమయంలో వచ్చే సంఘర్షణ మనల్ని అడ్డగాడిదల్ని చేస్తోందని అన్నాడు.

మేకులు లూజై మన ముఖాలు జారిపోతే ఎవరి ముఖాలు తొడుక్కునో మనం కాలం వెళ్లబుచ్చుతుంటామని నగ్నముని ఉవాచ.

చాలా మందివి వాళ్ల ముఖాలు కావు. కొందరు ఆడాళ్లకు మగముఖాలు. కొందరివి గాడిద ముఖాలు. కొందరివి ఎలుగుబంటి ముఖాలు. కొందరివి కప్ప ముఖాలు చాలా మంది మనుషులు జంతువుల ముఖాలు తగిలించుకుని తిరిగేస్తున్నారు. పదవుల్లోకి పాకేస్తున్నారు అన్నాడు ఆయన.

ఒకేసారి మనకు కుడి చేయి కనబడ్డదు. అందుకోసం ఉపసంపాదకుడైన మన బామ్మర్ది కుడిచేయి అరువుతీసుకుంటే అది దాన్నిష్టమొచ్చిన వాక్యాలు అది రాసేస్తోందట. వాడికి నేతలకు,అధికారులకు ఉపన్యాసాలు రాసిపెట్టే అలవాటుంది. అందుకే అబద్దాలు రాస్తోందట.

“ఇంకా నయం మా బావమరిది ఏ పోలీసు ఆఫీసరో కాలేదు. లేకపోతే పై వాళ్లకు సలాం చేసి క్రింద వాళ్లను చావగొట్టి ఛండాలపు పనులన్నీ చేసేవాడిని” అంటాడు మన నగ్నమునీశ్వరుడు. పాత సామాన్ల,అవయవాలు అమ్మే మార్కెట్ కు పోతే తప్ప మనకు సరిపోయే ముఖాలు,చేతులు ఏమైనా దొరుకుతాయేమో అని వ్యంగ్యీకరిస్తాడు ఆ మహనుభావుడు.

ఈ మునీశ్వరుడి ప్రకారం పులి ఆవు తలతో వ్యాపారం చేస్తున్నప్పుడే అది విజయవంతం అవుతుంది. మెడమీద మనిషి తలకాయున్న మనిషితో మాట్లాడాలని ప్రయత్నించాలంటే ఎలా సాధ్యమవుతుంది?

నగ్నమునీశ్వరుడి కథల్లో అక్షరాలు పాదాలు వెనక్కి తిరిగిన దయ్యాల్లా ఉంటాయి. భయపడితే ఆ దయ్యాలు హత్యలకు గురైన అభాగ్యులేనని మనమేనాడూ గ్రహించం.

ఇవాళ ఆఫీసుల్లో ఎర్రతేళ్ల  గుట్టల మధ్య మనుషుల మొహాలు కనపడవని, ఊపిరి తీస్తున్న శబ్దాలు మాత్రమే వినబడుతున్నాయని, ఒంటిమీద చీర క్కూడా అప్పిచ్చి తీర్చకపోతే దాన్ని లాగేసుకునే వారే మనుగడ సాధిస్తారని ఆయన అభిప్రాయం.

కడుపులోంచి గర్భస్థ శిశువు తండ్రితో  మాట్లాడుతుంది. తండ్రి దరిద్రం గురించి,కులం,మతం,ఉద్యోగం గురించీ వివరాలు అడుగుతుంది. ‘ఇంతకీ నీవు ఆడపిల్లగా వస్తున్నావా, మగపిల్లాడిగా వస్తున్నావా’ ఆ తండ్రి అడుగుతాడు. ఆ దరిద్రుడికీ మగపిల్లాడు కావాలనే ఆశ.  ఆ తల్లికి గర్భస్రావమవుతుంది.అది వ్యవస్థ చేసిన శిశుహత్య అని ఆ దరిద్రుడు కూడా గ్రహిస్తాడు.

ఒక దౌర్భాగ్య మధ్యతరగతి కాలనీలో ఇళ్ల యజమాని బాత్రూమ్ పక్కన చిన్న సందులాంటి చీకట్లో సిమెంట్ దిమ్మ కట్టి దాన్ని దేవాలయమంటాడు. అందులో ఎవరికిష్టమైన బొమ్మలకు మనుషులు పూజలు చేసుకుని పర దైవ సహనంతో మూడు మతాలు, ఆరు నైవేద్యాలుగా వర్ధిల్లే అవకాశం కల్పిస్తాడు.  వసుధైవ కుటుంబకం అన్నా,భిన్నత్వంలో ఏకత్వం అన్నా  ఇదే.

ఎవరో తొందరపడిపోయి ఊళ్లో ఉండలేక పరుగెత్తుకొచ్చినట్లు చుట్టూ కర్రముక్కలు చేర్చుకుని మండిపోతున్న స్మశానాల్ని చుట్టూరా గమనించాడు  నగ్నముని .

అతడికి పైన రాత్రి  కారుమేఘాల ఆకాశం ,క్రింద భూమికలిసి ఒక రాక్షసి గుడ్డులాగా,అది పగిలి చీకటి కారుతున్నట్లుగా కనిపిస్తుంది. కుక్కలు మొసళ్లుగా, మనుషులు కుక్కలుగా మారే ప్రపంచం చూడగలడాయన.

ఆఫీసులో రిటైర్ అయితే అంతా ఉద్యోగి  చనిపోయినట్లే. ఇంట్లోనే అతడిని  పూడ్చిపెట్టినట్లుగా ఉపన్యాసాలిస్తారు. అతడిని కుర్చీలో దండతో కూర్చోపెట్టి చావు ఫోటో లాంటి గ్రూప్ ఫోటో తీసుకుంటారు. దహన సంస్కారానికి ఏర్పాట్లు చేసి అంతా ఇళ్లకు బయలు దేరతారు. ఇవాళ ప్రతి ఆఫీసూ ఒక శ్మశానమే.

ఒక పిల్ల మొదట్లో మంచుతో చేసిన జలతారు ముసుగు మొహమ్మీదకు లాక్కుని, రేకు విడవడానిక్కూడా సిగ్గుపడే మల్లెమొగ్గలా ఉంటుంది. నడిస్తే నడుస్తున్న హారతిలా కనిపిస్తుంది.  పెంటకుప్ప మీద గులాబిమొక్కలా ఆ పిల్ల తనను తాను చూసుకునే లోపలే ఎదిగిపోతుంది. ఒకడు ఆమెను గుండె తెరిచి దేహమంతా ఆక్రమించుకున్నతర్వాత వాడికోసం రెప్పలు పీకేసిన కళ్లతో వెతికితేనేం, కనిపిస్తాడా?   వాడు వెళ్లిన తర్వాత రకరకాల జంతువులు గుమ్మం దగ్గరకు వచ్చాయ. ఖద్దరు వాసనా,కాంట్రాక్టుల వాసనా ఆమెకు అలవాటైపోయింది. పార్కులో రాజకీయనాయకుడి సిమెంట్ విగ్రహాన్ని ఆనుకుని నిద్రిస్తే  ఆ విగ్రహమూ ఆమెను సిమెంట్ చేతులతో లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. విగ్రహం కౌగిట్లోకి ఆమెను పొదువుకుంటుంది.ఆమె కడుపులో సిమెంట్ బలంతో మరో మొక్క దేహం రాళ్ల మధ్య వేళ్లూనింది. రాజకీయనాయకులు బతికున్నప్పుడు మాత్రమే కాకుండా చచ్చి విగ్రహాలయన తర్వాత కూడా ప్రజల భవిష్యత్ ను అంధకార బంధురం చేసి  తమ సంతతిని పెంచుకుంటూనే ఉంటారు. ఇవాళ అంతటా సిమెంట్ సంతతి విహరిస్తోంది.

సూర్యుడు ఉదయిస్తున్నాడేమోనని తూర్పు వైపు పరుగెడుతున్నాం.. అంటాడు నగ్నముని కథలో గుంపుస్వామి. గుంపులూ,గుంపు స్వాముల వధా జరుగుతూనే ఉంటోంది. వీళ్లకేం పోయేం కాలం ఇంత అద్భుతంగా చీకటి ప్రసరిస్తుంటే  ధిక్కరిస్తుంటారేం..అని మెడల మీద తలలు లేని వారు వ్యాఖ్యానిస్తుంటారు.

ఎవరి మెడల మీద తలలు లేవు. వాటిపై బోర్లించిన మట్టి కుండలుంటాయి.అందులో  కూడా ప్రముఖులుంటారు.

అనేక రంగాల్లో ప్రముఖులు క్యూలో నిలుచుని ఆత్మలు అమ్ముకుంటుంటారు. ఆ ఆఫీసంతా ఆత్మలు అమ్ముకుంటున్న వారితో కిటకిటలాడిపోతుంటుంది.ఇనుప బూట్లవాడు వారిని చూసి టిక్ పెట్టుకుంటాడు. పిశాచి వారిపై ఉమ్మూసి టేబులు పై ఉన్న డబ్బిస్తుంది.ఎవరైనా తలెత్తి చూస్తే ఇనుపబూట్లవాడు ముడ్డితో తంతాడు. తన్నులు తిన్నవాడు బూట్లు నాకి తమ ఆమోదాన్ని తెలుపుతాడు.

అందులో ఒకడు  మేధావి. వాడి   ఖరీదు. రూ.2000. మరొకడు పత్రికాధిపతి. వీడి ఖరీదు రూ. 10000 అని ఉంటుందని నిర్ణయమవుతుంది.  నగ్నమునికి పత్రికాధిపతులంటే ఎంత ప్రేమో!

అంతా  లోపలికి వెళ్లి క్షుద్ర దేవత గుణగణాల్ని పొగుడుతూ పాటలు పాడుతుంటారు. వ్యాసాలు, పాటలు, పద్యాలు రాస్తుంటారు. అందరూ చీకట్లో జంతువులపై ప్రయాణం చేస్తుంటారు. వెలుగొస్తే తమ జంతువాహన యోగం పోతుందని భయపడుతుంటారు

ఈ చీకటి ప్రపంచంలో పసిపిల్లలూ, ముసలీ ముతకా,అడుక్కునేవాళ్లు,పెద్దరోగాలవాళ్లుకనపడరు. వారు దేశానికి పనికి రారు కనుక చీకట్లో ఎవరికీ తెలియకుండా చంపేసి చెరువుల్లోకి, పాడు నూతుల్లోకి త్రోసేస్తుంటారు.  పిల్లలు చీకటిద్వేషులుగా మారతారని వారి భయం అని సెలవిస్తాడు మన దిగంబర ముని.

ఎమర్జెన్సీ కాలంలో రాసినప్పటికీ విలోమ కథలు నిత్యనూతనం. అసలు దిగంబరంగా సమాజాన్ని చూడడమే నిరంతర ఆధునికం.

ఎమర్జెన్సీ తర్వాత ఎమర్జెన్సీ కాలపు ఆలోచనలు వెళ్లిపోయానుకోవడం మన భ్రమ అంటాడు నగ్నముని. ఇవాళ కోరలు పెరిగిన అప్రకటిత దుర్మార్గ ఎమర్జెన్సీఅమలులో ఉన్నదని,క్రూరపాలన నిత్య కృత్యమని  నగ్నముని చెప్పనక్కర్లేదు. చెప్పకపోయినా అదే నిజమని మనకు తెలుసు.

ఎన్ని అణిచివేతలు జరిగాయని?ఎన్ని ఉద్యమాలు జరిగాయని? రెండింటిలోనూ నెత్తురు ప్రవహించింది.కాళ్ల క్రింద నెత్తురు ప్రవహిస్తూనే ఉంటోంది. ఇవాళ  కవిత్వం రాయాలనుకుంటే  శోకగీతంతో మొదలు పెట్టాల్సి వస్తోంది.

మనిషి జీవిస్తున్నాడనుకోవడం విలోమ సత్యం. నెత్తురూ, కన్నీరూ అసలు వాస్తవాలు.

ఏది సత్యం,ఏది అసత్యం,ఏది పుణ్యం,ఏది పాపం.ఓ మహాత్మా,ఓ నగ్నమునీ!

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు